Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మేనెల 15 నుంచి కేరళలో సిపిఎం నాయకత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం పన్నెండు సరకులతో కూడిన ఉచిత ఆహార కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో అక్కడి బిజెపి, దేశ వ్యాపితంగా ఉన్న కాషాయ దళాలు శవరాజకీయాన్ని ప్రారంభించాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో రాకెట్‌ దాడిలో మరణించిన కేరళ నర్సు సౌమ్య సంతోష్‌కు ముఖ్యమంత్రి విజయన్‌, ఇతర లౌకిక పార్టీల నేతలు కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని, ముస్లిం తీవ్రవాదులకు భయపడి పెట్టిన పోస్టులను కూడా తొలగించారన్నది వాటి ప్రచార సారం. జనానికి ఉపయోగపడే, విశ్వాసం చూరగొనే చర్యల కారణంగానే గతంలో పొందిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చి కేరళ జనం ఎల్‌డిఎఫ్‌కు పట్టం కడితే అదే జనం చౌకబారు, శవ రాజకీయాలను గమనించి బిజెపికి ఉన్న ఒక సీటును కూడా ఊడగొట్టి దాని స్ధానం ఏమిటో చూపించారు. రెండు పార్టీలకు ఉన్న తేడా ఏమిటో ఇంతకంటే వివరించనవసరం లేదు.


గత ఏడాది కరోనా తొలి తరంగం సమయంలోనే కేరళ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, అతిధి కార్మికులకు ( కేరళలో వలస కార్మికులను అలా పిలుస్తారు) ఉచితంగా రేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటే కేరళ ప్రభుత్వం బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరకులను కూడా జత చేసి ఒక కిట్‌ రూపంలో అందించి తరువాత కూడా కొనసాగించింది. ఎన్నికల తరువాత ఈ నెల 15 నుంచి తిరిగి ఆ పధకం కింద కిట్ల పంపిణీ ప్రారంభించింది. గతంలో 17 రకాల సరకులను అందిస్తే తాజా కిట్‌లో పన్నెండు ఇస్తున్నారు. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య వచ్చిన పండగల సందర్భంగా అందించదలచిన అదనపు రేషన్‌, కరోనా కిట్ల పంపిణీని వివాదాస్పదం చేయటంతో పాటు కాంగ్రెస్‌ నేతలు హైకోర్టుకు కూడా ఎక్కారు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఉచిత కిట్లో పెసలు, మినపప్పు అరకిలో చొప్పున, కంది పప్పు పావు కిలో, పంచదార కిలో, టీ పొడి, కారం, పసుపు వంద గ్రాముల చొప్పున, కొబ్బరి నూనె ఒక కిలో, గోధుమ పిండి, ఉప్పు కిలో చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. వీటికి బియ్యం అదనం. గత ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వామపక్ష ప్రభుత్వం వీటిని పంపిణీ చేసిందని, కేంద్రం ఇచ్చిన వాటిని తమ పేరుతో పంపిణీ చేసిందని మరో పల్లవిని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వినిపించాయి. కేంద్రం బియ్యం, కిలో కందిపప్పును మాత్రమే సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసమే అయితే కేరళతో పాటు బిజెపి పాలిత అసోం, దాని మిత్ర పక్షమైన అన్నాడిఎంకె పాలిత తమిళనాడులోనూ ఎందుకు ఇవ్వలేదు. ఓటర్లను అలాంటి వాటితో ప్రభావితం చేయదలుచుకోలేదు అంటారా ? అదే అయితే ఎన్నికలు లేని బిజెపి, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో జనానికి అలాంటి సాయం ఎందుకు చేయలేదు. క్వారంటైన్‌లో ఉన్న వారికి కేరళ అందించిన ఉచిత కిట్‌ విలువ వెయ్యి రూపాయలుగా ఉంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మే, జూన్‌ మాసాలకు సబ్సిడీ బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది, దాని విలువ 26వేల కోట్ల రూపాయలని అంచనా. గతేడాది ఆరునెలల పాటు ఇచ్చిన బియానికి మరో 80వేల కోట్ల వరకు ఖర్చయింది. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు అందచేయనున్నట్లు ప్రకటించిన కరోనా సాయం విలువ 4,200 కోట్లని ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక రాసింది. ఇప్పుడు అందచేస్తున్నవాటి ఖర్చు అదనం. ఇవిగాక వృద్దాప్య పెన్షన్ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. జనానికి అందించిన సాయం గురించి ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నిందలు వేసినా ప్రభుత్వం జనానికి సాయం నిలిపివేయలేదు.

బిజెపి ప్రారంభించిన ప్రచారం గురించి చూద్దాం. కేరళకు చెందిన వారు బ్రతుకు తెరువు కోసం అనేక దేశాలకు వెళ్లిన విషయం తెలియంది కాదు, కొత్త సంగతి కాదు. ఒక్క కేరళే కాదు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అనేక దేశాలకు వెళ్లారు. పశ్చిమాసియాలోని ఇరాక్‌ మీద అమెరికన్లు దాడులు జరిపినపుడు అక్కడ పని చేస్తున్న భారతీయులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 2015 సెప్టెంబరులో అమెరికా మద్దతు ఉన్న సౌదీ అరేబియా నాయకత్వంలోని వివిధ దేశాలకు చెందిన సైన్యం ఎమెన్‌పై జరిపిన దాడిలో 20 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇజ్రాయెల్‌లోని సముద్రతీర పట్టణమైన అష్కలోన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళ నర్సు సౌమ్య సంతోష్‌ తాజాగా ఒక రాకెట్‌ దాడిలో మరణించారు. దాడి జరిపిన వారు ఆమెను హతమార్చేందుకు లక్ష్యంగా చేసుకొని ఆయుధాన్ని ప్రయోగించలేదు. పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ తాజాగా ప్రారంభించిన దాడులకు ప్రతిగా గాజా ప్రాంతం నుంచి హమస్‌ సంస్ధ గెరిల్లాలు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తున్నారు. దానిలోనే సౌమ్య సంతోష్‌ మరణించారు. హమస్‌ గెరిల్లాలకు ఆమె శత్రువు కాదు, వారి మీద ఆమెకు పగాలేదు. ఆమె మరణానికి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ సంతాపం తెలిపారు, భౌతిక కాయాన్ని స్వస్ధలానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవం ఇదైతే ముఖ్యమంత్రితో సహా లౌకిక పార్టీలేవీ సంతాపం తెలియచేయలేదని, ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేతలు తొలుత చేసిన ప్రకటనలను ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. వారి పత్రిక ఆర్గనైజర్‌ కూడా దానిలో భాగస్వామి అయింది. ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు తప్ప హమస్‌ ఉగ్రవాదాన్ని ఖండించలేదంటూ మరొకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఫేక్‌ పోస్టులు, వక్రీకరణ వార్తల ఉత్పత్తి సామాజిక మాధ్యమంలో వాటిని వ్యాప్తి చేసే వాటిలో పోస్టు కార్డు పేరుతో నడిపేది ఒకటి. కొన్నింటికీ ఎవరు తయారు చేసిందీ కూడా ఉండదు. దానిలో హమస్‌ను ముస్లిం ఉగ్రవాద సంస్ధగా చిత్రించి హిందువు అయిన సౌమ్య సంతోష్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్లు చిత్రించారు. దాని ఉద్దేశ్యాలను గ్రహించకుండా కొందరు కాంగ్రెస్‌ నేతలు దాన్ని పంచుకొని వారు కూడా అదే మాదిరి హమస్‌ను ఉగ్రవాద సంస్ధగా పేర్కొంటూ పోస్టులు పెట్టారు. హమస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాద సంస్ధగా భావించటం లేదు గనుక జరిగిన పొరపాటును దిద్దుకుంటూ ఆ పోస్టులను వెనక్కు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద అలాంటి వార్తలు లేవు. అయితే ఫేస్‌బుక్‌ పోస్టును సవరించారని బిజెపి తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాలస్తీనా హమస్‌ సంస్ధ మన దేశంలోని లౌకిక పార్టీల అనుయాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ చెప్పారు.

గతంలో యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలోని పాలస్తీనా విమోచనా సంస్ధ(పిఎల్‌ఓ)ను కూడా అమెరికా, దాని అనుంగు భక్తులైన వారు ఉగ్రవాద సంస్ధ అని, అరాఫత్‌ ఉగ్రవాది అని చిత్రించి ప్రచారం చేశారు. దాన్నే సంఘపరివార్‌ కూడా తు.చ తప్ప కుండా అనుసరించింది. అదే అరాఫత్‌, పిఎల్‌ఓతో అమెరికా చర్చలు జరిపింది, ఒప్పందం చేసుకుంది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అంటే ఇదే. అరాఫత్‌ మరణానంతరం పాలస్తీనా విమోచనకు పోరాడే అసలైన సంస్ధగా హమస్‌ ముందుకు వచ్చింది. పాలస్తీనాను చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే పాలస్తీనా దేశం లేకుండా పోయింది. సామ్రాజ్యవాదుల కుట్రకు బలైన దేశంగా మారింది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలు కూడా తమవే అంటూ సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ ఆక్రమణ యుద్దానికి పాల్పడింది. దాంతో పక్కనే ఉన్న జోర్డాన్‌, ఈజిప్టు వాటిని కాపాడేందుకు రంగంలోకి వచ్చి తమ సంరక్షణలోకి తీసుకున్నాయి. వాటిలో ఒకటి వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతం. జోర్డాన్‌ నది పశ్చిమ గట్టున ఉంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. జోర్డాన్‌ రక్షణలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 యుద్దంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. పాలస్తీనాకు రాజధానిగా చేయాలనుకున్న తూర్పు జెరూసలేం పట్టణం ఈ ప్రాంతంలోనే ఉంది. అరబ్బులకు చెందిన ఈప్రాంతంలో యూదులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా నిష్పత్తిని మార్చివేసి శాశ్వతంగా తనదిగా చేసుకోవాలన్న ఎత్తుగడతో ఈ పని చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఏటా జెరూసలెం దినం పేరుతో ఇజ్రాయెల్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటున్నది. హిబ్రూ(యూదు) కాలెండర్‌ ప్రకారం మే నెలలో ఒక్కో సంవత్సరం ఒక్కోతేదీన దీన్ని పాటిస్తున్నారు. అదే క్రమంలో ఈ నెల తొమ్మిదిన జెరూసలేం దినానికి ముందు పాలస్తీనియన్ల నివాస ప్రాంతం ఒకదానిని యూదుల ప్రాంతంగా ప్రకటిస్తూ ఒక కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు. దాన్ని సాకుగా చూపి ఒక మసీదును ఆక్రమించేందుకు, అరబ్బుల నివాసాలను కూల్చివేసేందుకు పూనుకున్నారు. దాన్ని ప్రతిఘటించటంతో అన్ని రకాల దాడులకు యూదు దురహంకారులు పూనుకున్నారు. తోటి పాలస్తీనియన్లకు మద్దతుగా పాలస్తీనాలో భాగంగా పరిమిత స్వయం పాలన ప్రాంతంగా ఉన్న గాజాలో హమస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి సాయుధ విభాగం కూడా ఉంది. తూర్పు జెరూసలేంలో తోటి పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఆ విభాగం పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ మీద రాకెట్లతో దాడులు జరుపుతున్నది. అలాంటి ఒక రాకెట్‌ పడిన ప్రాంతంలో ఆసుపత్రిలో పని చేస్తున్న సౌమ్య మరణించింది. అది మనకు బాధాకర ఉదంతం. శనివారం నాడు ఆమె మృతదేహం కేరళ చేరుకుంది.


ఈ ఉదంతాన్ని మతకోణంలో కేరళలో ముస్లిం, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాలు పూనుకున్నాయి. దానిలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. యూదు దురహంకారుల దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అసలు తాజా దాడులు-ప్రతిదాడులకు కారకులు ఎవరన్న వాస్తవాన్ని మరుగుపరచి ముస్లింల దాడిలో హిందువు అయిన సౌమ్య సంతోష్‌ మరణించినట్లు చిత్రిస్తున్నారు. దేశంలో మత ఉగ్రవాదాన్ని రాజకీయాల్లోకి చొప్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి ఇజ్రాయెల్‌లో యూదు దురహంకారులు వ్యవహరిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఎ బేబీ విమర్శించారు. తాజా పరిణామాలకు ఇజ్రాయెల్‌దే బాధ్యత అన్నారు. సౌమ్య మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అయ్యప్ప పేరుతో కమ్యూనిస్టుల మీద తప్పుడు ప్రచారం చేసి అది పని చేయక చతికిల పడ్డారు. ఇప్పుడు చౌకబారు శవరాజకీయం చేసేందుకు ఈ ఉదంతం వాటంగా దొరికింది. గతేడాది ఒక ఏనుగు మృతి చెందిన ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని పీనుగు రాజకీయం చేసిన విషయం తెలిసిందే. కేరళలో హిందూమతోన్మాదులు ఉన్నట్లుగానే ముస్లిం మతోన్మాదులు కూడా వారికి పోటీగా తయారయ్యారు. అలాంటి వారిని ఉపయోగించుకోవటంలో బిజెపి- కాంగ్రెస్‌-ముస్లిం లీగు పోటీ పడుతున్నాయి. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా నికరంగా నిలిచి అసలు సిసలు లౌకికశక్తిగా ఎల్‌డిఎఫ్‌ నిరూపించుకుంది. అందుకే హిందూ, ముస్లిం, కైస్తవ మతాలు, కుల తత్వాన్ని రెచ్చగొట్టే సంస్ధల ప్రచారాన్ని తోసి పుచ్చి ఓటర్లు చారిత్రత్మాకంగా వరుసగా రెండోసారి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టారు.


ఓటమితో మైండ్‌ బ్లాంక్‌ అయిన మాజీ ఎంఎల్‌ఏ !
కేరళలో రెండు లక్షల మంది క్రైస్తవ యువతులను ముస్లింలు మతమార్పిడి చేశారంటూ ఆరోపించిన మాజీ ఎంఎల్‌ఏ పిసి జార్జి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆధారం లేని ఆరోపణలను ఒక ఆన్‌లైన్‌ మీడియా ఇంటర్వ్యూలో చేసినట్లు ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఉదంతం జరిగింది. కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చేందుకు మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు.


సాదా సీదాగా కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం !
పరిమిత సంఖ్యలో అతిధుల మధ్య నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. రోజు వారీ విలేకర్ల సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వీడియో ద్వారా నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలని అంతకు ముందు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కేరళ శాఖ సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంటారా అని విలేకర్లు అడగ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పరిమిత సంఖ్యతో జరుగుతుందని త్వరలో తెలియ చేస్తామని అన్నారు. అంతకు ముందు ఒక స్టేడియంలో ఏడువందల మంది ఆహ్వానితుల మధ్య ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి.


పార్టీలతో పాటు మీడియా కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి !
తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఎదురు దెబ్బలు తిన్న జాబితాలో మీడియా కూడా ఉందని అందువలన రాజకీయ పార్టీలతో పాటు అది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని కేరళ సిపిఎం తాత్కాలిక కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన వారితో పాటు గెలిచిన వారు కూడా సవరించుకోవాల్సిన అంశాలను వెనక్కి తిరిగి చూసుకోవాలని అదే ప్రజాస్వామ్యం అన్నారు.అయితే మీడియా అలాంటి ఆత్మవిమర్శను పరిశీలించకపోవటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిన యుడిఎఫ్‌, బిజెపితో పాటు మితవాద మీడియా సంస్ధలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయన్నారు. ప్రభుత్వం మీద జాగృతి కలిగించాల్సిన మీడియా అబద్దాలు, ఆరోపణలకు పూనుకున్నదన్నారు.