ఎం కోటేశ్వరరావు
రైతాంగానికి తమ పంటలకు గిట్టుబాటు ధరలు ఎంత ముఖ్యమో వాటిని సాగు చేసేందుకు అవసరమైన పెట్టుబడులు-వాటి ధరలు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇఫ్‌కో సంస్ద ప్రస్తుతం ఉన్న మిశ్రమ ఎరువుల ధరలపై 45 నుంచి 58 వరకు పెంచుతూ ఒక ప్రకటన చేసింది. కొన్ని వార్తల ప్రకారం ఈ కంపెనీ తన మేనేజర్లకు పంపిన సమాచారం బయటకు పొక్కటంతో వాటిని నిర్దారిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది. యూరియా మినహా ఇతర ఎరువుల మీద ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేసిన విషయం తెలిసిందే.
తాజా పెంపు ప్రతిపాదన రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగించేదిగా కనిపించటంతో అనూహ్యంగా ప్రభుత్వమే వేగంగా స్పందించింది. అయితే ఇది ఎత్తుగడా ? చిత్తశుద్ధి ఎంత ? కేంద్ర మంత్రి ప్రకటించినట్లుగా దౌత్య మార్గాల ద్వారా దిగుమతి చేసుకొనే ఎరువులు, ముడి పదార్ధాల ధరలను నిజంగా తగ్గించటం సాధ్యమేనా ? ఇలాంటి ప్రయత్నం ముడి చమురు విషయంలో, ఇతర దిగుమతుల విషయంలో ఎందుకు చేయటం లేదు ? వ్యాపార విషయాల్లో దౌత్య పద్ధతు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి ? మేం ప్రయత్నించాం, సాధ్యం కాలేదు, దేశం కోసం భారం భరించకతప్పదు అనే పేరుతో చివరకు రైతుల మీద మోపుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇఫ్‌కో సంస్ద మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద సహకార సంస్ధ. దేశంలో 19శాతం యూరియా, 29శాతం మిశ్రమ ఎరువుల మార్కెట్ వాటా కలిగి ఉంది. ఉత్పత్తి-మార్కెటింగ్ కార్యకలాపాలే కాదు, ఇతర రంగాల్లోకి కూడా అది ప్రవేశిస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న ధరల పెంపుదల ప్రకటన వెలువడగానే ప్రభుత్వం రంగంలోకి దిగి ఇఫ్‌కోతో పాటు ఇతర ఎరువుల కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించింది. అంతర్గతంగా ఏమి జరిగిందో తెలియదు, ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోయేంతవరకు పాతధరలకు విక్రయిస్తామని కంపెనీలు హామీ ఇచ్చినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. దీనికి నిజంగా కంపెనీలు కట్టుబడి ఉంటాయా, అమలు చేసేందుకు ప్రభుత్వాలు పూనుకుంటాయా అన్నది చెప్పలేము. ఫ్యాక్టరీల నుంచి వెలువడిన ఎరువుల సంచుల మీద పాత ధరలు ముద్రించిన నిల్వల వరకు ఆ ధరలే ఉంటాయని వార్తలు వచ్చాయి. అవి ఎన్ని ఉన్నాయి ? ప్రభుత్వం వైపు నుంచి స్పష్టంగా ప్రకటన లేదు.చిల్లర, టోకు వర్తకులు, రవాణా కేంద్రాలు, గోడౌన్లలో ఉన్న ఎరువులను పాత ధరలకు విక్రయిస్తామని చెప్పినట్లు, ఇఫ్‌కో సంస్ధ వద్ద 11.25లక్షల టన్నుల పాత నిల్వలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.పాత రేట్లతో ముద్రించిన ఎరువులను మాత్రమే విక్రయించాలని మార్కెటింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు ఇఫ్కో ఎండీ యుఎస్ అవస్తి చెప్పారు.
గత కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా ఎరువుల ధరల పెరుగుదల, మన దేశంలో ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేని కారణంగా ముందు చూపుతో తయారీదారులు ఉత్పత్తి నిలిపివేశారా ఇవన్నీ ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నలే. ఈ ఏడాది ఖరీఫ్ వరకు పాత ధరలకే ఎరువులు లభిస్తాయని మంత్రులు నమ్మబలుకుతున్నారు. ఈ రంగంలో అసలేం జరుగుతోందో, పాలకుల హామీలు ఏ మేరకు అమలు జరుగుతాయో చూద్దాం. ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఎరువుల సంచులపై కొత్త ధరలను ముద్రించింది. అయితే అవి సుమారు ధరలు మాత్రమే అని-రైతుల కోసం ముద్రించినవి కాదని పేర్కొనటం గమనార్హం. శివకాశీ బాణసంచా ధరల మాదిరి ఇలా కూడా ముద్రిస్తారా ?
ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××× పాత ధర×× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
ఇంత భారీ ఎత్తున ధరలను పెంచితే రైతాంగం మీద పెను భారం పడనుంది. ఇప్పటికే మూడు వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ ఆందోళన చేస్తున్న రైతాంగ ఆందోళన మరింతగా పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది. గత పది సంవత్సరాలుగా ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ మొత్తాలలో ఎలాంటి మార్పు లేదు. అంతకు మించి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదు. పెరిగిన మేరకు అదనపు భారాన్ని రైతులే భరిస్తున్నారు. ఇప్పుడు పెరిగేది కూడా పూర్తిగా వారే మోయకతప్పదు. ఎరువుల తయారీకి దిగుమతి చేసుకుంటున్న ముడి వస్తువుల ధరలు, దిగుమతి ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా ధరలు పెంచకతప్పదని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఎరువుల శాఖ మంత్రి డివి సదానందగౌడ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. సరఫరా సక్రమంగా ఉంటే, దిగుమతుల ధరలు తగ్గితే తాము ధరలను పెంచాల్సిన అవసరం ఉండదని, అందువలన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవాలని బంతిని అటువైపు నెట్టారు. మొరాకో, రష్యా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఎరువులు, ముడి సరకుల మీద బైడెన్ సర్కార్ దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచింది. అందువలన వాటిని మన దేశానికి సరసమైన ధరలకు మన దేశానికి మరలిస్తే ఉపయోగమని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. దౌత్యపరమైన చర్యల ద్వారా ఆ ప్రయత్నం చేస్తామని, అంతవరకు ధరలు పెంచవద్దని మంత్రి కోరారు. ఇది సాధ్యమేనా ? ప్రయివేటు కంపెనీలకు మరో రూపంలో మనం ప్రయోజనం కలిగిస్తే అవి ఎరువులను తక్కువకు మనకు ఇస్తాయి. రైతులకు ఎరువుల సబ్సిడీ పెంచటానికే మొరాయిస్తున్న సర్కార్ విదేశీ కంపెనీలకు అలాంటి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా ?
అమెరికా, బ్రెజిల్, చైనాలలో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉన్నందున అక్కడి నుంచి గిరాకీ కారణం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు దారితీసింది. మన ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడి కారణంగా ఒకవేళ మనకు సరఫరా ఎరువులు, ముడిసరకుల ధరలను తగ్గిస్తే మిగతా దేశాలు చూస్తూ ఊరుకుంటాయా ? ఐరోపా, అమెరికా మార్కెట్లలో డిఏపి ఎరువుకు మంచి డిమాండ్ ఉంది. గతేడాది అక్టోబరులో డిఏపి టన్ను ధర 400 డాలర్లు ఉండగా ఇప్పుడు 540 డాలర్లవరకు పెరిగింది.
ఇఫ్‌కో డిఏపి కొత్త ధర రు.1,900 అని ప్రకటించగా అదే ఎరువు ధరను క్రిబ్‌కో, జువారీ, పారాదీప్, ఎంసిఎఫ్‌ఎల్ రు.1,700 అని, చంబల్ ఫెర్టిలైజర్స్ రు.1,600, ఇండోరామ్ రు.1,495గా పేర్కొన్నాయి. గత ఆరు సంవత్సరాల కాలంలో దేశంలో రసాయన ఎరువుల వినియోగం 16శాతం లేదా 2015-16 నుంచి 2020-21 మధ్య 510లక్షల టన్నుల నుంచి 590లక్షల టన్నులకు పెరిగింది. వీటిలో యూరియా 55 నుంచి 60శాతం వరకు ఉంటున్నది. ఎరువుల వినియోగం పెరుగుతున్నప్పటికీ వాతావరణ పరిస్ధితులను బట్టి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. గత పదేండ్ల సగటును చూసినపుడు 500 లక్షల టన్నులు ఉంది. గత ఆరు సంవత్సరాలలో 2020-21లో డిఏపి, మిశ్రమ ఎరువుల వాడకం ఎక్కువగా ఉన్నట్లు ఫిబ్రవరి వరకు అందిన సమాచారం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు అందించిన సమాచారం ప్రకారం సగటున హెక్టారుకు 2015-16లో ఎరువుల వినియోగం 135.76కిలోలు ఉండగా మరుసటి ఏడాదికి 123.41కి తగ్గింది, 2019-20కి 133.44 కిలోలకు పెరిగింది.పైన పేర్కొన్న పట్టిక ప్రకారం నాలుగు ఎరువులను కలిపి 50కిలోల యూనిట్‌గా తీసుకుంటే సగటున పాత ధర రూ.1,121 ఉంది, పెంపుదల అమల్లోకి వస్తే రు.1,706 అవుతుంది. ఈ లెక్కన దేశ సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక హెక్టారుకు పెరిగే పెట్టుబడి భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరుగుతుంది. గరిష్ట స్ధాయిలో బీహార్‌లో హెక్టారుకు 245.25కిలోలు వినియోగిస్తుండగా అత్యల్పంగా కేరళలో 36.49 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారు. సగటున రెండువందల కిలోలు వినియోగిస్తున్న రాష్ట్రాలలో పంజాబ్, హర్యానా, తెలంగాణా ఉన్నాయి. దేశ సగటు కంటే తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్‌ఘర్ ఉన్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే బీహార్‌లో ఒక హెక్టారు ఉన్న రైతుకు భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరిగితే అదే కేరళలోని రైతుకు రు.818 నుంచి రు.1,245కు పెరుగుతుంది. బీహార్ రైతుకు అదే విధంగా కేరళ రైతుకు కేంద్రం నిర్ణయించే ధాన్య మద్దతు ధర ఒకే విధంగా ఉంటుంది.(బీహార్‌లోని బిజెపి-జెడియు సర్కార్ రైతులను గాలికి వదలి వేస్తే కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నది అది వేరే విషయం.)
మన కంపెనీలు ఎరువుల ధరలు పెంచటం గురించి బెలారస్ (పూర్వపు సోవియట్ యూనియన్‌లోని బైలో రష్యా రిపబ్లిక్) బెలారష్యన్ పొటాష్ కంపెనీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జనవరి నెలలో అంగీకరించిన దానికంటే 13శాతం అదనంగా టన్ను ధర 280 డాలర్లకు తాము ఇండియన్ పొటాష్ లిమిటెడ్‌తో కొత్త కాంటాక్టు ( ఏప్రిల్ )కుదుర్చుకున్నామని కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ కంపెనీయే చైనాకు ఏడాది పాటు ఇదే ధరకు సరఫరా చేసేందుకు ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకుంది. ఇదే విధంగా ఇజ్రాయెల్‌కు చెందిన ఐసిఎల్ గ్రూప్ కూడా గతం కంటే 50 డాలర్లు అదనంగా అదే ధరకు ఇండియన్ పొటాష్‌కు ఆరులక్షల టన్నులు అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే బెలారస్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇతర దేశాల్లోని పొటాష్ కంపెనీలు తప్పు పట్టాయి. ఈ ధరలు మార్కెట్ స్ధితిని ప్రతిబింబించటం లేదని, తాము ఆ ధరకు విక్రయించేది లేదని ప్రకటించాయి. బెలారస్ కంపెనీ పెంచినది 13శాతం అయితే మన కంపెనీలు 50శాతంపైగా పెంపుదలను ప్రకటించటాన్ని చూసి అనేక విదేశీ కంపెనీలు ఆశ్చర్యపోవటమే కాదు, ధరల పెంపుదల ఆలోచన కలిగించినందుకు భారత కంపెనీలకు కృతజ్ఞతలు చెబుతున్నాయి.
అమ్మోనియం(డిఎపి) కంటే పొటాష్ (ఎంఓపి)ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అవి కూడా పెరుగుదలను సూచిస్తున్నాయి. బెలారస్, రష్యా, కెనడా,ఇజ్రాయెల్, జోర్డాన్, జర్మనీల నుంచి మన దేశం పొటాష్ దిగుమతి చేసుకుంటున్నది. పొటాష్ పూర్తిగా మన దేశం దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. డిఏపి పరిస్ధితి కూడా దాదాపు అదే. ముడి పదార్ధాలను దిగుమతి చేసుకొని ఇక్కడ ఎరువును తయారు చేస్తున్నాము. పొటాష్, ఫాస్పేట్ ఎరువులకు నిర్ణీత మొత్తం మాత్రమే సబ్సిడీ ఇస్తామని 2010లో యుపిఏ ప్రభుత్వం నిర్ణయించిన విధానాన్నే మోడీ సర్కార్ కూడా అనుసరిస్తున్నది. కంపెనీలు ధరలు పెంచితే ఆ మొత్తాన్ని రైతులే భరించాలి. ఒక్క యూరియా విషయంలోనే కేంద్రం ధరలను నిర్ణయిస్తున్నది. ఆ మేరకు కంపెనీలకు సబ్సిడీని చెల్లిస్తున్నది.
2013 తరువాత అంతర్జాతీయంగా టన్ను డిఏపి ధర 560 డాలర్లకు పెరగటం ఇదే ప్రధమం. దీనికి తోడు మన రూపాయి విలువ పతనం కూడా ఎరువుల ధరల మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. డిఏపి ధరలు అక్టోబరులో 400 డాలర్లు ఉండగా ఇప్పుడు 540కి పెరిగాయి. అదే విధంగా ఎరువుల తయారీకి అవసరమైన అమ్మోనియా, సల్ఫర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం మొత్తం ఎరువుల వినియోగం 610లక్షల టన్నులు ఉంటుందని అంచనా. కాగా దీనిలో 55శాతం యూరియా ఉంది. మిశ్రమ ఎరువుల ధరలు గణనీయంగా పెరిగినందున చౌకగా లభించే యూరియాను రైతులు విరివిగా వాడుతున్నారు. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 79వేల కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీకి కేటాయించగా దానిలో యూరియా ఒక్కదానికే 59వేల కోట్లు పోనుంది. ఇప్పటికే యూరియా ధర తక్కువగా ఉన్నందున అవసరానికి మించి వాడుతున్నారని, అది భూ ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నదని చెబుతున్నారు. దీనిలో వాస్తవమూ ఉంది, యూరియా సబ్సిడీ తగ్గించే ఎత్తుగడా ఉంది. ఇతర మిశ్రమ ఎరువులకు సబ్సిడీ ఇస్తే ఏ రైతు కూడా తన పొలం ఆరోగ్యాన్ని చేతులారా చెడుగొట్టుకోడు, వాటినే వినియోగిస్తాడు.
చివరిగా ఎరువుల ధరల తగ్గింపునకు ప్రభుత్వ పలుకుబడి, దౌత్యాన్ని వినియోగిస్తామని చెప్పటం గురించి చూద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి అంత పలుకుబడే ఉంటే దాన్ని ఒక్క ఎరువుల దిగుమతికే ఎందుకు పరిమితం చేయాలి ? ఎరువులు ఎంత ముఖ్యమో, పెట్రోలియం ఉత్పత్తులు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవి. అంతర్జాతీయ ధరలకు అనుగుణ్యంగా ఎంత పెరిగితే అంత మేరకు డీజిలు, పెట్రోలు మీద వడ్డిస్తామని చెబుతున్న కేంద్రం ఎరువుల విషయంలో భిన్నంగా వ్యవహరించటానికి కారణం ఏమిటి ? చమురు ధరలు ఎంత పెరిగినా, కేంద్రం పన్ను వడ్డింపు ఎంత పెంచినా వినియోగదారులు కిక్కురు మనటం లేదు. వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడుల ధరలు పెరిగితే అది ఆ రంగంలో తీవ్ర సంక్షోభానికి దారి తీస్తుంది. గతంలో అనేక రాష్ట్రాలలో రైతులు ఆందోళనలు జరిపిన చరిత్ర ఉంది. ఇప్పుడు రాజధాని ఢిల్లీ పరిసరాల్లో కొనసాగుతున్న రైతుల తిష్ట కూడా దానిలో భాగమే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత ఫలితాలు బిజెపికి ప్రతికూలంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా రైతు ఉద్యమాన్ని ఏదో ఒక రూపంలో అణచివేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో ఎరువుల ధరలు పెంచితే అందునా త్వరలో ఖరీఫ్ తరుణం ప్రారంభం కానున్నందున రైతుల ఉద్యమానికి ఆజ్యం పోస్తాయి. నియంత్రణ ఎత్తివేసిన ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచకుండా కార్పొరేట్ కంపెనీలను ఎంతకాలం కట్టడి చేయగలదు ? ముడి చమురు ధరలను కట్టడి చేసేందుకు సౌదీ, ఇతర దేశాల మీద వత్తిడి తెస్తామని, చమురు ఆయుధాన్ని వినియోగిస్తామని ఆశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రగల్భాలు పలికారు, ఏమైంది ? ఇప్పుడు ఎరువుల మంత్రి సదానంద గౌడ ప్రకటనలకూ అదే గతి పడుతుందా ? వ్యాపారం, లాభాలే ధ్యేయంగా వ్యవహరించే కార్పొరేట్లు ఒక దేశానికి తక్కువ రేటుకు, మరొక దేశానికి ఎక్కువ రేటుకూ ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు.