Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందున ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్‌ ఒకటవ తేదీన దేశవ్యాపితంగా నిరసన దినం పాటించాలని రెసిడెంట్‌ డాక్టర్ల ఫోరం పిలుపు నిచ్చింది. దీంతో ఇష్టవచ్చినట్లుగా బాబా మీద, మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టే ఎండగట్టే అవకాశం ఉంది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి లేదా వెయ్యి కోట్ల జరిమానా దావాను ఎదుర్కోవాలని అందుకు పదిహేను రోజుల గడువు ఇస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) ఇచ్చిన నోటీసులో పేర్కొన్నది. అందువలన ఆ గడువులోగా క్షమాపణ చెబుతారా, కేసును ఎదుర్కొంటారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల తుపానుతో గుక్కతిప్పుకోలేని మోడీ సర్కార్‌కు అటు వైద్యులను సమర్ధించాలా లేకా విశ్వాసపాత్రుడైన రామ్‌దేవ్‌ను సమర్ధించాలా అన్న కొత్త తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌ రామ్‌దేవ్‌ బాబా పతంజలి కరోనిల్‌ టూల్‌కిట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంచాలని నిర్ణయించటాన్ని బట్టి బాబాకు మద్దతు ఇస్తున్నదెవరో స్పష్టమౌతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఏదో ఒకసాకుతో కొనుగోలు చేస్తాయా ?


వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని కొందరు పండితులు చెప్పారు, ప్రచారం చేశారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఏ వైద్య విధానమూ సర్వరోగ నివారిణులను కనుగొన్నాము అని ప్రకటించలేదు. అల్లోపతి కూడా చెప్పలేదు. కానీ కరోనా వైరస్‌ను సొమ్ము చేసుకోవాలని చూసిన రామ్‌దేవ్‌ బాబా వంటి వారు ఢిల్లీ పెద్దల అండచూసుకొని రెచ్చిపోతున్నారు. ప్రశ్నల పేరుతో అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికీ అనేక వ్యాధులకు సరైన ఔషధాలు, చికిత్స లేదు. అలాంటపుడు రామ్‌దేవ్‌ వంటి వారు ఒక్క అల్లోపతినే ఎందుకు ప్రశ్నించాలి, మిగతా విధానాలకు ఈ ప్రశ్నలను ఎందుకు వేయటం లేదు.


ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో సొమ్ము చేసుకోవటం సులభం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం అల్లోపతి ఔషధాలకు మాత్రమే పరీక్షల నిర్దారణ నిబంధనలు ఉన్నాయి. సంప్రదాయ వైద్య పద్దతులను ప్రోత్సహించే పేరుతో ఆయుర్వేద, సిద్ద, యునానీ పేరుతో తయారు చేసే ఔషధాలకు వాటి నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఆనందయ్య లాంటి వారు ఊరికొకరు మందుల పేరుతో పుట్టుకు వస్తున్నారు. ఈ లోపం కారణంగానే రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలి తాము కరోనాను అరికట్టే కరోనిల్‌ అనే ఔషధాన్ని తయారు చేసినట్లు ప్రకటించుకుంది. దాన్ని విడుదల చేసిన సభలో స్వయంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా సొమ్ము చేసుకోవటం కంటే జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అలా చెప్పుకోవటాన్ని సవాలు చేసింది. కనుకనే బాబా గారికి అల్లోపతి వైద్యం, వైద్యుల మీద కోపం వచ్చింది. అందుకే నోటికి ఏది తోస్తే దాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చివరికి అది వివాదానికి దారితీయటంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సలహా వంటి హెచ్చరిక చేయటంతో వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన బాబాగారికి ఉక్రోషం ఆగలేదు. ఐఎంఎగానీ దాని బాబు గాన్ని నన్ను అరెస్టు చేయించలేరు అని నోరుపారవేసుకున్నారు. దాని కొనసాగింపుగా వాక్సిన్‌ తీసుకున్నా పది వేల మంది వైద్యులు కరోనాతో మరణించారని అబద్దాలు ప్రచారం చేశారు. తన పాతిక ప్రశ్నలకు అల్లోపతి వైద్యవిధానాన్ని సమర్ధిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు.


రామ్‌దేవ్‌ బాబా సవాలుకు తాము జవాబు చెబుతామని, తాము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తామని ఆ చర్చను మీడియా సమక్షంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పతంజలి యోగ పీఠం నుంచి ముగ్గురు ఆయుర్వేదాచార్యులను నియమించాలని, కావాలంటే రామ్‌దేవ్‌ బాబా,ఆయన అనుచరుడు మరో భాగస్వామి బాలకృష్ణ కూడా చర్చలో ప్రేక్షకులుగా ఉండవచ్చునని ఐఎంఎ ప్రతిసవాలు విసిరింది. ఆయుర్వేదంలో వారిద్దరి అర్హతలేమిటో వెల్లడించాలని తాము గతంలోనే మూడు సార్లు కోరినప్పటికీ ఇంతవరకు జవాబు లేదని, అర్హత లేనివారితో చర్చించటం పద్దతి కాదు కనుక వారు తమ నిపుణులను నియమించాలని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్య సామర్ద్యాన్ని ప్రశిస్తూ రామ్‌దేవ్‌ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ వివాదంలో బిజెపి బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజరు జైస్వాల్‌ అల్లోపతి వైద్యులకు మద్దతు ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ రామ్‌దేవ్‌ ఒక యోగా గురువు మాత్రమే, దానిలో ఆయన సమర్దతను ఎవరూ ప్రశ్నించరు. పానీయాలకు కోకా కోలా ఎంత ప్రాచుర్యం తెచ్చిందో యోగాకు ఆయన అలా చేశారు.భారతీయులు పురాతన కాలం నుంచీ షికంజీ, తండారు వంటి పానీయాలను తాగుతున్నారు. కోకా కోలా వచ్చిన తరువాత అదే జనాలు పెప్సీ, కోక్‌లను ఇండ్లలో నిలవచేసుకుంటున్నారు. రామ్‌దేవ్‌ యోగి కాదు, ఎందుకంటే యోగులు తమ మెదళ్లు, స్పృహలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. అల్లోపతి వైద్యులు పనికిమాలిన చర్చల్లో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని పవిత్రమైన వృత్తి మీద కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. వ్యాధులను దూరంగా ఉంచినంత వరకు ముఖ్యమైనదే గాని యోగా వైద్యవిధానం కాదు, ప్రతి వైద్యవిధానానికి దేనికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి, యోగా మనలను జాడ్యానికి దూరంగా ఉంచవచ్చు కానీ ఉన్న రోగాలకు చికిత్సగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి అన్నారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి డాక్టర్‌ సహజానంద కుమార్‌ సింగ్‌ ఒక ప్రకటన చేస్తూ రామ్‌దేవ్‌ తన యోగా, పతంజలి ఉత్పత్తులకు పరిమితం కావాలి, కరోనా సమయంలో అవసరమైన చికిత్స చేస్తున్న వైద్యులను నిరుత్సాహపరచ కూడదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ పదివేల మంది వైద్యులు మరణించారంటూ పుకార్లు వ్యాపింప చేస్తున్నందుకు, కరోనా మీద ప్రభుత్వ చికిత్సా విధానాలను సవాలు చేయటం దేశద్రోహంగా పరిగణించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసినట్లు తెలిపారు. అలాంటి చర్యలు జనాన్ని వాక్సిన్లు తీసుకోకుండా చేసేందుకు ప్రోత్సహిస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ ఐఎంఎ శాఖ వెయ్యి కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపిందన్నారు.


కరోనిల్‌ గురించి పతంజలి తప్పుడు ప్రచారం చేసి రోగులను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటంతో దాని సామర్ధ్యం గురించి ఐఎంఎ సవాలు చేసింది. అయితే తాము 46 మంది రోగుల మీద పరీక్షలు జరిపామని సమర్ధించుకొనేందుకు చూసినప్పటికీ కుదరకపోవటంతో అది చికిత్సకు సహాయకారి అని ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సంస్ధ కూడా అలాంటిదిగానే పరిగణించి అనుమతి ఇచ్చినప్పటికీ ఏకంగా కరోనా నిరోధం అని ప్రచారం చేశారు. దీంతో ఐఎంఎ మీద అక్కసుతో అల్లోపతి వైద్యం బుద్ది తక్కువ శాస్త్రం అని రామ్‌దేవ్‌ అంటే పతంజలి సంస్ధ సారధుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ సమస్యకు మతం రంగు పులిమి కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. బిజెపి అనుకూల మీడియా కూడా దాన్ని భుజానవేసుకొని మతకోణాన్ని ముందుకు తీసుకు వచ్చిదాడి చేస్తోంది. సహజంగానే ఆ దాడికి గురైన నెటిజన్లు అదే పాటపాడుతున్నారు.


యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు అని బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దీని వెనుక అసలు కారణంగా కరోనిల్‌ మీద అదే విధంగా అల్లోపతిని అవమానిస్తూ వ్యాఖ్యానించిన రామ్‌దేవ్‌ మీద చర్యకు డిమాండ్‌ చేసిన ఐఎంఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా డాక్టర్‌ జాన్‌ రోజ్‌ జయలాల్‌ చురుకుగా వ్యవహరించటమే. తన పదవిని ఉపయోగించుకొని జాన్‌ రోజ్‌ జనాన్ని క్రైస్తవులుగా మార్చేందుకు పూనుకున్నారని గర్హనీయ, హాస్యాస్పదమైన ఆరోపణలకు దిగారు.


ప్రతిదానికీ ఆయుర్వేదంలో చికిత్స ఉంది, ఔషధాలున్నాయని చెప్పే వారు ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం ఎదురు చూస్తున్న జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు దేన్నీ వదలటం లేదు.మూడు సంవత్సరాల క్రితం కేరళలో వచ్చిన నీఫా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా ఆయుర్వేదంలో కషాయ చికిత్స ఉందంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. అప్పుడు కూడా ఐఎంఎ రంగంలోకి దిగి జనాన్ని హెచ్చరిస్తూ అలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.నిజానికి నీఫా వైరస్‌ 1990 దశకంలోనూ, తరువాత కూడా మన దేశంలో వ్యాపించింది, దేశంలో కేరళ ఆయుర్వేద ప్రాచుర్యం గురించి తెలిసిందే, అయినప్పటికీ ఆ వైద్య విధానం లేదా ఆరంగంలో పని చేస్తున్న వారు గానీ ఔషధాన్ని తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి అర్హతలు, నైపుణ్యంలేని ఆనందయ్య కరోనాకు తాను మందు తయారు చేశానని చెబితే సమర్ధించే ఆయుర్వేద వైద్యులందరూ తమ పట్టాలను పక్కన పడేసి కల్వాలు-గూటాలు తీసుకొని ఆనందయ్య అనుచరులుగా మారిపోవటం మంచిది. ఆనందయ్యను సమర్ధించే పాలకులు ఆయుర్వేద కాలేజీలు, ఆసుపత్రులను అల్లోపతికి మార్చివేయాల్సి ఉంటుంది.


తన పదవిని ఉపయోగించుకొని జనాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న తప్పుడు వార్తలను పట్టుకొని ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ ఐఎంఎ అధ్యక్షుడు జాన్‌ రోజ్‌ జయలాల్‌ మీద ఒక క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. రామ్‌దేవ్‌పై ఐఎంఎ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇది దాఖలు కావటం గమనించాల్సిన అంశం. సామాజిక మాధ్యమంలో ప్రకటనలు చేయటం ద్వారా మత బృందాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని లాయర్‌ ఆరోపించారు. తాను ఒక టీవీ చర్చను చూశానని, దానిలో బాబా రామ్‌దేవ్‌ను దూషిస్తూ, దుర్భాషలాడారని, బెదిరించారని, తాను యోగా గురువు భక్తుడిని కనుక మానసికంగా గాయపడ్డానని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ” కుష్టు, కలరా, ఇతర మహమ్మారులు ప్రపంచంలో నష్టం కలిగించినపుడు వాటికి వ్యతిరేకంగా క్రైస్తవ వైద్యులు, చర్చ్‌లు పని చేశారని, క్రైస్తవ కరుణ చూపించారని ” చెప్పారని అది క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నమని ఆరోపించారు.


ఒక కులం లేదా మతంలో పుట్టటం అనేది ఎంపిక ప్రకారం జరిగేది కాదు.అనేక మంది హిందూ, ముస్లిం, సిక్కు తదితర మతాల కుటుంబాలలో పుట్టినట్లుగానే డాక్టర్‌ జాన్‌ రోజ్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతని మీద చేస్తున్న ఆరోపణల స్వభావం ఏమిటి ? అతను హగ్గారు ఇంటర్నేషనల్‌ అనే క్రైస్తవ సంస్ద సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి దేశాన్ని ఏసు క్రీస్తు సువార్తతో మార్చివేయాలన్న లక్ష్యం మాది అని సదరు సంస్ధ ప్రకటించుకుంది. ఐఎంఎ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక జీవితంలో వైద్య వృత్తిలో సువార్త స్ఫూర్తిని నింపుకొని పని చేస్తానని, దేవుడికి సజీవ సాక్షిగా జీవించాలని గాఢంగా భావిస్తున్నాను. తమ వ్యక్తిగత రక్షకుడిగా ఏసును స్వీకరించాలని యువ వైద్య విద్యార్ధులు, వైద్యులను ప్రోత్సహిస్తాను, నేను పని చేస్తున్న ఒక లౌకిక సంస్ధలో దేవుడికోసం ఒక సాక్షిగా పని చేస్తాను అని చెప్పారు. సంఘపరివార్‌ శక్తులు ఈ మాటలను పట్టుకొని వాటికి చిలవలు పలవలు అల్లి తమ భాష్యాన్ని జోడించి నానా యాగీ చేశాయి. సదరు హగ్గీ సంస్ద ప్రకటించుకున్న లక్ష్యాలకు జాన్‌ రోజ్‌ ఎలా బాధ్యుడు అవుతారు?


లౌకిక రాజ్యాన్ని హిందూత్వ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు. నిత్యం అందుకోసమే ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు,ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలుసు. అలాంటివి ఇంకా అనేక సంస్ధలు ఉన్నాయి. వాటి సమావేశాల్లో పాల్గొన్నవారు అనేక మంది వివిధ అధికారిక సంస్దలు, పదవుల్లో ఉన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అలాంటిది కాదు, వైద్య వృత్తిదారుల సంస్ధ. దాని నిబంధనావళికి లోబడి అర్హతలు ఉన్న ఎవరైనా చేరవచ్చు, పదవులకు ఎన్నిక కావచ్చు. వివిధ మతాలకు చెందిన వైద్యులు దాని సభ్యులుగా ఉండి తమ మత సంస్ధల సమావేశాలు, ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటమా లేదా అనేది వారిష్టం. అదేమీ అనర్హత కాదు కనుకనే జాన్‌ రోజ్‌ జయలాల్‌ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అనేక మంది తమ మతవిశ్వాసాలకు అనుగుణ్యంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. అంతమాత్రాన లౌకిక రాజ్యాంగం ప్రకారం పదవిని పొందిన వారిని వాటికి వెళ్లవద్దని ఎవరూ చెప్పటం లేదు. అది వారికి సంబంధించిన వ్యక్తిగత అంశం. విధి నిర్వహణలో తమ మతాన్ని, కులాన్ని తీసుకురావటం చట్టవిరుద్దం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. జాన్‌ రోజ్‌ ఎన్నికైన తరువాత ఏ వైద్య విద్యార్ధులు లేదా వైద్యులను ఐఎంఎ అధ్యక్షుడి హౌదాలో సమావేశ పరచి క్రైస్తవాన్ని పుచ్చుకోమని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు సర్కార్‌ పుష్కర స్ధానాలు చేస్తే పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు కుంభమేళాలో పాల్గొని గంగలో మునగాలని ప్రోత్సహించారు, తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారు.


ఇక జాన్‌ రోజ్‌ హిందూయిజాన్ని, పురాతన భారత సంస్కృతిని ద్వేషించారు అన్న ఆరోపణ. ఏ సందర్భంలో ద్వేషించారో లేదో కాషాయ దళాల రాతలను బట్టి నిర్ధారణలకు రాలేము. లేదూ ఒకవేళ ద్వేషించారే అనుకుందాం. అలాంటి అభిప్రాయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. లేదూ మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక అభిప్రాయం కలిగి ఉండటం దేశద్రోహమా, రాజ్యాంగ విరుద్దమా ? కులము-హిందూయిజం రెండింటికీ తేడాలేదని ద్వేషించిన తరువాతనే కదా అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించలేదా, కేంద్రమంత్రిగా పని చేయలేదా.
ఒక ఇంటర్వ్యూలో ” వారు దేశాన్ని ఒకటిగా, వైద్య పద్దతిని ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు, రేపు ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా సంస్కృత భాష ప్రాతిపదికన, అది ఎల్లవేళలా హిందూ సిద్దాంతాలతోనే ఉంటుంది.ఇది పరోక్ష పద్దతిలో సంస్కృతం పేరుతో జనం మెదళ్లలో హిందూత్వను నింపాలని చూస్తున్నారు ” అని కూడా జాన్‌ రోజ్‌ చెప్పారట. దానిలో అభ్యంతరం ఏముంది, గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా ?


ప్రాణాయామం చేయటం ద్వారా, గాయత్రీ మంత్రాన్ని పఠించి కరోనాను పోగొట్టవచ్చా అని పరీక్షలు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ నిర్ణయించటాన్ని, రెండు వారాల పాట్లు క్లినికల్‌ ప్రయోగాలు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి, దాన్ని చదివి, విన్న వారికి కలిగే అభిప్రాయం ఏమిటి ? హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రోత్సహించటమా కాదా ? ముస్లిం, క్రైస్తవ ఇతర మతాల ప్రార్ధనలతో కూడా కరోనాను పోగొట్టవచ్చేమో పరీక్షించాలని గాయత్రీ మంత్రంతో పాటు ఎందుకు జత చేయలేదు. దీనితో పోల్చుకుంటే చర్చిల్లోంచి పరిశుద్ద జలం తెచ్చి వాటిని తాగితే లేదా చల్లుకుంటే కరోనా పోతుందని జాన్‌ రోజ్‌ చెప్పలేదు. తాను చెప్పిన వాటిని వక్రీకరించారని డాక్టర్‌ జయలాల్‌ చెప్పారు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఐఎంఎం స్వయంగా ఖండించింది. తమ విధానాలు, వైఖరిని విమర్శించిన ప్రతివారి మీద మతం ముద్రవేయటం ద్వారా తమ దాడిని సమర్ధించుకొనే యత్నం తప్ప ఇది మరొకటి కాదు.