Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మా పార్టీ తీరే వేరు, ఓట్ల కోసం కక్కుర్తి పడం, ఎన్నికలు వచ్చాయని అవకాశవాదంతో వ్యవహరించం, గెలుపుకోసం అడ్డదారులు తొక్కం, చేయదలచుకున్నది సూటిగా చెబుతాం అని బిజెపి చెప్పుకుందా లేదా ? కానీ చేస్తున్నదేమిటి ? సాధారణ రోజుల్లో ధరల పెరుగుదల గురించి అడిగితే వాటితో ప్రభుత్వానికి ఏమిటి సంబంధం ? చమురు కంపెనీల వ్యవహారం అది, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే పెంచుతారు, తగ్గితే తగ్గిస్తారు మధ్యలో ప్రభుత్వానిదేముంది అన్నారు. కరోనా తొలి దశలో రికార్డు స్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోయినపుడు దానికి అనుగుణంగా ధరలు తగ్గించలేదు. ఎందుకయ్యా అంటే అంతర్జాతీయ ధరలు తగ్గినంత మాత్రాన మన చమురు కంపెనీల ఖర్చులు తగ్గుతాయా? చమురు బంకుల వారి నిర్వహణ వ్యయంలో మార్పు ఉంటుందా ? లాక్‌డౌన్‌ వలన వినియోగం పడిపోయింది అందుకే ధరలు తగ్గించలేదు అని సమర్ధిస్తూ సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించిన వారి మీద దాడి చేశాయి.


నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత రాష్ట్ర ఎన్నికల సమయంలో జరిగిందేమిటి ? ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు చమురు ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఎందుకని, ఎలా సాధ్యమైంది? లాక్‌డౌన్‌ లేదు, చమురు వినియోగమూ తగ్గినదాఖలా లేదు. జనం పట్ల నిబద్దత, శ్రద్ద ఉన్న ప్రభుత్వం అందునా ఎన్నికల కోసం అసలు ఏమాత్రం కక్కుర్తి పడం అని ప్రమాణాలు చేసిన వారు ఏ నాడైనా ధరలు స్ధిరంగా ఎందుకున్నాయి అని చమురు కంపెనీలను ఆరాతీయలేదు ? పోనీ ఎన్నికల తరువాత దాదాపు ప్రతి రోజూ లేదా రోజు మార్చి రోజు ఎందుకు పెంచుతున్నారు అని ఎవరైనా ప్రశ్నించారా ? ఎవరి కనుసైగలతో ప్రభుత్వ చమురు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. జనం చెవుల్లో పూలు పెట్టుకున్న అమాయకులని అనుకుంటున్నారా ?


కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా చమురు ధర మార్పుల వివరాలను పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ పేరుతో ప్రకటిస్తుంది. ఆ వివరాలు, 2021 జనవరి నుంచి ముడి చమురు, ఆయా నెలల్లో హైదరాబాదులో పెట్రోలు ధరలు ఎలా ఉన్నాయో దిగువ చూడవచ్చు.


నెల ××××× ముడిచమురు (డా) ××××× పెట్రోలు ధర రు.
జనవరి ××× 54.41 ××××××× 87.02 – 89.75
ఫిబ్రవరి ×× 60.12 ××××××× 89.75 – 94.77
మార్చి ××× 64.87 ××××××× 94.77 – 94.14
ఏప్రిల్‌- ×× 63.18 ××××××× 94.14 – 93.97
మే 28 ××× 66.76 ××××××× 93.97 – 97.43

జూన్‌ రెండవ తేదీన లీటరు పెట్రోలు ధర రు.98.27కు పెరిగింది. ఈ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులలో ఎలాంటి మార్పు లేదు. జనవరిలో 54.41 నుంచి ఫిబ్రవరిలో 60.12 డాలర్లకు అంటే 5.71 డాలర్లు పెరిగినా వినియోగదారుల ధరలో వచ్చిన మార్పు రు. 5.02 తరువాత మార్చినెలలో 4.75 డాలర్లు పెరిగినా వినియోగదారుల ధర అంతకు ముందు నెలతో పోలిస్తే మొత్తంగా 63 పైసలు తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడి చమురు ధర 1.69 డాలర్లు తగ్గితే వినియోగదారుల ధర 17పైసలు తగ్గింది. మే నెలలో ముడిచమురు ధర 3.58 డాలర్లు పెరిగితే వినియోగదారులకు జూన్‌ రెండు నాటికి పెరిగిన ధర 4.30. దీనికి అడ్డగోలు, అధికార పార్టీకి తోడ్పడే అక్రమం తప్ప మరొకటి కాదు. చమురు కంపెనీలు బిజెపికి లబ్ది చేకూర్చేందుకు ధరలను అదుపులో ఉంచి అవసరం తీరిన తరువాత ఏకంగా బాదుడు ప్రారంభించాయన్నది స్పష్టం. మరి దీని గురించి సామాజిక మాధ్యమంలో పరివార్‌ దళం మాట్లాడదేం.


బిజెపి సీరియల్‌ను ఏడు సంవత్సరాల ముందుకు తిప్పితే స్మృతి ఇరానీ వంటి వారు గ్యాస్‌ ధరల పెరుగుదల గురించి సిలిండర్లు మోసి ప్రదర్శనలు చేశారు, ధరలు పెరిగితే సరకులమ్మే నటన చేశారు. చమురు ధరలు పెరిగితే ఎడ్ల బండ్లను లాగారు. ఇప్పుడెక్కడా బిజెపి వైపు నుంచి ప్రదర్శనలు లేవేం. తాము అధికారంలో ఉంటే ఒక నీతి, వేరే పార్టీలు ఉంటే ఒక రీతా ? వీటిని ఏమని పిలవాలి ?ద్వంద్వప్రమాణాలు అందామా పక్కా మోసం గురూ అని చెప్పాలా ?


పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామా వినురవేమా అన్నారు మహాకవి వేమన. రాజకీయ పార్టీలలో తమ పార్టీ వేరయా అని స్వయంగా బిజెపి కితాబు ఇచ్చుకుంది. ఇక్కడే ఉంది కిటుకు. దీనికి మూలం, స్ఫూర్తి ఎవరు అంటే స్వదేశీ కాదు, పక్కా విదేశీ జర్మన్‌ నాజీ హిట్లర్‌ ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌. ఒక అబద్దాన్ని వందసార్లు పునశ్చరణ చేస్తే 101వ సారికి అది నిజమై కూర్చుంటుంది. బిజెపి విషయంలో కూడా అదే జరిగిందో లేదో ఎవరికి వారు గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ విషయంలో కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రవర్తించింది ? ఎంపీలు, ఎంఎల్‌ఏలు కాంగ్రెస్‌ అధిష్టానం మీద వత్తిడి తీసుకురాకుండా కట్టడి చేసేందుకు, తోక ఝాడిస్తే కత్తిరిస్తామని చెప్పేందుకే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారన్నది తెలిసిందే. దాని వలన విడిగా వెళ్లే వారు సామూహిక ఫిరాయింపులకు తెరతీశారు. బిజెపి ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ కొత్తపుంతలు తొక్కి సామూహిక ఫిరాయింపులను కట్టడి చేస్తూ నిబంధనలు మార్చటంతో ఎంత మంది అవసరం అయితే అంతమందితో రాజీనామాలు చేయించి ప్రభుత్వాలను కూల్చటం, తాము గద్దెనెక్కి తరువాత వారిని పార్టీ పేరుతో గెలిపించుకొనే పర్వానికి తెరలేపింది. ఇది నిజాయితీ కలిగిన వారు చేయాల్సిందేనా ? విలువల వలువలు కప్పుకున్నవారు అంతనిస్సిగ్గుగా వాటిని విప్పి పక్కన పడేయటాన్ని ఏమనాలి ? ద్వంద్వ ప్రమాణమా, దిగజారుడా ?

అన్నట్లు గుర్తుకు తెచ్చుకోవాలి అంటే జనాలకు మతిమరుపు ఎక్కువ అన్నది కొందరి గట్టి విశ్వాసం కదా ! కాకపోతే ఏమిటి చెప్పండి. గత సంవత్సరం కరోనా ప్రారంభంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ తబ్లిగీ సమావేశాలకు అనుమతి ఇచ్చిందెవరు ? అప్పటికే కొన్ని దేశాలలో జరిగిన తబ్లిగీ సమావేశాలలో పాల్గొన్నవారికి కరోనా వైరస్‌ సోకిందని తెలిసినప్పటికీ ఆయా దేశాలు వారికి లేదా వాటిలో పాల్గొన్నవారికి వీసాలు ఇచ్చి మరీ ఢిల్లీకి అనుమతించింది ఏ సర్కార్‌ ? విదేశాల్లో తబ్లిగీ సమావేశాలను కొన్ని చోట్ల అర్ధంతరంగా నిలిపివేసి పాల్గొన్నవారిని స్వస్ధలాలకు పంపిన విషయమూ తెలిసి కూడా అనుమతి ఇచ్చారే ! వారెవరు, బిజెపి పెద్దలే కదా కేంద్ర అధికారంలో ఉంది, ఢిల్లీ పోలీసు యంత్రాంగం అంతా కేంద్ర సర్కార్‌ ఆధీనంలోనే కదా పని చేసేది ! తీరా సంఘపరివారం, వారితో గొంతు కలిపిన మీడియా దేశంలో కరోనా విస్తరించటానికి వారే కారణం అని నానా యాగీ చేశారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టారు. సామూహిక నమాజులపై ఆంక్షలు విధించారు. వారిని అరెస్టు చేశారు. ఇవన్నీ ఇప్పుడు జనానికి గుర్తు ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారంలో ఉన్న పెద్దలకు ఉండవా ?


మొదటి దశకంటే తీవ్రంగా కరోనా పెరుగుతున్న దశలో కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది జనం గుమికూడటానికి అనుమతించటాన్ని ఏమనాలి ? ద్వంద్వ ప్రమాణమా, మేము మెజారిటీ మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం అడగటానికి ఎవరు అనే పెత్తందారీ తనమా ? పాకిస్తానీ ముస్లిం మత పెద్దలు దేవుడు మాతో ఉన్నాడు కరోనా మమ్మల్నేమీ చేయదు, మనం నిదురపోతుంటే కరోనా కూడా నిదురపోతుంది అని చెప్పి నిబంధనలు ఉల్లంఘించి జనం ప్రాణాల మీదకు తెచ్చారు. వారి కంటే తెలివిగలవారమని అనుకునే బిజెపి పెద్దలు ఏం చెప్పారు? గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నందున కరోనా అంటదు, మునిగి పుణ్యం పొందండి అని ఉత్తరాఖండ్‌ బిజెపి ముఖ్యమంత్రి రావత్‌, ఇతర బిజెపి మంత్రులు, నేతలు జనాన్ని ప్రోత్సహిస్తుంటే దేశమంతటా కరోనా నిబంధనలు పాటించాలని ఉద్బోధలు చేస్తున్న నరేంద్రమోడీ బాబా ఏం చేశారు. నోరు మూసుకున్నారు. అఖాడాలు, కొందరు సాధువులు కరోనాతో దిక్కులేని చావు చచ్చిన తరువాత కుంభేమేళా వైరస్‌ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత నిలిపివేయాలని విధిలేక పిలుపు నిచ్చారు. దీన్నేమందాం ద్వంద్వప్రమాణాలు అని గాక ఇంకేదైనా గౌరవ ప్రదమైన వర్ణన ఉందా ?

ఇంతవరకు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో తమకు తాముగా గొప్పల ముద్ర వేసుకున్న పార్టీ బిజెపి తప్ప మరొకటి లేదు. కొత్త బైరాగికి పంగనామాలు ఎక్కువ అన్నట్లు లేని వాటిని తగిలించుకొని ప్రచారం చేసుకుంది. దీనికి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది. హిట్లర్‌, ముస్సోలినీ వంటి నియంతలు, ఫాసిస్టులకు అనుకరణ, ఎత్తుగడల పర్యవసానమే. ఆ పార్టీ కొలిచే దేవుళ్లలో ఒకరైన వినాయక దామోదర సావర్కర్‌ ఒకరు. ఈ పెద్దమనిషినే సంఘపరివారం వీర సావర్కర్‌ అని గౌరవంగా పిలుచుకుంటుంది. ఆయనకు సదరు వీర అనే బిరుదు ఎవరిచ్చారు అని అడగండి ఎవరి దగ్గర నుంచైనా సాధికారికమైన సమాధానం వస్తుందేమో ! రాదు, మరి ఎలా వచ్చింది, ఆ పెద్దమనిషే చిత్రగుప్త అనే మారు పేరుతో తన గురించి ఒక పుస్తకం రాసుకున్నారు. దానిలో తన వీరత్వం, శూరత్వం గురించి పొగుడుతూ తానే రాసుకున్నారు. ఆ పుస్తకం పునర్ముద్రణకు ముందు దాన్ని చదివి నిజమే కామోసు అనుకొని అలా పిలిచారంటే అర్ధం ఉంది. కానీ సదరు పుస్తక పునర్ముద్రణ సందర్భంగా దానిలో సదరు చిత్రగుప్త మరెవరో కాదు సావర్కరే అని రాశారు. తరువాత కూడా అదే ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలి. అనేక మంది కొన్ని సంస్దల పేరుతో ప్రాంతీయ, ప్రపంచ అవార్డులు, బిరుదులూ ప్రకటించుకుంటూ ఉంటారు. వాటి చిరునామా కోసం ప్రయత్నిస్తే మనకు ఎక్కడా దొరకవు. నకిలీ పట్టాలు ఇచ్చే వారు ఉన్నపుడు నకిలీ అవార్డులు, బిరుదులకు కొదవేముంటుంది.


రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది. కాంగ్రెస్‌ కారణంగా రూపాయి ఐసియులో ఉంది. కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు మిమ్మల్ని కాపాడాలా రూపాయిని కాపాడాలా అన్నారు ? యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వస్తే 45 రూపాయల స్ధాయికి పెంచుతానని చెప్పింది.

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చిన 2014లో మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి గత ఏడు సంవత్సరాలలో పతనమే తప్ప ఆ స్ధాయికి బలపడలేదు. మధ్యలో 75 వరకు పతనం అయినా ఇప్పుడు 73 రూపాయలకు అటూ ఇటూగా ఉంటోంది. ఈ పతనం గురించి ఎందుకు మాట్లాడరు ? కారణాలేమిటో ఎప్పుడైనా వివరించారా ? ద్వంద్వ ప్రమాణాలు, ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు అన్నట్లు జనాన్ని తప్పుదారి పట్టించటం కాదా ?

గోవధ, గొడ్డు మాంసం గురించి ఒక ప్రాంతంలో ఒక వైఖరి, మరొక చోట దానికి భిన్న వైఖరి.ఈశాన్య రాష్ట్రాలలో, గోవాలో గొడ్డు మాంసానికి అనుకూలంగా మాట్లాడతారు, వాగ్దానాలు చేస్తారు. కేరళలో నాణ్యమైన గొడ్డుమాంసం లభ్యమయ్యేట్లు చూస్తామని వాగ్దానాలు చేసిన బిజెపి అభ్యర్దులను చూశాము. బీహార్‌ ఎన్నికల సమయంలో తమకు అధికారమిస్తే అందరికీ ఉచితంగా వాక్సిన్లు వేస్తామని చెప్పారు. తొలుత దేశమంతటికీ ఉచిత వాక్సిన్లు అని చెప్పి, దానికోసం వేల కోట్ల నిధులు కూడా కేటాయించామని ప్రచారం చేసుకున్నారు. తీరా నలభై అయిదు సంవత్సరాల పైబడిన వారికే మా బాధ్యత, మిగతావారు రాష్ట్రాలు చూసుకోవాలి లేదా ప్రయివేటుగా వేయించుకోవాలని చెప్పారు. వాక్సిన్‌ ధరలు కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రానికి ఒక ధర, ప్రయివేటుకు మరొకటన్నారు. వీటిని ద్వంద్వ ప్రమాణాలు అంటారా, ఏమనాలి? ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అని చెబుతారు, పోనీ మాకు ఎలాంటి బాధ్యత లేదు అని ప్రకటిస్తారా అంటే అదీ లేదు. అసలు ఒక విధానం ఉందా అని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నిస్తే జవాబు చెప్పరు. రాజ్యాంగంలో సాధారణ ఆరోగ్యం రాష్ట్రాలదే అని చెప్పారు. కాని ఇప్పుడు వచ్చింది మహమ్మారి కదా ? మహమ్మారుల గురించి చెప్పలేదు. వాటిని కలసికట్టుగా ఎదుర్కోవాలి తప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేపట్టేది కాదు. ఇది అంతర్జాతీయ సమస్య అని ప్రపంచ సంస్ధల్లో బాధ్యత వహించాల్సింది రాష్ట్రాలు కాదు, కేంద్రం అని ఇలాంటి వారికి ఏ భాషలో చెబితే అర్ధం అవుతుంది. జవాబుదారీ తనంతో వ్యవహరించే వారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ?


తాజా ఉదంతానికి వస్తే ప్రస్తుతం మన దేశంలో వ్యాపిస్తున్న బి.1.617 వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక శాస్త్రీయ నామం పెట్టింది. ఆపేరుతోనే వ్యవహరించాలి. ఇటీవలి కాలంలో తలెత్తిన కొన్ని వైరస్‌లు వాటితో వచ్చిన వ్యాధుల పేర్లపై అభ్యంతరాలు రావటం, కొన్ని అవాంఛనీయ పరిణామాలు తలెత్తటంతో ప్రపంచ ఆరోగ్య సంస్ద వివిధ అంతర్జాతీయ సంస్దలతో చర్చించిన తరువాత వైరస్‌లు, వ్యాధులకు ఒక దేశ, ప్రాంత, నగర,జాతి, వ్యక్తులు, జంతువుల పేర్లు పెట్టకూడదనే మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉదాహరణకు గతంలో స్పానిష్‌ ఫ్లూ అనే పేరుతో పిలిచిన దానికి స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదు, అది అమెరికా నుంచి వ్యాప్తి చెందినట్లు తేలింది. అలాగే స్వైన్‌(పంది) ఫ్లూ. ఈ పేరుతో ప్రచారం కాగానే ఆహారానికి వినియోగించే ఆ జంతువులను విచక్షణా రహితంగా చంపివేయటానికి దారి తీసింది. అలాగే ‘మెర్స్‌ ‘ ఇది కూడా వివాదాస్పదమైంది. మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ అని పేరు పెట్టటంతో మధ్య ప్రాచ్య దేశాల మీద మిగతా జనాలకు అనుమానాలు తలెత్తాయి. అలాగే రిప్ట్‌ వ్యాలీ ఫీవర్‌( ఒక ప్రాంతం పేరు) వంటివి, వృత్తి సంబంధమైన పేర్లు వివాదాస్పదం అయ్యాయి.

ఈ నేపధ్యంలోనే ఊహాన్‌ లేదా చైనా వైరస్‌ అని పిలవటం ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శక సూత్రాలకు విరుద్దం. ఆ పేర్లను మీడియా వినియోగించినా, సంఘపరివార్‌, ఇతరులు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసినా తప్పిదమే. అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ట్రంప్‌ మొదలు అనేక మంది నోరు పారవేసుకున్నారు. చివరకు ఆ అలవాటు మన నరేంద్రమోడీ సర్కార్‌ యంత్రాంగానికి అంటుకొన్నది. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో బి.1.617 వైరస్‌ను ” భారతీయ కరోనా వైరస్‌ ” అని రాసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ సింగపూర్‌లో బయటపడిన వైరస్‌ను సింగపూర్‌ కరోనా రకం అని వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. దాని మీద సింగపూర్‌ నిరసన తెలపటంతో అది కేజరీవాల్‌ వ్యాఖ్య తప్ప భారత ప్రభుత్వ వైఖరి కాదని మన దేశం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికిగానీ తప్పిదం తెలిసిరాలేదు తరువాత అలాంటి పేర్లు వాడకూడదని అదే సర్కార్‌ ఆదేశించింది. మనకు నొప్పి తగిలిన తరువాత గానీ దానిలో ఉండే తప్పిదం ఏమిటో తెలిసిరాలేదు. తరువాత కూడా మీడియాలో, సంఘపరివార్‌, ఇతరులూ కోవిడ్‌-19 గురించి గతంలో చేసిన తప్పిదాన్నే చేస్తున్నారు. దీన్నేమందాం ? ద్వంద్వప్రమాణం అందామా లేక ఇతరులు చేస్తే వ్యభిచారం- మనం చేసేది సంసారం అందామా ?