Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సినిమా హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు కోపమొచ్చింది. రాదు మరీ పొగిడిన నోళ్లే రాజకీయ హీరో నరేంద్రమోడీని తెగుడుతుంటే కంగన వంటి వారికి ఆగ్రహం గాక ఆనందం కలుగుతుందా ! ఇంతకీ ఏమి జరిగిందీ దేశంలో కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యానికి మోడీదే బాధ్యత అంటూ విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోడీ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ విషయాన్ని మామూలుగా అయితే అభిమానులు మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. మోడీ సర్కార్‌ బండారం మరికొంత కాలం మరికొంత మందికి తెలియకుండా ఉంచేందుకు తిప్పలు పడతారు. ఈ చిన్న తర్కం కూడా తెలియకపోతే విమర్శించిన వారి గురించి రెచ్చిపోతే ఆ సమాచారం చూడని వారిని కూడా అరే ఇదేమిటి ఆశ్చర్యంగా ఉంది, మోడీ రాజీనామాను కోరటం ఏమిటి అన్న ఆసక్తిని కలిగిస్తుంది. కంగన వంటి వారికి ఈ చిన్న విషయం కూడా తెలిసినట్లు లేదు. సామాజిక మాధ్యమంలో ఉన్న వారందరికీ మొత్తం ఏమి జరుగుతోందో తెలియదు. అలాగే కేవలం పత్రికలు, టీవీలకే పరిమితమైన వారికి సామాజిక మాధ్యమంలో ఎలాంటి అభిప్రాయాలు వెల్లడౌతున్నాయో పట్టదు. కంగన ఆగ్రహం మీడియాలో రావటంతో అనేక మందికి ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ కంగన అమ్మడు ఏమన్నది ?

” మోడీ గారికి ఎలా నడపాలో(దేశాన్ని) తెలియదు, కంగనకు ఎలా నటించాలో తెలియదు, సచిన్‌ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌ ఎలా చేయాలో తెలియదు, లతామంగేష్కర్‌కు ఎలా పాడాలో రాదు గానీ ప్రమాణాల్లేని ఈ మరుగుజ్జులకు మాత్రం అన్నీ తెలుసు. మోడీ గారు మీరు రాజీనామా చేసి విష్ణు అవతారాలైన ఈ మరుగుజ్జుల్లో ఒకరిని తదుపరి ప్రధానిగా చేయండి ” అంటూ కంగన మండిపడింది. ఇంటా బయటా మీడియాలో నరేంద్రమోడీ వైఫల్యాల వార్తలు-వ్యాఖ్యలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో గుక్క తిప్పులోని స్ధితిలో పడిపోయారు. వేనోళ్ల పొగిడిన విదేశీ మీడియా ఇప్పుడు మోడై వైఫల్యాలను ఉతికి ఆరవేస్తోంది. బిజెపి వారు ప్రచారం చేసుకున్నట్లుగా ఇంటర్నెట్‌ను నరేంద్రమోడీయే జనానికి అందుబాటులోకి తెచ్చారని అంగీకరిద్దాం. దీని వలన జనానికి కలిగే నష్టం ఏముంది? దేశంలో ఇంటర్నెట్‌ రాకముందే ఇమెయిల్‌ ఉపయోగించానని, డిజిటల్‌ కెమెరా అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే వాటితో ఫొటో తీసి తమ నేత అద్వానీని ఆశ్చర్య పరిచినట్లు స్వయంగా మోడీ చెప్పుకున్నారు. వేల సంవత్సరాల నాడే మన దేశంలో పైకి కిందికి ఎటు పడితే అటు ఎక్కడబడితే అక్కడ దిగే, ఎంత మంది ఎక్కినా మరొకకి ఖాళీ ఉండే విమానాలున్నాయని, ప్లాస్టిక్‌ సర్జరీ చేసి వినాయకుడికి ఏనుగు తొండం అంటించారని, కుండల్లో కౌరవులను పుట్టించారని చెబుతుంటే నమ్మిన జనం మోడీ ఇమెయిల్‌, డిజిటల్‌ కెమెరా కధలను నమ్మకుండా ఉంటారా ! అలాంటి ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమంలో తొలిసారిగా నరేంద్రమోడీ రాజీనామా డిమాండ్‌ ముందుకు వస్తే కంగన వంటి వారికి మండటంలో, ఏం మాట్లాడితే జనం ఏమనుకుంటారో అన్న విచక్షణ మాయం అయితే ఆశ్చర్యం ఏముంది?


దేశంలో సామాజిక మాధ్యమాన్ని నరేంద్రమోడీ అండ్‌ కో ఉపయోగించుకున్నంతగా దాని ద్వారా లబ్ది పొందినంతగా మరొక పార్టీ లేదా రాజకీయ నేత లేరు అన్నది నిర్వివాదాంశం. అలాంటి నేతకు ఇప్పుడు ప్రతికూల వ్యాఖ్యల వేడి తగలటం ప్రారంభమైంది. సంప్రదాయ మీడియా పాకేజ్‌లకు అమ్ముడు పోవటం, ఫోర్త్‌ ఎస్టేట్‌ అనుకున్నది కాస్తా రియలెస్టేట్‌గా మారటం, ఇదే సమయంలో సామాజిక మాధ్యమం జనానికి అందుబాటులోకి వచ్చింది. మీడియా తమ భావాలను ప్రతిబించించటం లేదు అనుకున్న వారు సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకున్నారు. మీడియా మాదిరే సామాజిక మాధ్యమం కూడా కార్పొరేట్ల ఆధీనంలోనే కనుసన్నలలోనే నడుస్తున్నది. అయితే వారి వ్యాపారానికి లాభాలు సంపాదించి పెట్టేందుకు జీతం భత్యం లేకుండా పని చేసే వారు కావాలి, పెద్ద మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి గనుక యజమానులు జనానికి స్వేచ్చ కల్పించారు. అది తమకు లబ్ది చేకూర్చుతుందంటే అధికారంలో ఉన్నవారు ఉపయోగించుకుంటారు లేదంటే దాని మీద కూడా ఆంక్షలు పెడతారని ఇటీవల ట్విటర్లు, ఫేస్‌బుక్‌ వంటి మీద పెడుతున్న ఆంక్షలు, విమర్శలను తొలగించాలని ఆదేశించటాన్ని చూస్తున్నాము. కనుక రాజీనామా డిమాండ్‌ చేసిన వారి మీద కంగన మండిపడటం ద్వారా ఆ విషయం తెలియని వారికి కూడా మీడియా ద్వారా తెలిసిపోయింది, నిజమే కదా ఆక్సిజన్‌ కూడా సరఫరా చేయలేని వారు పదవిలో కొనసాగటమెందుకు అని ఒక్క క్షణం మనస్సులో అనుకుంటున్నారు. అయితే ఒకసారి మోజు పడినవారు అభిమానాన్ని వెంటనే మరల్చుకోలేరు. తప్పును తప్పని బయటకు చెప్పటానికి వారికి అహం అడ్డువస్తుంది.

బాధ్యతారహితంగా ట్వీట్లు చేయటంలో, ఎదుటి వారిని నిందించటంలో పేరు మోసిన కంగనకు నెటిజన్లు ఆమె గడ్డిని ఆమెకే తినిపిస్తున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్‌లో ఇలా సలహాయిచ్చారు.” ఆక్సిజన్‌ స్ధాయిలు తక్కువగా ఉన్న వారు ఇలా చేసి చూడండి.చెట్లు నాటటం శాశ్వత పరిష్కారం. మీరా పని చేయలేకపోతే కనీసం వాటిని నరకవద్దు. దుస్తులను తిరిగి ఉపయోగించండి, వేద ఆహారం తీసుకోండి, సహజమైన జీవితం గడపండి, ఇది తాత్కాలికమైన పరిష్కారం, ఇప్పటికైతే ఇది మీకు తోడ్పడుతుంది. జై శ్రీరామ్‌ ” దీని మీద బాజార్‌ చిత్ర దర్శకుడు గౌరవ్‌ కె చావ్లా అపహాస్యం చేస్తూ ” ఆక్సిజన్‌ వృధా మనిషి ” అని ఎద్దేవా చేశారు. దాని మీద కంగనా మండిపడుతూ ” మీ వంటి వారు పాలు సంచుల నుంచి వస్తాయనుకుంటారు.హ హ ఎంత బుద్దిహీనత, సిలిండర్లలోని ఆక్సిజన్‌ కూడా చెట్ల నుంచే తీసుకుంటారు. గాలిలో కాలుష్యం తక్కువ ఉంటే దానిలోని ఎక్కువ భాగం ఆక్సిజన్‌ను తీసుకొనే ఊపిరితిత్తులను కలిగి ఉంటారు, ఏదైతేనేం అమాయకత్వం ఆనందం కలిగించే అంశం, దానిలోనే జీవించండి ” అని పేర్కొన్నారు. నైట్రోజన్‌ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేస్తారు అని పేర్కొన్న అంశాన్ని కంగనా షేర్‌ చేశారు.ఆక్సిజన్‌ గురించి కంగన్‌ ట్వీట్ల మీద నెటిజన్లు ఆమెను ఆటపట్టించారు. మీరు పూర్తిగా పిచ్చివారయ్యారు చికిత్స చేయించుకోండి అని సలహా ఇచ్చిన వారున్నారు. విద్య ఎంత అవసరమో పెద్దలు ఇందుకే చెప్పారంటూ మరొకరు ఎకసెక్కాలాడారు. వారినీ కంగన వదల్లేదు. ప్రకృతి ప్రకోపం గురించి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇది శాస్త్రీయంగా రుజువైంది. చెట్లకూ బాధ,భావోద్వేగాలు ఉంటాయి. వాటిని విచక్షణా రహితంగా వినియోగిస్తూ నాశనం చేస్తున్నాము, ఈ రోజు గాలిపీల్చుకొనేందుకు ఇబ్బంది పడుతున్నాము, వాటిని బతకనివ్వండి అని ట్వీట్‌ చేశారు.

రైతు ఉద్యమం సందర్భంగా తాప్సీపన్ను మీద విరుచుకు పడిన కంగన మరోసారి బస్తీమే సవాల్‌ అంటూ ట్వీట్లతో వీధులకెక్కారు. తాప్పీ తనను అనుకరించిందని, చౌకబారు స్టార్‌, ఆడ పురుషుడు అంటూ నోరు పారవేసుకుంది. దాన్ని సమర్ధించుకుంటూ నీ తీక్షణమైన చూపులను చూస్తే అలాగే అనిపిస్తుంది, ఇది నీకు అభినందన తప్ప మరొకటి కాదు, ప్రతిదాన్ని ప్రతికూలంగా చూస్తావెందుకో నాకు అర్ధం కావటం లేదు అని మరో ట్వీట్‌లో తూలనాడింది. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయటంలో కాషాయ దళాల తరువాతనే ఎవరైనా అన్నది తెలిసిందే. నకిలీ ట్వీట్లు చేసి ఇతరులను బదనామ్‌ చేయటం గురించి వేరే చెప్పనవసరంలేదు. ఆ దళానికి చెందిన కంగన స్వయంగా బాధితురాలైంది. తాను అటువంటి ట్వీట్‌ చేయలేదు నమ్మండి అంటూ లబోదిబో మంటోంది. ఆక్సిజను పీల్చి ఆక్సిజన్‌ వదిలే ఏకకై జంతువు ఆవు అని బిజెపి పెద్దలు సెలవిచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ఆక్సిజన్‌ సరఫరా చేయటంలో విఫలమైన మోడీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆక్సిజన్‌ స్ధాయి తక్కువగా ఉన్న వారు ఆవు ముక్కు దగ్గర ముక్కు పెట్టి పీల్చుకుంటే సరి, కావాల్సినంత ఆక్సిజన్‌ వస్తుంది, జై శ్రీరామ్‌ అని కంగన్‌ పేరుతో ఒక ట్వీట్‌ సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. దానికి ఒక ఫొటోను కూడా తోడు చేశారు. అయితే ఫొటో నిజమే గానీ, ట్వీట్‌ ఫేక్‌ అని వెల్లడైంది. గుజరాత్‌కు చెందిన విజయ పరసానా అనే వ్యక్తి రోజూ ఉదయమే ఆవు పేడను ఉపాహరంగా తింటూ ఆవు మూత్రం తాగుతూ రాత్రుళ్లు ఆవులతో కలసి నిదురించే అలవాటు గురించి 2017లో బ్రిటన్‌ పత్రిక మెట్రో ఆవును ముద్దాడుతున్న దానితో పాటు మరికొన్ని చిత్రాలతో సహా వార్తను ప్రచురించింది. అయితే ఇలాంటి అశాస్త్రీయ పద్దతుల పట్ల ఆమెకు నమ్మకం ఉన్నట్లు ఒక మహిళ నోటితో గాలి పీల్చి ఆక్సిజన్‌ స్ధాయిలను పెంచుకోవచ్చంటూ చూపిన వీడియోను కంగన తన ట్వీట్‌తో పాటు షేర్‌ చేసింది.


తాప్పీ పన్ను ా కంగన మధ్య మరోసారి ట్వీట్ల పంచాయతీ నడచింది. కరోనా మహమ్మారికి సంబంధించి ఆక్సిజన్‌, ఔషధాల కొరత ఇతర ఇబ్బందుల గురించి అనేక మంది మాదిరే తాప్సీ కూడా తన ట్వీట్ల ద్వారా స్పందించింది. అనేక మంది ట్వీట్లను షేర్‌ చేసింది. వాటి మీద కంగన ద్వజమెత్తింది. ప్రతిగా తాప్పీ కూడా మండిపడుతూ ” దయచేసి …. మాదిరి నోర్మూసుకుంటావా, ఈ సమయంలో నువ్వేమైనా చెప్పదలచుకుంటే ఈ దేశం తిరిగి సజావుగా ఊపరిపీల్చుకొనేంతవరకు నోరు అదుపులో పెట్టుకో తరువాత నీ రోత పద్దతిలో తిరిగి రా, అప్పటి వరకు నీ చెత్త నాకు పంపవద్దు, నా పని నన్ను చేయనివ్వు” తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు నమ్మలేనంత మొత్తం సొమ్ము ఖర్చు చేస్తున్నారని కంగన మండిపడింది.ప్రతి పప్పుగాడు ఒక ఒంటరి యువతిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వ్యాఖ్యానించింది.కంగనా సోదరి రంగోలి చందేల్‌ కూడా రంగంలోకి దిగి సినిమా, రాజకీయ రంగ పప్పుగాళ్లందరూ ఒక యువతిని లక్ష్యంగా చేసుకున్నారు.వారందరికీ సమాధానం చెప్పేందుకు ఒక యువతి చాలు అని పేర్కొన్నది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదంటారు. అలాగే కంగనా వంటి కంపు నోళ్లు దుర్వాసన వెదజల్ల కుండా ఉంటాయా ?