Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


జ్ఞానం ముందు పుట్టిందా ? అజ్ఞానం ముందు పుట్టిందా ! ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి రాక ముందు జనానికి అస్సలు విజ్ఞానం లేదా ? లేదని చెబితే పురాతన మానవుల అనుభవాలను, తరతరాలుగా వాటిని పరిరక్షించటాన్ని కించపరచటమే. ఈజిప్టు పిరమిడ్లు నిర్మించిన వారు, వాటిలో మమ్మీలను భద్రపరచిన వారి పరిజ్ఞాన్ని విస్మరించగలమా ? చైనా గోడ నిర్మాతలకు తట్టిన ఆలోచన సామాన్యమైనదా ? క్రీస్తు పూర్వమే మన దేశంలో చెక్కిన ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలకు ప్రాతిపదిక విజ్ఞానం కాదా ? రోమ్‌ నగరంలో వేల సంవత్సరాల నాడు నిర్మించిన ప్రఖ్యాత బహిరంగ స్డేడియం కూడా అలాంటిదే. అయితే ఇవన్నీ కూడా ప్రపంచమంతటా వాటి నిర్మాణ కాలంలో లేదా తరువాత గానీ మరోచోట పునరావృతం కాలేదు. ఎందుకు ? విదేశీ దండయాత్రల నుంచి రక్షణకోసమే చైనా గోడ నిర్మాణమైందనుకుందాం. విదేశీ దండయాత్రలు ఒక్క చైనా మీదే జరిగాయా ? మిగతా దేశాలకు అలాంటి ఆలోచన ఎందుకు తట్టలేదు, చూసి కూడా ఎందుకు నిర్మించలేదు ? అలాగే మిగతావీనూ. ఎవరైనా ఈ కోణం నుంచి పరిశోధించారో లేదో నాకైతే తెలియదు, అలాంటి విశ్లేషణలు ఉంటే అందరం చదువుకుందాం.

గత కొద్ది వారాలుగా ఆనందయ్య ఆకుల మిశ్రమం ( మందు లేదా ఔషధం కాదని ఆయుష్‌ చెప్పింది కనుక), ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని తూలనాడిన రామ్‌దేవ్‌ బాబా గురించి చర్చలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ సమగ్రంగా చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు, కొన్ని పరిశీలనలకే పరిమితం. దక్షిణాసియా, మరికొన్ని ప్రాంతాలలో ఆకు, వక్క, సున్నంతో కిళ్లీలు వేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది.దానితో నోరు ఎర్రగా పండుతుందని తెలుసు కానీ ఎరుపుకు బదులు వేరే రంగులో ఎందుకు పండదో లేదా అసలు ఎందుకు పండుతుందో వేసుకొనే వారందరికీ తెలుసా ? తెలియనంత మాత్రాన వారిది అజ్ఞానం అనలేము ? ఆకు, వక్కలను పూజల్లో వినియోగిస్తాము. ఎందుకు ? ముఖ్యమైన దేవతలంతా తమలపాకులోని వివిధ భాగాలలో ఉంటారనే పుక్కిటి పురాణాలు వీటికి మూలం.

మహలక్ష్మి ఆకు కింది భాగంలో, సరస్వతి మధ్యలో, జేష్టలక్ష్మి తొడిమ-ఆకు కలిసే చోట, పార్వతి, మాంగల్యదేవి ఎడమవైపు, భూదేవి కుడి వైపు, శివుడు ఆకు బయట, శుక్రుడు పైన, సూర్యుడు ఆకులో మొత్తంగా ఇలా అనేక మంది దేవతలు, దేవుళ్లు, కాని ప్రముఖులకు కూడా తమలపాకులో స్ధానం కల్పిస్తూ కథలు రాశారు. శివుడు, పార్వతి ఆకు, వక్క మొక్కలను హిమాలయ ప్రాంతంలో నాటారు అని చెబుతారు. వాటినే ఇప్పటికీ విద్యావంతులు కూడా నమ్ముతూ ఉంటే దాన్ని అజ్ఞానం అంటారు, వారిని అజ్ఞానులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. చదువులేని వారికి తెలియని తనం తప్ప అజ్ఞానం అనలేము. శివుడు, పార్వతి వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు, హిమాలయాల్లోనే ఎందుకు నాటారు, మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరించారు. దేవతలకు పక్షపాతం ఉండకూడదు కదా ? అనే ప్రశ్నలకు సమాధానం ఉందా ? అదంతే అంటే దాన్నేమనాలి ? ఆయుర్వేదంలో తమలపాకులో ఉన్న ఔషధ లక్షణాల గురించి రాశారు. అది వేల సంవత్సరాల మానవుల అనుభవ సారం తప్ప ఎవరో ఒకరు పరీక్షించి కనుగొన్న పర్యవసానం కాదు. ఆకు, వక్కలతో వేసుకునే సున్నం మోతాదు మించితే నోరు బొక్కుతుంది. ఇది కూడా అనుభవంలోంచి వచ్చిందే కదా ? ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే అదంతే అంటే వితండవాదం, నాకు కనిపించేదాన్ని మాత్రమే నమ్ముతా మిగతావి నమ్మను అంటే మూర్ఖత్వం అవుతుంది.


ఇప్పుడంటే యావత్‌ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఆ మూల నుంచి ఈ మూలకు కొన్ని గంటల్లోనే వెళ్లి రావచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతి దేశం లేదా ప్రాంతం వారు అనుభవంలో తమవైన వైద్య పద్దతులను ఉనికిలోకి తెచ్చారు. ఎవరికి వారు తమ పద్దతే గొప్ప అనుకోవటమే కాదు, మిగతావాటిని అంత తేలికగా స్వీకరించలేదు. ఐరోపాలో హౌమియోపతి వైద్యులు తొలి రోజుల్లో అల్లోపతిని అంగీకరించలేదు, అపహాస్యం చేశారు. నాగరిక సమాజాలతో సంబంధాలు లేకుండా ఆడవులు, కొండలకే పరిమితమైన గిరిజనులు ఇప్పటికీ తమవైన ఔషధాలను తయారు చేసుకొని వాడుతున్నారు. వారికి ఆయుర్వేదం అంటే తెలియదు, ఆయుర్వేదాన్ని గిరిజన ప్రాంతాలకు తీసుకుపోయిన చరిత్రా లేదు. ఉంటే ఇప్పటికీ వారు తమ నాటు మందులనే ఎందుకు నమ్ముతున్నారు. తమ సాంప్రదాయ గిరిజన వైద్య పద్దతులకే కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. నల్లమలలోని చెంచు ఆదివాసులు కరోనా వాక్సిన్‌ తీసుకొనేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎక్కడికక్కడ స్ధానిక వైద్య పద్దతులు ఉనికిలోకి వచ్చాయి. వాటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. కానీ ఆయుర్వేదానికి మన కాషాయ దళాలు పెట్టినట్లు హిందూ వైద్యం, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల పేర్లు పెట్టలేదు. మన దేశంలో బౌద్దం, జైనం ఒకప్పుడు ప్రధాన మతాలుగా ఉన్నాయి, మరి వాటి పేరుతో వైద్యం ఎందుకు లేదు ! మన దేశంలో హిందూత్వ శక్తులకు ఒక అజెండా ఉంది, దానిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టటం ఒక ఎత్తుగడ గనుక ఇప్పుడు ప్రతిదానికి మతాన్ని తగిలిస్తున్నారు. సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశంలో విడదీయలేని భాగం, ఆయుర్వేదానికి మత, కుల ముద్రలు వేయటం ద్వారా దానికి ఆదరణ పెంచాలనుకుంటున్నారా ? దెబ్బతీయాలని తలపెట్టారా ? ఆనందయ్య మిశ్రమానికి కొందరు అతివాదులుగా చెలామణి అవుతున్నవారు కులాన్ని కూడా జత చేశారు. అందుకే అతివాదం-మితవాదం నాణానికి బొమ్మా బొరుసూ వంటివి అంటారు.


ఒక నాడు అల్లోపతి అప్పటికి ఉన్న వైద్యపద్దతులకు ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ముందుకు వచ్చింది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇప్పుడు అదే అసలైనదిగా మారి, స్ధానిక, దేశీయ వైద్య పద్దతులు జనం దృష్టిలో ప్రత్యామ్నాయమైనవిగా మారిపోయాయి. ఆయా దేశాలలో అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులను ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ పోయి ఉంటే అల్లోపతి రంగంలోకే వచ్చేదే కాదు కదా ? వాటికి చాదస్తాలను తగిలించి అభివృద్ది కాకుండా చేసింది ఎవరు ? వర్తమాన ప్రభుత్వాల సంగతి పక్కన పెడదాం. అమెరికా, ఐరోపా దేశాలలో ఉన్న స్ధానిక వైద్య పద్దతులు ఉన్నప్పటికీ వాటి స్ధానంలో అల్లోపతి అభివృద్ది చెందింది. అదేమీ రహస్యంగా జరగలేదు. బలవంతమూ చేయలేదు. మన దేశంలో ఆయుర్వేద పండితులు వాటిని చూసి తమ వైద్య పద్దతిని, ఔషధాలను అభివృద్ది చేయటాన్ని ఎవరు అడ్డుకున్నారు. బ్రిటీష్‌ పాలకులేమీ ఆంక్షలు పెట్టలేదు, అప్పటికి అల్లోపతి కార్పొరేట్‌ ఆసుపత్రులు వాటితో కుమ్మక్కయ్యే ఔషధ మాఫియాలు కూడా రంగంలో లేవే !

హౌమియోపతి వైద్యపద్దతి రోగి లక్షణాల మీద ఆధారపడింది. దానికి ప్రత్యామ్నాయంగా అమెరికా, ఐరోపాలో కొందరు ముందుకు తెచ్చినదానిని హౌమియోపతి నిపుణుడు హానిమన్‌ తొలిసారిగా అల్లోపతి అని వర్ణించాడు. రోగ లక్షణంతో సంబంధం లేకుండా చికిత్సకు వేరే పద్దతుల్లో వైద్యం చేయటాన్ని ఎగతాళి చేస్తూ తొలిసారిగా 1810లో ఆ పదాన్ని ఉపయోగించాడు. జ్వరం వస్తే లక్షణాలను బట్టి హౌమియో పద్దతిలో కొన్ని మందులు ఇచ్చి దాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదంలో కాషాయం, లంఖణాలతో చిక్సిత చేస్తారు. అదే అల్లోపతిలో యాంటీబయోటెక్‌ ఇచ్చి జ్వరానికి కారణమైన బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయటం ద్వారా జ్వరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. ఆయుర్వేదం, హౌమియోపతి వంటి వాటిలో శస్త్రచికిత్సలు లేవు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే రెండు పద్దతులను అసలు పోటీ దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక ఔషధాలతో జ్వరాన్ని రెండు మూడు రోజుల్లో తగ్గిస్తే లంఖణం పరమౌషధం పేరుతో వారాల తరబడి మంచాలకే పరిమితం చేస్తే ఉద్యోగాలేమి కావాలి, సెలవులు ఎక్కడి నుంచి వస్తాయి. శస్త్రచికిత్సలు అవసరమైన చోట దానికి బదులు మన మతం, మన కులం, మనదేశ పద్దతుల పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా ?

” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” ఇలాంటి ట్వీట్ల ద్వారా పతంజలి కంపెనీ సిఇఓ ఆచార్య బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఈ పెద్దమనిషికి నిజంగా ఆయుర్వేదం మీద, అన్నింటికీ మించి తాము తయారు చేస్తున్న ఔషధాల మీద, సకల రోగ నివారిణిగా చిత్రిస్తున్న యోగా మీద విశ్వాసం ఉందా ? నిజంగా ఉంటే ఉత్తరాఖండ్‌ రిషీకేష్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌( అల్లోపతి)లో చేరి ఎందుకు చికిత్స తీసుకున్నారు. 2019 ఆగస్టు 23న ఆసుపత్రిలో చేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి, బాలకృష్ణను పరామర్శిస్తూ రామ్‌దేవ్‌ బాబా నిలిచిన చిత్రాలూ దర్శనమిచ్చాయి. తాజాగా అలాంటి ఈ పెద్దమనుషులిద్దరూ అల్లోపతి వైద్యం మీద అనుచిత విమర్శలు చేయటంతో కొందరు పాతవీడియోలకు వ్యాఖ్యానాలు తోడు చేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. బాలకృష్ణకు గుండెపోటు వస్తే దివ్య అర్జున్‌ కషాయం ఇవ్వలేదు, అనులోమ విలోమ యోగా చేయించకుండా నేరుగా ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు, ఇప్పుడు రామ్‌దేవ్‌ బాబా అల్లోపతిమీద విమర్శలు చేస్తున్నారు సిగ్గు చేటు అని పేర్కొన్నారు. అయితే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారా లేదా అని బూమ్‌ వెబ్‌సైట్‌ నిజానిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తే ఆసుపత్రిలో చేరిన మాట నిజమే అని తేలింది. ఇండియా టుడే గుండెనొప్పితో అని రాస్తే జీ న్యూస్‌ కలుషిత ఆహారం కారణంగా అని రాసింది. అయితే ఆ సమయంలో రామ్‌దేవ్‌ ప్రతినిధి కెకె తిజార్‌వాలా చేసిన ట్వీట్‌లో కలుషిత ఆహారం గురించి పేర్కొన్నారు. ఇక్కడ సమస్య చిన్నదైనా పెద్దదైనా , జబ్బు ఏదైనా అల్లోపతి సామర్ధ్యం గురించి విమర్శిస్తున్న వారు అదే ఆసుపత్రిలో చేరటం ఏమిటి ? ఒక చెట్టునో, ఆవు మూతినో వాటేసుకోకుండా సిలిండర్ల ఆక్సిజన్‌ తీసుకోవటం ఏమిటి ?

ఏడాది తరువాత కరోనాకు,రోగనిరోధక శక్తికి ఇదిగో మందు అంటూ ఆనందయ్య రంగంలోకి వచ్చారు లేదా కొందరు తెచ్చారు. దీని నేపధ్యం ఏమిటి ? కరోనా కొత్త వైరస్‌ గనుక దానికి చికిత్స ఏమిటో ఏ వైద్య పద్దతికీ తెలియదు. జ్వరం వస్తుంది కనుక పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్నే చెప్పారు. మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఇస్తే ఫలితం ఉంటుందన్నారు. వెంటనే మన దేశం వాటిని ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. నిషేధం ఎత్తివేయకపోతే డొక్క చించుతా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. తరువాత రెమిడెసివిర్‌ దివ్వ ఔషధం అన్నారు, ఎంతగా బ్లాక్‌ మార్కెట్‌ జరిగిందో చూశాము. చివరికి బిజెపి పెద్దలు కంపెనీ నుంచి తామే సేకరించి పెద్ద మేలు చేకూర్చేవారిగా ఫోజు పెట్టారు. తరువాత దాని వలన ఫలితం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో ప్లాస్మా చికిత్స గురించి ప్రచారం. చివరికి అదీ ఫలితం లేదని తేలిపోయింది. రామ్‌దేవ్‌ బాబా కరోనిల్‌ పేరుతో కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రారంభించి కరోనాకు దివ్వ ఔషధం అన్నారు. అది అసలు ఔషధమే కాదు తేలిపోయింది. ఒకవైపు కరోనా రెండవ తరంగం రెచ్చిపోతుంటే జనానికి దిక్కుతోచని స్ధితిలో ఆనందయ్యను రంగంలోకి తెచ్చారు. అతను గాకపోతే మరొకరు వచ్చి ఉండేవారు. గతంలో మెదడు వాపు వ్యాధి, స్వైన్‌ఫ్లూ వంటివి జనాన్ని భయపెట్టిన సమయంలో నిర్ధారణగాని హౌమియో, ఆయుర్వేదం మందులు ఇలాగే పెద్ద ఎత్తున పంచారు. నష్టం లేదు కదా అని జనం కూడా తీసుకున్నారు.


అల్లోపతిలో ప్రయత్నించిన ప్రతి ఔషధం ఉపశమనం కల్పించేది తప్ప నిరోధించేది కాదని తేలిన సమయంలో ఆనందయ్య మూలికల మిశ్రమం వచ్చింది. దాన్ని తినేందుకు మాత్రమే ఇస్తే ఇంత రగడ జరిగి ఉండేది కాదేమో ? కండ్లలో వేసే చుక్కలతో రోగనిరోధకశక్తి వస్తుందని చెప్పటమే తీవ్ర వివాదాన్ని రేపింది.నిర్ధారణ కాని వాటిని కరోనా రోగులు కంట్లో వేసుకున్నా, తిన్నా వారి కండ్లు,ప్రాణాలకు ముప్పు కనుక అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. ఇది కూడా ఎందుకు జరిగింది. ఏడాదికి పైగా కరోనా జనాన్ని చంపేస్తుంటే ఆనందయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఏడాది కాలంగా చేసిన పరిశోధన లేదా తెలుసుకున్న పరిజ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి మందు కనుగొన్నా అంటే సరిపోతుందా ? ఇక్కడ ఆనందయ్య ఒక చిన్న వ్యక్తి. కరోనా వైరస్‌ గురించి నిర్ధారణ కాగానే అనేక దేశాల్లో ఉన్న స్ధానిక వైద్యపద్దతుల నిపుణులు ఔషధాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు ? అల్లోపతి శాస్త్రవేత్తలు, వైద్యుల ప్రయోగాలే ఫలించి వాక్సిన్‌ ఉనికిలోకి వచ్చింది. సహజంగానే దాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్‌ సంస్ధలు పూనుకున్నాయి. వాటిని చూపి నిర్ధారణ కాని నాటు మందులను ఒకసారి వాడి చూస్తే ఏమౌతుంది? నష్టమేమీ లేదు కదా అనే వాదనలు చేసే వారికి చెప్పేదేముంది. వాడి చూడండి, అనుభవించండి. ఆయిల్‌ పుల్లింగు చూశాము, నీటి వైద్యం వంటి వాటిని చూశాము. సాధారణ రోగాలకు అలాంటి వాటిని వెయ్యి వాడండి ఎవరి ఖర్మ వారిది. కానీ కరోనా ఒక మహమ్మారి, ఆదమరిస్తే, సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయేదానితో కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదని చెబుతుంటే వితండవాదం చేసే వారి మానసిక స్ధితిని అనుమానించాల్సి వస్తోంది. చుక్క వేయగానే పక్కాగా తయారయ్యానని చెప్పిన కోటయ్య మాస్టారు కొద్ది రోజుల్లోనే ఎందుకు మరణించారు,సమర్ధించిన వారే ఆయన ప్రాణాలకు మీదకు తెచ్చారనటం వాస్తవం కాదా ?


వైద్య రంగంలో అల్లోపతి ఆసుపత్రులు, ఔషధాల మాఫియా ఎలా అయితే ఉందో ఆయుర్వేద మాఫియా కూడా ముందుకు వచ్చింది. జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాము తయారు చేసిన కరోనిల్‌ ఔషధం కరోనాను అరికడుతుందని ప్రచారం చేసి సొమ్ము చేసుకొనేందుకు పెద్ద పధకం వేసిన రామ్‌దేవ్‌ బాబా ఆయుర్వేద మాఫియా తెగకు చెందిన వారు కాదా ? ఇలాంటి వారిని చూసి పక్కా ప్రణాళికతోనే ఆనందయ్యను కొందరు రంగంలోకి దించారని చెబుతున్నారు ? కాదని నిరూపించండి. నిజానికి ఏ పట్టా లేని ఆనందయ్యకు కొన్ని మూలికల మిశ్రమంతో కరోనా తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిసినపుడు ఆమాత్రం కూడా ఆయుర్వేద నిపుణలకు ఎందుకు తట్టలేదు. జగదేక వీరుడి సినిమాలో మాదిరో లేక ఆఫ్రికా లేదా అమెజాన్‌ అడవుల నుంచి తెచ్చిన అపురూప మూలికలు కాదే. వేటితో తాను తయారు చేస్తున్నదీ ఆనందయ్యే చెప్పాడంటున్నారు కదా ? అప్పుడైనా ఆ మిశ్రమానికి ఆ లక్షణం ఉంటుందో లేదో నిపుణులు ఎందుకు చెప్పలేకపోయారు ? ఆయుష్‌ రంగంలోకి దిగి అలాంటి లక్షణాలేమీ లేవు వేసుకుంటే వేసుకోండి, చస్తే చావండి మీ ఇష్టం, ఇతర మందులను ఆపకుండా కావాలంటే దాన్ని కూడా తీసుకోండి తప్ప అల్లోపతి మందులను ఆపవద్దని చెప్పింది కదా ? దీనికి అనుగుణ్యంగానే దాన్ని పంపిణీ చేయవచ్చని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్ధానం తామే దాన్ని తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అది ఔషధం కాదంటున్నారు గనుక ఆపని మానుకున్నాం అంటోంది. చిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఎంఎల్‌ఏలు మాత్రం మందు తయారు చేయించి పంపిణీ ప్రారంభించారు. ఇంత చర్చ జరిగాక కూడా ఎవరైనా దాని మీదే ఆధారపడితే ఎవరూ చేయగలిగింది లేదు. తమ పార్టీ వారే ఈ పని చేస్తున్నారు గనుక ఏదైనా అనుకోనిది జరిగితే వైఎస్‌ జగన్‌ మరోమారు ఓదార్పు యాత్రలు చేయాల్సి ఉంటుంది.

ఆనందయ్య మందును ప్రశ్నించటం ఒక కులాన్ని అణగదొక్కటంగా లేదా ఆయుర్వేదం హిందూ ఔషధం గనుక దాన్ని వ్యతిరేకించటం అంటే హిందూమతాన్ని వ్యతిరేకించటం , నాశనం చేసేందుకు పూనుకోవటమే అంటూ వాటిని అనుమతించాల్సిందే అని ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. శాస్త్రీయ అంశాలు బయటికి రావటం మతశక్తులకు ఇష్టం ఉండదన్నది చరిత్ర చెప్పిన సత్యం. బాగ్దాద్‌లో మహమ్మద్‌ బిన్‌ జకారియ లేదా రహేజాగా సుపరిచితుడైన వైద్యుడు 860-932 సంవత్సరాల మధ్య జీవించాడు. హేతువాద భావనలు, ఆ నాటికి ఉన్న పశ్చిమ దేశాల బోధనలను ముందుకు తెచ్చాడు. వైద్యం గురించి ఒక పుస్తకం రాశాడు. దాన్ని తట్టుకోలేని ముస్లిం మత పెద్ద ఆ పుస్తకంతోనే తల మీద మోదాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతని కండ్లు పోయాయి. మైఖైల్‌ సెర్వెటస్‌ అనే స్పెయిన్‌ వైద్యుడు 1511-53 మధ్య జీవించాడు. ఊపిరితిత్తుల పనితీరు గురించి, క్రైస్తవాన్ని సంస్కరించటం గురించి తన అభిప్రాయాలతో ఒక పుస్తకం రాశాడు.అది మతవిరుద్దమని ప్రకటించటంతో కాథలిక్‌ మతగురువుల విచారణ, శిక్ష నుంచి తప్పించుకొనేందుకు స్విడ్జర్లాండ్‌ వెళ్లాడు. అక్కడ ప్రొటెస్టెంట్‌ మతగురువులకూ కంటగింపయ్యాడు. జెనీవా సరస్సు ఒడ్డున సజీవదహనం చేశారు. అందరికీ తెలిసిన గెలీలియో (1564-1642) గురించి చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని చెప్పటాన్ని సవాలు చేసి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు. దాన్ని వ్యతిరేకించిన క్రైస్తవమత పెద్దలు జీవితాంతం గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించటమే గాక ఆయన రచనలను నిషేధించారు.


మన దేశంలో హేతువాదం, భౌతికవాదానికి ఆదిపురుషులు చార్వాకులు అన్నది ఒక అభిప్రాయం. వారు బౌద్ద, హిందూ మతాలను రెండు చెప్పే ఆశాస్త్రీయ, పరస్పర విరుద్ద అంశాలను వ్యతిరేకించారు. స్వర్గ నరకాలు లేవన్నారు. అంతకు ముందు ఉనికిలో ఉన్న అనేక భావనలను వారు సవాలు చేశారు. అది తమ మతాల మనుగడకే ప్రమాదమని భావించిన నాటి మత పెద్దలు వారిని సర్వనాశనం చేశారు, వారి రచనలను దొరక్కుండా చేశారు. వారి మీద తప్పుడు ప్రచారం చేస్తూ వారి ప్రస్తావనలతో రాసిన వ్యతిరేక రచనల నుంచి వారి భావజాలం గురించి తెలిసింది, వారి అసలు రచనలు లేవు. మొత్తంగా చెప్పాలంటే ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా నాశనం చేశారు. పర్యవసానంగా ఒక నిర్వీర్యమైన జాతిగా మనది తయారు కావటానికి మతాలు తప్ప మరొకటి కాదన్నది కొందరి అభిప్రాయం. నాడు మతశక్తులు హేతువాదాన్ని అణగదొక్కితే నేటి మతశక్తులు మరోరూపంలో అశాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి ఈసమాజాన్ని అజ్ఞానంలోకి నెట్టాలని చూస్తున్నాయి. దేశంలోని హిందూత్వ శక్తులు సమాజాన్ని వెనక్కు నడపాలని చూస్తున్నాయి గనుక మూఢనమ్మకాలకు, ఆశాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్సు సమావేశాలనే వేదికగా చేసుకొని అశాస్త్రీయ, ఆధారంలేని అంశాలను ప్రచారం చేశారు. ఆవు మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా తేల్చమని నిధులు కేటాయిస్తున్నారంటే ఏమనుకోవాలి. తిరోగామి జాతీయవాద అజెండాలో భాగంగా పురాతన సంస్కృతికి, మెజారిటీ హిందూమతానికి ముప్పు వచ్చిందనే పేరుతో జరుగుతున్న ప్రచారం తెలిసిందే. దానిలో భాగంగానే హేతువాదం ఘర్షణ పడే ప్రతిదానికి మతానికి సంబంధం కలిపితే జనాన్ని తమవెంట తీసుకుపోవటం సులభమని వారు భావిస్తున్నారు.

ఆల్లోపతి వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఔషధాలు తయారు చేసే కంపెనీల లాభాపేక్ష, ఇతర లోపాలను చూపి ఆయుర్వేదానికి మతాన్ని తగిలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్న పతంజలి వంటి కంపెనీల యజమానులు అలాంటి ధోరణులను ప్రోత్సహిస్తున్నారు.వారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మద్దతు గురించి చెప్పనవసరం లేదు. విదేశీ కార్పొరేట్‌లు పెరిగితే తప్పు పట్టని వారు స్వదేశీ కార్పొరేట్ల ఎదుగుదలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమెజాన్‌ మాదిరి మన అంబానీ కంపెనీ ఎందుకు పెరగకూడదు, ఒక ఫైజర్‌, ఒక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ మాదిరి రామ్‌దేవ్‌ బాబా పతంజలి ఎందుకు విస్తరించకూడదు అనే వాదనలకు స్వదేశీ కార్పొరేట్‌ జాతీయవాదమే మూలం. అసలు మొత్తంగా దేశాన్ని కార్పొరేట్‌లకు అప్పగించటం హానికరం అని ఎక్కడా చెప్పరు. ఐరోపా సామ్రాజ్యవాదులు ఇలాంటి కార్పొరేట్‌ జాతీయవాదంతోనే తమ కంపెనీలకు మార్కెట్‌ను కల్పించేందుకు గతంలో దేశాలను వలసలుగా చేసుకున్నారు, ఎన్నో ప్రాంతీయ యుద్దాలు, రెండు ప్రపంచ యుద్దాలకు, నిత్యం ఏదో ఒక మూల ఉద్రిక్తతలకు కారకులు అవుతున్నారు. ఆనందయ్య వంటి వారిని కొందరు తమ స్ధాయిలో ఉపయోగించుకోవాలని చూస్తుంటే మతశక్తులతో చేతులు కలిపిన పతంజలి పెద్దలు పెద్ద స్ధాయిలో లబ్ది పొందాలనుకుంటున్నారు. ” యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు ” అంటూ చేస్తున్న ట్వీట్లు, హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందంటూ సంఘపరివారం చేసే ప్రచారానికి పెద్ద తేడా ఏముంది ?


శాస్త్రం, కుహనా శాస్త్రం, జ్ఞానం, అజ్ఞానం వీటిలో ఏది ముందు ? బతుకు పోరాటంలోనే మానవుడు అనేక అంశాలను నేర్చుకున్నాడు. చెట్టుమీది కాయలు కింద పడటం మానవులకు తెలియని అంశం కాదు. దానిక్కారణం తెలియక ముందు అది దేవుడు, దేవత లేదా ఆదృశ్యశక్తి మహిమ అనుకున్నారు. అది కారణం తెలియని స్ధితి. దీనికి అజ్ఞానం ఒక పర్యాపదం. చెట్టుమీది యాపిల్‌ పండ్లు పైకి పోకుండా, పక్కకు పడకుండా నిటారుగా కిందనే ఎందుకు పడుతున్నాయన్న ఆలోచన న్యూటన్‌కు వచ్చింది కనుకనే భూమ్యాకార్షణ సిద్దాంతం వచ్చింది. అది విజ్ఞానం. అంతకు ముందు దేవుడే అలా రాసిపెట్టాడు అనుకోవటం తప్పుకాదు. తరువాత కూడా ఆ సిద్దాంతం గురించి తెలియని వారు అనుకుంటే దాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు. కానీ చదువుకొన్న వారు కూడా దేవుడి మహిమే అంటే అది అజ్ఞానం. పిల్లలు ఎలా పుడతారో తెలియక ముందు దేవుడి దయ, తెలిసిన తరువాత కూడా అలా అనుకుంటే అజ్ఞానం. అందువలన మౌలికంగా తెలియని స్ధితి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానం పుట్టింది. సైన్సు, కుహనా సైన్సు కూడా అంతే. వివేకం లేని జ్ఞానం ఇసుకలో నీరు వంటిది అన్నది ఒక సామెత. వానరుడు నరుడిగా మారిన పరిణామ క్రమం గురించి మీరు విశ్వసిస్తారా అంటూ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా సంస్ద జరిపిన సర్వే ప్రకారం జపాన్‌లో 78, ఐరోపాలో 70, చైనాలో 69, దక్షిణ కొరియాలో 64శాతం మంది అవునని అంగీకరిస్తే అమెరికాలో 45శాతం మందే ఉన్నారు. అజ్ఞానిగా ఉండటం పెద్దగా సిగ్గుపడాల్సిన అంశం కాదు, తెలుసు కొనేందుకు నిరాకరించటమే సిగ్గులేనితనం అని అమెరికా జాతిపితలలో ఒకడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పారు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో అన్నింటి గురించి రాశారని, మన సంస్కృత గ్రంధాల్లో ఉన్నవాటిని పాశ్చాత్యులు అపహరించి తామే కనుగొన్నట్లు ప్రచారం చేసే, చెబుతున్నవారు కొత్తగా తెలుసుకొనేందుకు ముందుకు వస్తారని ఆశించటం అత్యాశే. తెలుసుకొనేందుకు నిరాకరించే జాతి ఎక్కడైనా ముందుకు పోయిందా ?