ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్ పుట్టుక గురించి తేలక ప్రపంచం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవైపు శాస్త్రవేత్తలు దాన్ని నివారించేందుకు యుద్దంతో పాటు, గుట్టు విప్పేందుకు భాష, ప్రాంతీయ తేడాలు లేకుండా శ్రమిస్తున్నారు. మరోవైపు మీడియా సంచలన కథనాలతో జనం మెదళ్లను ఖరాబు చేస్తోంది. దున్న ఈనిందనగానే దూడను గాటన కట్టివేయమన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. తాజాగా వెలువడిన ఆస్ట్రేలియన్ కధనాన్ని తెలుగు మీడియా కూడా సొమ్ము చేసుకుంది. కష్టకాలంలో ఉన్నపుడు కుట్ర సిద్దాంతాలకు జనం త్వరగా ఆకర్షితులౌతారు. మూడవ ప్రపంచ యుద్దం వస్తే అది జీవ ఆయుధాలతోనే జరుగుతుందని అందుకోసం వాటిని తయారు చేయటం గురించి చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు చేసిన సమాలోచనల 2015 నాటి రహస్య పత్రం తమకు దొరికిందంటూ ”ది ఆస్ట్రేలియన్ ” అనే పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.
జీవ ఆయుధాలకు సంబంధించిన కట్టుకథలు-పిట్టకథలతో పాటు వాస్తవాలు కూడా జనానికి అందుబాటులో ఉన్నాయి. కావాల్సింది కాస్త ఓపికగా తెలుసుకోవటమే. బ్రిటన్‌లోని సన్ పత్రిక పేర్కొన్నదాని ప్రకారం అమెరికా విదేశాంగ శాఖ నుంచి పత్రాలు తీసుకొని ఆస్ట్రేలియన్ చైనా జీవ ఆయుధ పరిశోధన కథ రాసింది. కోవిడ్-19 మూలాలను శోధించే క్రమంలో మిలిటరీ మరియు చైనా ప్రజారోగ్య అధికారులు రాసిన పత్రాలు తమకు దొరికాయని అమెరికా అధికారులు చెప్పారట. అమెరికా వైమానిక దళ కల్నల్ మైఖేల్ జె కఫ్ మూడవ ప్రపంచ యుద్దం జీవాయుధాలతో జరుగుతుందని చెప్పిన విశ్లేషణను పరిగణనలోకి తీసుకొని చైనా శాస్త్రవేత్తలు సార్స్ వైరస్‌తో జీవ ఆయుధాన్ని తయారు చేయటం గురించి చర్చించారట.2003లో చైనాలో సార్స్ వైరస్ వ్యాపించింది.
ఆస్ట్రేలియన్ పత్రిక కధనం చదివిన వారందరూ దాని మీద చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. పత్రిక పేర్కొన్న పత్రాలు నకిలీవి కాదని ఇంటర్నెట్ నిపుణులు చెప్పేశారు. రాజకీయ నేతలు గళం విప్పేశారు. మరికొందరు తెలివి తేటలు ఎక్కువగా ఉన్న వారు కరోనా వైరస్ మానవ కల్పితం అని చెప్పేందుకు, కావాలని చైనా బయటకు వదిలిందనేందుకూ ఆధారం లేదని చెబుతూనే ఊహాన్ రహస్య పరిశోధనాశాల నుంచి తప్పించుకొని వచ్చి ఉండవచ్చనే ఆనుమానాలను చొప్పిస్తున్నారు. అసలింతకీ ఆస్ట్రేలియన్ కధనానికి ఆధారం ఏమిటి ?
ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. దానిలో రహస్యాలు, కుట్ర ఆలోచనలు ఉంటే చైనా సర్కార్ అనుమతిస్తుందా ? అమెరికా విదేశాంగశాఖ పుస్తకంలోని అంశాలను రహస్య పత్రాలని చెప్పటం వాటిని గుడ్డిగా ఆస్ట్రేలియన్ పత్రిక సంపాదకులు నమ్మి నిజమే అని ప్రచురించారని అనుకోజాలం. అంత రహస్యం అయితే అమెరికా అధికారులు తమ పత్రికలకు ఇవ్వకుండా ఆస్ట్రేలియా పత్రికను ఎంచుకోవటం ఏమిటి ? అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయంలో అది భాగస్వామి, అమెరికా పెట్టిన చిచ్చుకారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యపోరు సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాతో వాణిజ్య చర్చలను నిరవధికంగా వాయిదా వేసినట్లు చైనా ప్రకటించిన నేపధ్యంలోనే ఈ వార్తలు వెలువడ్డాయి. అంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, ఆస్ట్రేలియా భుజం మీద నుంచి తుపాకి కాల్చే అమెరికా ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. పధకం ప్రకారం రాసే పత్రికల నుంచి జర్నలిస్టు ప్రమాణాలను ఆశించలేము. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడించారన్నట్లుగా చైనా ప్రచురించిన పుస్తకంలోని అంశాలకు వక్రభాష్యాలు చెప్పి రాసిన కధనం అన్నది స్పష్టం. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్ (ఇది కూడా కరోనా వైరస్ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్, హునాన్ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు. ఇన్ని అంశాలుండగా వాటన్నింటినీ పక్కన పెట్టి చైనా శాస్త్రవేత్తలు చైనాలో సార్స్ నుంచి జీవ ఆయుధాల గురించి చర్చ చేశారంటూ ఆస్ట్రేలియన్ వర్ణించింది.
బిల్ మరియు మెలిందా గేట్స్ ఫౌండేషన్ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్ గేట్స్ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పారు.భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. బిల్‌గేట్స్ వ్యాఖ్యల మీద మీడియా ఎలా స్పందించిందో ఎవరికి వారు పరిశీలించుకోవచ్చు. 2015లో బిల్ గేట్స్ టెడ్ టాక్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్ గేట్స్ మాటలను బట్టి గేట్స్ అప్పటికే మైక్రోచిప్ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు. ఆస్ట్రేలియన్‌కు, అమెరికాకు దీనిలో ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదా ?
వాక్సిన్లు మేధోసంపత్తి హక్కుకు సంబంధించినవి కాదు, లేదా ఖాళీగా పడి ఉన్న వాక్సిన్ కర్మాగారమూ కాదు. నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ చెప్పాడు. ప్రపంచ వ్యాపితంగా తక్కువ ఖర్చుతో కరోనా వాక్సిన్లు వేయాల్సిన అవసరం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ద, ఇతర నిపుణులు సూచించినందున దాన్ని సొమ్ము చేసుకోవాలని కార్పొరేట్లు నిర్ణయించాయి. అనేక కంపెనీలలో వాటాదారుగా ఉన్న బిల్‌గేట్స్ నుంచి ఇలాంటి మాటలు గాక భిన్నంగా వస్తాయని ఎవరూ ఆశించరు.
రష్యా-చైనా సరిహద్దుల సమీపంలో అమెరికన్లు ప్రయోగశాలల్లో జీవ ఆయుధాలను అభివృద్ది చేస్తున్నారని, వాటి పరిసరాలలో తడపర (తట్టు) వంటి ప్రమాదకర అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయని దాని మీద విచారణ జరపాలని ఏప్రిల్ మొదటి వారంలో రష్యా కోరింది. దానికి ప్రతిగా కూడా ఆస్ట్రేలియన్ కధనాన్ని ప్రచురించి ఉండవచ్చు. ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్ అనే ప్రాంతంలో ఫోర్డ్ డెట్రిక్ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
జనాలను కొంత మంది ఎలా బురిడీ కొట్టిస్తారో ఒక ఉదంతాన్ని చూద్దాం . అమెరికన్ రచయిత డీన్ కూన్జ్ ఎప్పుడో కరోనా గురించి జోశ్యం చెప్పారని కరోనా వైరస్ బయట పడిన కొత్తలో గత ఏడాదే వార్తలు వచ్చాయి. డీన్ 1981లో రాసిన ది ఐస్ ఆఫ్‌ది డార్క్‌నెస్ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్ -400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్‌లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 ముద్రణ నాటికి ఊహాన్‌గా మారిపోయింది. ఇదెలా జరిగింది? ఊహించటం కష్టమేమీ కాదు. అమెరికా, ఐరోపాలోని అనేక మంది రచయితలు, సినిమా దర్శకులు, కథకులు 1991 ముందు వరకు సోవియట్ యూనియన్, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్దలను దుష్టమైనవిగా చిత్రించి సొమ్ము చేసుకోవటం పరిపాటి.అమెరికన్లు, సిఐఏ ఏజంట్లు అసాధారణ తెలివి తేటలు గలవారిగా, సోవియట్ ఏజంట్లను పిచ్చిపుల్లయ్యలుగా చిత్రించిన సినిమాలు అనేకం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సోవియట్, ఇతర సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అలాంటి వారు సొమ్ము చేసుకొనేందుకు కొత్త కథలను అల్లటం ప్రారంభించారు. అమెరికా ప్రధాన ప్రత్యర్ధిగా అనూహ్యంగా చైనా ముందుకు వచ్చింది.1991 తరువాత వచ్చిన సినిమాల్లో, రష్యన్ల బదులు చైనీయులు విలన్లుగా, అపహాస్యపు పాత్రధారులుగా మారిపోవటాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్ధలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్లు స్పష్టమైంది.
జీవ ఆయుధాలు ప్రపంచంలో తయారు కావటం లేదా, ఏ ఏదేశాలకు సామర్థ్యం ఉంది, అసలు ఎప్పటి నుంచి వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారో చూద్దాం. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనా, భారత్ వంటి దేశాలకు లేదా అంటే లేదని ఎవరూ చెప్పజాలరు. మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి.
చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్ పాలకులు అమ్మోరు పోసిన వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు. నెపోలియన్ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్ సైనికులకు ఎల్లోఫీవర్, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.
1346లో జెనోయీస్-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్ డే ముసిస్ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.
మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్, అంతరాక్స్ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. జీవ ఆయుధాల తయారీ, ప్రయోగాలు నిర్వహించారు. 1980-88 మధ్య ఇరాక్-ఇరాన్ యుద్ధంలో అమెరికా అందచేసిన శరీన్, ఇతర గ్యాస్‌లను ప్రయోగించినట్టు ఇరాక్‌పై విమర్శలు వచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్ వద్ద ఉన్నట్టు అనుమానించిన అమెరికా సద్దామ్ హుసేన్ మానవవినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వచేసినట్టు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాక్‌లో అమెరికన్లకు అలాంటివేమీ దొరకలేదని తరువాత వెల్లడైంది.
అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికీ జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్ ఏజంట్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.
మొదటి ప్రపంచ యుద్దంలో రష్యా, రుమేనియాల్లో కలరా, ప్లేగు, అంత్రాక్స్‌ను వ్యాపింప చేసేందుకు నౌకల్లో అవి సోకిన గుర్రాలు, ఇతర పశువులను ఎగుమతి చేసేందుకు జర్మనీ పధకం వేసిందని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. తరువాత రసాయనిక ఆయుధాలను రూపొందించకూడదని కోరుతూ 1925లో జెనీవా ఒప్పందం చేసుకున్నారు. అనేక దేశాలు సంతకాలు చేసినా 1975వరకు అమెరికా భాగస్వామి అయ్యేందుకు మొరాయించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాలను ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదులు ఆపరేషన్ చెర్రీ బ్లూసమ్స్ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. అమెరికన్లు జపాన్ పెరల్ హార్బరు మీద దాడి చేసిన తరువాత పదిహేను కోట్ల ప్లేగు బాక్టీరియాను మోసుకుపోయే ఈగలు, ఎలుకలతో అమెరికా మీద దాడి చేయాలని జపాన్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే కారణాలు ఏమైనా వాటిని మోసుకుపోయే బెలూన్ నిరీ?త స్థలాన్ని చేరలేదు. తరువాత దాడి చేయాలనుకున్న తేదీకి కొద్ది వారాల ముందే జపాన్ లొంగిపోయింది. దాంతో పన్నాగం నెరవేరలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిపిన విచారణలో జీవ ఆయుధాల తయారీ బ ందం నేత షిరోషిని జపాన్ విడిచినా సోవియట్ విచారణలో 12మంది జపనీయులకు శిక్షలు తప్పలేదు.
జపాన్ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్, మంగోలియా, అమెరికన్, బ్రిటిష్, ఆస్ట్రేలియన్ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే దొంగే దొంగ అన్నట్లు చైనా మీద తప్పుడు ప్రచారం చేస్తోంది. మీడియా దానికి సాధనంగా ఉపయోగపడుతోంది. ఆస్ట్రేలియన్ కధ దానిలో భాగమే !