Tags
Anandaiah miracle medicine, Ayurvedic, Krishnapatnam medicine, Religious fanatics, Traditional Medicine
ఎం కోటేశ్వరరావు
నిజం గడప దాటక ముందే ఒక అబద్దం ఊరంతా తిరిగి వచ్చి నిజానికే తన మీద తనకే అనుమానం వచ్చేట్లు చేస్తుంది. ఆనందయ్య మందు గురించి సామాజిక మాధ్యమంలో వస్తున్న తర్క-కుతర్కాల గురించి చూద్దాం.
గతంలో కూడా పసరు లేదా ఇతర నాటు మందులు, వాస్తు గురించి కూడా వాటిని సమర్దించే వారు, నమ్మేవారు పుష్కలంగా ఉన్నారు. తాజా ఆనందయ్య మందుకు హిందూ మతాన్ని జోడించటం ద్వారా మతోన్మాద శక్తులు దీన్ని కూడా వెంటనే వినియోగించుకున్నాయి.
వనమూలికలు, పసరు మందులు లేదా ఆయుర్వేదం సాంప్రదాయకమైనవి అని చెబుతున్నారు. ఇది కుతర్కం. అవి సాంప్రదాయకం కాదు. మానవ జాతి జీవన పోరాటంలో తమ అనుభవంలోకి వచ్చిన వాటితో గాయాలు, రుగ్మతలను రూపు మాపేందుకు ఎందరో చేసిన ప్రయోగాలే. జ్వరం, కడుపు, తలనొప్పులు వస్తే మా తాత, మానాన్న ఫలానా మూలికలు, ఆకుపసరులు ఇచ్చే వారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నా అని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజానికి వాటిలో వుండే శాస్త్రీయ లక్షణాలు తెలిసి ఇచ్చేవి కాదు. అవి పూర్తిగా పని చేస్తాయనే నిర్దారణతో ఇచ్చేవి కాదు. నిజానికి జనానికి పూర్తి విశ్వాసమే ఉంటే అన్ని రకాల గాయాలు, జబ్బులను నయం చేసే లక్షణం ఉంటే అల్లోపతి ఆసుపత్రులు ఇలా కిటకిటలాడుతుండేవా ? జనం వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో సమర్ధకులు చెప్పాలి. రోడ్డు మీద పోతుంటే ఒక పూజలు చేసిన ఒక చెట్టో, పుట్టో, గుండ్రాయో కనిపించగానే కొందరు ఒక దండం పడేసి పోతారు. వస్తే సంపదలు వస్తాయి, దండంతో పోయేదేమీ లేదు కదా అన్నదే వారి ఆలోచన. ఒక పక్క ప్రాణాలు తీస్తున్న మహమ్మారికి సరైన మందు లేదన్న ప్రచార నేపధ్యంలో తెల్లవారేసరికి అలాంటి మందు ఉంది అని చెప్పగానే జనం ఎగబడటం మన సామాజిక రుగ్మతల్లో ఒకటి. వాటిని అర్ధం చేసుకోవాలే గానీ ఆగ్రహిస్తే ప్రయోజనం లేదు.
నమ్మకం లేకపోతే జనం ఎందుకు ఎగబడుతున్నారు ? జనం ఎగబడే వన్నీ సమర్దనీయమేనా ? కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు పక్కనే ఉండే పలకలూరు అనే గ్రామం(ఇప్పుడు సిటీలో కలసిపోయింది)లోని ఒక బావిలో నీరు తాగితే రోగాలు నయం అవుతున్నాయని ప్రచారం సాగి జనం ఎగబడ్డారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక హైదరాబాదు బత్తిన సోదరుల చేప మందు సంగతి తెలిసిందే. ఉబ్బసానికి – మృగశిర కార్తెకు సంబంధం ఏమిటి అని ఎవరైనా ఆలోచించారా ? 1845లో ఒక సాధువు తమ పూర్వీకుడికి మందు గురించి చెప్పారని అప్పటి నుంచి తమ కుటుంబం పంపిణీ చేస్తున్నదని ఆ సోదరులు చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న వారి పూర్వీకులకు సాధువు ఇవ్వక ముందు ఉబ్బసం లేదా దానికి ఎవరు మందు ఇచ్చారు ? అది ప్రపంచవ్యాపిత జబ్బు. పుప్పొడి, బొద్దింకలు, దుమ్ము ప్రధాన కారణం అని నిర్ధారించారు. ఉబ్బసం అనేది సర్వకాలాల్లోనూ వస్తున్న వ్యాధి. దీనికి ఉపశమనం తప్ప ఇంతవరకు చికిత్సలేదు. జలుబు కూడా అంతే. ఇవి అందరికీ ఒకే కారణంతో రావాలని లేదు.ఎవరి కారణాలు వారికి ప్రత్యేకమే. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఆస్తమా రోగులు ఉన్నారు. అయితే దానికి బలి అవుతున్నవారు ఎక్కువగా పేద, వర్ధమాన దేశాల వారే. ప్రపంచంలో ప్రతి పది మంది ఆస్తమా రోగుల్లో ఒకరు మన దేశంలో ఉంటున్నారు. వారి సంఖ్య ఒకటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉంటోంది. బత్తిన సోదరులు తమ మందు లేదా ప్రసాదం తీసుకున్న వారి సంఖ్య ఆరున్నర లక్షలు. అతి అతిశయోక్తి అంతలేరు అనే వారున్నారు. పోలీసు లెక్కల్లో అది కనపడదు, పోనీ అంత మంది తీసుకున్నారనుకున్నా మిగతావారు ఏం చేస్తున్నట్లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లే కదా. అందువలన మెడికల్ మాఫియాకు బత్తిన సోదరులు సవాలుగా తయారైందీ లేదు ఆసుపత్రుల వారు ఆందోళన చెందిందీ లేదు. ప్రతి మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకొనే వారే జనవిజ్ఞాన వేదికను చూసి ఆందోళన చెందారు. అందువలన ఇలాంటి వాటితో పాటు, మహమ్మారులు తలెత్తినపుడు, చికిత్సలేనపుడు సూక్ష్మంలో మోక్షం కోరుకున్నట్లుగా ఒకసారి వాడి చూద్దాం పని చేస్తే చేస్తుంది లేకుంటే ఏమీ కాదంట కదా అని జనం ఎగబడుతున్నారు తప్ప మరొకటి కాదు. వారికి అన్నీ తెలిసి ఎగబడుతున్నారని ఎవరైనా నిరూపించగలరా ?
1890దశకంలో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నివారణ కోసం సిబ్బంది ఇండ్లకు వచ్చినపుడు మతం, ఆచారాల పేరుతో కనీసం లోపలికి ప్రవేశించేందుకు సైతం అంగీకరించకుండా అడ్డుకున్నారని చదువుకున్నాం. చివరికి మత పెద్దల సాయంతో సిబ్బంది ప్లేగు బాధితులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే కొన్ని చోట్ల బ్రిటీష్ మిలిటరీ, పోలీసు, ఆరోగ్య యంత్రాంగం అలాంటి వారి మీద బల ప్రయోగం చేయాల్సి వచ్చిందని కూడా తెలిసిందే. ఇప్పుడు కూడా ఎవరికన్నా కరోనా ఉందని తెలిస్తే ఇంటి యజమానులు అద్దెకుండే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్న ఉదంతాలెన్ని లేవు. అందువలన జనం చేసేవన్నీ మంచివే అనీ చెప్పలేం. ఇప్పుడు లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు జరిపే పేరుతో పోలీసుల అతి చర్యలను కూడా చూస్తున్నాం-జనం కోసమే అయినా అలాంటి వాటిని సమర్ధిస్తామా ? ప్లేగు వ్యాధి నివారణకోసం నాటి నిజాం నవాబులు వేరే దిక్కుతోచక హైదరాబాద్‌లో చార్మినార్‌ను నిర్మించారన్నది తెలిసిందే. అదే సమయంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా వచ్చిందిగా, బిజెపి భాషలో చెప్పాలంటే మరి హిందూ పాలకులు అనేక మంది ఉన్నారు కదా చికిత్సకు వారేం చేశారు, వారెందుకు కట్టడాలు కట్టించలేదు అంటే ఏం సమాధానం చెబుతారు ? కుతర్కానికి జవాబులుండవు ?
వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో లేనిది లేదు అని చెబుతారు. నిజమే ఉన్నాయనుకుందాం, మనకు పోయేదేమీ లేదు. వాటన్నింటినీ బయటకు తీసి దేశంలో కోట్లాది మందిని బలితీసుకున్న ప్లేగు, మసూచి, కలరా, మలేరియా, కుష్టు వంటి వాటికి ఔషధాలను ఎందుకు తయారు చేయలేదు, ప్రపంచ దేశాలకు ఎందుకు ఎగుమతి చేయలేదు ? 1890లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నాటి బ్రిటీష్ ప్రభుత్వం రష్యా నుంచి బాక్టీరియాలజిస్టు డాక్టర్ వాల్డమర్ హాఫికిన్‌ను రప్పించింది. ఆయన రూపొందించిన వాక్సిన్ తరువాత కాలంలో ఎన్నో ప్రాణాలను కాపాడింది. అదే శాస్త్రవేత్త కలరా నిరోధ వ్యాక్సిన్ను కూడా రూపొందించాడు. మరి వేల సంవత్సరాల ఆయుర్వేదం, దాన్ని ఔపోసన పట్టిన వారు, సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పేవారు ఎందుకు కనిపెట్టలేకపోయారు ? ప్రతి దేశంలోనూ అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులు లేదా ఔషధాలకు చాదస్ధాలను తగిలించి అభివృద్ధి నిరోధకంగా తయారు చేశారు. ఈ పరిణామం అన్ని దేశాలలో తరతమ స్ధాయిల్లో జరిగింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ముందు వాటికి ఆదరణ తగ్గింది. అల్లోపతితో పాటు స్ధానిక వైద్య విజ్ఞానాన్ని అభివృద్ది చేస్తే ఎవరు అడ్డుకున్నారు ? ఆయుర్వేదం గురించి భారతీయులకు మాత్రమే తెలుసు, కొంత మందిలో విశ్వాసం ఉంది. ఔషధాలకు ప్రపంచ మార్కెట్‌లేదు, కనుకనే ఆ రంగంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రావటం లేదు. అందువలన దానికి, అల్లోపతి వైద్యానికి పోటీ పెట్టి ఇది విదేశీ అని ఆయుర్వేదం హిందూ వైద్యం కనుక అణచివేస్తున్నారని ప్రచారం చేయటం ఉన్మాదం ముదరటం తప్ప మరొకటి కాదు. ఆయుర్వేదంలో బిపికి, మధుమేహానికి మహా గొప్ప మందులు ఉన్నాయి, వాటిని మెడికల్ మాఫియా బయటకు రానివ్వటం లేదన్నది ఒక ప్రచారం. ఆడలేక మద్దెల ఓడని ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటారు. భారతీయ పద్దతులను పరిరక్షించేవారు, వెలికి తీసేవారే కదా గత ఏడు సంవత్సరాలుగా కేంద్రంలో, ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. వారంతా ఏమి చేస్తున్నట్లు ? సొల్లు కబ్లురు తప్పితే, చైనా అంత పెద్ద దేశాన్నే లొంగదీసుకొని చర్చలకు రప్పించామని చెప్పుకొంటున్న 56 అంగుళాల ఛాతీ గల నేతలు మెడికల్ మాఫియాను అదుపు చేయలేరా ?
ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ది క్రమంలో ఏవరైనా ఒక ఔషధాన్ని తయారు చేశామని ప్రకటిస్తే దానికి రుజువులు చూపాలని, సామర్ద్యం సంగతి తేల్చాలని కోరుతున్నారు గనుకనే అనేక ఔషధాలు, వాక్సిన్లపై సంవత్సరాల తరబడి ప్రయోగాలు చేస్తున్నారు. అల్లోపతి ఔషధాలను ఎవరూ ప్రశ్నించటం లేదనేది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. దానికి చట్టాలే ఉన్నాయి. ఆయుర్వేద వైద్యానికి శిక్షణా కళాశాలలు, విద్యార్ధులకు సిలబస్, పరీక్షల వంటివి అన్నీ ఉన్నాయి. కానీ ఆనందయ్య వంటి వారు ఆయుర్వేదం పేరుతో ఏ అర్హతలతో వైద్యం చేస్తున్నారు, తయారు చేసిన పసరు మందులు ఇస్తున్నారు ? కొందరు అలాంటి వారిని ప్రోత్సహించటం ఏమిటి ? ప్రశ్నించిన వారిని హిందూ ద్రోహులుగా చిత్రిస్తారా ? అల్లోపతి ఆసుపత్రుల్లో జరిగే వాటిని ప్రశ్నించరు అని ఒక ప్రచారం. ఈ ప్రశ ్న అడిగేవారు వేదికలను ఏర్పాటు చేసుకొని ఆ పని ఎందుకు చేయరు ? ఈ దేశంలో ఒక చట్టం, ఒక విధానం అన్నీ ఉన్నాయి. ఒక వేళ ఆనందయ్య లాంటి వారు ఆయుర్వేద వైద్యం చేయటానికి అర్హతలు ఉన్నాయనుకుంటే వారికి డిగ్రీలు ప్రదానం చేసి చట్టబద్దంగానే చేయించండి, ఎవరు వద్దన్నారు. కల్వరి తైలం గురించి శాస్త్రీయ నిరూపణ చేయాలని ఎవరూ అడగలేదు ఎందుకు అని ఒక ప్రశ్న. కల్వరి అయినా మరొకటి అయినా ఔషధం అని ప్రచారం చేస్తే జనవిజ్ఞానవేదికో మరొకటో రంగంలోకి వస్తాయి. లేదూ రాలేదు అనుకోండి ఈ ప్రశ్న వేస్తున్నవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు? వారికి బాధ్యత లేదా ? గుళ్లూ గోపురాల్లో ప్రసాదం పేరుతో పెట్టేవాటిలో, పవిత్ర తీర్ధంలో , చర్చ్‌లలో బాప్తిజం, ఇతర సందర్భాలలో పవిత్ర జలంలో ఏముంది అని ఏ జనవిజ్ఞాన వేదిక కార్యకర్త అయినా ఎప్పుడైనా ప్రశ్నించిన ఉదంతం ఉదంతం ఉందా ? ఎందుకంటే వాటిని వారు ఔషధాలుగా ప్రచారం చేసుకోవటం లేదు. అడ్డగోలు తర్కాలకు అంతు ఉండదు.
ఉచితంగా ఇస్తున్న మందు గురించి ఇన్ని విచారణలా ? లక్షలు తీసుకుంటున్న ఆసుపత్రులను ఎందుకు పట్టించుకోరు ? ఈ దేశంలో ఒక చట్టం ఉంది. దాని ప్రకారం ఎవరైనా తెల్లవారే సరికి ఒక మందు ఇస్తున్నామంటూ ముందుకు వస్తే దానికి అనుమతి ఉందా , ఎక్కడ తయారైంది, ఇతర వివరాలన్నీ ముద్రించిన సమాచారం ఉండాలి. రామర్ పిళ్లే పెట్రోలు తయారీ, ఆనందయ్య మరొక వెంకయ్య గానీ వివరాలు, అనుమతుల్లేని మందు గురించి చెబితే ఈ సమస్యలన్నీ ముందుకు వస్తాయి. ఈ ప్రశ్న వేసే వారు చట్టాన్ని గౌరవిస్తున్నట్లా లేక అడ్డగోలు తనాన్ని ప్రోత్సహిస్తున్నట్లా ? విచారణ చట్టబద్దంగా జరుగుతోందా, విరుద్దంగా జరుగుతోందా ? ఒక మహిళకు పుట్టిన బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక మగవాడు ప్రకటిస్తే డిఎన్‌ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారా లేదా అదే విధంగా ఆనందయ్య తయారు చేసినట్లు చెబుతున్న మందును ఎవరైనా ప్రశ్నించినా లేక వార్తలు తెలిసి తనంతటతానే అయినా ప్రభుత్వాలు, సంబంధిత సంస్దలు విచారణ జరుపుతాయి. అదే విధంగా ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిగ్గుతేల్చాలి. విచారణ సక్రమంగా జరగలేదు అంటే అది వేరే విషయం.
జనవిజ్ఞాన వేదిక లక్ష్యం ఈ దేశ అనాది సంస్కృతుల్ని విజ్ఞానం పేర నాశనం చేసి చైనాకు బానిసలుగా చేయటం అని ఒక ముక్తాయింపు. సంస్కృతి, సాంప్రదాయాల పేరిట అసలు ప్రశ్నించే తత్వాన్నే నాశనం చేసింది, నగుబాట్ల పాలు చేస్తున్నదీ జనవిజ్ఞానవేదిక లేదా అలాంటి మరొక సంస్ధ కాదు. విదేశీ పాలకులు వారు పశ్చిమ, మధ్య ఆసియా నుంచి వచ్చినా ఐరోపా నుంచి వచ్చినా ప్రతిఘటించకుండా జనాన్ని దద్దమ్మలుగా తయారు చేసింది, ఈ దేశంలో పుట్టి పెరిగిన బౌద్ధమతాన్ని విదేశాలకు తరిమి వేసింది ఎవరు ? ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనాన్ని పెంచి పోషించింది హిందూమతం లేదా గొప్పదని చెప్పుకుంటున్న హిందూ సంస్కృతా లేక జన విజ్ఞానవేదికలా ?
ఔషధ కంపెనీల మాఫియా లేదా వత్తిడి అని ఒక ప్రచారం. నిజమే మాఫియా లేదా వారి మాయాజాలం ఉన్న మాట నిజమే. అది ఉండబట్టే కదా భారత్ బయోటెక్, సీరం సంస్దల వాక్సిన్లు తప్ప నెలల తరబడి మరొక వాక్సిన్ రాకుండా మన నరేంద్రమోడీ సర్కార్ ఏదో ఒకసాకుతో మోకాలడ్డి జనం ప్రాణాల మీదకు తెచ్చింది. కాదంటారా ? నిజంగా జనం ప్రాణాలు కాపాడటం ముఖ్యం అనుకుంటే వాటికి అనుమతి ఇచ్చినట్లుగానే అత్యవసర ప్రాతిపదికన ఇతర వాక్సిన్లకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు ? ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేక ఆనందయ్యను అడ్డుపెట్టుకొని కాషాయ తాలిబాన్లు ఔషధ మాఫియా పేరుతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. లేదూ నిజంగానే ఔషధ మాఫియా పని చేస్తోందని అనుకుందాం. కొత్తగా ఆనందయ్య మందుతో వారు ముందుకు రాలేదుగా, ప్రధాని, మంత్రులు, వారందరికీ మార్గదర్శనం చేస్తున్న సంఘపరివార్ మేథావులు ఏడు సంవత్సరాలుగా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? యాభై ఏండ్లలో కాంగ్రెస్ చేయలేనిదానిని ఐదేండ్లలో చేశామని చెప్పుకున్న గొంతులు మాట్లాడవేం. కంపల్సరీ లైసన్సులు ఇచ్చి ప్రాణావసర ఔషధాలు, వాక్సిన్లు తయారు చేయించి మెడికల్ మాఫియాను దునుమాడితే ఎవరు వద్దన్నారు ?
ఇప్పుడు కొంత మంది కోవిడ్ -19ను చైనా వైరస్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగానే బ్రిటీష్ వారి పాలనా కాలంలో మన దేశంలో తలెత్తిన కలరాను ఐరోపా, అమెరికా ఖండాలలో ఆసియా లేదా ఇండియన్ కలరా అని వర్ణించారు. తమ ప్రాంతంలో వచ్చిన కలరా కూడా దీని వలనే నిందించారు. బహుశా కరోనా గురించి చైనా మీద మన టీవీ యాంకర్లు, వాట్సప్ యూనివర్సిడీ పండితులు రెెచ్చి పోవటానికి ప్రేరణ ఇదే అయి ఉండవచ్చు. భారత్‌లోని హరిద్వార్, పూరీ, పండరిపూర్, పశ్చిమాసియాలోని మక్కా, మదీనా వంటి చోట్ల జరిగే మతకార్యక్రమాలకు హాజరయ్యే జనాలు దీనికి ఒక కారణమని నాటి బ్రిటీష్ పాలకులు భావించారు. 1892లో ఒక అమెరికన్ భారత్‌లో పారిశుధ్య నిబంధనలు అమలు చేయాలంటే ప్రతి యాత్రీకుడికి ఇద్దరు సిపాయిలు అవసరమని రాశాడు. భారత్‌లో హిందూ భక్తులు, ఈజిప్టులో ముస్లిం భక్తులు కొనసాగినంత కాలం ఐరోపా, అమెరికాలకు ముప్పుకొనసాగుతూనే ఉంటుందన్నాడు. ఒక మతం వారు, మరొక మతంలోని కొన్ని సామాజిక తరగతుల వారు పరిశుభ్రత పాటించరంటూ ఇప్పటికీ ప్రచారం చేసే వారు దీన్ని గమనంలో ఉంచుకోవాలి.
పూరీ జగన్నాధ రధయాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులు కలరా వ్యాప్తికి ప్రధాన కారకులౌతున్నారనే అభిప్రాయంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్ పాలకులు ఒక దశలో ఆలోచించి, జనం నుంచి వచ్చే వ్యతిరేకతకు భయపడి పోతే పోనివ్వండి పోయేది వారేగా అన్నట్లు అలాంటి నిషేధాన్ని మానుకున్నారని చరిత్రకారులు రాశారు.బొంబాయి ప్లేగు, కలరా ఉదంతాలు 150 సంవత్సరాల క్రితం జరిగాయి. మహమ్మారుల గురించి ఎంతో పరిజ్ఞానం, విజ్ఞానం వచ్చిందనుకుంటున్న సమయంలో హిందూత్వశక్తుల అజ్ఞానం ఏ స్ధాయిలో ఉందో వారిని నమ్మి జనం ఎలా ప్రవర్తించారో చూశాము. గంగలో మునిగితే వైరస్ అంటుకోదని ప్రచారం చేశారా లేదా ! కుంభమేళాలో అంత మంది గుమికూడటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా బిజెపి ముఖ్యమంత్రులు, నేతలు దానికి అనుమతి ఇవ్వాల్సిందే అని వాదించి జనాన్ని గంగలో మునకలేయించారు కదా ! కొందరు అఖారాలు మరణించటం, వ్యాధి ప్రబలటంతో ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకొని మధ్యలోనే నిలిపివేశారు. ఎందుకు అనుమతించారో, ఎందుకు నిలిపివేయించారో, హిందూ భక్తుల మనోభావాలు ఏమయ్యాయో ఎవరైనా చెప్పగలరా ?
ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలో ఎబోలా మహమ్మారి తలెత్తినపుడు జనం ఎలా ప్రవర్తించారో మనం చూశాము. వాటిని సమర్ధిస్తామా ? ఎబోలా చికిత్స కేంద్రాలకు జనం వెళితే కొన్ని శరీర భాగాలను అపహరిస్తారని కొందరు, తమ సాంప్రదాయాలు, ఆచారాలకు భంగం వాటిల్లుతుందని ముందుకు రాని వారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు. అందువలన జనం పేరు చెప్పి మూఢవిశ్వాసాలను పెంచి పోషించే వారు పెద్ద దేశద్రోహులు. దాన్ని ప్రశ్నించారా,దీన్ని ప్రశ్నించారా అంటూ అనేక మంది ఇప్పుడు అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఆనందయ్య మందును కొందరు ప్రశ్నించారు గనుక వీరంతా రంగంలోకి దిగారు. ఆ మందు లేనపుడు కూడా వీరు చెబుతున్న అంశాలు ఉన్నాయి కదా వీరెందుకు స్పందించలేదు. అంటే వీరి ప్రశ్నలు,ప్రచార అసలు లక్ష్యం హిందూత్వతో సహా దేన్నీ ప్రశ్నించకూడదు. అది కుదిరేది, జరిగేది కాదు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎందరు అడ్డుకున్నా సమాజాన్ని వెనక్కు నడపాలని గతంలో ప్రయత్నించినా కుదరలేదు, ఇక ముందు కుదరదు !