Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. నిజమే అని నమ్మిన వారు కోరినంత నల్లధనాన్ని పంపారు. దాన్ని పంచుకోవటం లేదా దొంగ డబ్బు కనుక లెక్కా పత్రం ఉండదు కనుక బొక్కేసిన వారి మధ్య వచ్చిన తేడా వంటి కారణాలతో బయట పడి పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ డబ్బంతా హవాలా మార్గంలో వచ్చిన నల్లధనం అని వేరే చెప్పనవసరం లేదు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు ఇంకా ఎక్కువే అని తేలింది,మూడున్నర కోట్లుగా చెబుతున్నారు. ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. ఈ ఉదంతంలో రాష్ట్ర బిజెపి, ఆర్‌ఎస్‌ఎన్‌ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో పార్టీలోని రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పోలీసులు కోటి రూపాయల దొంగడబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయక ముందే బిజెపి నేతలకు దొంగడబ్బు మాయం గురించి తెలుసునని వెల్లడైంది.


తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌, ఆయన అనుయాయులు మాత్రమే మాట్లాడుతుండగా మిగతావారు మౌనం దాలుస్తున్నారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది ఇప్పుడు చర్చ. చివరికి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను పాలక్కాడ్‌లో ఓడించేందుకు కొందరు బిజెపి నేతలు ప్రత్యర్ధికి ఓట్లను అమ్ముకున్న కారణంగానే అరవైవేల ఓట్లు రావాల్సింది 50వేలు వచ్చాయనే ఫిర్యాదు కూడా కేంద్రానికి పంపారు.


గిరిజన నాయకురాలిగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన సికె జాను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఐదు అసెంబ్లీ స్దానాల్లో పోటీ చేసేందుకు, కేంద్రంలో మంత్రిపదవికోసం బేరమాడినట్లుగా అందుకోసం పది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్‌ చేయగా సురేంద్రన్‌ కేవలం పదిలక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు ఆపార్టీ కోశాధికారి ప్రసీత మీడియాకు చెప్పారు. పదిలక్షలు తీసుకొని పోటీ చేసేందుకు జాను అంగీకరించిన విషయాన్ని ప్రసీత ఫోను ద్వారా సురేంద్రన్‌కు చెప్పగా తిరువనంతపురంలో జాను బసచేసిన హౌటల్‌కు పంపినట్లు ఆమె చెబుతున్నారు. ఈ మేరకు వారి ఫోను సంభాషణ ఆడియోను స్వయంగా ప్రసీత విడుదల చేశారు. కొడక్కరలో పట్టుబడిన దొంగ డబ్బు కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసిన మొత్తం కంటే ఎక్కువ సొమ్మునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో సురేంద్రన్‌ వంటి బడానేతలు కూడా ఉన్నారని దొరికిన వారు చెప్పటంతో వారిని కూడా ప్రశ్నిస్తారని వార్తలు వచ్చాయి. గురువారం నాడు సురేంద్రన్‌ కోజికోడ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సికె జాను నన్ను డబ్బు అడగలేదు, ఆమెకు పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. ఆమె పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా ఆడియోలు బయటకు వచ్చి ఉండవచ్చన్నారు. పోలీసులు పిలిచిన వారందరూ విచారణకు వెళుతున్నారు తప్ప కోర్టును ఆశ్రయించలేదు,భయపడలేదు. కొడక్కరలో దొరికింది నల్లధనమో, తెల్లధనమో నాకు తెలియదు. ఆడియో సంభాషణ తనది కాదు అన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ముస్లిం లీగ్‌, సిపిఎం మద్దతుదారులు ఉన్నారని సురేంద్రన్‌ ఆరోపించారు.


ఆడియో సంభాషణ బయటకు వచ్చిన దృష్టా పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం కనిపిస్తోందని సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ చెప్పారు. లేనట్లయితే రాష్ట్రంలో పార్టీ అసంగత సంస్ధగా మారిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరువు పోయిందని, దీనికి సురేంద్రనే కారణమని అన్నారు. నిధుల చెల్లింపులకు సంబంధించి పరస్పర విరుద్దంగా పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేంద్ర పెద్దలకు తెలుసునని, తనను సంప్రదిస్తున్నారని, విచారణ కూడా జరుపుతున్నారని ముకుందన్‌ చెప్పారు.


ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు. సురేంద్రన్‌ చేసిన ప్రకటనను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ కోశాధికారి ప్రసీత బహిరంగ సవాలు చేశారు. ఆడియో నిజమైనదో, నకిలీదో కావాలంటే పరీక్షలు జరపాలన్నారు. తిరువనంతపురంలోని హొరైజన్‌ హౌటల్‌లో సికె జానుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ డబ్బు అందచేశారన్నారు. అంతకు ముందు తనకు ఫోన్‌ చేశారని కావాలంటే నిర్ధారించుకోవచ్చన్నారు. రెండు నిషేధిత సంస్దలతో జానుకు సంబంధాలు ఉన్నాయని, కొంత మంది ఆమెను కలిశారని, డబ్బును వాటి కార్యకలాపాలకు వినియోగించి ఉండవచ్చు అన్నారు.


ఇదిలా ఉండగా ఎన్నికల నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాల కారణంగా జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జానును తొలగించినట్లు రాష్ట్రకమిటీ ప్రకటించగా తాను పదవిలోనే ఉన్నట్లు ఆమె చెప్పారు. అవసరమైతే పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడతాను తప్ప మధ్యవర్తులనెవరినీ నియమించలేదని, తన పేరుతో వారేమైనా డబ్బు తీసుకున్నారో తెలియదు కనుక విచారణ జరపాలని సికె జాను చెప్పారు. ఆమె పోటీ చేసిన సుల్తాన్‌ బాతరే నియోజకవర్గంలో ఎన్‌డిఏ ప్రచారం నిమిత్తం కోటీ 25లక్షల ఖర్చుకు సంబంధించిన వివరాలు బయటకు రావటం దొంగడబ్బు వివాదాన్ని మరో మలుపు తిప్పింది. కోజికోడ్‌ నుంచి రెండు కార్లలో కోటీ 25లక్షలు సుల్తాన్‌బాతరేకు తరలించారని, అక్కడ కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కొడకర పద్దతుల్లో పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి.
ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా తెలుస్తోంది. అయితే అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని మరొకొ సందర్భంగా చెప్పారు. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది.పార్టీ ఆఫీసులోని వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు. మొత్తం మీద చివరకు వెల్లడయ్యే వివరాలు కేరళలో బిజెపికి తద్వారా కేంద్ర నాయకత్వానికి తలవంపులు తేవటం ఖాయం అని చెప్పవచ్చు.

మూడున్నర కాదు కేరళ బిజెపి దొంగ సొమ్ము ఇప్పటికి 9.8 కోట్లు !

పోలీసులు తవ్విన కొద్దీ బిజెపి కేరళ ఎన్నికల దొంగ సొమ్ము బయటకు వస్తోంది.కొడక్కర వంతెన వద్ద తమ కారును ఆపి సొమ్ము దోపిడీ చేశారంటూ కారు డ్రైవర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కర్ణాటక నుంచి వచ్చిన దొంగ సొమ్ముతో బిజెపి అభ్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేసింది కొంతైతే దాచుకున్నది ఎంతో అన్నది అంతుచిక్కటం లేదు. రోజు రోజుకూ మరింత సమాచారం వెల్లడికావటంతో దిక్కుతోచని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నష్టనివారణతో పాటు కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి మార్గాలు వెతుకుతున్నారు.ధర్మరాజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత త్రిస్సూర్‌కు తెచ్చిన దొంగ సొమ్ము 9.8 కోట్లని పోలీసులు చెప్పారు. దీనిలో త్రిస్సూర్‌లోని ఒక వ్యక్తికి 6.30 కోట్లు ఇచ్చిన తరువాత మిగతా సొమ్మును వేరే చోటికి తరలిస్తూ దోపిడీ కట్టుకధలు అల్లారని తేలుతోంది. ధర్మరాజన్‌ అంతకు ముందు కూడా సొమ్మును తెచ్చారని, అది ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాల మీద పోలీసులు కేంద్రీకరించారు. త్రిస్సూరు నియోజకవర్గంలో బిజెపి రాజ్యసభ ఎంపీ సురేష్‌ గోపి పోటీ చేసి మూడవ స్ధానంలో నిలిచారు. అక్కడ ఖర్చుల కోసం రెండు కోట్లు ఇచ్చినట్లు తేలింది.

మంజేశ్వరమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్ల తేడాదో ఓడిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అక్కడ కె సుంద్రా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటంతో తన మద్దతుదార్లు పొరపాటున సుందర్‌కు ఓటు వేసిన కారణంగా తాను ఓటమి పాలైనట్లు సురేంద్రన్‌ భావించారు.ఈ సారి కూడా అదే వ్యక్తి బిఎస్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరటంతో తనకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని, సురేంద్రన్‌ గెలిస్తే పక్కనే ఉన్న కర్ణాటకలో ఒక మద్యం షాపు ఇప్పించాలని సుంద్రా డిమాండ్‌ చేశాడు. అయితే రెండున్నర లక్షల రూపాయలు , పదిహేను వేల రూపాయల విలువ గల ఫోను ఇచ్చారు. మిగతా కోర్కెల గురించి ఎన్నికల తరువాత చూద్దాం లెమ్మని సురేంద్రన్‌ స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారని, స్ధానిక బిజెపి నేతలు తనకు సొమ్ము ఇచ్చినట్లు ఉపసంహరణ అనంతరం అతను బిజెపిలో చేరుతున్నట్లు ఒక సభలో ప్రకటన కూడా చేశారు. నామినేషన్‌ ఉపసంహరణకు ముందు రోజు తమ అభ్యర్ధి కనిపించటం లేదంటూ బిఎస్‌పి నేతలు పోలీసు సేష్టన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొడక్కర దొంగ సొమ్ము ఉదంతం బయటకు వచ్చిన తరువాత సదరు సుంద్రా ఈ విషయాలన్నీ స్వయంగా బయట పెట్టాడు. వాటి ఆధారంగా బిజెపి నేత సురేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంజేశ్వరమ్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి వివి రమేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సురేంద్రన్‌తో పాటు స్ధానిక బిజెపి నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.తాను డబ్బు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టిన తరువాత బిజెపి నేతలు తమ కుటుంబం మీద వత్తిడి తెస్తూ అలాంటిదేమీ లేదని చెప్పాలని, సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సుంద్ర చెప్పాడు. తన తల్లి మీద వత్తిడి తెచ్చారని, ఆ సొమ్మంతా ఖర్చయిపోయిందని, తాను తిరిగి ఇవ్వలేనని , ఈ విషయాలను వెల్లడించటానికి తన మీద ఎవరి వత్తిడీ లేదని సుంద్ర చెప్పాడు. ఇతను ఇప్పుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు.

దొంగ సొమ్ము పంపిణీదారైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ అనేక మంది బిజెపి నేతలతో ఫోన్‌ ద్వారా సంభాషించాడు. వారిలో సురేంద్రన్‌ కుమారుడితో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగ సొమ్ము ఉదంత దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని, పట్టుబడిన సొమ్ము తీవ్ర ఆర్ధిక నేర స్వభావం కలిగినదని , అయినా పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మీద చర్య తీసుకోవాలని కోరుతూ లోక్‌తాంత్రిక్‌ యువ జనతా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్‌ మాదవుర్‌ కేసు దాఖలు చేశారు. దీని గురించి ఇడి అధికారులకు నోటీసలు ఇవ్వగా తమకు సమయం కావాలని కోరారు, పది రోజుల్లో తీసుకున్న చర్యలను కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించారు. సీనియర్‌ బిజెపి నేత సికె పద్మనాభన్‌ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఉప్పు తిన్న వారు నీరు తాగటం ప్రకృతి ధర్మమని అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే అన్నారు.కొడకర దొంగ సొమ్ము ఉదంతంలో తవ్విన కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, మరింత సమగ్ర దర్యాప్తు జరపాలసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియరి బాలకృష్ణన్‌ అన్నారు. దొంగ సొమ్ము గురించి వార్తలు రాగానే ఇడి వెంటనే రంగంలోకి దిగుతుందని, కానీ ఈ ఉదంతంలో పట్టనట్లుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టి దాని వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. భవిష్యత్‌లో తాము ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌కు పోటీగా వస్తామని భయపడుతున్నవారు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, పధకం ప్రకారం నాశనం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనం రాజశేఖరన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో ఆరోపించారు. గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్ధానంలో రాజశేఖరన్‌ నిలిచిన విషయం తెలిసిందే.