Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఎంతలో ఎంత మార్పు ! రోజులు ఎలా మారిపోయాయి !! కరోనా వైరస్‌ మన జీవితాలనే మార్చివేసింది. మనలో భాగమైన ప్రధాని నరేంద్రమోడీని ప్రభావితం చేయకుండా ఉంటుందా ? కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శల నేపధ్యంలో ఆయనను గుడ్డిగా నమ్మే జనంలో ఏదో తేడా కొడుతోంది అన్న ఆలోచన అంకురించింది. నమ్మకాన్ని తప్పు పట్టలేం – గుడ్డి నమ్మకాన్ని ఏ మాత్రం అంగీకరించకూడదు. మోడీని విమర్శించిన వారి మీద గతంలో మాదిరి దాడి చేసే స్దితిలో బిజెపి లేదా దానికి మద్దతు ఇచ్చే మీడియా ఆయుధాలు పనికి రావటం లేదు. గతంలో మాదిరి ఎవరైనా విరుచుకుపడితే సహించే రోజులకు కాలం చెల్లుతోంది అని చెప్పవచ్చు.


గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీ గద్దెనెక్కే వరకు, తరువాత కూడా నరేంద్రమోడీ బహిరంగ సభల్లో మాట్లాడే తీరు, ప్రదర్శించే హావభావాల గురించి చర్చ ఇప్పటిది కాదు. ఒక విషయాన్ని -అది ఎలాంటిది అనేది వేరే అంశం- జనం ముందుకు తేవటం, మెదళ్లకు ఎక్కించటంలో మోడీని అనుసరించాలని కార్పొరేట్‌ శక్తులే తమ సిబ్బందికి నూరిపోశాయి. వినియోగదారులకు తమ ఉత్పత్తుల మీద విశ్వాసం కలిగించేందుకు మోడీ మాదిరి మాటలు చెప్పాలని, హావభావాలు ప్రదర్శించాలని సూచనలు ఇచ్చిన అంశాల గురించి గూగుల్తల్లిని అడిగితే పుంఖాను పుంఖాలుగా -వస్త్రాల షాపులో మన ముందు చీరలు పడవేసినట్లు- పడవేసి ఎంచుకోమని చెబుతుంది. అందువలన వర్తమానంలో ఈ విషయంలో నరేంద్రమోడీని మించిన వారు లేరని అంగీకరించేందుకు ఇబ్బంది పడాల్సిందేమీ లేదు.

ఎంత కఠినాత్ముడికైనా ఒకానొక సమయంలో కంట నీరు రాకపోదని పెద్దలు చెబుతారు. మోడీ అలాంటి వారా అంటే అవునని-కాదని రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. ఏనుగు గురించి ఏడుగురు అంధులను అడిగితే ఎవరు తడిమినదాన్ని బట్టి వారు ఏనుగు రూపాన్ని వర్ణించినట్లుగా అనుభవాన్ని బట్టి ఒక వ్యక్తి లేదా వ్యవస్ధ మీద అభిప్రాయాలను ఏర్పరుచుకోవచ్చు. హిట్లర్‌ ముందుకు తెచ్చిన జర్మన్‌ జాతీయవాదానికి ప్రభావితులైన వారు, జర్మన్‌ జాతిని శుద్ది చేస్తానంటే నిజమే అని భ్రమించిన వారు నెత్తికెక్కించుకున్నారు-అతగాడి మారణ కాండకు గురైన యూదులు, ఇతర దేశాలు ఎంతగా ద్వేషించాయో చూశాము.


కరోనా మరణాల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగానికి గురైనట్లుగా కంటతడి పెట్టినట్లు కొందరికి కనిపిస్తే మొసలి కన్నీరు అని కొందరికి అనిపించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ వైద్యులతో మాట్లాడుతున్న సందర్భంగా నరేంద్రమోడీ కంటతడి పెట్టుకున్నట్లుగా వీడియో దృశ్యాలు, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని చూసి మోడీ అంతటి వ్యక్తే కన్నీరు పెట్టుకున్నారంటూ బాధపడిపోయి కన్నీరు పెట్టుకున్నవారు – మోడీలో జనం గోడు పట్టని దిగంబర రాజును చూసిన గుజరాతీ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ వంటి వారు కూడా ఎందరో ఉంటారు. అయితే ఒక రాజకీయ నేత వ్యాఖ్యానిస్తే….. అదంతా వట్టిదే వాక్సిన్ల కొరత, పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు, దిగజారి పోయిన జిడిపి విషయాలను పక్కదారి పట్టించటానికి మోడీ మొసలి కన్నీరు కార్చారని కాంగ్రెస్‌ నేత రాహులు గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ సినిమాల్లో అయితే నటనతో బాగా రాణిస్తారు అని వ్యాఖ్యానించారు. ఆర్‌జెడి కూడా మొసలి కన్నీరు అని వ్యాఖ్యానించింది. జనం చస్తుంటే నరేంద్రమోడీ ఎన్నికల సభల మీద కేంద్రీకరించి ఇప్పుడు కన్నీరు పెట్టుకోవటం మోసం కాదా అని ప్రశ్నించింది. దీని మీద బిజెపి నేతలు, మోడీ భక్తులు వెంటనే స్పందించలేకపోయారు.

నరేంద్రమోడీ నిజంగా ఏడ్చారా ? అలా నటించారా అనే చర్చ కూడా సామాజిక మాధ్యమంలో జరుగుతోంది. ఏది నిజం అని తేల్చటం ఎంతో కష్టం. మొసలి కన్నీటి గురించిన నిజా నిజాలను ఎవరైనా ఎవరైనా శాస్త్రవేత్తలు తేల్చారా అంటే కొన్ని అభిప్రాయాలు వెల్లడించటం తప్ప నిర్దిష్టంగా తెలియదు. అందుబాటులో ఉండే మొసళ్ల సంగతే తేల్చలేని వారు నరేంద్రమోడీ గారి దగ్గరకు వెళ్లి మీరు నిజంగా రోదించారా లేదా అని అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది. మీడియాకు ఎలాగూ అలాంటి అవకాశం లేదు, మీరు ఏం చెప్తే అది రాసుకుంటాం, ఏం చూపిస్తే దాన్ని చూపుతాం అనే జీ హుజూరు మీడియా అలాంటి ప్రశ్నలు ఎలాగూ అడగదు. ఇతరులెవరైనా అలా చేస్తే ఇంకేమైనా ఉందా ! మొసలి కన్నీరు గురించి సమాచారం, కొన్ని భాష్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

జాన్‌ మండవిల్లే అనే బ్రిటీష్‌ యాత్రీకుడు తన యాత్రల అనుభవాలను (1300-71) అక్షర బద్దం చేశారు. ఆ రచనలో మొసళ్ల గురించి ప్రస్తావన ఉంది. ఆ దేశంలో మొసళ్లు మనుషులను తింటూ ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి అని రాసినట్లు ఒక ముక్క చదివాను. అప్పటికి మన దేశానికి సముద్రమార్గం కనిపెట్టలేదు, రవాణా సౌకర్యాలు లేవు గనుక మన దేశంలోని మొసళ్ల గురించైతే మాత్రం కాదని చెప్పవచ్చు. అయినా మొసళ్లు ఎక్కడైనా ఒకటే కదా ! ఏమాత్రం కనికరం లేకుండా మనుషులను మట్టుబెట్టే అనేక మంది ఎలా దొంగేడుపులు ఏడుస్తారో సినిమాల్లో చూడటం, అలాంటి చర్యలను మొసలి కన్నీరు కార్చటం అంటారని వినటం తప్ప ప్రత్యక్ష అనుభవం లేదు. మొసలి నోటితోనే కాదు తోకతో కూడా దాడి చేసి చంపివేస్తుంది. మొసళ్లకు దొరికితే ఏమాత్రం కనికరం చూపవు, వాటికి దొరికిన వాటిని తినేటపుడు కన్నీరు కారుస్త్తాయి, అయితే ఆ చర్యకు భావోద్వేగానికి సంబంధం లేదు. నీటి నుంచి బయటకు వచ్చినపుడు కండ్ల మీద పడే దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకొనేందుకు ద్రవాన్ని విడుదల చేయటాన్ని చూడవచ్చని కొందరు పేర్కొన్నారు. అమెరికా ప్రాంతంలో, అదే విధంగా ఉప్పునీటిలో ఉండే మొసళ్లు తీసుకొనే ఆహారంలో అధికంగా ఉండే ఉప్పును బయటకు పంపేందుకు కండ్లద్వారా ద్రవరూపంలో విడుదల చేస్తాయని చెబుతారు. అదే విధంగా నీటి నుంచి బయటకు వచ్చేటపుడు కండ్ల నుంచి కారే నీటిని కన్నీరుగా భ్రమిస్తామని కూడా కొందరంటారు.


ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ తన రచనల్లో మొసలి కన్నీటిని చాలా సందర్భాలలో వాడుకున్నారు.తనను వంచిస్తున్న భార్య గురించి ఒథెల్లో అనే పాత్ర తనను తాను ఇలా సమాధానపరుచుకుంటుంది.” ఆ భూమి మీద మహిళల కన్నీరు పారితే, ఆమె కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక మొసలిగా రుజువు చేసుకుంటుంది.” అదే విధంగా దొంగ ఏడుపులు, సంతాపాలు ప్రకటించిన వారిని మొసలి కన్నీటితో వర్ణించాడు. అలాంటి వారి కళ్లు తడిబారితే అర్దం లేదంటాడు. ఇంకా అనేక మంది తమ రచనల్లో ఇలాంటి పోలికలను పేర్కొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నాడే ఇలాంటి పోలికలను ముందుకు తెచ్చారంటే దానికి నాంది ఎక్కడో తెలుసుకోవటం నిజంగా కష్టమే. ఇది ఒక్క ప్రాంతానికో ఖండం, దేశానికో పరిమితం కాదు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మాల్కొం షానెర్‌, కెంట్‌ వెయిట్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో 2006లో ఒక పరిశోధన చేశారు. మొసళ్లు కన్నీరు కారుస్తాయనే ప్రచారంలో నిజమెంతో తేల్చాలనుకున్నారు. మొసళ్ల జాతిలో ఉపజాతికి చెందిన భయంకర తొండలను అందుకు ఎంచుకున్నారు. సెయింట్‌ అగస్టీన్‌ మొసళ్ల పార్కులో ఏడు తొండలను ఎంచుకొని వాటికి పొడినేలపై ఆహారం అందచేశారు. వాటిలో ఐదు కన్నీరు కార్చటాన్ని చూశారు. ఆహారం తినేటపుడు వాటి గ్రంధులలో సంభవించే మార్పుల వలన కండ్లలోకి ద్రవాన్ని పంపినట్లుగా అదే రోదిస్తున్నట్లుగా కనిపిస్తుందని విశ్లేషించారు. మొసళ్లలో కూడా అదే విధంగా జరుగుతుండవచ్చని నిర్దారణకు వచ్చారు.


ఒక ఉదంతం జరిగితే దానికి చిలవలపలవలతో కువ్యాఖ్యానాలు, మార్పిడి చేసిన చిత్రాలతో ప్రత్యర్ధుల పరువు తీయటం లేదా కొందరికి లేని వాటిని ఆపాదించి మహానుభావులుగా ప్రచారం చేయటం తెలిసిందే. జవహర్‌ లాల్‌ నెహ్రూ, సోనియా గాంధీ ఇలా ఎందరో అలాంటి ప్రచారాలకు గురయ్యారు. వాటి వెనుక కాషాయ దళాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కమ్యూనిస్టు యోధుడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన జ్యోతిబసు అమ్మాయిలతో కాబరే నృత్యాలు చేసినట్లు చిత్రాలను సృష్టించటం వెనుక నాటి కాంగ్రెస్‌ పెద్దలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మన ప్రధాని నరేంద్రమోడీ గారి గొప్పతనాన్ని తెలియచెప్పే పధకంలో భాగంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా జీవితం ప్రారంభించిన కొత్తలో ఆ సంస్ద సమావేశాలు జరిగినపుడు స్నానపు గదులు, మరుగుదొడ్లు కడిగిన సేవకుడిగా చిత్రిస్తూ ఫొటోలను సామాజిక మాధ్యమంలో పెట్టిన విషయం తెలిసిందే. వాటిని కించపరుస్తూ పెట్టినట్లు భావిస్తే వెంటనే తొలగించమని కోరి ఉండే వారు. అలాంటిదేమీ జరగలేదు గనుక వాటి వెనుక ఎవరున్నారో చెప్పనవసరం లేదు.

ఇక తాజా ఉదంతానికి వస్తే ఎవరి గడ్డిని వారిచేతే తినిపించినట్లుగా న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ఆ పత్రిక సూర్యరశ్మితో సిరియాలో విద్యుత్‌ తయారీ గురించి రాసిన కథనానికి ఒక పెద్ద చిత్రాన్ని తోడు చేసింది. అయితే ఆ చిత్రం స్దానంలో కంటి నుంచి ద్రవాన్ని కారుస్తున్న ఒక మొసలి బొమ్మ పెట్టి పైన రోదించిన భారత ప్రధాని అనే శీర్షిక పెట్టారు. అంటే నరేంద్రమోడీ మొసలి కన్నీరు కార్చారు అనే అర్ధం వచ్చేట్లుగా తయారు చేసిన ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ దాన్ని ట్వీట్‌ చేసి నకిలీదని తేలటంతో వెనక్కు తీసుకున్నారు. అలాంటి హుందాతనాన్ని సంఘపరివార్‌ పెద్దలు ఎంత మంది పాటించారన్నది ప్రశ్న.


కొద్ది రోజుల క్రితం నరేంద్రమోడీని బదనామ్‌ చేయాలని సూచిస్తూ కాంగ్రెస్‌ ఒక టూల్‌కిట్‌ను తయారు చేసిందంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సంబిత్‌ పాత్రా తదితరులు ఒక నకిలీ పత్రాన్ని పట్టుకొని సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తీరా అది కాంగ్రెస్‌ తయారు చేసిన డాక్యుమెంట్‌ అనేందుకు ఆధారాలు లేవని, కాషాయ దళాల పనితనం అని తేలిపోయింది. కాంగ్రెస్‌ పోలీసు కేసు దాఖలు చేయటంతో పాటు అదే విషయాన్ని ట్విటర్‌ కంపెనీకి కూడా ఫిర్యాదు చేసింది. దాంతో సదరు సంస్ద సంబిత్‌ పాత్రా టూల్‌ కిట్‌ ట్వీట్‌కు ఇది ”తిమ్మిని బమ్మిని చేసిన మాధ్యమం ” (మానిప్యులేటెడ్‌ మీడియా) అని తానే ముద్రవేసి ప్రచారంలో పెట్టింది. దీనికి మోసపూరిత మాధ్యమం అనే అర్ధం కూడా ఉంది. ఈ సమాచారాన్ని చూసిన వారు గుడ్డిగా నమ్మవద్దు అనే సందేశం దీని వెనుక ఉంది. ఇంతకంటే బిజెపి నేతలకు మరొక అవమానం అవసరం లేదు. అయితే ఇది బిజెపి పెద్దలకు కొత్తేమీ కాదు. ప్రపంచ వ్యాపితంగా ఇలాంటి తప్పుడు వార్తలు, ఫొటోలను వ్యాప్తి చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఉన్నంతలో అనుసరించే వారిని అప్రమత్తం గావించేందుకు ట్విటర్‌ తీసుకున్న చర్య ఇది. ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని తొలగించకుండా అనుమానం వచ్చిన వాటికి 2020 మార్చి నెల నుంచి ఇలాంటి ముద్రలు వేయటం ప్రారంభించింది. మన దేశంలో తొలిసారిగా అలాంటి ఘనతను దక్కించుకున్న వ్యక్తి బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయగారు. రైతు ఉద్యమం సందర్భంగా ప్రచారం-వాస్తవం అనే పేరుతో ఉన్న ఒక వీడియోను ఆ పెద్ద మనిషి షేర్‌ చేసి దాన్ని ఆధారం చేసుకొని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మీద అనుచిత వ్యాఖ్య చేశారు. దాంతో ఆ ట్వీట్‌కు మోసపూరిత మాధ్యమం అని ట్విటర్‌ ముద్రవేసింది.


ఒకటి మాత్రం స్పష్టం, మోడీ సర్కార్‌ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో మీడియాలో సానుకూల కథనాలు ఎక్కువ వచ్చేట్లు చూడాలని సంఘపరివార్‌ అపరిమిత సానుకూలత అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా దాని కార్యకర్తే గనుక జనంలో సానుకూలత కోసం నటించారా లేదా నిజంగానే రోదించారా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ముందే చెప్పుకున్నట్లు జనానికి దగ్గరయ్యేందుకు నరేంద్రమోడీ చేసే ఉపన్యాసాలు, ప్రదర్శించే హావభావాలే ఇప్పుడు ఆయన నిజం చెప్పినా నమ్మని స్ధితిని కల్పిస్తున్నాయా ? ఎవరైనా ఊహించారా ! ఎంతలో ఎంత మార్పు !!