Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తమ విజయం నల్లేర మీద బండి నడక మాదిరి అనుకుంటున్న బిజెపికి స్ధానిక సంస్దల ఎన్నికలు పెద్ద షాకిచ్చాయి.ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, హిందూత్వకు ప్రతీకగా చూపుతూ కూల్చివేసిన మసీదు స్ధానంలో నిర్మిస్తున్న రామాలయం ఉన్న అయోధ్య, ముఖ్యమంత్రి కోట అని చెబుతున్న గోరఖ్‌పూర్‌ వంటి చోట్ల బిజెపికి చావు దెబ్బలు తగలటం గమనించాల్సిన అంశం. రామాలయ నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, వారణాసి అభివృద్దికి పెద్ద పీటవేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అన్నింటికీ మించి ఇదే పరిస్దితి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతం అయితే భవిష్యత్‌లో ప్రధాని పదవి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న ఆదిత్యనాధ్‌ పరిస్దితి ఎలా ఉంటుందో తెలియదు.


మార్చి 14వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌ ప్రస్తుత విధాన సభ గడువు ముగియ నుంది. అందువలన ఆ లోగా ఎన్నికల జరగాల్సి ఉంది. గత నెలలో జరిగిన గ్రామీణ స్ధానిక సంస్ధల ఎన్నికలలో యోగి ఆదిత్యనాధ్‌ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగలటం కమలనాధులకు కంటి మీద కునుకు లేకుండా చేయటం ఖాయం. పార్టీ రహితంగా జరిగినప్పటికీ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించిన అభ్యర్ధుల తీరుతెన్నులు చూస్తే పార్టీల వారీగా జిల్లా పరిషత్‌ స్ధానాలలో సమాజవాద పార్టీ పెద్ద పార్టీగా వచ్చింది. పార్టీల కంటే స్వతంత్రులు ఎక్కువ మంది గెలిచారు. దీంతో సహజంగానే అధికార బిజెపి వారిని టోకుగా లేదా విడివిడిగా కొనుగోలు చేసి జిల్లా పరిషత్‌లలో తమకే మెజారిటీ అని చూపించుకొనే యత్నంలో ఉంది. దాని కంటే
7.32 లక్షల గ్రామ పంచాయతీల వార్డులు, 826 సమితులలో 75,852 స్ధానాలు, 75 జిల్లాల్లోని 3,121 జిల్లా పరిషత్‌ స్ధానాలు అంటే మొత్తం ఎనిమిది లక్షల స్దానాలకు 13లక్షల మంది అభ్యర్దులు పోటీ చేశారు. మిగిలిన పార్టీలకు భిన్నంగా బిజెపి ఏ ఏ స్దానాలలో ఎవరిని బలపరుస్తున్నదో జాబితా ప్రకటించింది. దాని ప్రకారం రెండువేలకు పైగా స్ధానాలలో అది ఓడిపోయింది. ఈ ఎన్నికలలో తమ సత్తా చాటేందుకు గాను జనవరిలోనే బిజెపి ఆరు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక మంత్రి, ఒక సీనియర్‌ నేతలను అధిపతులుగా నియమించింది. ముఖ్యమంత్రి యోగి, కేంద్ర పార్టీ పరిశీలకుడు రాధామోహన్‌ సింగ్‌ అనేక సమీక్షా సమావేశాలు జరిపారు. ఈ ఎన్నికలలో గెలిచిన వారు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్న షరతును పార్టీ విధించింది. ఇప్పుడు గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఉంటుందనే ఆశతో అనేక మంది ముందే రాజీనామాలు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.


రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్‌లలో మొత్తం 3,121 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. పార్టీల వారీ సమాజవాద పార్టీ 1000,బిజెపి 900, బిఎస్‌పి 320, కాంగ్రెస్‌ 270, ఆమ్‌ ఆద్మీ 70 మిగిలిన స్ధానాల్లో స్వతంత్రులు గెలిచినట్లు ఆ పార్టీలు ప్రకటించుకున్నాయి ( ఆయా పార్టీలు ప్రకటించుకున్న వివరాల మేరకు వివిధ పత్రికలలో వచ్చిన సంఖ్యలలో తేడాలు ఉన్నాయి. ఉదా కొన్ని పత్రికల్లో కాంగ్రెస్‌కు 72 మాత్రమే). గతంలో గ్రామీణ స్ధానిక సంస్దల ఎన్నికలలో బిజెపి పెద్ద శక్తి కాదు కనుక గత ఎన్నికలలో దాని తీరుతెన్నులు ఇతర పార్టీలతో పోల్చలేము. 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల బిజెపి ఫలితాలతో బిజెపి 2021 పనితీరును పోల్చాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రామాలయ భూమి పూజ జరిగిన ప్రాంతం అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ జిల్లాలో 43 సీట్లకు గాను సమాజవాది పార్టీ 24, బిజెపి 8, బిఎస్‌పి 4, స్వతంత్రులు ఆరుగురు గెలిచారు. అయోధ్య తరువాత దేశంలో చిచ్చుపెట్టేందుకు ఎంచుకున్న మధుర కృష్ణ జన్మభూమి వివాద జిల్లాలో 33కు గాను బిఎస్‌పి 13, బిజెపి 8 సీట్లు గెలుచుకుంది. రెండు సార్లు ప్రధాని నరేంద్రమోడీని గెలిపించిన వారణాసి జిల్లాలో 48 స్దానాలకు గాను సమాజవాద పార్టీ 15, బిఎస్‌పి, అది బలపరచిన స్వతంత్రులు 17, బిజెపికి 8 వచ్చాయి.


సమాజవాది పార్టీ విషయానికి వస్తే తమకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పటం తప్ప జాబితాను ప్రకటించలేదు. ఇతరులు ఎవరైనా తమతో కలసి వస్తే అవసరమైతే వారికి పార్టీ ముద్రవేసి బలపరిచేందుకు వీలుగా వ్యవహరిస్తున్నది. ఎన్ని సమితి, జిల్లా పరిషత్‌లను కైవశం చేసుకోవాలన్నదే ఇప్పుడు దాని లక్ష్యంగా ఉంది. తాము అధికారికంగా ప్రకటించిన అభ్యర్ధులతో పాటు గెలిచిన వారిలో తమ పార్టీకి చెందిన తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు బిజెపి చెప్పుకుంటోంది. పార్టీ రహితంగా గెలిచినందున ఫిరాయింపుల సమస్య ఉండదు కనుక ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకొనేందుకు ద్వారాలు తెరిచింది. బిఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తాయనేది రాజకీయంగా కీలకంగా మారింది.
వివిధ పత్రికలలో వస్తున్న వార్తల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కరోనా వ్యాపిస్తున్నది. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నా నమోదు కావటం లేదు. దక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక సమాచారం ప్రకారం మే 7వ తేదీ నాటికి ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం కేసులు 14,25,916 కాగా, మరణాలు 14,501 అంటే వందకు ఒక మరణం జరుగుతోంది. ఆదిత్యనాధ్‌ ఇటీవల కేరళ వెళ్లి తమ అభివృద్దిని చూసి నేర్చుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే. అక్కడ ఇటీవల కేసులు గణనీయంగా పెరిగినప్పటికీ మే 7 నాటికి వందకు మరణాలు 0.3 మాత్రమే. యోగి ఆదిత్యనాధ్‌ పలుకుబడి బాగా ఉన్న తూర్పు ఉత్తర ప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాలలో పరిస్ధితి దారుణంగా ఉందని వార్తలు వస్తున్నాయి.


ఇక రాజకీయాల విషయానికి వస్తే 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిఎస్‌పి ఒంటరిగా అన్ని స్ధానాలకు పోటీ చేయగా సమాజవాది పార్టీ 298, దానితో కలసిన కాంగ్రెస్‌ 105 చోట్ల పోటీ చేసింది. రెండేళ్ల తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పి, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా కాంగ్రెస్‌ విడిగా పోటీ చేశాయి.ఓటింగ్‌ను చూస్తే ఎస్‌పి-బిఎస్‌పి కుడి ఎడమలుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత బిఎస్‌పి అనేక కీలక సమస్యల మీద బిజెపికి మద్దతు ఇచ్చి దానికి దగ్గరైందనే అభిప్రాయం కలిగే విధంగా వ్యవహరించింది. అందుకే బిజెపి బీ టీమ్‌ బిఎస్‌పి అని ప్రియాంక గాంధీ వర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో సమాజవాది పార్టీతో పోలిస్తే బిఎస్‌పికి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ రాబోయే రోజుల్లో రాజకీయ అవసరాల కోసం ఫలితాల గురించి ఎస్‌పి ఆచితూచి వ్యాఖ్యానిస్తోంది.


వివిధ పార్టీల బలాబలాలకు సంబంధించి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వివరాలను చూద్దాం. 2017అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 384 స్ధానాల్లో దాని మిత్ర పక్షాలు 19 స్ధానాల్లో పోటీ చేశాయి.బిజెపికి 39.67శాతం, మిత్రపక్షాలకు 1.7శాతం వచ్చాయి. సమాజవాది పార్టీ పోటీ చేసిన 298 స్దానాల్లో 21.82, బిఎస్‌పి అన్ని చోట్లా 403 పోటీ చేసి 22.23శాతం తెచ్చుకుంది. సమాజవాది పార్టీతో సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌కు 105 స్దానాల్లో 6.25శాతం వచ్చాయి. ప్రతిపక్ష పార్టీల ఓట్ల చీలిక బిజెపికి 312 సీట్లు తెచ్చిపెట్టింది.యాభైశాతం పైగా ఓట్లు తెచ్చుకున్న పార్టీలకు వచ్చింది 73 మాత్రమే. తరువాత 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కూటమికి 51.19శాతం ఓట్లు 80కి గాను 69 సీట్లు వచ్చాయి. ఓట్లు పెరిగినా అంతకు ముందుతో పోలిస్తే 9 సీట్లు తగ్గాయి. ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 39.23శాతం ఓట్లు 15 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్‌కు 6.41శాతం ఓట్లు ఒక సీటు వచ్చింది.


అయోధ్యలో రామాలయ నిర్మాణ వాగ్దానం నెరవేర్చామని చెప్పుకుంటూ యోగి మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తారని కలలు కంటున్నవారికి స్ధానిక సంస్ధల ఫలితాలు షాక్‌ వంటివే. ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పడిన కారణంగానే తాజా ఎన్నికలలో బిజెపి అనేక చోట్ల ఓడిపోయిందని వార్తలు వచ్చాయి. కరోనా నిర్లక్ష్యంతో జరిగే పరిణామాలు రాబోయే రోజుల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు.