Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఎదుటి వారిలో ఏమీ లేకుండా మనం ఎగిరెగిరి కౌగలించుకున్నంత మాత్రాన ఒరిగిందేమీ లేకపోగా అడుగడుగునా అవమానాలు. విదేశీనేతలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ను మన నరేంద్రమోడీ కౌగిలించుకున్న తీరు తెన్నులు చూసి ఎబ్బెట్టుగా అనిపించి ఇదేమిటని విమర్శించిన వారు కొందరు ఉండవచ్చు. కానీ మోడీ ఏం చేసినా దేశం కోసమే అని నమ్మి సమర్ధించిన వారెందరో. ఒక్కొక్క నేతది ఒక్కో శైలి. అధికారంలో ట్రంపు ఉన్నా బైడెన్‌ వచ్చినా అమెరికా నుంచి అడుగడుగునా ఆటంకాలు, అవమానాలే. అన్నింటికీ మించి మనకు ఒరిగిందేమీ లేకపోగా నష్టాలే. వాటిని పదే పదే చెప్పుకున్నా అల్లు అర్జున్‌ ఒక సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు.


తాజా విషయానికి వస్తే అమెరికా మనల్ని మోసకారుల జాబితాలో చేర్చింది. కరెన్సీతో మోసాలకు పాల్పడుతూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ కన్నేసి ఉంచాల్సిన దేశాల జాబితాలో మన పేరు చేర్చింది. తొలిసారి 2018లో చేర్చి మరుసటి ఏడాది తొలగించింది, మరోసారి గత డిసెంబరులో చేర్చింది. దాన్ని మరోసారి తాజా పరిచినట్లు గతవారంలో వార్తలు వచ్చాయి. అమెరికా ఆర్ధికశాఖ రూపొందించిన జాబితాలో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, ఇండియా, మలేషియా, సింగపూర్‌,థాయిలాండ్‌, మెక్సికో ఉంది. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రుదేశాలనేవి లేవని ఈ జాబితా స్పష్టం చేస్తున్నది. డిసెంబరు జాబితాలో మెక్సికో, ఐర్లండ్‌లు లేవు. ఈ జాబితా లేదా ఈ దేశాల మీద ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఏ ప్రపంచ వాణిజ్య సంస్దో లేక ఐక్యరాజ్యసమితో అయితే అదోదారి. ఏదో ఒక అంతర్జాతీయ చట్టం కింద అనుకోవచ్చు. అదేమీ లేదు, 2015నాటి అమెరికా వాణిజ్య చట్టం ప్రకారం ఈ పని చేశారు. వారు దాడి చేయాలనుకున్నవారిని జాబితాలో పెడతారు, ఎత్తుగడగా వద్దనుకున్న వారిని మినహయిస్తారు. దానిలో భాగంగానే వియత్నాం, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, స్విడ్జర్లాండ్‌లను ఆరునెలల క్రితం ఈ జాబితాలో చేర్చారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతో జాబితా నుంచి తొలగించి మిగతావాటితో పాటు ఓ కన్నేసి ఉంచాలని మాత్రమే నిర్ణయించారు.


ఒక దేశం కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించేందుకు అమెరికాకు ప్రాతిపదిక ఏమిటి? అమెరికాతో వాణిజ్యం చేసే దేశపు మిగులు ఏడాదిలో 20 బిలియన్‌ డాలర్లు ఉండటం, ఆయా దేశాల జిడిపిలో కరెంటు ఖాతా మిగులు మూడుశాతం వరకు ఉన్నపుడు, ఒక దేశం ఏడాది కాలంలో కొనుగోలు చేసిన విదేశీ కరెన్సీ దాని జిడిపిలో రెండుశాతం దాటితే అమెరికాను మోసం చేస్తున్నట్లు పరిగణిస్తారు. 2020 జనవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో వియత్నాం, స్విడ్జర్లాండ్‌, తైవాన్‌, భారత్‌, సింగపూర్‌ లావాదేవీల గురించి అమెరికాకు అనుమానం వచ్చినట్లు ఏప్రిల్‌ 16వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. పైన పేర్కొన్న మూడు ప్రాతిపదికలలో మన దేశం రెండింటిలో గీత దాటినట్లు పేర్కొన్నది. 2020లో పన్నెండు నెలలకు గాను పదకొండు నెలల్లో భారత్‌ నిఖరంగా 131 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసింది, ఇది జిడిపిలో ఐదుశాతానికి సమానం. 2001,02,03 తరువాత 2020లో భారత కరెంటు ఖాతా మిగులు 1.3శాతం ఉంది. అదే ఏడాది అమెరికాతో భారత వాణిజ్య మిగులు 24 బిలియన్‌ డాలర్లు ఉంది, సేవల వాణిజ్యంలో కూడా ఎనిమిది బిలియన్‌ డాలర్ల మిగులు ఉంది. 2019తో పోల్చితే కరోనాతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలయినా మన దేశ స్టాక్‌ మార్కెట్లోకి విదేశీ మదుపరులు పెద్ద మొత్తంలో ప్రవేశించారు. మన డాలర్ల నిల్వ పెరగటానికి అది కూడా ఒక కారణం. ఒక దేశ ఆర్ధిక మౌలిక అంశాలను ప్రతిబింబించే విధంగా కరెన్సీ మారకపు విలువ ఉండాలి. విదేశీ కరెన్సీ జోక్యం పరిమితంగా ఉండాలి, ఎక్కువగా నిలువ చేసుకోకూడదని అమెరికా ఆర్ధికశాఖ నివేదిక పేర్కొన్నది.


వారి జాబితా నుంచి తొలగించిన వాటిలో స్విడ్జర్లండ్‌ ఐరోపాలోని తటస్ధదేశం, అయినా గతంలో మోసకారుల జాబితాలో చేర్చి తాజాగా తొలగించింది. వియత్నాం సోషలిస్టు దేశం. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల విషయంలో చైనాతో విబేధిస్తున్నది కనుక దాన్ని తనవైపు తిప్పుకోవాలంటే ఇలాంటి తాయిలం పెట్టాలన్నది ఒక ఎత్తుగడ. ఇక తైవాన్‌ విషయానికి వస్తే చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం, స్వంతంగా మిలిటరీని కలిగి ఉంది. అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది. దాన్ని కూడా అనుమానితుల జాబితాలో చేర్చితే అక్కడి జనంలో అమెరికా వ్యతిరేకత పెరుగుతుంది, దీనికి తోడు చైనాను రెచ్చగొట్టేందుకు తైవాన్‌ ఒక శిఖండిలా ఉపయోగపడుతోంది కనుక దానికీ అమెరికన్లు మినహాయింపు ఇచ్చారు. మనల్ని మిత్రదేశం అంటూనే మరింతగా లొంగదీసుకొనేందుకు మోసకారి ముద్రవేశారు.


అమెరికా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నది. స్వార్ధం, బెదిరింపు,లొంగదీసుకొనే ప్రక్రియలో భాగం తప్ప మరొకటి కాదు. దీనిలో కీలక అంశం కరెన్సీ విలువ. ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల మధ్య టవమారకానికి డాలర్లను వినియోగిస్తున్నారు. కరెన్సీ విలువలను మోసపూరిత పద్దతుల్లో కృత్రిమంగా తగ్గించి లేదా పెంచి తమ కార్మికులను దెబ్బతీస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలని చెబితే బాగోదు కనుక కార్మికుల పేరుతో రాజకీయం చేస్తోంది. ఆయా దేశాలు తమ కరెన్సీ విలువలను కావాలని తగ్గిస్తున్నాయన్నది దాని ప్రధాన ఆరోపణ. చిత్రం ఏమంటే ట్రంప్‌ యంత్రాంగం చైనాను మోసకారి అని ప్రకటించగా, బైడెన్‌ యంత్రాంగం నిఘావేసి ఉంచాల్సిన మోసకారుల జాబితాలో మన దేశంతో పాటు చైనాను కూడా చేర్చింది, అంటే చైనా మీద దాడి తీవ్రతను తగ్గించింది. ఈ జాబితా రూపకల్పనలో ఎలాంటి ఆర్ధిక పరమైన తర్కం తనకు అర్ధం కావటం లేదని మన వాణిజ్యశాఖ కార్యదర్శి అనుప్‌ వాధ్వాన్‌ వ్యాఖ్యానించారు. పోనీ మోసకారులంటే ఏ ఒక్కరి మీద అమెరికా ఆంక్షలు ఎందుకు లేవు అన్నారు. మార్కెట్‌ శక్తుల ప్రాతిపదికగానే రిజర్వుబ్యాంకు వ్యవహరిస్తోందన్నారు.


ఇక అమెరికా ఆగ్రహం విషయానికి వస్తే మన రూపాయి పాపాయి బలపడుతోంది- చిక్కిపోతోంది. తాజాగా ఆసియాలో అత్యంత దారుణమైన పని తీరు కనపరుస్తున్న కరెన్సీగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలర్ల కొనుగోలు రూపాయి పెరుగుదలను నిరుత్సాహపరచేందుకు తీసుకున్న చర్యగా కొందరు చెబుతున్నారు. రూపాయి చిక్కితే ఎగుమతిదార్లకు లాభం- దిగుమతిదార్లకు నష్టం, బలపడితే ఎగుమతిదార్లకు నష్టం-దిగుమతిదార్లకు లాభం. మార్కెట్లోని ఈ రెండు శక్తులు తమకు అనువైన వాదనలను ముందుకు తెస్తూ వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి.మనతో వాణిజ్యం జరిపే దేశాల ప్రమేయం కూడా దీనిలో ఉంటుంది. తమ డాలరు విలువ తగ్గకుండానే తమ సరకులను అమ్ముకోవాలన్నది అమెరికా లక్ష్యం. కరెన్సీ విలువ ఎక్కువ-తక్కువలు ఒకే దేశంలో ఎగుమతి-దిగుమతిదార్లు ఇద్దరి మీద ప్రభావం చూపుతాయి. ఇలా ఇంటా బయటి వత్తిళ్లతో రూపాయి పరిస్ధితి అగమ్యగోచరంగా ఉంటుంది. గత ఏడు సంవత్సరాల కాలంలో చూసినపుడు రూపాయి 58 నుంచి 75కు దిగజారింది కనుక దీనిలో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుపిఏ కంటే తన పాలనలో ఎగుమతులను పెంచి దేశాన్ని ముందుకు తీసుకుపోయానని చెప్పుకొనేందుకు మోడీ సర్కార్‌ రూపాయి విలువను దిగజార్చిందని చెప్పవచ్చు. అంతకు ముందు రూపాయి విలువ పడిపోతే ముఖ్యమంత్రిగా మోడీ, బిజెపి నేతలు ఎంత యాగీ చేశారో, ఎన్ని మాటలన్నారో తెలిసిందే. తమ దాకా వచ్చే సరికి ప్లేటు ఫిరాయించారు.నోరు మూసుకున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.


2010 నుంచి 2019వరకు ఉన్న వివరాలను చూసినట్లయితే మన ఎగుమతులు జిడిపిలో 2010లో 22.4శాతం ఉండగా 2013 నాటికి 25.43శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి పడిపోతూ 2019నాటికి 18.41శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా తగ్గినప్పటికీ ఎగుమతుల కంటే ఎక్కుగానే ఉన్నాయి. 2010 -21 మధ్య డాలరుతో రూపాయి మారకపు విలువ 45 నుంచి 75కు పడిపోయింది (ఏప్రిల్‌ 24న 75.22). మే నెలలో 76.50వరకు పతనం కావచ్చని అంచనా. ఇదే కాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు రూపాయి విలువ అంతర్గతంగా 100 నుంచి 202.96(ఏప్రిల్‌ 24వ తేదీ)కు పడిపోయింది. అంటే ఒక వస్తువు ధర పదేండ్లలో ఆ స్ధాయిలో పెరిగింది అని చెప్పవచ్చు. ఒక దేశ కరెన్సీ విలువ డాలరుతో మారకపు ధర ఎంత తక్కువ ఉంటే అంతగా ఎగుమతి అవకాశాలు ఉంటాయన్నది సాధారణ సిద్దాంతం. దానికి మినహాయింపుగా మన దేశ పరిస్ధితి ఉన్నట్లు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ ఏడు సంవత్సరాలుగా ఎగుమతుల గురించి కబుర్లు చెప్పటం తప్ప పెరగలేదంటే ఇతర దేశాల సామర్ధ్యం లేదా మన అసమర్ధత అయినా కావచ్చు. ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్ధిక వ్యవస్దలను నిర్మించిన దేశాలన్నీ చైనా మాదిరి విజయవంతం కాలేదు.మనం అసలు పోటీలోకే ప్రవేశించ కుండా లేస్తే మనిషిని కాదు అన్న మల్లయ్య కథమాదిరి మాట్లాడుతున్నాము.


ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. ఇలాంటి పరిస్ధితి ఏ దేశంతో ఉన్నా అమెరికన్లకు నిదురపట్టదు.చైనాతో లోటు మరింత ఎక్కువగా ఉంది కనుక దానితో వాణిజ్య యుద్దానికి దిగింది.మనది పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఖరీదైన తన వస్తువులను మన మీద రుద్దాలని చూస్తున్నది. వాటికి మార్కెట్‌ ఉండదు కనుక దానికి మన దిగుమతిదారులు కూడా అంగీకరించరు. ఎక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటే అక్కడికే దారితీస్తారు. అందుకే కమ్యూనిజానికి నరేంద్రమోడీ బద్ద వ్యతిరేకి అయినప్పటికీ వాణిజ్యవేత్తల వత్తిడికి తలొగ్గి భారీ ఎత్తున దిగుమతులకు అనుమతించక తప్పలేదు. మరోవైపు అమెరికాను సంతృప్తి పరచేందుకు పెద్ద మొత్తంలో ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నారు, మరో దేశం నుంచి దొరకని వైద్యపరికరాల వంటివాటిని కూడా దిగుమతి చేసుకుంటున్నాము. అయినా అమెరికన్లకు తృప్తి లేదు.


మన దేశ కరెంటు ఖాతా ఎప్పుడూ లోటులోనే ఉంటున్నది. గతేడాది కరోనా వలన కొనుగోలు చేసేవారు లేక దిగుమతులు పెద్ద ఎత్తున పడిపోయినందున మన వాణిజ్యం మిగుల్లో ఉంది తప్ప నిజానికి మన ఎగుమతులు పెరిగి కాదు. నికర వాణిజ్యలోటు నిరంతరం ఉండే మన వంటి దేశాలకు తగినన్ని డాలర్ల నిల్వలు లేనట్లయితే అసాధారణ రీతిలో చమురు ధరలు పెరిగితే చెల్లింపుల సమస్య తలెత్తుతుంది. అయితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటికీ ఆరు సంవత్సరాల కాలంలో చమురు ధరలు కనిష్టస్ధాయికి పడిపోయి విదేశీమారక ద్రవ్య నిల్వలు బాగా పెరిగాయి.కరోనా కారణంగా స్టాక్‌మార్కెట్‌ పడిపోయింది, దాంతో విదేశీమదుపుదార్లు వాటాలను అమ్ముకొని పెట్టుబడులు తరలించుకుపోయినపుడు రిజర్వుబ్యాంకు డాలర్లను కొనుగోలు చేసింది. అయితే మన ప్రభుత్వం కార్పొరేట్‌శక్తులకు పెద్దమొత్తంలో రాయితీలు ఇవ్వటంతో స్టాక్‌మార్కెట్‌లో వాటాలు ధరలు పెరిగినందున తిరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. గతేడాది ఏప్రిల్‌ 24న రూపాయి విలువ 76.22కు పడిపోయింది. తరువాత పెరిగి, స్వల్పంగా తగ్గినా 2021మార్చి 21న 72.32కు పెరిగింది. తిరిగి గత నెల రోజుల్లో ఏప్రిల్‌ 21న 75.22కు పతనమైంది. తరువాత అదే స్ధాయిలో కొనసాగుతోంది. ఇప్పుడు ముడిచమురు ధర 65 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నపుడు ఇలా ఉంటే విశ్లేషకులు చెబుతున్నట్లు 75డాలర్లకు పెరిగితే పతనం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఉన్న డాలర్లు కూడా హరించుకుపోతాయి గనుక డాలర్లను కొనుగోలు చేయకతప్పదు.


2020-21 ఆర్ధిక సంవత్సరంలో తొలి ఆరునెలల్లో మన వాణిజ్య మిగులు 15.1 బిలియన్‌ డాలర్లు ఉండగా, సెప్టెంబరు-డిసెంబరు కాలంలో 1.3 బిలియన్‌ డాలర్లలోటు నమోదైంది. తరువాత మూడు నెలల్లో అది 5-7 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇప్పటి వరకు ఉన్న పరిస్ధితిని బట్టి రూపాయి విలువ 74.50 నుంచి 76 మధ్య కదలాడవచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇంతకు మించి పతనం కాకుండా ఆర్‌బిఐ చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అంతకు మించితే మన దిగుమతుల బిల్లు పెరిగి, పర్యవసానంగా జనం మీద మరింత భారం పడుతుంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి మార్కెట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండేట్లు చూసే లక్ష్యంతో ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య రిజర్వుబ్యాంకు లక్ష కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా రూపాయి పతనాన్ని అరికట్టవచ్చని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం వీటి మీద ఎలా ఉంటుందో ఊహించలేని స్ధితి. ఇక్కడ సమస్య మనకు అవసరమైన డాలర్లు కొనుగోలు చేస్తే అమెరికాకు అభ్యంతరం ఎందుకు ఉండాలి ? తర్కబద్దంగా చెప్పాలంటే డాలరు విలువను నిర్ణయించేది మార్కెట్‌శక్తులైనపుడు మన రూపాయిని కూడా అవే శక్తులు నిర్ణయిస్తాయని ఎందుకు అనుకోకూడదు. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే ప్రతి దేశమూ తన అవసరాలకు అనుగుణ్యంగా కరెన్సీ విలువలను నియంత్రిస్తోంది. ఈ క్రీడలో అమెరికా లబ్ది పొందలేదా ? కరెన్సీని అదుపు చేస్తున్నదని చైనా మీద ఆరోపణలు చేసే అమెరికన్లు అదే చైనా కరెన్సీ రేటు తక్కువగా ఉన్నందునే అక్కడినుంచి పెద్ద ఎత్తున సరకులను దిగుమతి చేసుకున్నది వాస్తవం కాదా ? అంతేకాదు, ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువగా ఉన్న కారణంగా తమ గడ్డమీద పరిశ్రమలను మూసి చైనాకు తరలించలేదా ? కొత్తగా చైనాలో పెట్టలేదా ?


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య ప్రచ్చన్న యుద్దం సాగిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు లేవు. అందుకు విరుద్దంగా అమెరికా-చైనా సంబంధాలు ఉన్నాయి. చైనా తన మార్కెట్‌ను తెరిచిన తరువాతనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరేందుకు అమెరికా అనుమతించింది. సోవియట్‌యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను పతనం గావించి ప్రచ్చన్న యుద్దంలో తామే విజయం సాధించామని 1990 దశకంలో అమెరికా ప్రకటించుకుంది. అంతకు ముందు సోవియట్‌ – చైనా మధ్య ఉన్న విబేధాలను ఉపయోగించుకొనేందుకు, చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.వారు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రచ్చన్న యుద్దరంగాన్ని చైనాకు మార్చారు. గత మూడు దశాబ్దాలలో వాటి మధ్య వాణిజ్యంతో పాటు వైరమూ పెరిగింది. ఇలాంటి స్ధితి సోవియట్‌తో లేదు.


అలాంటి చైనాతో అమెరికన్లకు ఇప్పుడు వాణిజ్యలోటు చాలా ఎక్కువగా ఉంది. ట్రంపు నాలుగు సంవత్సరాల పాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా చైనాతో వాణిజ్య యుద్దం చేశాడు.2019తో పోలిస్తే 2020లో తొమ్మిది శాతం తగ్గినా అమెరికాలోటు 310.8 బిలియన్‌ డాలర్లు ఉంది. అమెరికన్లు 124 బిలియన్‌ డాలర్ల సరకు, వస్తువులను ఎగుమతి చేయగా చైనా నుంచి 435.5 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నారు. అలాటి చైనా మీద తుపాకి పేల్చేందుకు మన భుజాన్ని వాడుకుంటున్నారు, చివరికి మనలను కూడా మోసకారుల జాబితాలో చేర్చారు.