Tags
Andhra Pradesh Budget 2021-22, Andhra Pradesh Budget Analysis, AP Budget Highlights, chandrababu naidu, YS jagan
ఎం కోటేశ్వరరావు
కరోనా కారణంగా ఒక రోజులోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2021-22 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా సంక్షేమ పధకాలు తప్ప అభివృద్దిని పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. అయినా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైఎస్ జగన్ సర్కార్ మూడవ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది.ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశంస మామూలుగానే కొనసాగింది. చంద్రబాబు నాయుడి సర్కార్ మాదిరి అంకెల గారడీ కొనసాగించింది. సంక్షేమ పధకాలకు ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి పధకాలకు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో జరిగేదేమిటో చెప్పనవసరం లేదు. ప్రతి ఏటా బడ్జెట్ మీద కొండంత రాగం తీసి ఏడాది చివరిలో కీచుగొంతుతో కోత పెట్టటం ఈ ఏడాది కూడా కొనసాగింది. నవరత్నాల భజన కొనసాగుతోంది. పాడిందే పాడరా అన్నట్లు వాటి గురించి ఎన్నిసార్లు చెబుతారు, మిగతా వాటి గురించి మాట్లాడరా అని జనం అనుకుంటున్నారు.
గత రెండు సంవత్సరాలలో వరుసగా 2,27,975 – 2,24,79 కోట్లు ఈ ఏడాది 2,29,779కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తొలి బడ్జెట్‌ను 1,74,160, రెండవ దానిని 1,85,136 కోట్లుగా సవరించిన అంచనాను పేర్కొన్నారు. వాస్తవంలో ఇంకా తగ్గవచ్చు. ఇదే బాటలో తాజా బడ్జెట్‌కు సైతం కోత పెడతారని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకీ గారడి, ఎవరిని తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు ? గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసిన దానినే పునరావృతం చేస్తున్నారు, జనం ఏమన్నా అనుకుంటారని పాలకులు ఆలోచించరా ? చంద్రబాబు సర్కార్ దిగిపోయే ముందు ఏడాది లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు (29వేల కోట్లు) కుదించింది. జగన్ ప్రభుత్వ మూడవ బడ్జెట్‌లో గత సంవత్సరాలను అనుసరిస్తే ఏడాది చివరికి యాభైవేలు కోత పెట్టి ఏ లక్షా 80వేల కోట్లకో కుదిస్తారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లుగా 2019-20లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం రు.21,876 కోట్లు, గత ఏడాది వస్తుందని బడ్జెట్‌లో చూపిన మొత్తం రు. 53,175 కోట్లు, సవరించిన అంచనా రు.32,934 కోట్లు. తిరిగి ఈ ఏడాది రు.57,930 కోట్లు వస్తుందని చూపారు. పారు బాకీలను కూడా బ్యాంకులు తమ ఖాతాలలో చూపుతున్నట్లు ఎందుకిలా చేస్తున్నారు ? రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వస్తాయో రావో అమీతుమీ తేల్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అడుగుతున్న మొత్తం మేము ఇవ్వాల్సిన పనిలేదు అని కేంద్రం చెప్పదు, ఎటూ తేల్చరు-ఇవ్వరు ఏమిటీ నాటకం అని అడిగే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ?
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది మార్చి నెల నాటికి రాష్ట్ర రుణభారం రు.3,01,802 కోట్లు. అది ఈ ఏడాది మార్చి నాటికి రు.3,55,939 కోట్లకు చేరింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 3,87,125 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఇది ప్రభుత్వం పేరుతో తీసుకుంటున్న అప్పు, ఇదిగాక ప్రభుత్వం హామీదారుగా ఉండి వివిధ సంస్దలకు ఇప్పించిన అప్పు మరో 91,330 కోట్లు ఉంది. ద్రవ్య సంబంధ స్వయం క్రమశిక్షణ నిబంధనలో (ఎఫ్‌ఆర్‌బిఎం) భాగంగా విధించుకున్న పరిమితి దాటలేదు అని చెప్పుకొనేందుకు రెండవ అప్పును ప్రభుత్వ ఖాతాలో చూపరు. ఇది గతంలో అన్ని ప్రభుత్వాలు చేశాయి.
చంద్రబాబు నాయుడి ఏలుబడి చివరి ఏడాదిలో కొత్త – పాత అప్పుల మొత్తం రాష్ట్ర స్ధూల ఆదాయం(జిఎస్‌డిపి)లో 28.02శాతం ఉండగా జగన్ తొలి ఏడాది దాన్ని 31.02శాతానికి, రెండవ సంవత్సరంలో 35.23( సవరించిన అంచనా)గా చూపారు. ఈ ఏడాది అది 40శాతానికి చేరినా ఆశ్చర్యం లేదు. అందువలన గత పాలకులను విమర్శించే నైతిక హక్కు వైసిపికి ఉందా ? అప్పుల మీద వడ్డీ -అసలు చెల్లింపు పెరుగుతోంది, అభివృద్ది వ్యయం తగ్గటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. 2018-19లో స్ధిర ఆస్దుల కొనుగోలు, కల్పనకు గాను చేసిన ఖర్చు రు.19,976 కోట్లు, అదే ఏడాది తెచ్చిన అప్పుల మీద, అసలు-వడ్డీ చెల్లింపులకు చేసిన ఖర్చు రు.28,877 కోట్లు. 2019-20లో అది రు.12,845 – 35,428 కోట్లుగానూ 2020-21లో రు.18,797-34,318 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 50వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు చేయాలని సంకల్పించారు. వడ్డీ 23,205 కోట్లని అంచనా. ఏటా తెస్తున్న అప్పులో అధికభాగం వడ్డీ చెల్లింపులకే పోతున్నది. ప్రాధాన్యతా రంగాలకు కేటాయిస్తున్న మొత్తాలను చూస్తే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ రంగాలలో జాతీయ సగటు కంటే తక్కువ కేటాయిస్తున్నది.
రాష్ట్రంలో సేవారంగం తరువాత వ్యవసాయం ప్రధానంగా ఉంది. దీనికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం గురించి చెప్పనవసరం లేదు. ఈ రంగానికి పెట్టుబడి వ్యయంగా అన్ని రకాల ప్రాజెక్టులకు కలిపి 10,647 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం 3,860 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తిరిగి 11,587 కోట్లు కేటాయించారు. మొత్తం అన్ని రకాల పెట్టుబడి వ్యయ ఖాతాలో 29,907 కోట్లు కేటాయింపు చూపి ఖర్చు చేసింది 18,797 కోట్లు మాత్రమే. తిరిగి ఈ ఏడాది 31,198 కోట్లు చూపారు. కరోనా కారణంగా ప్రజారోగ్య విభాగంలో ఖర్చు పెంచాల్సి ఉన్నప్పటికీ ఐదు వందల కోట్లకు పైగా గతేడాది కోత విధించారు. గృహనిర్మాణానికి గతేడాది 4,600 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 2,030 కోట్లు మాత్రమే. షెడ్యూలు కులాలు, తరగతులు, ఇతర వెనుక బడిన కులాల సంక్షేమానికి గత బడ్జెట్‌లో కేటాయింపు 41,162 కోట్లు ఖర్చు 23,253 మాత్రమే. ఈ ఏడాది కేటాయింపే 27,401 కోట్లకు తగ్గించారు, ఖర్చు ఎంత ఉంటుందో తెలియదు.
తన పాలనా కాలంలో దశల వారీ మద్య నిషేధాన్ని అమలు జరుపుతానని వాగ్దానం చేసిన వైసిపి ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవు. దానికి నిదర్శనం దాన్నొక ఆదాయ వనరుగా మార్చుకోవటమే. 2019-20 సంవత్సరంలో బీరు మీద వచ్చిన డ్యూటీ(పన్ను) 187 కోట్లు, అది 2020-21లో 351 కోట్లని అంచనా వేయగా 805 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఆ మొత్తం వెయ్యి కోట్లు దాటనుందని అంచనా. ఇక మొత్తం మద్యం మీద ఆదాయ పెరుగుదల ఎలా ఉందో చూడండి. 2019-20లో మొత్తం ఆదాయం 6,914 కోట్లు కాగా గత ఏడాది లక్ష్యం 7,931 కోట్లని చెప్పి 11,575 కోట్లకు పెంచారు. ఈ ఏడాది పదిహేనువేల కోట్ల రూపాయల లక్ష్యం నిర్ణయించారు.ఈ మొత్తాన్ని మద్యం అమ్మకాల పెంపుదల లేదా మరింతగా పన్నుల బాదుడుతో మాత్రమే రాబట్టుకోవటం సాధ్యం. ఇంత మొత్తం ఆదాయాన్ని వదులుకొని మద్య నిషేధం అమలు జరుపుతామని ఇప్పటికీ కబుర్లు చెబితే నమ్మే జనాలుంటే చేయగలిగిందేమీ లేదు.
పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేస్తున్న వ్యాట్, సెస్సులు తక్కువేమీ కాదు. పెట్రోలు, డీజిలు మీద లీటరుకు నాలుగు రూపాయలు స్ధిర వ్యాట్ , ధరను బట్టి మారే వ్యాట్ మరొకటి ఉంది. స్ధిర వ్యాట్ ఖాతా కింద గత ఏడాది రు.1,243 కోట్లు వసూలు చేస్తే వర్తమాన సంవత్సరంలో ఆ మొత్తం 2,648 కోట్లని పేర్కొన్నారు. ఇక ధరల పెరుగుదలను బట్టి మారే వ్యాట్ మొత్తం గత ఏడాది రు.4,810 కోట్లయితే ఈ ఏడాది 11,042 కోట్లుగా అంచనా వేశారు. ఇదిగాక రోడ్డు సెస్ పేరుతో పెట్రోల, డీజిలు మీద వసూలు చేస్తున్న మొత్తం 245 నుంచి 662 కోట్లకు చేరనుంది. వీటన్నింటినీ కలుపుకుంటే గత ఏడాదితో పోలిస్తే వర్తమాన సంవత్సరంలో ఈ ఖాతాలో బాదుడు రు.6,298 కోట్ల నుంచి రు.14,352 కోట్లకు చేర నుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక కార్మికుల వినియోగధరల సూచి కంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల ధరల సూచి ఎక్కువగా ఉన్నట్లు సామాజిక, ఆర్ధిక సర్వే తెలిపింది. దేశవ్యాపితంగా పారిశ్రామిక కార్మికుల ధరల సూచికలో పెరుగుదల 4.98శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది 6.03గాను, వ్యవసాయ కార్మికుల సూచి దేశంలో 5.51శాతం ఉంటే ఏపిలో 6.15శాతంగా నమోదైంది. పెద్ద ప్రచార అస్త్రంగా ఉన్న రైతు భరోసా పధకంలో ఏడాదికి రు.13,500 ఇస్తున్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరువేల రూపాయలు కూడా కలసి ఉన్నాయి. ఇందుకు గాను కేంద్రం ఇచ్చే దానితో సహా ఇస్తున్న రు. 2,966 కోట్లతో సహా మొత్తం రు.6,928 కోట్లు. రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో (కరోనా లేదు) మధ్య,చిన్న, సన్నకారు పరిశ్రమల రంగంలో రు.2,980 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన సంస్ధలలో 76,716 మందికి ఉపాధి కలిగింది.2020-21లో 2,154 కోట్లతో 3,710 సంస్ధలలో 35,029 మందికి ఉపాధి దొరికినట్లు తెలిపారు. 2019-20లో భారీ మరియు మెగా ప్రాజెక్టుల తరగతిలో 44 పారిశ్రామిక ప్రాజెక్టులలో రు.22,282 కోట్లతో 18,385 మందికి ఉపాధి కల్పించగా 2020-21లో అవి పన్నెండుకు తగ్గిపోయి రు.3,656 కోట్లతో 8,114 మందికి ఉపాధి కల్పించినట్లు సామాజిక సర్వేలో పేర్కొన్నారు.
ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తెలుగుదేశం సభ్యులు, వీడియో ద్వారా విడిగా సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అయితే రెండు పార్టీలూ అనుసరిస్తున్న విధానాలలో పెద్ద తేడా లేదు. సంక్షేమం పేరుతో ప్రజాకర్షక పధకాలకు పెద్ద పీట వేస్తున్నందున అభివృద్ది గురించి నువ్వు మూస్కో నేను మూస్కుంటా అన్నట్లుగా ఎవరూ మాట్లాడరు. రాష్ట్రంలోని మేథావులకు సైతం ఈ అంశం పెద్దగా పట్టినట్లు లేదు, ఎవరికైనా పడితే వారికి మీడియాలో చోటు దొరకదు. పోనీ మీడియా అయినా విమర్శనాత్మకంగా వ్యవహరిస్తుందా అదీ లేదు.