ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీని అర్ధం ఇంకేమీ లేవని, కనిపించటం లేదని కాదు. మచ్చుకు పదకొండు సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి ఏప్రిల్ నెలలో టోకు ధరల పెరుగుదల 10.5శాతంగా నమోదైంది.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడగానే ఆగిపోయిన చమురు ధరల పెరుగుదల ఫలితాలు వచ్చిన తరువాత నుంచీ రోజు రోజుకూ ఎలా పెరుగుతోందో కనిపిస్తూనే ఉంది. ఇక ప్రధాన దృశ్యాలలో ఒకటి తమను ఎప్పుడు ఎలా కబళించి ఏం చేస్తుందో అన్న భయంతో వణికి పోతున్న దేశ ప్రజలు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ బిజెపి నేతలు గుండెలు బాదుకుంటున్నది రెండవది. మొదటి దాని విషయానికి వస్తే వైద్య సౌకర్యాలు సరిగా లేవు, చెట్ల కింద చికిత్స చేస్తున్నారంటూ మీడియాకు చెప్పిన గ్రామీణులపై మాన్యశ్రీ యోగి ఆదిత్యనాధ్ గారి ఏలుబడిలోని ఉత్తర ప్రదేశ్ గౌతమ బుద్ద నగర్ జిల్లా పోలీసులు పుకార్లు వ్యాపింప చేస్తున్నారంటూ మీడియా ఫొటోలు వచ్చిన తరువాత కూడా కేసులు పెట్టారు. ఇక రెండవ దాని విషయంలో బిజెపి పెద్దలను తప్పుపట్టాల్సిన పని ఏముంది ఎవరికి ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యత కదా ! వినూత్న దుస్తుల రాజు పాలనలో ఇంతకంటే మరొకటి జరుగుతుందా !
బిజెపి నేతలు గుండెలు బాదుకుంటున్న దారుణం ఏమిటట ! కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని ప్రధాని నరేంద్రమోడీ, ఇతర కేంద్ర మంత్రుల ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా దేశ విదేశాల్లో ప్రచారం చేయాలంటూ కాంగ్రెస్ తన శ్రేణులకు అందచేసేందుకు రూపొందించిన ఒక రహస్య టూల్ కిట్ బయటపడిందట. బిజెపి నేతలు వర్ణించిన దాని ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా మహమ్మారిని ” మోడీ (రకం) వంశ ” రకం అని వర్ణించాలని కాంగ్రెస్ కార్యకర్తలు, టీవీల్లో మాట్లాడే వారికి, ప్రకటనలు చేసే అధికార ప్రతినిధులకు, ఆ పేరుతో వర్ణనలు చేస్తూ రాయాలని, చర్చల్లో మాట్లాడాలని దేశ, విదేశీ జర్నలిస్టులను ప్రభావితం చేయాలని దానిలో ఉందని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చెబుతున్నారు. ఆ పత్రాల్లో మోడీ వైరస్, భారతీయ వైరస్, తప్పి పోయిన అమిత్ షా, క్వారంటైన్‌లో జై శంకర్, మంద బుద్ది నిర్మలా సీతారామన్, పక్కకు తప్పించిన రాజనాధ్ , కుంభమేళాతో పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి తదితర అంశాలను ప్రచారం చేయాలని ఆ పత్రాల్లో ఉన్నట్లు బిజెపి నేతలు చెబుతున్నారు. నరేంద్రమోడీని ద్వేషిస్తే అది దేశాన్ని ద్వేషించినట్లే అని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ భాష్యం చెప్పారు. ఇందిరే ఇండియా – ఇండియాయే ఇందిర అని గతంలో డికె బారువా అనే కాంగ్రెస్ పెద్దమనిషి చెప్పిన అంశాన్ని ఇది గుర్తు చేసింది.
అలాంటి టూల్‌కిట్ తాము తయారు చేయలేదని, అది కల్పితం అని కాంగ్రెస్ చెబుతోంది. తమ పార్టీ లెటర్ హెడ్‌ను ఫోర్జరీ చేసి దాని మీద కల్పిత, కట్టుకథలతో ఉన్న అంశాలను ముద్రించి సామాజిక మాధ్యమంలో ఇతరులకు పంచినందుకు గాను ఢిల్లీలో ఒక కేసును నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఢిల్లీ పోలీసు కమిషనరుకు ఫిర్యాదు చేసింది. దానిలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పార్టీ నేతలు సంబిత్ పాత్ర, బిఎల్ సంతోష్ తదితరుల పేర్లను చేర్చింది. మత విరోధం కలిగించేందుకు, వర్తమాన మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్ధితిలో ప్రజలకు సాయం చేయటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్ వైఫల్యాల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి నేరానికి పాల్పడినట్లు కాంగ్రెస్ పేర్కొన్నది.
ఇక్కడ ప్రతి వారూ గమనించాల్సిన అంశం ఏమంటే మన దేశానికి చెందిన రాజకీయ పార్టీలు, సంస్ధలు దేశంలో, వెలుపలా కొన్ని ఫేక్ న్యూస్, ఫొటోలు, రచనలను తయారు చేసే ఫ్యాక్టరీలను నడుపుతున్నాయి. సామాజిక మాధ్యమం ద్వారా వాటిని వ్యాపింప చేస్తున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా ప్రధాని మోడీ మేకిన్ ఇండియా కార్యక్రమంలో వస్తూత్పత్తి లేదు గానీ ఇవి పుష్కలంగా తయారవుతున్నాయి. అలాంటి వాటిలో తమకు ఆపాదించిన టూల్‌కిట్‌ను తాము తయారు చేయలేదని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిన తరువాత దానిలోని అంశాల గురించి చర్చ జరపటంలో అర్ధం లేదు. కానీ బిజెపి వారు దాన్ని అంగీకరించటం లేదు, మీరే తయారు చేశారు అంటూ ఇవిగో అంశాలని అధికారికంగా చెబుతున్న మాటలు, ప్రచారాన్ని చూసిన తరువాత వారి తీరుతెన్నుల గురించి చర్చించాల్సి వస్తోంది. కరోనా రెండవ తరంగాన్ని గుర్తించటంలో, జాగ్రత్తలు తీసుకోవటంలో వైఫల్యంతో దిక్కుతోచని మోడీ యంత్రాంగ ప్రచారదాడిలో ఇది ఒక ఆయుధం. మన దేశంలో ఇంటర్నెట్‌ను ఎందరు ఉపయోగిస్తున్నారు. వారిలో సామాజిక మాధ్యమంలో ఎందరు ఉన్నారు. బిజెపి నేతలు అందచేస్తున్న వాటిని పంచుకొనే వారు ఎందరు, వారు ఎవరు అన్నది ప్రశ్న. చాలా తక్కువ అన్నది జవాబు. కానీ బిజెపి నేతలు చేసిన ప్రకటనలు, దాని మీద కాంగ్రెస్ స్పందన వార్తలను పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకున్నవారే ఎక్కువ. వారందరూ నరేంద్రమోడీకీ అంటించదలచిన లేదా అంటించినట్లు చెబుతున్న మచ్చ – రచ్చ గురించి చర్చించుకోవటం సహజం. ఆక్సిజన్ కూడా అందించలేని కేంద్ర నిర్వాకం చూసి విస్తుపోతున్న వారు ఒక వేళ కాంగ్రెస్ వారు నిజంగా అంటే మాత్రం తప్పేముందిలే అనుకుంటున్నారు. కాంగ్రెస్ కంటే బిజెపి వారే సినిమాల్లో మాదిరి మోడీ మచ్చ గురించి రచ్చ చేశారు. జనానికి ఎక్కువ మందికి తెలియ చేశారు. జనానికి లేని ే ఆలోచనను కలుగ చేశారు. నరేంద్రమోడీ రాజీనామా చేయాలంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్ల స్పందన మీద కాషాయ నటి కంగన రనౌత్ వెల్లడించిన ఆగ్రహం తీరు కూడా నరేంద్రమోడీ ప్రతిష్టను మరింత దిగజార్చింది తప్ప పెంచలేదు.
బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ ప్రజలను పట్టించుకోని పాలకుల గురించి ప్రపంచంలో ఒక కధ ఉంది. మన దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. అదేమంటే ” రాజుగారి వింత బట్టలు లేదా దిగంబర మహరాజు ” గురించి చాలా మంది వినే ఉంటారు. గుజరాతీ కవయిత్రి పారుల్ కక్కర్ రాసిన కవితలో దిగంబర రాజు గురించి ప్రస్తావన రావటంతో దేశ వ్యాపితంగా ఆమె గురించి జనం మెచ్చుకుంటున్నారు. గతంలో సంఘపరివార పత్రిక ఒకదానిలో భవిష్యత్ గుజరాతీ కవయిత్రిగా వెలుగొందుతారు అని ఆమెను ప్రశంసించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె రాసింది మహా కావ్యమేమీ కాదు. దేశంలోని పరిస్ధితులను చూసి చలించి రాసిన పద్నాలుగు పంక్తుల ఆమె కవితలో నగరాజు, బిల్లా-రంగా పదాలకు ఎవరి భాష్యం వారు చెబుతున్నారు. నగరాజు అంటే నరేంద్రమోడీ, బిల్లా-రంగా అంటే మోడీ-అమిత్ షా అని సామాజిక మాధ్యమంలో వారి చిత్రాలతో సహా వర్ణించారు. గీతా-సంజరు అనే సోదరీ సోదరుల కిడ్నాప్-హత్యలో నేరగాండ్ల పేర్లు వేరే ఉన్నప్పటికీ వారు బిల్లా-రంగాలనే పేర్లతో వ్యవహరించిన వారన్నది తెలిసిందే.
దిగంబర రాజు కధ గురించి నాలుగు ముక్కల్లో చెప్పుకుందాం. జనం గోడు పట్టని రాజుగారికి దుస్తుల సరదా. కొత్త కొత్తవి వేసుకొని పురవీధుల్లో తిరిగి తన దర్పాన్ని ప్రదర్శించుకోవటం అలవాటు. అలాంటి రాజు ఒక రోజు ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ ధరించని వస్త్రాలను తయారు చేసి ఇవ్వాలని నేతగాండ్లను ఆదేశించాడట, అపని చేయకపోతే వారి సంగతి చూస్తానని బెదిరించాడు. దీంతో ఒక తెలివిగల యువకుడు ఒక రోజు ఉదయాన్నే వచ్చి రాజా మీరు కోరిన దుస్తులు తెచ్చాను ధరించండి అని చెప్పాడు. అదేమిటి నీ చేతుల్లో ఏమీ లేవు కదా అంటే రాజా అవి తెలివిగల వారికి మాత్రమే కనిపిస్తాయి, మిగతావారు చూడలేరు అన్నాడట. ఆ విషయం రాజ్యంలో వైరల్ అయింది. మరుసటి రోజు ఆ యువకుడు రాజుగారికి బట్టలు వేసినట్లు హావభావాలు ప్రదర్శించాడు. రాజు గారికి బట్టలేమీ కనిపించలేదు. నిండు పేరోలగంలో తెలివిగల వారికే కనిపిస్తాయని చెప్పినందున తనకు కనిపించటం లేదని అంటే తననెక్కడ తెలివి తక్కువ దద్దమ్మ అనుకుంటారో అనుకొని రాజు గారు బాగున్నాయి బాగున్నాయి అని పరివారంతో కలసి పురవీధుల సందర్శనకు వెళ్లాడు. రాజుగారిని విమర్శిస్తే పట్టే గతేమిటో జనానికి తెలుసు, దానికి తోడు తెలివి గలవారికే కనిపిస్తాయని అన్నారు గనుక ఎవరూ కనిపించలేదని చెప్పేందుకు ముందుకు రాలేదు. అయితే ఒక తల్లి చేతిలోని చిన్న పిల్లవాడు రాజుగారు దగ్గరకు రాగానే షేమ్ షేమ్ పప్పీ షేమ్ అంటూ నవ్వాడు. రాజుగారికి కోపం వచ్చి నేరుగా ఆ పిల్లవాడినే అడగ్గా అభశుభం తెలియని బాలుడు మీకు బట్టల్లేవు అందుకని నవ్వా అన్నాడట. వెంటనే రాజుగారికి అర్ధం అయింది.ఆ పిల్లవాడు కల్మషం లేకుండా తాను చూసింది చెప్పినట్లుగానే గుజరాతీ కవయిత్రి పారుల్ కక్కర్ కూడా కరోనా మరణమృదంగం, గంగలో కొట్టుకువస్తున్న శవాలు, పాలకుల నిర్లక్ష్యంతో దేశంలో ఉన్న పరిస్ధితి గురించి సహజంగానే స్పందించారు.
రైతు ఉద్యమానికి మద్దతుగా దిశా రవి అనే కర్ణాటక యువతి టూల్‌కిట్‌ను సరఫరా చేసిందంటూ దేశద్రోహం కేసును కేంద్ర ప్రభుత్వం బనాయించిన విషయం తెలిసిందే. దిశా రవిపై మోపిన ఆరోపణలో దేశద్రోహం కనిపించలేదంటూ బెయిలు మంజూరు చేశారు. తన గోప్యత ఉల్లంఘన, విచారణ న్యాయంగా జరగాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటీషన్ మీద మార్చి నెలాఖరులోగా సమాధానం దాఖలు చేసేందుకు ఆఖరి గడువు ఇస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు గతంలో కేంద్రానికి తెలిపింది. అయినా స్పందించలేదు. కరోనా కారణంగా దాఖలు చేయలేకపోయినట్లు మే 18వ తేదీన కేంద్రం చెప్పటం మీద హైకోర్టు మండిపడింది. ఆఖరి అవకాశం అంటే అర్ధం తెలియదా అని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆగస్టు నాటికి వాయిదా వేసింది.
ఇక టూల్‌కిట్ల విషయానికి వస్తే ప్రతి పార్టీ తన ప్రతినిధులు, టీవీ చర్చలలో పాల్గొనే వారికి, తమ అనుయాయి టీవీ ఛానళ్లు, రాతలు రాసే జర్నలిస్టులు, పత్రికలకు ప్రతి రోజూ ఒక టూల్‌కిట్ అందిస్తుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యం. వాటిని పట్టుకొని వారు తమ పాత్రలను తాము పోషిస్తారు.సింగపూర్ కరోనా వైరస్ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్ చేసిన ప్రకటన బాధ్యతా రహితమని విదేశాంగ మంత్రి జైశంకర్ తప్పు పట్టారు. ఒక ముఖ్యమంత్రిగా కేజరీ వాల్ అలా వర్ణించటం తగనిపని, తప్పదమే. ఒక వైరస్‌కు ఒక దేశం, ఒక ప్రాంతం, జాతి వంటి పేర్లను ఉపయోగించకూడదన్నది అంతర్జాతీయ ఒప్పందం. కానీ ఊహాన్, చైనా, కమ్యూనిస్టు వైరస్ అంటూ చర్చలలో బిజెపినేతలు ఉపయోగించటం తెలిసిందే. అలా ఉపయోగించకూడదని ఎన్నడూ బిజెపి బహిరంగప్రకటన చేయలేదు. అలా నిందించటం చైనాతో సంబంధాలను మెరుగుపరుస్తాయని అనుకుంటున్నారా ?
దిశ రవి టూల్‌కిట్‌ను పంచుకోవటం(షేరింగ్) దేశద్రోహంగా వర్ణించిన బిజెపి నేతలు ఇదిగో కాంగ్రెస్ టూల్‌కిట్ అంటూ తాము అభ్యంతరం చెబుతున్నదానికి ఎందుకు తమ అనుయాయులతో పంచుకున్నట్లు ? అభ్యంతర వర్ణణలను ఎందుకు తామే వ్యాప్తి చేస్తున్నట్లు ? కాంగ్రెస్ టూల్ కిట్ నిజమైనదే అయితే అది నిజంగా ప్రధాని, ఇతర నేతలకు మచ్చ తెచ్చేది, విదేశీ జర్నలిస్టులకు తోడ్పడేదే అయితే బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం కేసు ఎందుకు దాఖలు చేయలేదు, మీడియా పరంగా ఎందుకు సమస్యను ముందుకు తెస్తున్నారనే ప్రశ్న సహజంగానే వస్తుంది. తమ నేతలే తనను గబ్బు పట్టిస్తున్నారనే అంశం నరేంద్రమోడీకి అర్ధం అవుతున్నదా ? అనే సందేహం తలెత్తుతున్నది.