Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళ ఎల్‌డిఎఫ్‌లో గతంలో ఎన్నడూ లేనంత మంది ” విశ్వాసులు ” దేవుడి పేర శాసనసభ్యులుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటూ కేరళలో ప్రముఖ మీడియా సంస్ధ మలయాళ మనోరమ పత్రిక ఒక విశ్లేషణ రాసింది. అంతకు ముందు కొన్ని పత్రికలు మంత్రివర్గంలో కులాల వారీ ఎవరు ఎందరున్నారనే విశ్లేషణలు చేశాయి. వీటిని చదివిన వారు ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం వ్యతిరేకులైతే శత్రుపూరిత దాడి చేసేందుకు, శ్రేయోభిలాషులైతే స్నేహపూర్వక విమర్శలు, సమర్దనలు చేసేందుకు పూనుకోవచ్చు.


మనోరమ పత్రిక విశ్లేషణ ప్రకారం 1980లో ఎల్‌డిఎఫ్‌ ఏర్పడిన తరువాత తొలిసారిగా 99 మంది కూటమి సభ్యులలో 17 మంది దేవుడి పేరుతో ప్రమాణం స్వీకారం చేశారు, మరొక సభ్యుడు సకాలంలో వచ్చి ఉంటే 18 అయ్యేవారు. ఇరవై ఒక్క మంది మంత్రుల్లో ఆరుగురు దేవుడి మీద ప్రమాణం చేశారు. ఇక పార్టీల వారీ చూస్తే పదకొండు పార్టీల కూటమిలో కేరళ కాంగ్రెస్‌(ఎం) ఐదుగురు, సిపిఎం ముగ్గురు, జనతాదళ్‌(ఎస్‌) ఇద్దరు, మిగిలిన వారిలో సిపిఐ మినహా ఇతర పార్టీల సభ్యులు దేవుడి పేరుతో ప్రమాణాలు చేసిన వారు ఉన్నారు. మంత్రుల్లో సిపిఎంకు చెందిన వీణాజార్జి ఉన్నారు. గత అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌ నుంచి 10 మంది, అంతకు ముందు ఏడుగురు ఉన్నారు. కుక్క మనిషిని కరవటం వార్త కాదు, మనిషి కుక్కను కరవటం వార్త అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కూటమిలో సిపిఎం, సిపిఐ మినహా మిగిలిన పార్టీల వారు ఎలా ప్రమాణ స్వీకారం చేసినా అది పెద్ద సమస్య కాదు. కమ్యూనిస్టుల్లో వారి మద్దతుదారుల్లో ఎవరైనా ఉంటేనే అది విశేషం అవుతుంది.


ప్రపంచంలోని ఇతర దేశాలలో మాదిరే మన దేశంలో కూడా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఉన్న పార్టీలలో సిపిఎం అగ్రస్దానంలో ఉంది. ఆ పార్టీ నిబంధనావళిని చూసినపుడు పార్టీ ఆశయాలను అంగీకరించటం, కనీస నిబంధనలు పాటించటం తప్ప మతం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండకూడదన్న నిబంధన లేదు అనే అంశం చాలా మందికి తెలియదు. వ్యక్తిగతంగా వాటిని పాటించటానికి ఆటంకం లేదు. ఆ నిబంధనలు, ఆశయాలేమీ రహస్యం కాదు. పుస్తకాల దుకాణాల్లో అవి దొరుకుతాయి అనుమానం ఉన్న వారు కొని చదువుకోవచ్చు. చరిత్రలో మత రాజ్యాల గురించి, పాలకులు ఏ మతాన్ని ఆచరిస్తే జనం కూడా దాన్నే ఆచరించాలనే వత్తిడిని చూశాం తప్ప కమ్యూనిస్టుల పాలనలో అలాంటిది ఎక్కడా కనపడదు. నిజంగా కమ్యూనిస్టులు అలా చేసి ఉంటే సోషలిస్టు దేశాలలో ఒక్క చర్చి, ఒక్క మసీదు కూడా మిగిలి ఉండేది కాదు. కానీ ఎక్కడా వాటి జోలికి పోలేదు, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనిజం లక్ష్యం దోపిడీ లేని సమాజాన్ని నిర్మించటం, ఆ క్రమంలో మతం, కులం, దేవుడి వంటి భావాలు, వివక్ష పాటింపు వంటివి సామాజిక చైతన్యంతో అంతరిస్తాయని నమ్ముతారు, అందుకు కృషి చేస్తారు తప్ప బలవంతంగా అమలు చేయలేదు, చేయరు.

ఈ నేపధ్యంలో కేరళలో జరుగుతున్నదానిని చూడాల్సి ఉంది. కమ్యూనిస్టులు, వారి సిద్దాంతాలు, ఆచరణ గురించి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు మతాలకు చెందిన వారు బలమైన శక్తులుగా ఉన్నారు. అక్కడ ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులతో పాటు లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్‌, పురోగామి సిద్దాంతాలతో పని చేస్తున్నామని చెప్పుకున్న ప్రజా సోషలిస్టు పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కేరళ సోషలిస్టు పార్టీ, ఒక మతానికే ప్రధానంగా పరిమితమైన ముస్లిం లీగు విమోచన సమరం పేరుతో కుమ్మక్కయ్యాయి. ఆందోళన చేసి 1957లో ఏర్పడిన నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని 1959లో కేంద్ర ప్రభుత్వంతో బర్తరఫ్‌ చేయించాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణలు, విద్యా బిల్లులతో ప్రభావితులైన వారందరూ దీని వెనుక ఉన్నారు. వీరందరినీ దగ్గరకు చేర్చిందీ, ఆందోళనల రూపాలు ఎలా ఉండాల్సిందీ, జనాన్ని ఎలా రెచ్చగొట్టాల్సిందీ నేర్పింది, అవసరమైన నిధులు ఇచ్చిందీ అమెరికా గూఢచార సంస్ద సిఐఏ అన్న విషయం తెలిసిందే. ఇది కమ్యూనిస్టుల ఆరోపణ లేదా చీకట్లో బాణం కాదు. మన దేశంలో అమెరికా రాయబారులుగా 1973-75లో పని చేసిన డేనియల్‌ మోయినిహన్‌ 1978లో ఏ డేంజరస్‌ ప్లేస్‌ పేరుతో రాసినపుస్తకంలో, 1956-61 మధ్య పని చేసిన రాయబారి ఎల్స్‌వర్త్‌ బంకర్‌ జీవిత చరిత్రను రాసిన హౌవర్డ్‌ ష్కాఫర్‌ దాని గురించి ప్రస్తావించారు. ” భారత్‌లో మరికొన్ని కేరళలు ” ఏర్పడకుండా చూడాలంటూ కమ్యూనిస్టు వ్యతిరేక విముక్తి సమరానికి నిధులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఎలా కుమ్మక్కు అవుతాయో ఈ పరిణామం పాఠాలు నేర్పింది. దీన్నుంచి ఉద్యమాన్ని రక్షించుకోవటమే కాదు, ఆదరించిన కష్టజీవుల తీర్పుకు అనుగుణ్యంగా ప్రభుత్వాల ఏర్పాటుకు గాను అనుసరించిన అనేక పురోగామి ప్రయోగాల ప్రతి రూపమే నాలుగు దశాబ్దాల నాడు ఏర్పడిన ఎల్‌డిఎఫ్‌.అయితే దీనిలోని కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అటూ ఇటూ మారిన ఉదంతాలూ, రెండు కమ్యూనిస్టు పార్టీలతో పాటు ముస్లిం లీగు నుంచి చీలి ఇండియన్‌ నేషనల్‌ లీగుగా ఏర్పడిన పార్టీ ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తీరూ ఉంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష సంఘటనలో సిపిఎంతో కలసి అధికారం పంచుకున్న ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డు బ్లాక్‌ కేరళలో కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నాయి. ఏనాడూ అధికారం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర ఎల్‌డిఎఫ్‌, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎంకు లేదు. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో కేవలం 0.89శాతం ఓట్ల తేడా, ఎల్‌డిఎఫ్‌కు 68, యుడిఎఫ్‌ 72 సీట్లు వచ్చిన సమయంలో ఒకటి రెండు యుడిఎఫ్‌ ఫ్రంట్‌ పార్టీలు,ఎంఎల్‌ఏలు ముందుకు వచ్చినప్పటికీ ప్రజాతీర్పును ఎల్‌డిఎఫ్‌ హుందాగా స్వీకరించింది తప్ప అధికారం కోసం కక్కుర్తి పడలేదు.


కమ్యూనిస్టులు మతాన్ని మత్తు మందుగా ఎందుకు భావిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు అని అనేక మంది అడుగుతారు. అలాంటి వారు ముందుగా తెలుసుకోవాల్సింది కమ్యూనిస్టులకంటే అంటే కారల్‌మార్క్స్‌కు ముందుగానే మతాన్ని మత్తు మందుతో పోల్చిన వారు, వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. రెండవది కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకిస్తారనేది హిమాలయమంత వక్రీకరణ. నల్ల మందుతో వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి, హానిచేసే లక్షణాలూ ఉన్నాయి. దాన్ని ఎవరైనా తినిపించినా, స్వయంగా తీసుకున్నా మందమతులుగా మత్తుతో పడిఉంటారు. అందువలన దాన్ని దుర్వినియోగం చేయటమే ఎక్కువగా ఉంది, దానితో తయారు చేసే మాదక ద్రవ్యాలతో అక్రమ సంపాదనకు ఒక ప్రధాన వనరుగా ఉన్నందున ప్రతికూల భావంతోనే జనం చూస్తారు. మతం కూడా అలాగే దుర్వినియోగమైంది. కనుకనే కమ్యూనిస్టులు పుట్టక ముందే ఐరోపాలో కొందరు మత్తు మందు అన్నారు. రాజకీయాలోకి మతాన్ని చొప్పించటం, పరమత ద్వేషంతో వ్యవహరించే మతాలను, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని ఒక ఆయుధంగా వినియోగించటాన్ని మాత్రమే కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.

మతం ఆ విధంగా దుర్వినియోగం అవుతున్నందున మతం అంతరించాలని కోరుకోవటంలో ఎలాంటి మినహాయింపులు, రాజీలు లేవు. గాయపడిన, జబ్బు పడిన వారికి పూర్వం నల్లమందు ఇవ్వటం ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించేవారు. దాంతో తక్షణం ఉపశమనం కలిగేది, భ్రమల్లోకి తీసుకుపోయేది కనుక కొంత శక్తినిచ్చేది. మార్క్స్‌ ఈ కోణం నుంచే మతాన్ని నల్ల (మత్తు) మందుతో పోల్చారు. ఫ్యూడల్‌ సమాజంలోనూ, తరువాత పారిశ్రామిక విప్లవంతో ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ విధానంలోనూ ఐరోపా సమాజాల్లో క్రైస్తవ మతం దోపిడీదారులకు సాయపడింది తప్ప జనానికి కాదు, దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు చేయాల్సిందంతా చేసింది. అందుకనే మతం పట్ల ఆయనకు ఎలాంటి సానుభూతి లేదు. ఆయన సిద్దాంతాలతో ప్రభావితులైన కమ్యూనిస్టులకూ అదే అభిప్రాయం ఉంటుంది. మతం గురించి నాలుగు ముక్కల్లో మార్క్స్‌ చెప్పిందేమిటి ? ” అణచివేతకు గురైన వారికి మతం ఒక నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి గుండెకాయ, పశుప్రాయమైన పరిస్ధితులకు ఆత్మవంటిది. జనం పాలిట మత్తుమందు.”


ఇరవై ఎనిమిదేండ్ల వయస్సులోనే టీబితో మరణించిన జర్మన్‌ కవి నోవాలిస్‌ (1772-1801) మతం మత్తు మందు మాదిరి పనిచేస్తుంది. ఉద్దీపకగా,ఇంద్రియ జ్ఞానాన్ని పోగొట్టేదిగా, దుర్బలపరచి నొప్పిని తగ్గిస్తుంది అన్నారు. అప్పటికి మార్క్సు పుట్టనేలేదు. మార్క్స్‌ సమకాలికుడు హెన్రిచ్‌ హెయిన్‌ 1840లో మతం గురించి చెబుతూ బాధల్లో ఉన్న జనానికి మతం కొన్ని చుక్కల ఆధ్యాత్మిక మత్తుమందును, కొన్ని చుక్కల ప్రేమ, ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తుంది అన్నారు. బైబిల్‌ను ఒక మత్తుమందు డోసుగా ఉపయోగిస్తున్నామని ఇంగ్లండ్‌ చర్చికి చెందిన చార్లెస్‌ కింగ్‌స్లే 1847లో రాశాడు. వీరెవరూ కమ్యూనిస్టులు కాదు. తమ అనుభవంలోంచి చెప్పిన మాటలే.జనానికి నిజమైన సంతోషం కలగటానికి చేసే పోరాటాల నుంచి భ్రమలతో కూడిన తప్పుదారి పట్టించే ఉపశమనాన్నిచ్చేందుకు ప్రయత్నించే సంఘటిత మతం అంతరించాలని కమ్యూనిస్టులు కోరుకుంటారు. అయితే జనం స్వచ్చందంగా వదులుకోవాలని చెబుతారు తప్ప బలవంతం చేయరు.

సామ్రాజ్యవాదులు, క్రైస్తవ మతాధికారులు కుమ్మక్కై కూల్చివేసిన సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాలలో కమ్యూనిస్టులు మతాన్ని నాశనం చేయలేదు, దానికి ఆలవాలంగా ఉన్న చర్చ్‌లను కూల్చివేయలేదు.మతం మత్తు మందు అని నమ్మినప్పటికీ దాన్ని వదిలించేందుకు కమ్యూనిస్టు పార్టీలు తగిన చర్యలు తీసుకోకపోతే అక్కడ జరిగిందేమిటో చూశాము. జనంలో తలెత్తిన అసంతృప్తిని క్రైస్తవమత పెద్దలు ఉపయోగించుకొని జనాన్ని రెచ్చగొట్టారు. ఏ చర్చ్‌లను, మసీదులనైతేే సురక్షితంగా ఉంచారో వాటినే సమీకరణ కేంద్రాలుగా మార్చారు. చైనాలో కూడా టిబెట్‌లో బౌద్దమతం పేరుతో చిచ్చుపెట్టేందుకు గతంలో, ఇప్పుడూ సామ్రాజ్యవాదులు చేస్తున్న ప్రయత్నం, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ఒక రాష్ట్రంలో రెచ్చగొడుతున్నతీరు, సోషలిస్టు వ్యవస్ధకు వ్యతిరేకంగా రహస్య పద్దతుల్లో క్రైస్తవమతాన్ని రంగంలోకి తెస్తున్న పరిణామాలనూ, వాటిని సమర్దవంతంగా ఎదుర్కొన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అనుభవాన్ని చూశాము.


ఇక కేరళ అసెంబ్లీ సభ్యులలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన కొందరు ప్రమాణ స్వీకారాలు ఎలా చేశారనే అంశానికి వస్తే 99 మంది సభ్యులలో 18 మంది దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే 81 మంది ఆత్మ సాక్షిగా చేశారంటే త్రాసు ఎటు వైపు మొగ్గుగా ఉంది. వీరిలో సిపిఎంకు చెందిన వారు ముగ్గురు అని పేర్కొన్నారు. సిపిఎం వారు అంటే పార్టీ గుర్తుమీద పోటీ చేసిన వారు, సిపిఎంకు కేటాయించిన స్ధానాలలో అది బలపరచిన స్వతంత్రులు కూడా ఉన్నారు. వారిలో ఆరుగురు గెలిచారు. వారందరినీ సిపిఎం కిందే పరిగణిస్తున్నారు. సిపిఎం నుంచి ముగ్గురు దేవుడి మీద ప్రమాణం చేశారంటే వారిలో ముగ్గురు కూడా కావచ్చు, మరో ముగ్గురు చేయలేదని అనుకోవచ్చు. ఎవరు అన్నది మనోరమ విశ్లేషకుడు రాయలేదు. లేదూ ముగ్గురూ సిపిఎం సభ్యులే కూడా కూడా అయి ఉండవచ్చు. గతం కంటే పెరిగారు అన్నది ఒక వ్యాఖ్య. ఇది ఒక వైపు మాత్రమే, రెండో వైపును చూడాలి. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అనే కొత్త పార్టీ మూడు సీట్లకు పోటీ చేసి ఒకటి గెలుచుకుంది. కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే పార్టీ యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరి పన్నెండు సీట్లకు పోటీ చేసి ఐదు గెలుచుకుంది. ఈ కారణంగా కూడా గతం కంటే పెరిగారు. దీన్ని చూపి ఎల్‌డిఎఫ్‌లో దేవుడి విశ్వాసులు పెరిగారు అని చెప్పటం గురించి పాఠకులను దురుద్దేశ్య పూరితం, తప్పుదారి పట్టించే యత్నంగా ఎందుకు భావించకూడదు ?

దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసేందుకు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా మతాన్ని పాటించటానికి, దేవుణ్ని విశ్వసించటానికి- మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, దేవుణ్ని ఓట్ల కోసం వీధుల్లోకి తీసుకురావటానికి ఎంతో తేడా ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో కొంత మంది సభ్యులు దేవుడి సాక్షిగా ప్రమాణస్వీకారం చేసినందుకు అభిశంసనకు గురయ్యారు. సిపిఎంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా జారీ చేసిన మార్గదర్శక సూత్రాల మీద కొంత మంది విబేధించారు. పార్టీ సభ్యులు మత కార్యక్రమాల్లో పాల్గొన కూడదని దానిలో పేర్కొన్నారు. దానికి నిరసనగా కేరళకు చెందిన మాజీ ఎంపీ కెఎస్‌ మనోజ్‌ పార్టీకి రాజీనామా చేశారు. మత విశ్వాసాలు పార్టీ కంటే ఉన్నతమైనవని, దిద్దుబాటు పేరుతో జారీ చేసిన మార్గదర్శకాలు రాజ్యాంగానికి వ్యతిరేమైనవని రాజీనామా కారణాలుగా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు సాధారణంగా, సూత్రరీత్యా హేతువాదులు, వారికి ఏమతం పట్లా విశ్వాసం ఉండదు. అయితే మతం, కులం అనేవి ఉనికిలో ఉన్నాయి గనుక వాటిని విస్మరించజాలరు. అందుకే అలాంటి భావాలు ఉండి కూడా కమ్యూనిస్టు సిద్దాంతాలను కూడా అంగీకరిస్తే అలాంటి వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వాటి మూలం ఏమిటో తెలుసు, వాటికి అతీతంగా జనాన్ని ఎలా మార్చాలో కూడా అవగాహన ఉన్నవారు. అదే సమయంలో వాటి అడుగుజాడల్లో నడవరు. అలాంటి పరిస్ధితే ఉంటే కమ్యూనిస్టులు పార్టీ దుకాణం మూసుకొని ఇతర పార్టీల్లో చేరి బాబాలు, స్వామీజీల అడుగుజాడల్లో నడిచే వారు. అందువలన స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురితో సహా సిపిఎంకు చెందిన 68 మంది ఎంఎల్‌ఏల్లో ముగ్గురు దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తే దాన్ని బూతద్దంలో చూపటం భావ ప్రకటన రీత్యా ఎవరికైనా ఎంత హక్కుందో అదే హక్కు ప్రకారం దురుద్ధేశ్య పూరితం అని కూడా చెప్పవచ్చు.


దేశ లౌకిక రాజ్యాంగంలో మత విశ్వాసాలను కలిగి ఉండటానికి ఎంత హక్కు ఉందో మతాన్ని పాటించకుండా ఉండేందుకు కూడా అంతే హక్కు ఉంది. కనుకనే కమ్యూనిస్టులు అలాంటి ప్రమాణాలను పాటించే విధంగా ఉండాలని నిరంతరం చెబుతుంటారు తప్ప వాటిని ఒక నిబంధనగా పెట్టలేదు. సమాజం మొత్తం లేదా అత్యధిక భాగం ఏదో ఒక మతం లేదా కులంలో పుట్టిన వారితో నిండి ఉన్నపుడు వారు లేకుండా కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం ఎలా సాధ్యం ? ముందే వాటిని వదులుకోవాలని షరతు పెడితే ఎవరైనా అటువైపు చూస్తారా ? వేల సంవత్సరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన వాటిని కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకోగానే అందరూ వాటిని పోగొట్టుకుంటారని అనుకుంటే వాస్తవ పరిస్ధితుల మీద ఆధారపడిన అవగాహన కాదు. దోపిడీని వ్యతిరేకించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు పార్టీ నిబంధనావళిని అంగీకరిస్తున్నారా, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా లేదా అనేదే కొలబద్ద గానీ మతాన్ని, కులాన్ని వదులుకుంటారా అన్న షరతులు ఉండవు. పార్టీలోకి వచ్చిన తరువాత అన్యవర్గధోరణులుగా వాటిని పొగొట్టుకొనేందుకు సభ్యులు, సైద్దాంతిక అవగాహన కలిగించేందుకు పార్టీ ప్రయత్నిస్తుంది.ఎక్కడైనా అలా జరగలేదంటే స్ధానికంగా అధిగమించాల్సిన లోపం తప్ప పార్టీ సిద్దాంతం లేదా పార్టీది కాదు. ప్రజల కోసం చిత్తశుద్దితో పని చేసే మత సంస్ధల పెద్దలు ఎవరైనా ఉంటే వారితో కలసి పనిచేసేందుకు వారి సాయం తీసుకోవటం కూడా తప్పుకాదని కూడా సిపిఎం తన వైఖరిని వివరించే వ్యాసాల్లో పేర్కొన్నది. పార్టీలో చేరిన వారు గుడులు గోపురాలు, చర్చ్‌లు, మసీదులకు వెళ్లటం వారి వ్యక్తిగత విషయంగానే భావిస్తుంది. దాని అర్ధం మతోన్మాద చర్యల్లో భాగస్వాములు కమ్మని, మతాన్ని రాజకీయాలు, అధికారానికి జోడించమని కాదు. అలాంటి పనులు చేస్తే సిపిఎం నిర్మాణంలో వారు ఇమడలేరు.


అందువలన ఎల్‌డిఎఫ్‌, దానిలో ప్రధాన భాగస్వామి అయిన సిపిఎంలో కొంత మంది దేవుడి మీద ప్రమాణాలు చేసినంత మాత్రాన వారు మతశక్తులు కాదు. శబరిమల విషయంలో హిందూమతానికి వ్యతిరేకంగా విజయన్‌ సర్కార్‌ పని చేసిందని మతశక్తులు గగ్గోలు పెట్టినపుడు దానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎంఎల్‌ఏలు, మంత్రులుగా ఉన్నవారందరూ పని చేసిన వారే. వారు ఎక్కడైనా మతాన్ని, తమ వ్యక్తిగత విశ్వాసాలను ప్రజాజీవితంలో జనం మీద రుద్దారా, ప్రభావితం చేశారా అంటే అలాంటి రికార్డు ఎక్కుడా లేదు. అదే గనుక ఉంటే మనోరమ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికలు ఈపాటికి దుమ్మెత్తి పోసి ఉండేవి. అదే విధంగా హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు, కులసంఘాల వారు కమ్యూనిస్టులు, వారితో కలసి పని చేస్తున్నవారికి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినప్పటికీ ఓటమికైనా సిద్ద పడ్డారు తప్ప ఓట్ల కోసం కక్కుర్తి పడని వారే వారందరూ. ఎక్కడా మతశక్తులతో రాజీ పడలేదు, అలాగని ఆయా మతాలకు చెందిన సామాన్యుల సంక్షేమం విషయంలో మడమతిప్పలేదు గనుక జనం మత, కులశక్తులకు చెంపపెట్టుగా ఎల్‌డిఎఫ్‌కు చారిత్రాత్మక విజయం చేకూర్చారు. కొన్ని స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ కోరకుండానే స్ధానిక రాజకీయాలు, ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా మతశక్తులు మద్దతు ఇచ్చినపుడు గెలిచిన పదవులకు రాజీనామా చేసిన వారి నిజాయితీ, చిత్తశుద్ది గురించి తెలిసిందే.

అధికారంలో దేవాదాయశాఖ మంత్రిగా కమ్యూనిస్టు ఉన్నపుడు పూజలు చేసి కమ్యూనిస్టు విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తే అది కూడని పని తప్ప అసలు గుళ్లకు వెళ్లకూడదంటే కుదరదు. ఇంత మంది దేవుడి పేరుతో ప్రమాణస్వీకారం చేసినందున శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీం కోర్టు పునర్విచారణ తీర్పు ఎలా వచ్చినప్పటికీ వీరిని సిపిఎం విస్మరించజాలదని మనోరమ విశ్లేషకుడు ఒక పెడర్ధాన్ని తీశారు. శబరిమల విషయం మీద సిపిఎం వైఖరి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా ఒకటే అన్నది స్పష్టం. ఓట్ల కోసమే అయితే హిందూమతశక్తులు నిర్దేశించిన విధంగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చి ఉండేది. అనుకూలంగా తీర్పు వచ్చింది కనుక దానికి కట్టుబడి అమలు జరిపేందుకు ప్రయత్నించింది.కోర్టు తీర్పును గౌరవించనిది, ఖాతరు చేయకుండా మనోభావాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతు ఇచ్చే కుల, మతశక్తులు. దాన్ని వ్యతిరేకించింది ఎల్‌డిఎఫ్‌. గత ఎన్నికల్లో మతశక్తులు, వాటితో రాజీపడిన కాంగ్రెస్‌ కూటమి దాన్ని వినియోగించుకొని లబ్ది పొందాలని చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లు వస్తాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా తీర్పు ఎలా వచ్చినా దాని గురించి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఎం ప్రకటించింది తప్ప మతశక్తుల వత్తిడికి లొంగలేదు.ఆ కక్షతోనే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చారు.


లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో వామపక్ష ప్రభుత్వాలకు నాయకత్వం వహించి, వరుస విజయాలకు కారకులైన ఛావెజ్‌, మదురో వంటి వారు ఒకచేత్తో బైబిలు మరొక చేత్తో కష్టజీవుల జెండాను మోసిన వారే. అయినప్పటికీ అక్కడి చర్చి అధికారులు వారిని వ్యతిరేకించటంలో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేయటానికి వెనుకాడటం లేదు. చర్చి పెద్దలు చెప్పారు కదా అని సామాన్య జనం వామపక్షాలకు మద్దతు ఇవ్వటం మానుకోలేదు. అది నికరాగువా డేనియల్‌ ఓర్టేగా కావచ్చు మరొకరు కావచ్చు. కమ్యూనిస్టుల గురించి లాటిన్‌ అమెరికా, అమెరికా ఖండాలలో జరిగిన విష ప్రచారం మనవంటి వారికి పెద్దగా తెలియదు. ఫలానా వ్యక్తి కమ్యూనిస్టు అంటే వ్యతిరేక ఉన్మాదం తలకు ఎక్కిన వారు ఉట్టిపుణ్యానికే ఇండ్ల మీద దాడులు చేసిన ఉదంతాలు అమెరికాలో ఉన్నాయి. తాము మతానికి, వ్యక్తిగత మతవిశ్వాసాలకు, ఆచరణకు, విశ్వాసాలు, సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కమ్యూనిస్టులు విశ్వాసం కలిగించకపోతే జనం పార్టీ వైపు రారు, దోపిడీలేని సమాజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సిద్దం కారు. మేము కూటికి పేదలం తప్ప కులానికి కాదు అని చెప్పే అనేక మంది సామాన్యులను మనం చూస్తాం. అలాంటి వారిని పేదరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమీకరించదలచిన వారు మేం మతాన్ని, కులాన్ని నిర్మూలిస్తాం, మీరు వాటిని వదులు కోవాలనే షరతులు పెట్టి సమీకరించలేరు. ఎవరైనా అలా చెబితే అది మొరటు తనం తప్ప మరొకటి కాదు.


కమ్యూనిస్టుల గురించి సమాజంలో ఉన్నతమైన భావనలతో పాటు దురభిప్రాయాలు కూడా ఉన్నాయి. వారి సిద్దాంతం, ఆచరణ మొదటి వాటికి మూలమైతే రెండవ వాటికి శత్రువులు కారణం. అయితే దురభిప్రాయాల ప్రచారానికి గురైన వారందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కాదు. కమ్యూనిస్టు సిద్దాంతానికి ముందే ప్రపంచంలో వేల సంవత్సరాలుగా మతాలు,వాటికి ప్రతీకలుగా తయారు చేసిన దేవుళ్లను వ్యతిరేకించిన నాస్తికులు ఉన్నారు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కాలేరు. కమ్యూనిస్టు పార్టీల సభ్యులు, అభిమానులందరూ కూడా తెల్లవారేసరికి నాస్తికులు కాలేరు అన్నది గ్రహించటం అవసరం. కమ్యూనిస్టు సిద్దాంతంలో అనేక అంశాలలో నాస్తికత్వం కూడా ఒకటి తప్ప అదే ఏకైక ప్రాతిపదిక కాదు. నాస్తికులలో అనేక మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు ఉన్నారు. కమ్యూనిస్టులలోని ఆస్ధికులలో నాస్తికత్వం మీద అలాంటి వ్యతిరేకత కానరాదు. పినరయి విజయన్‌ నాయకత్వంలో వరుసగా రెండవ సారి అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించిన ఎల్‌డిఎఫ్‌ కొత్త మంత్రి వర్గంలో దేవస్దానాల మంత్రిగా ఒక దళితుడిగా పుట్టిన కె రాధాకృష్ణన్‌ను నియమించటాన్ని ఎలా చూడాలి ? ఆయనేమీ దేవుడి మీద ప్రమాణం చేయలేదు. హిందూ మత లేదా అగ్రకుల భావనలు కలిగిన వారిని సంతుష్టీకరించేందుకు నిజంగా విజయన్‌ సర్కార్‌ పూనుకుంటే ఇలా జరుగుతుందా ? రాధాకృష్ణన్‌ గతంలో స్పీకర్‌గా పని చేశారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, విద్యార్ధి ఉద్యమం నుంచి ఎదిగిన నేత. మరి ఈ నియామకాన్ని ఎలా చూడాలి ?