Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సలహాదారులెవరో గానీ అచ్చతెలుగులో చెప్పాలంటే దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు.అఫ్‌కోర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దగ్గర కూడా అలాంటి వాటిని ఇచ్చేవారు పుష్కలంగా ఉన్నారనుకోండి. లేకపోతే వధువు-వరుడు లేకుండా పెళ్లి చేసినట్లు టీకాలు లేకుండా నాలుగు రోజుల పాటు కరోనా టీకా ఉత్సవాలు జరపటం ఏమిటి ? అత్యున్నత న్యాయస్ధానం కరోనాటీకా విధానం గురించి తీవ్ర ఆక్షేపణ తెలియచేయటం వ్యక్తులు ఎవరని కాదు ఒక దేశ ప్రధానికి ఎంత నామర్ధా ! ఒక విధానం అంటూ లేదని వ్యాఖ్యానించటాన్ని చూసి అడ్డగోలు పాలన నడుస్తున్నట్లుగా ప్రపంచమంతా అనుకుంటుంటే ఎంత అవమానం!


మన జనానికి జ్ఞాపకశక్తి తక్కువ అన్నది మోడీ భక్తులకు పూర్తి విశ్వాసం. ఒక్క విషయాన్ని గుర్తు చేసి అసలు విషయానికి వద్దాం. పదమూడు కోట్ల వాక్సిన్లు వేసేందుకు నరేంద్రమోడీ నాయకత్వం కేవలం 95 రోజులే తీసుకుంటే అగ్రరాజ్యం అమెరికాకు 101, చైనాకు 109రోజులు పట్టిందని పెద్ద ఎత్తున కాషాయ దళాలు ప్రచారం చేశాయి. భారత్‌ ఎంత వేగంగా స్పందించిందో చూడండి అంటూ దాన్నొక పెద్ద విజయంగా విర్రవీగాయి. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా రెండవ తరంగం గురించి స్పందించకుండా నిర్లక్ష్యం చేశారన్న దుమారం నేపధ్యంలో ఈ విజయగాధను గానం చేశారు.


ఇప్పుడు పరిస్ధితి ఏమిటి ? ప్రపంచంలో మే నెలాఖరుకు 209 కోట్ల మందికి కనీసం ఒక డోసు వాక్సిన్లు వేశారు. ఒక్క చైనా లోనే 72 కోట్ల మందికి వేయగా మన దేశం 22 కోట్ల దగ్గర ఉంది. జూన్‌ నాలుగవ తేదీ నాటికి మన దేశంలో రెండు డోసుల వాక్సిన్‌ తీసుకున్నవారు 4.44 కోట్ల మంది, జనాభాలో కేవలం 3.3శాతమే. చైనా గురించిన సమాచారం లేనప్పటికీ అంతకంటే ఎక్కువే అన్నది స్పష్టం. వారిని పక్కన పెడదాం ఫైనాన్సియల్‌ టైమ్స్‌ జూన్‌ మూడవ తేదీ నాటి సమాచారం ప్రకారం బ్రిక్స్‌లోని బ్రెజిల్‌లో 10.6, రష్యాలో 8.9శాతం చొప్పున పూర్తిగా వేస్తే మనం ఎక్కడ ఉన్నాం అని ఆలోచించాలి. ఆలశ్యంగా ప్రారంభించినా ఈ ఏడాది చివరికి చైనాలో 80శాతం మందికి పూర్తిగా రెండు డోసులూ వేస్తారంటూ వార్తలు రాస్తున్నారు. మనం ఆస్ధాయిలో ఉన్నామా ? కొంత మంది మన దేశంలో వాక్సిన్లు వేయటం గురించి ఆలోచించకుండా చైనాలో ఎడతెగని వరుసల్లో జనం రోజుల తరబడి వేచి చూస్తున్నారంటూ ఈ మధ్య కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమంలో తిప్పారు.ఇది కూడా నరేంద్రమోడీ వైఫల్యాన్ని సమర్ధించుకొనే యత్నంలో భాగమే. లేదూ సదరు వీడియోలు నిజమే అనుకుందాం. మోడీ తప్పేమీ లేదు, అంతా అలాగే ఉంది అని చెప్పేందుకు గాకపోతే దాని వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ? రోజుకు ఇప్పుడు కోటీ 90 లక్షల వాక్సిన్లు చైనాలో వేస్తున్నట్లు వార్తలు. ఎవరైనా అవన్నీ మేం నమ్మం అంటే అది వారిష్టం. చైనా గురించి కొన్ని నమ్ముతున్న వారు కొన్నింటిని ఎందుకు నమ్మటం లేదు ? లోకంలో నిత్యం ప్రతిదాన్నీ చివరికి తమను తామే నమ్మకుండా శంకించేవారు కొందరు ఉంటారు. మరికొందరు అతి తెలివి గలవారు అది కమ్యూనిస్టు నియంతృత్వం అండీ అవసరమైతే బలవంతంగా వాక్సిన్‌ వేస్తారు, మనది ప్రజాస్వామ్యం అని చెప్పే బాపతు కూడా తగలవచ్చు. దేశంలో ఇంతగా వ్యాధిని పుచ్చబెట్టమని, చంపమని ప్రజాస్వామ్యం చెప్పిందా ?

గేట్స్‌ ఫౌండేషన్‌ మాజీ డైరెక్టర్‌ రే ఇప్‌ చైనా గురించి వంకర బుద్దిని బయట పెట్టుకుంటూ అమానుష వ్యవస్ధలో భాగంగా ప్రతి గ్రామంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉంటారు, అయితే వారు ఎంతో శక్తివంతంగా జనాన్ని సమీకరిస్తారు కూడా అని వాక్సినేషన్‌కు జనాన్ని సమీకరించటం గురించి చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కంటే తమ పార్టీలో ఎక్కువ మంది సభ్యులున్నారని బిజెపి చెప్పుకుంటుంది కదా ఇప్పుడు వారంతా ఏమయ్యారు? మైనారిటీ మతాల వారి మీద విద్వేషం రెచ్చగొట్టటం, మెజారిటీ మతోన్మాదాన్ని ఎక్కించటం తప్ప వారు చేస్తున్నది ఏమిటి ? నిజంగా కరోనాపై పోరులో రంగంలోకి దిగితే నరేంద్రమోడీ ఖ్యాతి ఇంకా పెరుగుతుంది కదా ? ఏప్రిల్‌ నెలలో అమెరికాలో గరిష్ట స్దాయిలో వాక్సినేషన్‌ జరిగింది. రోజుకు 34 లక్షల మందికి వేశారు, అదే చైనాలో ఏడు రోజుల సగటు కోటీ 90లక్షల మంది అని ఏపి వార్తా సంస్ధ తన కథనంలో పేర్కొన్నది. రాజధాని బీజింగ్‌లో 87శాతం మందికి ఒక డోసు వేశారు. సినోవాక్‌, సినోఫామ్‌ అనే రెండు రకాల వాక్సిన్ల తయారీకి అంతకు ముందున్న ఫ్యాక్టరీలేగాక కొత్తగా నిర్మించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ఫ్లూ(జలుబు) మాదిరి కరోనా వైరస్‌ కూడా పదే పదే వచ్చే అవకాశం ఉన్నందున నివారణకు రానున్న రోజుల్లో కూడా వాక్సిన్‌ అవసరం అని కొంత మంది నిపుణులు భావించటం, అవసరమైతే మూడో డోసు కూడా వేయాల్సి రావచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అవసరం లేకపోతే ఆ ఫ్యాక్టరీలను వేరే ఔషధాలు లేదా వాక్సిన్ల తయారీకి వినియోగిస్తారు. గతేడాది కరోనా కట్టడికి కొద్ది రోజుల్లోనే తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించిన విషయం తెలిసిందే. సినోవాక్‌ ఏడాదికి రెండు వందల కోట్లు, సినోఫామ్‌ మూడు వందల కోట్ల డోసుల తయారీ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. అనేక దేశాలలో మాదిరి వాక్సిన్ల తయారీకి చైనా ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చినప్పటికీ దాని తీరు వేరేగా ఉంది. మిగతాదేశాల మాదిరి వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్దాలకు అమెరికా నుంచి దిగుమతులపై ఆధారపడినందున మన దేశంలో సీరం సంస్ధ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. చైనా కంపెనీలు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
కొంత కాలం తరువాత వాక్సిన్‌ ప్రభావం తగ్గిపోతుంది కనుక రాబోయే రోజుల్లో తిరిగి తీసుకోవాల్సి రావచ్చని షాండోంగ్‌ రాష్ట్రంలోని క్వింగ్‌డావోలో ఉన్న బోయావో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా సంస్ద ప్రతి ఝాంగ్‌ చెప్పారు. కొత్త రూపాన్ని సంతరించుకున్న వైరస్‌ల మీద వాక్సిన్ల ప్రభావం ఇంకా రుజువు కానందున మరింత సమాచారాన్ని పరిశీలించిన తరువాత గానీ మరోసారి వాక్సిన్లు తీసుకోవాలా లేదా అనేది చెప్పజాలమన్నారు. ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ మాదిరి కరోనా కూడా మారవచ్చని కొందరు భావిస్తున్నారు. అమెరికా వంటి కొన్ని చోట్ల ఇప్పటికీ ఫ్లూ కారణంగా జనం మరణిస్తున్నప్పటికీ మనవంటి అనేక దేశాలలో జనంలో రోగనిరోధకశక్తి పెరిగి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టి మాయం అవుతున్నది. గతంలో పది కోట్ల డోసుల లభ్యతకు 25 రోజులు పడితే తరువాత క్రమంగా 16,9, 7 రోజులకు తగ్గి ఇప్పుడు ఐదు రోజుల్లోనే అందుబాటులోకి వచ్చింది. ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే డోసు 0.5 మిల్లీ లీటర్లు ఉంటుంది. చైనాలో ఇలాంటి వాటితో పాటు ఒక కంపెనీ 0.1 మిల్లీలీటరును ముక్కుతో పీల్చుకొనే విధంగా ఒక వాక్సిన్‌ తయారు చేసి పరీక్షలు నిర్వహించింది. అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి వస్తే వాక్సిన్‌ లభ్యత ఇబ్బడి ముబ్బడి అవుతుంది, రవాణా కూడా సులభంగా చేయవచ్చు.

కరోనా రెండవ దశ గురించి చేసిన హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పట్టిందనే విమర్శలు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని చెబుతోంది, అంగీకరిద్దాం. కరోనా నిరోధానికి వాక్సిన్‌ అవసరాన్ని గుర్తించారు కదా ! తానే స్వయంగా ఉత్పత్తిని పర్యవేక్షిస్తున్నారని జనం అనుకొనే విధంగా ప్రధాని నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌ పర్యటనలను జరిపారు కదా ! దాని మీద చూపిన శ్రద్ద ప్రణాళిక మీద ఎందుకు పెట్టలేదు, సుప్రీం కోర్టుకు సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయింది ? నరేంద్రమోడీ సర్కార్‌ మనోవైకల్యం కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ విమర్శించారు. ప్రభుత్వంలో గందరగోళంలో పడిన కారణంగానే సత్తా అంతటినీ చూపలేకపోయిందన్నారు. ఆర్ధిక రంగంలో, సామాజిక సంబంధాల వైఫల్యం మహమ్మారి దాడిని ఎదుర్కోవటంలో వైఫల్యానికి ప్రాతిపదిక అన్నారు.


వాక్సిన్‌ తయారీ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప మూడు ధరల విధానాన్ని కేంద్రం ముందుకు తీసుకురావటంలో మరొక పరమార్ధం లేదు.ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధానమిది. కేంద్రానికి 150 రూపాయలకు ఇచ్చిన కంపెనీలు రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు భారీ మొత్తాలను వసూలు చేయటంలో ఆంతర్యం ఏమిటి ? కేంద్రానికి ఇచ్చిన రాయితీలను కూడా ఈ రూపంలో పూడ్చుకోవాలన్న కంపెనీల ఎత్తుగడ, వాటితో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దల అతి తెలివి తప్ప మరొకటి కాదు. నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటంతో పాటు కంపెనీలకు లాభం చేకూర్చటమే దీని అంతరార్ధం. ముడిపదార్దాలు, అవసరమైన పరికరాల ఎగుమతులపై అమెరికా ఇంతవరకు ఆంక్షలు ఎత్తివేయలేదు. మరోవైపు రాష్ట్రాలు వాక్సిన్ల కోసం ప్రపంచ స్ధాయి టెండర్లను పిలిచినా కంపెనీల నుంచి స్పందన లేదు. అవి పెడుతున్న షరతుల మీద నిర్ణయం తీసుకోవాల్సిందీ, పరిష్కరించాల్సిందీ కేంద్ర తప్ప రాష్ట్రాలు చేయగలిగినది కాదు. ఇంత జరుగుతున్నా, వాక్సిన్‌ విధానం మీద కేంద్రం చురుకుగా కదులుతున్న దాఖలాలు లేవు.


కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం ఒకటైతే దాని కొనసాగింపుగా వాక్సిన్‌ దౌత్యంతో దూరమైన ఇరుగు పొరుగు, ఇతర దేశాలకు దగ్గర కావాలని మోడీ సర్కార్‌ ఆలోచన చేసింది. ఇప్పుడు ఇటు దేశంలో తీవ్ర విమర్శలపాలు కావటమే గాక దౌత్య రంగంలో కూడా అనుకున్నది సాధించే స్ధితిలో లేవని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు చైనా వైపు చూస్తున్నాయి. ప్రతి దేశానికి దౌత్య సంబంధమైన, అంతర్జాతీయ సహకారానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ పేద దేశాలకు కోవాక్స్‌ పేరుతో వాక్సిన్లు అందచేసేందుకు నిర్ణయించింది. వాక్సిన్‌ తయారీ దేశాలన్నీ తమ శక్తిమేరకు దానికి విరాళంగా వాక్సిన్లు అందచేస్తున్నాయి. మన దేశం కూడా అలాంటి బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతవరకు ఓకే. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ సంస్ధ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) మార్చినెల 23న ఒక ప్రకటన విడుదల చేసింది. దానిలో పేర్కొన్న సమాచారం ప్రకారం 74 దేశాలకు గ్రాంట్‌ (ఉచితం) వాణిజ్యం, కోవాక్స్‌ కార్యక్రమానికి గాను వాక్సిన్లు ఎన్ని డోసులు అందచేసిందీ వివరంగా ఉంది. మూడు తరగతులకు సంబంధించి మొత్తం 5.959 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. వీటిలో గ్రాంట్లుగా 81.25లక్షలు, కోవాక్స్‌ కార్యక్రమానికి కోటీ 75లక్షల డోసులు ఇవ్వగా వాక్సిన్‌ ఎగుమతి చేసే కంపెనీలు వాణిజ్య పరంగా ఎగుమతి చేసినవి 3.396 కోట్ల డోసులు ఉన్నాయి. విశ్వగురువు నరేంద్రమోడీ పేరుతో ప్రచారం మాటున ఇదంతా జరిగింది. అంటే దానం, విరాళం అనే పేరుతో దౌత్యం దాని వెనుక పక్కా లాభసాటి వ్యాపారం. మరోవైపు నరేంద్రమోడీ కార్పొరేట్ల తాట తీస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో భక్తుల ప్రచారం. మార్చినెలలో మన రాయబారి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ భారత్‌ దేశీయంగా ఉపయోగించే వాటి కంటే ఎగుమతులు చేసిందే ఎక్కువ అని గొప్పగా చెప్పుకున్నారు.


దేశంలో వాక్సిన్ల కొరత తలెత్తటంతో అబ్బే అంతా ఉత్తిదే అని జనాన్ని నమ్మించేందుకు కొత్త నాటకం. ప్రపంచం అంతా రాజకీయమయంగా ఉన్నపుడు ఎవరికి అవకాశం దొరికితే వారు ఉపయోగించుకుంటారన్నది జగమెరిగిన సత్యం. చైనా అదే చేస్తున్నది, ఎవరెంత గింజుకున్నా చేయగలిగిందేమీ లేదు. మనల్ని నమ్ముకొని వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన వారు ఇప్పుడు మన మీద జాలి చూపుతూ చైనా వైపు చూస్తున్నారు. చిన్న దేశమైన భూటాన్‌ మన మీద ఆధారపడుతున్న దేశం, డోక్లాం వివాదంలో మన మిలిటరీ వెళ్లి చైనా వారిని అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇండియా మాకు విశ్వసనీయమైన మిత్ర దేశమే, మేము అడిగితే రెండో డోసుకు వాక్సిన్లు ఇవ్వగలదు కానీ ఆ దేశంలోనే ప్రాణాలను నిలిపేందుకు ఎంతో అవసరం పడుతున్నపుడు మేము వత్తిడి చేయలేము అని ఆ దేశ ప్రధాని లోటే షెరింగ్‌ గత నెలలో ప్రకటించాడు.చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకు పూనుకున్నారు.నేపాల్‌దీ అదే పరిస్ధితి. మన వాక్సిన్ల కంటే చైనావి ధర ఎక్కువే అయినప్పటికీ, అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎగుమతులు చేయనందున మిగతా ప్రపంచ దేశాలు చైనా వైపు చూడక తప్పని స్ధితి.

చైనాలో తయారు చేస్తున్న సినోఫామ్‌, సినోవాక్‌ వాక్సిన్‌న్లకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆమోదం తెలపటంతో ఇప్పుడు అనేక దేశాలు అంతకు ముందు వచ్చిన వార్తలతో సందేహాలు వెలిబుచ్చినవి కూడా ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికా, ఐరోపాల వెలుపల తయారు చేసిన వాక్సిన్లలో ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదం పొందిన వాటిలో ఇంతవరకు చైనావి మాత్రమే ఉన్నాయి. మన దేశానికి చెందిన కోవాక్సిన్‌కు ఇంతవరకు ఆమోదం లేదు. ఒకసారి వాగ్దానం చేస్తే అది గ్రాంటు అయినా వాణిజ్య ప్రాతిపదిక అయినా కచ్చితంగా చైనా సరఫరా చేస్తుందనే నమ్మకం ప్రపంచ దేశాల్లో ఉంది. ఎనిమిది కోట్ల డోసులను అందచేస్తామని అమెరికా ప్రకటించటమే తప్ప వారాలు గడుస్తున్నా ఎటూ తేల్చటం లేదు. ఈ నెలాఖరుకు వస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని మనకు అమెరికా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఆవి అక్కడి గోడౌన్లలో పడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలకు 26.5కోట్ల డోసులు సరఫరా చేసిన చైనా మరో 50కోట్ల డోసుల సరఫరా చేయనుందని ఎయిర్‌ ఫినిటీ అనే సంస్ద నెల రోజుల క్రితం వెల్లడించింది. చైనా తరువాత ఐరోపా యూనియన్‌ వంద దేశాలకు 6.7 కోట్ల డోసులను ఎగుమతి చేసింది. మన దేశం నుంచి వాక్సిన్లు వస్తాయని ఆశించిన ఫిలిప్పైన్స్‌ అధికారి ఒకడు వాస్తవ పరిస్ధితిని అర్ధం చేసుకోకుండా దక్షిణ చైనా సముద్ర దీవుల వివాదంలో చైనాను విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. ప్రభుత్వం ఒకవైపు వాక్సిన్‌కోసం సంప్రదింపులు జరుపుతుంటే ఇలాంటి చర్యలేమిటని సదరు అధికారిని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెరేట్‌ మందిలించాడు. చైనాతో వివాదం ఉన్నంత మాత్రాన దాని పట్ల దురుసుగా, అమర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నాడు. మన దేశం వాక్సిన్‌ ఎగుమతులపై నిషేధం విధించటంతో ఇండోనేషియా ప్రభుత్వం చైనా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. చైనాతో వివాదం పేరుతో వాక్సిన్లు కొనుగోలు చేయకుండా జనం ప్రాణాలను ఫణంగా పెట్టటమా వివాదం ఉంటే తరువాత తేల్చుకుందాం ముందు ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని వాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేస్తారా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాల్సి ఉంది.


అవసరమైతే మనం కూడా చైనా నుంచి వాక్సిన్లు ఎందుకు దిగుమతి చేసుకోకూడదనే సూచనలు ఇప్పటికే వెలువడుతున్నాయి. మన మాదిరే చైనా కూడా గ్రాంటుగా ఇచ్చేది ఇస్తోంది, మరోవైపు వాక్సిన్లను ఆమ్ముతోంది. గత నెలాఖరులో మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా వెళ్లి వాక్సిస్లు ఆమ్ముతారా అంటూ వాకబు చేసి వచ్చారు. అమెరికన్లు ఏవీ ఉచితంగా ఇవ్వరు. ఒక వేళ ఒకదాన్ని ఇచ్చినా మరొకదానితో మొత్తం రాబడతారు. చైనా నుంచి ఆక్సిజన్‌ పరికరాలు, ఇతర సరఫరాలకు ఆటంకం లేకుండా సరకు రవాణా విమానాలు నడపాలని అదే జైశంకర్‌ చైనాను అడిగారు గానీ వాక్సిన్ల దగ్గర మొహమాట పడ్డారు. వాక్సిన్లు లేక జనం చస్తుంటే ఇదేమి వైఖరో, రాజకీయమో అర్ధం కాదు.