Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అదుపు తప్పిన చైనా రాకెట్‌ గురించి మీడియా వర్ణనలతో ఎవరికి వారు తమమీదే పడబోతోందని భయపడిపోయిన వారున్నారు. అలాంటిదేమీ లేకుండానే భూతలంలోకి రాగానే మండిపోగా మిగిలిన శకలాలు ఏమైనా ఉంటే మాల్దీవుల సమీపంలోని అరేబియా సముద్రంలో పడ్డాయి. జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు జరిపిన రాకెట్‌ ప్రయోగాలు విఫలమై కూలిపోయిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి చైనా రాకెట్‌. విఫలమైన రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న చైనా శాస్త్రవేత్తలు చెప్పక ముందే అమెరికా వారు దాన్ని రచ్చ చేశారు. కూలిపోక ముందే ఫలానా చోట పడింది, ఇవిగో ఫొటోలంటూ కుహనా వార్తలను ప్రచారంలో పెట్టారు. చైనా బాధ్యతా రహితంగా వ్యవహరించిందని, శకలాలు ఎక్కడ పడతాయో ఏ ముప్పు సంభవిస్తుందో అన్నట్లుగా నానా యాగీ చేశారు. అసలే కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాకెట్‌ చైనాది, చెప్పింది అమెరికా, రెచ్చిపోవటానికి మన మీడియాకు అంతకంటే కావాల్సిందేముంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆరుదశాబ్దాల అనుభవంలో రాకెట్లు కూలిన ఉదంతాలు అంత తీవ్రమైనవి కాదని తెలిసిన శాస్త్రవేత్తలు కూడా నోరు మూసుకొని తప్పుడు ప్రచారానికి ఊతమిచ్చారు.


తయాన్హీ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భాగంగా అవసరమైన పరికరాలను మోసుకు పోయి క్షక్ష్యలో ప్రవేశపెట్టే లాంగ్‌ మార్చ్‌-5బి వై2 వాహక నౌక(రాకెట్‌)ను ఏప్రిల్‌ 29న చైనా ప్రయోగించింది. దానికి అమర్చిన వాటిని నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టటాన్ని బట్టి దాని విస్వసనీయత సరైనదే అని రుజువైంది. తిరిగి వచ్చే క్రమంలో చోదన ( ప్రొపల్షన్‌ ) వ్యవస్ధ విఫలమైంది, దాన్నే అదుపు తప్పటంగా పరిగణించారు. దాని గమనం, అదే విధంగా ఎక్కడ భూమిని చేరనుందనే అంశాలకు సంబంధించి చైనా చెప్పినట్లుగానే మే తొమ్మిదవ తేదీ అది గాలిలో మండగా, అవశేషాలు సముద్రంలో పడ్డాయి.
సాధారణమైన అంశాన్ని అమెరికా ఎందుకు ఇంత రచ్చ చేసింది ? ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టేసి చైనా ప్రధమ స్ధానంలో ఉండబోతున్నది. అన్నింటికీ మించి ఆధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవటంలో వేగంగా దూసుకుపోతోంది. ఇలా చైనా ప్రతి అడుగునూ ప్రపంచానికి ముప్పుగా చూపేందుకు, కుట్ర సిద్దాంతాలను జనం మెదళ్లలో చొప్పించేందుకు అడుగడుగునా అమెరికా ప్రయత్నిస్తోంది. తాజా ఉదంతం దానిలో భాగమే అని చెప్పవచ్చు. ఇది ఒక్క చైనాకే అనుకుంటే పొరబాటు మన దేశం ఆ స్ధితిలో ఉన్నా అదే చేస్తుంది. రాకెట్లు భూ తలంలోకి వచ్చేటపుడు జరిగేదేమిటో సామాన్యులకంటే శాస్త్రవేత్తలకే బాగా తెలుసు. అమెరికన్లు తప్ప మిగిలిన అంతరిక్ష అగ్రరాజ్యాలేవీ రచ్చ చేయలేదు. అంతరిక్ష ప్రయోగశాలను చైనా నిర్మించటం అంటే ఆ రంగంలో అమెరికా, రష్యా సరసన చేరినట్లే. అందుకే నిష్పాక్షికంగా పరిశీలించే వారు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్నారు, ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. శకలాలతో జరిగే హాని పెద్దగా ఉండదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ దాన్ని బూతద్దంలో చూపి ఒక దోషిగా చూపేందుకు ప్రయత్నించారు. దీనికి నాసాతో పాటు అమెరికా రక్షణశాఖ, మీడియా అన్నీ కలసి ప్రచారదాడి చేశాయి.చైనా రాకెట్‌ శకలాలు ఐవరీ కోస్ట్‌లోని రెండు గ్రామాల మీద పడ్డాయని కొన్ని పత్రికలు రాశాయి. వాటి మీద చైనా గుర్తులున్నాయని కూడా పేర్కొన్నాయి. ఇవిగో ఫొటోలంటూ ప్రచురించాయి. అవన్నీ తప్పుడు కధనాలని తేలిపోయింది.


అంతరిక్ష ప్రయోగాల శకలాల సమస్య చైనా ఒక్కదానితోనే తలెత్తింది కాదు, ఆ రంగంలో ప్రయోగాలు నిర్వహించే ప్రతిదేశమూ ఎదుర్కొంటున్నదే. సాంకేతిక పరమైనదానిని రాజకీయం చేయటం, జనాన్ని భయపెట్టేందుకు వినియోగించటమే గర్హనీయం. ప్రతి రాకెట్‌ ప్రయోగంలోనూ విజయవంతం చేయటంతో పాటు విఫలమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ శాస్త్రవేత్తలు పాటిస్తారు. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా సంస్ధ నాసా, మిలిటరీ చైనా రాకెట్‌ జాడను వెంబడించటం మిలిటరీ కోణాన్ని వెల్లడించింది. ఒక క్షిపణి వ్యతిరేక కార్యక్రమ శిక్షణగా అవి పరిగణించాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ రంగంలో ప్రావీణ్యత ఉన్న ఏదేశమైనా అదే చేస్తుంది.
తియాన్‌హి అంతరిక్ష కేంద్ర కేంద్ర నిర్మాణంలో తొలి కీలక పరికరాలను లాంగ్‌ మార్చ్‌ మోసుకుపోయింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో మరో పది రాకెట్‌ ప్రయోగాల ద్వారా అవసరమైన అన్నింటినీ సమకూర్చిన తరువాత 2022 నాటికి అది పని చేయటం ప్రారంభిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2024లో పని చాలించనుంది. ఆ తరువాత విదేశీ భాగస్వాములకు అవకాశమిచ్చే అంతరిక్ష కేంద్రం తియాన్‌హి అని భావిస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలకు ఈర్ష్య పుట్టిస్తున్న అంశమిదే. అంతరిక్ష రంగంలో చైనా అభివృద్ధిని అవి సహించలేకపోతున్నాయి.


ఇతర దేశాల రాకెట్లు కూలిపోలేదా ? చైనా రాకెట్‌ కూలిపోవటాన్ని ప్రమాదకరంగా వర్ణించిన వారు మార్చి నెల 26వ తేదీన కూలిపోయిన అమెరికా ఫాల్కన్‌ 9 రాకెట్‌ గురించి మాట్లాడలేదేం ? వాషింగ్టన్‌ రాష్ట్రంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో దాని శకలాలు పడ్డాయి. అది ఒక తోక చుక్క మాదిరి వెలుగులతో భూమిని తాకినట్లు ఎపి వార్తా సంస్ధ వర్ణించింది. కొందరికి అది ఎగిరే పళ్లాల మాదిరి అనిపించిందట. అదే జనావాసాల మీద పడి ఉంటే ఏమై ఉండేదన్న ఆందోళన, దానికి అనుగుణ్యమైన హెచ్చరికను కూడా అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించలేదు.

నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్‌ పతనమై కూలిపోయిన ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించటం అవసరం. దాని గురించి నాటి పత్రికల్లో అల్లిన కథనాలు చదివి తెలుగు జనాలు ఎంత ఆందోళనకు గురయ్యారో నాటి తరాలకు తెలిసిందే. అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే కొంత మంది తమ పిల్లలకు స్కైలాబ్‌ అని పేరు పెట్టుకున్నారు. సాధారణంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని గడువు మీరిపోయిన తరువాత తిరిగి భూమికి తెచ్చే విధంగా రూపొందిస్తారు. దీర్ఘకాలం అంతరిక్షంలో బరువు కోల్పోయే మానవ శరీరాల మీద పడే ప్రభావం వంటి అనేక అంశాలను పరిశోధించేందుకు 77 టన్నుల బరువుగల స్కైలాబ్‌ను రూపొందించారు. తొమ్మిది సంవత్సరాల పాటు పని చేయించాలని నిర్ణయించి 1973లో ఏర్పాటు చేశారు. అయితే 1978 చివరిలో లోపాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్ధితుల్లో దాన్ని సురక్షితంగా కిందికి దించటం ఎలా అనే అంశాన్ని నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన సమయంలోనే పట్టించుకోని కారణంగా అది పతనం అవుతోందని గ్రహించారు. అయితే జనం ఆందోళన చెందటంతో దాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాల పాటు తిరిగేట్లు చేస్తామని, తరువాత అది అలా తిరుగుతూనే ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే అదేమీ జరగలేదు. 1979 జూలై 11న దాని బూస్టర్‌ రాకెట్లను పేల్చివేసి కూలిపోయేట్లు చేశారు. ఆస్ట్రేలియా, హిందూ మహా సముద్ర ప్రాంతంలో కూలిపోవచ్చని ఊహించారు. దాంతో మీడియాలో అనేక కధనాలు వచ్చాయి. చివరకు అనేక భాగాలు సముద్రంలో పడిపోగా కొన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలోని జనావాసాల్లో పడ్డాయి ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
సరిగ్గా అదే సమయంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గిడసబారింది, చమురు సంక్షోభం తలెత్తింది. జనానికి ప్రభుత్వం, పార్లమెంట్‌ మీద విశ్వాసం సన్నగిల్లింది. స్కైలాబ్‌ కూలిపోనుందనే వార్తలు రావటంతో ప్రభుత్వాన్ని అపహాస్యం చేయటం ప్రారంభించారు. కొందరు దాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. దేశమంతటా స్కైలాబ్‌ విందులు జరుపుకున్నారు. వాటిలో పాల్గొవారి మీద స్కైలాబ్‌ శకలాలు పడితే తలలు పగలకుండా గట్టి హెల్మెట్లు పెట్టుకురావాలని నిబంధనలు పెట్టారు. కొన్ని హౌటళ్లయితే ఇదిగో ఈ ప్రాంతంలోనే శకలాలు పడతాయంటూ ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంతం చుట్టూ విందులు ఏర్పాటు చేశాయి. టీషర్టులను అమ్మారు. కొన్ని పత్రికలయితే అపహాస్యం చేస్తూ స్కైలాబ్‌ బీమా గురించి ప్రకటించాయి. శకలాలు పడి ఎవరైనా గాయపడినా, మరణించినా 72 గంటల్లోగా చెబితే పదివేల డాలర్లు చెల్లిస్తామని ఒక పత్రిక ప్రకటించింది. శకలాలు ఎప్పుడు, ఎక్కడ పడతాయో నాసా చెప్పలేకపోయింది. ఆస్ట్రేలియా-హిందూ మహాసముద్రం మధ్య 7,400 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా పడవచ్చని పేర్కొన్నది. ఆ ప్రాంతం వెలుపల ఉన్న దేశాల వారు చివరికి ఐరోపా వారు కూడా ఎక్కడ తమ మీద పడతాయో అని అందోళన చెందారు. 1978లో సోవియట్‌ ఉపగ్రహం ఉత్తర కెనడా ప్రాంతంలో కూలిపోవటంతో స్కైలాబ్‌ కూడా ఇదే విధంగా కూలిపోనుందని జనం భయపడ్డారు.1979 జూలై పదకొండున స్కైలాబ్‌ కూలిపోనుందని ప్రకటించటంతో ఇంగ్లండ్‌లోని కొందరు డీవన్‌ ప్రాంతంలోని ఒక గుహలోకి వెళ్లి కూర్చున్నారు. బెల్జియంలో శకలాలు పడతాయనే భయంతో అక్కడి ప్రభుత్వం యుద్ద సమయంలో వైమానిక దాడుల గురించి హెచ్చరిస్తూ మోగించే 1250 సైరన్లను సిద్దం చేసుకుంది.

1995 జనవరి పదిహేనున రష్యా తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని జపాన్‌ రాకెట్‌తో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.దానికి జర్మనీ సాంకేతిక పరికరాలను అందించింది. తీరా అది ఏమైందో తెలియకుండా పోయింది. అందరూ కక్ష్యలోకి వెళ్లిందనుకున్నారు. అది నిర్ధారణగాకపోవటంతో భూమీ మీద పడిందని భావించారు గాని ఎక్కడ పడిందో తెలియలేదు.తరువాత కొంత కాలానికి ఆఫ్రికాలోని ఘనాలో ఉపగ్రహంలోని కాప్సూల్‌ దొరికింది. దానికి అమర్చిన పారాచూట్‌తో కింద పడింది. దాన్నుంచి సంకేతాలు పంపినా ఎవరూ గ్రహించలేకపోయారు. ఒక స్కూలు టీచరు దాన్ని గుర్తు పట్టి ఒక రూములో భద్రపరిచాడు. కొన్ని నెలల తరువాత అది లండన్‌ చేరింది. 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన అమెరికా కు చెందిన కొలంబియా స్పేస్‌ షటిల్‌ కూలిపోయి ఏడుగురు వ్యోమగాములు మరణించారు. 1967 జనవరిలో అమెరికా ఉపగ్రహం అపోలో 1 పేలిపోయి ముగ్గురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌లో సోవియట్‌ తొలి వ్యోమగామి కొమరోవ్‌ భూమికి తిరిగి వస్తూ పారాచూట్‌ విఫలం కావటంతో మరణించాడు.1971 జూలైలో 24 రోజుల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో గడిపి తిరిగి వస్తూ ముగ్గురు సోవియట్‌ వ్యోమగాములు మరణించారు.1986 జనవరి 28న కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన 72 సెకండ్లలోనే ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌ పేలిపోయి ఒక స్కూలు టీచరుతో సహా ఏడుగురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌ 18న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన ఒక మిలిటరీ ఉపగ్రహం పేలిపోయింది. మే మూడవ తేదీన కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన డెల్టా రాకెట్‌ పేలిపోయింది. 1990 ఫిబ్రవరి 22న పశ్చిమ ఐరోపాకు చెందిన ఏరియానె 36వ రాకెట్‌ ఫ్రెంచి గుయానాలో ప్రయోగించిన రెండు నిమిషాలకు పేలిపోయింది.ఇలా ఎన్నో ఉదంతాలను పేర్కొన వచ్చు.


ఈ సందర్భాలలో అవన్నీ ఆయా దేశాల బాధ్యతా రాహిత్యమూ, ప్రమాణాలను పాటించలేదు, ఎంత ప్రమాదమో చూడండంటూ చైనా రాకెట్‌ వైఫల్యం గురించి చిత్రించిన కధనాలు వెలువడలేదు, ఎందుకంటే అవన్నీ ప్రమాదాలు. ఫుకుషిమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం కారణంగా కలుషితమైన జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్‌ ప్రకటించగానే ప్రపంచం గగ్గోలు పెట్టింది. ఆ చర్యకు అమెరికా మద్దతు పలికిగింది. వివాదాస్పదమూ, ప్రమాదకరమైన ఆ చర్యను సమర్ధించటానికి కారణం జపాన్‌ మిత్రపక్షం. అలాంటి ప్రమాదాలేమీ లేని చైనా రాకెట్‌ పతనం గురించి పెడబొబ్బలు పెట్టటం చైనాతో ఉన్న శతృత్వం తప్ప మరొకటి కాదు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్ధిక విధానాలతో తలపడటానికి అమెరికాతో అన్ని దేశాలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి అక్కసుతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం ద్వారా ఎవరి నిజ స్వరూపం ఏమిటో, చిత్తశుద్ది ఏమిటో స్పష్టం అవుతోంది.