Tags
Anti China Media, Corona vaccine, Fuel Price in India, Joe Biden, Narendra Modi Failures, Saudi Arabia
ఎం కోటేశ్వరరావు
దేశంలో, మన చుట్టుపట్ల, ప్రపంచంలో ఏం జరుగుతోంది ? అన్నింటినీ ఒకేసారి చూడలేం. ఆలోచనలను రేకెత్తిస్తున్న కొన్ని అంశాలను చూద్దాం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. స్వతంత్ర భారతచరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధాన అభిశంసనకు గురైందంటే అతిశయోక్తి కాదు. పేరు పెట్టి మందలించకపోవచ్చు, కొన్ని హైకోర్టుల మాదిరి తీవ్ర వ్యాఖ్యలు చేయకపోవచ్చు గానీ తీసుకున్న చర్య చెంప పెట్టువంటిది. ఆక్సిజన్, కరోనా సంబంధిత సమస్యను గతనెలలో సుప్రీం కోర్టు తనంతట తానుగా విచారణకు చేపట్టినపుడే నరేంద్రమోడీ సర్కార్ మొద్దు నిద్రను వీడి తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది. అదేమీ లేకపోగా తన చర్యలను సమర్ధించుకొనేందుకు పూనుకుంది. రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపు విషయంలో ప్రభుత్వం సూచించిన విధానాన్ని తోసి పుచ్చి శాస్త్రీయ పద్దతిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ కేటాయింపులకు ఒక కార్యాచరణ కమిటీని ఆరునెలల కాలానికి సుప్రీం కోర్టు నిర్ణయించటం నరేంద్రమోడీ సర్కార్‌ను అభిశంచించటం గాక మరేమనాలి ? వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేస్తున్న వ్యాఖ్యల నేపధ్యంలో సుప్రీం కోర్టు తగినంత గడువు ఇచ్చినప్పటికీ సంతృప్తికరమైన విధానాన్ని కేంద్రం రూపొందించలేకపోయింది. దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది అని చెప్పిన వారు ఇప్పుడు ఏమంటారో తెలియదు. చెడు వినను, చెడు కనను, చెడు చెప్పను అన్న మూడు కోతుల బొమ్మలను చాలా మంది చూసే ఉంటారు. చెప్పింది చేయను, జరుగుతున్నది చూడను, నోరు విప్పను అన్నట్లుగా కేంద్ర పాలకుల వ్యవహారం ఉంది.
సురక్షితమైన చేతుల్లో జనం అంటే ఇదేనా ?
ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర పాకేజ్ ప్రకటించామని ఎంత ప్రచారం చేసుకున్నారో తెలిసిందే. వాక్సినేషన్లకు 35వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. ఆ సొమ్ముతో రెండువందల కోట్ల వాక్సిన్ డోసులు కొనుగోలు చేయవచ్చు. వంద కోట్ల మందికి వేయవచ్చు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోకుండా 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే తాము వేస్తామని, మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఎవరికి వారు స్వంత ఖర్చుతో వేయించుకోవాలని చెబుతోంది. చిన్న వయసు వారికి కూడా కరోనా సోకుతున్నందున అందరికీ వాక్సిన్ వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఖర్చుకు వెనకాడాల్సిన సమయమా ఇది. అందులోనూ దేశ రక్షకులమని తమకు కితాబు ఇచ్చుకుంటున్న వారు. పోనీ వాక్సిన్లు అందుబాటులోకి తెచ్చే చర్యలేమైనా తీసుకుందా అంటే అదీ లేదు. కోవాగ్జిన్, కోవీషీల్డ్ రెండింటిని అత్యవసర వినియోగ ప్రాతిపదిక మీదనే అనుమతి ఇచ్చారు. రష్యా స్పుత్నిక్కుకు కూడా అదే పద్దతిలో అనుమతి ఇచ్చి ఉంటే ఈ పాటికి అది కూడా ఉత్పత్తిలోకి వచ్చి ఉండేది. రెండు కార్పొరేట్ సంస్ధలకు వచ్చే లాభాలు, వాటి నుంచి అందే నిధుల గురించే ఆలోచించారని జనం అభిప్రాయం పడితే తప్పు పట్టగలమా ? తాజాగా చైనా వాక్సిన్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్ద అనుమతి ఇచ్చింది. దాన్నైనా అనుమతిస్తారా లేక పంతానికి పోయి జనం ప్రాణాలను ఫణంగా పెడతారా ? అనుమతిస్తే చైనా కంపెనీ అనుబంధ సంస్ధ హైదరాబాద్‌లోని గ్లాండ్ ఫార్మాలో వెంటనే తయారీ మొదలు పెట్టవచ్చు.
బాధ్యతల నుంచి వైదొలగిన మోడీ సర్కార్ !
గత ఏడాది రాష్ట్రాలతో సంప్రదించకుండా, జనం స్వస్ధలాలకు చేరే అవకాశం ఇవ్వకుండా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఆకస్మికంగా ప్రకటించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపట్టాయి తప్ప లాక్‌డౌన్ను వ్యతిరేకించలేదు.ఈ సారి లాక్‌డౌన్ విధించాలా లేదా అన్న నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదలివేస్తున్నట్లు ప్రకటించి ఎంతో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. అసలు విషయం ఏమంటే కేంద్రం బాధ్యతలను వదలించుకోవటమే. ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న రాష్ట్రాలు వాక్సిన్ ఉచితంగా వేసేందుకు నిర్ణయించాయి. లాక్‌డౌన్ లేదా అలాంటి చర్యలు తీసుకుంటే ఉపాధి కోల్పోతున్న వారికి సాయం చేసే స్ధితిలో రాష్ట్రాల ఆర్ధిక స్ధితిలేదు. కేంద్రం నుంచి ఇంతవరకు ప్రత్యేకమైన చర్యలు ఏమీ లేవు. ఐదేసి కిలోల బియ్యం ఇస్తే సరిపోతాయా ? కేరళలో 17 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన ఆహారకిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తే అదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, ఎన్నికల కోసం అని కాంగ్రెస్, బిజెపి ప్రచారం చేశాయి. ఓటర్లు వాటికి చెప్పాల్సిన బుద్ది చెప్పారు. ప్రభుత్వం సాయం అందని వారు ఆరుశాతం మందే అని ఎన్నికల తరువాత జరిగిన ఒక సర్వేలో తేలింది. కేరళ ఇప్పుడు కూడా అదే కిట్‌ను అందిస్తున్నది, లాక్‌డౌన్ ప్రకటించినందున సామూహిక వంటశాలలను ప్రారంభించి అవసరమైన వారికి ఆహారం సరఫరా చేస్తున్నది. అలాంటి చర్యలను ఏ బిజెపి లేదా కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల పాలిత ప్రభుత్వాలలో అయినా అమలు జరుపుతున్నారా ?
రచ్చ చేసిన మీడియా ఎందుకు మౌనం దాల్చినట్లు ?
చైనా వస్తువుల కొనుగోలు గురించి గత ఏడాది కాషాయ దళాలు, వాటికి వంత పాడి రేటింగ్ పెంచుకున్న టీవీ ఛానళ్లు, పత్రికలు ఎంత రచ్చ చేశాయో చూశాము. ఇరుగు పొరుగుదేశాలతో సమస్యలు వస్తాయి, వాటిని పరిష్కరించుకొనేందుకు చూడాలి గానీ శాశ్వతవైరంతో వ్యహరిస్తే ఉభయులకూ నష్టమే. బలహీనులకు మరింత నష్టం.మన దేశంలో కరోనా పెరిగిన కారణంగా చివరికి తమ పౌరులు స్వదేశానికి వచ్చినా జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఎదుటి వారు మంచి పని చేసినప్పటికీ ఎవరికైనా ఇష్టం లేకపోతే మౌనంగా ఉండటం ఒక పద్దతి. కానీ ఇష్టంలేని వారు చేసే ప్రతిదానిని బూతద్దంలో చూపి దాడి చేసేందుకు పూనుకునే వారిని ఏమనాలి ? కరోనా కారణంగా చైనా ప్రభుత్వరంగ విమానయాన సంస్ద మన దేశానికి తాత్కాలికంగా వాణిజ్య విమానాల నిలిపివేత ప్రకటన చేయగానే ఇంకేముంది చైనా మనకు వెన్ను పోటు పొడిచింది అని టీవీ చానల్స్ నానా యాగీ చేశాయి. కానీ అదే చైనా గురించి ఇప్పుడు మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏమన్నారు.” మా దేశానికి చెందిన అనేక కంపెనీలు చైనా నుంచి వస్తువుల కొనుగోలుకు ఆర్డర్లు పెడుతున్నాయి. రవాణాలో మేము సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిని పరిశీలించి తగుచర్యలు తీసుకొంటే మేము శ్లాఘిస్తాము ” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇతో మాట్లాడారు.” మా సంభాషణ తరువాత పని జరిగింది. మన విమాన సంస్దలు కొన్నింటికి వెంటనే అనుమతులు వచ్చాయి.రవాణా జరుగుతోంది, అదెంతో శ్లాఘనీయం ” అని చెప్పారు. ఇప్పుడు యాగీ చేసిన ఛానల్స్ ఏమంటాయి ? అసలేమీ జరగనట్లు మౌనంగా ఉన్నాయా లేదా ?
భారత ఆర్డర్లతో చైనా కంపెనీల లాభాలు – భావ స్వేచ్చ సమస్య !
చైనా వస్తువులు, వాటి నాణ్యత గురించి ఏదేదో మాట్లాడిన వారు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు. రికార్డు స్ధాయిలో మన దేశానికి చెందిన కంపెనీలు, ఏప్రిల్, మే మాసాల్లో చైనా వస్తువుల దిగుమతికి ఆర్డర్లు పెట్టాయి. ఏప్రిల్ ఆఖరు నాటికి 40వేల ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లకు అర్డరు పెట్టారు, వాటిలో 21వేలు వచ్చాయి. ఐదువేల వెంటిలేటర్లు, 2.1కోటి ముఖ తొడుగులు(మాస్క్‌లు),3,800 టన్నుల ఔషధాలకు ఆర్డర్లు పెట్టినట్లు చైనా కస్టమ్స్ వివరాలు తెలుపుతున్నాయి( ది హిందూ మే 9, 2021) మన దేశ ఆర్డర్ల కారణంగా చైనా కంపెనీల అమ్మకాలు, లాభాలు విపరీతంగా పెరిగాయి.
చైనాలో భావ ప్రకటనా స్వేచ్చ లేదనే ప్రచారం గురించి తెలిసిందే. అది నాణానికి ఒక వైపు మాత్రమే. సోషలిజం, కమ్యూనిజాలకు, దానికొరకు పనిచేసే రాజ్యాంగానికి దాన్ని అమలు జరిపే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రచారానికి స్వేచ్చ లేదు. ఆ మాటకు వస్తే మన దేశంలో గానీ మరొక కమ్యూనిస్టేతర దేశంలో గానీ ఎవరైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే స్వేచ్చ ఉందా ? అలాంటి వారిని శిక్షించకుండా వదులుతారా ? రాజ్యాంగపరిధిలో అనుమతించిన స్వేచ్చ మేరకు మాట్లాడితేనే దేశద్రోహులుగా మనదేశంలో చిత్రిస్తున్న విషయం దాస్తే దాగుతుందా ? ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగమైన చట్ట అమలు కమిటీ ట్విటర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ వెలువడింది. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. వివాదాస్పదమైన ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించారు. దాని గురించి కూడా మన మీడియాలో వార్తలు వచ్చాయి.(అలాంటి అవాంఛనీయమైన ట్వీట్లను మన కాషాయ దళాలు ఎన్ని తొలగించాయో వారే చెప్పాలి ) ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది ? రెండు ఫొటోలు పెట్టారు. ఒకటి నింగిలోకి దూసుకుపోతున్న చైనా రాకెట్, మరొకటి మన దేశంలోని శ్మశానంలో చితిమంటల చిత్రం. వాటి కింద చైనా వెలిగిస్తున్న మంటలు-భారత్ వెలిగిస్తున్న మంటలు అని వ్యాఖ్యానించారు.ఒక దేశంలోని విపత్తును అలా పోల్చటం తగిన చర్య కాదు, తప్పు పట్టాల్సిందే. ఒక వ్యక్తి లేదా ఆ విభాగాన్ని చూస్తున్న కొందరు వ్యక్తులు అనాలోచితంగా పెట్టినప్పటికీ దాన్ని యావత్ కమ్యూనిస్టు పార్టీకి అంట గట్టారు. కానీ ఆ ట్వీట్ మీద చైనా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున విమర్శలు-ప్రశంసలు వెలువడ్డాయి. అక్కడ స్వేచ్చ లేకపోతే ఆ చర్చ ఎలా జరిగినట్లు ? ఆ ట్వీట్‌ను గ్లోబల్‌టైమ్స్ పత్రిక సంపాదకుడు గ్జీ జిన్ విమర్శించినందుకు పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడ్డారు.ఆ ట్వీట్‌ను విమర్శించటంతో పాటు భారత్‌కు చైనా స్నేహ హస్తం అందిస్తున్నప్పటికీ భారత్ ద్వేషంతో, సంకుచితంగా వ్యవహరిస్తోంది, అయినప్పటికీ సాయం చేయాల్సిందే అని సంపాదకుడు పేర్కొన్నారు.గ్జీ విమర్శపై ధ్వజమెత్తిన షాంఘైలోని పుడాన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ షెన్ ఇ తొలగించిన ట్వీట్‌ను సమర్దించాడు. భారత్‌కు సానుభూతి చూపినందువలన సానుకూల ఫలితం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించాడు. నెటిజన్లు గ్జీ-షెన్ వర్గాలుగా చీలిపోయినట్లు కొందరు వ్యాఖ్యానించారు.దీని గురించి అమెరికా అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ రాసింది.
చమురు ధరలపై జనం ఊహించిందే జరిగింది !
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత చమురు ధరలు పెరుగుతాయని జనం సరిగానే ఎంతగా అంటే పగలు తరువాత రాత్రి వస్తుందన్నంత కచ్చితంగా ఊహించారు. అదే జరుగుతోంది. చలికాలంలో గిరాకీ ఉంటుంది కనుక అది ముగిసిన తరువాత చమురు ధరలు తగ్గుతాయని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 26న చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కనుక ధరలు స్ధిరంగా ఉండి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పెరుగుతున్నాయి. ఓట్ల కోసం అలాంటి పనులు బిజెపి చేయదు అని మరో వైపు ఆ పార్టీ నేతల డాంబికాలను జనం చూశారు. వేసవిలో జనాలు ఎక్కువగా తిరుగుతారు కనుక గిరాకీ పెరిగి వర్షాకాలం నాటికి ఎవరి పనుల్లో వారుంటారు గనుక ధరలు తగ్గుతాయని మంత్రిగారు చెబుతారేమో చూడాలి. పెట్రోలియం ప్లానింగ్ మరియు అనాలసిస్ విభాగం ప్రకటించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో మన దేశం దిగుమతి చేసుకొన్న ముడిచమురు పీపా సగటు ధర 61.22 డాలర్లు, మార్చినెలలో 64.73, ఏప్రిల్ నెలలో 63.40 డాలర్లు ఉంది. చైనా వస్తువుల కొనుగోలును ఆపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పినట్లుగా మనం దిగుమతి చేసుకొనే దేశం కనుక దాన్ని ఆయుధంగా చేసుకొని ఒపెక్ దేశాలకు బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే అవి దిగివచ్చి ధరలు తగ్గిస్తాయని మంత్రిగారు సెలవిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు అమెరికా నుంచి కొనుగోళ్లు పెంచాం గాని ధరలు దిగిరాలేదు. ఏ దేశమూ మన కాళ్ల దగ్గరకు రాలేదు-వృతం చెడ్డా ఫలం దక్కలేదు.
అడుసు తొక్కనేల – కాలు కడగనేల !
ఇప్పుడు ఏమైంది ? మన బెదిరింపులు, చమురు కొనుగోలు తగ్గింపు వంటి చర్యలను మనసులో పెట్టుకోకుండా మనకు అవసరమైన ద్రవరూప ఆక్సిజన్ను ఆరునెలల పాటు సరఫరా చేసేందుకు సౌదీ, యుయేఇ, కతార్ దేశాల ప్రభుత్వాలు కంటెయినర్లలో సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి.అమెరికా నుంచి అలాంటిది రాలేదు.ప్రభుత్వరంగ చమురు కంపెనీలు సౌదీ నుంచి కొనుగోళ్లు తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా పూర్వం మాదిరే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా మబ్బులను చూసి గల్ఫ్ దేశాల చమురు ముంతలను వలకపోసుకుంటే ఏమౌంతుందో మోడీ సర్కార్‌కు తెలిసివచ్చింది. ఇంతేనా, కాదు గత ఏడాది కాలంలో జరిగిన పరిణమాలను చూస్తే మన విదేశాంగ విధానం ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికైనా ఇరాన్ నుంచి చమురు కొనుగోలును కేంద్రం ప్రారంభిస్తుందా ?
మనం సౌదీని బెదిరించిన సమయంలోనే సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ అరామ్‌కో ఒకశాతం వాటాను చైనా పెట్టుబడి-చమురు కంపెనీలకు విక్రయించే చర్చలు మరింత పురోగమించాయని వార్తలు.సౌదీ-అమెరికా ప్రభుత్వం మధ్య సంబంధాల గురించి 1945లో ఒక ఒప్పందం కుదిరింది. దాని నిబంధనలు, స్ఫూర్తికి మరింత దూరం జరిగి సౌదీ అరేబియా వాటా అమ్మకం గురించి చర్చలు జరుపుతోందన్నదే కీలక అంశం.ఈ పరిణామం ఒక అడుగు అమెరికాకు దూరం చైనాకు దగ్గర కావటంగా చెబుతున్నారు. అమెరికాను వెనక్కు నెట్టేసి 2030 నాటికి అతి పెద్ద ఆర్ధిక వ్యవస్దగా చైనా అవతరించనుందనే అంచనాలు తెలిసిందే. అరామ్‌కో కంపెనీ వాటాలను చైనా కొనటం గురించి జరిగే చర్చలు కొత్తవేమీ కాదు. గత ఏడాది తప్ప అంతకు ముందు మూడు సంవత్సరాలలో దీని గురించి చర్చలు జరిగాయి. గత కొద్ది సంవత్సరాల పరిణామాలను చూస్తే సౌదీ – అమెరికా సంబంధాలలో ముద్దులాట-దెబ్బలాట తీరుతెన్నులు కనిపిస్తాయి. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై 2011 సెప్టెంబరులో జరిగిన దాడికి సౌదీ మద్దతు ఉందన్న దగ్గర నుంచి అనేక పరిణామాల నేపధ్యంలో అమెరికాలో సౌదీ గురించి ప్రతికూల భావాలు పెరిగాయి.ఈ కారణంగానే అమెరికా,బ్రిటన్ స్టాక్ ఎక్సేంజ్‌లలో అరామ్‌కో కంపెనీ వాటాల లావాదేవీలకు అనుమతి ఇవ్వలేదు. ఈ వైఖరి కూడా చైనాకు వాటాలను అమ్మేందుకు సౌదీని పురికొల్పిందని చెబుతున్నారు. ఈ ఒప్పంద వివరాలు అన్నీ రహస్యమే. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా తన కరెన్సీ డాలరుతో ప్రపంచంపై పెత్తనం చేస్తోంది. గతేడాది పెద్ద మొత్తంలో సౌదీ నుంచి చైనా చమురు కొనుగోలు చేసింది. ఆ లావాదేవీలలో డాలర్లకు బదులు తమ కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్)ను స్వీకరించాలని చైనా చేసిన ప్రతిపాదనకు సౌదీ అంగీకరిందని చెబుతున్నారు. ఇది అమెరికాకు ఆగ్రహం తెప్పించే చర్య. దాని పర్యవసానాలను అంచనా వేస్తున్నందున ఇవేవీ ఇంకా ఖరారు కాలేదు. ఇదే జరిగితే అనేక దేశాలు డాలర్లను పక్కన పెట్టి యువాన్లవైపు మళ్లుతాయని, తమ పలుకుబడికి దెబ్బ అన్నది అమెరికా భయం. ఇప్పటికే ఎస్‌డిఆర్ ఆస్ధులలో చైనా కరెన్సీని 2016లో చేర్చారు. దాని కొనసాగింపుగా డాలరు బదులు మరొక కరెన్సీని రిజర్వుగా ఉంచాలన్నది ఆలోచన. ఆర్ధికంగా చైనా అగ్రరాజ్యంగా మారనున్నందున దాని కరెన్సీ అవుతుందని మిగతా దేశాల భయం. అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో తాము డాలర్లకు బదులు మరొక కరెన్సీని ఉపయోగంచక తప్పదని రష్యా హెచ్చరిస్తున్నది. ఇరాన్, వెనెజులా, రష్యా వంటి చమురు ఎగుమతి దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తున్నది, అందువలన వాటికి డాలర్ బదులు మరొక ప్రత్యామ్నాయ కరెన్సీ అవసరం కనుక చైనా కరెన్సీ వైపు చూస్తున్నాయి.
సౌదీ అరేబియాను కూడా దూరం చేసుకుంటున్నామా ?
అరామ్‌కో కంపెనీలో ఒక శాతం వాటాను 19 బిలియన్ డాలర్లకు చైనా కొనుగోలు చేయనున్నదని వార్తలు వచ్చాయి. అంతే కాదు రెండు దేశాలు సంయుక్తంగా చెరిసగం వాటాలతో 20 బిలియన్ల డాలర్లతో పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయాలని కూడా సూత్ర ప్రాయంగా నిర్ణయించాయి. గత నాలుగు సంవత్సరాలలో వివిధ రంగాలలో వాణిజ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. అరామ్‌కోలో చైనా వాటా కొనుగోలు చేస్తే దాని ప్రభావం, పర్యవసానాలు మన దేశం మీద ఎలా ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. గతంతో పోలిస్తే సౌదీ నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించినప్పటికీ గణనీయంగానే కొంటున్నాము. అయితే చైనాతో సౌదీ ఒప్పందాలు చేసుకొని సంబంధాలు పెంచుకుంటే మన దేశంతో జరిగే వాణిజ్యం మీద దాని ప్రభావం పడుతుంది. మన ఎగుమతులు తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అంతే కాదు రాజకీయంగా కీలకమైన ప్రాంతంలో చైనా మరొక మంచి మిత్రదేశాన్ని సంపాదించుకుంటుంది. సౌదీ మన దేశంతో కూడా పెట్టుబడుల గురించి సంప్రదింపులు జరిపింది. రిలయన్స్ ఇండిస్టీస్‌లో పెట్రోకెమికల్స్ వాణిజ్యంలో 20శాతం వాటా తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్ధలతో కలసి చమురుశుద్ధి మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. తరువాత ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల చమురు ధరలను పెంచటంతో సౌదీపై చమురు దిగుమతి ఆయుధాన్ని వినియోగిస్తామని మన చమురుశాఖ మంత్రి చేసిన బెదిరింపు అందుకు నిదర్శనం. గతేడాది చౌకగా కొనుగోలు చేసి నిల్వచేసుకున్న చమురును వినియోగించుకోండని సౌదీ మంత్రి తిప్పికొట్టారు. చైనాలో పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలలో నియంత్రణలు ఎత్తివేస్తున్న కారణంగా అక్కడ చమురు డిమాండ్ పెరుగుతున్నదని ఇప్పుడున్న 68 డాలర్ల రేటు 80వరకు పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మన పరిస్ధితి ఏమిటి ? మే నెలలో 0.40 డాలర్లు పెంచిన సౌదీ అరేబియా జూన్ మాసంలో సరఫరా చేసే చమురుకు గాను ఆసియా దేశాలకు పీపాకు 0.28 డాలర్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. దీని వలన వినియోగదారులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. గతేడాది డిసెంబరులో కూడా ఇదే విధంగా తగ్గించింది. నరేంద్రమోడీ కోరిన కారణంగానే తగ్గించినట్లు కాషాయ దళాలు ప్రచారం చేశాయి.
చైనా సంగతి పక్కన పెట్టండి అమెరికా పద్దతయినా అనుసరిస్తారా !
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు, దానిలో భాగంగా ఉపాధి కల్పించేందుకు రెండు లక్షల కోట్ల డాలర్లను ( మన రూపాయల్లో 146లక్షల కోట్లు ) ఖర్చు చేయాలని అమెరికాలో జోబైడెన్ సర్కార్ నిర్ణయించింది. ఈ పనుల్లో రోడ్లు, విద్యుత్ వాహన స్టేషన్ల మరమ్మతులు, ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూలు భవనాల నిర్మాణం, మరమ్మతులు,అల్పాదాయ వర్గాల, వృద్దుల ఇండ్ల నిర్మాణం, ఇంటర్నెట్ వేగం పెంపుదల వ్యవస్ధలు, ఇలా శాశ్వత వనరులను సమకూర్చటంతో పాటు ఉపాధికల్పించే పనులు ఈ మొత్తంతో చేపట్టనున్నారు. దీన్నుంచి పరిశోధన-అభివృద్ధికి కూడా ఖర్చు చేస్తారు. దీనికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రజల మీద పన్నులు విధింపునకు బదులు కార్పొరేట్ సంస్దల పన్ను పెంచాలని బైడెన్ నిర్ణయించారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ కార్పొరేట్లకు పన్ను తగ్గించారు.కనీస కార్పొరేట్ పన్ను 21శాతానికి పెంచటంతో పాటు గరిష్టంగా 28శాతం విధించి నిధులు సమకూర్చి పైన పేర్కొన్న పనులను చేపడతారు. కార్పొరేట్ కంపెనీలు పన్నులు ఎగవేసేందుకు పెట్టుబడులు, లాభాలను పన్ను స్వర్గాలకు తరలించకుండా మేడ్ ఇన్ అమెరికా టాక్స్ పధకం పేరుతో స్వదేశంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే సంస్ధలకు పన్ను రాయితీలను ప్రోత్సాహంగా ప్రకటించనున్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెడితే తొలి పదిశాతం ఆదాయంపై పన్నులు చెల్లించనవసరం లేదన్న నిబంధనను ఎత్తివేయనున్నారు.
ఉపాధి పెంచే పేరుతో మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో రాయితీలుఇచ్చింది. కరోనా కాలంలో సామాన్య జనం దివాలా తీస్తే కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, బిలియనీర్లు కూడా పెరిగారు. వారు పెట్టుబడులు పెట్టకుండా తమ మూటలను అలాగే ఉంచారు. కనీసం కరోనా వాక్సిన్లు, వ్యాధి గ్రస్తుల వైద్య ఖర్చులకు అయినా కార్పొరేట్ల నుంచి తాత్కాలికంగా అయినా పన్ను రేటు పెంచి నిధులు సేకరించి దేశంలో ఖర్చు చేయవచ్చు. అలాంటి ప్రయత్నాలు గానీ ఆలోచనలు గానీ లేవు. అమెరికా మాదిరి అనేక ఐరోపా దేశాలలో ఇలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది గీటు రాయి అన్న సామెత మాదిరి వ్యవస్ధ ఏదనికాదు. కమ్యూనిస్టు చైనా మాదిరి మన దేశాన్ని కూడా ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామంటూ ఆర్ధిక సర్వేల్లో పుంఖాను పుంఖాలుగా రాసుకున్నాం. కమ్యూనిస్టు చైనాను పక్కన పెట్టండి కాపిటలిస్టు అమెరికా, ఐరోపా దేశాల పద్దతి అయినా అనుసరిస్తారా ? అసలు జనం కోసం పని చేస్తారా ? వట్టిస్తరి మంచి నీళ్ల ఆత్మనిర్భరతోనే సరిపెడతారా !