Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


హిట్లర్‌, రెండవ ప్రపంచ యుద్దంలో ఓటమి పాలై అవమానం భరించలేక ఆత్మ హత్యకు పాల్పడి దిక్కులేని చావు చచ్చి ప్రపంచమంతా ద్వేషించిన జర్మన్‌ నాజీ పాలకుడు.
నరేంద్రమోడీ, దేశ రాజకీయ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించి గద్దెనెక్కి ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఏలిక.
మార్టిన్‌ నియోములర్‌, లూథరన్‌ క్రైస్తవ పూజారి, తొలి రోజుల్లో హిట్లర్‌ అభిమాని-కమ్యూనిస్టు వ్యతిరేకి.హిట్లర్‌ నిజస్వరూపం తెలుసుకొని వ్యతిరేకించినందుకు జైలు పాలైన వారిలో ఒకడు.
పారుల్‌ ఖక్కర్‌, నరేంద్రమోడీ అభిమాని, భవిష్యత్‌లో గుజరాతీ కవులకు ప్రతీకగా మారతారని సంఘపరివార్‌ ప్రశంసలు పొందిన కవయిత్రి. మోడీ పాలనా తీరును భరించలేక కవిత రాసినందుకు అదే పరివార్‌ బూతులతో అవమానాల పాలైన బాధిత మహిళ.
తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు….. అనే పదాలతో ప్రారంభించి నాజీల తీరు తెన్నులు- సమాజ స్పందనను వర్ణించి దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదమైన కవితను జైలు గోడల మధ్య రాసిన రచయిత నియోములర్‌. హిట్లర్‌ను బలపరిచినందుకు పశ్చాత్తాప పడుతూ భవిష్యత్‌ తరాలను హెచ్చరిస్తూ చేసిన రచన అది.
అన్ని దేశాలలో, భాషలలో చెప్పుకొనే దిగంబర రాజు కథలో రాజుకు బట్టలు లేవంటూ అమాయకత్వం తప్ప అభం శుభం తెలియని ఒక పిల్లవాడు నిజం చెబుతాడు. గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలతో సంబంధం లేని భక్తి గీతాలు, భావ కవితలు రాసే అలవాటున్న ఖక్కర్‌ నరేంద్రమోడీ పాలన తీరు తెన్నులు చూసి భరించలేని పసిపిల్ల మాదిరి ఆవేదనతో అల్లిన కవిత. ఇప్పుడు దేశవ్యాపితంగా అన్ని భాషల్లో అనువాదమై వైరల్‌ అవుతోంది.
హిట్లర్‌ అంతమైన తరువాత మార్టిన్‌ నిములర్‌ను మిత్రరాజ్యాల సేనలు జైలు నుంచి విముక్తి చేశాయి.
కవిత రాసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు పారుల్‌ను నోరుబట్టని బూతులతో బిజెపి సంస్కృ(తి)త పండితులు నిందిస్తున్నారు. వారు నిత్యం ప్రవచించే ఏకత, శీలము, సంస్కారానికి అర్ధం ఇదా అని జనం విస్తుపోతున్నారు.


తన కవిత మీద తీవ్ర దుమారం, బెదిరింపులు, దూషణలు వెల్లడైనప్పటికీ తన రచనను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని తానెలాంటి తప్పు చేయలేదని పారుల్‌ ఖక్కర్‌ చెప్పారు. నరేంద్రమోడీని ఆయన అంతరంగం అమిత్‌ షాను విమర్శించిన వారికి ఏ గతి పడుతుందో తెలియనంత ఎడారిలో, అడవిలో ఆమె లేరు. అందుకే ఒకే ఒక్కడు అన్నట్లుగా గుజరాత్‌లో మోడీని తప్పు పట్టిన ఆమెను ఒకే ఒక్కతె అనవచ్చు. కేవలం పద్నాలుగు పంక్తుల కవితతో విశ్వగురువు పీఠాన్ని, పరివారాన్ని గడగడలాడించిన ఆ రచనలోని ఆవేదనను అర్ధం చేసుకొని మరింతగా ప్రచారంలోకి తేవటమే ఆమెకు మనమిచ్చే ఘనమైన గౌరవం. మే పదకొండవ తేదీ వరకు కేవలం గుజరాత్‌కే తెలిసిన ఆమె నేడు దేశ వ్యాపితంగా ప్రాచుర్యం పొందారు. అన్నింటికీ మించి హమ్మయ్య చివరికి గుజరాత్‌లో కూడా స్పందించే వారు ఉన్నారంటూ అనేక మందికి ప్రాణం లేచి వచ్చేట్లు చేశారు.


ఎందరో పేరు ప్రఖ్యాతులున్న కవులు, కవయిత్రులు ఉన్నారు. కరోనాతో నిమిత్తం లేకుండానే గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఉన్న భావ ప్రకటన స్వేచ్చ పరి(దు)స్ధితిని చూసి మన కెందుకులే అని కలాలను, గళాలను మూసుకున్నవారే ఎక్కువ. ఆరోగ్యానికి హానికరం అని తెలిసీ దురలవాట్లను మానుకోని వారి మాదిరి వారంతా చెవులు కొరికే లక్షణంతో బాధపడుతున్నారన్నది స్పష్టం. గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే. ఎక్కడైనా ఒకటో అరా విమర్శనాత్మక రచన చేసినా, గళం విప్పినా, శిరమెత్తినా వాటికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్న బూతు పురాణాలను చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఖక్కర్‌ కవితకు గుజరాత్‌లోని ప్రముఖ కవులు, కళాకారుల నుంచి మద్దతు రాలేదు. అయితే గుజారాతీ లేఖక్‌ మండల్‌ అనే సంస్ధ మాత్రం మద్దతు ప్రకటించింది. ఆమెను నిందించే బిజెపి మరుగుజ్జులను ఖండించింది.

గుజరాతీ రచయిత్రి, సినిమా దర్శకురాలు మెహుల్‌ దేవకళ పారుల్‌ ఖక్కర్‌ గురించి, తన అనుభవాన్ని వివరిస్తూ రాసిన వ్యాసాన్ని కొన్ని ఆంగ్ల మీడియా సంస్ధలు ప్రచురించాయి. దాని సారం ఇలా ఉంది. ” నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత తొలిసారిగా ఆయన మాతృభాష గుజరాతీలో మోడీని విమర్శించటమే గాక కరోనా రెండవ తరంగం గురించి సామాన్యుల ఆవేదనను వ్యక్త పరిచిన కవిత బహుశా ఇదేనేమో. శవవాహిని గంగ పేరుతో రాసిన కవిత దావాలనంలా వ్యాపించింది, గుజరాతీ సాహిత్యకారులు మొద్దుబారి పోయారు, ఎలా స్పందించకూడదో వారికి తెలుసు. అయితే సాహిత్యంతో పనిలేని సామాన్య గుజరాతీలు ఆ కవితలో తమ మనోభావాలు ప్రతిబింబించినట్లు భావించారు. విస్కృతంగా పంచుకున్నారు.యాభై ఒక్క సంవత్సరాల ఖక్కర్‌ భావ గీతాల కవయిత్రిగా పరిచయం. అమె గతంలో రాజకీయ అంశాలను సృజించలేదు.వివాహమై, పిల్లలు పుట్టి స్ధిరపడిన తరువాత ఆలస్యంగా అమె సాహితీ ప్రయాణం ప్రారంభించారు.త్వరలోనే సాహితీ బృందాలలో ఒక స్ధానం సంపాదించుకున్నారు. గృహిణిగానే ఉన్న ఆమెతో కలసి నేను అనేక సాహితీ సమావేశాలలో కవితా గానాలు చేశాను. ఆమె రాసిన తాజా కవిత మితవాద శక్తులకు పిడుగు పాటు వంటిది.ఆమె ఎన్నడూ ప్రభుత్వ వ్యతిరేకిగా లేరు, అలాంటి కవితలు ఆమె రాస్తారని అనుకోరు. అయితే ఆమె చుట్టూ ఉన్న పరిస్ధితులు, ప్రభుత్వ ఘోరవైఫల్యం ఆమెను అందుకు పురికొల్పాయి.నేను ఫోనులో మాట్లాడి ఫేస్‌బుక్‌ నుంచి కవితను తొలగించనందుకు ఆమెను అభినందించినపుడు నేనెందుకు దాన్ని తొలగించాలి, నేను చెప్పినదానిలో తప్పేముంది అంటూ సన్నగా నవ్వుతూనే ధృడంగా చెప్పారు.


ఆమెను దీర్ఘకాలంగా అభిమానిస్తున్నవారు ముఖం చాటేశారు, దూరం జరిగారు.తరువాత ఖక్కర్‌కు ఏమి జరుగుతుందో నేను చెప్పగలను. దేశంలో అసహన సంస్కృతి పెరుగుతున్న నేపధ్యంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాయాలని 2015 అక్టోబరులో నేను నిర్ణయించుకున్నాను. గుజరాత్‌లోని అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులను కలసి దాని మీద సంతకం చేయాలని కోరాను.నైతికంగా మద్దతు తెలిపారు తప్ప సంతకాలు చేసేందుకు తిరస్కరించారు. నిజం చెబితే వచ్చే ముప్పును స్వీకరించేందుకు సిద్దపడలేదు. భయంతో గుసగులాడుకోవటాన్ని అలవాటు చేసుకున్నారు. నా లేఖపై సంతకాలు చేయని గుజరాతీ సాహిత్యకారుల గురించి మొద్దుబారిపోయారని ఒక జాతీయ పత్రిక మొదటి పేజీలో వ్యాఖ్యానించింది. ఆ లేఖ తరువాత సాహితీ సమావేశాల్లో , అవార్డులకు సిఫార్సుల్లో నా పేరును తొలగించారు. ఖక్కర్‌ కవిత తరువాత ప్రభుత్వ అనుకూల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక ప్రముఖ మహిళా కాలమిస్టు తన వ్యాసం మొత్తాన్ని ఖక్కర్‌కు కేటాయించి కవిత ఉద్ధేశ్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక ఫాషనై పోయింది అని ఆగ్రహించారు. కొందరు బిల్లా -రంగా, ఫిడేలు వంటి పదాలను ఉపయోగించటం ఏమిటని ప్రశ్నించారు. మరికొందరు కవితాత్మకంగా సమాధానాలిచ్చారు. మరొక రచయిత ఎవరూ ఖక్కర్‌ను అనుసరించి అలాంటి విమర్శనాత్మక కవితలు రాయకూడదన్నది వారి స్పష్టమైన ఉద్దేశ్యం. అనేక మంది రచయితలు, వ్యాసకర్తలు సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి అనుకూలం వాదనలతో రంగంలోకి దిగారు. ఎక్కువ మంది గుజరాతీ కవులు మౌనం దాల్చారు.నేను సామాజిక మాధ్యమంలో రాసిన వాటిని చూసి వెనక్కు తగ్గమని తోటి గుజరాతీ రచయితలు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఖక్కర్‌ పేరు వినని వారు కూడా ఆమె కవితకు మద్దతు ఇస్తున్నారు. అది ఇప్పుడు భాషా సరిహద్దులు దాటిపోయింది. చివరికి రచయిత్రితో సహా ఎవరూ కూడా దాని ప్రయాణాన్ని ఆపలేరు.” అని దేవకళ పేర్కొన్నారు.


1973-74లో గుజరాత్‌లో నవనిర్మాణ ఆందోళన పేరుతో ఏర్పడిన సంస్ధ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి చిమన్‌భారు పటేల్‌ ఉద్వాసనకు కారణమైంది. ఆ సంస్ద అధ్యక్షుడిగా పని చేసిన మానిషీ జానీ ప్రస్తుతం గుజరాతీ లేఖక్‌ మండల్‌ అధ్యక్షుడిగా ఒక ప్రకటన చేస్తూ ఈ కవితను పూర్తిగా సమర్ధించిన వారిలో ఉన్నారు. బిజెపి నిందా ప్రచారాన్ని ఖండించారు. సంస్ధ కార్యదర్శి మన్‌హర్‌ ఓజా కూడా సమర్ధించటమే గాక సామాజిక మాధ్యమంలో ప్రతి భారతీయుడు ఆమెకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.


తన కవిత వైరల్‌ అవుతున్న సమయంలో ఒక గృహిణిగా ఖక్కర్‌ ఇల్లు తుడుస్తూ లేదా చపాతీలు చేస్తూ ఉండి ఉంటుందని ఆమె బంధువు ఒకరు ది వైర్‌ పోర్టల్‌తో చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె భర్త ఒక బ్యాంకు ఉద్యోగి.తన భార్య కవితల పట్ల ఆయన గర్వపడతారు. అనేక మంది యువతుల మాదిరి కళాశాలలో చదువుతూ డిగ్రీ రెండవ సంవత్సరంలో మానివేసి వివాహం చేసుకొని గృహిణిగా స్ధిరపడ్డారు. అయితే ఆమెకు స్కూలు దశలోనే రాయటంపై మక్కువ ఏర్పడింది. పదవతరగతిలో ఉండగా 1984లో తొలి కవిత రాశారు. ఇందిరా గాంధీ మరణం, ఆమె వ్యక్తిత్వం గురించి దానిలో పేర్కొన్నారు. అయితే వివాహం తరువాత కవితలు రాయటం నిలిపివేశారు. 2011లో కుమారుడు ఆమెకు ఇంటర్నెట్‌ను, సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమెలోని కవయిత్రి మేలుకున్నది. గజల్స్‌ ఇతర కవితలు రాసింది.తాను ఆధ్యాత్మికవాదినని, కవిత్వం తన జీవితానికి నిశ్శబ్దంగా మద్దతు ఇస్తుందని, కవితలంటే ఇష్టమని తన గురించి రాసుకున్నారు. ఆమె రాసిన అనేక భక్తి గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. విష్ణు పాండ్య అనే రాజకీయ చరిత్రకారుడు ఆర్‌ఎస్‌ఎస్‌ గుజరాతీ పత్రిక సాధనలో పని చేసేవ్యక్తి. నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత పాండ్యకు పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. పారుల్‌ ఖక్కర్‌ భవిష్యత్‌లో గుజరాతీ కవితకు పెద్ద ప్రతీకగా ఎదుగుతారని వర్ణించారు. శవగంగ పేరుతో కవిత రాసిన తరువాత బిజెపి మరుగుజ్జులు ఆమె పరిణితిలేనిది, హిందూ వ్యతిరేకి, నైతిక విలువలు లేనిది, బజారు మనిషి అంటూ బూతులు తిడుతూ పోస్టులు పెడుతుంటే ఆమెను అంతగా పొగిడిన ఆ పెద్దమనిషి ఖక్కర్‌ రక్షణకు రాలేదు. రాజకీయంగా ఆమె కుటుంబం బిజెపికి మద్దతు ఇస్తుంది, ఎప్పుడూ ఆ పార్టీని వ్యతిరేకించలేదు. ఖక్కర్‌ కవితను ఆమె ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని బిజెపి వారు ప్రచారం చేశారు. అయితే వారి దాడి నుంచి తట్టుకొనేందుకు తన ఫేస్‌బుక్‌కు తాళం వేశారు తప్ప కవితను తొలగించలేదు. ఆమె ఖాతాలోని స్నేహితులు తప్ప బయటి వారు చూడలేరు.


ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప వాటి మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాదు గానీ దిగంబర రాజు, బిల్లా-రంగా వంటి పదాలను వాడినందుకు మోడీ భక్తులు ఆమె మీద దాడిచేస్తున్నారంటూ సమర్ధించేవారు వారు తయారయ్యారు.


ప్రభుత్వాన్ని విమర్శించిన వారి మీద వత్తిడి ఎలా ఉంటుందో అవుట్‌లుక్‌ పత్రిక ఉదంతమే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం కనిపించటం లేదు, కనుగొని చెప్పండి అంటూ తయారు చేసిన ముఖపత్రాన్ని ఆన్‌లైన్‌ నుంచి తొలగించింది. ఎందుకంటే ప్రచారం కోసం పెట్టాము, దాని పని అయిపోయింది కనుక తొలగించాం తప్ప ముద్రణలో పేజీ తొలగించలేదని వివరణ ఇచ్చింది. దీని వెనుక సదరు పత్రిక యాజమాన్యం రహేజా గ్రూప్‌పై కేంద్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి అని వేరే చెప్పనవసరం లేదు.ముఖ చిత్రం గురించి ప్రపంచ వ్యాపితంగా తెలిసిపోయింది. అందువలన కొత్త ముఖచిత్రంతో పత్రిక ముద్రణ జరిగితే అది నరేంద్రమోడీ సర్కార్‌కు మరింత నష్టదాయకం. కరోనా సమయంలో దుకాణాల్లో పత్రిక కొనేవారి కంటే ఆన్‌లైన్లో చూసే వారు గణనీయంగా ఉంటారు. కనుక ఉన్నంతలో ప్రచారం, చర్చను నిలువరించేందుకు ఇలా చేశారన్నది స్పష్టం.

ప‌రుల్ క‌క్క‌ర్ (గుజ‌రాతీ క‌వ‌యిత్రి) శవవాహిని గంగ

అనువాదం : రాఘ‌వ‌శ‌ర్మ‌

భ‌య‌ప‌డ‌కు..ఆనంద‌ప‌డిపో..

ఒకే గొంతుతో శ‌వాలు మాట్లాడుతాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వాలు గంగాన‌దిలో ప్ర‌వ‌హించ‌డం చూశాం

ఓ రాజా..అడ‌వి అంతా బూడిద‌య్యింది,ఆన‌వాళ్ళు లేవు, అంతా శ్మ‌శాన‌మైపోయింది,

ఓ రాజా..బ‌తికించే వాళ్ళు లేరు,

శ‌వాల‌ను మోసేవాళ్ళూ క‌నిపించ‌డం లేదు,

ధుఃఖితులు మాత్రం మిగిలారు.

అంతా కోల్పోయి మిగిలాం

మాట‌లు లేక‌ బ‌రువెక్కిన మా హృద‌యాలు శోక‌గీతాలైనాయి

ప్ర‌తి ఇంటిలో మృత్యుదేవ‌త ఎగిసిప‌డుతూ తాండ‌వ‌మాడుతోంది

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..క‌రిగిపోతున్న పొగ‌గొట్టాలు క‌దిలిపోతున్నాయి, వైర‌స్ మ‌మ్మ‌ల్ని క‌బ‌ళించేస్తోంది

ఓ రాజా.. మా గాజులు ప‌గిలిపోయాయి, భార‌మైన మా హృద‌యాలు ముక్క‌ల‌య్యాయి

అత‌ను ఫిడేలు వాయిస్తున్న‌ప్పుడు మా న‌గ‌రం కాలిపోతోంది

బిల్లా రంగాల బ‌రిసెలు ర‌క్త‌ద‌ప్పిక గొన్నాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..నీవు మెరిసిపోతున్న‌ట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు త‌ళుక్కుమ‌న‌డం లేదు

ఓ రాజా..ఈ న‌గ‌రమంతా చివ‌రిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి

ఇక‌ ప‌రిమితులు, మిన‌హాయింపులు లేవు నీ ద‌మ్ము చూపించు,

రా..బయిటికి రా.. గ‌ట్టిగా చెప్పు, పెద్ద‌గా అరువు,

దిగంబ‌ర రాజు అవిటివాడు, బ‌ల‌హీనుడు

ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండ‌లేన‌ని చెప్పు

కోపంతో ఊగిపోతున్న న‌గ‌రం మంట‌లు ఎగిసిప‌డుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి

,ఓ రాజా.. నీ రామ‌రాజ్యంలో శ‌వ‌గంగా ప్ర‌వాహాన్ని చూశావా?