Tags
BJP dangerous toolkits, Congress Toolkit case, Judiciary Activism, Supreme Court of India, Toolkits
ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల ఏలుబడిలో అన్నీ విజయాలే అన్న మాటలు జనానికి ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు. వంది మాగధులు కూడా పొగిడేందుకు వెనుకా ముందూ చూశారు. ఏడు సంవత్సరాలకు ముందు- ఏడు సంవత్సరాల తరువాత ఏమిటని ఎవరైనా పోల్చుకున్నారా ? కాస్త నిదానంగా ఆలోచించండి. కాంగ్రెస్ గురించి 2014కు ముందు బిజెపి మీడియా వారికి, పార్టీ ప్రచారదళాలకు ఇచ్చిన టూల్కిట్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే పార్టీని టూల్కిట్లు గజగజ వణికిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏడేండ్ల నరేంద్రమోడీ పాలనలో మిగతావన్నీ దిగజారుతుంటే ఇవి ఏటికేడు పెరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం స్వయంగా బిజెపి పార్టీ, సర్కార్ తయారు చేస్తున్నవే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, చర్యలను విమర్శించటం దేశద్రోహంగా భావిస్తున్న రోజుల్లో ఈ టూల్‌కిట్లకు న్యాయవ్యవస్ధలో వెలువడుతున్న తీవ్ర వ్యాఖ్యలు మరింతగా పదును పెడుతున్నాయా అనిపిస్తోంది. ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వ పరువు తీశారంటూ దిశ రవి అనే యువతి మీద రైతు ఉద్యమం గురించి టూల్‌కిట్ కేసు వేశారు. వివాహ సమయాల్లో పెళ్లికూతుళ్లకు పంపే మేకప్‌కిట్ గురించి, సుత్తీ, రెంచీలు, స్క్రూడ్రైవర్ల వంటి చిన్న పరికరాలు ఉండే దానిని టూల్ బాక్సు, కిట్ అంటారని తెలుసుగానీ మీడియా టూల్కిట్లో ఏముంటాయో తెలియక, ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారో అని చాలా మంది మధనపడ్డారు. కానీ బిజెపి వారు దిశ రవి కేసుతో తెలియని వారికి అవేమిటో తెలియ చేశారు.జనానికి విజ్ఞానం పంచారు.
తరువాత తమ నేత నరేంద్రమోడీ, ప్రభుత్వాన్ని బదనామ్ చేసేందుకు కాంగ్రెస్ టూల్కిట్లను పంపిణీ చేసిందని బిజెపి నేతలు ఆరోపించారు. చివరికి అది వారికే ఎదురు తన్నింది, పరువు తీసింది. దాంతో దాని వ్యూహకర్తలకు చెప్పుకోరాని చోట దెబ్బ తగిలింది. మా పేరుతో బిజెపి రూపొందించిన టూల్‌కిట్ అని కాంగ్రెస్ ఎదురు కేసు పెట్టింది. దాంతో కాంగ్రెస్ టూల్‌కిట్‌కు సంబంధించి బిజెపి నేతలు చేసిన ట్వీట్లకు మానిప్యులేటెడ్ మీడియా(మోసపుచ్చే సమాచారం) అని ట్విటర్ కంపెనీ ముద్రవేసి దేశ, విదేశీయులకు ఒకటూల్ కిట్ అందించింది. దీని అర్ధం ఏమంటే బిజెపి వారు చేసే ట్వీట్లు మోసపుచ్చేవి సుమా మీరు జాగ్రత్త అని చెప్పటమే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడటం అంటే ఇదే. ఆ ముద్రను చెరిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్ కంపెనీ మీద పోలీసులతో దాడి చేయించి భయపెట్టింది. ఇది మరింత పరువు తీసింది.
ఏడు సంవత్సరాలకు ముందు బిజెపి టూల్కిట్లో గుజరాత్ తరహా అభివృద్ది, నల్లధనం వెలికితీత, అచ్చేదిన్ వంటివి ఎన్నో ఉన్నాయి. అధికారానికి వచ్చిన తరువాత మేక్ ఇండియా, మేకిన్ ఇండియా తోడయ్యాయి. ఏడు సంవత్సరాల తరువాత చూస్తే టూల్‌కిట్‌లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అన్నింటికంటే చిత్రం ఏమంటే ప్రపంచానికి, ప్రతిపక్షాలకు, ప్రచార, ప్రసార సాధనాలకు స్వయంగా ప్రభుత్వంతో పాటు కొన్ని సందర్భాల్లో న్యాయవ్యవస్ధ కూడా టూలుకిట్లు ఎలా అందించగలదో దాదాపు ప్రతి రోజూ చూస్తున్నాం.దిశ రవి ఒక సాధారణ యువతి, ఏమీ చేయలేదని కేసు దాఖలు చేశారు గానీ న్యాయమూర్తుల మీద కూడా పెడతారా ?
లోపభూయిష్టమైన వెంటిలేటర్లతో రోగుల మీద ప్రయోగాలు చేయవద్దని, వాటిని తాము అంగీకరించబోమని బొంబాయి హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇదీ కరోనా వైఫల్యాల టూల్‌కిట్టులో చేరింది. ఇదే వ్యాఖ్యను ప్రతిపక్ష పార్టీలు గనుక చేసి ఉంటే ఈ పాటికి కాషాయ దళాలు ఎలా రెచ్చిపోయి ఉండేవో తెలిసిందే. పిఎం కేర్ నిధులకు దాతలు ఉదారంగా నిధులు ఇస్తే వాటితో పనికి రాని వెంటిలేటర్లు కొనుగోలు చేయటం వెనుక అవినీతి, అక్రమాలు లేవంటే ఎవరైనా నమ్ముతారా ? అలాంటి నాసిరకం పరికరాలను రోగులకు అమర్చితే వారి ప్రాణాలు హరీమంటే దాన్ని హత్య అనాలా, స్వర్గానికి పంపారనుకోవాలా ? ఆ పుణ్యం ప్రధాని మోడీ ఖాతాలోనే వేయాలి, ఎందుకంటే ప్రధాని పేరుతోనే కదా కొనుగోలు చేస్తున్నది ! బొంబాయిహైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు అర్దం ఏమిటి ? మరట్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలకు నాసిరకం వెంటిలేటర్ల సరఫరా గురించి వచ్చిన వార్తల మీద ప్రజాప్రయోజన వ్యాజ్య విచారణ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరట్వాడా ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు పంపిన 150 వెంటిలేటర్లలో 113 లోపభూయిష్టమైనవని బయటపడింది. మిగిలిన 37ను ఆసుపత్రుల వారు అసలు రవాణా చేసిన డబ్బాల నుంచి బయటకు తీయనేలేదు. మే 28వ తేదీన ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. వెంటిలేటర్లను మామూలుగా పని చేసేట్లు చూస్తామని, వేటిలో అయినా లోపాలుంటే తొలగిస్తామని పేర్కొన్నది. అయితే ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఆర్ కాలే మే 29వ తేదీన ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వెంటిలేటర్ల పనితీరు నమోదు చేసిన అంశాలను కోర్టుకు సమర్పిస్తూ మరమ్మతులు చేసిన తరువాత కూడా అవి సరిగా పని చేయటం లేదని పేర్కొన్నారు. సిబ్బందికి వాటిని పని చేయించటం తెలియదన్న కేంద్ర వాదనను తిప్పికొట్టారు. వాటిని గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సిఎన్సి అనే కంపెనీ సరఫరా చేసింది. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వైద్యులను పంపి పరిశీలించిన తరువాత లోపాలుంటే తయారీదారును బాధ్యులను చేస్తామని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తాము పూర్తిగా సంతృప్తి చెందేంత వరకు వాటిని వినియోగించబోమని అలాంటి వాటితో తీవ్ర ముప్పు ఉంటుందని మహారాష్ట్ర న్యాయవాది చెప్పారు. ఈ వాదనల తరువాత న్యాయమూర్తులు పైన పేర్కొన్న వ్యాఖ్యలను చేశారు. ఇది ప్రతిపక్షాల విమర్శలకు ప్రాతిపదిక అవుతుందా లేదా ? ఈ ఆయుధాన్ని ఎవరిచ్చారు, దానికి మూలం ఎవరు ? దీన్ని కుంభకోణం అనక ఏమంటారు ?
కేంద్ర ప్రభుత్వ వాక్సినేషన్ విధానం గురించి సాక్షాత్తూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన విషయాన్ని చెప్పుకోనవసరం లేదు. మూడు ధరల విధానం గురించి ప్రతిపక్షాలు విమర్శించాయంటే రాజకీయం అనుకుందాం, సుప్రీం కోర్టు సంగతేమిటి ? దేశంలో వేస్తున్న వాక్సిన్ ధరలు-విదేశాల్లో వాటి ధరలను పోలుస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించిందా లేదా ? వాక్సిన్లకోసం 35వేల కోట్లు కేటాయించినట్లు మోడీ సర్కార్ పెద్ద ప్రచార ఆయుధంగా వాడుకుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో చెప్పాలని నిలదీసింది. ఇప్పటి వరకు వాక్సిన్లను ఏ రోజు ఎన్ని కొన్నారో చెప్పమంది, ఆ మొత్తంతో 18-45 సంవత్సరాల వయస్సు వారికి వాక్సిన్లు ఎందుకు వేయకూడదో వివరించాలంది ? ఈ వివరాలన్నింటినీ సుప్రీం కోర్టు ముందు కూడా మూసిపెడుతుందా ? అంతకు ముందు ప్రతిపక్షాలు ఇదే డిమాండ్ చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. ఇది మీడియా, ప్రతిపక్షాలకు, అన్నింటికీ మించి అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసే ఆయుధం కాదా ? అంతకు ముందు ఆక్సిజన్ సరఫరా విధానం లేదంటూ తానే ఒక కమిటీని వేసిన తీరు తెలిసిందే. మోడీ, బిజెపి విమర్శకులకు ఇవన్నీ బహిరంగంగా అందుతున్న ఆయుధాలు కావా ? టూల్ కిట్స్ కాదా ?వివిధ రాష్ట్రాల హైకోర్టులు చేసిన వ్యాఖ్యలన్నింటినీ గుదిగుచ్చి చూస్తే తేలుతున్నదేమిటి ? గతంలో కాంగ్రెస్ తన విధానాలు, తీరుతెన్నులతో తానే ప్రతిపక్షాలకు టూల్కిట్లు అందించింది. ఇప్పుడు బిజెపి అదే బాటలో నడుస్తున్నది.
వాక్సిన్ విధానం గురించి రాష్ట్రాలు తీసుకోవాల్సిన వైఖరుల గురించి కేరళ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రాసిన లేఖలు కూడా టూల్‌కిట్లే. వాటి తయారీకి ముడి పదార్దాన్ని అందించిది నరేంద్రమోడీ సర్కారే కదా ! ప్రతిపక్షాలు బహిరంగంగా విమర్శిస్తాయి, బిజెపి ముఖ్యమంత్రులు లోలోపల కుమిలిపోతారు. పది సంవత్సరాల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో నగరంలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన తీర్మానం పేరు ” మన సమాఖ్యవాదానికి పెను ముప్పు యుపిఏ ”. దానిలో ఏమి రాశారు ? రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నది, దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తున్నది, గవర్నర్లను రాజకీయకీయ ఏజంట్లుగా పని చేయిస్తున్నది. కాంగ్రెసేతర రాష్ట్రాలు చెబుతున్నదానిని ఆమోదించటం లేదు. ఇలా సాగింది, దానిలో నూటికి నూరు పాళ్లు వాస్తవం ఉన్నది.
కానీ ఇప్పుడు అదే నరేంద్రమోడీ చేస్తున్నది ఏమిటి ? ఆ కాంగ్రెస్ చెప్పుల్లోనే కాళ్లు దూర్చి అంతకంటే ఎక్కువ చేస్తున్నారా లేదా ? ఇదీ టూలుకిట్టే, ప్రతిపక్షాలకు ఇచ్చిందెవరు ? కేరళ గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని చదవకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు, పశ్చిమబెంగాల్ గవర్నర్ చేస్తున్న రాజకీయం చూస్తున్నాం. మహారాష్ట్ర గవర్నర్ రాజకీయాన్ని ఎలా రక్తి కట్టించారో చూశాము. తమ ఆదేశాలను ఖాతరు చేయలేదని బెంగాల్ ప్రధాన కార్యదర్శిని కేంద్రానికి రావాలని ఫర్మానా జారీ చేశారు. ప్రధాని మోడీ తమ మాటలు వినటం లేదని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత సొరేన్ బహిరంగంగానే చెప్పారు. మంత్రులను పక్కన పెట్టి తమ రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో కేంద్ర మంత్రి మాట్లాడటం ఏమిటంటూ తమిళనాడు సర్కార్ ఆ సమావేశాన్నే బహిష్కరించింది. వైద్య, ఆరోగ్య విషయాలు రాష్ట్రాలకు సంబంధించినవి అని బిజెపి నేతలు ఎలుగెత్తి చాటుతున్న సమయంలోనే ఇది జరిగింది. విద్య రాష్ట్రాల అంశం కాదా ? కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ చేసిందేమిటి ? డిఎంకెకు టూల్‌కిట్ అందించట కాదా ?
కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో దాదాపు అందరూ ముస్లింలే ఉన్నారు. గుజరాత్ వివాదాస్పద బిజెపి రాజకీయ నేత ప్రఫుల్ పటేల్‌ను దాని సామంతుడిగా నియమించి అక్కడ చిచ్చు పెట్టారు. చివరికి స్ధానిక బిజెపి నేతలకే అది నచ్చక అనేక మంది పార్టీకి రాజీనామా చేశారు. జిఎస్టి నుంచి కోవిడ్-19 అత్యవసరాలను మినహాయించాలా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్రాల మంత్రులు కమిటీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. ఇవన్నీ ప్రతిపక్షాలకు బిజెపి అందించిన టూల్‌కిట్స్ కాదా ?
సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు కేంద్రంలో ఉన్న బిజెపి లేదా రాష్ట్రాలలో ఉన్న బిజెపి, ఇతర పార్టీలకు చురకలు, అభిశంసనల వంటివే. అయితే గతంలో ఇదే న్యాయవ్యవస్దలో వెలువడిన తీర్పులు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను మరచిపోకూడదు. భారత్, అమెరికా, చైనా, పాకిస్ధాన్ రాజ్యాంగాలు ఏవైనా అక్కడ ఉన్న న్యాయవ్యవస్ధలు పాలకవర్గాలకు అనుకూలంగా పని చేసేవే అనే అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. చైనాలో కార్మికవర్గ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ వర్గానికి అనుకూలంగా అక్కడి వ్యవస్ధ ఉంటుంది. మిగతా దేశాలలో పాలకవర్గాలు పెట్టుబడిదారులు కనుక వాటికి అనుకూలంగా న్యాయవ్యవస్దలు ఉంటాయి. కొన్ని అంశాల మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం అంటే పుట్టి మునుగుతుంది జాగ్రత్త పడమనే హెచ్చరిక అని ఎందుకు అనుకోకూడదు. గాంధీ పుట్టిన దేశంలోనే గాడ్సే కూడా పుట్టాడు. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా పొగిడిన నోటితోనే ఆ రాజ్యాంగాన్నే దెబ్బతీసే శక్తులను భక్తితో కొలిచే ప్రబుద్దులను చూస్తున్నాము.
న్యాయవ్యవస్ధకు మొత్తంగా దురుద్దేశ్యాన్ని ఆపాదించటం లేదు. పాలనా విధానాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అందువలన ఆ వ్యవస్ధలోని వారి తీరు తెన్నులను విమర్శనాత్మకంగా చూడక తప్పదు. పైన చెప్పుకున్న న్యాయమూర్తుల వ్యాఖ్యలు, కోర్టుల నిర్ణయాలు నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూడకపోతే ఇబ్బందుల్లో పడతాము. రాజ్యాంగ పదవుల్లో, రక్షణలతో ఉన్న వారు రాజకీయ నేతలను పొగడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి. పదవీ విరమణ చేయగానే ఎంపీ నామినేషన్ పోస్టును తీసుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి గొగోరు న్యాయవ్యవస్ధకు, సమాజానికి ఎలాంటి సందేశమిచ్చారు. సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా 2020లో అంతర్జాతీయ న్యాయ సమావేశంలో మాట్లాడుతూ ” ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాతీయ ప్రశంసలు పొందిన దార్శనికుడు, ప్రపంచ దృష్టితో ఆలోచిస్తూ స్ధానికంగా పని చేసే బహుముఖ ప్రజ్ఞాశాలి ” అని ప్రశంసలు కురిపించారు. ఆ సమావేశంలో ఇరవై దేశాలకు చెందిన న్యాయమూర్తులు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ఉన్నారు.( అలాంటి ప్రజ్ఞాశాలి కరోనా విషయంలో ఏం చేశారో యావత్ ప్రపంచం చూస్తున్నది) ఒక స్వతంత్ర వ్యవస్ధలో ఉన్నత స్ధానంలో ఉన్న వారే అలా పొగిడి ఎలాంటి సందేశాన్ని జనానికి పంపినట్లు ? అంతకు ముందు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉండి తరువాత పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎంఆర్ షా చెప్పిందేమిటి ? ” మోడీ ఒక ఆదర్శం, ఒక హీరో ” అన్నారు.
అధికారంలో ఉన్న వారిని పొగడటం ప్రయోజనాలు పొందటం నరేంద్రమోడీ హయాం కంటే ముందే కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభమైంది.1980 ఎన్నికల్లో విజయం సాధించగానే ఇందిరా గాంధీని పొగుడుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పిఎన్ భగవతి ఒక లేఖ రాశారు. అత్యవసర సమయాల్లో పౌరుల ప్రాధమిక హక్కులను తీసివేయవచ్చని ఒక హెబియస్ కార్పస్ పిటీషన్ కేసులో మెజారిటీ తీర్పు ఇచ్చిన వారిలో భగవతి ఒకరు . ఆ కేసులో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా అసమ్మతి తీర్పు రాశారు. దానికి గాను ఆయనకు రావాల్సిన ప్రధాన న్యాయమూర్తి పదవి దక్కలేదు. దానికి నిరసనగా ఆయన న్యాయమూర్తి పదవికి 1977లో రాజీనామా చేశారు. మరోవైపున ముగ్గురు న్యాయమూర్తుల సీనియారిటీని పక్కన పెట్టి భగవతిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. రాజకీయ నేతలను పొగిడే న్యాయమూర్తులకు ఇవన్నీ తెలియవా, ప్రభావితం చేయవా ? అలాంటి వారు పక్షపాతం లేని తీర్పులు ఇస్తారంటే జనం నమ్ముతారా ? న్యాయవ్యవస్ధ మీద నమ్మకం ఉంటుందా ? ఇప్పటికే మూడు రాజ్యాంగ వ్యవస్ధలోని కార్యనిర్వాహక వ్యవస్దను, శాసనవ్యవస్ధలను ఎలా నీరుగారుస్తున్నారో చూస్తున్నాము. న్యాయవ్యవస్ధను కూడా తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం ప్రారంభమైంది. పురుషులందరు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా న్యాయమూర్తులలో కూడా తేడాలున్నాయని ముందే చెప్పుకున్నాము. అదే పాలకులకు నచ్చదని కరోనా వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న న్యాయమూర్తుల మీద మింగా కక్కలేకుండా ఉన్న పాలకులను చూస్తున్నాము. తమ పీఠాలకు ముప్పు అనుకుంటే న్యాయవ్యవస్దను కూడా ఎలా దిగజారుస్తారో లాటిన్ అమెరికాతో సహా అనేక దేశాల్లో చూశాము. అలాంటి పరిస్ధితే మన దేశం కూడా రానుందా ?