Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.