Tags
China bio war, India’s COVID-19, Modi’s Beard, Narendra Modi, Propaganda War, RSS, RSS Propaganda War, Untruths
ఎం కోటేశ్వరరావు
ఒకవైపు కరోనా వైరస్ మన దేశ పౌరుల మీద యుద్దం చేస్తోంది. దాన్ని ఎదుర్కోవాల్సింది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలే . రాష్ట్రాలకు (రాజకీయ ) మార్గదర్శనం (కాదు) చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఆ పని చేయటంలో విఫలమైన ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చే సంఘపరివార్, పాలకులకూ-పరివార్ కొమ్ముకాస్తున్న ప్రధాన స్రవంతి మీడియా (జనం ఏదని భావిస్తే అది ) మరోవైపు తీవ్ర ప్రచార యుద్దం ప్రారంభించింది. సామాజిక మాధ్యమంలో దాడి సంగతి సరేసరి ! స్వయంగా గోబెల్స్ స్వర్గం నుంచి రంగంలోకి ( దాని మీద నమ్మకం ఉన్న వారి మనోభావాల ప్రకారం) దిగి పర్యవేక్షిస్తున్నాడా ? ఇప్పటికే వాట్సప్ విశ్వవిద్యాలయ పండితులు వండి వారుస్తున్న సరకుతో రాబోయే రోజుల్లో మరింతగా జనం మెదళ్లను నింపబోతున్నారు. వాటిలో ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం ! ఇలాంటి అంశాల మీద జనంలో అనుమానాలు తలెత్తటం ప్రారంభమైంది. దాంతో తమ పోస్టులోని అంశాలు సాధికారికంగా చెబుతున్నట్లు నమ్మించేందుకు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల లింకులను కూడా దీనికి జతచేశారు.
మెదళ్లతో వేస్తున్న ప్రశ్నలేనా ?
” కోవిడ్ -2 వేవ్ ఒక ప్లానెడ్ బయోలాజికల్ యుద్ధం ? భారత ఉపఖండం మొత్తం మీద ఒక్క భారత్ లోనే ఇలా ఎందుకు అవుతున్నది ? బంగ్లాదేశ్ , పాకిస్థాన్, నేపాల్ , శ్రీలంక, భూటాన్ దేశాలలో ఎందుకు లేదు ? అంటే భారత్ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే క్రమశిక్షణ లేని వారా ? అమెరికా ,చైనా లు కలిసి ఎకానమీ,ఫార్మా రంగాలని కాపాడుకోవడానికే ఇదంతా చేశారా ? ”
పధకం ప్రకారం జరుపుతున్న బయలాజికల్ యుద్దం అదీ చైనా మీద చేస్తున్న ఆరోపణ రోత పుట్టించే పాచిపాటే. పధకం ప్రకారం జరుగుతున్నదనుకుంటే మోడీ సర్కార్ నిఘా యంత్రాంగం, అసలు సిసలు జేమ్స్ బాండ్ అని చెబుతున్న అజిత్ దోవల్ ఏమి చేస్తున్నట్లు ? అధికారికంగా ప్రభుత్వం ప్రకటించి ఎందుకు జనాన్ని అప్రమత్తం చేయలేదు. మిగతా దేశాలకు రానందుకు సంతోషించాల్సింది పోయి ఎందుకు రాలేదు అని ప్రశ్నించేవారి మానసిక స్ధితి ఏమిటి ? పైన పేర్కొన్న దేశాల్లోనే కాదు ఇంకా అనేక దేశాల్లో రాలేదు. అలా ఎందుకు జరిగిందో చూసి ఇక్కడ కూడా నివారించాలని కోరకుండా ఫలానా చోట ఎందుకు రాలేదు అనే వారు మెదడుతోనా మరోదానితో ప్రశ్నిస్తున్నట్లా ? భారత ప్రజలు క్రమశిక్షణ లేని వారని ఎవరన్నారు ! వారిలో కొందరికి లేదు మచ్చుకు గోమాంసం, గోసంరక్షణ పేరుతో మైనారిటీల మీద దాడి చేసే వారు, వాలెంటైన్స్ డే రోజున పార్కుల వెంట తిరిగే బాపతు, మసీదులు, దేవాలయాల్లో, సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారాలు, కుట్రలు చేసే సకల కళా పారంగతులు, కాశ్మీరులో మాదిరి అత్యాచారం చేసిన వారికి మద్దతుగా ప్రదర్శనలు చేసిన రాజకీయ పార్టీలు, లాయర్ల వంటి వారు, వారికి మద్దతు ఇచ్చే పెద్దలు క్రమశిక్షణ లేనివారు తప్ప వాటితో నిమిత్తం లేని సామాన్య జనం క్రమశిక్షణ లేని వారని ఎలా అంటాం ? చైనా మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దం గురించి తెలిసి కూడా తెలియనట్లు నటించే వారు మాత్రమే ఆ రెండు దేశాలూ కలసి ఆర్ధిక, ఔషధ రంగాలను కాపాడుకోవాలని చేశాయని చెప్పగలరు. బుర్రతక్కువ ప్రచారం గాకపోతే రెండూ కలిస్తే అమెరికాలో కరోనా ఎందుకు పుచ్చిపోతుంది, చైనాలో అదుపులోకి వచ్చి ఆర్ధికరంగం ఎందుకు పురోగమిస్తోంది. ఇలాంటి అంశాలను ముందుకు తెస్తున్న వారు జనాలకు మెదళ్లు లేవన్న జనం అంటే గౌరవం లేని వారే అని ఎందుకు అనుకోగూడదు ?
దీన్నే ఎదురు దాడి అంటారు !
” డొనాల్డ్ ట్రంఫ్ లాగా మోడీ గ్లోబల్ ఆయుధ, ఫార్మా,ఆయిల్ లాబీలకి లొంగకుండా ముందుకు వెళ్తునందుకె ఇదంతా జరుగుతున్నదా ? ”
నరేంద్రమోడీ మహానుభావుడు లొంగలేదని ఎలా చెబుతారు. అమెరికా ఆదేశిస్తే జీ సార్ అంటూ చేతులు కట్టుకొని ఇరాన్ నుంచి చమురు కొనటం మాని అమెరికా దగ్గర కొంటున్నారు. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలు సరేసరి. సర్వం అర్పించుకుంటాం అన్నట్లుగా తయారైన కారణంగానే మోడీ రాక ముందు పాకిస్ధాన్‌తో లాహిరి లాహిరిలో అన్నట్లున్న అమెరికా ఇప్పుడు దాన్ని తెరచాటుకు పంపి మన దేశంతో సయ్యాటలాడుతోంది. చతుష్టయం పేరుతో మనలకు ముగ్గులాగిందా లేదా ? అది లొంగుబాటు కాదా ! నూట ముప్పయి కోట్ల జనాభాకు వాక్సిన్ వేయాలంటే రెండు కంపెనీలకే ఎందుకు అనుమతి ఇచ్చారు ? ఏ లాబీ దీని వెనుక ఉంది. అత్యవసర వినియోగానికి ఆ రెండింటికీ అనుమతి ఇచ్చినట్లుగానే ఇతర వాక్సిన్లకు అనుమతి ఇవ్వకపోవటం సకాలంలో వాక్సిన్లు వేయకుండా జనాలను చావుదాకా నెట్టటం వెనుక ఫార్మా లాబీ హస్తం లేదా, దానికి మోడీ సర్కార్ తలొగ్గలేదా ? నరేంద్రమోడీ సర్కార్ మూడు వేల కోట్ల రూపాయలు సీరం సంస్ధకు ఎలాంటి హామీలు లేకుండా ఇస్తే ఆ సొమ్ముతో బ్రిటన్‌లో తయారీ కేంద్రం పెడుతున్నట్లు అదర్‌పూనావాలా ప్రకటించిన విషయం తెలియదా ? దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరించటం అంటే ! నిజానికి మోడీకి విదేశీ ఫార్మాలాబీని దెబ్బతీయాలంటే 56 అంగుళాల ఛాతీ ఉంటే రెమిడెసివిర్, వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సులు ఇచ్చి మన దేశంలో చౌకధరలకు ఎందుకు తయారు చేయించరు ? ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి ఫార్మారంగం మీద నియంత్రణ ఎందుకు పెట్టరు ? అమెరికా నుంచి చమురుకొనుగోలు నిలిపివేసి తిరిగి ఇరాన్ నుంచి ఎందుకు కొనుగోలు చేయరు ? జనాలకు ఎల్లకాలం చెవుల్లో పూలు పెట్టలేరు !
డోనాల్డ్ ట్రంప్ మీద ఇంత సానుభూతి, ప్రేమ ఎందుకు ?
” ముందు డొనాల్డ్ ట్రంఫ్ ఓటమి వెనక ఉన్న వాస్తవాలు ఏమిటో చూద్దాము. నాటో దేశాల రక్షణ అమెరికా బాధ్యత కాదు అన్నాడు అంటే నాటో దేశాల కంటే నాటో కూటమిలో ఉన్న అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నది. యూరోప్ అంతటా మిలటరీ బేస్ లు పెట్టి అమెరికన్ సైనికులని అక్కడ మోహరించి ఉంచడం చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. అందుకే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుంది అని చెప్పేశాడు మళ్ళీ అధికారం లోకి వస్తే ఆ పని చేసేవాడు ఇది అమెరికన్ ఆయుధ లాబీ కి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు ఉండాలి అక్కడ అమెరికా సైన్యం వెళ్ళాలి ఆయుధాలు అమ్ముడుపోవాలి కానీ ట్రంఫ్ ఉంటే ఇవన్నీ జరగవు. ”
ఇదొక బుర్ర తక్కువ వాదన. ఐరోపా దేశాలను బెదిరించేందుకు, వారి నుంచి డబ్బు గుంజేందుకు, ఉపయోగించే అవసరం లేకపోయినా ఆయుధాలు కొనిపించేందుకు నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్ చెప్పాడు తప్ప మరొకటి కాదు. నాటో నుంచి వైదొలుగుతాం అన్న ట్రంప్ ఆసియాలో దక్షిణ చైనా సముద్రంలో చిచ్చు పెట్టేందుకు ఆసియా నాటో అని పిలుస్తున్న చతుష్టయం(క్వాడ్)లో జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు మన జుట్టుకూడా ముడివేసింది వాస్తవం కాదా ? నాటో నుంచి వైదొలిగే వాడికి ఇక్కడ ఈ కూటమి ఎందుకు అని నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించలేకపోయినట్లు ? మన దేశం ఆయుధాలు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నది ట్రంప్ హయాంలోనే కదా ?
” ఇక బ్లాక్స్ ఓన్లీ లివ్ (బ్లాక్ లైవ్స్ మాటర్ )నినాదం తో ట్రంఫ్ మీద విపరీతమయిన దుష్ప్రచారం చేశారు. ప్రతి ఒక పోలీసుని ఏ దేశ ప్రధాని కావచ్చు లేదా అధ్యక్షుడు కానీ నీయంత్రించ లేరు కానీ అది ట్రంఫ్‌కి అంటగట్టారు విజయవంతంగా ! అప్పటికి నల్లజాతి వాళ్ళ మీద అదే మొదటి దాడి జరిగినది అనే విధంగా ! ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంఫ్ ఓటమికి ఏవైతొ శక్తులు వెనక ఉండి ప్లాన్ చేసాయో అవే ఇప్పుడు మోడీ మీద ప్రయోగిస్తున్నాయి. ”
బోడి గుండుకూ మోకాలికి ముడి పెట్టటం అంటే ఇదే ! నల్జజాతీయుల జీవిత సమస్య (బ్లాక్ లైవ్స్ మాటర్ ) అనేది 2013లో ప్రారంభమైన ఒక సామాజిక మాధ్యమ, సామాజిక, రాజకీయ ఉద్యమం. అప్పటికే వారి మీద జరుగుతున్నదాడుల తీవ్రతతో అది ఉనికిలోకి వచ్చింది. ట్రంప్ హయాంలో నల్లజాతి, ఆసియా, ఇతర రంగుజాతి వ్యతిరేక చర్యలు పెచ్చుమీరాయి. అందువలన ఎన్నికల ప్రచారంలో అది ఒక సమస్యగాకుండా ఎలా ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ ట్రంప్ పుట్టక ముందే పుట్టింది, అది శ్వేత జాతి దురహంకార పార్టీ అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్ ఎంత వదరుబోతో, ఎంత అబద్దాలకోరో అక్కడి మీడియా లెక్కలు వేసి మరీ చూపింది.ట్రంప్ నల్లజాతి విద్వేషి అయితే మోడీ ముస్లిం, క్రైస్తవ మతాల మీద నిరంతరం విద్వేషం, దాడులకు పాల్పడే శక్తులకు కాపు కాస్తున్న పెద్దమనిషి. అందుకే ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకో కూడదన్న విధానాన్ని పక్కన పెట్టి మన నరేంద్రమోడీ అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్ అని అమెరికా వెళ్లి కౌగిలింతలతో మరీ పిలుపునిచ్చి వచ్చారు. ఒకటి మాత్రం స్పష్టం. కరోనా నిర్లక్ష్యం చేసి లక్షలాది మందిని చంపి జనాగ్రహానికి గురైన ట్రంప్ మీద ఎంత సానుభూతి ! ఎంత గాఢమైన అనురాగం. దీనికి కారణం లేకపోలేదు. ట్రంప్ నల్లజాతి వ్యతిరేకి – నరేంద్రమోడీ మైనారిటీల వ్యతిరేకి. అందుకే ఇద్దరికీ రాగి-బంగారం మాదిరి కలిసింది. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్ కూడా కరోనాను నిర్లక్ష్యం చేసి చివరికి ఆక్సిజన్ కూడా అందించలేకపోతోంది. అందువలన అవకాశం వచ్చినపుడు జనం ట్రంప్‌కు చేసిన సత్కారాన్ని మోడీ లేదా ఆయన పార్టీకి చేస్తారు !
ఈ ”చావు ” తెలివితేటలే కొంప ముంచుతున్నాయి !
” కోవిడ్ మొదటి దశ ని విజయవంతంగా దాటడం అనేది భారత దేశ చరిత్రలో అతి పెద్ద విజయం. గత 2020 జనవరి నెలలో వెస్ట్ దేశాలు జోస్యం చెప్పింది ఏమిటంటే భారత్ లో హీన పక్షం వొ రెండు కోట్ల మంది కోవిడ్ వల్ల చనిపోతారు కానీ వాళ్ళు జోస్యం నిజం కాలేదు సరికదా మరణాల సంఖ్య రెండు లక్షల లోపే జరిగినది. పైగా హైడ్రాక్లోరో క్వీన్ ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయగలిగింది. నిజానికి 2020 లో ఇదే సమయానికి అమెరికా,యూరోపు తో సహా మిగతా ప్రపంచదేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి కానీ భారత్ మాత్రం పెద్దగా నష్టం లేకుండానే బయటపడగలింది. చివరకి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు కూడా భారత్ ని చూసి మిగతా దేశాలు నేర్చుకోవాలి కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలో అంటూ ఒక ప్రకటన చేశాడు గతి లేక. ”
ఈ చావు తెలివితేటలు, విజయగానాలే దేశాన్ని ఇప్పుడీ దుస్తితికి తెచ్చాయి. స్పానిష్ ప్లూ మహమ్మారి అనుభవంతో భారత్ వంటి పెద్ద దేశంలో విస్తరిస్తే మరణాలు ఎక్కువ ఉంటాయని ఎవరైనా అంచనా వేస్తే వేసి ఉండవచ్చు గానీ ప్రపంచ ఆరోగ్య సంస్ద అలాంటి జోశ్యాలు చెప్పలేదు. రెండవ దశ కరోనా గురించి నిర్లక్ష్యానికి నరేంద్రమోడీని బోనులో నిలబెడుతుండటంతో దానికి సమాధానం చెప్పలేక విజయగానాల గురించి మొదలు పెట్టారు. జ్యోతిష్కులు చెప్పిన సొల్లు కబుర్ల మీద ఉన్న విశ్వాసం శాస్త్రవేత్తలు చెప్పిన లేదా ప్రపంచ అనుభవాల మీద పాలకులకు లేకపోవటమే ఈ దుస్దితికి కారణం. మార్చి 30 నుంచి దేశంలో కరోనా ప్రభావం ఉండదని, మే 11 తరువాత ప్రపంచంలోనే కరోనా అంతరిస్తుందని ఇలా ఎవడికి తోచిన చెత్తను వారు చెప్పారు. ఒక్కడంటే ఒక్క జ్యోతిష్కుడు కూడా రెండవ దశ ఇంత తీవ్రంగా వస్తుందని ఎందుకు చెప్పలేకపోయాడు. ఒక పక్క మార్చినెలలో కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తుండటాన్ని చూసి కూడా గంగలో మునిగితే వైరస్ అంటదని బిజెపి అగ్రనేతలు చెప్పారంటే కళ్ల ముందున్నదానిని చూడలేని, వినలేని, శాస్త్రవేత్తలు చెప్పిన దానిని విశ్వసించలేని మూఢత్వంలోకి వారు జారి దేశాన్ని నెట్టారని ఎవరైనా అంటే తప్పేముంది ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా తొత్తు అయితే దాన్నుంచి మన దేశం ఎందుకు బయటకు రాలేదు ?
అవాస్తవాలు -జనం చెవుల్లో పూలు !
”ఇక వాక్సిన్ విషయంలో అన్నీ దేశాల కంటే ముందే ఉత్పత్తి ప్రారంభం చేసి వాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టింది భారత్. సరిగ్గా ఇక్కడే గ్లోబల్ ఫార్మా లాబీకి కష్టం అనిపించింది. ప్రతి సంవత్సరం గ్లోబల్ ఫార్మా చేసే వ్యాపార విలువ 4 నుండి 6 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది ఇక వాక్సిన్ వ్యాపారం అయితే 1.25 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా కానీ భారత్ బయో టెక్ కోవాక్సిన్, లైసెన్స్ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్ ఉత్పత్తి రేటు మిగతా దేశాలకంటే ఎక్కువ. పైగా ధర విషయంలో మిగతా దేశాలకంటే 60% తక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకి మింగుడు పడడం లేదు ఇదే మోడీ పట్ల ద్వేష భావం నెలకొనడానికి కారణం అయ్యింది. చివరకి జర్మనీ ఛాన్సేల్లర్ అంజేల మోర్కెల్ అయితే భారత్ ఫార్మా రంగ హబ్ అవడం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది అంటే ఎంత అక్కసు ఉందో తెలిసిపోయింది. ఇక్కడ ప్రధానం గా ఆస్ట్రా జెనీక వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మరణాలు సంభవించాయి యూరోపులో. ఇదే సమయంలో అదే లైసెన్స్ తీసుకొని భారత్ లో తయారుచేసిన కొవీషీల్డ్ వల్ల అలాంటి దుష్ప్రభావాలు కలిగినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు. ”
జనం చెవుల్లో కమలం పూలు పెట్టుకున్నారన్నది ఇది రాసిన వారి గట్టి విశ్వాసంగా కనిపిస్తోంది.ప్రపంచ ఫార్మామార్కెట్ 2019లో 324 బిలియన్ డాలర్లు, 2020లో 405, 2027లో 908 బిలియన్ డాలర్లు (ఒకబిలియన్ వంద కోట్లు )ఉంటుందనే అంచనా వార్తలను గూగుల్తల్లిని ప్రార్ధించి ఎవరైనా తెలుసుకోవచ్చు. నాలుగు వందల బిలియన్లెక్కడ ? రాసిన వారు చెప్పిన నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల డాలర్లెక్కడ ? గ్లోబల్ ఫార్మా లాబీకి కష్టం అట. ఆస్ట్రాజెనెకా వల్ల రక్తం గడ్డకట్టి మరణాలు సంభవించాయట. మన దేశంలో సీరం సంస్ధ కోవిషీల్డు పేరుతో తయారు చేస్తున్నది అదే విదేశీ ఆస్ట్రాజెనెకా కంపెనీ ఆధ్వర్యాన ఆక్ప్‌ఫర్డ్ తయారు చేసిందని తెలియదా ? అందుకే కదా మన దేశంలో కోవిషీల్డు వద్దు కోవాగ్జిన్ కావాలని అనేక మంది కోరుతున్నది.
” గ్లోబల్ ఫార్మా రంగం ఆశించింది అసలు జరగలేదు….. అన్నీ మన దేశంలో నే తయారు చేసుకున్నాము. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. బిడెన్ అధికారంలోకి రాగానే ఫార్మా లాబీ భారత్ కి వాక్సిన్ తయారీ కోసం వాడే ముడి పదార్ధాల మీద నిషేధం విధించమని తీవ్ర ఒత్తిడి తెచ్చి విజయం సాధించాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్ కోసం ముందే రా మెటీరీయల్ బుక్ చేసుకుంది. ముందు ఇచ్చిన ఆర్డర్ లు డెలివరీ అయ్యాకే మనకి ఇస్తాయి అమెరికన్ సంస్థలు అంటే హీన పక్షం మరో మూడు నెలల వరకు మనకి రా మెటీరీయల్ దొరికే అవకాశం లేదు.”
ఇది రాసిన పెద్దలే మన అజిత్ దోవల్ అమెరికాకు వారి భాషలోనే మాట్లాడి ముడిపదార్దాల సరఫరాకు దిగివచ్చేట్లు చేశారని కూడా రాశారు. దానికి ఆధారాలు లేవు. ట్రంపు అంటే కౌగిలింతల మిత్రుడు బిడెన్ కాదు కదా అయినా నరేంద్రమోడీకి నోరు ఎందుకు రావటం లేదు. అమెరికాతో అవసరం అయితే తెగతెంపులు చేసుకుంటామని బహిరంగ హెచ్చరిక ఎందుకు చేయలేదు ?
ఇది రాసిన వారికి తెలిసిన మాత్రం కూడా తెలియకుండా మోడీ, బిజెపి నేతలు బెంగాల్ వెళ్లారా !
” ఇక ఇంత హఠాత్తుగా 2 వేవ్ విజ ంభించడానికి కారణాలు సుస్పష్టం. ప్రస్తుతం విజ ంభిస్తున్న కోవిడ్ రెండు సార్లు మార్పు చెందినట్లు పరీక్షలలో తేలింది అంటే ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు కనపడుతున్నది దీనికి కారణం వేస్ట్ బెంగాల్ లో ఉన్న చికెన్ నెక్ ప్రాంతం ప్రధానం గా చెప్తున్నారు. ఈ చికెన్ నెక్ ప్రాంతం నుండే డుబుల్ మ్యూటేషన్ చేసిన వైరస్ ని వదిలినట్లు అనుమానిస్తున్నారు ఎందుకంటే బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదు కానీ ఒకేసారి డబుల్ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది ? ఇది ఖచ్చితంగా బయో వార్ మన మీద. లేకపోతే కేవలం భారత దేశంలోనే ఇది విజ ంభిస్తున్నది ? పోయిన సంవత్సరం కూడా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడే చైనా సరిహద్దుల్లో తిష్ట వేసింది అలాగే ఇప్పుడు 2వ వేవ్ ఉధ తంగా ఉన్న సమయంలో మళ్ళీ సవాల్ విసురుతున్నది. ”
తాము ఏమి రాసినా బుర్రను ఉపయోగించకుండా నమ్మే జనం ఉన్నారన్న గట్టి నమ్మకంతో అల్లిన కధ ఇది. కోడి మెడ మాదిరి ఉండే ప్రాంతాన్ని చికెన్ నెక్ అంటున్నారు. ఇది పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం. ఆ ప్రాంతం పక్కనే భూటాన్,నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులు ఉన్నాయి. అక్కడ వదలిన వైరస్ ముక్కుసూటిగా అటూ ఇటూ చూడకుండా పొరుగుదేశాలకు వెళ్లకుండా పశ్చిమ బెంగాల్‌కు వచ్చిందని చెబుతున్నారు. మరి కర్ణాటకలో ఎందుకు పెరుగుతోంది. బెంగాల్‌కు కర్ణాటకకు, మహారాష్ట్రకు చాలా దూరం ఉంది. పక్కనే ఉన్న బీహార్‌కు, ఝార్కండ్, ఒడిషా, వాటి మీదుగా ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎందుకు వ్యాపించలేదు. ఇలాంటి కట్టుకధలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు ? ఇక్కడ చిన్న తర్కం మరచిపోయారు. చికెన్ నెక్ ప్రాంతానికి వైరస్‌ను తీసుకురావాలంటే భూటాన్, నేపాల్ దేశాలను దాటి చైనా వారు రావాలి. కానీ లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలకు కొన్ని అడుగుల దూరంలోనే మన సరిహద్దు ఉన్నపుడు అక్కడ వదల కుండా దేశాలు దాటి వచ్చి చికెన్ నెక్ ప్రాంతంలో ఎందుకు వదలినట్లు ? నిజంగా బయోవార్ అయితే దేశం మొత్తాన్ని లక్ష్యం చేసుకుంటారు తప్ప ఒక్క పశ్చిమ బెంగాల్‌నే ఎందుకు ఎంచుకుంటారు? బయోవార్ కథలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలేమిటి ? దాన్ని గుర్తించేందుకు మోడీ సర్కార్ ఇచ్చిన ప్రత్యేక శిక్షణ ఏమిటి ? సొల్లు కబుర్లంటే ఇవే. కాస్త బుర్ర ఉపయోగిద్దాం. నిజానికి బయోవార్ మొదలు పెడితే లడఖ్ ప్రాంతంలో మన సైన్యం మీదే చైనా వారు వైరస్‌ను వదలి ఉండేవారు. లడఖ్ సైనికులు కరోనా బారిన పడ్డారన్న వార్తలేమీ ఇంతవరకు లేవే ! ఎందుకీ బుర్రతక్కువ రాతలు ?
” దాదాపు 15 కోట్ల మంది బంగ్లాదేశీయులు , రోహింగ్యా లు వెస్ట్ బెంగాల్ లో అస్సాం లో ఉన్నారు. మమత బేగం తో పాటు కాంగ్రెస్ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చింది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు వీళ్ళకి ప్రధానం అందుకే వీటి కోసం ఏం చేయడానికయినా వెనుకాడరు. ”
బంగ్లాదేశ్ మొత్తం జనాభా పదహారున్నర కోట్లు, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం జనాభా మొత్తం పద్నాలుగు లక్షలు. పదిహేను కోట్ల మంది మన దేశం వస్తే బంగ్లాదేశ్ మొత్తం ఖాళీ అయినట్లా ?
అమెరికన్లు చైనాకు మద్దతిస్తే చతుష్టయంలో చేరి మనం చేసేది ఏమిటి ?
” ఇప్పుడు జో బిడెన్ మంత్రి వర్గంలోని అధికారులు అందరూ దాదాపుగా లెఫ్ట్ వింగ్ ని సమర్ధించేవాళ్లే కాబట్టి కనపడకుండా చైనాకే మద్దతు ఇస్తారు , తీసుకుంటారు. మోడీ ప్రధాన మంత్రిగా ఉంటే అటు ఫార్మా లాబీ తో పాటు ఆయుధ లాబీ కూడా నష్టపోతుంది. నల్ల జాతీయుడు ఒక అమెరికన్ పోలీసు చేతిలో హత్యమవ్వడం దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని లెఫ్ట్ వింగ్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే లాబీ చైనా , కాంగ్రెస్ మద్దతుతో కోవిడ్ ని భూతంగా చూపించి దానికి మోడీ నే బాధ్యుడుగా చిత్రీకరిస్తున్నది. మోడీ ఉన్నంత కాలం డిఆర్‌డిఓ చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి అది తమకి నష్టదాయకం. మోడీని ఏదో విధంగా దించాలి. ఈ కుట్రలని ఛేదించుకొని మోడీ మనగలరా ? లేక ట్రంఫ్ లాగా బలి అవుతారా అన్నది మనమీదే ఆధారపడి ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ”
ఒకవైపు అజిత్ దోవల్ జేమ్స్ బాండ్‌లో బైడెన్ మెడలు వచ్చి వాక్సిన్ ముడిపదార్దాల దిగుమతులు సాధించారంటారు. మరోవైపు అదే బైడెన్ మన నరేంద్రమోడీని దించుతారని చెబుతారు. అమెరికన్లు చైనాకు మద్దతు ఇస్తే, మన మోడీని దించేందుకు ప్రయత్నిస్తుంటే చతుష్టయం నుంచి వెంటనే బయటకు రావాలి, అమెరికాతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలి కదా ? కరోనా వైఫల్యంతో మోడీ కనుక కొనసాగితే అసలు మొదటికే మోసం వస్తుందనే భయం సంఘపరివార్‌లో ప్రారంభమైందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మరో బొమ్మను రంగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు. ట్రంప్ బలి స్వయంకృతం, జనం గద్దె దించారు. ట్రంపు జిగినీదోస్తు నరేంద్రమోడీ, ఆయన సౌభాగ్యం ఎలా ఉంటుందో నోస్ట్రోడోమస్ ఎక్కడా చెప్పినట్లు లేదు.
నరేంద్రమోడీ గడ్డం దీక్ష వికటించి కరోనా పెరిగిందా ?
ప్రధాని నరేంద్రమోడీ గడ్డం పెంచటం గురించి ఇంతవరకు ఎవరూ ఏమీ చెప్పటం లేదు. గడ్డం, జులపాలు పెంచుకోవటమా లేదా అనేది వ్యక్తిగతమైనదే. కానీ మన దేశంలో కొంత మంది ఆకస్మికంగా పెంచితే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కొందరు భార్య గర్భవతి అయితే గడ్డం తీయరు. అలాగే దేవతలకు మొక్కో, దీక్ష్లో మరొక ప్రత్యేక కారణమో ఉంటుంది. కుర్రకారుకు సరదా ! మరి నరేంద్రమోడీ ఏ తరగతికి చెందుతారు. గడ్డం పెంచటం అనేది అస్తిత్వ రాజకీయాలకు, పురుషాధిక్యత ప్రదర్శనలో భాగం అనే తాత్పర్యాలు చెప్పేవారు కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణ దీక్షలో భాగంగా గడ్డం పెంచారని పెజావర మఠం స్వామి చెప్పారు. మోడీ గడ్డం తప్ప దేశ ఆర్ధికస్ధితి పెరగటం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు కూడా గడ్డం గురించి రాశాయి. అయినా మోడీ తనదైన శైలిలో తన గడ్డం గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేకమైన మన్నాత్ క్రతువులో భాగంగా రహస్య పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారని అందుకే గడ్డం పెంచుతున్నారని 2020 సెప్టెంబరు 27న డక్కన్ క్రానికల్ పత్రిక రాసింది. దీన్ని చూస్తుంటే కరోనా బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు అనిపిస్తోందని కూడా పేర్కొన్నది. అదే నిజమైతే ఆ పూజలు, ప్రార్ధనలు వికటించి ఇప్పుడు ఇంత విపత్తును తెచ్చి పెట్టాయా ?