Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఆంగ్లంలో ఇంటలెక్చ్యువల్‌ – తెలుగులో బుద్ధి జీవి. బుద్ది జీవులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటి అన్నది సామాన్యులకూ – బుద్ది జీవుల్లోను ఎడతెగని సమస్య. వాళ్లు అలా అనుకుంటున్నారు- వీళ్లు ఇలా అనుకుంటున్నారు అని చెప్పటమే మేథావి లక్షణం అయితే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడివి అక్కడికి చేరవేసే వారందరూ, అలా అట ఇలా అట అంటూ చెవులు కొరికే వారూ మేధావులే. ప్రశ్నలను మాత్రమే రేకెత్తించి జవాబులు చెప్పని వారు మేథావులని ఒక అనుభవశాలి చెప్పాడు. జార్జి ఆర్వెల్‌ అనే కలం పేరుతో సుప్రసిద్దుడైన ఆంగ్ల రచయిత ఎరిక్‌ ఆర్ధర్‌ బ్లెయిర్‌ ” కొన్ని ఆలోచనలు ఎంత బుద్ది తక్కువగా ఉంటాయంటే బుద్ది జీవులు మాత్రమే వాటిని నమ్ముతారు ” అని చెప్పారు. జార్జి ఆర్వెల్‌ ప్రస్తుతం బీహార్‌లోని మోతీహరిలో జన్మించి స్వాతంత్య్రం తరువాత ఇంగ్లండ్‌ వెళ్లిపోయి 47 సంవత్సరాల వయస్సులోనే 1950లో మరణించాడు. ఇంటర్నెట్‌, వాట్సప్‌ రాక ముందే తనువు చాలించాడు గానీ లేకుంటేనా వాట్సప్‌ విశ్వవిద్యాలయ బుద్ది మంతుల గురించి ఎంత చెప్పి ఉండేవాడో కదా !

హైదరాబాదు, విజయవాడ, తిరుపతి నగరాల్లో స్లేట్‌ ద స్కూలు పేరుతో విద్యా సంస్ధలు నడుపుతూ వైద్యంతో సహా (ఫేస్బుక్‌ పోస్టులను బట్టి ) బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. పేరు వినటమే తప్ప నాకు పరిచయం లేదు, పంచాయతీల్లేవు. అమరనాధ్‌ పోస్టు వాట్సప్‌ విశ్వవిద్యాలయంలో చూసిన తరువాత ఒక జర్నలిస్టుగా బుద్ది జీవుల గురించి రాయాలనిపించింది. ఆ పోస్టు అంశాలు ప్రస్తుతం సమాజంలో ఎందరో మేథావులు, విద్యావంతుల గందరగోళం- ఆలోచనకు ప్రతిబింబంగా ఉంది కనుక స్పందించాల్సి వస్తోంది. కనుక వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు. పోస్టులోని అంశాన్ని విమర్శించాలని లేదా సంవాదం ప్రారంభించాలని కాదు. నా అభిప్రాయాలతో ఏకీభవించటమా, వ్యతిరేకించటమా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిశీలించి బుద్దికి పదును పెట్టమని కోరుతున్నాను. అమరనాధ్‌గారి పోస్టులోని అంశాలపై నా స్పందన ఇక్కడ ప్రస్తావిస్తాను.

” చైనాలో పుట్టిన ఆ వైరస్‌ ప్రపంచం నలుచెరుగులా ఉన్న 180 కి పైగా దేశాలకు వ్యాపించింది . కానీ చైనా లో మాత్రం ఒక్క నగరానికే పరిమితం . ప్రపంచమంతా ఒకటి.. రెండు .. మూడు అంటూ వేవ్‌ లు . అక్కడ మాత్రం మొదటి మూడు నాలుగు నెలలు .. ఒక నగరం .. 90 వేల కేసులు మాత్రమే . . దీని వెనుక ఉన్న ఇంద్ర జాల మహేంద్ర జాలం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు . పోనీ చైనా న్యూజిలాండ్‌ లాగా ఎక్కడో దూరంగా ఉన్న దేశమా అంటే .. కాదు . ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ! జన సాంద్రత ! ఆ వైరస్‌ ను ఏ అల్లాఉద్దీన్‌ అదుÄ్బత ద్వీపం సాయం తో కట్టడి చేసారో ఇప్పటి దాక ఒక్క శాస్త్రవేత్త కూడా వివరించ లేదు. ”

దీనిలో శాస్త్రవేత్తలు వివరించాల్సిందీ, వివరించనిదీ, తెలియనిదీ ఏమీ లేదు. వైరస్‌ చైనాలో పుట్టిందా మరోచోటనా అన్నది ఇంకా తెలియదు. చరిత్రలో స్పానిష్‌ ఫ్లూగా పరిచితమైనది తొలుత బయటపడింది అమెరికాలో, నింద మాత్రం స్పెయిన్‌కు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన సమయంలో దేశాలన్నింటా మీడియా మీద సెన్సార్‌ ఆంక్షలున్నాయి. స్పెయిన్‌ ఆ యుద్దంలో తటస్దంగా ఉంది. రాజు పదమూడవ ఆల్పోన్సోకు తీవ్ర సుస్తీ చేయటంతో అక్కడి మీడియాలో దాని గురించి రాశారు. అందరూ స్పానిష్‌ ఫ్లూ అన్నారు.
1977లో ఫ్లూ రష్యా, ఇతర దేశాలను వణికించింది. తొలుత ఇది ఉత్తర చైనాలో కనిపించింది. వ్యాప్తి ఎక్కువగా నాటి సోవియట్‌యూనియన్‌లో జరిగింది కనుక మీడియాలో దాన్ని రష్యా ప్లూ అన్నారు. తరువాత అమెరికా, ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది. అప్పుడు చైనా-సోవియట్‌ సంబంధాలు సరిగా లేవు గనుక చైనా వారు లాబ్‌లో తయారు చేసి వదిలారని తప్పుడు ప్రచారం చేశారు.
2009లో ప్రపంచాన్ని వణికించిన హెచ్‌1ఎన్‌1 ప్లూ తొలుత మెక్సికోలో కనిపించినా దాన్ని మెక్సికో ఫ్లూ అని పిలువ లేదు. పందుల నుంచి వ్యాప్తి చెందినట్లు బయటపడినందున స్వైన్‌ ఫ్లూ అన్నారు. అయితే పంది మాంసం తినే దేశాలు ఈ పేరును అభ్యంతర పెట్టాయి. తరువాత ఇలాంటి వైరస్‌లకు ఒక దేశం, ప్రాంతం, భాష, జీవి పేరు పెట్టకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్ణయించింది. ఆ మేరకు కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. దాన్ని ఉల్లంఘిస్తూ చైనా వైరస్‌ అని ప్రచారం చేసి చైనా మీద ఉన్న కసిని అలా తీర్చుకున్నారు.

కరోనా వైరస్‌ తొలుత కనిపించిన ఊహాన్‌ నగరంలోని కోటి మంది జనాభా, పరిసరాలలో లాక్‌డౌన్‌ అమలు జరిపారు. అపార్ట్‌మెంట్లు, జనావాసాలను ఎక్కడిక్కడ కట్టడి చేశారు. రోగలక్షణాలతో నిమిత్తం లేకుండా దాదాపు ప్రతి ఇంటివారిని పరీక్షించి వైరస్‌ లక్షణాలున్న వారిని వేరు చేసి చికిత్స చేశారు. దేశంలోని ప్రజారోగ్య సిబ్బందినీ, వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా సమీకరించి ప్రతి నివాసం వద్ద ఉంచారు. ప్రతి ఇంటిలో ఎవరికేమి జరుగుతోందో పర్యవేక్షించారు. కావాల్సిన వాటిని అందచేశారు, జవాబుదారీతనంతో వ్యవహరించారు. అమరనాధ్‌ గారు స్లేట్‌ అనే ఒక కార్పొరేట్‌ స్కూలు అధిపతి గనుక స్కూలు పిల్లల గురించి చైనా తీసుకున్న జాగ్రత్తలను తెలుసుకోవాల్సింది. స్కూలు బస్సులకు ప్రత్యేక రోడ్ల కేటాయింపు, ఎక్కేటపుడు దిగేటపుడు జ్వరం ఉందా లేదా అని పరీక్షించటం వంటి చర్యలన్నీ తీసుకున్నారు.
ఇక్కడ కావాల్సింది చైనా మీద, అక్కడి వ్యవస్ధ మీద విశ్వాసం. అది లేని వారు అక్కడ ఏమి జరిగినా నమ్మరు. అందుకు ఒక్క ఉదాహరణ. చైనాలో జరిగిన ఆర్దిక అభివృద్ది గురించి చెప్పిందంతా అంకెల గారడీ అని ప్రచారం చేశారు. అవే నోళ్లు ఇప్పుడు తన ఆర్దికశక్తితో ప్రపంచాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు చైనా పూనుకుంది అని కొత్తబాణీ అందుకున్నాయి. చైనా, వైరస్‌ గురించి కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేసేందుకు చూపిన శ్రద్ద వైరస్‌ నివారణకు మన దేశంతో సహా మిగతా దేశాలు చూపి ఉంటే ఇలాంటి తీవ్ర పరిస్ధితి ఉండేది కాదు. రెండవ తరంగం కరోనా వ్యాప్తి తీవ్రం అవటం ప్రారంభించిన తరువాతనే కదా లక్షలాది మంది రాసుకుంటూ పూసుకుంటూ తిరిగే కుంభమేళాకు అనుమతించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మూర్ఖ, మూఢత్వాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించాయా ? దీనిలో తెలియంది ఏముంది ? అమరనాధ్‌ లాంటి వారికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది, నిజంగా శ్రద్ద ఉండి తెలుసుకుంటే తెలియనిదేమీ లేదు. తెలుసుకోకుండా ఉంటారనీ అనుకోలేము.నిర్మొహమాటంగా చెప్పాలంటే చైనా సమాచారాన్ని విశ్వసించలేకపోవటమే అసలు సమస్య. దానికి సామాన్యుడైనా మేథావి అయినా ఒకటే.

” చైనా అమెరికా దేశంలోని అనేక యూనివర్సిటీ లకు సీక్రెట్‌ గా ఫండ్స్‌ ఇచ్చిందట . ఇదేదో అభియోగం కాదు. ట్రంప్‌ అధికారం లో వున్నప్పుడు దీని పై విచారణ జరిపి ఆయా యూనివర్సిటీ ల పై చర్య ల కు కూడా ఆదేశించాడు . యూనివర్సిటీ ల కు ఫండ్స్‌ ఇస్తే మంచే పనే కదా . దాన్ని గొప్పగా చెప్పుకోవాలి కదా ? . కానీ సీక్రెట్‌ గా దొంగ లాగా ఇవ్వడం ఏంటి ? అమెరికా మేధావులను తన అదుపులో పెట్టుకోవడం .. అమెరికన్‌ ల బ్రెయిన్‌ వాష్‌ .. మరో మాటలో చెప్పంటే మేధో దాడి అని కొంత మంది అంటారు . ”

చీమ చిటుక్కుమంటే కనిపెట్టగలిగిన అమెరికా గూఢచారి వ్యవస్ద గురించి తెలిసిన అమరనాధ్‌ గారు మీడియా ప్రచారదాడికి గురైయ్యారని పోస్టు పెట్టిన తీరు చెబుతోంది. ఇక్కడ కూడా అమెరికన్లు చెబుతున్న కుట్ర సిద్దాంతాన్ని నమ్మటమే. ముందే చెప్పినట్లు అక్కడ అలా అట ఇక్కడ ఇలా అట అని చెప్పటానికి అమరనాధ్‌ గారు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన దేశంలోని విశ్వవిద్యాలయాలలో అధ్యయన సంస్దల ఏర్పాటు వాటికి స్వదేశీ, విదేశీ సంస్ధలు నిధులు ఇవ్వటం రహస్యమేమీ కాదు. అలాగే అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో కన్పూషియస్‌ సిద్దాంతాల అధ్యయనం పేరుతో మరో పేరుతో చైనా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి చైనా సంస్దల నుంచి, అమెరికా సంస్దల నుంచి కూడా నిధులు ఇచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా-చైనాల మధ్య సంబంధాలు, వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతున్నపుడు లేని సమాచారం ట్రంప్‌ హయాంలోనే బయటకు వచ్చిందా ? అంతకు ముందున్న పాలకులకు తెలియదా ? సిఐఏ, ఎఫ్‌బిఐ, జాతీయ దర్యాప్తు సంస్దలు వాటికి ఉన్న లక్షలాది మంది గూఢచారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? నిజానికి అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందేమీ లేదు.

చైనాతో వివాదం పెట్టుకోవాలి, దాన్ని అదిరించి బెదిరించి తన వాణిజ్యలోటును తగ్గించుకోవాలి. అందుకోసం ఏదో ఒక సాకులు చెప్పి జనాన్ని నమ్మించాలి. ఆ ఎత్తుగడలో భాగమే విశ్వవిద్యాలయాలకు నిధులు, అమెరికన్ల బుద్ది శుద్ది ప్రచారం. మన దేశంలోని విద్యా సంస్ధలలో గత ఐదు దశాబ్దాలుగా వామపక్ష ఉగ్రవాద సానుభూతి పరులు ఉద్యోగాలు చేయటం, నక్సల్‌ పార్టీల అనుబంధ సంఘాలతో సంబంధాలు కలిగి ఉండటం తెలిసిందే. ఇదే సమయంలో తిరోగమన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారి సంఖ్యతో పోలిస్తే వీరు తక్కువే. అయినా అర్బన్‌ నక్సల్‌ అనే పదాన్ని ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు? నిజానికి విశ్వవిద్యాలయాల్లో అలాంటి వారి సంఖ్య గతంతో పోల్చితే చాలా తగ్గింది. అధికార పార్టీలకు భజన చేసే బ్యాచి ఎక్కువైంది. అర్బన్‌ నక్సల్స్‌ పదం ప్రచారం ఎత్తుగడలో భాగం.

అమెరికాలో బుద్ది శుద్ది ఎవరు చేస్తున్నారు? చైనా కమ్యూనిస్టులు వచ్చి అక్కడేమీ రాజకీయ పాఠశాలలు పెట్టి కమ్యూనిస్టు పాఠాలు చెప్పటం లేదే ? గత మూడు దశాబ్దాల్లో అమెరికా విద్యావంతుల్లో వచ్చిన మార్పు ఏమిటి ? అంతకు ముందు కమ్యూనిజాన్ని బూచిగా చూపారు. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజంపై విజయం సాధించామని ప్రకటించింది ఎవరు ? అమెరికన్లే కదా ! అక్కడే అమెరికా మేథావులు, యువతలో కొత్త ఆలోచనకు నాంది పడింది. దేశంలో దిగజారుతున్న పరిస్ధితి, దుకాణాలన్నీ చైనా వస్తువులతో నిత్యం దర్శనమివ్వటం, వాణిజ్య లోటు తగ్గించాలని అమెరికా నేతలు నిత్యం చైనీయులను కోరటం, అదే సమయంలో చైనా కమ్యూనిస్టు వ్యవస్ధలో మానవ హక్కులు లేవనే బ్లాక్‌మెయిల్‌ ప్రచారం వాస్తవమా, కాదా ? వీటికి తోడు పదేండ్లకొకసారి వస్తున్న ఆర్ధిక సంక్షోభాలు అమెరికా వంటి ధనిక దేశాలకు తప్ప చైనా దరిచేరకపోవటం అమెరికా మేథావులకు తెలియదా ? ఆందుకే మన దేశపు పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎందుకు విఫలమైంది, అంతకు ముందు విఫలమైంది అని చెప్పిన సోషలిస్టు వ్యవస్ధ చైనాలో ఎందుకు ముందుకు పోతోంది అనే ఆలోచన వారిని కాపిటల్‌ గ్రంధం దుమ్ముదులిపేందుకు ముందుకు నెట్టింది. ఇప్పుడు అమెరికా విద్యావంతుల్లో చర్చ పెట్టుబడిదారీ వ్యవస్ద వైఫల్యం గురించే నడుస్తున్నది. సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వాడిని చూసినట్లు చూసే జనం ఒకప్పుడు ఉన్న అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది. అవును నేను సోషలిస్టును బస్తీమే సవాల్‌ అంటూ బహిరంగంగా ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కొరకు పోటీపడే స్ధితి ఏర్పడింది. ఆ పార్టీలోని అనేక మంది మీద కమ్యూనిస్టు ముద్ర ఉన్నా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మిలియన్ల మంది యువత మేమూ సోషలిస్టులమే అని ప్రకటించుకుంటున్నారు. ఇవేవీ అమరనాధ్‌ వంటి వారికి తెలియవా, తెలుసుకుంటే దొరకని వస్తువా ? మార్గం చూపాల్సిన మేథావులు అపని చేయకుండా, తాము ఏమనుకుంటున్నారో చెప్పకుండా అమెరికన్ల బ్రెయిన్‌ వాష్‌.. మరో మాటలో చెప్పాలంటే మేథోదాడి అని కొంత మంది అంటారు అని ఇతరుల మీద నెట్టటం ఏమిటి ?

” తొలిసారి ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు ఒక ప్రచారం జరిగింది . రష్యా వివిధ పద్ధతుల్లో ట్రంప్‌ గెలవడానికి సాయ పడింది . ఆ విధంగా అమెరికా పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది అని . చైనా ప్రపంచం పై పట్టు సాధించడానికి చేయని ప్రయత్నం లేదనేది మేధావుల మాట . మొన్నటి అమెరికా ఎన్నికలు ముందు అమెరికా లో కేసులు విపరీతంగా పెరగడం తెలిసిందే . అప్పటికే దిగజారుతున్న ట్రంప్‌ పరపతి దీనితో ఇంకా పోయింది . ట్రంప్‌ , కరోనా విషయం లో సరిగా వ్యవహరించక పోవడం వల్లే ఇంత నష్టం జరిగింది అని చాలా మంది అమెరికన్‌ లు అనుకొన్నారు . ఫలితం .. ట్రంప్‌ ఓటమి . అమెరికన్‌ లు మాస్క్‌ పెట్టుకోకపోవడం వల్లే కేసులు పెరిగాయని ట్రంప్‌ మాస్క్‌ ల విషయం లో తప్పుదారి పట్టించేలా వ్యవహరించాడని చాలా మంది భావించారు . లేదు .. తన పై దాదాపుగా యుద్ధం ప్రకటించిన ట్రంప్‌ ను ఓడించాలని చైనా పంతం పట్టింది .. అమెరికా లో మేధావులు , మీడియా ఇప్పుడు చైనా గుప్పిట్లో వున్నారు . చైనా కావాలంటే కేసులు పెంచడం పెద్ద కష్టమా ? ఇందులో ఏదో కుట్ర వుంది అని భావించే వారున్నారు . ఇలా చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవనేది సత్యం . ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు కేవలం కాలక్షేపానికి పనికి వస్తాయి అని చాలా మంది భావిస్తారు. ” అని అమరనాధ్‌గారు చెప్పారు.

వాట్సప్‌ యూనివర్సిటీ చేస్తోంది ఇదే. రుజువులు లేని సొల్లుకబుర్ల తయారీ కూడా ప్రచార దాడిలో భాగమే. జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అవి బాగా ఉపయోగపడతాయి, రంజుగా ఉంటాయి. ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా మేథావులు వాటిని జనం ముందు ఉంచటమే విషాదం, విచారకరం, ఆక్షేపణీయం. ఆ పని చేయటంలో పోస్టుమాన్‌ పని తప్ప వారి బుద్ది కుశలత ఏముంది ? వాటి మీద బుద్ది జీవుల వైఖరి ఏమిటి ? ఒక టీవీ యాంకర్‌ అయితే దీని మీద వారలా అంటున్నారు, మీరేమంటున్నారు, దాని మీద వారలా అన్నా మీరేమంటారు అని అడగవచ్చు. అది మేథోలక్షణం కాదు. కొందరు యాంకర్లు తమకు నచ్చేవాటిని చెప్పేందుకు ఎక్కువ అవకాశమిస్తారు, భిన్నంగా మాట్లాడితే ఏదో ఒక పేరుతో వేరే అంశానికి మరలుతారు. మేథావులు అలా చేస్తే సహజంగానే అనుమానాలు వస్తాయి.

ప్రతి దేశం మరోదేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది అన్నది అందరికీ తెలిసిన పచ్చినిజం. మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రచారం చేసి వచ్చిన విషయం తెలియదా ? అంటే బైడెన్‌ను ఓడించాలనే కదా ! ఎవరైనా ఒకటే కదా మరి, మోడీ ఎందుకు ఆ పిలుపు ఇచ్చినట్లు ? పాకేజ్‌ ఏమైనా కుదుర్చుకున్నారా ? తన పెరటితోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలో, ఇంకా అనేక దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ ఎవరు గద్దెమీద ఉండాలో కూడదో నిర్దేశిస్తున్నది. ఎన్నుకున్న ప్రభుత్వాలను గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. మేథావులకు ఇవేవీ పట్టవా ? కుట్ర సిద్దాంతాలను ఒక లక్ష్యం కోసం తప్ప కాలక్షేపం కోసం సృష్టించటం లేదు. అదేమీ చిన్న విషయం కాదు. సూటిగా చెప్పకుండా అనుమానాలు రేకెత్తించి జుట్టుపీక్కొనేట్లు చేసే నైపుణ్యం ఉంటేనే అలాంటి వాటి సృష్టి కర్తలకు నాలుగు డబ్బులు వస్తాయి. దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఇస్లాం, క్రైస్తవ మతాల వారి మీద నిరంతరం ప్రచారం చేస్తున్నారు. దీన్ని కాలక్షేపానికి చేస్తున్నారని అనుకోవాలా ? కేంద్ర ప్రభుత్వ చర్యలను లేదా రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల చర్యలను విమర్శించిన మీడియా మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశద్రోహంగా చిత్రిస్తున్నది. అదే విధంగా అమెరికా మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి చైనా మద్దతు, నిధులు అంటున్నారు. అమెరికా మీడియాలో ప్రధాన స్రవంతి సంస్ధలన్నీ కార్పొరేట్లవే. వాటి ప్రయోజనాలే మీడియాకు ముఖ్యం తప్ప చైనా కోసం పని చేస్తాయని చెప్పటం ప్రచారదాడిలో భాగమే.

” కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్‌ లో ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ వీడియో చూసాను . ఆయన తెలుగు వాడే . పేరు గుర్తు రావడం లేదు . ఢిల్లీ స్థాయిలో మీడియా ను చైనా దేశం తరపున కొంత మంది బ్రోకర్‌ లు ఎలా మానిప్యులేట్‌ చేస్తున్నారో .. మీడియా లో చైనా వ్యతిరేక వార్తలు రాసిన జర్నల్లిస్ట్‌ ల ఉద్యోగాలు ఎలా ఊడి పోయాయో అయన ఆ వీడియో లో పేర్ల తో సహా వివరించాడు . అవునా ? మన దేశం లో కూడా చైనా కు నిజంగా అంత పట్టుందా అని నేను ఆశ్చర్య పోయాను. ”

ఇది ఆధారం, అర్దం లేని అంశం. సదరు సీనియర్‌ జర్నలిస్టు తెలుగువాడైనా మరొకరైనా చైనా వ్యతిరేక వార్తలు రాసి ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. పత్రికలు, టీవీ ఛానళ్లు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రచారం అమరనాధ్‌ గారి దృష్టికి వచ్చి ఉంటే ఈ అతిశయోక్తి వార్తను నమ్మి పోస్టులో పెట్టి ఉండరు. చైనాతో మన సంబంధాల గురించి విమర్శనాత్మకంగా రాసిన వారెవరైనా ఉద్యోగాలు పోగొట్టుకొని ఉంటారు తప్ప మరొకటి కాదు. చైనీయులు అమెరికాను, మన దేశ మేథావులను కూడా అదుపులోకి తీసుకున్నారని అమరనాధ్‌ వంటి వారు నిజంగా నమ్ముతున్నారా ? మొత్తంగా ఎక్కడైనా అమ్ముడు పోతారా ? ఒక వైపు మీడియాను పూర్తిగా తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ ఒకటీ అరావిమర్శనాత్మకంగా ఉంటే మీడియా మొత్తం కమ్యూనిస్టులు, దేశద్రోహులతో నిండిపోయిందని కాషాయ దళాలు నిరంతరం ప్రచారం చేస్తుంటాయి. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారు, భజన చేయని వారందరూ వారి దృష్టిలో కమ్యూనిస్టులే.

” ఫిబ్రవరి మూడవ వారం నుంచి కేసులు మన దేశం లో భారీగా పెరిగాయి . ఇలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు అనేది సత్యం . ఇప్పుడు అనేక వాట్సాప్‌ గ్రూప్‌లలో ఫేస్బుక్‌ పైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగడం చూసాను . అమెరికా లో సఫలం అయిన ప్రయోగాన్ని ఇక్కడ కూడా చేయాలని చైనా చూస్తోందా ? అసలు అమెరికా లో చైనా ఆలా చేసింది అని చెప్పడానికే ఆధారాలు లేవు . ఇంకా ఇక్కడ దాన్ని ప్రయోగిస్తోంది అని అనుకోవడమేంటి ? పిచ్చి ఊహ కాదా ? అయిన చైనా ఆలా చెయ్యాలని ప్రయత్నిస్తే మన దేశం లో గూఢచారి సంస్థలు పసిగట్ట లేవా ? ఏమో .. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కన్నా మన సంస్థ లు గొప్పవా ? ఆబ్బె .. ఇది అతి గా ఆలోచించడం .. ”

ఇది వాట్సప్‌, బుర్ర ఉపయోగించకుండా దానిలో వచ్చిన వాటన్నింటినీ గుడ్డిగా నమ్మి ప్రచారం చేసిన దాని ప్రభావం అమరనాధ్‌ గారి మీద కూడా పడినట్లుంది. ఆయనే చెప్పినట్లు పిచ్చి ఊహల గురించి చెప్పుకోవటం పనిపాటా లేని వ్యవహారం. లేదా వాటిని చెప్పాల్సి వస్తే అలాంటి పనిపాటా లేని సరకు గురించి జనాన్ని హెచ్చరించాలి. అతిగా ఆలోచించటం అన్నారు తప్ప అమరనాధ్‌ పోస్టులో అలాంటి సూచనలేవీ లేవు. కరోనా కేసులు పెరుగుతాయని సామాన్యులు ఊహించలేకపోవచ్చు. కానీ ఎంతో అనుభవం, నిత్యం ప్రపంచ పరిణామాలను చూస్తున్న అధికార యంత్రాంగం, దాన్ని నడిపే రాజకీయనాయకత్వానికి ముందు చూపు లేకపోతే దేశం అధోగతి పాలవుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో వస్తుందో రాదో తెలియని యుద్దం గురించి అంచనా వేసుకొని లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము. ఆ సమాచారం ఉంది ఈ సమాచారం ఉందని కథలు రాయిస్తుంటారు. కొన్న ఆయుధాలు పాతపడి పోగానే పక్కన పడేసి కొత్తవి కొంటున్నాము.

కరోనా మీద యుద్దం ముగిసిందని ఎవరు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అలాంటి సూచనలేమీ ఇవ్వలేదు. అనేక దేశాలలో తిరగబెట్టింది. కేంద్ర పాలకులు ఆ అనుభవాన్ని ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా ? పోనీ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న తరువాత కూడా కుంభమేళాకు ఎందుకు అనుమతిచ్చారు? అనేక మంది నిపుణులు చేసిన హెచ్చరికలను ఎందుకు పెడచెవిన పెట్టారు ? ఆక్సిజన్‌ అవసరం గురించి గతేడాదే అర్దం అయింది. దానికోసం 150 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. ఏడు నెలల పాటు టెండర్లు ఖరారు చేయలేదు, దీన్ని ఏమనాలి బాధ్యతా రాహిత్యమా , నేరపూరిత నిర్లక్ష్యమా ? ఫేస్బుక్‌లో జన స్పందన చూసేంతవరకు మీకు కేంద్ర వైఖరిలో ఎలాంటి తప్పు ఒప్పులు కనిపించలేదా ? సామాన్యులకు మీకు ఇంక తేడా ఏముంది. పరిజ్ఞానం కంటే ఊహ ముఖ్యమని ఐనిస్టీన్‌ చెప్పాడు. మెదడుతో చూడగలిగిన వాడే బుద్ది జీవి అని మరో పెద్దమనిషి సెలవిచ్చారు. అలాంటి వారు కొందరు హెచ్చరిస్తున్నా కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో యంత్రాంగం పట్టించుకోకపోవటమే ఇంతవరకు తెచ్చింది. మేథావులూ పట్టించుకోవటం లేదు.

” చైనా లో ఆ ఒక్క నగరం తప్పించి మిగతా చోట్లకు ఆ రోగం ఎందుకు విస్తరించలేదు ? ఆ నగరం పేరు పోస్ట్‌ చేసినా సోషల్‌ మీడియా ఎందుకు ఆ పోస్ట్‌ ను బ్లాక్‌ చేస్తోంది ? చైనా మిత్రం దేశం .. మన పొరుగున వున్న పాకిస్థాన్‌ . మన దేశం లో మాత్రం అటు ఉత్తరాంచల్‌ మొదలు ఇటు తమిళనాడు దాకా కేసులు పెరుగుతున్నాయి . సరే ఇక్కడ మాస్క్‌ లు పెట్టుకోలేదు .. జనాలు గుంపులు గుంపులుగా తిరిగారు అని చెప్పేవారు . మరి మన పొరుగునే వున్న పాకిస్థాన్‌ ? అక్కడ కొద్దీ పాటి కేసులు పెరిగినా ఇక్కడి లాగా ఇన్ని కేసులు రావడం లేదు . అక్కడ మాస్క్‌ లు భౌతిక దూరం సిద్ధాంతం పని చెయ్యదా ?
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను కదా . అందుకే చెప్పా .. నా దగ్గర రుజువులు లేవండి . చదివే వారికి ఏదో సోది లాగా ఉంటుంది .. లేదా నేనేదో సంచలనం కోసం .. పబ్లిసిటీ పిచ్చితో ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది .. కాబట్టి నేను చెప్పను .. అవి నా మనసులో అనుమానాలే .. అది నాతోనే ఉండి పోనీ అని .. నిన్నటి నుంచి సర్‌ చెప్పండి చెప్పని అని మెసెంజర్‌ లో మెసేజ్‌ ల వెల్లువ . సరే పోస్ట్‌ చేశా . జస్ట్‌ చదివి మరచి పోండి. అయిదు నిముషాలు కాలక్షేపం అనుకోండి. ”

ఊహాన్‌ నగరం పేరు ఉన్న పోస్టును సోషల్‌ మీడియా బ్లాక్‌ చేస్తోందన్నారు. చాలా చిత్రంగా ఉంది. కాషాయ తాలిబాన్లు ఇలాంటి చిత్రాల గురించి పోస్టులు పెట్టటం నేను ఫేస్బుక్‌లో చూశాను. మన దేశంలో ఇంటర్నెట్‌ను నియంత్రించేది చైనా అనుకుంటున్నారా ? పక్కా నరేంద్రమోడీ సర్కార్‌. రైతు ఉద్యమం సందర్భంగా మీడియా కిట్ల గురించి ఎంత రచ్చ చేసిందో మీకు తెలియకుండా ఉంటుందా ? పబ్లిసిటీ పిచ్చికోసం ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది అన్నారు. మీకేమనిపించిందో స్కానింగ్‌చేసినా దొరకదు, కానీ మెసేజ్‌ల వెల్లువ కారణంగా పోస్టు చేయాల్సి వచ్చిందన్నారు. పర్యవసానం మీకు ఎంతో పబ్లిసిటీ వచ్చింది. మీకు కాలక్షేపం అనిపించవచ్చు గానీ, ఒక మేధావిగా ఇలాంటి పోస్టులు పెట్టటం తగదేమో ఆలోచించండి. దీని వలన ఏమి సాధించిందీ అవలోకించుకోండి. ఎవరిలో అయినా ఉన్న గందరగోళాన్ని తొలగించారా, ఇంకా గట్టిపరిచారా ? చైనా-అమెరికా-నరేంద్రమోడీ ఇంకా ఎవరైనా సరే వారి గురించి అమరనాధ్‌ గారయినా మరొక మేధావి అయినా ఒక స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలని మనవి. అవి వెల్లడించే ధైర్యం లేనపుడు మౌనంగా ఉండటం మేలు. అటూ ఇటూగాకుండా చెబితే ప్రయోజనం ఏముంది ? ఒక బుద్ది జీవిగా ఆలోచించండి. మేథావుల మౌనం దేశాలకు మంచిది కాదని ప్రపంచ చరిత్ర చెప్పింది.ప్రపంచంలో తటస్ధం అంటూ ఏదీ లేదు. నాకు రాజకీయాలు పట్టవు, నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు అని ఎవరైనా అంటే అధికారంలో ఉన్నవారిని కొనసాగించాలని కోరే పక్షానికే అది అనుకూలిస్తుంది. తెలియకుండానే అలాంటి వారు ఒక వైపు మద్దతు ఇచ్చినట్లే !