Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కిందపడ్డా విజయం మాదే అని ప్రచారం చేసుకోవటంలో కాషాయ దళాల తరువాతనే ఎవరైనా అనేందుకు మరో ఉదాహరణ కేరళ ఎన్నికల ఫలితాలే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి 10.6శాతం ఓట్లు, 2021లో 11.3శాతం తెచ్చుకుంది. అంటే గతం కంటే అదనంగా ఓట్లు తెచ్చుకున్నట్లే కదా అని బిజెపి చెబుతోంది. దీనిలో నిజము – వక్రీకరణ ఉంది. కేరళ అగ్రశ్రేణి మీడియా సంస్ధ మళయాల మనోరమ నివేదించినదాని ప్రకారం 2016 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి ఓట్లు 14.96శాతం, 2019 లోక్‌సభ ఎన్నికలలో వచ్చినవి 15.53, 2021లో వచ్చినవి 12.47 శాతం, అంటే రెండు సంవత్సరాలలో దాని ఓట్లు 3.06శాతం తగ్గాయి. మరి బిజెపి ఓట్లు పెరిగాయనటంలో నిజం ఏమిటి ? 2016 ఎన్నికలలో అది 140కి గాను 98 చోట్ల పోటీ చేసి 10.6శాతం తెచ్చుకుంది, తాజా ఎన్నికలలో 113 చోట్ల పోటీ చేసి తెచ్చుకున్నది 11.3శాతం. అది ఎక్కువ సీట్లలో పోటీ చేసింది, దాని మిత్రపక్షాలు తక్కువగా పోటీ చేశాయి. రెండు చోట్ల నామినేషన్‌ పత్రాలు సరిగా వేయటం చేతగాక పోటీలో లేదు తప్ప 138 చోట్ల ఎన్‌డిఏ పక్షాలు పోటీ చేశాయి. వాటన్నింటికీ కలిపి గత ఎన్నికల కంటే 2.49 శాతం తగ్గిపోయాయి. బిజెపి పోటీ చేసిన స్ధానాల్లో గత ఎన్నికల కంటే ఐదు చోట్ల అదనంగా ఓట్లు తెచ్చుకుంది. ఈ అంకెలను బట్టి బిజెపి చెబుతున్నదానిలో నిజం ఏమిటో వక్రీకరణ ఏమిటో అంతిమంగా ఏం జరిగిందో పాఠకులే అర్ధం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా వంటి అగ్రనేతలు పర్యటించిన చోట్ల కూడా కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగి బిజెపికి ఓట్లు తగ్గాయని, దీని మీద ఆ పార్టీ విచారణ కమిటీని వేస్తే మంచిదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చమత్కరించారు.

బిజెపి విషయానికి వస్తే నరేంద్రమోడీ పలుకుబడి-శబరిమల అయ్యప్ప దేవాలయ ప్రవేశ సమస్యల మీద పెట్టుకున్న ఆశలు నిరాశలయ్యాయని చెప్పవచ్చు. 2014లో కేంద్రంలో బిజెపి విజయం తరువాత 2015లో జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీకి 13.3శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14.96 శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 15.64 శాతం ఓట్లు రావటాన్ని చూపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే 2020 స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దాని బలం 14.5శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికలలో 12.47కు పడిపోయింది. అధికార యావలో ఈ సారి క్రైస్తవుల ఓట్ల కోసం బిషప్పుల బంగ్లాల చుట్టూ బిజెపి నేతలు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. 2016లో ఆ పార్టీ ఏడు నియోజకవర్గాలలో రెండవ స్ధానంలో వచ్చింది. ఈ సారి మరొక స్ధానంతో, నీమమ్‌తో తొమ్మిదికిి చేరాయి. అంతకు మించి పెరగలేదు. ఆ ఏడు చోట్లా ఈసారి విజయం సాధిస్తామని గట్టిగా ఆశలు పెట్టుకుంది. వాటిలో నాలుగు చోట్ల గతం కంటే స్వల్పంగా ఓట్లు పెంచుకోగా నీమమ్‌తో సహా నాలుగు చోట్ల రెండవ స్ధానాన్ని కాపాడుకున్నప్పటికీ బలం కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 15శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాలు 54, ఇరవైశాతం తెచ్చుకున్నవి మరో 24 ఉన్నాయి. వాటిని చూసి ఈ సారి తమదే అధికారం అని ఆ పార్టీ పేరాశలు పెంచుకుంది.ఆ నియోజకవర్గాలు ఇప్పుడు 34-16కు తగ్గిపోయాయి. ఎజవా సామాజిక తరగతి కేరళలో ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. ఆ ఓట్లను రాబట్టేందుకు భారత ధర్మ జనసేన పేరుతో ఉన్న పార్టీని బిజెపి కలుపుకుంది. గత ఎన్నికల్లో అనేక చోట్ల ఆ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించినా ఈసారి ఘోరంగా విఫలమైంది. దాని ప్రభావం ఎన్‌డిఏ కూటమి ఓట్ల శాతం మొత్తంగా తగ్గింది. బిజెపి రాష్ట్రనేతలు పోటీ చేసిన చోట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేసిన రెండింటిలో ఒక చోట స్వల్పంగా ఓట్లశాతం పెరిగింది, శబరిమల ఆలయం ఉన్న నియోజకవర్గంలో బాగా తగ్గాయి, మిగతా అగ్రనేతలు పోటీ చేసిన చోట్ల కూడా ఓట్లశాతాలు తగ్గాయి. మెట్రోమాన్‌ శ్రీధరన్‌, సినీ హీరో సురేష్‌ గోపి పోటీ చేసిన చోట ఓట్లశాతాలు పెరిగాయి. గిరిజన నాయకురాలిగా పేరున్న సికె జాను పోటీ చేసిన నియోజకవర్గంలో గతంలో 16.35 శాతం ఓట్లు తెచ్చుకోగా ఈసారి 9.08 శాతం మాత్రమే వచ్చాయి. నరేంద్రమోడీ పలుకుబడి పని చేయక, అయ్యప్ప స్వామి వివాదం ఓట్లు రాల్చక బిజెపి పరిస్దితి అగమ్య గోచరంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


నోట మాటరాని బిజెపి నాయకత్వం – ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసిందన్న బిడిజెఎస్‌ !


ముప్పై ఐదు స్ధానాలు వస్తాయని, వాటితోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన బిజెపి నేతలు ఇప్పుడు ఎన్నికలలో తలెత్తిన పరిస్ధితిని కార్యకర్తలకు వివరించలేని స్ధితిలో ఉన్నారు. ఉన్న ఒక్క స్ధానం పోయి ఖాతా రద్దయింది. దానికి తోడు కూటమి ఓట్లశాతం తగ్గటం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు.గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి మద్దతు ఇచ్చిన వెనుకబడిన తరగతుల ఓట్లు సిపిఎంకు పడ్డాయని భావిస్తున్నారు. బిజెపి తమను మోసం చేసిందని బిజెపితో కలసి 21 సీట్లలో పోటీ చేసిన బిడిజెఎస్‌ పార్టీ ఫలితాల తరువాత గగ్గోలు పెడుతోంది. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోయామని అలాంటి పార్టీతో ఇలా అయితే కలసి పనిచేయలేమని ఆ పార్టీ నేతలు వాపోతున్నారని వార్తలు. ఉత్తరాదిలో అనుసరించిన వ్యూహం కేరళలో పని చేస్తుందనుకోవటం తెలివితక్కువ తనమని బిజెపి సీనియర్‌ నేత సికె పద్మనాభన్‌ విమర్శించారు. గతంలో ఒకే పార్టీకి వరుసగా రెండవ సారి అధికారమిచ్చిన ఉదంతం లేనప్పటికీ విజయన్‌ ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నారు, దాన్ని మనం అంగీకరించాలని తమ పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. పొరపాట్లను సరిచేయకపోతే పార్టీ పెరిగే అవకాశం లేదన్నారు. విజయోత్సవ సభల్లో సిపిఎం దాని మిత్ర పక్షాలు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) మీద విమర్శలు చేస్తున్నాయని దాన్ని తాము సహించేది లేదని కేంద్ర మంత్రి, బిజెపి నేత వి మురళీధరన్‌ చెప్పారు. ఇతరుల మాదిరే ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమారన్‌కూ తన రాజకీయ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందన్నారు. ఏప్రిల్‌ ఆరున ఉదయమే ఓటు వేసేందుకు వచ్చిన సురేంద్రన్‌ అంతకు ముందు చెప్పిన తటస్ధ వైఖరికి విరుద్దంగా ప్రభుత్వ మార్పుకోసం ఓటు వేయాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక ప్రకటన చేశారు.


ఎల్‌డిఎఫ్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?


కేరళలో వామపక్షాలు గతంలో ఎన్నడూ సాధించని రీతిలో 97 స్దానాలు తెచ్చుకొని గత యుడిఎఫ్‌ రికార్డును సమం చేశాయి, ఘనవిజయం సాధించాయి, రాజకీయ సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లు వరుసగా రెండవ సారి అధికారపక్షానికి పట్టం గట్టి చరిత్రను తిరగరాశారు. సంతోషించాల్సిందే. కానీ మరోవైపు పరిస్ధితి ఏమిటి ? కేరళలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చిన ఓట్లు 45.43 శాతం, దాన్ని వ్యతిరేకించే పార్టీలకు వేసిన ఓటర్లు యుడిఎఫ్‌కు వచ్చిన 39.47, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు వచ్చిన 12.47శాతం కలుపు కుంటే 51.94 శాతం ఉన్నారు. ఇలా చెప్పటం అలాంటి కలయిక వెంటనే ఏర్పడుతుందని కాదు, ఒకవేళ అదే జరిగినా ఆ పార్టీల వెనుక ఉన్న సామాన్య ఓటర్లు అలాగే స్దిరపడిపోతారనీ కాదు. ఆ పార్టీల వెనుక ఉన్నవారందరూ కమ్యూనిస్టు లేదా ప్రజావ్యతిరేకులు కారు. వీరిలో గణనీయమైన భాగాన్ని ఎల్‌డిఎఫ్‌లోకి ఆకర్షించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు నొక్కి చెప్పాయి. వివిధ తరగతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఎల్‌డిఎఫ్‌ వెలుపల ఉన్న ప్రజాతంత్రశక్తులను ఎలా కూడగట్టాలో ఆ కూటమి నాయకత్వం ఆలోచించాలి. మనోరమ విశ్లేషణ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు 2.67, లోక్‌సభ కంటే 10.73శాతం ఈసారి అదనంగా వచ్చాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 0.66శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని వికీపీడియా విశ్లేషణ పేర్కొంటే 0.78 అని, పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చితే 7.87 తగ్గినట్లు మనోరమ విశ్లేషణ తెలిపింది. (స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ధోరణిని గమనించాలి).

కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్న బిజెపి !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్లతో చెప్పిన అంశాల ప్రకారం 140కి గాను 90 చోట్ల కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగిందన్నారు. కొన్ని చోట్ల దీన్ని అధిగమించి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు విజయం సాధించారని అన్నారు. ఈ వ్యాపారం అగ్రనాయకుల మధ్యనే జరిగిందని విమర్శించారు. విజయన్‌ చెప్పిన కొన్ని నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌ బతరేలో బిజెపికి 12,458 ఓట్లు తగ్గాయి, కాంగ్రెస్‌ అభ్యర్ధి 11,822 మెజారిటీతో నెగ్గారు.పెరుంబవూరులో యుడిఎఫ్‌ 2,889 తేడాతో నెగ్గగా బిజెపికి 4,596 తగ్గాయి, ఓడిపోయిన సిపిఎం నాయకురాలు, ఏకైక మంత్రి మెర్సికుట్టి అమ్మ 4,452 ఓట్ల తేడాతో ఓడిపోగా అక్కడ బిజెపి ఓట్లు 14,160 తగ్గాయి. త్రిపురినితురలో సిపిఎం ఎంఎల్‌ఏ మీద గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి మెజారిటీ 992 కాగా అక్కడ బిజెపికి 6,087 తగ్గాయి. చలక్కుడిలో కాంగ్రెస్‌ 1,057 ఓట్లతో గెలవగా బిజెపికి అక్కడ కూడా 6,087 తగ్గాయి. తిరువనంతపురంలోని కోవలం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 11,562 మెజారిటీతో నెగ్గగా బిజెపికి 12,323 తగ్గాయి. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌(ఎం) అధ్యక్షుడు జోస్‌కె మణిని ఓడించేందుకు యుడిఎఫ్‌-బిజెపి కుమ్మక్కయ్యాయి. గెలిచిన మణి సికప్పన్‌కు 15,378 మెజారిటీ రాగా బిజెపికి 13,952 తగ్గాయి. కడుత్తురత్తిలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి 4,251 ఓట్ల తేడాతో ఓడిపోగా బిజెపికి 5,866 తగ్గాయి. ఒక ఎన్నిక తరువాత మరొక ఎన్నికలో తమ బలం పెరుగుతోందని చెప్పిన బిజెపి ఈ తగ్గుదలను ఎలా సమర్ధించుకుంటుందో చెప్పాలని విజయన్‌ ప్రశ్నించారు. నీమమ్‌ నియోజకవర్గంలో ఈ సారి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధికి ఓట్లశాతం పెరగటాన్ని గతంలో ఆమేరకు బిజెపికి ఓట్లు బదిలీ అయి అక్కడ బిజెపి గెలిచిందని, ఈ సారి కాంగ్రెస్‌ పోటీలో ఉండటంతో బిజెపి ఖాతా మూతపడిందన్నారు. రెండు రెళ్లు నాలుగు అవుతాయని కాంగ్రెస్‌-బిజెపి భావించాయని అయితే ఓటర్లు భిన్నంగా ఆలోచించి ఎల్‌డిఎఫ్‌కు ఘనవిజయం చేకూర్చారన్నారు.


కాంగ్రెస్‌ ఎదురుదాడి – బిజెపి ఓటమి బాధ్యత తనదే అన్న సురేంద్రన్‌ !


ముఖ్యమంత్రి విజయన్‌ చేసిన విమర్శలతో దిక్కుతోచని కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ నేత రమేష్‌ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరలేపారు. సిపిఎం-బిజెపి 69 నియోజకవర్గాలలో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బిజెపి చెబుతున్న కాంగ్రెస్‌ ముక్తభారత్‌లో భాగంగానే రెండు పార్టీలు కుమ్మక్కై తమను దెబ్బతీశాయన్నారు. బిజెపికి తగ్గిన ఓట్లన్నీ సిపిఎంకు పడ్డాయన్నారు. మరోవైపు బిజెపి ఓటమికి ప్రాధమిక బాధ్యత తనదే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ ప్రకటించారు. ఓటమి కారణాలను పార్టీకి వివరించానని పార్టీ ఏ చర్య తీసుకున్నా తాను సిద్దమే అని విలేకర్లతో చెప్పారు. కాంగ్రెస్‌ -సిపిఎం కుమ్మక్కయినట్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందే ముస్లిం ఓట్ల సమీకరణ జరిగిందని, ముస్లింలీగ్‌ లేని చోట్ల ఎస్‌డిపిఐ పార్టీతో సహా అనేక బృందాల ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయన్నారు.మతశక్తులైన ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ ఓట్లను సిపిఎం పొందిందని చెప్పుకున్నారు. కేరళ విద్యుత్‌ శాఖ మంత్రి మణిపై ఓడిపోయిన యుడిఎఫ్‌ అభ్యర్ది అగస్తీ ముందుగా ప్రకటించినట్లుగా ఓడిపోయినందుకు గుండు గీయించుకున్నారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ దానిపై మనం మాట నిలుపుకోవాలని శీర్షికగా పెట్టారు.


నీమమ్‌లో జరిగిందేమిటి ?


కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన బిజెపి ఉన్న ఒక్క సీటు నీమమ్‌ను కోల్పోయి ఖాతాను నిలబెట్టుకోలేకపోయింది. యుడిఎఫ్‌లోని ఒక చిన్న పార్టీ అభ్యర్ధిని నిలిపిన కాంగ్రెస్‌ నేతలు బిజెపితో కుమ్మక్కై తమ ఓట్లను బదలాయించి సీనియర్‌ బిజెపి నేత ఓ రాజగోపాల్‌ను గెలిపించారు. అది తీవ్ర విమర్శలకు దారి తీయటంతో అలాంటి తెరచాటు బాగోతం లేదని నమ్మించేందుకు కాంగ్రెస్‌ అక్కడ తన అభ్యర్ధినే నిలిపింది. అనేక మంది సీనియర్‌ నేతలను అక్కడ నిలిపేందుకు ప్రయత్నించి విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని నిలపాలని ఆయన మీద వత్తిడి తెచ్చారు. అయితే చాందీ పుతుపల్లిని వదిలితే తాము ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద బెదిరింపులకు దిగారు. నీమమ్‌లో గతంలో మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ ప్రాతినిధ్యం వహించి ఉన్నందున ఆ పేరుతో ఆయన కుమారుడు, ఎంపీ అయిన కె మురళీధరన్‌ను నిలిపారు.
గతంలో బిజెపి సీనియర్‌ నేత రాజగోపాల్‌కు అక్కడ 67,813 రాగా ఈ సారి కుమనం రాజశేఖరన్‌కు 51,888 వచ్చాయి. యుడిఎఫ్‌కు గతంలో 13,860 రాగా ఈ సారి 36,524 వచ్చాయి. సిపిఎం అభ్యర్ధి, తిరువనంతపురం మాజీ మేయర్‌ అయిన వి శివన్‌కుట్టికి గత ఎన్నికల్లో 55,837 రాగా ఈ సారి 59,142 వచ్చాయి. గతంలో కుమ్మక్కులో భాగంగా బిజెపికి పడిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.


వెలుగు దివ్వెలతో ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు : ఎల్‌డిఎఫ్‌


కరోనా దృష్యా ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ కోరారు. ఏడవ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాపితంగా ఒకేసారి మద్దతుదారులందరూ దివ్వెలను వెలిగించి ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నిర్ణయించినట్లు విజయరాఘవన్‌ చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కె కె శైలజ టీచర్‌ పదిహేనవ అసెంబ్లీ స్పీకర్‌ పదవిని అధిష్టించనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే నూతన సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డుతో పాటు కేరళ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా మరో రికార్డు సృష్టిస్తారు. గతంలో ముగ్గురు మహిళలు ఉపసభాపతులుగా పని చేశారు.