ఎం కోటేశ్వరరావు
ప్రపంచంలో అనేక పార్టీలు పుట్టాయి, గిట్టాయి. అది పెద్ద విషయం కాదు, వంద పార్టీ జనాలకు ఏమి చేసిందనేదే గీటురాయి. ఈ నేపధ్యంలో జూలై ఒకటవ తేదీన వందవ వార్షికోత్సవం చేసుకోనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) గురించి అందరూ తెలుసుకోవటం అవసరం. వందేళ్ల చరిత్ర, విజయాలు, అనుభవాల వివరణకు పెద్ద గ్రంధమే అవసరం. చైనా సాధించిన విజయాల నుంచి జనాల దృష్టి మళ్లించేందుకు నిరంతరం కమ్యూనిస్టు వ్యతిరేకులు చేస్తున్న ప్రయత్నాలు ఈ సందర్భంగా మరీ ఎక్కువయ్యాయి.అక్కడ మానవ హక్కులు లేవు, ఏక పార్టీ నియంతృత్వం, ప్రశ్నిస్తే సహించరు. సోషలిస్టు వ్యవస్ధ కూలిపోతుంది, అభివృద్ది అంకెల గారడీ తప్ప నిజం కాదు అని చెబుతారు. అలాంటపుడు అలా చెప్పే దేశాలు, శక్తులు కూలిపోయేంతవరకు వేచి చూస్తే పోయేదానికి ఆందోళన ఎందుకు ? చతుష్టయ కూటములెందుకు, జి7 సమావేశాలెందుకు, చైనాను అడ్డుకోవాలనే సంకల్పాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ?
1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి కబుర్లు చెబుతూనే ఉన్నారు. వాటిని ఒక చెవితో వింటూ ఒక కంట కనిపెడుతూనే చైనా తన పని తాను చేసుకుపోతూ అనేక విజయాలు సాధించింది. దీని అర్ధం చైనాకు ఎలాంటి సమస్యలూ లేవని కాదు. ఒక్కొక్క మెట్టూ అధిగమిస్తూ ముందుకు పోతున్నది. ఆ తీరు సామ్రాజ్యవాదులను బెంబేలెత్తిస్తున్నది. పూర్వపు సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా రాజ్యాల అనుభవాలు, గుణపాఠాలు తీసుకున్న సిపిసి నాయకత్వం తమవైన లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నది. కూల్చివేతకు గురైన సోషలిస్టు దేశాలలోని జనం తమ స్ధితిని పెట్టుబడిదారీ దేశాలలో ఉన్న పరిస్ధితినీ పోల్చుకున్నారు గనుకనే కమ్యూనిస్టు వ్యతిరేకుల పని సులభమై ఆ వ్యవస్ధలను కూలదోశారు. అయితే చైనీయులు కూడా పోల్చుకోవటం సహజం. తాము ఉత్పత్తి చేసిన సరకుల మీద అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఆధారపడ్డాయని, ఆ ఎగుమతులు తమ జీవితాలను మెరుగుపరిచాయని కూడా వారికి తెలుసు. ఇలాంటి అనుభవం సోవియట్, తూర్పు ఐరోపా దేశాల వారికి లేదు. అప్పుడు సోషలిజం విఫలమైందనే ప్రచారం అమెరికాలో జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది. తాము సాధిస్తున్న విజయాలు పశ్చిమ దేశాల మీద మిగిలి ఉన్న భ్రమలను చైనీయుల్లో క్రమంగా తొలగిస్తున్నాయి.
మొదటి ప్రపంచ యుద్దంలో సామ్రాజ్యవాదుల పట్ల చైనా ప్రభుత్వ మెతక వైఖరికి నిరసనగా 1919లో విద్యార్ధులు, మేథావులు తీవ్రంగా స్పందించారు. చైనాలోని కొన్ని ప్రాంతాలను జపాన్ ఆధీనంలో ఉంచేందుకు అంగీకరించటం ఆగ్రహం కలిగించిది. దానికి నిరసనగా మే నాలుగవ తేదీన ప్రదర్శనలు నిర్వహించారు. రష్యాలో బోల్సివిక్ విప్లవం, ప్రధమ శ్రామిక రాజ్యం ఏర్పడటం వంటి పరిణామాలు కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు పురికొల్పాయి. మే నాలుగు ఉద్యమంలో భాగస్వాములైన మేథావులు ప్రపంచ విప్లవం, మార్క్సిజం భావజాలంతో స్పూర్తి పొందారు. రష్యన్ కమ్యూనిస్టు ఓటిన్‌స్కీ 1920 ఏప్రిల్ నెలలో చైనా వచ్చి అక్కడి మేథావులను కలిసి చర్చలు జరిపారు. షాంఘైలో దూర ప్రాచ్య కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ శాఖను ఏర్పాటు చేశారు. దాని ఫలితమే షాంఘై రివల్యూషనరీ బ్యూరో లేదా కమ్యూనిస్టు గ్రూప్ ఏర్పాటు, అధ్యయన తరగతులు నిర్వహించారు.1921 జూలై 1న చైనా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత జూలై 23-31వ తేదీల మధ్య పార్టీ వ్యవస్దాపక మహాసభ జరిగింది.
కేవలం యాభై మంది సభ్యులతో ప్రారంభమైన పార్టీ ప్రధమ మహాసభకు మావో జెడాంగ్‌తో సహా ప్రతినిధులు పన్నెండు మంది మాత్రమే. అది కూడా షాంఘైలోని ఫ్రాన్స్ భూభాగంలో ఒక ఇంట్లో జరిగింది. దాన్ని పసిగట్టిన ఫ్రెంచి పోలీసులు సభను అడ్డుకోవటంతో పక్కనే ఉన్న ఒక నదిలో విహార యాత్రీకుల పడవలోకి మార్చారు. అయితే ఆ సమావేశానికి అప్పటికే ప్రముఖ కమ్యూనిస్టు మేధావిగా, చైనా లెనిన్‌గా పేరు గాంచిన చెన్ డూక్సీ హాజరు కాలేకపోయినప్పటికీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైయ్యారు.1927వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. చైనా జాతియోద్యమనేత సన్‌యేట్ సేన్ కమ్యూనిస్టు కాకపోయినప్పటికీ కమ్యూనిస్టు భావజాలానికి అనుకూలం. చైనా కమ్యూనిస్టులు ఆయన నాయకత్వంలోని కొమింటాంగ్ పార్టీతో కలసి పని చేయటమే గాకుండా జాతీయవాదులను కమ్యూనిస్టులుగా మార్చేందుకు పని చేశారు. ఒక దశలో ఆ పార్టీకి కమ్యూనిస్టులే నాయకత్వం వహిస్తారా అన్న స్దితిలో 1925లో సన్‌ఏట్ సేన్ మరణించారు. తరువాత చాంగ్‌కై షేక్ కొమింటాంగ్ పార్టీ, ప్రభుత్వ అధినేతగా ఎన్నికయ్యాడు. సన్‌యేట్ సేన్ మరణించేంతవరకు తన కమ్యూనిస్టు వ్యతిరేకతను దాచుకున్న చాంగ్ పార్టీనేతగా మారగానే కమ్యూనిస్టులను పక్కన పెట్టటం ప్రారంభించాడు. పశ్చిమదేశాలకు దగ్గరయ్యాడు.1927 నాటికి కమ్యూనిస్టుల అణచివేతకు పూనుకున్నాడు.
చైనా విప్లవం ఏ పంధాలో నడవాలనే అంశంపై 1925లోనే పార్టీలో చర్చ జరిగింది. కార్మికవర్గ నాయకత్వాన జరగాలని చెన్ డూక్సీ ప్రతిపాదించగా చైనాలో ఉన్న పరిస్ధితిని బట్టి రైతాంగం ఆధ్వర్యాన జరగాలని మావో ప్రతిపాదించాడు. కొమింటాంగ్ పార్టీతో ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా చెన్ వైఖరి వ్యతిరేకంగా ఉంది. చాంగ్‌కై షేక్ కమ్యూనిస్టులను వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీలోని అనేక మంది కమ్యూనిస్టులతో సఖ్యతగా ఉన్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం చెన్ వైఖరిని తప్పు పట్టింది. చివరికి 1929లో పార్టీ నుంచి బహిష్కరణకు గురై తరువాత ట్రాట్సీయిస్టుగా మారిపోయాడు. చాంగ్‌కై షేక్‌ను ప్రతిఘటించే క్రమంలోనే కమ్యూనిస్టుల లాంగ్ మార్చ్ తరువాత 1948లో అధికార హస్తగతం తెలిసిందే.
దారిద్య్రం నుంచి 77 కోట్ల మందిని బయట పడవేయటం 50 కోట్ల మంది మధ్యతరగతి జనాల వినియోగశక్తిని పెంచటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన పెద్ద విజయం. కమ్యూనిజం మీద వ్యతిరేకత ఉన్నా, దాన్ని కూల్చివేయాలని కోరుతున్నా బహుళజాతి సంస్ధలన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టటం, వాణిజ్యానికి ముందుకు రావటం వెనుక ఉన్న కారణం అదే. వీటికి తలుపులు తెరిచే సమయంలోనే సంస్కరణలకు ఆద్యుడిగా ఉన్న డెంగ్‌సియావో పింగ్ ఒక మాట చెప్పారు. కిటికీలు తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి, అయితే వాటిని ఎలా నిరోధించాలో కూడా మాకు తెలుసు అన్నారు.
గత పద్దెనిమిది నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపి వేస్తుండగా దాన్ని అరికట్టటం, కొద్ది నెలల్లోనే తిరిగి సాధారణ ఆర్ధిక, సామాజిక జీవనాన్ని పునరుద్దరించటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన అతి పెద్ద విజయం. మన దేశంలో కరోనా సోకిన వారు ఆసుపత్రులపాలై ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి సామాజిక సంక్షోభంతో సతమతమౌతున్నారో మనం నిత్యం చూస్తున్నాం. సమర్ధవంతమైన చర్యల ద్వారా చైనీయులకు అటువంటి పరిస్ధితి నుంచి కమ్యూనిస్టు పార్టీ కాపాడింది. అందుకే అంతర్జాతీయ సంస్ధలు జరిపిన సర్వేలో 95శాతం మందికిపైగా జనం కమ్యూనిస్టు పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నూటపది కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయటం చిన్న విషయం కాదు. ఈ విజయాలు సాధించటం వెనుక 9.2 కోట్ల మంది సిపిసి సభ్యుల పాత్ర ఉంది.2008లో ధనిక దేశాలలో ప్రారంభమైన సంక్షోభం చైనా మీద ప్రభావం చూపింది. అయితే దాన్ని అధిగమించేందుకు మౌలిక సదుపాయాలు, శాస్త్ర, సాంకేతిక, మానవ వనరుల రంగాలలో పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి త్వరలోనే దాన్ని అధిగమించింది. ఆ పెట్టుబడులు ఇప్పుడు వివిధ రంగాలలో చైనా విజయాలను ప్రపంచానికి వెల్లడించుతున్నాయి. టెలికాం రంగంలో 5జి, మొబైల్ చెల్లింపులు, ఇ కామర్స్, కృత్రిమ మేథ, రోబోటిక్స్, రోబో కార్లు,హైస్పీడ్ రైల్వేలు, అంతరిక్ష రంగం, అధునాతన ఆయుధాల తయారీలో నేడు చైనా కొత్త వరవడిని సృష్టిస్తోందంటే దాని వెనుక చోదకశక్తి చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొకటి కాదు.
చైనా తొలి పంచవర్ష ప్రణాళిక 1953లో ప్రారంభమైంది. సోవియట్ యూనియన్ను చూసి ఈ విధానాన్ని ప్రారంభించిన చైనా త్వరలోనే దానిలో ఉన్న లోపాలు, పొరపాట్లను గమనించింది. చైనాకు తగిన విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేసింది.1981-90 మధ్య జిడిపిని రెట్టింపు, తరువాత పది సంవత్సరాలో దానికి రెట్టింపు లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించకుండా ఆర్ధిక కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు లేవని గుర్తించారు. దాంతో అంతకు ముందు అనుసరించిన ప్రణాళికాబద్ద విధానంతో పాటు కొద్ది మార్పులు చేసి సోషలిస్టు మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధగా మార్చి 2001లో ప్రవేశం పొందారు. 2049 నాటికి అంటే సోషలిస్టు వ్యవస్ధ వందవ సంవత్సరంలో ప్రవేశించే నాటికి ఆధునిక సోషలిస్టు రాజ్యంగా రూపొందాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. చైనా సాధించిన వృద్ధి ఏదో ఒక ఏడాదిలో వచ్చింది కాదు. సంస్కరణలు ప్రారంభించిన పది సంవత్సరాల తరువాతనే ఫలితాలనివ్వటం ప్రారంభమైంది.
1960లో ప్రపంచ జిడిపిలో చైనా వాటా 4.4శాతం, 1970లో 3.1, 1980లో 1.7, 1990లో 1.6, 2000లో 3.6, 2010లో 9.2, 2020లో 18.34శాతం ఉంది.సంస్కరణల్లో భాగంగా తలుపులు తెరిచినపుడు కమ్యూనిస్టు పార్టీలోనే ప్రతిఘటన ఎదురైంది. ఇవి చివరకు పెట్టుబడిదారీ విధానం వైపు దారి తీస్తాయోమో అన్నదే దాని వెనుక ఉన్న ఆందోళన. 1982లో షెంజన్‌లోని షెకావ్ పారిశ్రామిక ప్రాంతంలో విదేశీయుడిని వాణిజ్య మేనేజర్‌గా నియమించేందుకు తీసుకున్న నిర్ణయం మీద తీవ్ర విమర్శ వచ్చింది. వెంటనే డెంగ్‌సియావో పింగ్ జోక్యం చేసుకొని దాన్ని సమర్ధించారు,అదేమీ దేశద్రోహ వైఖరి కాదు అన్నారు. చైనా అమలు జరిపిన విధానాలను చూసి పశ్చిమ దేశాల వారు, కొందరు వామపక్ష అభిమానులు కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని ప్రచారం చేశారు. నిజానికి అది పెట్టుబడిదారీ విధానమే అయితే నేడు ఇతర పెట్టుబడిదారీ దేశాలు మన వంటి దేశాలను కూడా కలుపుకొని కలసికట్టుగా వారి మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది ?
గత ఆరు దశాబ్దాలలో చైనాలో వచ్చిన మార్పును వివిధ దేశాల జిడిపితో పోల్చినపుడు ఎలా ఉందో దిగువ చూడవచ్చు. విలువ బిలియన్ డాలర్లలో.
దేశం ××× 1960×× 1970×× 1980××× 1990××× 2000×××× 2010×××× 2020
చైనా ××× 59.7 ×× 92.6×× 191.1×××360.9×××1211.3 ×× 6,087.2 ××16,640
జపాన్ ×××44.3××212.6 ××1,105.4××3,132.8××4,887.5 ×× 5,700.1 ×× 5,378
బ్రిటన్ ××× 73.2××130.7 ××564.9 ××1,093.2 ××1,657.8×× 2,475.2 ×× 3,120
అమెరికా ××543.3 ×1,073.3××2,857.3××5,963.5××10,252.3××14,992.1××22,680
జపాన్ అభివృద్ది గురించి లొట్టలు వేసుకుంటూ వర్ణించినంత ఆనందంగా చైనా గురించి మీడియా గానీ మరొకరు గానీ చెప్పలేదు. కారణం ఏమంటారు ? కరోనా రెచ్చిపోయిన 2020 సంవత్సరంలో చైనా గురించి ఎవరెన్ని కథలు చెప్పినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే వారు పొలోమంటూ చైనాకే వెళ్లారు. చైనాకు 163 బిలియన్ డాలర్లు రాగా అమెరికాకు 134 బిలియన్ డాలర్లు వచ్చాయి. తరువాత పరిస్దితి మెరుగుపడితే తిరిగి అమెరికాయే మొదటి స్ధానానికి చేరవచ్చు. తొలి రోజుల్లో జనానికి అవసరమైన ఉపాధి, ఆహారం, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి చైనా కమ్యూనిస్టుపార్టీ తొలి రోజుల్లో కేంద్రీకరించింది. ఇప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం మీద కేంద్రీకరించింది. అమెరికా వంటి ధనిక దేశాలకు అదే కంటగింపుగా మారింది.