Tags
China, F-16 jets, imperialism, imran khan, Narendramodi, US, yankees
ఎం కోటేశ్వరరావు
మరో ఆరు రాఫేల్ యుద్ద విమానాలు ఏప్రిల్ 28న మన దేశానికి రానున్నాయన్నది ఒక వార్త . తన వ్యూహాత్మక భాగస్వామి పాకిస్ధాన్‌కు ఎనిమిది ఎఫ్-16 జెట్ యుద్దవిమానాలను విక్రయించాలని నిర్ణయించిన అమెరికా ఆమేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. డోక్లాంతో సహా చైనా-భూటాన్ మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సంప్రదింపులలో రెండు దేశాలూ నిర్ణయించాయి.
విమానాల కొనుగోలు లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉన్న భారత ” దేశభక్తుడు ” సుషేన్ గుప్తా దొంగతనంగా మన సైన్యం వద్ద పత్రాలను దొంగిలించి అందచేసినందుకు బహుమతి పేరుతో గుప్తా, మరికొందరు మధ్యవర్తులకు రాఫేల్ కొన్ని మిలియన్ల యూరోలు సమర్పించుకుంది. మన పాలక దేశభక్తులు ఏం చేస్తారో తెలియదు. పాకిస్ధాన్‌కు ఎఫ్-16 యుద్ద విమానాలు అందచేయటం ‘ఉగ్రవాదం’ మీద జరిపే పోరుకు ఇబ్బంది అని నరేంద్రమోడీ ఎంత మొత్తుకున్నా -నిజంగా అలా చేశారో లేదో తెలియదు- అమెరికా ఖాతరు చేయలేదు. గెజిట్‌లో కూడా ప్రకటించాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది.
డోక్లాంలో చైనా సైన్యాన్ని అడ్డుకొనేందుకు మన మిలిటరీ భూటాన్ ఆహ్వానం మీద వెళ్లిందా లేదా చిన్న దేశం కనుక పక్కకు నెట్టి వ్యవహరించిందా అన్నది ఇప్పటికీ తేలని విషయమే. తాజాగా చైనా-భూటాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్వతంత్రంగానే భూటాన్ వ్యవహరించనున్నదని వార్తలు వచ్చాయి. అంటే మీకు చైనా ముప్పు ఉందంటూ మనం జోక్యం చేసుకొనేందుకు దారి మూసినట్లేనా ? అంతిమ ఒప్పందం కుదిరే వరకు రెండు దేశాల మధ్య శాంతి, సుస్ధిరతలను కాపాడాలని నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేకపోయినా ఈ ఒప్పందం కుదరటం విశేషం. భారత్‌ను దూరంగా ఉంచేందుకు చైనా వైపు నుంచి భూటాన్‌కు గణనీయంగా రాయితీలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. డోక్లాంకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చైనీయులు భూటాన్ భూ భాగంలో ఒక గ్రామాన్ని నిర్మించారని మన పత్రికలు కట్టుకధలు రాసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌లో కూడా అదే విధంగా గ్రామాలను నిర్మించినట్లు రాసిన విషయం తెలిసిందే.
నరేంద్రమోడీ సర్కార్ అమెరికా, దాని మిత్రపక్షాలతో జతకట్టదలచుకుంటే సూటిగానే చెప్పవచ్చు. దాని మంచి చెడ్డలను సమయం వచ్చినపుడు జనం తేలుస్తారు. మేము ఏదైనా బస్తీమే సవాల్ అన్నట్లుగా చెప్పి చేస్తాము అని చెప్పుకుంటున్న మోడీ నాయకత్వం ఆచరణలో అలా ఉందా ? ప్రతిదేశం ప్రతి సమస్య, పరిణామం నుంచి తామెలా లబ్ది పొందాలన్న తాపత్రయంలోనే ఉంది.అందుకే ఎన్నో ఎత్తులు, జిత్తులూ దీనికి ఏ దేశమూ మినహాయింపు కాదు. వాటి వలన జనానికి లబ్ది చేకూరుతుందా, వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నదే గీటురాయి.ప్రపంచం వైరుధ్యాల మయం. అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. అయితే అన్నీ ఒకేసారి ముందుకు రావు. ఏదైనా ప్రధాన వైరుధ్యంగా ముందుకు వచ్చినపుడు వాటి పట్ల తీసుకొనే వైఖరి తరువాత వచ్చే వైరుధ్యాన్ని బట్టి మారిపోతూ ఉండవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మింగివేయాలన్నది అమెరికా దురాశ. అది సాధ్యం కాదని ఐరోపాలోని ధనిక దేశాలకు ఇంతకు ముందే తెలుసు కనుక వైరుధ్యాలను ఉపయోగించుకోవాలని అవి నిత్యం చూస్తుంటాయి.అమెరికా, ఐరోపా ధనిక దేశాలు తమ పధకంలో ఏ దేశాన్ని ఎక్కడ నిలిపి ఎలా లబ్ది పొందాలా అని నిరంతరాన్వేషణ సాగిస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలో ఇండోాపసిఫిక్ ప్రాంతం మీద కేంద్రీకరణ పెరిగింది. భూమి తన చుట్టుతాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రకృతి. అమెరికా అన్ని దేశాలనూ తన చుట్టూతిప్పుకోవాలనుకుంటుంది, అది వికృతి. తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని చైనా నిరూపించింది. అతి పెద్ద దేశంలో ప్రవేశించి అక్కడి మార్కెట్‌ను కొల్లగొట్టాలన్నది అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆకాంక్ష. తమ దగ్గర లేని సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను బయటి నుంచి తెచ్చుకొని తాము అభివృద్ధి చెందాలన్నది చైనా కమ్యూనిస్టుల లక్ష్యం. నాలుగుదశాబ్దాల ఈ పయనంలో చైనా కమ్యూనిస్టులే పైచేయి సాధించారు. ఎంతగా అంటే ఆర్ధికంగా అమెరికాను అధిగమించి పోయేంతగా అని వేరే చెప్పనవసరం లేదు. అందుకే దాన్ని అడ్డుకొనేందుకు ఎన్నో పధకాలు.
తన ఆర్ధిక, మిలిటరీ శక్తిని ఉపయోగించి మన దేశంతో సహా అనేక దేశాలను చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలన్నది దాని పధకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత అమెరికా కొంత మేరకు సఫలీకృతమైంది.దానిలో భాగమే గతేడాది జరిగిన లడఖ్, అంతకు ముందు సంభవించిన డోక్లాం పరిణామాలు. భూటాన్-చైనా మధ్య వివాదంగా ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు వేయకూడదని మన దేశం వెళ్లి అడ్డుకుంది. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినప్పటికీ లడఖ్ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి.చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం పేరుతో అమెరికా-జపాన్-ఆస్ట్రేలియాలతో మన దేశం జట్టుకట్టి బస్తీమే సవాల్ అంటున్నాయి.ఈ గుంపులోకి ఐరోపా ధనిక దేశాలను కూడా లాగాలని చూస్తున్నాయి. పశ్చిమ దేశాలు అనుకున్న, వేసిన పధకం సఫలం కావాలంటే కాగితాల మీద గీతలు గీసినంత సులువు కాదు. ముందుగా చైనా వస్తువుల మీద ధనిక దేశాలు ఆధారపడటం మానుకోవాలి. అంటే వాటికి చౌకగా వస్తువులను తయారు చేసి సరఫరా చేసే ప్రత్యామ్నాయ దేశాలు కావాలి. మన దేశంలో చౌకగా దొరికే మానవశక్తి ఉంది, పశ్చిమ దేశాల వస్తువులకు అవసరమైన మార్కెట్టూ ఉంది. అందుకే మన దేశాన్ని, ఎవరు గద్దెమీద ఉంటే వారిని ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగుడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో మనం ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఎవరూ అనుకోవటం లేదు.
వివిధ పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే దారులన్నీ రోమ్‌కే అన్నట్లుగా ప్రస్తుతానికి ప్రయత్నాలన్నీ చైనాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. గతంలో బ్రిటన్-జపాన్-ఫ్రాన్స్ -స్పెయిన్- ఇటలీ-జర్మనీ చరిత్రను చూసినపుడు ప్రపంచాన్ని పంచుకొనేందుకు వాటి మధ్య వచ్చిన పంచాయతీలే అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు దారి తీశాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు నెట్టి అమెరికా ముందుకు వచ్చి అదే చేస్తోంది.చైనా మార్కెట్లో వాటికి ప్రవేశం కల్పిస్తే, చైనా తమకు పోటీ ఇవ్వకుండా ఉంటే అసలు పేచీయే లేదు. అది జరగటం లేదు గనుకనే ఏదో ఒక గిల్లికజ్జా పెట్టుకుంటున్నాయి. చైనాకు పోటీగా మన దేశాన్ని వినియోగించుకోవాలని చూసిన పశ్చిమ దేశాలు తీవ్ర ఆశాభంగం చెందాయి. దాని దరిదాపుల్లో కూడా మనం లేకపోవటంతో చైనాతో విధిలేక ముద్దులాట-దెబ్బలాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన ప్రధాన బలహీనత జిడిపిలో 14శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 50శాతం మంది ఉపాధిపొందుతున్నారు.అరవైశాతంగా ఉన్న సేవారంగం 28శాతం మందికే ఉపాధి చూపగలుగుతోంది.
లాహిరి లాహిరిలో అన్నట్లుగా చైనా అధినేత గ్జీ జింపింగ్ ా మన నరేంద్రమోడీ వ్యవహరించిన తీరును మనం చూశాము. అలాంటిది ఆకస్మికంగా గాల్వన్‌లోయ ఉదంతాలకు ఎందుకు దారి తీసింది ? చైనా మన ప్రాంతాలను ఆక్రమించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన తరువాత సరిహద్దుల్లో జరిగిన ఉదంతాల గురించి పరిపరి విధాల ఆలోచనలు ముందుకు వచ్చాయి. చైనాతో వచ్చిన లేదా తెచ్చుకున్న సరిహద్దు వివాద అసలు లక్ష్యం ఏమిటి ?తెరవెనుక పాత్రధారులు, వారేం చేస్తున్నదీ మనకు కనిపించదు,వినిపించదు. తెర ముందు జరిగే వాటిని బట్టి నిర్దారణకు వస్తే తప్పులో కాలేస్తాము. చైనాతో సరిహద్దు వివాదం రాజకీయంగా నరేంద్రమోడీ పుట్టక ముందునుంచీ ఉంది.1962 తరువాత కొత్తగా మన భూభాగం చైనా ఆధీనంలోకి వెళ్లలేదని మోడీ సర్కారే పార్లమెంటులో కూడా చెప్పింది. మన పాలకులు చెబుతున్నట్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వించిందనే అనుకుందాం. చర్చల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్న మనం ఆ మార్గాన్ని ఎందుకు ఎందుకు ఎంచుకోలేదు ? కాసేపు పక్కన పెడదాం.
ఇరాన్‌తో మనకు గోడ-నీడ పంచాయతీల్లేవే. (ఇష్టం లేకపోతే నీ స్ధలమే గావచ్చు గోడ ఎత్తుగా కట్టావు, దాని నీడ మా ఇంటి మీద పడుతోందని గిల్లికజ్జా) ఇప్పుడు ఇరాన్-చైనా మధ్య ఏర్పడిన బంధం మన దేశానికి తలనొప్పిగా మారిందని, కొత్త సవాళ్లను ముందుకు తెచ్చిందని సంఘపరివార్ పత్రిక ఆర్గనైజర్ మాజీ సంపాదకుడు శేషాద్రి చారి పేర్కొన్నారు. తలనొప్పి స్వయంగా నరేంద్రమోడీ తెచ్చింది తప్ప మరొకటి కాదు. శేషాద్రి ముందుకు తెచ్చిన అంశాల సారాంశాన్ని చూద్దాం. ఇరాన్ మీద విధించిన ఆంక్షలను తొలగించే చిన్నపాటి సూచనలు కూడా అమెరికా నుంచి వెలువడని సమయంలో పాతికేండ్ల పాటు అమల్లో ఉండే 400 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఇరాన్‌తో చైనా కుదుర్చుకుంది.హార్ముజ్ జలసంధిలో కీలక స్ధానంలో ఉన్న బందర్ అబ్బాస్ రేవు ద్వారానే మన దేశానికి గరిష్టంగా సరకు రవాణా జరుగుతోంది.అమెరికా ఆంక్షల కారణంగా మన దేశానికి దాన్ని మూసివేసినందున మన రవాణా ఖర్చులు అనేక రెట్లు పెరుగుతున్నాయి.చమురు సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ధరలు పెరిగిపోయి వాణిజ్యలోటులో సమస్యలు వస్తున్నాయి. అరవై రోజుల వరకు అరువు సౌకర్యం, ఆకర్షణీయమైన రాయితీలు, రూపాయి చెల్లింపులను అంగీకరించటం వంటివి ఇరాన్‌తో మనకున్న సానుకూల అంశాలలో కొన్ని మాత్రమే. ఇవన్నీ పోవటం మన వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాలకు వ్యతిరేకం. మధ్య ఆసియా దేశాలతో మన వాణిజ్యానికి ఇరాన్ ముఖద్వారం. పాకిస్ధాన్‌తో నిమిత్తం లేకుండా చబ్బార్ రేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించేందుకు ఉపయోగపడుతుంది. తుర్కుమెనిస్దాన్-ఆఫ్ఘనిస్దాన్-పాకిస్దాన్-భారత్ చమురు పైప్‌లైన్ మన ఇంధన భద్రతకు అవసరం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇరాన్ సహకారం లేకుండా సాధ్యం కాదు, అందువలన ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు మన దేశం అమెరికాను ఒప్పించాల్సి ఉందని శేషాద్రి చారి చెప్పారు. ఆ పెద్దమనిషి చైనా వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్ వైఖరిని ఎందుకు తప్పు పడుతున్నట్లు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.అమెరికాను నమ్ముకొని మోడీ ఇరుగు పొరుగు దేశాలను చైనా వైపు వెళ్లేట్లు నెడుతున్నారన్నది అసలు దుగ్ద. చైనాతో సరిహద్దు వివాదం ఉంది గనుక మన లడఖ్‌లో ప్రతాపం చూపాము అనుకుంటే అర్ధం ఉంది. మరి ఇరాన్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాము ? అమెరికా కౌగిలింతలతో మునిగి తేలుతూ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేశాము.
ఇరాన్‌తో చైనా ఒప్పందం కేవలం దానికి అవసరమైన చమురు కోసమే అనుకుంటే పొరపాటు. అమెరికా ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్ ఆర్దిక వ్యవస్ధను ఆదుకోవటం కూడా దానిలో కీలక అంశం. ప్రపంచాన్ని ఆక్రమించాలని చూస్తున్న అమెరికాను కట్టడి చేసే మధ్య ప్రాచర్య వ్యూహంలో భాగం అది. ఇండో-పసిఫిక్ వ్యూహం పేరుతో చైనాను దెబ్బతీసేందుకు భారత్-జపాన్-ఆస్ట్రేలియాలను ఇప్పటికే అమెరికా ఒక దగ్గరకు చేర్చింది. దానికి ప్రతిగా చైనా తన ఎత్తుగడలను రూపొందించుకొంటోంది. రానున్న రోజుల్లో మధ్య ప్రాచ్యం అగ్రదేశాల అధికార పోరుకు వేదిక కానుందన్నది చైనా అంచనా.అందుకే ఆప్రాంతంతో పాటు ఆఫ్రికాలో కూడా చైనా వ్యూహాన్ని అమలు చేస్తూ అనేక దేశాలతో ఒప్పందాలతో ముందుకు పోతున్నది. పశ్చిమాసియాలో షియా-సున్నీ విభేదాలను ఉపయోగించుకొని అమెరికా రాజకీయం చేస్తుంటే చైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది.సున్నీలు మెజారిటీగా ఉన్న సౌదీ అరేబియా-షియాలు మెజారిటీగాఉన్న ఇరాన్‌తోనూ సత్సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాల నుంచీ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నది. అమెరికాను ఎదుర్కొనే ఎత్తుగడలో భాగంగా రష్యా కూడా తన పావులు కదుపుతున్నది. 2019లో చైనా-రష్యా-ఇరాన్ మిలిటరీ సంయుక్త విన్యాసాలు అమెరికాకు ఒక హెచ్చరిక తప్ప మరొకటి కాదు.
వర్దమాన దేశాలు తమలో తాము సహకరించుకోవటం ద్వారా అభివృద్ధి పొందాలి తప్ప సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి బాగుపడదామనుకుంటే జరిగేది కాదన్నది ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం. మన సంబంధాలు అమెరికా, జపాన్ వంటి దేశాలతో ఈ గీటురాయితోనే సరి చూసుకోవాలి. ఒకవైపు బ్రెజిల్, రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) ఒక కూటమిగా సహకరించుకోవాలని సంకల్పం చెప్పుకున్నాయి. మరోవైపు మన దేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జతకడుతుంది. అలాంటపుడు ఈ కూటమి దేశాల మధ్య విశ్వాసం ఎలా ఉంటుంది, సహకారానికి ఎలా దారి చూపుతుంది ? అందుకే ముందుకు పోవటం లేదు. చతుష్టయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా, జపాన్ మరోవైపు అమెరికా వ్యతిరేకించే ఆర్‌సిఇపి కూటమిలో చైనాతో చేతులు కలుపుతాయి.అమెరికా బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా చైనాతో ఒప్పందాలు చేసుకున్న ఐరోపాధనిక దేశాలు మరోవైపున ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జట్టుకట్టేందుకు ఆసక్తి చూపుతాయి. అమెరికా రెచ్చగొట్టగానే చైనాతో తాడోపేడో తేల్చుకుంటామన్న మన నరేంద్రమోడీ సర్కార్ మరోవైపు దానితో చర్చల ప్రక్రియ సాగిస్తోంది.బాలాకోట్ దాడులతో పాక్‌ను దెబ్బతీశామని ప్రకటించిన మన దేశం తెరవెనుక వారితో 2018 నుంచే సంప్రదింపులు జరుపుతున్నట్లు బయటపడింది. రెండు దేశాలూ సఖ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలనే నాటకీయంగా ప్రకటన చేశాయి. ఆట మనకై మనమే ఆడుతున్నామా లేక ఎవరైనా ఆడించినట్లు ఆడుతున్నామా ?
ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది అమెరికా, ఐరోపా అగ్రరాజ్యాలు. మనవంటి వర్ధమాన, పేద దేశాలను దానిలోకి లాగిందీ అవే. దశాబ్దాల పాటు చైనాను ప్రపంచీకరణలో భాగస్వామిని చేసేందుకు నిరాకరించాయి. తీరా ఇప్పుడు ప్రపంచీకరణకు భిన్నమైన చర్యలు తీసుకుంటున్నదీ దాన్ని ప్రారంభించిన దేశాలే. నిజమైన ప్రపంచీకరణ స్ఫూర్తిని పాటించాలని చైనా డిమాండ్ చేస్తున్నది. ప్రపంచ పరిణామాల్లో ఎంత మార్పు ? ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి వాటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంటోంది. మనవంటి దేశాలను తన అజెండాకు అనుగుణ్యంగా నడవమంటోంది, బెదిరిస్తోంది.(ఇరాన్ చమురు కొనవద్దని ఆదేశించటం పక్కా నిదర్శనం). రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచీకరణ ద్వారా తన మార్కెట్‌ను పెంచుకోవాలన్నది ధనిక దేశాల ఎత్తుగడ. అవి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి.
మనలను ప్రధాన భాగస్వామి అని చెబుతున్న అమెరికన్లు పాకిస్ధాన్‌కూ అదే చెబుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గానీ అమెరికా చెరొక చంకలో ఇమ్రాన్ ఖాన్ను, నరేంద్రమోడీని ఎక్కించుకుంటున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాను నమ్ముకొని చైనాతో శతృత్వం పెంచుకుంటే నష్టం మనకే. పశ్చిమాసియా, మధ్య ఆసియాలో అమెరికా ప్రయోజనాల రక్షణకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా పాకిస్ధాన్ అవసరం. అందుకే మనలను మాయపుచ్చటానికి ఎన్ని కబుర్లు చెప్పినా చేయాల్సింది చేస్తోంది. పాక్‌తో సయోధ్యకు మన మెడలు వంచుతోంది. మనం లొంగిపోయామనే అంచనాకు వచ్చిన కారణంగానే వాణిజ్యం, దిగుమతుల విషయంలో సానుకూల ప్రకటన చేసిన పాకిస్ధాన్ మరుసటి రోజే అబ్బెబ్బె అదేం లేదంటూ మాట మార్చింది. ఎఫ్ -16 విమానాలను తెచ్చుకున్నాం గనుక తాడో పేడో తేల్చుకుందాం అన్నా ఆశ్చర్యం లేదు.
ఒక స్వతంత్ర విదేశాంగ విధానం లేనట్లయితే మనం ఎటువైపు ఉండాలో తేల్చుకోలేము.గతంలో నెహ్రూ, కాంగ్రెస్ హయాంలో సోవియట్‌కు అనుకూలంగా ఉండి భారీ పరిశ్రమలు, ఇప్పుడు అనేక విజయాలు సాధిస్తున్న అంతరిక్ష రంగానికి అవసరమైన వాటిని సాధించుకున్నాము. ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా మారి చెప్పుకొనేందుకు సాధించింది ఏమైనా ఉందా ? లేకపోగా చుట్టుపక్కల వారినందరినీ దూరం చేసుకున్నాము. పాకిస్ధాన్, చైనాతో శతృత్వం పెంచుకుంటున్నాము. దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుంటున్న అమెరికా తప్ప మనకు కలిగిన లబ్ది ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కరుడు గట్టిన నేరగాండ్లు, మాఫియా ముఠాలు కొత్త వారికి ఎరలు వేసి ఆకర్షిస్తారు. మెల్లగా వారికి తెలియకుండానే చిన్నపాటి నేరాలు చేయించి తమ బందీలుగా చేసుకుంటారు. తరువాత వారు చెప్పినట్లు చేయక తప్పని స్ధితిని కల్పిస్తారు. అమెరికా, ఇతర అగ్రదేశాలు కూడా అంతే ! ఈ అంశాన్ని మన పాలకులు గుర్తిస్తారా ?