ఎం కోటేశ్వరరావు
మలయమారుతం వీస్తున్నపుడు, చిరు జల్లుల మబ్బుల కింద అహౌ… తీపి కబుర్లు చెప్పమని ఎవరు- ఎవరిని ఏమి అడిగినా సానుకూల ఫలితాలు వస్తాయి. అదే గాలి దుమారం రేగినపుడు, తుపాను ముంచుకు వస్తున్నపుడు ముద్దు ముచ్చట్లాడుకుందాం అంటే ఏం జరుగుతుందో ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీ బాత్ కార్యక్రమానికి అదే ఎదురైంది. ” నూటముప్పయి కోట్ల మంది సానుకూలత శక్తి గురించి పండుగ చేసుకొనేందుకు ఈనెల మన్‌కీ బాత్ తిరిగి వచ్చింది. ఉత్తేజకరమైన కథలు ఉంటే ప్రధాని నరేంద్రమోడీతో పంచుకోండి ” అని ప్రధాని యంత్రాంగం ప్రభుత్వం దగ్గర ఉన్న జాబితాలోని వారికి, బహిరంగంగా ట్వీట్ చేశారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని అన్ని విధాలుగా వైఫల్యం చెందినట్లు చివరికి నిన్నటి వరకు భజన చేసిన మీడియా కూడా చెబుతున్న తరుణంలో మన్‌కీబాత్ ఉపన్యాసం తయారు చేసే వారికి తత్వం బోధపడినట్లు లేదు.ఫ్రాన్సులో 1789లో ఫ్రెంచి రాణి మేరీ ఆంటోనెటెతో అమ్మా మన ఏలుబడిలో జనానికి రొట్టె దొరకటం లేదు అని సహాయకులు విన్నవించినపుడు రొట్టె లేకపోతే కేకులు తినమనండి అని సెలవిచ్చిన ఉదంతాన్ని మోడీ యంత్రాంగం గుర్తుకు తెచ్చింది. యధా రాజా తధా అధికార కదా మరి !
ఏ మూల నుంచి ఏ విషాద గాధ వినాల్సి వస్తుందో, ఆదుకొనే వారెవరో తెలియటం లేదు అని జనం భయపడుతున్నారు.రామ రాజ్యాన్ని ఏలుతున్న ఓ నగ చక్రవర్తీ శవవాహిని గంగను చూడవయ్యా అంటూ గతంలో కాషాయ శ్రేణుల ప్రశంసలు అందుకున్న గుజరాత్‌కు చెందిన పారుల్ ఖక్కర్ వంటి కవయిత్రులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే , మన ప్రధాని మన్‌కీ బాత్ కోసం ఉత్తేజకరమైన కరోనా విజయ గాధలను పంపండి అంటూ అధికార యంత్రాంగం కోరింది. రోమ్ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి చరిత్రను జ్ఞప్తికి తేవటం లేదూ. ప్రధాని యంత్రాంగమింకా కరోనాపై విజయం సాధించామన్న ప్రచార హౌరులోనే ఉన్నారు తప్ప వాస్తవంలో లేరని తేలిపోయింది. ఈ ఉత్తేజకర గాధల ట్వీట్ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో అధికార యంత్రాంగం దాన్ని వెనక్కు తీసుకుంది.
కరోనా పోరులో భాగంగా ధ్యానం, యోగా చేయాలన్న ప్రధాని సూచనను పంచుకోండి అంటూ మే పదకొండవ తేదీన ఆయన యంత్రాంగం చేసిన మరొక ట్వీట్ కూడా అభాసుపాలైంది. జనానికి ఆక్సిజన్, ఆసుపత్రులు, ఔషధాలు, వెంటిలేటర్లు కావాలి ప్రభో అంటుంటే వాటి సంగతి చెప్పకుండా ధ్యానం చేయమంటారేమిటి అని నెటిజన్లు ఆగ్రహం వెలిబుచ్చారు.అయ్యా మేం పేదవారం మృత్యువుతో పోరాడాలా ? యోగా చేయాలా ? మీరు యోగా చేయాలంటున్నారు. మేం యోగాను ప్రారంభిస్తే ఆసుపత్రి బయట వేచి ఉన్న మా తలిదండ్రులు, పిల్లలను ఎవరు చూడాలి అని ఒక వ్యక్తి ప్రశ్నించిన తీరు వైరల్ అయింది.
అధికార యంత్రాంగం ఎందుకిలా వ్యవహరించినట్లు ? ఏప్రిల్ 30వ తేదీన జరిగిన ఉన్నతాధి కారుల వర్క్‌షాపులో ప్రభుత్వం తీసుకుంటున్న ‘ సానుకూల చర్యలు, పని మీద ‘ మరింత మెరుగ్గా ప్రచారం చేయటం గురించి చర్చించారు. విదేశీ రాయబారులు, హైకమిషనర్లు పాల్గొన్న వీడియో కాన్ఫరెన్సులో విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మీడియాలో ఏకపక్షంగా వెలువడుతున్న కధనాలకు ధీటుగా తగిన సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. దాని కొనసాగింపుగా మే 12వ తేదీ బిజెపి మీడియా జాతీయ బృంద సభ్యుడైన సుదేష్ వర్మ రాసిన ఒక వ్యాసాన్ని బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ట్వీట్ చేశాయి. ” ఎంతో కష్టపడి పని చేస్తున్న ప్రధాని మోడీ- ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దు ” అని దానికి పేరు పెట్టారు. దానిలో ఒక పేరాలో ఇలా ఉంది. ” ఒక సంక్షోభం వచ్చినపుడు నిశ్శబ్దంగా పని చేసేందుకు ప్రయత్నించే ఒక ప్రధాని ఇక్కడ ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించటం ముఖ్యం తప్ప రాజకీయ ప్రకటనలకు స్పందించరు. ఆయన తన యావత్ శక్తిని మళ్లించి రెట్టింపు వేగంతో పని చేసేందుకు, పరిష్కారాలను కనుగొనేందుకు దృష్టిపెడతారు. ఆయన కూడా ఇతరుల మాదిరే పసిపిల్లల్లా రోదిస్తే పరిష్కారాలతో ఎవరు ముందుకు వస్తారు ” అని రాశారు. నిజంగా ప్రధాని అసహాయతతో రోదిస్తే సానుభూతి వెల్లువెత్తేదేమో ! లేదా సమస్యలను పరిష్కరిస్తే ఇంటా బయటా ఇన్ని విమర్శలు వచ్చేవా, ఢిల్లీలో ఏడేళ్ల ప్రభుత్వం కనపడటం లేదు అని రాయగలిగే వారా ? అతిధుల ముందు మన గొప్ప చెప్పరా మంకెన్నా అంటే మా ఆయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత ఉంటాయి బాబయ్యా అన్నట్లుగా పరిస్ధితి ఉంది.
దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఎలా పెరిగిందో, ఆక్సిజన్‌లేక ఎంత మంది మరణించారో, హైకోర్టు, సుప్రీం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో పదే పదే చెప్పుకోనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని నరేంద్రమోడీ – మోడీ అంటే ప్రభుత్వమే అన్నట్లుగా పరిస్ధితి తయారైన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ వాక్సిన్ విధానాన్ని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు వేశారు. వాటిని చూసీ చూడనట్లు ఉంటే మొత్తం ఢల్లీీ వాలాలకు, దేశంలోని యావత్ జనాలకు తెలిసేది కాదు. కానీ ఢిల్లీ పోలీసులా మజాకానా ” నరేంద్రమోడీ ఖ్యాతిని ప్రపంచ వ్యాపితం ” కావించేందుకు పూనుకున్నారు. పాతిక మందిని అరెస్టు చేశారు, మరి కొందరికోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అది అంతర్జాతీయ వార్త అయింది. పోస్టర్లు వేయటం వెనుక ఎవరున్నారని పోలీసులు విచారణ చేపట్టారు. రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు పాతి ఖ్యాతిని అంతర్జాతీయం చేసిన వారే వీరు. కొంత మంది అనుమానితులను పట్టుకుంటే వారు స్ధానిక ఆమ్ ఆద్మీనేత పేరు చెప్పారట. వారు నిజంగానే చెప్పారో లేక పోలీసులే ఎవరో ఒకరి మీద కేసులు పెట్టాలి గనుక అలా చెప్పించారో మనకు తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం ఆమ్ ఆద్మీది, పోలీసులు మాత్రం బిజెపి అమిత్ షా ఆధీనంలో పని చేస్తారు కనుక ఏమైనా జరిగి ఉండవచ్చు. పోస్టర్లను తామే వేశామని ఆమ్ ఆద్మీ స్ధానిక నేతలు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇంతకీ హిందీ భాషలో ముద్రించిన ఆ పోస్టర్లలో ఏమి ఉంది.” మన పిల్లలకు వేయాల్సిన వాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపారు ప్రధాని మోడీ గారూ ” అని ప్రశ్నించారు. మా దేశంలో తయారైన టీకాలు ముందుగా మాకే అని అమెరికా, బ్రిటన్ ఒక్కటంటే ఒక్క డోసు కూడా బయటకు పంపలేదు. మన దేశంలో టీకాలకు అవసరమైన ముడి పదార్దాలు, వస్తువుల మీద అమెరికా ఏకంగా నిషేధమే విధించిన నేపధ్యంలో మన ప్రభుత్వం విదేశాలకు టీకాలు పంపటం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వచ్చింది.దీనిలో తప్పేముందో, దేశద్రోహం లేదా మోడీ గారి ప్రతిష్టకు వచ్చిన ముప్పేమిటో ఎవరికైనా అర్ధం అవుతోందా ? గత కొద్ది రోజులుగా టీవీ చర్చలలో, నేతల వ్యాఖ్యల్లో ఇలా ప్రశ్నించిన వారు లేదా విమర్శించిన వారు ఎందరో ఉన్నారు.లేదూ అలా ప్రశ్నించటం తప్పయితే తప్పని చెప్పండి, విలేకర్ల సమావేశాలు పెట్టే , ప్రశ్నలను ఎదుర్కొనే అలవాటు, ధైర్యం ఎలాగూ లేదు గనుక ఎలా తప్పో మన్‌కీబాత్‌లో చెప్పి జనాన్ని ఒప్పించండి. ప్రకటనలు, వ్యాఖ్యలు చేయటానికి వాటిని పోస్టర్లుగా ముద్రించి గోడల మీద అంటిచటానికి పెద్ద తేడా ఏముంది ? కేసులేమిటి ? అరెస్టులేమిటి ?
వాక్సిన్లు ఎగుమతి చేయటాన్ని మోడీ ఘనతగా, చైనాతో పోటీ పడి వాక్సిన్ దౌత్యంతో ఇతర దేశాలను ఆకట్టుకున్నట్లు చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు. ఆ విధానాన్ని ఎవరైనా తప్పు పడితే సహించరా ! ఇదేమి ప్రజాస్వామ్యం !! ” మహమ్మారి సమయంలో యావత్ ప్రపంచం ఒక్కటే.ఒక అంటువ్యాధి మహమ్మారిగా మారినపుడు యావత్ ప్రపంచాన్ని ఒకటిగానే భావించి దాన్ని అదుపు చేయాలి.టీకాలు వేసే ప్రపంచ కార్యాచరణలో భాగమే వాక్సిన్ల ఎగుమతులు. ” ఈ మాటలు మార్చి 11వ తేదీన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మోడీ సర్కారే స్వయంగా చెప్పింది. అంతే కాదు, తొంభై దేశాలకు మేడిన్ ఇండియా కోవిడ్-19 వాక్సిన్ సరఫరాల్లో భాగంగా 663.698 లక్షల డోసులు(ఆరుకోట్ల 63లక్షలకు పైగా) జనవరి- ఏప్రిల్ మధ్య ఎగుమతి చేసినట్లు విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇది నరేంద్రమోడీ సర్కార్ వాక్సిన్ దౌత్యంలో భాగం సాధించిన ఘనతగా వర్ణించారు. ఇంతేకాదు, ఒకేసారి పెద్ద మొత్తంలో వాక్సిన్ అందిస్తే జనాలకు వేసే యంత్రాంగం, సౌకర్యాలు లేవని కూడా కేంద్రం పేర్కొన్నది. తీరా మహమ్మారి తీవ్రత పెరిగి వాక్సిన్లకు డిమాండ్ ఏర్పడటంతో అవసరాలకు అనుగుణ్యంగా అందించలేని స్ధితి. నెల రోజులకు రెండవ డోసు వేస్తామన్న వారు ఇప్పుడు నెలల వ్యవధి గురించి చెబుతున్నారు. అసలు విషయం వాక్సిన్ కొరతను దాచిపెట్టటమే. కొద్ది వారాల క్రితం ఎగుమతుల గురించి ఘనతగా ప్రచారం చేసుకున్న బిజెపి పెద్దలకు విమర్శల సెగ తగలటంతో ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఎగుమతి చేసిన ఆరుకోట్ల డోసుల్లో ఒక కోటి మాత్రమే సాయం అని మిగిలినవన్నీ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఎగుమతి చేసినవే అని ప్రభుత్వంపై వచ్చిన విమర్శల తీవ్రతను తగ్గించేందుకు జాతీయ నేత సంబిత్ పాత్ర ప్రయత్నించారు. మన దేశంలో వినియోగించకుండా ఎగుమతులతో వాణిజ్యం చేయటం ఏమిటి ? దానికి ప్రభుత్వం ఎలా అనుమతించినట్లు ? ఇదేనా కేంద్ర ప్రభుత్వ వాక్సిన్ విధానం ?
ఢిల్లీ పోస్టర్లపై కేసులు నమోదు చేసిన పోలీసుల తీరు మీద విమర్శలు వెల్లువెత్తటంతో మోడీ సర్కార్ ఇరకాటంలో పడింది.నేనూ అదే అంటున్నా నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ రాహుల్ గాంధీ కేంద్రాన్ని సవాల్ చేశారు. మోడీని ప్రశ్నించినందుకు అంటే మరింత గబ్బు పడతారు కనుక పోస్టర్లు అంటించి గోడలను ఖరాబు చేశారంటూ పోలీసులు కేసులు బనాయించటం విశేషం. ఆ పోస్టర్ల మీద ఎవరు ప్రచురించిందీ,ఎక్కడ ముద్రించిందీ లేదు. ఒక వేళ అలాంటి కేసులు బనాయించాల్సి వస్తే ప్రతి పట్టణం, గ్రామాలలో లక్షల కేసులను నమోదు చేయవచ్చు. అనుమతి లేకుండా పోస్టర్లను అంటించటం, బ్యానర్లను ఏర్పాటు చేయటం వంటి చర్యలన్నీ అభ్యంతరకరమైనవే. స్పూను కొంటే పట్టు చీర ఉచితం, ఒకటి కొని రెండు తీసుకుపోండి వంటి లేదా అశ్లీల చిత్రాల పోస్టర్ల వాటిమీద చర్యలు తీసుకుంటే ఇంత రచ్చయ్యేది కాదు. తాజా పోస్టర్లలో మోడీ విధానాన్ని ప్రశ్నించటంతో వాటికి అంత ప్రాధాన్యత వచ్చింది.
నరేంద్రమోడీని ప్రశ్నిస్తూ అంటించిన పోస్టర్ల మీద కేసుల మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం, దేశవ్యాపితంగా మీడియాలో వార్తలు రావటంతో అబ్బే ఇలాంటి కేసులు పెట్టటం ఢిల్లీలో మామూలే అని గత కొద్ది సంవత్సరాలలో ఏ ఏ సందర్భాల్లో కేసులు బనాయించిందీ, ఎందరిని అరెస్టు చేసిందీ వివరిస్తున్నారు. సిఎఎ,ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా, జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల సమయంలో మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ, ఇతరంగా వేసిన పోస్టర్ల మీద అనుమతి లేకుండా అంటించకూడదనే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే వీటిని మొత్తంగా పరిశీలించినపుడు మోడీ సర్కార్ మీద విమర్శ, అసమ్మతి వ్యక్తం చేసిన పోస్టర్లే ఎక్కువగా ఉన్నందున వాటికి వ్యతిరేకంగానే పోలీసులు కేసులు బనాయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.