Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ, నరేంద్రమోడీ ఇద్దరూ పాలకవర్గాల సేవకులే అనటంలో మరో మాట లేదు. ఒకరు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా అధికారంలో ఉంటే మరొకరు ఇప్పటి వరకు ఏడు, మరో మూడు సంవత్సరాలు ఉండబోతున్నారు. దేశం కోసం అనే పేరుతో ఇంకేదైనా చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. మనం అనేక రంగాలలో వెనుకబడి ఉండటానికి నెహ్రూ, తరువాత కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే కారణం అని సంఘపరివార్‌ అంశ నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సందుదొరికినపుడల్లా దుమ్మెత్తి పోయటం తెలిసిందే. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో సాధించలేని దానిని తాము ఐదేండ్లలో అమలు చేశామని చెప్పుకొనే వారు ఆ పాచిపాట ఇంకేమాత్రం పాడలేరు. దేశ అభివృద్దికి సంబంధించి నిరంతరం చర్చ జరగాల్సిందే. అధికారంలో ఉన్న ఎవరి విధానాలనైనా విమర్శనాత్మకంగా చూడాల్సిందే. చిత్రం ఏమిటంటే నెహ్రూ విధానాలను విమర్శించటం దేశభక్తి, నరేంద్రమోడీ ఏలుబడిని తప్పుపట్టటం దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది ? తిరుగుతున్న చట్రంలో ఏ దేశం ఎక్కడ ఉంది ? వాటిలో మార్పుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, వాటి పర్యవసానాలేమిటి ? వీటి అంతరార్దం ఏమిటి ? కార్పొరేట్ల లాభాలుా, అందుకోసం రక్షణాత్మక చర్యలు. ధనిక దేశాలు, వాటిని అనుసరించాలని చూస్తున్న దేశాల విధానాల సారమిదే !

వాణిజ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. వివాదాలు తలెత్తితే విచారించి తీర్పు చెప్పేందుకు ఒక న్యాయస్ధానం ఉంటుంది. దానికి న్యాయమూర్తులను నియమించేందుకు అమెరికాలో అధికారంలో ఉన్న ట్రంప్‌ నిరాకరించాడు, ఇప్పుడు జో బైడెన్‌ అదే బాటలో నడుస్తున్నాడు. కనుక ఎవరైనా దానికి ఫిర్యాదు చేస్తే వెంటనే తేలదు. మనం అమెరికా, ఇతర విదేశీ కంపెనీలపై డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) వేశాము. దాని మీద డబ్ల్యుటిఓకు వెళితే వెంటనే తేలదు. అది తెలుసు గనుక దానితో నిమిత్తం లేకుండా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల మీద అమెరికా 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం ఎక్కడ తేలాలి ? తెలియదు !
చైనా నుంచి దిగుమతి చేసుకొనే సౌర విద్యుత్‌ పలకలు, సంబంధిత పరికరాలపై మన ప్రభుత్వం రక్షణ పేరుతో 2018లో విధించిన పన్ను గడువు ఈ ఏడాది జూలైలో తీరి పోనుంది. అందువలన సోలార్‌ ఫొటోఓల్టాయిక్‌ మోడ్యూల్స్‌(పివి) మీద 40శాతం, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌ మీద 25శాతం చొప్పున దిగుమతి పన్నును 2022 ఏప్రిల్‌ నుంచి విధించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని డబ్ల్యుటివోలో సవాలు చేసినా వెంటనే తేలదు కనుక చైనా కూడా పోటీగా ప్రతీకార చర్య తీసుకుంటుంది. దానికీ అదే గతి, కనుక ఏం చేయాలి ? తెలియదు ! అలాంటపుడు జరిగేదేమిటి ? ఆయా దేశాల సామర్ధ్యం ముందుకు వస్తుంది. అది లేని దేశాలు మిగతావాటికి లొంగిపోతాయి. లేదూ తమకూ కొన్ని ప్రత్యేకతలు ఉంటే వాటిని తురుపుముక్కగా ఉపయోగించి రాజీకి వస్తాయి. మన దేశంలో సౌర విద్యుత్‌ తయారీకి అవసరమైన పరికరాకావచ్చు, మరొకటి కావచ్చు స్వంతంగా తయారు చేసుకుంటే ఎవరికీ లొంగాల్సిన, రాజీ పడాల్సిన పని లేదు.

ఇప్పుడున్న పరిస్దితి ఏమిటి ? ఈ ఏడాది మార్చి 24న అమెరికన్‌ ప్రాస్పెక్ట్‌ అనే పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం సౌర విద్యుత్‌కు అవసరమైన నాలుగు పరికరాల విషయంలో ప్రపంచ సామర్ధ్యం ఇన్‌గాట్స్‌లో 95, వేఫర్స్‌లో 99,పివి సెల్స్‌ 80,పివి మోడ్యూల్స్‌లో 75శాతం చైనా వాటాగా ఉంది. ఈ రంగంలో చైనా తన సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకొంటోంది. దీనికి సాంకేతికపరిజ్ఞానంతో పాటు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. ఇలాంటి పరిస్దితిలో అమెరికాను మెప్పించేందుకో మరొకందుకో చైనా దిగుమతుల మీద పన్నులు పెంచితే మనం దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవటం అనుమానాస్పదమే అనే వారిని దేశద్రోహులుగానో, స్వదేశీ పరిశ్రమ మీద ప్రేమ లేని వారుగానో ముద్రవేస్తారు. సంప్రదాయ విద్యుత్‌ బదులు ప్రత్యామ్నాయ సౌర విద్యుత్‌ మీద కేంద్రీకరించే దేశాలకు చైనా తన వస్తువులను ఎగుమతి చేస్తుంది. దానికి పోయేదేమీ లేదు. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించుదాం !


మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారీలో బోరోసిల్‌ అనే కంపెనీ ఉంది. అది తయారు చేసేవి మన అవసరాలకు చాలవు.దీనికి తోడు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య మన దేశంలో తయారయ్యే పివి సెల్స్‌ తయారీదారులు చెప్పుకున్నమాదిరి సామర్ద్యం కలిగినవి కాదన్నది విమర్శ. నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే ప్రభుత్వ సంస్దలు లేని కారణంగా ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ ఉత్పత్తుల గురించి చెప్పుకుంటున్నారు. అది ఆయా సంస్దల గిట్టుబాటును కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 32గిగావాట్లు కాగా మన సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి మూడు, మాడ్యుల్స్‌ ఉత్పత్తి ఐదు గిగావాట్లకే సరిపోతుంది. మిగిలినదంతా చైనా నుంచి దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఏడు సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ సారధిగా మారాలని చాలా మంది ఆశించగా వాస్తవ పరిస్ధితి ఇలా ఉంది. దేశభక్తి ప్రదర్శన కాదు, ఆచరణలో చూపాలి మరి. మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారు చేస్తున్న కంపెనీకి దన్నుగా కేంద్రం దిగుమతి సుంకాలు విధించి రక్షిస్తోంది.

మన దేశ పరిశ్రమలను రక్షించుకోవాలనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యాపారంతో పని లేదు అని చెబుతున్న పాలకులు నిత్యం వ్యాపారుల సేవలోనే మునిగితేలుతున్నారు.విశాఖ ఉక్కు వంటి వాటిని రక్షించుకొనేందుకు అవసరమైన చర్యలను నిరాకరిస్తున్న పాలకులు విదేశీ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు పూనుకోవటం ఏమిటి ? ఇక్కడా చేస్తున్నది దేశానికి దివాలాకోరు-విదేశాలకు లాభాల వ్యాపారమే. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం అని చెబుతారు, సులభతర వాణిజ్యంలో మన స్దానం ఎంతో మెరుగుపడింది చూడమంటారు. కానీ ఆచరణలో ఎలా ఉన్నారు.మనం చైనా ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తున్నాం. చైనా మనకు ఎంత దూరమో మనమూ చైనాకు అంతే దూరంలో ఉంటాం. ఒకరు రాళ్లు వేస్తుంటే మరొకరు పూలు వేస్తారా ? మన భాగస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఏం చేస్తోందో చూశాము. శత్రుదేశం అంటూ నిత్యం కత్తులు దూస్తున్న చైనా ప్రతికార చర్యలకు పూనుకోకుండా ఎలా ఉంటుంది?


మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దున్న-బర్రె మాసం, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల మీదచైనా ఆంక్షలు విధించింది. దాన్ని సవాలు చేస్తూ తాజాగా మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది. గాళ్లు లేదా గాలి కుంటు వ్యాధి ముప్పు కారణంగా దున్న-బర్రె మాంసాన్ని నిషేధిస్తున్నామని, అదే విధంగా రొయ్యల గురించి తగినంత సమాచారం లేనందున వాటినీ నిషేధిస్తున్నట్లు చైనా చెబుతోంది. రొయ్యల్లో ఉండే వైరస్‌ మానవులకు హాని కలిగించేది కాదనే నిర్ధారణ పత్రాలు కావాలని చైనా చెబుతోంది. అయితే కొత్త నిబంధనలను ముందుకు తెస్తూ అడ్డుకుంటున్నదని, ఆ మేరకు నిర్దారణ పత్రాలను మనం ఇవ్వలేమని మన దేశం వాదిస్తోంది. నిజం చెప్పుకోవాలంటే చైనాతో మన సర్కారు వివాదం, పెట్టుబడులపై ఆంక్షలు, దిగుమతులపై సుంకాల విధింపు అసలు కారణం అని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సరంలో మన దేశం 680కోట్ల డాలర్ల మేర సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయగా వాటిలో ఐదోవంతు చైనా 130 కోట్ల డాలర్ల సరకు దిగుమతి చేసుకుంది.2020-21లో దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. దున్న-బర్రె మాంసం పరిస్ధితి కూడా ఇంతే.

మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ సీసాలు, గ్లాసులను పోలిథిలిన్‌ టెరెఫాథలేట్‌(పెట్‌ రెసిన్‌) అనే పదార్ధంతో తయారు చేస్తారు.దీన్ని మన దేశంలో రిలయన్స్‌, ఇండో రమా కంపెనీలు ప్రధానంగా తయారు చేస్తాయి. వీటి వాటా 91శాతం ఉంది.అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ రెండు కంపెనీలు తమకు రక్షణ కల్పించాలని కోరిన మేరకు ఏడాది తరువాత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే విధంగా రానున్న ఐదు సంవత్సరాల పాటు చైనా దిగుమతుల మీద నాణ్యతను బట్టి టన్నుకు 16.92 నుంచి 200.66 డాలర్ల మేరకు దిగుమతి పన్ను విధించాలని నిర్ణయించింది. పెట్‌తో శీతల పానీయాల, మంచినీటి సీసాలు, జాడీల వంటివి తయారు చేస్తారు. 2018లో చైనా నుంచి 88,247 టన్నులు దిగుమతి చేసుకోగా 2019లో అది 147,601 టన్నులకు పెరిగింది. దీంతో చైనా దిగుమతులపై పన్ను విధించాలని రిలయన్స్‌, ఇండోరమా కంపెనీలు డిమాండ్‌ చేశాయి. లడఖ్‌ వివాదానికి ముందే ఈ కంపెనీలు కేంద్రం ముందు వత్తిడి తెచ్చాయి. ఆ సాకుతో దానికి మోడీ సర్కార్‌ తలొగ్గింది. దీనికి ఆత్మనిర్భర ముసుగు తొడిగింది. రక్షణ చర్యల పేరుతో ప్రతి దేశం తమ కార్పొరేట్ల ప్రయోజనాలకు పూనుకుంటే స్వేచ్చా వాణిజ్యం, పోటీ తత్వం గురించి చెప్పే కబుర్లకు విలువ ఉండదు. చైనా వస్తువులపై 200 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి సుంకాలు విధించిన అమెరికా చర్యను ప్రపంచ వాణిజ్య సంస్ధ విమర్శించింది.


నిజానికి రక్షణ చర్యలు మన దేశానికి కొత్తేమీ కాదు. జవహర్‌లాల్‌ నెహ్రూ పాలన ప్రారంభమైన తరువాత అంతకు ముందు మాదిరి తమ వస్తువులకు మార్కెట్‌గా భారత్‌ను మార్చుకోవాలని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు భావించాయి. మన దేశంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రాలేదు. అప్పటికి మన పారిశ్రామికవేత్తలకు భారీ పెట్టుబడులు పెట్టగలిగిన సత్తా లేదు. అంతకు మించి పెట్టి లాభాలు సంపాదించగలమనే ధైర్యమూ లేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, వాణిజ్యానికి నాటి ప్రభుత్వం పునాదులు వేసింది. వాటిని ఆధారం చేసుకొని అనేక మంది పెట్టుబడిదారులు లబ్ది పొందారు, తమ పరిశ్రమలకు వాటిని ఆలంబనగా చేసుకున్నారు. హైదరాబాదులోని ఐడిపిఎల్‌లో పని చేసిన అనుభవాన్ని ఔషధ రంగంలో పరిశ్రమల స్ధాపనకు వినియోగించుకొని నేడు ఆ రంగాన్ని శాసిస్తున్న రెడ్డీలాబ్స్‌ వంటి కంపెనీల యజమానుల గురించి చెప్పనవసరం లేదు. ప్రయివేటు రంగం ముందుకు వచ్చిన తరువాత ఐడిపిఎల్‌ను మూసివేయించారు. అన్ని రంగాల్లోనూ అదే జరుగుతోంది. నాడు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, దానికి ఆలంబనగా చేసేందుకు నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించారు. నేడు వాటి అవసరం తీరిపోయింది గనుక ఆ ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటు వారికి తెగనమ్మి లేదా మూసివేసి లబ్ది చేకూర్చేందుకు నరేంద్రమోడీ అదేపని చేస్తున్నారు.ఐడిపిఎల్‌ను మరింతగా విస్తరించి జనానికి చౌకగా ఔషధాలు అందించవచ్చు, కానీ ప్రభుత్వం వ్యాపారం చేయదనే పేరుతో వదిలించుకుంటున్నారు.
1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో మన దేశం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ఈ పని చేశారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాల కాలంలో పదమూడు సంవత్సరాలు అతల్‌ బిహారీ వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఏలుబడే ఉన్నది. సాధించింది ఏమిటి ? 2014లో అధికారానికి వచ్చిన మోడీ దగ్గర మంత్రదండం ఉందని, అద్భుతాలు చేస్తారని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ రంగం, దానికి వెన్నుదన్నుగా ఉండే మీడియా ఊదరగొట్టింది.అలాంటిదేమీ లేకపోగా తిరోగమనంలో నడుస్తోందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లోనే రక్షణ లేదా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన సమయంలో తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తానని మోడీ కూడా చెప్పారు.


కాంగ్రెస్‌ హయాంలో అయినా, మోడీ ఏలుబడిలో అయినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఆశించిన మేరకు రాలేదు. వాటికి బదులు మన దేశంలో ఉన్న పరిశ్రమలు, వాణిజ్యాల షేర్‌మార్కెట్లో వాటాల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టి లాభాలను తరలించుకుపోయే (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, వడ్డీ వసూలు చేసుకొనే అప్పుల రూపంలో మాత్రమే ఎక్కువగా వచ్చాయి. మన దేశానికి రావటం గొప్ప అన్నట్లుగా పాలకులు, వారికి వంతపాడే అధికార యంత్రాంగం చెబుతోంది.మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, వాటిద్వారా వచ్చే లాభాల కోసం తప్ప మనకు మేలు చేసేందుకు కాదు అన్నది గమనించాలి.

నెహ్రూ హయాంలో అనుసరించిన విధానం అభివృద్ధికి దోహదం చేయలేదని కొంత మంది విమర్శిస్తారు. దాన్ని తప్పుపట్టనవసరం లేదు. వారు ప్రత్యామ్నాయంగా సూచించిన విధానాల పర్యవసానం ఏమిటి? 1990దశకానికి ముందు మన పారిశ్రామిక వస్తువులకు రక్షణగా దిగుమతుల మీద గరిష్టంగా విధించిన పన్ను మొత్తం 355శాతం ఉంటే సగటు 126శాతం. తరువాత 2010-11 నాటికి అవి 10-9.5శాతాలకు తగ్గాయి.2020-21లో 10-11.1శాతాలుగా ఉన్నాయి. నరేంద్రమోడీ హయాంలో తిరిగి రక్షణాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి.2020జూన్‌ నాటికి వివిధ దేశాల్లో అమల్లో ఉన్న దిగుమతి వ్యతిరేక చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.(ది.ని- దిగుమతి నిరోధ చర్యలు),ప్ర.వా.వా-ప్రపంచ వాణిజ్యంలో వాటాశాతం )
దేశం××× ది.ని ××× సుంకం×××× ప్ర.వా.వా
అమెరికా× 398 ××× 71 ×××× 13.3
భారత్‌ × 243 ××× 98 ×××× 2.5
చైనా × 156 ××× 4 ×××× 10.8
బ్రెజిల్‌ × 111 ××× 4 ×××× 1
ఆస్ట్రేలియా× 71 × 15 ×××× 1.2
గతంలో నెహ్రూ లేదా కాంగ్రెస్‌ హయాంలో రక్షణాత్మక చర్యలు ఎక్కువగా తీసుకున్నారు, వాణిజ్యానికి ఆటంకాలు ఎన్నో కలిగించారు. మేము వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్న బిజెపి పెద్దలు ఏ దేశంతో పోల్చుకొని చెబుతున్నట్లు ? ప్రపంచ వాణిజ్యంలో మనవాటా శాతంతో పోల్చితే అవి ఎక్కువగా తక్కువా అన్నది చెప్పాలి. 1990దశకానికి ముందు, తరువాత గణాంకాలను చూసినపుడు ఎగుమతులు-దిగుమతుల ధోరణి ఒకే విధంగా ఎందుకు ఉన్నట్లు ? గతంలో స్వావలంబన అని చెప్పినా, ఇప్పుడు మేకిన్‌ ఇండియా, స్ధానిక వస్తువులనే కొనండి, ఆత్మనిర్బర్‌ అని ఏ పేరు చెప్పినా దిగుమతులదే పై చేయి ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? యుపిఏ కాలంలో పెరిగిన ఎగుమతి-దిగుమతులు నరేంద్రమోడీ హయాంలో రెండూ ఎందుకు పడిపోయినట్లు ? ఉపాధి ఎందుకు పెరగటం లేదు, ఎందుకు తగ్గుతోంది ?
పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించిన నెహ్రూ విధానంలో దుస్తులు, పాదరక్షలు,ఫర్నీచర్‌ వంటి వాటిని చిన్న లేదా కుటీర పరిశ్రమలుగా వర్గీకరించి వాటికి రక్షణ కల్పించారని, ఫలితంగా అవి గిడసబారి పోయినట్లు విమర్శ చేసే వారున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు బడా రంగం అది కూడా రక్షణ లేకపోతే విదేశీ దిగుమతుల దెబ్బకు విలవిల్లాడుతున్నాది. చిన్న పరిశ్రమల సంగతి సరేసరి మూతపడుతున్నవాటి సంఖ్యే అందుకు నిదర్శనం.చిన్న సన్నకారు పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగ సంస్ధలు కొనుగోలు చేయాలన్న రక్షణ విధానాలకు గతంలో అనుసరించిన వాటికి తేడా ఏమిటి ? కరోనా సమయంలో వాటికి ఇవ్వాల్సిన బకాయిలను కూడా మోడీ సర్కార్‌ చెల్లించలేకపోవటం వివాదంగా మారిన విషయం తెలిసినదే.

మన దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఘోరంగా విఫలమైంది. దిగుమతుల నిరోధానికి విధించే పన్ను శాతాలు పెరుగుతున్నాయి. మనం ఆ పని చేస్తే మన వస్తువులను దిగుమతి చేసుకొనే దేశాలూ అదే చేస్తాయా లేదా ? మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో మోడీ అండ్‌కో చెబుతారా ? ప్రభుత్వం వాణిజ్యం చేయకూడదంటూ విశాఖ ఉక్కు వంటి సంస్ధలను తెగనమ్మేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం అమలు జరిపే ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పధకం వంటి వాటి సంగతేమిటి ? విశాఖ ఉక్కు వంటి వాటికి ఈ పధకాన్ని ఎందుకు అమలు జరపరు ? ప్రయివేటు రంగం ముద్దు-ప్రభుత్వరంగం వద్దా ! భారీ పెట్టుబడులు-కార్మికులు తక్కువగా ఉండే ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఐదేండ్ల పాటు నాలుగు నుంచి ఆరుశాతం రాయితీలు ఇస్తామని ప్రకటించారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలు తమ సంగతి తాము చూసుకుంటాయి కదా వాటికి జనం సొమ్ముతో రాయితీలు ఇవ్వటం ఏమిటి ? ఇది రక్షణాత్మక చర్య కాదా ? భారీ పెట్టుబడులు, ఆటోమేషన్‌తో పనిచేసే సంస్ధలే ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ఉపాధి తక్కువ. అదే తక్కువ పెట్టుబడి, ఎక్కువ మంది కార్మికులు పని చేసే పరిశ్రమలు వాటితో పోటీ పడలేవు. అంటే బడా కంపెనీలకే ప్రోత్సాహకాలు ఇస్తే ఈ సంస్ధలేమి కావాలి ? విదేశాలు కూడా అదే పని చేస్తే మన ఉత్పత్తులు పోటీ పడతాయా ? నెహ్రూ విధానాలను విమర్శించేవారు తాము చేస్తున్నదేమిటి ?


నినాదాలు జనాన్ని ఆకర్షిస్తాయి తప్ప అమలు సందేహమే.అయితే చైనా అందుకు మినహాయింపుగా ఉంది. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారన్న లెనిన్‌ మాటలు తెలిసిందే. మన దేశంలో గరీబీ హటావో నినాదం అలాంటిదే.ఇప్పుడు ఆత్మనిర్భరత కూడా అలాంటిదే అని అనేక మంది అభిప్రాయం. మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచిన తరువాత వస్తున్న పోటీని స్ధానిక పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేకపోతోంది. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పుడు చేస్తున్నది అదే. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య(ఆర్‌సిఇపి) ఒప్పందంలో చేరకపోవటం కూడా రక్షణాత్మక చర్యల్లో భాగమే. దానిలో చేరితే మిగతాదేశాల సరకుల మీద దిగుమతి పన్నులు తగ్గించటంతో పాటు వాటిని అనుమతించాల్సి ఉంటుంది. మనకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ సామర్ధ్యం లేని కారణంగా బలమైన వారే ఉట్టి కొడతారు. మన ఎగుమతి అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. గత ఐదు సంవత్సరాలలో టారిఫ్‌ కోడ్‌లో ఉన్న 5,500కు గాను 3,600 వస్తువుల విషయంలో దిగుమతి సుంకాలు పెరిగాయి. గత ఏడాది కాలంలోనే ఆరువందల వస్తువుల మీద పన్నులు పెరిగాయి. నెహ్రూను విమర్శించేవారు తాము కక్కిన దానిని తామే తినటం అంటే ఇదే. ఇప్పటికే ప్రయివేటు రంగం పరిశోధన-అభివృద్దికి చేస్తున్నదేమీ లేదు, ఇక వాటికి రక్షణ కల్పిస్తే రాయితీలు మింగి మరింతగా పెరుగుతాయి తప్ప వినియోగదారులకు ప్రయోజనం ఏముంటుంది ?

అద్భుతాలు సృష్టించిన దేశాలుగా పేరు పడిన వాటిలో దక్షిణ కొరియా ఒకటి. ఇప్పుడు ఆ దేశ పరిస్ధితి ఏమిటి ? ప్రభుత్వం ఇచ్చిన మద్దతుకారణంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అది పురోగతి సాధించిన మాట వాస్తవం. అమెరికా రక్షణలో ఉన్న కారణంగా మిలిటరీ వ్యయం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ప్రయివేటు రంగానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు దానికి చైనా రూపంలో పోటీ ఎదురైంది. అక్కడి సంస్ధలు కార్యకలాపాలను పరిమితం చేయటం, ఉత్పత్తులను నిలిపివేయటం వంటి చర్యలకు పూనుకున్నాయి.1998 తరువాత తొలిసారిగా 2019లో దాని జిడిపి ఒకశాతం తిరోగమనంలో ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేసేందుకు ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున కంప్యూటర్లు అవసరమై అక్కడి సంస్ధలు ఎగుమతులతో 2020లో నిలదొక్కుకున్నాయి గానీ లేకుంటే పరిస్ధితి ఏమిటి ? అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న వడ్డీ రేటు కేవలం 0.5(అర)శాతమే. అటువంటి రాయితీ ఇచ్చే స్ధితిలో మన దేశం లేదు. అలాంటపుడు బస్తీమే సవాల్‌ అన్నట్లుగా అమెరికా అండచూసుకొని మనకంటే బలవంతుల మీద మీసాలు మెలివేయటం తగనిపని. వాణిజ్య యుద్దంలో అమెరికా వారే కిందామీద పడుతుంటే మనం నిలవగలమా ? చైనా మాదిరి వస్తువులను ఎగుమతి చేయాలని, దాన్ని అనుకరించాలని నాలుగు దశాబ్దాల తరువాత చెబుతున్నారు. మరోవైపు అక్కడి నుంచి వస్తువుల దిగుమతులను నిలిపివేసి ఆర్ధికంగా దెబ్బతీస్తామని అసాధ్యమైన అంశాన్ని టాంటాం వేస్తున్నారు.


అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి చౌకగా వచ్చే చైనా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందినట్లుగానే గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అదే పని చేస్తున్నారు.కొత్త ఆవిష్కరణలు చేసి తక్కువ ఖర్చుతో ఉత్పత్తిచేసేందుకు ముందుకు రావటం లేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో లైసన్సు విధానం ద్వారా కొన్ని పరిశ్రమలకు రక్షణ కల్పించారు. దాన్ని విమర్శిస్తున్న సంఘపరివార్‌ పెద్దలు ఇప్పుడు చేస్తున్నదేమిటి. అదే రక్షణ విధానంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలని, విధించిన పన్నులను చెల్లించాలంటున్నారు. సబ్సిడీలు ఇస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేస్తే ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో తగ్గిస్తున్నారు. అసలు పూర్తిగా ఎగవేస్తే రద్దుచేస్తున్నారు. అలాంటపుడు పోటీ ఎలా ఉంటుంది ? చరిత్ర పునరావృతం అవుతుందంటారు. దాని అర్ధం గతం మాదిరే అని కాదు. విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పిస్తున్నారు, గతంలో తెరిచిన ద్వారాలను మెల్లగా మూస్తున్నారు. స్వాతంత్య్రానంతరం విదేశీ మార్కెట్‌కు ద్వారాలు మూసినందుకు అమెరికా, ఐరోపా దేశాలు మనలను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అవి వేర్పాటు, ఉగ్రవాదం రూపంలో ఎలా మనలను దెబ్బతీశాయో చూశాము. ఇప్పుడు ఒక వైపు ధనిక దేశాలతో రాజకీయంగా చేతులు కలుపుతూ మరోవైపు ఆర్ధిక విధానాల్లో దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తున్నారు.

అమెరికా బడా దిగ్గజం అమెజాన్‌కు పోటీగా మన దేశ కంపెనీ రిలయన్స్‌ ముందుకు వచ్చింది. రిలయన్స్‌కు దన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అడుగడుగునా అమెజాన్ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది. అదే విధంగా మెట్రో వంటి సంస్ధలను రిటెయిల్‌ రంగంలోకి రాకుండా ఆటంకం కలిగిస్తూ దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తోంది మోడీ సర్కార్‌. అందువలన విదేశాలు ముఖ్యంగా ధనికదేశాలు మనలను చూస్తూ అలాగే వదలి వేస్తాయనుకుంటే పొరపాటు. ముందే చెప్పినట్లు నెహ్రూ-మోడీ ఇద్దరూ కార్పొరేట్ల ప్రతినిధులే. ఒకరు ప్రయివేటురంగం నిలబడేందుకు ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేస్తే, ప్రయివేటు రంగం బలపడింది కనుక మరొకరు దాన్ని కారుచౌకగా ప్రయివేటు, విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రయివేటు రంగానికి రక్షణ, రాయితీలు కల్పించటంలో సేమ్‌ టు సేమ్‌ ! ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తే తప్ప చైనా మాదిరి అభివృద్ది చెందే అవకాశం ఉండదు. కానీ ఆర్ధిక విధానాల విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ ఒకదాన్నే అనుసరిస్తున్నాయి. అంతర్గత వైరుధ్యాలు అప్పుడూ-ఇప్పుడూ ఉన్నాయి.