Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


తామేం చేసినా, ఏం మాట్లాడినా జనం గతం మాదిరి అధికారం అప్పగించక తప్పుదు అన్నట్లు వ్యవహరించిన కేరళ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఓటమికి మీరు బాధ్యులంటే కాదు మీరే అనే కీచులాటలకు దిగారు. అధికారం ఖాయం అన్న ఆశతో మీతో పాటు ఐదేండ్లు ఎదురు చూశాము, మీ తీరు తెన్నులతో మరో ఐదేండ్లు ప్రతిపక్షంలో ఎలా కూర్చోవాలి, అసలు ఆ తరువాతైనా అధికారానికి వస్తామా అన్నది అనుమానమే అన్నట్లుగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు మధనపడుతున్నాయి. పైపై మెరుగులు కాదు సమూల ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి వత్తిడి వస్తోంది. ఇరవై మంది ప్రస్తుత ఎంఎల్‌ఏలను నిలిపితే ముగ్గురే ఓడిపోయారు, కొత్త ముఖాల పేరుతో 50 మందిని రంగంలోకి రప్పిస్తే గెలిచింది ఇద్దరే , ఎందుకీ పని చేశారు అని అడుగుతున్నారు. ఓటమికి అందరూ బాధ్యులే అయితే నన్ను ఒక్కడినే బలిచేసి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు పూనుకుంటారా అని ముళ్లపల్లి రామచంద్రన్‌ ఆగ్రహించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కోరితే రాజీనామాకు సిద్దం, అదే విషయం చెప్పాను అన్నారు. రెండు సంవత్సరాల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడేమో దానికి బాధ్యత నాది అని ఎవరూ చెప్పలేదు, ఇప్పుడేమో అంతా మీరే చేశారు అన్నట్లు ప్రతివారూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర నాయకత్వం ఈసారి ఎన్నికల్లో జోక్యం చేసుకుంది, అందువలన ప్రతివారూ దీనికి బాధ్యులే, నన్ను అవమానించి పార్టీ నుంచి వెలివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే కష్టకాలంలో పార్టీ వదలి వెళ్లాననే అభిప్రాయం రాకుండా ఉన్నాను, పార్టీ అధినాయకత్వం అనుమతిస్తే వెంటనే రాజీనామా చేస్తా అన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌కు వ్యతిరేకంగా తిరువనంత పురంలో బ్యానర్లు వెలిశాయి. ఆయన ఎప్పుడూ నిద్రపోతున్నట్లు ఉంటారని, అలాంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా పనికిరారని హిబి ఇడెన్‌ అనే నేత ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ముఠా తగాదాలే ఓటమికి ముఖ్యకారణమని కేరళ కాంగ్రెస్‌ నేత పిజె జోసెఫ్‌ విమర్శించారు. ముళ్లపల్లి రామచంద్రన్‌, రమేష్‌ చెన్నితల ఇద్దరినీ ఆ పదవుల నుంచి తప్పించి కొత్త వారిని ఎన్నుకోవాలని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ చొరవతో జరిగిన ఒక సమావేశంలో ఒక వర్గం అభిప్రాయంపడింది.
పిసిసి అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేతను మార్చాల్సిందే అయితే అది ఉన్నవారిని బలవంతంగా తొలగించారనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని పార్టీ నాయకత్వం చూస్తోంది. కరోనా వలన ఎల్‌డిఎఫ్‌కు లబ్ది చేకూరింది, అందువలన పార్టీ ఓటమికి ఎవరినీ నిందించనవసరం లేదని కన్నూరు ఎంపీ కె సుధాకరన్‌ చెప్పారు. కరోనా కారణంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు చురుకుగా పనిచేయలేకపోయారు. కానీ అలాంటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ సృష్టిలో సిపిఎం విజయవంతమైంది.వారి మాదిరి ఏ పార్టీ జనానికి మద్దతు ఇవ్వలేదు, అది ఈ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిందని సుధాకరన్‌ చెప్పారు. ప్రతిపక్ష నేతగా రమేష్‌ చెన్నితల బాగా పని చేశారని, అయితే దాన్ని పార్టీ వినియోగించుకోలేకపోయిందన్నారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని అనేక మంది సుధాకరన్ను కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ అంతరించదని యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించిన నీమమ్‌ నియోజకవర్గంలో మూడవ స్దానంలో నిలిచిన కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడు వి మురళీధరన్‌ చెప్పారు. తమ ఓట్లశాతం పెరిగిందని, అయితే బిజెపి ఓట్ల శాతం తగ్గిపోవటం పట్ల ముఖ్యమంత్రి విజయన్‌ ఎక్కువ ఆందోళన వ్యక్తం చేశారని అరోపించారు.యుడిఎఫ్‌ను అంతం చేసేందుకు ఒక సాధనంగా బిజెపిని ఉపయోగించుకుంటున్నారని చెప్పుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఇక్కడ బిజెపి ఎదిగేది లేదన్నారు. యుడిఎఫ్‌లో రెండవ పెద్ద పార్టీ అయిన ముస్లింలీగులో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవటానికి నాయకత్వమే కారణమని, కొందరు నేతలు వారిలో వారు పదవులను పంచుకుంటూ కొత్తవారికి అవకాశం ఇవ్వటం లేదని ధ్వజమెత్తుతున్నారు. బలమైన స్దానాల్లో ఓటమి కారణాలు వెల్లడించాలని కోరుతున్నారు.

బిజెపి కూటమిలోనూ కీచులాటలు !


ఉన్న ఒక్క సీటు పోగొట్టుకోవటంతో పాటు ఓట్లు కూడా గణనీయంగా తగ్గిన ఎన్‌డిఏ కూటమిలోనూ కీచులాటలు ప్రారంభమయ్యాయి. ఎన్‌డిఏ రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్న భారత ధర్మ జనసేన (బిడిజెఎస్‌) తుషార్‌ వెల్లపల్లి రాజీనామాకు సిద్దపడినట్లు, బిజెపితో కొనసాగాలా లేదా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలు. కేంద్ర ప్రభుత్వ బోర్డులు, కమిటీలలో తమకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్న వాగ్దానాన్ని బిజెపి నిలబెట్టుకోలేదని, తాము పోటీ చేసిన చోట బిజెపి నేతలు ప్రచారం చేయలేదు, కార్యకర్తలు ఓట్లుకూడా వేయలేదని ఆ పార్టీ చెబుతోంది. ఒకవేళ బిడిజెస్‌ ఎన్‌డిఏ నుంచి బయటకుపోయి ఎల్‌డిఎఫ్‌లో చేరినా తమకు జరిగే నష్టం ఏమీ లేదని బిజెపి నేత ఒకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక పేర్కొన్నది.

మతశక్తుల శాపాలు – కమ్యూనిస్టులకు వరాలు !

అసెంబ్లీ ఎన్నికల సమయంలో శబరిమల అయ్యప్ప, ఇతర దైవ సంబంధ అంశాలను ముందుకు తెచ్చి కాంగ్రెస్‌, బిజెపి తీవ్రంగా ప్రయత్నించాయి. పోలింగ్‌ జరుగుతుండగా నాయర్‌ సర్వీసు సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయ్యప్ప శాపం తగిలిన ప్రభుత్వం రెండవ సారి అధికారానికి రాదని, జనం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అయ్యప్ప ఇతర దేవుళ్లందరూ ఎల్‌డిఎఫ్‌తో ఉన్నారని ఫలితాలు రుజువు చేశాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. పుణ్యక్షేత్రాలుగా, ప్రాంతాలుగా పేరున్న తొమ్మిది పట్టణాలు లేదా నియోజకవర్గాలు, ప్రతిపక్ష కూటమికి కంచుకోటలుగా భావించిన చోట కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు పెద్ద మెజారిటీలతో విజయాలు సాధించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో శబరిమల ప్రాంతం ఉన్న కొన్ని నియోజకవర్గంలో యుడిఎఫ్‌ గెలిచింది. అయితే శాసనసభ్యుడి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో 23 సంవత్సరాల తరువాత సిపిఎం గెలిచింది. తిరిగి తాజా ఎన్నికలలో ఎనిమిదిన్నర వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అయ్యప్ప పేరుతో పాగా వేయాలని చూసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడ మూడవ స్ధానంలో నిలిచారు. త్రిసూర్‌లో వడక్కున్హా పేరుతో ఉన్న శివాలయం ఎంతో ప్రాచుర్యం కలిగింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గతసారి సిపిఐ గెలిచి, ఈ సారి కూడా విజయం సాధించింది. సినిమా హీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమార్తె పద్మజ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. సురేష్‌ గోపి మూడవ స్ధానంలో నిలిచారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రార్ధనా స్ధలాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందిన అనంత పద్మనాభ స్వామి ఉన్న తిరువనంతపురంలోని నియోజకవర్గంలో దీర్ఘకాలం తరువాత కాంగ్రెస్‌ను ఓడించి సిపిఎం విజయం సాధించింది. ఇక్కడ కూడా బిజెపికి మూడవ స్ధానమే. ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం ఉన్న గురువాయూర్‌లో యుడిఎఫ్‌ అభ్యర్ధి కెఎన్‌ఏ ఖాదర్‌ పోటీ చేశారు. అక్కడ బిజెపి నామినేషన్‌ చెల్లకపోవటంతో ఆయన విజయం సాధించాలని సురేష్‌ గోపి బహిరంగంగానే ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇక్కడ కూడా ఎల్‌డిఎఫ్‌ గెలిచింది. వైకోం మహదేవ దేవాలయం, శ్రీ కురుంబ భగవతి వంటి ప్రముఖ క్షేత్రాలలో కూడా ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించింది.
ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రలో భాగంగానే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ కాంగ్రెస్‌-బజెపిలతో చేతులు కలిపారని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ దేశాభిమాని పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.మతపరమైన చీలిక తెచ్చే విధంగా ఆయన ప్రకటనలు చేశారని విమర్శించారు. తాము ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకం కాదని తన మాటలను వక్రీకరించారని సుకుమారన్‌ నాయర్‌ ఆరోపించారు. అయితే నాయర్‌ చేసిన ప్రకటనను కాంగ్రెస్‌, బిజెపి సమర్ధించాయి.
కొన్ని సంస్ధలు ఎన్నికల అనంతరం జరిపిన సర్వేల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మతాలలో ఉన్న పేదలు, బడుగు జీవులు ఎల్‌డిఎఫ్‌కు ఓటు వేసినట్లు తేలింది. కొన్ని చోట్ల గతం కంటే ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారు ఎక్కువగా ఓటు చేశారు. వెనుకబడిన తరగతులు, దళితులు అత్యధికులు కమ్యూనిస్టులకు ఓటు వేశారు.

ఇరవైన విజయన్‌ ప్రమాణస్వీకారం !

రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ముగిసిన తరువాతనే ఈనెల 20న నూతన ప్రభుత్వం ఏర్పడ నుంది ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు పూర్తి స్ధాయి లాక్‌డౌన్‌ ప్రకటించారు. పదిహేడవ తేదీన ఎల్‌డిఎఫ్‌ సమావేశం పద్దెనిమిదిన సిపిఎం కార్యదర్శివర్గ సమావేశం, పందొమ్మిదవ తేదీన మంత్రివర్గ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రికి తీర్మానం అందచేత, ఇరవయ్యవ తేదీన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.ఈలోగా వివిధ పార్టీలకు కేటాయించే మంత్రుల సంఖ్య, శాఖల కేటాయింపులో మార్పుల గురించి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రద్దయిన మంత్రి వర్గంలో ముఖ్యమంత్రిగాక 19 మంది మంత్రులు ఉన్నారు. ఈ సారి ఒక ఎంఎల్‌ఏ ఉన్న పార్టీలకూ ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే మంత్రుల సంఖ్య 21కి పెరగవచ్చు.గతంలో యుడిఎఫ్‌ మంత్రివర్గంలో 21 మంది మంత్రులు ఉన్నారు.