Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం వైరస్‌లు తయారు కావటం, వాటి నిరోధానికి జరుగుతున్న పోరాటం ముఖ్యంగా కరోనా మానవాళికి చరిత్రలో ఎదురైన అతిపెద్ద సవాలు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా మన దేశంలోనూ, ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్రిక్తతలకు కారణం అవుతున్న అమెరికా సామ్రాజ్యవాదులు తీరుతెన్నులు అందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కరోనా నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు ఔషధ కార్పొరేట్లు ప్రయత్నించటం దారుణం. వాక్సిన్‌ పంపిణీ, లభ్యత అసమానంగా ఉంటే ఏడాదికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 1.2లక్షల కోట్ల డాలర్ల నష్టం అని రాండ్‌ కార్పొరేషన్‌ అంచనా వేసింది. వాక్సిన్లు సమ ప్రాతిపదికన పంపిణీ చేయనట్లయితే ప్రపంచానికి నైతికంగా, ఆర్ధికంగా వినాశకరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్ద డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ చెప్పారు. ఇది రాసిన సమయానికి అమెరికా తరువాత స్ధానంలో ఉన్న బ్రెజిల్‌ను కిందికి నెట్టి మన దేశం మొత్తం కేసుల్లో రెండవ స్దానంలో ఉంది. ఏప్రిల్‌ 16న రెండు లక్షల పదహారువేలకు పైగా కేసులు రోజుకు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత ఉత్తర ప్రదేశ్‌ రెండవ స్ధానంలో ఉంది.
కొత్త కరోనా వైరస్‌లు పెరుగుతున్న నేపధ్యంలో పాత వైరస్‌కు తయారు చేసిన వాక్సిన్ల గురించి ఒక వైపు అనుమానాలు. మరోవైపు సాధ్యమైన త్వరగా దాన్నుంచి లబ్ది పొందాలని కార్పొరేట్లు ప్రయత్నిస్తున్నాయి. వాక్సిన్లు వస్తాయి, 2020 డిసెంబరు నాటికి కరోనాను అదుపులోకి తెస్తాము, త్వరలో సామూహిక రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పిన వారి అంచనాలు తప్పాయి. ఆశించిన వారికి కొత్త రకాల విజృంభణతో ఆశాభంగం కలిగేలా పరిణామాలు ఉన్నాయి. పరిమిత మరణాలతో వ్యాధి తీవ్రత తగ్గటానికి వాక్సిన్లు మినహా మరొక మార్గం కనిపించటం లేదు. అదే సమయంలో అవే కరోనాను కట్టడి చేస్తాయనే హామీ లేదు. కొత్త వైరస్‌ను కనుగొనే సామర్ధ్యమే అనేక దేశాలకు లేని స్ధితిలో వాటికి వాక్సిన్లు తయారు చేయటం ఎంత పెద్ద సవాలో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. కనిపిస్తున్నదాని కంటే పరిస్ధితి తీవ్రంగా ఉంది.


గతేడాది మార్చినెల 14న దేశంలో ఇరవై కొత్త కేసులు నమోదైతే సెప్టెంబరు 16న గరిష్టంగా 97,894కు పెరిగి తరువాత క్రమంగా తగ్గాయి. ఈ ఏడాది మార్చి 14న 26,971నమోదు కాగా నెల రోజుల్లో ఏప్రిల్‌ 15న 2,17,353కి పెరిగాయి. ఇంత వేగంగా పెరుగుతున్నప్పటికీ లక్షల మంది గుమికూడే కుంభమేళాను ప్రభుత్వాలు అనుమతించాయి. దానికి సమర్ధన విచిత్రంగా ఉంది. రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఏప్రిల్‌ 30వరకు జరిగే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే హరిద్వార్‌లో రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అనేక మంది సాధువులకు కరోనా సోకిందని ఒక అఖారా ప్రకటించి కుంభమేళాలను ముగించాలని కోరింది. ఆ పిలుపును ఎవరూ లెక్క చేయటం లేదు. కుంభమేళా జరిగేది ఉత్తరా ఖండ్‌లో అయినప్పటికీ పాల్గొనేవారు దేశం మొత్తం నుంచి వచ్చేవారుంటారు. అందువలన వారికి అంటుకుంటే అది దేశం మొత్తానికి అంటిస్తారు. పుణ్యం పోయి పాపం చుట్టుకుంటుంది అన్న స్పృహకూడా లేకుండా పాల్గొనేవారు, వారిని ప్రోత్సహిస్తున్నవారూ ఉండటం విచారకరం, గర్హనీయం.


కొత్త కరోనా వైరస్‌ రకాల గురించి తక్షణమే కేంద్రీకరించాలని, ఉన్న వాక్సిన్ను అందరికీ సమాన ప్రాతిపదికన అందించాలని, గరిష్టంగా వైరస్‌ను అణచివేయాలని ప్రపంచంలోని ప్రముఖులు పిలుపు నిచ్చారు. ఒకసారి వైరస్‌ సోకి రోగనిరోధక శక్తి పెంపొందిన తరువాత తిరిగి వైరస్‌ సోకదని చెబుతారు. అయితే కొత్త రకాలు వస్తున్నందున వాటికి గతంలో వచ్చిన వారా లేదా అనే విచక్షణ ఉండదు, ఎవరికైనా మరోసారి సోకుతుంది గనుక గతంలో తీసుకున్న జాగ్రత్తలన్నీ ఇప్పుడు కూడా పాటించాలి. సామాజిక వ్యాప్తి నిరోధానికి అంతర్జాతీయంగా మరింత సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉంది.


మార్చి నెలాఖరుకు ఉన్న సమాచారం ప్రకారం వాక్సిన్‌ తయారీలో చైనా అగ్రస్ధానంలో ఉండగా తరువాత అమెరికా, భారత్‌, ఐరోపాయూనియన్‌, బ్రిటన్‌ ఉన్నాయి. వీటిలో అమెరికా,బ్రిటన్‌ తమ దేశాల్లో తయారయ్యే వాక్సిన్‌ స్ధానిక వినియోగానికి మాత్రమే అని ప్రకటించాయి.ఐరోపా యూనియన్‌ తమ సభ్యదేశాల మధ్యనే వినియోగిస్తున్నది. చైనా, భారత్‌లు మాత్రమే ఇతర దేశాలకు ముఖ్యంగా పేద, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే ప్రతి దేశం వాక్సిన్‌ దౌత్యానికి పాల్పడుతున్నదనే విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవం లేదని చెప్పలేము. కమ్యూనిస్టు వ్యతిరేకత, ఇతర రాజకీయ కారణాలతో చైనా వాక్సిన్ల సామర్ధ్యం మీద తప్పుడు ప్రచారం చేయటంతో పాటు వాటిని తిరస్కరించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ కారణాలతో పాటు మన దేశంలో తయారీ ఖర్చు తక్కువగా ఉండటంతో అనేక బహుళజాతి కంపెనీలు తమ ఉత్పత్తులను మన దేశంలో తయారు చేయిస్తున్నాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో చైనా కంటే మన దేశం ఉత్పత్తిలో ముందుండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే చైనాలో ఉన్న సంస్ధలు మనకంటే ఎక్కువగా ఉత్పత్తి చేయగల స్థితిలో ఉన్నాయి.


అనేక అంశాలలో సోషలిస్టు దేశాలు-ఇతర దేశాల మధ్య స్పష్టమైన తేడాలను గతంలో ప్రపంచం చూసింది. ఇప్పుడు కరోనా విషయంలో కూడా అదే వెల్లడైంది. చైనా, వియత్నాం కరోనాను ఎలా కట్టడి చేశాయో, ఆర్ధిక దిగజారుడును ఎలా తప్పించాయో తెలిసిందే. అమెరికాలో తయారు చేసిన వాక్సిన్లకు పేటెంట్‌ హక్కు ఉన్న కారణంగా లాభాల కోసమే వాటిని తయారు చేస్తున్నారు. సామాన్యులకు వాటి ధర అందుబాటులో ఉండదు. కోవిషీల్డ్‌ను మన దేశంలో తయారు చేస్తున్న పూనాలోని సీరం సంస్ధ ప్రభుత్వానికి ఒక డోసును 150 రూపాయలకు ఇస్తున్నామని, బయటి మార్కెట్లో వెయ్యి రూపాయలకు అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఎగుమతుల మీద నిషేధం విధించిన కారణంగా తమకు నష్టం వస్తున్నదని అందువలన కేవలం మన దేశానికి మాత్రమే తయారు చేయాలంటే ఉత్పాదకత సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం తమకు మూడువేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని వత్తిడి చేస్తోంది. వివిధ రకాల వాక్సిన్లు అందుబాటులో లేని కారణంగా పేద, వర్దమాన దేశాల్లో ఏటా పదిహేను లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలకు భిన్నంగా తాము తయారు చేసిన వాక్సిన్‌ ఎవరైనా తయారు చేసేందుకు దాని ఫార్ములాను అందచేస్తామని, పేటెంట్‌ హక్కును వదులు కుంటామని క్యూబా ప్రకటించింది.గతంలో పోలియో వాక్సిన్‌ కనుకొన్న అమెరికా శాస్త్రవేత్త జోనాస్‌ సాక్‌ దాని మీద పేటెంట్‌ హక్కును వదలుకొని ప్రపంచంలో ఎవరైనా తయారు చేసేందుకు అవకాశం ఇచ్చిన ఆదర్శానికి అనుగుణ్యంగా ఇది ఉంది.

మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వంటి ఇతర ఔషధ కంపెనీలు వాక్సిన్‌ పరిశోధనలకు ప్రభుత్వాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు పొందినప్పటికీ, వాటి ఫార్ములాను ఇతరులకు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. జనం ప్రాణాలు కోల్పోయినా సరే తమ లాభాల వేటలో ఉన్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ కరోనా వాక్సిన్‌ తయారీ కార్యక్రమంలో 142 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. నూటముప్పయి కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండానికి జూన్‌ నాటికి కేవలం కోటీ 40లక్షల డోసులు మాత్రమే అందుతాయని గార్డియన్‌ పత్రిక విశ్లేషించింది. ప్రపంచవ్యాపింగా 700 కోట్ల డోసులు కొనుగోలు చేస్తే వాటిలో 420 కోట్లు ప్రధాన పెట్టుబడిదారీ దేశాలకే పోతున్నదని కూడా తెలిపింది. నిజానికి ప్రపంచ జనాభా మొత్తానికి వాక్సిన్ల తయారీకి అవకాశాలున్నప్పటికీ లాభాల కోసం ఆ పని చేయటం లేదు. అంతిమంగా కొన్ని లక్షల కోట్ల డాలర్లను కార్పొరేట్లు లాభం పొందితే ఆ మేరకు సామాన్యజనం నష్టపోతారు.


లాటిన్‌ అమెరికాలో క్యూబాతో పోలిస్తే ధనిక దేశాలు అనేకం ఉన్నాయి. కానీ కరోనా వ్యాక్సిన్సు రూపొందించిన దేశం క్యూబా ఒక్కటే. ఐదు రకాల వాక్సిన్ల తయారీకి పూనుకొని రెండింటిని జనానికి అందుబాటులోకి తెచ్చింది. మే నెలాఖరుకు పెద్ద వారందరికీ వాక్సిన్లు వేయనున్నారు.ఆగస్టు నాటికి 70శాతం మందికి ఏడాది ఆఖరుకు మొత్తం జనాభాకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒక్క కరోనానే కాదు అన్ని వాక్సిన్లు అక్కడి జనానికి ఉచితంగానే వేస్తారు. కరోనా వాక్సిన్ను తమ పౌరులకే కాదు, తమ దేశ పర్యటనకు వచ్చిన వారందరికీ కావాలంటే వేస్తున్నారు. మా దగ్గర లేని దాన్ని మేం ఇవ్వలేము, ఉన్నదాన్ని అందరం పంచుకుంటాం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.

బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ ( మన దేశంలో కోవీషీల్డ్‌ పేరుతో సీరం సంస్ధ తయారు చేస్తున్నది) అభివృద్దిలో 97శాతం సొమ్ము ప్రజల నుంచి లేదా దాతల నుంచి వచ్చిందే అని తేలింది. అంతేకాదు రెండువేల సంవత్సరం నుంచి జరుపుతున్న వివిధ పరిశోధనల సారాన్ని విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగించుకున్నారు. కరోనా వాక్సిన్‌ తయారీకి ధనాశ, పెట్టుబడిదారీ విధానమే కారణమని దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చేసిన వ్యాఖ్యలోని డొల్లతనాన్ని గార్డియన్‌ పత్రిక బయటపెట్టింది. ప్రయివేటు పెట్టుబడిదారుల నుంచి కేవలం 2.8శాతం నిధులు మాత్రమే అందాయని, పారదర్శకత లేని కారణంగా వివరాలు జనానికి తెలియటం లేదని పేర్కొన్నది. ఎలాంటి ప్రతిఫలం కోరకుండానే వాక్సిన్‌ తయారు చేసే అర్హత ఉన్నవారందరికీ ఫార్ములా అందచేస్తామని తొలుత ఆక్స్‌ఫర్డ్‌ ప్రకటించింది. అయితే గతేడాది ఆగస్టులో బిల్‌గేట్స్‌ కోరిక మేరకు బ్రిటీష్‌-స్వీడిష్‌ ఔషధ తయారీ సంస్ధ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. అది వివిధ దేశాలో సీరం వంటి సంస్దలతో ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తి చేయిస్తున్నది. లాభాల కోసం తాము వాక్సిన్‌ విక్రయాలు జరపం అని, ఆ మేరకు ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత వాక్సిన్‌ ధరను నిర్ణయించే హక్కును అట్టిపెట్టుకున్నట్లు తెలిపింది. ఇక్కడే అసలు కీలకం ఉంది. వాక్సిన్లు పరిమితం కాలం మాత్రమే ప్రభావం చూపుతాయని అందువలన రాబోయే సంవత్సరాలలో అదనపు డోసులను ఇవ్వాల్సి వస్తే దాన్ని లాభాలకు ఉపయోగించుకోవాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. వాక్సిన్ల తయారీకి సంవత్సరాల సమయం పట్టటం, ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉండటం, దాని ఉపయోగం పరిమిత కాలమే అయితే నష్టం కనుక ఔషధ సంస్ధలు పరిశోధనలకు మొగ్గుచూపటం లేదు. అటువంటి స్ధితిలో కరోనా వాటికి ఒక వరం మాదిరి తయారైంది. లాభాలు పిండుకోవచ్చని అంచనా వేస్తున్నారు.


కరోనా వాక్సిన్‌ తయారీ సంస్ధలు ఉత్పత్తి రేటు కంటే ప్రభుత్వానికి తక్కువకు ఇస్తున్నామని చెబుతున్నాయి. పరిశోధన-అభివృద్ధి ఖర్చు, పంపిణీ, మార్కెటింగ్‌ ఖర్చు లేనందున అవి వాటికి కలసి వచ్చినట్లే. ఏ ప్రయివేటు సంస్ధా లాభం లేకుండా ఏ పనీ చేయదు. గరిష్ట స్ధాయిలో ఉత్పత్తి చేస్తున్నందున టర్నోవరు ఎక్కువగా ఉండి లాభాలు దండిగానే ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తరువాత అవి ఎంత చెబితే అంతకు జనం కొనుగోలు చేయాల్సిందే. లాభాల గురించి అడిగితే ఇంతవరకు ఏ సంస్దా నోరు విప్పేందుకు సిద్దంగా లేదు. పూనాలోని సీరం సంస్ద ప్రధానంగా వాక్సిన్ల తయారీమీదే కేంద్రీకరించింది.


చైనా విషయానికి వస్తే కరోనా వాక్సిన్‌ ప్రజా వస్తువు అని ప్రకటించింది. అనేక దేశాలకు అందచేస్తామని ప్రకటించింది. అయితే అదేమీ వాణిజ్య ప్రాతిపదిక కాదు, అలాగని ఉచితమూ కాదు. మన దేశం విరాళంగా ఇస్తున్నట్లే అది కూడా ఇస్తోంది. ప్రతి వాక్సిన్‌ సామర్ధ్యం గురించి అనేక అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఎక్కువ మరికొన్ని తక్కువ కావచ్చు. తమ ప్రత్యర్ధి సంస్ధ తయారు చేస్తున్నది ఒట్టి నీళ్లే అని మన దేశంలోని ఒక సంస్ధ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. తరువాత ఆ రెండూ సర్దుబాటు చేసుకొని నోరుమూసుకున్నాయి. చైనాలో ప్రస్తుతం కేసులేవీ లేవు ఉన్నా వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోదగ్గవి కాదు కనుక అక్కడ వాక్సిన్‌ తయారీ విదేశాలకు అందచేయటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగని దేశీయంగా వాక్సిన్లు వేయటం లేదని కాదు. వెయ్యి పడకల ఆసుపత్రిని వారం రోజుల్లో సిద్దం చేయగలిగిన వారికి అవసరమైతే వాక్సిన పెద్ద ఎత్తున తయారు చేయటం పెద్ద సమస్య కాదు.


కరోనా కాటుకు జనం బలవుతున్నా కొన్ని దేశాలు రాజకీయాలు మానుకోలేదు. తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్నదనే సాకుతో అనేక దేశాలు దాన్ని నిషేధించాయి. దీనిలో శాస్త్రం కంటే ఇతర అంశాలే ప్రధానంగా ఉన్నాయని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారు చేసినదాని మీదే ఇంత రాజకీయం చేస్తుంటే చైనా తయారు చేసిందాని గురించి తప్పుడు ప్రచారంలో ఆశ్చర్యం ఏముంటుంది ?

హొ