Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అల్బేనియా, టర్కీ మాదిరే అత్యధిక ముస్లిం జనాభాతో ఉన్న ఆగేయా ఐరోపా ఖండ దేశం. జనాభా 30లక్షలకు లోపుగానే ఉన్న లౌకిక రాజ్యం. తూర్పు ఐరోపా దేశాల మాదిరే మూడు దశాబ్దాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలో ఉంది.1991 తరువాత బహుళ పార్టీ రాజకీయ వ్యవస్ధ ఉనికిలోకి వచ్చింది. మూడు దశాబ్దాలు గడచినా కమ్యూనిస్టు గతాన్ని సమూలంగా వదిలించుకోవటంలో విఫలమైందని రాజధాని టిరానా కేంద్రంగా పని చేస్తున్న ఒక స్వచ్చంద సంస్ధ పరిశోధకుడు అల్టిన్‌ జెటా తాజాగా రాసిన వ్యాసంలో వాపోయాడు. తూర్పు ఐరోపా దేశాలలో అనేక చోట్ల ప్రజాస్వామ్య ఖూనీ, కమ్యూనిస్టు పార్టీలపై నిషేధం, కమ్యూనిజం బాధితుల పేరుతో వ్యతిరేక ప్రచారం చేసే శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అల్బేనియా గురించి ఇలాంటి వ్యాఖ్య వెలువడటం ఒక చిన్న దేశం ఇస్తున్న పెద్ద సందేశంగా చెప్పవచ్చు. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఎందుకీ కడుపు మంట ?

కమ్యూనిస్టు గతం నుంచి విడగొట్టుకోని ఏకైక పూర్వపు ఐరోపా సోషలిస్టు దేశం అని సదరు రచయితే చెప్పాడు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్ధలను వ్యతిరేకిస్తూ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు, నాటి పోప్‌తో చేతులు కలిపిన ఉదంతాలను గుర్తుకు తెచ్చుకుంటే అలాంటి శక్తులు, వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేని ఏకైక దేశం అల్బేనియా. అయినప్పటికీ అక్కడి పాలకవర్గం అనేక చర్యలు బహుళ పార్టీ వ్యవస్ధను ప్రవేశ పెడుతూ రాజ్యాంగ పరమైన మార్పులు చేసింది. పూర్వపు సోషలిస్టు వ్యవస్ధలోని యంత్రాంగం, పార్టీ రాజకీయాలు, ఇతర అనేక అంశాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న దేశం అయినప్పటికీ దీని ప్రభావం మిగిలిన పూర్వపు సోషలిస్టు దేశాల మీద పడుతుందన్నది సామ్రాజ్యవాదులు లేదా వారి ఏజంట్ల భయం. పూర్వపు సోషలిస్టు దేశాల్లో అధికారానికి వచ్చిన శక్తులు సోషలిస్టు వ్యవస్ధలు, కమ్యూనిజం మీద విషం కక్కుతుంటే అల్బేనియాలో అలాంటి పరిస్ధితి లేదు. కమ్యూనిస్టు అల్బేనియా దేశంలో అందరికీ ఓటింగ్‌ హక్కు కల్పించటం,ఉచిత విద్య, వైద్యం, ఇతర అభివృద్ధికి ఒక పురోగామి రాజ్యంగా పని చేసిందని పాఠశాల పుస్తకాల్లో ఇప్పటికీ పిల్లలకు బోధిస్తున్నారు. దీన్ని కొనసాగిస్తున్న కారణంగా కమ్యూనిస్టు గతాన్ని పూర్తిగా తుడిచివేయటం అసాధ్యంగా మారిందని అక్కసు వెళ్లగక్కుతున్నారు.


సదరు రచయిత అక్కసుకు తక్షణ ప్రేరేపణ గతనెలాఖరులో అక్కడ జరిగిన ఎన్నికల్లో పూర్వపు అల్వేనియా లేబర్‌ పార్టీ ( కమ్యూనిస్టు పార్టీ ) వారసురాలు అల్బేనియా సోషలిస్టు పార్టీ అధికారానికి రావటమే. అనేక దేశాలలో కార్మికుల పేరుతో ఏర్పడిన అనేక పార్టీలు తరువాత కాలంలో సోషలిస్టు లక్ష్యంతో, కమ్యూనిస్టు సిద్దాంతాలను అనుసరించినప్పటికీ పూర్వపు పేర్లతోనే కొనసాగాయి. వాటిలో అల్బేనియా పార్టీ ఒకటి. ఉత్తర కొరియాలో అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులని అందరికీ అందరికీ తెలుసు. పార్టీ పేరు కొరియా వర్కర్స్‌ పార్టీ అనే ఉంది. అదే విధంగా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ 1920దశకంలోనే ఏర్పడినప్పటికీ ఎన్నికల అవసరాల కోసం 1944లో ప్రజా సోషలిస్టు పార్టీగా పేరు మార్చుకుంది. అయితే నియంత బాటిస్టాను కూలదోసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఫైడెల్‌ కాస్ట్రో ఆ సమయంలో కమ్యూనిస్టు కాదు.1955లో జూలై 26 ఉద్యమం పేరుతో ఏర్పడిన పార్టీ నేత.1959లో అధికారానికి వచ్చారు. రెండు సంవత్సరాల తరువాత విప్లవంలో భాగస్వాములైన మూడు పార్టీలు 1961లో విప్లవ సంస్ధగా ఐక్యమయ్యాయి. మరుసటి ఏడాది క్యూబన్‌ విప్లవ ఐక్య సోషలిస్టు పార్టీగా మారింది. మరో మూడు సంవత్సరాల తరువాత క్యూబా కమ్యూనిస్టు పార్టీ అయింది. 1976లో రాజ్యాంగ సవరణ చేసి దేశానికి మార్గదర్శిగా కమ్యూనిస్టు పార్టీని గుర్తించారు.

అయితే అల్బేనియా పార్టీ అలా ఉందని చెప్పలేముగాని ఒక వామపక్ష పార్టీగా పూర్వపు వారసత్వాన్ని కొనసాగిస్తోందని భావించవచ్చు. పూర్వపుసోషలిస్టు ప్రభుత్వంలో పని చేసిన వారు ఈ పార్టీలో కొనసాగుతున్నారు.యాభై ఆరు సంవత్సరాల ఎడి రామా పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఉన్నారు. కమ్యూనిస్టు నేపధ్యం గల కుటుంబంలో జన్మించిన రామా కమ్యూనిస్టు పార్టీలో పని చేయటం లేదా ప్రభుత్వ పదవుల్లో గానీ లేరు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా కుట్రలు జరిగిన 1990దశకంలో అల్బేనియాలో ప్రజాస్వామ్య వ్యవస్ధ కావాలని కోరిన వారిలో ఒకడు. డెమోక్రటిక్‌ పార్టీలో చేరి వెంటనే సైద్దాంతిక విబేధాలతో బయటికి వచ్చి సోషలిస్టు పార్టీలో చేరారు. టిరానా నగర మేయర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆయన నాయకత్వంలో మూడు సార్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో , రెండు మున్సిపల్‌ ఎన్నికలలో పార్టీ విజయం సాధించింది. ఐరోపా సోషలిస్టు పార్టీల కూటమిలో భాగస్వామిగా ఉంది.


తాజా విషయానికి వస్తే గతనెలాఖరులో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను 74 సాధించి అల్బేనియా సోషలిస్టు పార్టీ వరుసగా మూడవ సారి అధికారానికి వచ్చింది. 1992 నుంచి ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో ఒక సారి సంకీర్ణ మంత్రి వర్గానికి నాయకత్వం వహించింది, నాలుగుసార్లు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నాలుగు సార్లు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ధనిక దేశాలలో తలెత్తిన 2008 ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ 2013 నుంచి వరుసగా ఎన్నిక అవుతూనే ఉంది. మిగతా ఐరోపా దేశాలలో ఒక పాలకపార్టీ ఇలా వరుస విజయాలు సాధించటం ఇటీవలి కాలంలో అరుదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికలోనూ ఓట్లశాతాన్ని పెంచుకుంటూ వస్తుండటం కూడా ఒక విశేషమే. ప్రతిపక్ష మితవాద డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ఫలితాలను గుర్తించటం లేదని ప్రకటించి తరువాత మౌనం దాల్చింది. అనివార్యమైన స్ధితిలో అమెరికా, ఐరోపా దేశాలు కూడా సోషలిస్టుల విజయాన్ని జీర్ణించుకోలేకపోయినా గుర్తించక తప్పలేదు.


ఇక అంతర్గత రాజకీయాల విషయానికి వస్తే 2017లో సోషలిస్టు పార్టీ మద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు లిర్‌ మెటా తరువాత ప్రభుత్వ వ్యతిరేకిగా మారాడు. తాజా ఎన్నికలలో సోషలిస్టు పార్టీకి గనుక 71 స్ధానాలు వస్తే తాను రాజీనామా చేస్తానని ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసి ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నించాడు. సోషలిస్టు పార్టీ విజయం సాధించిన తరువాత 2022లో తన పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని, రాజీనామా ప్రసక్తి లేదని ప్రకటించాడు. అయితే అధికారపార్టీకి చెందిన ఎంపీలు అధ్యక్షుడిని అభిశంసించేందుకు ఒక తీర్మానాన్ని అంద చేశారు, తనను తొలగించటం చట్టవిరుద్దమని మెటా వాదిస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్యలను తీసుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది.అల్బేనియా ఎన్నికల్లో సోషలిస్టుల విజయం ఐరోపాకే కాదు, యావత్‌ ప్రపంచ పురోగామి శక్తులకు ఉత్సాహానిచ్చే పరిణామమే.

చిలీలో మితవాదులకు చావు దెబ్బ

లాటిన్‌ అమెరికాలోని చిలీ పరిణామాలు కూడా ప్రపంచ వామపక్ష శక్తులకు ఉత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి. నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసే రాజ్యాంగపరిషత్‌కు జరిగిన ఎన్నికలలో మితవాద శక్తులకు చావు దెబ్బ తగిలింది.మాజీ నియంత పినోచెట్‌ మద్దతుదారులు, సాంప్రదాయ పార్టీలు జనాగ్రహ సునామీలో కొట్టుకుపోయాయి. మే 16వ తేదీన నూటయాభై ఐదు స్ధానాలకు జరిగిన ఎన్నికలలో 77శాతం మంది వామపక్ష భావాలు కలిగిన వారు, నియంత పినోచెట్‌ విధానాలను వ్యతిరేకించిన వారు విజయం సాధించారు. అధికారంలో ఉన్న సోషలిస్టు సాల్వెడోర్‌ అలెండీని హత్య చేసిన పినోచెట్‌ 1973లో అధికారానికి వచ్చి 1990వరకు కొనసాగాడు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో మితవాద పార్టీల కూటమికి కేవలం 37 మాత్రమే వచ్చాయి.నిబంధనల ప్రకారం కొత్త రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్‌ ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. మితవాద శక్తులు గనుక 54 స్ధానాలు పొంది ఉంటే రాజ్యాంగ రచన చిక్కుల్లో పడి ఉండేది, అయితే ఓటర్లు అలాంటి అవకాశం లేకుండా 37 మాత్రమే ఇవ్వటంతో రాజ్యాంగ రచనలో మితవాద శక్తుల పప్పులు ఉడికే అవకాశాలు లేవు. రాజ్యాంగ సభలో 77 మంది మహిళలు, 78 మంది పురుషులు ఉన్నారు. నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద విజయాలు సాధించిన వారిలో 28 స్దానాలతో కమ్యూనిస్టులు ఉన్నారు, వామపక్షంగా ఉన్న మరొక పార్టీ 24 పొందింది.


2018లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన మితవాది, బిలియనీర్‌ సెబాస్టియన్‌ పినేరా విధానాలతో మరుసటి ఏడాదే దేశంలో వివిధ తరగతుల్లో ఆందోళన ప్రారంభమైంది. తరువాత అనేక ఉద్యమాలు నడిచాయి. గత మూడు సంవత్సరాలుగా పార్లమెంట్‌లోని మితవాదులు, పినేరా కూడా వైద్యరంగంలో ప్రజానుకూల సంస్కరణలకు అడ్డుతగిలారు. నయావుదారవాద విధానాలతో జనజీవితాలు అతలాకుతలం అయ్యాయి.సంపదలు దిగువ జనానికి చేరతాయని చెప్పిన ఊట సిద్దాంతం తిరగబడింది. కనీసం పదిలక్షల మంది జనం 2019లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన నేపధ్యంలో రాజ్యాంగపరిషత్‌ ఎన్నికలను చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం నయా ఉదారవాద విధానాలతో నియంత పినోచెట్‌ ఏర్పాటు చేశాడు. రాజ్యాంగ పరిషత్‌తో పాటు ప్రాంతీయ ప్రభుత్వాలు, స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావిస్తున్న డేనియెల్‌ జాడ్యు 66శాతం ఓట్లతో శాంటియాగోలోని రాజధాని ప్రాంత కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే విధంగా శాంటియాగో మేయర్‌గా చిలీ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త లిరాసీ హాస్లర్‌ ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. కమ్యూనిస్టు పార్టీతో సహా వామపక్ష శక్తులు ఉన్న బ్రాడ్‌ ఫ్రంట్‌ (విశాల కూటమి) తరఫున పోటీచేసిన అనేక మంది స్ధానిక సంస్ధలలోనూ, రాజ్యాంగ పరిషత్‌లోనూ విజయాలు సాధించారు. మితవాద శక్తులకు సాంప్రదాయంగా ఓటు వేసే అనేక పట్టణాల్లో వారిని మూడవ స్ధానానికి నెట్టివేశారు. చిలీ జనాభా కోటీ 90లక్షలు కాగా శాంటియాగో పరిసరాల్లో 60లక్షల మంది ఉన్నారు. ఆప్రాంతంలోని 27 మేయర్‌ స్ధానాలను కమ్యూనిస్టు, వామపక్షశక్తులు, పదకొండు స్ధానాలను స్వతంత్రులు గెలుచుకోగా మితవాదులకు 14వచ్చాయి. ఎన్నికలు ముగిసిన ఏడాది లోపు నూతన రాజ్యాంగ రచన జరగాలి. ఆ తరువాత రెండు నెలల్లో మరోసారి దాని మీద ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదానికి పెట్టాలి.


ప్రపంచ వ్యాపితంగా మితవాద, నయా ఫాసిస్టు శక్తులు పెరిగేందుకు అనువైన పరిస్దితులు ఉన్నాయి. అందుకే మన దేశంతో సహా అనేక చోట్ల అవి అధికార పీఠాలపై తిష్టవేశాయి.ఈ పరిణామాలను చూసి గుండెలు బాదుకోవాల్సిన పనిలేదు. ఇదేమీ ప్రపంచానికి కొత్త కాదు, వాటి పీచమణిచే ప్రజాశక్తి మొద్దుబారలేదు. అల్బేనియా, చిలీ పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి.