Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు జనమంతా తమకు నెగెటివ్‌ రావాలని కోరుకుంటున్నారు- మరోవైపు నరేంద్రమోడీకి పాజిటివ్‌ రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోంది. ఇదేమిటనుకుంటున్నారా ? అవును నిజం… అవును నిజం. కరోనా వైరస్‌ గురించి జనం నెగెటివ్‌ రావాలని అనుకుంటుంటే – కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యం మీద జనంలో వస్తున్న వ్యతిరేకతను పాజిటివ్‌గా మార్చాలని సంఘపరివార్‌ నడుం కట్టింది. ఆ కసరత్తులో భాగంగా అనేక చర్యలు తీసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, ఎత్తుగడలు తెలిసిన వారికి ఇది ఆశ్చర్యం కలిగించదు. అన్ని తరగతుల్లోనూ ప్రత్యక్ష, పరోక్షంగా తీవ్ర విమర్శలకు గురైన నరేంద్రమోడీని పూర్తిగా భుజాన వేసుకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ మీద ఉన్న భ్రమలు కూడా తొలగిపోతాయి.పిర్ర గిల్లి జోల పాడినట్లుగా విమర్శించినట్లూ ఉండాలి- ఆదుకోవాలి అనే ఎత్తుగడలో భాగంగా ” పరిమితులు లేని సానుకూలత ” అనే ఇతివృత్తంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) ఐదు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీని ముగింపు వక్తగా భగవత్‌ పాల్గన్నారు. ఆ సంస్ధ ఏర్పాటు చేసిన కరోనా స్పందన బృందంతో కలసి దీన్ని నిర్వహించారు. దీనిలో ప్రసంగించిన ప్రముఖులందరూ ఇదేవిధమైన ఉద్బోధలు చేశారు. వంద వేదికల ద్వారా ఈ ఉపన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.


అన్నమైతేనేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా వక్తలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. కరోనా తొలి తరంగం తరువాత ప్రభుత్వం-జనం ఇద్దరూ నిశ్చింతగా ఉన్నారు ఇద్దరూ తప్పు చేశారు అందువలన సానుకూలంగా ప్రభుత్వానికి మద్దతు ఇద్దాం అన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పారు. కరోనా మొదటి దశపై విజయం సాధించామని ప్రకటించినపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ మౌనంగా ఉంది. నిపుణులు చేసిన హెచ్చరికల గురించి ఏం చేశారని ఆరా తీసిందో లేదో తెలియదు. రెండవ దశ పరిస్ధితి ఆందోళనకరంగా తయారైంది. ఇంటా బయటా తీవ్ర విమర్శలు, వైఫల్యాల గురించి జనం మాట్లాడుకోవటం ప్రారంభించగానే ఆ సంస్ధలో ఆందోళన మొదలైంది, నష్ట నివారణ చర్యల్లో భాగంగానే జనానిది, ప్రభుత్వానిది ఇద్దరిదీ తప్పు ఉందంటూ ప్రచారం మొదలు పెట్టింది. జనంలో అసంతృప్తి మోడీ పలుకుబడిని తగ్గిస్తుందా పూర్తిగా దిగజారుస్తుందా అన్న మదింపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాను పెంచి పెద్ద చేసిన వ్యక్తి, ప్రభుత్వం గురించి అలా ఆలోచించటం సహజం. రెండోది జరిగితే పరివార్‌ అజెండాకు ఎదురుదెబ్బ తగులుతుంది. అప్పుడు గౌరవ ప్రదంగా మోడీని పక్కన పెడతారు. అసంతృప్తి తాత్కాలికమే అయితే కొనసాగిస్తారు. దానికి తన హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోవటం తప్ప వ్యక్తులుగా ఎవరినైనా ఉపయోగించుకుంటుంది.అందుకు ఏమైనా చేస్తుంది.

వాజ్‌పారు బతికి ఉండగా కూడా అందరికీ తెలిసిన, నలుగురిలో నానిన విషయాన్నే ఇప్పుడు ” జుగుల్‌ బందీ ” పేరుతో గ్రంధస్ధంగావించిన వినరు సీతాపతి పేర్కొన్నారు. రాజకుమారి కౌల్‌ అనే వివాహితతో వాజ్‌పేయి సంబంధం తెలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు గురుగోల్వాల్కర్‌, నానాజీదేశముఖ్‌ ఆమెకు దూరంగా ఉండాలని ఇచ్చిన ఆదేశం లేదా హితవును వాజ్‌పేయి తిరస్కరించి జీవితాంతం కొనసాగించారు. ఒకే ఇంట్లో ఉన్నారు. దీని గురించి సంఘపరివార్‌ సర్దుకుపోయింది గానీ వాజ్‌పాయిలో మార్పులేదు. విలువలు-వలువల గురించి కబుర్లు చెప్పే సంఘపరివార్‌ నాయకత్వానికి ఇవన్నీ తెలిసినప్పటికీ వాజ్‌పారు-అద్వానీ ఇద్దరిలో సౌమ్యుడిగా పేరున్న వాజ్‌పారును ప్రధానిగా చేయటం ద్వారా మిగతా పార్టీల మద్దతు కూడ గట్టవచ్చు అన్న దూరాలోచనతో నిర్ణయానికి వచ్చింది. బిజెపి ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కె ఎన్‌ గోవిందాచార్య బ్రిటీష్‌ దౌత్యవేత్తలతో మాట్లాడుతూ పార్టీకి వాజ్‌పాయి ఒక ముసుగు మాత్రమే అసలైన నేత అద్వానీయే అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటలతో ఆయన ఉద్యోగం ఊడిందనుకోండి అది వేరే విషయం. తరువాత గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ ” పని తనాన్ని ” చూసిన తరువాత అద్వానీని పక్కన పెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయే అసలు సిసలు వ్యక్తిగా మోడీని గుర్తించి ముందుకు తెచ్చిన కథ తెలిసిందే. కరోనా రూపంలో వచ్చిన మహమ్మారికి మతం లేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా ప్రకారం నడిచేది కాదు గనుక చివరికి మోడీ పదవికి ముప్పు తెచ్చిందా ?


కరోనా వైఫల్యం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ మీద వీర భక్తి ఇప్పటికీ అనేక మందిలో పతాక స్ధాయిలోనే ఉంది. జనానికి ఆక్సిజన్‌ అందించలేకపోతే అదే జనం మోడీ అధికార ప్రాణవాయువును లాగేస్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు కార్పొరేట్లకు కూడా మోడీ ” తగిన ” వ్యక్తి అని ముఖ్యమంత్రిగా రుజువు చేసుకున్నారు గనుక ప్రధానిగా గద్దెనెక్కించటానికి వారు కూడా ” చేయాల్సిందంతా ” చేశారు. ప్రపంచ బ్యాంకు నమ్మిన బంటుగా అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్లకు ఇష్టుడిగా ఉన్నారు కనుకనే మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల పాటు పదవిలో కొనసాగారు. ఆయనకు కొన్ని పరిమితులు ఏర్పడిన తరువాత అపరిమిత సానుకూలంగా వ్యవహరించేందుకు నరేంద్రమోడీ సరైన నేతగా కనిపించారు. కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది, కరోనా దాన్ని వేగవంతం చేసింది. ఈ దశలో గత ఏడు సంవత్సరాల మాదిరే కార్పొరేట్లకు దోచిపెడితే జనం ఊరుకోరు, ఒకసారి తినటానికి అలవాటుపడిన కార్పొరేట్లకు వాటా తగ్గితే అవి సహించవు. ఇదే సమస్య. దీన్ని సంఘపరివార్‌ ఎలా పరిష్కరిస్తుందన్నది కొంతకాలం చూడాల్సిందే. అవసరమైతే మరొకరిని ముందుకు తేవాలనుకుంటే కాస్త సద్దుమణిగిన తరువాత చేయాల్సిన పని చేస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఏమీ చేయదు. గతంలో మొరార్జీ దేశారు ప్రభుత్వానికి ముందు రోజు వరకు వీర విధేయుడిగా మాట్లాడిన జార్జిఫెర్నాండెజ్‌ తెల్లవారేసరి ఎలా ప్లేటు ఫిరాయించారో చూశాము. అనేక మంది ప్రముఖులు పార్టీ మారే ముందు కూడా ఇలానే ఉంటున్నారు. పరివారం తలచుకుంటే తెల్లవారే సరికి పరిస్ధితి మారిపోతుంది.భక్తులు కొత్త దేవుడి భజనకు మారటం చొక్కా మార్చినంత సులభం !


కరోనా వైరస్‌ మొదటి దశలో, రెండవ దశలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రతిపక్ష పార్టీలన్నీ సానుకూలంగానే తీసుకున్నాయి. ఎక్కడా వాటికి వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపు ఇచ్చిన ఉదంతం లేదు. తమ స్వస్ధలాలకు చేరేందుకు జనానికి తగిన వ్యవధి, రవాణా ఏర్పాట్లు చేయకుండా గతేడాది ప్రకటించిన లాక్‌డౌన్‌, 27లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించిన కేంద్రం వలస కార్మికులు స్వస్ధలాలకు చేరేందుకు అయ్యే రైలు ఛార్జీలను ఎవరు భరించాలనే చిన్న అంశంపై చేసిన రచ్చ , ఆత్మనిర్భర పాకేజి బూటకం గురించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తప్ప మిగతా వన్నీ అపరిమిత సానుకూలమే.


ఇక వర్తమానానికి వస్తే సంఘపరివార్‌ ఇప్పుడు జనంలో మోడీ సర్కార్‌ పట్ల సానుకూల వైఖరిని ఎక్కించేందుకు ఎందుకు పూనుకున్నది అన్న ప్రశ్న. ఇదేమీ సమాధానం చెప్పక పోతే తలలు ఎగిరిపోయే సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న కాదు. దీని గురించి పైనే చెప్పుకున్నాం. నిపుణుల అభిప్రాయాలు, హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన వర్తమాన నీరో, అదృశ్యమైన పాలన, పాలకులంటూ ఒక పత్రిక పెట్టిన శీర్షిక చాలు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడటానికి. సజావుగా సాగుతోందనుకుంటున్న తన అజెండా అమలుకు విఘాతం కలిగే విధంగా మోడీ సర్కార్‌ వ్యవహరించిందని సంఘపరివార్‌ గ్రహించటమే ఈ నష్ట నివారణ చర్య. మోహన్‌ భగవత్‌ గారు చెప్పినదాన్ని సానుకూలంగా తీసుకుంటే ప్రభుత్వం- జనం కూడా నిశ్చింతగా ఉన్నారు.ఇద్దరిదీ తప్పే. దాన్నే మరోవిధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేశారు. జనంతో ఉన్నామని చెప్పుకొనే, పరిస్ధితిని ఎప్పటికప్పుడు కన్నార్పకుండా పరిశీలించే పరివార్‌ నిపుణులు ఏం చేస్తున్నారు ? ఆర్నాబ్‌ గోస్వామి వంటి కాషాయ మీడియా పెద్దలేమి హెచ్చరికలు చేశారు అన్నది ప్రశ్న. ఇది ” దేశ భద్రత అంశం ” కనుక సమాధానాలు చెప్పరు. జనం బాధ్యతాయుతంగా వ్యహరించటం లేదనే ప్రచారం గత కొద్ది వారాలుగా సామాజిక మాధ్యమంలో, బిజెపి ప్రతినిధుల చర్చలలో ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇది, ప్రశ్నించేవారి నోరు మూయించే ఎదురుదాడి వ్యూహం. భగవత్‌గారు ఇచ్చిన సలహా ఏమిటి ? సమాజానికి తోడ్పడాలంటే యోగా చేయాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి. గతేడాది మోడీ గారు ఇచ్చిన గ్లాసులు, పాత్రల మోగింపు, దీపాలు వెలిగింపు కార్యక్రమానికి దీనికి పెద్ద తేడా ఏముంది. అంతేనా కరోనాతో చస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, పునర్జన్మ గురించి భారతీయులకు వేరే చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది నిర్లక్ష్యం చేసిన జనానికి చెప్పారు బానే ఉంది, మరి లక్షలాది మంది పునర్జన్మకు కారకులౌతున్న నరేంద్రమోడీ గారి సంగతేమిటి ?


” కరోనా తొలి తరంగం తరువాత జనం, ప్రభుత్వాలు, యంత్రాంగాలు దారి తప్పాయని అందరికీ తెలుసు, వైద్యులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ అందరూ ఇప్పటికీ దారి తప్పి ఉన్నారు. అందుకే మనం ఈ రోజు ఈ పరిస్ధితిని ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు మూడవ తరంగం గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి, అయితే మనం భయపడాలా, కూడదు. అన్ని విబేధాలను మరచిపోయి అందరం ఐక్యంగా పనిచేయాలి. ప్రస్తుతానికి లోపాల చర్చలను నిలిపివేయాలి, ఒక జట్టుగా పనిచేయాలి.” అని భగవత్‌ చెప్పారు.


ఎంత చక్కటి మాట ? నిజంగా అభినందించాల్సిందే. నరేంద్రమోడీ గారు పరివార్‌ కుటుంబ సభ్యుడే. ప్రతి ఏటా తన ప్రభుత్వ పని తీరు గురించి దాని నాయకత్వానికి విధేయుడిగా నివేదించటం తెలిసిందే. సరిగ్గా ” పరిమితులు లేని సానుకూలత ” గురించి ఉపన్యాసాలు ఇప్పిస్తున్న సమయంలోనే పన్నెండు ప్రతిపక్ష పార్టీలు నరేంద్రమోడీకి ఒక లేఖ రాశాయి. అంతకు ముందు ఎలాగూ అఖిలపక్ష సమావేశం నిర్వహించి కరోనా యుద్దం మీద తీసుకుంటున్న చర్యలను వివరించలేదు, తరువాత అయినా నరేంద్రమోడీ ఎందుకు సానుకూలంగా స్పందించలేదు ? ప్రతిదాన్నీ విమర్శించే ప్రతిపక్షాలతో సమావేశం జరిపి ప్రయోజనం లేదని టీవీల్లో బిజెపి ప్రతినిధుల సమర్ధన. సానుకూల నాటకం భలే సాగుతోంది కదూ !


పుండు మీద కారం రాయటం అంటే ఇదేనా ?

కరోనాతో ఆకస్మికంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు, అనాధలైన పిల్లల గురించి, వీధులపాలైన బతుకుల గురించి రోజూ విషాదకర కథనాలు వెలువడుతున్నాయి.చివరి చూపుకు సైతం నోచుకోవటం లేదు. ఏ రోజు ఎవరి వంతు వస్తుందో తెలియని స్ధితిలో ఉన్న జనానికి భగవత్‌ గారు చెప్పిందేమిటి ? ” భారత పౌరుల గురించి మనకు తెలుసు. జీవన్మరణాల చక్రం తిరుగుతూనే ఉంటుందనీ మనకు తెలుసు. అది ఎలా అంటే పాతపడిన, జీర్ణావస్తలో ఉన్న దుస్తులను మనం ఎలా మార్చుకుంటామో అదే మాదిరి ముసలితనం, పనికిరాని శరీరాన్ని వదలి కొత్త శరీరం కోసం మానవులు ముందుకు పోతారు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు మరియు ఈ పరిస్ధితి మనల్ని భయపెట్టటం లేదా కలవరప్టెకూడదు ”
ఇక భగవత్‌ గారు చెప్పిన ఇతర విషయాలకు వస్తే జనం అనుభవంలోకి రాని, శాస్త్రీయంగా రుజువు గాని వాటిని ఆయుర్వేదం పేరుతో చెప్పేవాటిని, శాస్త్రాలు చెప్పని వాటిని నమ్మవద్దని చెప్పారు. ప్రస్తుత పరిస్ధితిని సమాజం తిరస్కరించాల్సిన అవసరం లేదు, ఏమీ జరగలేదు, అంతా బాగుంది అనే భావాలకు చోటివ్వాలి, శరీరం వైరస్‌ను ప్రతిఘటించాలి, మనస్సు సానుకూలంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఉపాధి, ఆర్ధికరంగాలలో సంక్షోభం, ద్రవ్య సంబంధ వెనుకబాటు తలెత్తనుంది, దానికి మనం సిద్దంగా ఉండాలి.


ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ రవిశంకర్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, అజీమ్‌ ప్రేమ్‌ జీ వంటి వారు ధర్మోపన్యాసాలు చేశారు.సానుకూల ధోరణి అవలంభించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు.వారు చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.యోగా, ఆయుర్వేదం రోగ నిరోధక శక్తిని పెంచుతుందనే ప్రచారం ఇప్పటిది కాదు. దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా అదే పాట పాడారు.
” ప్రభుత్వం పట్ల ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. మీడియాను, వీక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నించటం, ఒకరి నొకరు దెప్పుకోవటం వలన మీరు సమస్యలో భాగం అవుతారు తప్ప పరిష్కారంలో కాదు.దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు తగినన్ని లేవు అయితే తెల్లవారేసరికి మార్పు రాదు.” జగ్గీవాసుదేవ్‌.
మనలో దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని మేల్కొలపాలి. దేవుడు ఉన్నాడని మనకు విశ్వాసం ఉండాలి.మనం బలహీనంగా, నిరుత్సాహంగా ఉన్నట్లు అనుకుంటున్నాము. ఇలాంటి సమయాల్లో నిర్భరతను కోల్లోకూడదు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే వత్తిడి నుంచి దూరం అవుతాము” శ్రీ శ్రీ రవి శంకర్‌.
” అనేక మంది పునర్మజన్మ గురించి పరిశోధనలు చేశారు. అది ఉన్నందున మరణం గురించి భయపడకూడదు. కరోనాతో మరణించినప్పటికీ తదుపరి జన్మలో కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఐదు పది సార్లు ఓం కారాన్ని పలికితే బలం వస్తుంది. సానుకూల వైఖరి కలిగిస్తుంది.” సామాజిక కార్యకర్త నివేదిత భిడే. మూడు నిమిషాలు మాట్లాడిన విప్రో సిఇఓ అజీమ్‌ ప్రేమ్‌ జీ పేదల్లో అత్యంత నిరుపేదలను ఇప్పుడు అదుకోవాలన్నారు. మంచి శాస్త్రాల మీద ఆధారపడిన చర్యలను వేగంగా అన్ని రంగాలలో తీసుకోవాలన్నారు. విబేధాలను మరచి అందరూ ఐక్యం కావాలన్నారు.

కరోనిల్‌ అనే ఔషధం కరోనా చికిత్సకు పనికి వస్తుందనే ప్రచారంతో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్న రామ్‌దేవ్‌ బాబా ఆస్తా టీవీ ఛానల్లో ఆక్సిజన్‌ కొరత గురించి ప్రస్తావించిన వారితో చెప్పిన మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూడండి.” మనకు దేవుడు ఇక్కడ రెండు సిలిండర్లు ఇస్తే జనాలు బయట ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం చూస్తున్నారు. వాటిని ఉపయోగించండి అమాయకులారా ” అంటూ గుండెలోని ఊపిరితిత్తులను చూపారు. ”ఇక్కడ రెండు సిలిండర్లు ఉన్నాయి. మీ రెండు కాళ్లు ఇద్దరు వైద్యుల వంటివి, మీ రెండు చేతులు ఇద్దరు నర్సుల వంటివి ” అన్నారు. ఇదే పెద్ద మనిషి ఆవనూనె పీలిస్తే కరోనా వైరస్‌ నశిస్తుందని సెలవిచ్చిన విషయం తెలిసిందే. భోపాల్‌ బిజెపి ఎంపీ, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఆవు మూత్రం తాగి కరోనా సోకుండా ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

దృష్టి మళ్లించే ఎత్తుగడలు


ఒకవైపు ఢిల్లీ శివార్లలోని రైతులంతా వెళ్లిపోయారని ప్రచారం చేశారు. కొంత మంది వెళ్లారు తప్ప నిరసన శిబిరం ఖాళీ కాలేదు. వేలాది మంది అక్కడే ఉన్నారు. అయితే గోధుమ కోతల తరుణంలో గ్రామాలకు చేరుకున్న వారు ఆపనులు పూర్తయిన తరువాత, కొత్త రైతులు తిరిగి ఢిల్లీ శివార్లకు వస్తున్నారన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో మే నెల 14వ తేదీన నరేంద్రమోడీ నోటివెంట పిఎం కిసాన్‌ నిధుల అందచేత ప్రకటన వెలువడింది. పోనీ వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్లు విధించినా ఆర్ధిక కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో, ఎంత మందికి ఉపాధి కల్పించారో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో వంటి విషయాలను ప్రకటిస్తూ వాటితో పాటు రైతుల నిధుల గురించి చెబితే సాధారణ వ్యవహారం అనుకుంటారు.వాటి గురించి ఆందోళనకరమైన వార్తలు ఎన్ని వచ్చినా నోరు విప్పని వారు దీని గురించి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే మోడీ అజెండాలో కరోనా లేదన్నది స్పష్టం.


తాను కరోనా గురించి ఎంతో ఆవేదన, బాధ పడుతున్నట్లు మోడీ చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ఇది ఓదార్పు అనుకుందాం. సురక్షితమైన చేతుల నుంచి చేతల బాధ్యత కదా ఇప్పుడు కావాల్సింది.టన్నుల కొద్దీ ఆవేదన వ్యక్తం చేస్తే ఒక లీటర్‌ ఆక్సిజన్‌ అవుతుందా ? ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు మెరుగుపడతాయా ? కావాల్సిన ఔషధాలు దొరుకుతాయా ? కరోనాపై పోరు, యుద్దం, సమూల నాశనం వంటి ఉపమాలంకారాలతో కూడిన మాటలు బాధితులకు ఉపయోగపడవు. యుద్దాన్ని ఎదుర్కొనే తీరులో సన్నాహాలు, చర్యలు ఉన్నాయా? అధికారాలను ఉపయోగిస్తున్నారా ? అందరికీ ఉచితంగా వేస్తామన్న వాక్సిన్‌ విషయంలో మడమ తిప్పారు, జనానికి విశ్వాసం కల్పించలేకపోగా సగం భారాన్ని రాష్ట్రాల మీద నెట్టారు. రాష్ట్రాలకు అధిక రేటు, కేంద్రానికి తక్కువ రేటట. ఏమిటీ వ్యాపారం ? వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోది, వాటిదే బాధ్యత అంటున్నారు. మీ పరిధిలోని ఆక్సిజన్‌ కూడా అందించలేని పరిస్ధితి ఎందుకు తలెత్తింది అంటే జవాబు లేదు. దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు. అసలు సమస్య ఏమంటే తమ వైఫల్యాలను అంగీకరించేందుకు బిజెపి నేతలు సిద్దంగా లేరు. ఆక్సిజన్‌ కొరత అన్నది దేశ వ్యతిరేకులు చేస్తున్న విష ప్రచారం తప్ప మరొకటి కాదని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ వర్ణించారు.

కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని ప్రధాని చెప్పారు. దాని మీద విజయం సాధించామని చెప్పినపుడు కనిపించిందా ? హెచ్చరికలను పెడచెవిన పెట్టినపుడు ఎక్కడైనా నక్కిందా ? ప్రపంచ వ్యాపితమైన మహమ్మారిని జయించినట్లు ప్రకటించాల్సింది ప్రపంచ ఆరోగ్య సంస్ద తప్ప ఒక దేశం కాదు. చైనా వంటి దేశాల్లో కొత్త కేసులేవీ లేనందున అదుపులో ఉంచామని చెబుతున్నారు తప్ప జయించామని వారే చెప్పలేదు. మరి మన దేశం ఏ సాధికారతతో అలాంటి ప్రకటనలు చేసినట్లు ?కేరళ ముఖ్యమంత్రి ప్రతి రోజూ విలేకర్లతో మాట్లాడుతున్నారు, కరోనా, ఇతర అంశాలను చెబుతున్నారు. ప్రధానికి విలేకర్లతో మాట్లాడే అలవాటు లేదు కనుక ఎవరూ ఆశించరు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఏమయ్యారు. అందుకే కదా అవుట్‌లుక్‌ పత్రిక ఏడేళ్ల వయసున్న ప్రభుత్వం కనపడటం లేదు అని ముఖచిత్ర కధనాన్ని రాసింది. అది కూడా ” జాతి వ్యతిరేకుల ” శిబిరంలో చేరింది. ఒక నాడు సంఘీయుల ప్రశంసలు అందుకున్న గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన కవిత మే 11వ తేదీ నుంచి దేశంలో వైరల్‌ అవుతోంది. అన్ని భాషల్లోకి అనువదించి వ్యాపింప చేస్తున్నారు. నరేంద్రమోడీని నగచక్రవర్తితో పోల్చి తన ఆవేదనను వ్యక్తం చేసి ఇప్పుడు పరివార్‌ ఆగ్రహానికి గురయ్యారు.శీలము, ఏకత, సంస్కారం గురించి మాట్లాడేవారు నోరుబట్టని బూతులతో ఆమెను ట్రోల్‌ చేస్తున్నట్లు వార్తలు. ఎంతలో ఎంత మార్పు !