Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


నిజమే, అవసరం మనదైనపుడు తగ్గి ఉండాలని పెద్దలు చెప్పిన బుద్దులు- సుద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే-కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని లొంగి పోవాలని పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఏవీ చెప్పలేదే ? మన గత చరిత్ర కూడా అది కాదు కదా ! కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించకపోతే ఎవరికైనా ఏం గౌరవం ఉంటుంది. అయితే అందుకు తగిన దమ్మూ-ధైర్యం ఉండాలి. మనమూ అమెరికా విడదీయలేనంతటి సహ భాగస్వాములమని చెప్పారు. నిజమే కామోసు, మన నరేంద్రమోడీ గారిని చూసి భయపడకపోయినా అమెరికా మారు మనసు పుచ్చుకుందేమో అనుకున్నారు ఎందరో ! కానీ జరుగుతోందేమిటి ? కరోనాతో ప్రాణాలు పోతున్నా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను మనకు అందచేసేందుకు – సొమ్ము తీసుకొనే సుమా – మన సహ భాగస్వామి అంగీకరించటం లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అబ్బే మేము నిషేధం పెట్టలేదు ట్రంప్‌ హయాంలో దుమ్ముదులిపిన మా చట్టాన్నే అమలు జరుపుతున్నాం, దాని ప్రకారం ఎగుమతి చేసేందుకు అవకాశం లేకపోతే మేమేం చేయగలం, ఎగుమతుల మీద పని గట్టుకొని నిషేధం అయితే లేదబ్బా …. ఏవమ్మా కమలా హారిస్‌ మీ పూర్వీకుల దేశం వారు ఏదేదో అంటున్నారు నువ్వయినా చెప్పమ్మా అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడుతున్నారు. మీ అవసరాలను గుర్తించాంగానీ ఇప్పటికైతే మా చేయి ఖాళీ లేదు, ఏమీ చేయలేం అంటున్నారు అధికారులు. ఏం చేయాలో పాలుపోక మన నరేంద్రమోడీ గారి నోట మాట రావటం లేదు.(మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు, కరోనా కదా నోరు విప్పుతారేమో అనుకున్నవారికి ఆశాభంగం).

సరిగ్గా ఏడాది క్రితం మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కరోనా వ్యాప్తిని అలక్ష్యం చేసి ఎందరి ప్రాణాలను ఎలా తీశాడో చూశాము. ఆ సమయంలో మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ కరోనాకు కూడా దివ్వ ఔషధంగా పని చేస్తుందని ఎవరో చెప్పగానే మన దేశం దాని ఎగుమతుల మీద నిషేధం విధించింది. అది నిజమా కాదా అని నిర్దారించుకోకుండా తక్షణమే మాకు సరఫరా చేయండి లేకపోతే మన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాదిరి మీ తాట వలుస్తా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన విషయమూ-యాభై ఆరు అంగుళాల ఛాతీ గల మనదేశం వెంటనే ఎందుకంత కోపం కావాలంటే పంపకుండా ఉంటామా అంటూ ఆఘమేఘాల మీద అందచేయటం తెలిసిందే. శ్రీశ్రీ అన్నట్లుగా తారీఖులు, దస్తావేజులను పక్కన పెడితే శనివారం నాడు మనం నిషేధం విధించాం, ఆదివారం నాడు మోడీతో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడాడు. సోమవారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ ఔషధాన్ని పంపకపోతే ప్రతీకార చర్యలు తీసుకుంటామని బహిరంగంగా బెదిరించాడు. మంగళవారం నాడు ఆంక్షలను సడలించి అమెరికాకు ఎగుమతి చేశాము. ఇదీ ఏడాది క్రితం జరిగిన ఉదంతం.


ఇంతేనా జర్మనీకి రవాణా అవుతున్న లక్షలాది మాస్కులు, తొడుగులను మధ్యలోనే అడ్డుకొని తమ దేశానికి మళ్లించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ అదరగొండితనం కూడా అదే సమయంలో జరిగిన సంగతి తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో తాము దేశీయంగా చేసుకున్న రక్షణ ఉత్పత్తి చట్టానికి పదును పెట్టామని, దాని ప్రకారం అవి ఎగుమతి నిషేధ జాబితాలో ఉన్నాయని, తమ కంపెనీలు తయారు చేసినందున వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని అమెరికా సమర్ధించుకుంది. ఇప్పుడు కరోనా వాక్సిన్‌ కోవీషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు, ఇతర వస్తువుల సరఫరా మీద కూడా అదే చట్టాన్ని ప్రయోగించి ఎగుమతుల మీద జోబైడెన్‌ సర్కార్‌ నిషేధం విధించింది. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా తమ అవసరాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమ సహజ భాగస్వాములుగా వర్ణించి, ఉబ్బేసిన మన విషయంలో ఇవ్వటం లేదని తేలిపోయింది. ఎక్కడైనా బావే గానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ముద్దులాట వ్యవహారం దగ్గర మొహమాటానికి సిద్దమే గాని వ్యాపారం దగ్గర కాదు అంటే ఇదే. మనం నొప్పిని తట్టుకోలేని-బయటకు చెప్పుకోలేని స్దితిలో పడిపోయామా ?

అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ముడి సరుకులు నిండుకొని వాక్సిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని పూనాలోని సీరం సంస్ధ మార్చి తొమ్మిదవ తేదీన ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన వాక్సిన్‌ తయారీదారుల సమవేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆరువారాలు గడచిపోయాయి. తమ నేత ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారని చెబుతున్న మోడీ భక్తులు గానీ, బహుశా గడ్డాన్ని చూసి విశ్వగురువు అని వర్ణిస్తున్నవారు గానీ, చివరికి నరేంద్రమోడీ గానీ ఈ విషయంలో ఇంతవరకు చేసిందేమీ లేదు. భారత వినతిని పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడు ? తాత చచ్చి అవ్వ వితంతువు అయిన తరువాతనా అని తెలుగులో ఒక సామెత ఉంది. కరోనా కాటుకు మన జనం బలైన తరువాతనా లేక అమెరికా సంస్దలు తయారు చేస్తున్న వాక్సిన్ను మనం అధిక ధరలకు కొనుగోలు ఒప్పందం కుదిరిన తరువాత అనా ?


గతేడాది పిపిఇ కిట్ల తయారీ నిర్ణయాన్ని తీసుకోవటంలో జరిగిన జాప్యం గురించి వచ్చిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక దేశాల్లో రెండవ, మూడవ కరోనా తరంగం వచ్చిన విషయమూ తెలిసినా ఒకవేళ మన దగ్గర వస్తే ఏం చెయ్యాలన్న ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్ధితులను తెచ్చుకోవద్దని ఘనమైన ప్రధాని నరేంద్రమోడీ గారు నెపాన్ని జనం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కరోనా మీద విజయం సాధించామన్న స్వంతడబ్బా ప్రకటనలు తప్ప మరోసారి వస్తే అన్న ముందుచూపు లేకపోయింది. గతేడాది అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రోగులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇరవైఆరులక్షల కోట్ల ఆత్మనిర్బర పాకేజీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప అది అవసరమై ఆక్సిజన్‌ అందించి ప్రాణాలను నిలిపేందుకు ఉపయోగపడలేదు. గతేడాది అనుభవాన్ని చూసి ఇప్పటికే ఆక్సిజన్‌ సరఫరాకు కొత్త ప్లాంట్లకు అనుమతి ఇచ్చి సిద్దం చేసి ఉంటే అనేక రాష్ట్రాల్లో కొందరు రోగులు దిక్కులేని చావు చచ్చేవారా ? ఒక్క సిలిండరు ఉత్పత్తికి కూడా పనికి రాని లక్షల కోట్ల పాకేజ్‌లు ఎందుకు ? ఇల్లుకాలుతుండగా నీటికోసం బావులు తవ్వినట్లుగా ఇప్పుడు వంద ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్లు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. కేవలం రెండు వందల కోట్ల రూపాయలతో 150 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు ఎనిమిది నెలలు పట్టిందంటే మన కేంద్ర ప్రభుత్వ నిర్వాకం ఎలా ఉందో ఇంతకంటే చెప్పాలా ? ఇలాంటి స్దితికి విచారించాలా, బాధ్యతా రాహిత్యాన్ని గర్హించాలా ? యుద్దం వస్తుందో రాదో తెలియకపోయినా లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను కొని పెట్టుకుంటున్నాం. అవి కొంత కాలానికి పనికి రావని తెలిసినా కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలా లేదా ? డబ్బుల్లేక అడుక్కుంటే ఇచ్చే దాతలు ఎందరు సిద్దంగా లేరు ?

మార్చినెల 26వ తేదీ నుంచి దేశంలో కరోనా అనూహ్యంగా వ్యాపిస్తోన్న విషయం తెలిసినా, అంతకంటే ముందే తయారీదార్లు హెచ్చరించినా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరకులు మీద నిషేధం ఎత్తివేయించేందుకు అమెరికా మీద ఎలాంటి వత్తిడీ ఎందుకు తేలేదు. గత వారం వరకు మన కేంద్ర మంత్రులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అన్నీ తానై చూసుకుంటున్న ప్రధాని ఏమి చేస్తున్నట్లు ? ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యతలో వందో వంతైనా ఇచ్చి ఉంటే అమెరికా నుంచి వస్తాయో రావో ఎప్పుడో తేలిపోయి ఉండేది. ప్రపంచం గొడ్డుపోలేదుగా ! మరో దేశం నుంచి తెచ్చుకొనేందుకు ప్రయత్నం చేసినట్లు కూడా ఎవరూ చెప్పటం లేదు. అమెరికా కోడి కూయకపోతే ప్రపంచానికి తెల్లవారదా ? వాక్సిన్‌ తయారు చేస్తున్న దేశాల్లో చైనా ఒకటి. కావాలంటే ముడిసరకులు సరఫరా చేస్తామంటూ వారు ముందుకు వచ్చారు. అక్కడి నుంచి తెచ్చుకొనేందుకు ఇబ్బంది ఏమిటి ? గాల్వన్‌ ఉదంతానికి, సరిహద్దు ఉద్రిక్తతలు, సమస్యలకు ఇతర అంశాలను ముడి పెట్టవద్దని వారు చెబుతున్నారు. అలాంటపుడు అక్కడి నుంచి తెచ్చుకుంటే తప్పేముంది?


చైనా నుంచి తెచ్చుకోవచ్చుగానీ వారి సరకుల నాణ్యత గురించి సందేహాలున్నాయి అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, వాటి మీదే ఆధారపడి ఉన్నాము. వాటికి లేని నాణ్యత సమస్య వాక్సిన్‌ ముడి పదార్దాలు, వస్తువులకు మాత్రమే వచ్చిందా ? ఎందుకీ సాకులు, ప్రాణాలు పోతున్నా రాజకీయమేనా ? చైనాలో తయారైన వాక్సిన్ను ఇతర దేశాలు వినియోగించటం లేదా ? కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత ఎక్కిన వ్యవహారం తప్పితే మరొకటి ఏదైనా ఉందా ? నువ్వు మిత్రుడు అనుకుంటున్న అమెరికా వాడు ఇవ్వడు-శత్రువు అంటున్న చైనా వారు ఇస్తానంటే జనం ప్రాణాలను పోగొట్టటానికైనా సిద్దం అవుతున్నాము తప్ప తెచ్చుకోవటానికి ముందుకు కదలటం లేదు. ఇదేమి జవాబుదారీతనం ! ఇదేమి రాజధర్మం !! ప్రపంచంలో ఏదేశమూ ఎదుర్కోని విధంగా మన దేశంలో కరోనా విజృంభిస్తోందన్న కఠోర సత్యాన్ని కేంద్ర పాలకులు గుర్తిస్తున్నట్లు లేదు. బతికుంటే కావాలంటే తరువాత చైనాతో సమస్యలను తేల్చుకోవచ్చు. 1962లో యుద్దం జరిగిన తరువాత వివాదం ఉండగానే సాధారణ సంబంధాలు నెలకొల్పుకోలేదా, వాణిజ్యం చేయలేదా ? గాల్వన్‌లో మరో వివాదం వచ్చింది, ఆ పేరుతో ప్రాణావసరాలను కూడా తెచ్చుకోకుండా మడికట్టుకు కూర్చుందామా ? ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు అనుమతి ఇస్తే కరోనా పుచ్చిపోతుందని అనేక మంది హెచ్చరించారు. అయినా బిజెపి పెద్దలు ఖాతరు చేయలేదు.మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఏమైంది, కరోనాతో అనేక మంది మరణించిన తరువాత మధ్యలోనే విరమించాలని ప్రధాని చెప్పాల్సి వచ్చిందా లేదా ? వాయిదా కూడదు కూడదు అని చెప్పిన అఖాడాలు బతుకు జీవుడా అంటూ మూటా ముల్లె సర్దుకొని గుడారాలు ఎత్తివేశాయా లేదా ?

ముప్పు పేరుతో అమెరికా ఆయుధవ్యాపారులు చెప్పిన ఆయుధాలన్నీ కొంటున్నాము. సమాచారం ఇస్తామంటే దానికీ ఒప్పందాలు చేసుకున్నాము. ఇటు నుంచి అటుపోవటం తప్ప అటు నుంచి ఇటు వచ్చిందేమీ లేదు. చైనా మీద, అదే విధంగా పెరుగుతున్న చమురు ధరల మీద మన ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పారు.చైనా యాప్‌లను నిషేధించారు, కొన్ని పెట్టుబడులను అడ్డుకొని, ఆయుధాలు కొనుగోలు చేసి అమెరికాను సంతోష పెట్టారు తప్ప మనం సాధించింది ఏమిటి? అమెరికా నుంచి వాక్సిన్‌ ముడిసరకులను అప్పనంగా అడిగామా ? ఆపదలో ఆదుకోని మిత్రుడి గురించి వెంపర్లాడటం ఎందుకు ? చైనా వస్తువుల కొనుగోలు మానుకుంటే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని, మనం చెప్పినట్లు వింటారని ప్రచారం చేశారు. అలాంటి సూచనలేమీ లేవు, తొలి మూడు మాసాల్లో 18శాతం అభివృద్ది రేటు సాధించినట్లు వార్తలు వచ్చాయి. కీలకమైన లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలు పూర్వపు స్ధానాలకు తగ్గాలంటే మనం పెడుతున్న ప్రతిపాదనలను అంగీకరించటం లేదు. అంటే మన వత్తిడిలో పసలేదని తేలిపోయింది. అమెరికా అండ చూసుకొని ఆయాసపడటం అవసరమా ? పోనీ చమురు ఎగుమతి దేశాల మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పినట్లు దిగుమతి ఆయుధ ప్రయోగంచేసి వత్తిడి తెచ్చి చమురు ధరలు తగ్గించామా అంటే అదీ లేదు. చివరకు చమురును కూడా అమెరికానుంచే కొనుగోలు చేస్తున్నాము. గల్ఫ్‌, పశ్చిమాసియా దేశాలను శత్రువులుగా చేసుకుంటున్నాము. చతుష్టయ కూటమి నుంచి తప్పుకుంటాము, ఆయుధాలు, చమురు కొనుగోలు నిలిపివేస్తాము అంటే అమెరికా దిగిరాదా ? జనం చస్తున్నా ఎందుకీ లొంగుబాటు ?ముడి పదార్దాల సరఫరా గురించి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రితో మాట్లాడామని చెప్పారు తప్ప ఫలితం ఏమిటో వెల్లడించలేదు. వాక్సిన్లకోసం ముడి సరకులు సజావుగా అందేందుకు అందుబాటులో ఉంచాలని పెద్ద దేశాలను కోరినట్లు జై శంకర్‌ చెప్పారు. అలాంటపుడు సూటిగానే చైనా నుంచి ముడిసరకులను ఎందుకు తీసుకోకూడదు ?

వాక్సిన్‌ రాజకీయాల్లో భాగంగా చతుష్టయ దేశాలైన అమెరికా, జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియా కూటమి వాక్సిన్‌ తయారీకి చర్యలు తీసుకొని చైనా పలుకుబడిని తగ్గించాలని నిర్ణయించాయి. దానిలో భాగంగా మన దేశానికి వాక్సిన్‌ ముడి పదార్దాలతో పాటు అమెరికా, జపాన్‌ నుంచి పెట్టుబడులూ వస్తాయని చెప్పారు. బ్రిటన్‌ ఆస్ట్రాజెనెకాతో పాటు సీరం సంస్ద అమెరికాకు చెందిన నోవాక్స్‌ వాక్సిన్‌ కూడా తయారీకి ఒప్పందం చేసుకుంది. పోనీలే రాజకీయం చేస్తే చేశారు, ఏదో ఒక పేరుతో వాక్సిన్‌ అందించేందుకు పూనుకున్నాయి అని సంతోషించిన వారికి ముడిసరకులను బ్లాక్‌చేసిన అమెరికా తానే మోకాలడ్డింది. దీంతో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది, నోవాక్స్‌ ప్రారంభానికి నోచుకోలేదు.


తూర్పు చైనాలోని జియాంగ్‌సు రాష్ట్రంలో ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీ ప్రతినిధి చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌తో మాట్లాడుతూ ఇప్పటికే తాము భారత్‌కు సరఫరా చేస్తున్న సోడియం క్లోరైడ్‌ను వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారని, దానిలో కొంత వాక్సిన్లకూ ఉపయోగించవచ్చని చెప్పారు. ప్రస్తుతం తాము దేశీయ అవసరాలకోసమే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇతర దేశాలు కోరితే వాటికీ అందచేసే సామర్ధ్యం తమకు ఉందని చెప్పారు. షాంగ్‌డోంగ్‌ రాష్ట్రానికి చెందిన మరో సంస్ధ ప్రతినిధి మాట్లాడుతూ ఔషధాలకు అవసరమైన సీసాల తయారికి వినియోగించే సిలికాన్‌ గ్లాస్‌ను తయారు చేస్తున్నామని, ఏటా ఐదు కోట్ల సీసాలు తయారు చేయగలమని అవసరమైతే విదేశాలకూ అందచేయగలమని చెప్పారు. క్యూబాలో వాక్సిన్‌ తయారు చేసినా దానిని సరఫరా చేసేందుకు అవసరమైన సీసాల తయారీ సమస్యగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి, అదే పరిస్ధితి మన దేశంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఉంది.


మనకు అవసరమైన వాక్సిన్ల తయారీకి విదేశాల్లో కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. మంచిదే ! మన పాలకులు చేయాల్సిందేమిటి ? ప్రయివేటు కంపెనీలను నమ్ముకొని మన ఐడిపిఎల్‌ను మూతపెట్టాము, వాక్సిన్‌ తయారీ కేంద్రాలలో చెట్లు మొలిపిస్తున్నాము.లాభాలే ధ్యేయంగా పని చేసే సీరం సంస్దలో ఉత్పత్తిని పెంచటానికి 1500 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి హామీలు లేకుండా ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పులేదు, తమిళనాడులో ఆరువందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సమగ్ర వాక్సిన్‌ కేంద్రాన్ని ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు ? ఇలాంటివే ఇంకా కొన్ని సంస్ధలు ఉన్నాయి. యుద్ద ప్రాతిపదికన వాటిని కరోనా వాక్సిన్ల తయారీకి ఎందుకు ఉపయోగించటం లేదు ? ఎవరి ప్రయోజనాలకోసమీ నిర్లక్ష్యం ? ఇంత పెద్ద దేశంలో ఎప్పుడే అవసరం ముంచుకు వస్తుందో తెలియదు. అవసరం తీరిన తరువాత ఇతర వాక్సిన్లను తయారు చేయవచ్చు, ఇతర దేశాలకు ఎగుమతికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వ రంగంలో ఔషధతయారీని మూతపెట్టిన కారణంగా ఈ రోజు అవసరమైన డెమిసెవిర్‌ వంటి ఔషధాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. మహారాష్ట్రలో అలా దొరికిపోయిన దొంగలకు మద్దతుగా ఆ రాష్ట్ర బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ధర్నాకు దిగారంటే ఏమనుకోవాలి. తీరా అసలు విషయం బయటపడిన తరువాత మహారాష్ట్ర కోసమే డామన్‌ కంపెనీ నుంచి తెప్పిస్తున్నట్లు మాట మార్చారు. అంటే అక్కడి శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం చేతగానిదైంది, మా పలుకు బడి ఉపయోగించి తెచ్చామనే చౌకబారు చావు రాజకీయం తప్ప దీనిలో ఏమైనా ఉందా !