ఎం కోటేశ్వరరావు
ఒక తప్పుడు వార్తను ప్రసారం చేసి శివసేన పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ఇండియా టుడే న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్ చెంపలు వేసుకున్నారు. మే రెండవ తేదీ ఆదివారం నాటి ప్రసారంలో తాను చేసిన వ్యాఖ్యలపై సోమవారం నాడు సామాజిక మాధ్యమంలో ట్విటర్ ద్వారా విచారం ప్రకటించారు. సీరం సంస్ధ అదర్ పూనావాలాను బెదిరించింది స్వాభిమాని షేత్కారి సంఘటన నేత రాజు షెట్టి, అతని అనుచరులు తప్ప శివసేనకు సంబంధం లేదని చెప్పారు. అయితే కన్వాల్ టీవీ ప్రసారం ద్వారా క్షమాపణలు చెప్పాలి తప్ప కేవలం ట్విటర్‌లో విచారం ప్రకటిస్తే చాలదని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజు షెట్టి గతంలో శరద్ జోషి షేత్కారి సంఘటనలో పని చేశారు. తరువాత స్వాభిమాన షేత్కారి సంఘటన పేరుతో స్వంత దుకాణం, ఒక పార్టీ పెట్టారు. బిజెపి మద్దతుతో 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. గతేడాది ఎన్‌సిపితో సంబంధాలకు ప్రయత్నించినా స్వంత పార్టీలో విబేధాల కారణంగా దానికి దగ్గర కాలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు వాక్సిన్ సరఫరాలను పెంచాలని లేనట్లయితే ఇతర రాష్ట్రాలకు సీరం సంస్ద సరఫరా చేస్తున్న వాక్సిన్ వాహనాలను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని బెదిరిస్తూ మాట్లాడినట్లు వీడియోలో ఉంది.
రాహుల్ కన్వాల్ చేసిన తప్పుడు ప్రకటన తప్ప గతవారంలో ఇద్దరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు లేదా ప్రకటనలకు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడదు.( అన్ని టీవీ ఛానల్స్ చూడటం, అన్ని పత్రికలు చదవటం సాధ్యం కాదు కనుక నా పరిశీలనలో లోపం ఉంటే సరి చేసుకుంటాను.) ఒకటి పూనాలోని సీరం సంస్ధ అదర్ పూనావాలా తనకు రక్షణ లేని కారణంగానే లండన్ వచ్చి అక్కడే ఉండిపోయానని, త్వరలో భారత్ వెళతానని ప్రముఖ పత్రిక టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. భారతకు వాక్సిన్ ఫార్ములా ఇవ్వకూడదని ప్రపంచ ప్రముఖుడు బిల్ గేట్స్ ప్రకటించారన్నది మరొక వార్త. ఇవి రెండూ తీవ్రమైనవే.
ఇంతకీ పూనా వాలాను బెదిరించింది ఎవరు, దాని స్వభావం ఏమిటి ? ఫలానా వారు బెదిరించారని టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఇండియా టుడే జర్నలిస్టు రాహుల్ కన్వాల్ సంచలనాత్మక విషయంగా పూనావాలకు బెదరింపులు వచ్చాయని అవి చేసింది ఎవరో కాదు శివసేన నుంచి అని ఆరోపించారు. మేనెల రెండవ తేదీన ఎన్నికల ఫలితాల గురించి ప్రసారం చేస్తుండగా కన్వాల్ ఈ ప్రత్యేక ప్రస్తావన చేశారు. తాను ఆ వీడియోలను చూశానని వాటిలో బూతులు తిడుతున్న స్ధానికులు కనిపించారని చెప్పారు. వాక్సిన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన ఫ్యాక్టరీని ఘెరావ్ చేసిన శివసేన గూండాలంటూ కొన్ని వీడియోలను తనకు పూనావాలా పంపారని పేర్కొన్నారు. అది తప్పుడు వార్తని అందుకు గాను కన్వాల్ క్షమాపణ చెప్పాలని, జనవరిలో తప్పుడు వార్తను ప్రసారం చేసినందుకు ఇదే సంస్ద యాజమాన్యం రాజదీప్ సర్దేశారుపై తీసుకున్న మాదిరి చర్య తీసుకోవాలని శివసేన ఇండియా టుడే యాజమాన్యానికి రాసిన లేఖలో డిమాండ్ చేసింది. ఒకవైపు కరోనా విజృంభణ, మరోవైపున ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా జనాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ కన్వాల్ కావాలనే తప్పుడు వార్తలను ప్రసారం చేశారని అన్నారు. శివసేన మీద పని గట్టుకొని నిందా ప్రచారం చేస్తున్నారని దానికి నిదర్శనంగా ఇదే గ్రూపుకు చెందిన మరొక ఛానల్ ఆజ్‌తక్‌లో ముఖ్యమంత్రి కుమారుడు, కాబినెట్ మంత్రి అయిన ఆదిత్య థాకరేను శివసేన రాహుల్ గాంధీ అని వర్ణించినట్లు శివసేన తన లేఖలో తెలిపింది.
అదర్ పూనావాలాకు నిజంగా బెదిరింపులు వచ్చాయా లేక ఇతర కారణాలతో చిన్న ఉదంతాన్ని పెద్దది చేసి చూపారా ? అవి చిన్నవైనా పెద్దవైనా ముంబైలోనో మరొకచోటో వెల్లడించకుండా పూనాలో కేసులు నమోదు చేయకుండా లండన్ వెళ్లి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. రైతు ఉద్యమం గురించి విదేశీయులు మన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారాలు చేశారని, వారికి మన దేశంలోని ప్రభుత్వ, దేశ వ్యతిరేకులు సహకరించారని ఎంత పెద్ద లొల్లి చేశారో, ఎన్ని కేసులు పెట్టారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. పూనా వాలా చేసిన ప్రకటనతో ప్రపంచంలో మన దేశ పరువు ఏమైందో అసలు సిసలు దేశభక్తులం మేమే అని డబ్బా కొట్టుకొనే వారు ఆలోచించారా ? మీడియాలో అయితే కనిపించలేదు. బిజెపి ఎలాంటి ప్రకటనా చేసినట్లు లేదు, ఎవరు బెదరించారో వెల్లడించాలని కాంగ్రెస్, శివసేన కోరాయి.
ఇంతకీ పూనా వాలా చెప్పిందేమిటి ? వివిధ మీడియాల్లో వచ్చిన సమాచారం మేరకు వాటి సారాంశం ఇలా ఉంది. వాక్సిన్ కోసం భారత్‌లో బెదరింపులు వస్తున్న కారణంగా నేను, నా కుటుంబం దేశం విడిచి లండన్ వచ్చాము.అసాధారణ బెదిరింపులు వచ్చాయి, వారు ఏమైనా చేయవచ్చు. ఇటు వంటి పరిస్ధితుల్లో లండన్‌లో మరికొంత కాలం ఉంటాము. భారత్‌లో నా పని నేను చేసుకుంటున్నాను ఎక్స్, వై లేదా జడ్‌ల అవసరాలకు అనుగుణ్యంగా వాక్సిన్లను సరఫరా చేయలేను. వారేం చేయబోతున్నారో ఊహించలేము. అంతా నా భుజాల మీద వేస్తే నేను ఒక్కడినే చేయలేను.ఆకాంక్షలు, వత్తిడి అసాధారణంగా ఉంది. ప్రతివారూ తమకు వాక్సిన్ ఇవ్వాలంటున్నారు. ఇతరుల కంటే వారికే ఎందుకివ్వాలో అర్ధం కాదు. వారు చెప్పినట్లు ఇవ్వకపోతే ఏమైనా చేయవచ్చు అన్నట్లుగా బెదరింపుల స్వభావం ఉంది.వారు అలాంటి భాష ఉపయోగించలేదు గానీ ధోరణి, పర్యవసానం అలా ఉంది. తాము కోరింది ఇవ్వకపోతే మేమున్న చోటు నుంచి వెళ్లనిచ్చేది లేదని చుట్టుముట్టారు. వాక్సిన్ ఇవ్వకపోతే బాగుండదని వారు చెబుతున్నారు.
టైమ్స్ పత్రిక విలేకరి అడిగిన ప్రశ్నలకు పూనా వాలా స్పందన కూడా ముఖ్యమైనదే. కరోనా పెరుగుదలకు కారణంగా భావిస్తున్న కుంభమేళా- అసెంబ్లీ ఎన్నికల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు ” నేను గనుక సరైన సమాధానం చెప్పినా లేదా ఏ సమాధానం చెప్పినా వారు నా తల తీసేస్తారు. నేను ఎన్నికల మీద లేదా కుంభమేళా గురించి వ్యాఖ్యానించను, అది ఎంతో సున్నితమైనది. (కరోనా పరిస్ధితి ) ఇంతలా దిగజారిపోతుందని బహుశా దేవుడు కూడా ఊహించి ఉండలేదేమో అనుకుంటున్నా అన్నారు.
ఇండియా టుడే తప్పుడు ప్రచారంతో బిజెపి కిరాయి మీడియా వెంటనే గుండెలు బాదుకోవటం ప్రారంభించింది. శివసేన గురించి దుమ్మెత్తి పోసింది. ఇప్పుడు ఇండియా టుడే తన ప్రకటనను వెనక్కు తీసుకొని విచారం ప్రకటించిన నేపధ్యంలో కనీసం ఆ మాత్రం విచారం లేదా చెంపలు వేసుకుంటుందా ? ఎక్కడైనా ఎవరైనా బెదరింపులు, మరొక నేరపూరితమైన చర్యకు పాల్పడితే వెంటనే సంబంధిత వ్యక్తుల మీద పోలీసు ఫిర్యాదు ఇవ్వాలి. కానీ అదేమీ చేయకుండా ఏప్రిల్ 16వ తేదీన పూనాలోని సీరం సంస్ద ప్రతినిధి ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసి అదర్ పూనావాలకు రక్షణ కల్పించాలని కోరారు. వెంటనే వై తరగతి భద్రతను కల్పించింది. అంటే పూనావాలా దేశంలో ఉన్నపుడు ఆయనకు రక్షణగా ఎనిమిది మంది సాయుధ సిబ్బంది రక్షణగా ఉంటారు. ఒకరిద్దరు కమాండోలు కూడా ఉండవచ్చు.
చీకట్లో బాణం వేసినట్లుగా అదర్ పూనావాలా సంచలనాత్మక ప్రకటన చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. వత్తిడి చేసి లేదా ప్రలోభంతో డామన్‌లోని ఒక సంస్ధ నుంచి వేలాది రెమిడెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొని దొరికిపోయిన ఉదంతంలో ఉన్నది బిజెపి వారే. అందువలన దీనిలో కూడా వారు లేరని చెప్పగలమా ? కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు ఒక్కో రేటు నిర్ణయిస్తూ తయారీ సంస్ధలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు పూనా వాలా ఇలాంటి ప్రకటన చేశారా ? లేక విదేశాల్లో తయారు చేసి అధిక ధరలకు అమ్ముకొనేందుకు నేపధ్యాన్ని సృష్టించారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.ఒక వేళ నిజంగానే బెదరింపులు వస్తే ఇది తీవ్రమైన అంశం. దానికి కారకులు ఎవరంటే వేలు కేంద్ర ప్రభుత్వం వైపే చూపకతప్పదు. బీహార్ ఎన్నికల సమయంలో తమను ఎన్నుకుంటే ఉచితంగా వేస్తామని చెప్పి వాక్సిన్ రాజకీయాన్ని ప్రారంభించింది బిజెపి-జెడియు కూటమి. ఆ ప్రకటన వివాదాస్పదం కావటంతో దేశమంతటా ఉచితంగా వేస్తామని కేంద్ర మంత్రులు ప్రకటించారు. తీరా 45 ఏండ్లు దాటిన వారికే తాము ఉచితంగా వేస్తామని, మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనివేసుకోవాలని లేదా ప్రయివేటు ఆసుపత్రుల్లో అధిక ధరలకు కొనుక్కోవాలని కేంద్రం ప్రకటించింది. తాను బాధ్యతల నుంచి తప్పుకొని రాష్ట్రాల మీద భారం మోపేందుకు వేసిన ఎత్తుగడ తప్ప ఇది మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతనుంచి తప్పుకోవటమే ఇది. అందువలన ఈ విధానమే బెదిరింపులకు తెరలేపేందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. వాక్సిన్ రాజకీయంలో లబ్దిపొందేందుకు ముందుగా తామే కొనుగోలు చేసి ప్రజల ముందు గొప్పలు చెప్పుకొనేందుకు ఎవరైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడ్డారా ? అంతటి ధైర్యం కేంద్రంలో ఉన్న అధికారపార్టీ వారికి తప్ప ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులకు ఉండే అవకాశాలు లేవు.
లండన్ ఒక అంతర్జాతీయ కేంద్రం. అక్కడి ప్రముఖ పత్రికకు ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వటం వెనుక బెదిరింపులు కారణం కావచ్చు. పూనావాల ప్రకటన తరువాత నరేంద్రమోడీని నమ్మి ఏ విదేశీ సంస్ధ పెట్టుబడులు పెడుతుంది, పరిశ్రమలు స్దాపించేందుకు ముందుకు వస్తుంది? అలాంటిదేమీ లేదని నిర్ధారించేందుకు కేంద్రం ఎందుకు ముందుకు రాలేదు ? పూనా వాలా తనకు ఎదురైన బెదిరింపుల గురించి మాత్రమే చెప్పలేదు. ఎన్నికల ప్రచారం ద్వారా, కుంభమేళా ద్వారా కరోనాను వ్యాపింప చేశారని విమర్శచేసినా తన తలతీస్తారని కూడా చెప్పారు. హిందూత్వశక్తులు తప్ప మరొకరు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. కుంభమేళాకు అనుమతులు ఇవ్వవద్దన్న వారు హిందూమతానికి వ్యతిరేకమని ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లివచ్చిన వారిమీద అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వారిలో 99శాతం మందికి కరోనా వచ్చిందని టైమ్స్ నౌ ఛానల్ వార్త పేర్కొన్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ అంశాలన్నీ తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఇప్పుడు పూనావాలా దేశంలో పెరుగుతున్న అసహనం, విమర్శను సహించలేని తనాన్ని చెప్పకనే చెప్పినట్లు లేదూ ? అంతటి ప్రముఖుడే స్వేచ్చగా మాట్లాడేందుకు భయపడుతుంటే ఇంక సామాన్యుల సంగతి చెప్పాలా ?