Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మరోసారి మీడియా – కాషాయ దళాలు ప్రచారదాడితో రెచ్చిపోతున్నాయి. ఎవరెంత సమర్దవంతంగా జనాన్ని పక్కదారి పట్టించగలమో చూద్దాం అన్నట్లుగా మిత్రులుగా పోటీ పడుతున్నాయి. నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రతిసారీ వాటికి ఏదో ఒక అంశం, బకరాలు కావాలి. కరోనా రెండవ దశను ఊహించటంలో వైఫల్యం, అలక్ష్యం, అసమర్ధ నిర్వహణ ఒకటేమిటి ? వందకు ఒకటైనా ప్రతికూల వార్తకు చోటు కల్పించకపోతే ” చాల బాగోదు ” కనుక బాధ్యత ఎవరిది అనే అంశాన్ని తెలివిగా పక్కన పెట్టి సమస్య తీవ్రతను ప్రతిబింబించక మీడియాకు తప్పని స్ధితి. కాషాయ దళాల ఆరాధ్య దైవం గోబెల్స్‌. రాముడికైనా విరామం ఇస్తారేమో గానీ ఆయనకు రోజూ అబద్దాల నైవేద్యం పెట్టటం మానరు. ఎవరైనా నిజాలు చెప్పటంలో పోటీ పడితే మంచిదే. కానీ జరుగుతోందేమిటి ?


వద్దంటున్నా అనుమతించిన ఉత్తరాఖండ్‌ కుంభమేళా ( మనం పుష్కరాలు అంటాం) గంగలో మునిగిన వారు కరోనాను ఎలా వ్యాప్తి చేస్తున్నారన్నదాన్ని గురించి చెప్పటంలో వాటి మధ్య పోటీ లేదు. గతంలో తబ్లిగీ సమావేశాల సందర్భంగా చేసిన రచ్చ ఊసేలేకుండా జాగ్రత్త పడుతున్నాయి. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు 91లక్షల మంది గంగలో మునిగారని, ఒక్క ఏప్రిల్లోనే 60లక్షల మందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో మార్చి 31న కేవలం 1,862 కేసులుండగా ఏప్రిల్‌ 24 నాటికి 33,330 పెరిగినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎంత మందికి అంటించారో తెలియదు. దేశాన్ని వస్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చి యావత్‌ ప్రపంచానికే ఎగుమతులు చేస్తామని చెప్పిన వారు స్వంత జన ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పిత్తి, పంపిణీ చేయటంలో కూడా ఎందుకు విఫలమయ్యారో, విదేశీ సాయం కోసం ఎదురు చూడాల్సిన అగత్యం గురించి చెప్పటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం రంకు-భారతం బొంకు అన్న ఇతిహాసాలలోని అధ్యాయాలను మించిపోతాయి. రాబోయే రోజుల్లో వాటి గురించి ఎలాగూ చెప్పుకుంటాం గనుక అసలు విషయానికి వద్దాం.

ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెల వంటి జీవులు ఆహారం దొరకగానే ఆబగా కొద్దిగా నమిలి తింటాయి. తరువాత తీరికగా నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి మింగుతాయి, దీన్నే నెమరు వేసుకోవటం అంటారు. మనుషులు అలా చేసేందుకు అవకాశం లేదు గానీ జరిగిన అంశాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నెమరు వేసుకోవచ్చు. గత రెండు నెలల కాలంలో జరిగిన కొన్ని ముఖ్య పరిణామాల గురించి ఒక్కసారి చూద్దాం. ఏప్రిల్‌ 28నాటికి అమెరికాలో పది కోట్ల మందికి పూర్తిగా వాక్సిన్‌ వేశారు, మరో 23 కోట్ల మందికి ఒక డోసు వేశారు.వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అమెరికాలో 80 కోట్ల డోసులు అందుబాటులోకి రానుంది. జనాభా అంతటికీ వేసిన తరువాత కూడా పది కోట్ల డోసుల వరకు అదనంగా ఉంటుంది. అయినా అదేమిటో డబ్బు చెల్లిస్తామురా నా ప్రియమైన ఒకే మంచం ఒకే కంచం దోస్తూ అని మన దేశం రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా కోవిషీల్డ్‌ వాక్సిన్‌ తయారీకి అవసరమైన 37 రకాల ముడి పదార్దాలు, పరికరాలను విక్రయించేందుకు కొద్ది రోజుల క్రితం అంగీకరించాం అన్న ప్రకటన తప్ప ఇంతవరకు (మే 1 ) పంపిన దాఖలా లేదు. ఇది కూడా పాక్షిక సడలింపు మాత్రమే అని చెబుతున్నారు.


గతేడాది జరిగిన పరిణామాల నేపధ్యంలో మొత్తంగా మీడియా లేదా పూర్తిగా కాషాయ దళాలుగానీ చైనాను దోస్తుగా పరిగణించటం లేదు. యాప్‌లను నిషేధించారు, అక్కడి నుంచి పెట్టుబడులను ఆపేశారు. వస్తువుల దిగుమతి నిలిపివేసి కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసుకుంటామని చెప్పారు. చైనా వస్తువులు నాశిరకం అన్నారు. వాటిని బహిష్కరించాలని పెద్ద హడావుడి చేశారు. ఇదిగో చూడండి మన దిగుమతులు తగ్గిపోయాయని అంకెలు చెప్పారు. అక్కడ తయారు చేసిన వాక్సిన్‌లో పసలేదని రాశారు. ఔషధాల నాణ్యత ప్రశ్నార్దకం అన్నారు. గతేడాది నవంబరు నుంచి రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు, వీసాల జారీలేదు. సరిహద్దు వివాదం గురించి ఎడతెగని చర్చలు సాగుతున్నాయి, ఎటూ తేలటం లేదు. అవి ఎప్పుడు పూర్తవుతాయో లడఖ్‌ కొండలెక్కించిన మన సైనికులను కిందికి ఎప్పుడు దింపుతారో తెలియదు. ఏ విధంగా చూసినా చైనాను శత్రువుగానే పరిగణిస్తున్నారు. చైనా ప్రభుత్వ సిచువాన్‌ విమాన సంస్ధ పదిహేను రోజుల పాటు వస్తురవాణా విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. తరువాత వెంటనే తిరిగి అనుమతిస్తామని, అవసరాన్ని బట్టి కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని చెప్పింది. ఈలోగా ఇంకే ముంది సాయం చేస్తామని మోసం చేసింది, సరఫరాలను అడ్డుకుంటున్నది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే గతేడాది నవంబరు నుంచి ప్రయాణీకుల విమానాల రాకపోకలు లేకున్నా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చైనా నుంచి సిచువాన్‌ సంస్ధ వస్తురవాణా విమానాలను నడుపుతూనే ఉంది.సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. భారత్‌తో కరోనా విపరీతంగా పెరిగిన కారణంగా పదిహేను రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ చివరి వారంలో ప్రకటించింది. అంటే అప్పటి వరకు అటు నుంచి ఇటు నుంచి అటు సరకు రవాణా జరుగుతూనే ఉంది. కాషాయ దళాలు చెప్పినట్లు చైనా వస్తువుల బహిష్కరణ లేదు, పాడూ లేదు. తమకు అనేక దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయని, వాటి తయారీలో తలమునకలుగా ఉన్నామని, అందువలన భారత ప్రభుత్వం తమకు ఏమి కావాలో స్పష్టంగా చెబితే దానికి అనుగుణ్యంగా చర్య తీసుకుంటామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ లోగా కాషాయ దళం రంగంలోకి దిగింది. చైనా ప్రకటనపై మోడీ సర్కార్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇంతవరకు అధికారికంగా స్పందన లేదు. మీడియా, కాషాయ దళాలు రచ్చ చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాలలో కరోనా నిరోధం గురించి చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి మన దేశం డుమ్మాకొట్టింది.


ముడిసరకులపై నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించి వాక్సిన్‌ తయారీకి ఆటంకం కలిగేందుకు కారణమైన అమెరికా గురించి పల్తెత్తు మాట మాట్లాడని వారు చైనా పదిహేను రోజుల పాటు విమానాలను నిలిపివేస్తామని ప్రకటించగానే ఇంకేముంది నమ్మక ద్రోహం చేసింది, దాని బుద్ది బయటపెట్టుకుంది అంటూ రెచ్చిపోవటం ఏమిటి ? అప్రకటన చేసే ముందు రోజు వరకు మనకు అవసరమైన అత్యవసర సరఫరాలన్నింటినీ చైనా నుంచి తెచ్చుకున్నది వాస్తవం కాదా ? నేరుగా చైనా నుంచి గాకుండా ఇతర దేశాల మార్గాల ద్వారా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వ కంపెనీ గాకుండా ఉన్న మరో విమాన కంపెనీ ఎలాంటి నిషేధం విధించలేదు, దాని ద్వారా తెచ్చుకోవచ్చు. నిజానికి మనలను ఇబ్బంది పెట్టదలచుకుంటే అమెరికా మాదిరి నిషేధమే విధించవచ్చు కదా ! మనకు ఎగుమతి చేసే వాటి మీద మన నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద భారీ ఎత్తున పన్నులు విధించిందన్నది మరొక తప్పుడు ప్రచారం. నిజంగా ఆ పని చేస్తే దాపరికం ఏముంది ? గతంలో జిగినీ దోస్తు అమెరికా ట్రంపు అదేపని చేసినపుడు మీడియాలో వార్తలు వచ్చాయిగా, నిజంగా చైనా ఆ పని చేస్తే ఏ మీడియా కూడా ఎందుకు వార్తలు ఇవ్వలేదు.మన దేశం కూడా చైనా వస్తువుల మీద అదే మాదిరి పన్నులు ఎందుకు విధించకూడదు.

సిచువాన్‌ విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించిన తరువాత హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి చైనాకు చెందిన 800 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు వచ్చినట్లు, వారంలో మరో పదివేలు పంపుతున్నట్లు కొలంబోలో చైనా రాయబారి ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో 26వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్లు పంపినట్లు చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు. చైనా నుంచి నేరుగా అవకాశం లేకపోతే సింగపూర్‌, ఇతర ప్రాంతాల మీదుగా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది.ఏప్రిల్‌ ఒకటి నుంచి 25వ తేదీ వరకు చైనా నుంచి ప్రతి రోజూ మన దేశానికి సగటున ఐదు విమానాలు నడిచాయి. వాటిలో సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు కూడా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ సినిమా నటుడు చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా తాను ఆర్డరు పెట్టిన ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు ఆగిపోయాయని ఢిల్లీలోని చైనా రాయబారికి పంపిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దాని మీద స్పందించిన రాయబారి ట్వీట్లద్వారా సమాధానం పంపుతూ రెండు దేశాల మధ్య సరకు రవాణా విమానాలు మామూలుగానే తిరుగుతున్నాయని, గత రెండు వారాల్లో 61 విమానాలు తిరిగాయని వెల్లడించారు. అనుమానాలుంటే ఎవరైనా తీర్చుకోవచ్చు, సమస్యలుంటే పరిష్కరించాలని కోరవచ్చు.
అందువలన నిజాలేమిటో, సమస్య ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి తీవ్ర విమర్శలు చేయటం తగనిపని, మనకే నష్టం. కొద్ది రోజులుగా పద్దెనిమిది వేల ఆక్సిజన్‌ యంత్రాలకు మన దేశం నుంచి వివిధ సంస్ధలు ఆర్డరు చేశాయని చైనాలోని పెద్ద మెడికల్‌ కంపెనీ జియాంగ్‌సు యు మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తెలిపింది. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉన్న కారణంగా వెంటనే సరఫరా చేయలేమని, నెల రోజులు కూడా పట్టవచ్చని, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చైనా సంస్దలు చెబుతున్నాయి.


గతేడాది చైనాతో తలెత్తిన సరిహద్దు వివాద నేపధ్యంలో మోడీ సర్కార్‌ వైఖరిలో అస్పష్టమైన మార్పు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే చైనా నుంచి అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తున్నాము. భారత్‌ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు 25వేల ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను సరఫరా చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నామని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెయిడోంగ్‌ నిర్ధారించారు. వాటిని సరఫరా చేసేందుకు అసరమైన సరకు రవాణా విమానాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.చైనా నుంచి వస్తువులను తీసుకుంటున్నామని భావనా పరమైన సమస్యలేవీ లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు మీడియా-కాషాయ దళాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయి ?


లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్‌ఫినిటీ అనే సంస్ధ సేకరించిన సమాచారం ప్రకారం మార్చినెలాఖరుకు 16.4 కోట్ల కరోనా వాక్సిన్‌ డోసులను అమెరికా ఉత్పత్తి చేసింది. ఒక్కడోసు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. ఐరోపా యూనియన్‌ పదకొండు కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా 42శాతం ఎగుమతి జరిపింది. చైనాలో తయారైన సినోవాక్‌, సినోఫామ్‌ 20 కోట్ల డోసులను ఎగుమతి చేశారు. అమెరికా మీద తీవ్రమైన వత్తిడి రావటంతో రాబోయే రోజుల్లో ఆరుకోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. ఇది గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం వంటిదే. ఈ వాక్సిన్‌ వినియోగానికి అమెరికాలో అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించక ముందేే కొనుగోలు చేశారు. తరువాత అనుమతి ఇవ్వలేదు. అందువలన దాన్ని వదిలించుకొనేందుకు ముందుకు వచ్చింది. లేనట్లయితే అది నిరుపయోగంగా అక్కడే ఉండిపోతుంది.


వాక్సిన్‌ తయారీలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా సంస్దలదే గుత్తాధిపత్యం.అక్కడి ఫైజర్‌ కంపెనీకి అవసరమైన ముడిపదార్దాల సరఫరా తద్వారా దాని లాభాలను ఇబ్బడి ముబ్బడి చేసేందుకు వాటి మీద నిషేధం విధించినట్లు చెబుతున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమెరికా, ఐరోపా స్వంతం కావటంతో వేగంగా పెద్ద మొత్తంలో తయారు చేసి సొమ్ము చేసుకొనేందుకు వాక్సిన్‌ తయారీని ఒక్కోదశలో ఒక్కో దేశానికి అప్పగించారు. మోడెర్నా వాక్సిన్‌ స్విడ్జర్లాండ్‌లో తయారు చేసి దాన్ని సీసాల్లో నింపేందుకు స్పెయిన్‌కు పంపుతారు. బ్రిటన్‌ కంపెనీ క్రోడా వాక్సిన్‌ తయారు చేసి సీసాల్లో నింపేందుకు నార్మండీ, ఫ్రాన్స్‌ పంపుతున్నారు. ఒక వేళ తమ కంపెనీ వాక్సిన్‌ వికటించి వినియోగించిన వారికి పరిహారం చెల్లించాల్సి వస్తే కోర్టు దావాల నుంచి ఔషధ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇతర దేశాలు ప్రభుత్వ ఆస్తులను, రిజర్వుబ్యాంకుల నిధులు, మిలిటరీ కేంద్రాల వంటి వాటిని తాకట్టుపెట్టాలని ఫైజర్‌ కంపెనీ వత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇదేంట్రాబాబూ తొలి రోజుల్లోనే బిడెన్‌ పెద్దమనిషి ట్రంప్‌ కంటే దారుణంగా తయారయ్యాడు అని ఎక్కడ అనుకుంటారో, అమెరికా వ్యతిరేకత ఎక్కడ పెరుగుతుందో అనే భయం – బిడియంతో వాక్సిన్‌ తయారీ వస్తువులపై నిషేధాన్ని కాస్త సడలించేందుకు నిర్ణయించుకున్నట్లుగా గత కొద్ది రోజుల పరిణామాలు స్పష్టం చేశాయి.

అజిత్‌ దోవల్‌ ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పి దారికి తెస్తారని, అమెరికాను అదే విధంగా హెచ్చరించి మనకు సరఫరాలు చేసేందుకు అంగీకరింప చేయించారని కాషాయ దళాలు ప్రచారం ప్రారంభించాయి. మరి అదే అజిత్‌ దోవల్‌ చైనా విషయంలో కూడా అదే విధంగా ఎందుకు వ్యవహరించలేదు, అమెరికా కంటే బలహీనమైన చైనాను కాషాయ దళాల భాషలో చెప్పాలంటే ఎందుకు మన కాళ్లదగ్గరకు తేలేదు ? చివరికి బలహీన పాకిస్దాన్‌న్ను ఎందుకు అంకెకు తేలేకపోయారు ? మన ఇరుగు పొరుగుదేశాలను మన వైపు ఎందుకు తిప్పలేకపోయారు. అజిత్‌ దోవల్‌కు అంతసీన్‌ లేదు ! నరేంద్రమోడీ కంటే బలవంతుడా ! అందరికీ చెడ్డాం, చివరికి మీరు కూడా ఇలా చేస్తే మా మోడీ పరువు, పనేంగాను అని సాష్టాంగపడ్డారేమో ? చరిత్రలో ఇలాంటివారిని అమెరికన్లు ఎందరినో చూశారు. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ దాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తున్నట్లుగా ఈ ప్రచారం ఉంది. ఇలాంటి పోసుకోలు కబుర్లతో నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పిపుచ్చగలరా ? తోకపట్టుకొని పోవటం తప్ప మరొక విధంగా వ్యవహరించలేని రీతిలో మనం అమెరికా చేతిలో చిక్కాము. దాన్ని నమ్మి రెచ్చి పోయి చైనా, పాకిస్దాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకున్నాం, వాటన్నింటినీ చైనాకు దగ్గర చేశాము. రెండునెలలుగా ససేమిరా అని మొరాయిస్తుంటే అజిత్‌ దోవల్‌ గానీ నరేంద్రమోడీ గానీ చేసిందేమీ లేదు. మిత్రదేశం అని చెప్పిన భారత్‌ను అమెరికన్లు ఎలా నిర్లక్ష్యం చేశారో చూడండి అంటూ చైనా మీడియాలో వ్యాఖ్యలు, ఇతర దేశాల నుంచి విమర్శలు, వత్తిడి, అన్నింటికీ మించి మన దేశంలో అమెరికా వ్యతిరేకత పెరిగితే తమకూ, అనుయాయి నరేంద్రమోడీకి నష్టం అని లెక్కలు వేసుకున్న తరువాతనే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది.


శ్రీరాముడంతటి శక్తివంతుడే రావణుడిపై పోరుకు ఉడత సాయం తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటారు. రాముడి అడుగుజాడల్లో నడుస్తున్నామని చెబుతున్నవారు పాక్‌ నుంచి సాయం తీసుకొనేందుకు తిరస్కరించటం శ్రీరాముడి పట్ల అపచారం చేసినట్లు కాదా ?వెంటిలేటర్లతో సహా కొన్ని ఇతర వైద్య సామగ్రిని పంపుతామని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే దాన్ని స్వీకరిస్తామని గానీ తిరస్కరిస్తున్నట్లుగానీ మోడీ సర్కార్‌ ప్రకటించలేదు. స్వీకరించటం తమ స్ధాయికి భంగకరమని, తలెత్తే ప్రశ్నలు, విమర్శలకు సమాధానాలు చెప్పలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.పాకిస్ధాన్‌తో సయోధ్య కుదిరినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ వైఖరితో వ్యవహరించటం గమనించాల్సిన అంశం. పదహారు సంవత్సరాల క్రితం విదేశీ సాయం తీసుకోవటంపై మన్మోహన్‌ సింగ్‌ హయాంలో స్వయంగా విధించుకున్న ఆంక్షలను గుట్టుచప్పుడు కాకుండా నరేంద్రమోడీ ఎత్తివేసింది. చైనా నుంచి ప్రాణావసర ఔషధాలు, ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలను తీసుకొనేందుకు భావనా పరమైన సమస్యల్లేవని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొన్నది. అయితే పాకిస్ధాన్‌ నుంచి స్వీకరించే విషయంలో ఏం చేయాలనేది స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం విదేశాల నుంచి బహుమతులు, విరాళాలను స్వీకరించాల్సి వస్తే వాటిని రెడ్‌ క్రాస్‌ సంస్ధకు మాత్రమే అందచేయాలి, దాని ద్వారానే పంపిణీ చేయాలి.ప్రభుత్వాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవాటికి వెల చెల్లించి మాత్రమే తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి ప్రకటిస్తున్న సాయమంతా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేదే అని గ్రహించాలి. విధాన సడలింపుల తరువాత వచ్చే సాయంలో కొంత విరాళం కొంత నగదు చెల్లింపులు ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేరుగా తమకు అవసరమైన వాటిని విదేశాల నుంచి సేకరించుకోవచ్చని కేంద్రం సూచించింది.

అంతకు ముందు ఉత్తరా ఖండ్‌ భూకంపం(1991) లాతూర్‌ భూకంపం(1993) గుజరాత్‌ భూకంపం(2001) బెంగాల్‌ తుపాను(2002) బీహార్‌ వరదలు(2004) సంభవించిన సమయాలలో విదేశీ సాయం తీసుకున్నాము.2004లో సునామీ తరువాత పరిస్ధితిని మనకు మనమే ఎదుర్కోగలమంటూ విదేశీ విరాళాలను తీసుకోవద్దని, అవసరమైతే వారి సాయం తీసుకుందామని నిర్ణయించారు. దీనికి అనుగుణ్యంగా 2005లో కాశ్మీరులో భూకంపం, అక్కడే 2014లో వరదల సమయాలో, 2013లో ఉత్తరా ఖండ్‌ వరదల సమయంలో విదేశీ విరాళాన్ని తీసుకొనేందుకు ప్రభుత్వ నిరాకరించింది.తాజా విషయానికి వస్తే లక్షలాది మంది మళయాలీలు పని చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం 2018లో కేరళ వరదల సమయంలో 700 కోట్ల రూపాయల విరాళం అందచేస్తామని ముందుకు వచ్చినపుడు కేంద్రం తిరస్కరించింది. ఆ మేరకు కేంద్రం సాయం ఇవ్వకపోవటం తీవ్ర విమర్శలు రావటం అది వేరే విషయం. కానీ అదే ప్రభుత్వం పిఎం కేర్‌ నిధికి ఎవరు విరాళం ఇచ్చినా తీసుకోవాలని గతేడాది నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే స్వీకరించనుంది. అయితే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించలేదని, ఇదే సమయంలో సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం ఎలాంటి వినతులు చేయలేదని, ప్రభుత్వాలు లేదా ప్రయివేటు సంస్ధలు ఏవైనా బహుమతిగా విరాళం ఇస్తే కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరిస్తామని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. గతంలో మన ప్రభుత్వం ఇతర దేశాలకు విరాళంగా ఇచ్చిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ నుంచి వాక్సిన్లకు ప్రతిగా ఇలాంటి విరాళాలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఇప్పుడు కావాల్సింది ఏమిటి ? ప్రపంచ లేదా ప్రాంతీయ రాజకీయాలు, శత్రుత్వమా ? ప్రజల రక్షణా ఏది ముఖ్యం. నిజమైన రాజనీతి ప్రాధాన్యత జన సంక్షేమం అన్నది స్పష్టం. గతంలో అన్ని దేశాలూ రాజకీయాలు చేశాయి. ఒకదానిని ఒకటి దెబ్బతీసుకొనేందుకు ప్రయత్నించాయి. మనం తప్ప మిగతావన్నీ అదే చేశాయనే కాషాయ ప్రచారాన్ని ఎవరైనా నమ్మితే తప్పుదారి పట్టినట్లే. చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో కలిశాము. అయినా దానిని పక్కన పెట్టి చైనీయులు మనకు అవసరమైన వాటిని విక్రయిస్తున్నారు. ఎలాంటి నిషేధం పెట్టలేదు. మిత్రదేశం అనుకున్న అమెరికా ఆ పని చేసింది. మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ -చైనా దగ్గరయ్యాయి. అమెరికాకు అనుకూలంగా మనం ఇరాన్‌ను దూరం చేసుకున్నాము. అమెరికాకు వ్యతిరేకంగా అది చైనాకు దగ్గరైంది. ఇతర ఇరుగుపొరుగు దేశాలు కూడా అమెరికాతో మన సంబంధాల కారణంగా చైనా వైపు మొగ్గుచూపుతున్నాయన్నది స్పష్టం. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు, దేనితో ఎలా తేల్చుకోవాలో తరువాత నిర్ణయించుకోవచ్చు. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో స్నేహం చేశాము, ఇప్పటికీ ఎగుమతి-దిగుమతి కొనసాగుతూనే ఉంది. పాకిస్ధాన్‌తో వైరం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు వాణిజ్యంలో అత్యంత సానుకూల హౌదా ఇచ్చాము. ఒకవైపు మిత్ర రాజ్యం అంటూనే మరోవైపున మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దలో ఫిర్యాదులు చేస్తున్నది, మన వస్తువుల దిగుమతులపై ఉన్న పన్ను రాయితీలను రద్దు చేసింది, కొత్తగా దిగుమతి పన్నులు వేసింది. మాకు మా దేశ పౌరులు తప్ప మిగతావారి గురించి పట్టించుకోము అంటూ వాక్సిన్‌ ముడిసరకులు, పరికరాలపై నిషేధం విధించినా అమెరికాతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధానం చైనా, పాకిస్దాన్‌తో ఎందుకు అనుసరించకూడదో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వివాదాలు, విబేధాలతో రాజీపడాలని, లొంగిపోవాలని ఎవరూ చెప్పటం లేదు. ప్రజానుకూలంగా విధానాలుండాలని చెప్పటం తప్పుకాదు. అలాంటి వైఖరి, విదేశాల సాయం లేకుండా కరోనా బారి నుంచి మన జనాన్ని మన ప్రభుత్వం కాపాడగలదా ?

ఆపదలో ఆదుకుంటాయని నమ్మిన అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ముఖం చాటేశాయి.మనలను చైనాకు వ్యతిరేకంగా ఉపయోగించుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత ఆదుకొనేందుకు ఇవ్వలేదని కరోనా నిరూపించింది. మార్చినెలలో జరిగిన తొలి చతుష్టయ సమావేశంలో ప్రపంచానికి వంద కోట్ల వాక్సిన్లు అందించాలని, వాటిని భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన సాయం చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పుడు మన దేశమే వాక్సిన్ల కొరతను ఎదుర్కొంటుంటే మిగతా దేశాలు ముఖం చాటేస్తున్నాయి. ముడిపదార్దాల సరఫరాను అడ్డుకుంటున్నాయి. లక్షల సంఖ్యలో ఆక్సిజన్‌ జనరేటర్లు మనకు అవసరం కాగా కొన్ని వందలు పంపుతూ దాన్నే పెద్ద సాయంగా అమెరికా చిత్రిస్తున్నది. జపాన్‌ మౌనంగా ఉంది.మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెప్పే, గుండెలు బాదుకొనే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కరోనా వాక్సిన్ను మానవ హక్కుగా పరిగణించటం లేదు. అలాంటి వాటిని నమ్మి అలీన విధానానికి తిలోదకాలిచ్చి వాటి చంకనెక్కితే ప్రయోజనం లేదని తేలిపోయింది కనుక భేషజాలకు పోకుండా ఇప్పటికైనా మన విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవటం అవసరం.
హొహొహొ