Tags
#Modi’s vaccine policy, BJP, Modi’s Vaccine U-Turn, Narendra Modi Failures, Supreme Court of India
ఎం కోటేశ్వరరావు
కరోనా బాధితుల పట్ల రాష్ట్రాలకు బాధ్యత లేదా, అసలు వైద్యం, ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కదా, అన్నీ కేంద్రమే చేయాలంటే సాధ్యమేనా అంటూ జనం చెవుల తుప్పు వదిలేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపి పెద్దలు తమ టూల్‌కిట్‌లోంచి ఒక ప్రచార ఆయుధాన్ని ప్రయోగించారు. జనానికి రాజ్యాంగం గురించి బోధ చేయటంతో పాటు ప్రతిపక్షాల మీద దాడికి కత్తులు, కటార్లు, మొరటు బాంబులు, విషపూరిత ఆయుధాలను సిద్దం చేసుకున్న భక్తులందరినీ విశ్వగురువు, దేవుడు లేదా దేవదూత నరేంద్రమోడీ దారుణంగా దెబ్బతీశారు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వాక్సిన్ వేయించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని నాటకీయ పద్దతుల్లో స్వయంగా ప్రకటించారు. దాంతో ఆయుధాలన్నింటినీ ఎక్కడికక్కడ పడవేసి పాలాభిషేకాలు, పాదాభిషేకాలు చేయటంతో పాటు భజన ప్రారంభించారు. భక్తుల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో ఇవి లేదా వీటికి అనుబంధ అంశాలు మాత్రమే ఉంటాయి. పరిమిత ప్రయోజనం కోసమే వారిని తయారు చేస్తారు. ఇది విశ్వజనీన సత్యం.
గతంలో ప్రకటించిన వాక్సిన్, ధరల విధానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అయితే నరేంద్రమోడీ ప్రకటించిన తాజా విధానానికి ముందు అలాంటి సమావేశం జరిగినట్లుగానీ, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగానీ ఎలాంటి సమాచారం లేదు. రాజ్యాంగం ప్రకారం విధానపరమైన నిర్ణయాలు ఫెడరల్ వ్యవస్ధలో మంత్రివర్గం తీసుకోవాలి. అధ్యక్ష తరహా వ్యవస్ధలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని తరువాత మంత్రివర్గఆమోదానికి పెడతారు. ఇక్కడ నరేంద్రమోడీ గారు చేసిందేమిటి ? పెద్ద నోట్ల రద్దు అంటే రహస్యం కనుక ఆకస్మికంగా చేశారని అనుకుందాం. వాక్సిన్ విధానం అలాంటిది కాదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చీమకుట్టలేదు. సుప్రీం కోర్టు స్వయంగా పూనుకున్న తరువాత కూడా స్పర్శలేనట్లుగానే వ్యవహరించారు. తీరా గట్టిగా నిలదీసి కేటాయించిన 35వేల కోట్లు ఏం చేశారో చెప్పాలంటూ గడువు పెట్టటంతో మరోదారి లేకపోయింది. మోడీ స్వయంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్ణయాన్ని ప్రకటించేశారు. మంత్రులను రబ్బరు స్టాంపులుగా మార్చివేశారు. తొలుత ప్రకటించిన దానికీ దానికీ మంత్రి వర్గ ఆమోదం లేదు, దీనికీ అవసరం ఏముంది అంటారా ?
తామేం చేసినా ప్రశ్నించేవారు లేరు, ఉండకూడదు, ప్రతిపక్షాలను లెక్కచేయాల్సిన అవసరం లేదు అనే యావలో పడిన బిజెపి పెద్దలకు ఈ మధ్య వాస్తవ పరిస్ధితులు అర్ధం కావటం లేదు. కరోనా రెండవ దశ నిర్లక్ష్యంతో తలెత్తిన పరిస్ధితి మీద వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఉంటే వాక్సిన్ విధానంలో ఇంత షాక్ తగిలి ఉండేది కాదు. నిజానికిది కరోనా కంటే పెద్ద దెబ్బ. సుప్రీం కోర్టు వాక్సిన్ విధానం గురించి ఇలా నిలదీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో చేసిన నిర్ణయాలకే విధానం అనే ముద్రవేసి కోర్టుకు సమర్పించి ఉంటే రాజ్యాంగబద్దమా కాదా అన్నది చూస్తాం తప్ప విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని న్యాయమూర్తులు చెప్పి ఉండేవారేమో ! కానీ ఇది ఎవరో వేసిన కేసు కాదు, స్వయంగా చేపట్టిన అంశం. యాభై ఆరు అంగుళాల గుండె పిరికిబారినట్లుంది. లేకపోతే కోట్లాది భక్తులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రుల పరువు తీస్తూ ఇలాంటి ప్రకటన ఎందుకు చేస్తారు అన్న అనుమానాలు కలగటం సహజం కాదంటారా ?
మరి ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాలా వద్దా ? స్వాగతించాల్సిందే. కేంద్రమే వాక్సిన్ బాధ్యత చేపట్టాలని, మూడు ధరల విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేసిన వారు తప్పకుండా ఆ పని చేస్తారు, చేశారు.అయితే స్వాగతించటానికి – భజన చేయటానికి తేడా ఉంది. బిజెపి ముఖ్యమంత్రులకు భజన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అలా చేస్తే జనం దృష్టిలో మరింత పలుచన అవుతారు. నలభైఅయిదు సంవత్సరాల లోపు వారికి వాక్సిన్ గురించిన నిర్ణయం రాష్ట్రాలకే వదలి వేయాలని డిమాండ్ చేశారని చెబుతున్న బిజెపి ముఖ్యమంత్రులు, ఆ వాదనలతో కొండెక్కి కూర్చున్నవారు ఏ నోటితో స్వాగతిస్తారు, ఏ ముఖాలతో దిగివస్తారు ? కేంద్ర వాక్సిన్ విధానం గురించి విమర్శలు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ నాలుగుసార్లు ఏలుబడిలో ఉన్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వారం రోజుల క్రితం ఏం మాట్లాడారు ? ” ఎంతో చక్కటి, పక్కాగా ఉన్న కేంద్ర వాక్సిన్ విధానాన్ని రాష్ట్రాల వత్తిడి మేరకే కేంద్రం మార్చింది. ముఖ్యమంత్రులందరూ ఒక దగ్గరకు వచ్చి కేంద్రీకృత విధానం కావాలని ప్రధానిని కోరితే ఆయన కూడా పరిశీలిస్తారు.రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నపుడు కేంద్రం కూడా ఒకే రకమైన విధానాన్ని తీసుకురాలేదు, అందుకే రాష్ట్రాలకు వదిలిపెట్టింది ” అన్నారు. మా వాక్సిన్ మేం కొనుక్కుంటాం అని బిజెపి ముఖ్యమంత్రులు చెప్పారు. కాదు కేంద్రమే మొత్తంగా ఇవ్వాలి లేదా సేకరించి ఒకే ధరకు రాష్ట్రాలకు ఇవ్వాలి తప్ప ద్వంద్వ ధరలేమిటని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చెప్పారు. ఎద్దు-దున్నతో అరక కడితే ఏమౌతుంది. ఎండ ముదిరే కొద్దీ ఎద్దు నీడవైపు లాగుతుంది-దున్న ఎండవైపు మొగ్గుతుంది. అలాగే భిన్న వైఖరుల మధ్య ఏకాభిప్రాయం ఎలా సాధ్యం ? అప్పుడు కేంద్రం ఏమి చేయాలి, ధర చెల్లించగలిగిన రాష్ట్రాలు కొనుక్కోవచ్చు, మాకంత శక్తిలేదు అని అన్నవారికి మేమే ఇస్తామని చెప్పాలి. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వ పధకం దాన్ని అమలు జరపాలా లేదా అన్నది రాష్ట్రాలకే వదలి వేసినట్లు వాక్సిన్ విషయంలో ఎందుకు చేయలేకపోయింది. దురుద్ధేశ్యాన్ని కడుపులో పెట్టుకొని కొన్ని రాష్ట్రాల పేరుతో ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరి ఇప్పుడు ఆ పక్కా పధకం ఏమైంది ? రాష్ట్రాలతో సంప్రదించకుండానే ప్రధాని ఏకపక్షంగా ఎలా ప్రకటించారు. మేమే కొనుక్కుంటాం అన్న రాష్ట్రాల మనోభావాలను గాయపరచి, ముఖ్యమంత్రులను అవమానించినట్లు కాదా ?
ఐదూండ్లు కాదు కదా సూదిమొన మోపినంత కూడా ఇచ్చేది లేదన్న రారాజు మాదిరి గత కొన్ని వారాలుగా భీష్మించిన విశ్వగురువు ఆకస్మికంగా అందరికీ మేమే వేయిస్తాం అని ఎందుకు చెప్పారు? ఇది వైఫల్యాన్ని అంగీకరించటమే, పోనీ ఆ చెప్పిందైనా సక్రమంగా ఉందా ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా లేదూ ! పోయిన పరువును తిరిగి తెచ్చుకొనే యత్నమన్నది ఏకాభిప్రాయం. అంటే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? రారాజు దిగి వచ్చారు సరే, మంచిదే , మళ్లా 25శాతం ప్రయివేటు ఆసుపత్రులద్వారా వేయించుకోవచ్చనే పితలాటకం ఏమిటి ? ఫార్మా, కార్పొరేట్ మాఫియాకు లాభాలు చేకూర్చే ఎత్తుగడ అనే విమర్శలను ఎందుకు భరిస్తున్నారు. వారిచ్చే నిధుల ముందు విమర్శలు ఒక లెక్కా ?
ఉచితంగా ఇస్తామనే ప్రకటన హుందాగా చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు, ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. ప్రధాని స్వయంగా రాష్ట్రాల మీద నెపం మోపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేవీ వాక్సిన్ సేకరణ తమకు వదిలేయాలని అడగలేదు. చివరకు బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్ నుంచి కూడా అలాంటి డిమాండ్ లేదు. సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఊపిరి సలుపుకోలేక తప్ప చిత్తశుద్ది లేదు.గతంలో వాక్సిన్ వేసి నందుకు వంద రూపాయల సేవా రుసుం ప్రయివేటు ఆసుపత్రులు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు దాన్ని 150కి పెంచారు. ఇంతలోనే ఇంత పెంపుదల ఎందుకు ? అదనపు ఖర్చులు ఆసుపత్రులకు ఏమి వచ్చాయి ?
నరేంద్రమోడీ దిగిరావటం వాక్సిన్‌కంటే ముందే ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ కుంభమేళాను మధ్యలో ఆపివేయాలనటం అదే కదా ? అంతకు ముందు అనేక మంది కరోనా నిబంధనలను ఉల్లంఘించి లక్షలాది మందిని సామూహిక స్నానాలకు అనుమతించటం ప్రమాదకరం అని హెచ్చరిస్తే పెడచెవిన పెట్టారు. మొరటుగా ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు జనాన్ని మునగమని చెప్పారు. తీరా కొందరు అఖారాలు మరణించటం, కరోనా సోకటం, మీడియాలో వార్తలు రావటంతో విధిలేక ప్రధాని మోడీ జోక్యం చేసుకొని నిలిపివేయించారు.
కరోనా మొదటి తరంగం సమయంలో జనానికి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టారు, రెండోసారి వాటి ఊసే లేదు. లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలివేసి పర్యవసానాలకు బాధ్యత తమదేమీ లేదన్నట్లు వ్యవహించారు. అందుకే రెండో సారి దీపాలు వెలిగించటం, గ్లాసులు,కంచాలు మోగించటం వంటి పిలుపులకు దూరంగా ఉన్నారు. కానీ వాక్సిన్ భారాన్ని రాష్ట్రాల మీద మోపాలన్న ఎత్తుగడ పారకపోగా వికటించింది.మోడీ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని అతిశయోక్తులు పలికి మునగ చెట్టు ఎక్కించిన వారికి కరోనా రెండవ దశ తీవ్రతను గుర్తించటంలో వైఫల్యాన్ని చూసి దిమ్మతిరిగినోట మాట రావటం లేదు.
ఆత్మనిర్భర పాకేజ్ కింద మేడిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు వ్యాక్సిన్లు తయారు చేసి దేశ ప్రజలకు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇది వాస్తవమా ? కోవాగ్జిన్ ఒక్కటే మన దేశంలో తయారు చేసిందని జనానికందరికీ తెలిసిందే. అనేక మంది అది స్వదేశీ అని మరొక వ్యాక్సిన్ వేసుకోము అని ఆలస్యం చేసిన వారు కూడా ఉన్నారు. కోవీషీల్డ్ విదేశీ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారీ, కంపెనీ అనుమతితో ఇక్కడ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అయినా రెండు వాక్సిన్లు ఇక్కడే రూపొందించినట్లు చెప్పటం భావ్యమేనా ? జనాన్ని మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ?
వాక్సిన్ల విముఖతను విడనాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి కాషాయ దళాలు చెబుతున్నదేమిటి ? ఆవు పేడ పూసుకొని మూత్రం తాగితే కరోనా అంటదనే వీడియోలను ప్రపంచమంతా చూసింది. తాజాగా బిజెపి ఎంపీ, అలనాటి హీరోయిన్ హేమమాలిని కరోనా నుంచి రక్షణకు హౌమాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందే అనేక మంది చేశారు. స్ఫూర్తికోసం ప్రధాని దీపాలు వెలిగించమని కోరితే దాంతో కరోనాను నాశనం చేయవచ్చని ప్రచారం చేసిన ప్రబుద్దులు ఉన్నదేశం మనది, గో కరోనా గో కరోనా అంటూ భజనలు చేయించిన పెద్దలున్నారు. గంగలో మునిగితే కరోనా అంటదు అని ప్రబోధించిన వారి గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలన్నింటీని ప్రోత్సహించటంలో అన్ని మతాలూ ఒకటిగానే ఉన్నాయి, ప్రోత్సహించాయి.జనాభా రీత్యా చూస్తే వాక్సిన్‌కు విముఖత చూపితే ఎక్కువగా నష్టపోయేది నూటికి 80శాతంగా ఉన్న మతానికి చెందిన వారే. మరి హిందూత్వ శక్తులు ఇంతగా మూఢత్వాన్ని ఎందుకు ఎక్కించినట్లు ? ఇప్పుడు ఒక్క మాటతో దాన్ని పోగొట్టుకోమంటే అంత తేలికగా మత్తు దిగుతుందా ?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలు దిమ్మతిరిగేట్లు చేస్తే , ఉత్తర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యమైనవి కాదు. ప్రధాని వారణాసి జిల్లాలోనే బిజెపి బొక్కబోర్లా పడింది. రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చిన కారణంగానే వికేంద్రీకరణ విధానాన్ని ప్రకటించామని, ఇప్పుడు కొన్ని అనేక రాష్ట్రాలు తిరిగి కేంద్రీకరణ విధానాన్ని డిమాండ్ చేస్తున్నాయని మోడీ చెప్పారు.మీడియాలో కొన్ని తరగతులు కూడా ఈ డిమాండ్ గురించి ప్రచారం చేశాయి. ఇతర దేశాలు పని ప్రారంభించక ముందే మన దేశంలో శాస్త్రవేత్తలు, తయారీదార్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ఇది అతిశయోక్తి, అర్ద సత్యం తప్ప ప్రధాని నోటి నుంచి రావాల్సింది కాదు.
గత కొద్ది వారాలుగా చర్చలను చూసినపుడు కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉంది. దేశంలో వాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు లేక సీరం సంస్ద ఉత్పత్తి నిలిపివేసిన విషయం తెలుసు, భారత్‌బయోటెక్ ఉత్పత్తి సామర్ధ్యం తక్కువనీ తెలిసినా రాష్ట్రాలు వాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని, అవసరమైతే దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర పెద్దలు ఎలా భావించారు.ఇతర వాక్సిన్ల తయారీకి అవసరమైన పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేసింది. విదేశీ కంపెనీలు వాక్సిన్ల సరఫరాకు పెట్టిన షరతులకు అంగీకరించటమా లేదా అన్నది నిర్ణయించాల్సింది కేంద్రం అయినపుడు దిగుమతులు ఎలా చేసుకుంటాయని భావించారు. కొన్ని రాష్ట్రాల టెండర్లకు ఎలాంటి స్పందన లేదని తెలిసి కూడా కేంద్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించిందా లేదా ? ఒకే వాక్సిన్‌కు వివిధ ధరలకు అనుమతించిన విధాన హేతుబద్దతు ఏమిటి ? మిగతా దేశాల మాదిరి తగినంత ముందుగా వాక్సిన్ల కోసం కేంద్రం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు. ప్రభుత్వ రంగంలోని వాక్సిన్ తయారీ సంస్ధల గురించి ముందుగానే ఎందుకు కేంద్రం పరిశీలన జరపలేదు. కరోనా మహమ్మారి ప్రారంభమై ఏడాది గడచిన తరువాత దాన్ని జాతీయ సమస్యగా చూడాలా, రాష్ట్రాల పరిధిలో ఆరోగ్య సమస్యగా పరిగణించాలా అన్న చర్చ కేంద్రం వైపు నుంచి ఎందుకు జరపలేదు. ఆరోగ్యం గురించి రాజ్యాంగంలో ఉంది తప్ప మహమ్మారులను ప్రత్యేక అంశంగా పరిగణించాలని పేర్కొనలేదా ? జాతీయ విపత్తుల యాజమాన్య చట్టానికి అర్దం ఏమిటి ?
గతేడాది కరోనా పేరుతో 21లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి ప్రకటించామని ఊరూ వాడా ప్రచారాన్ని ఎలా అదరగొట్టారో చూశాము. నరేంద్రమోడీ గడ్డం ఎందుకు పెంచుతున్నారో తెలియనట్లుగానే ఆ పాకేజి ఏమిటో దాని వలన సామాన్య జనానికి కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. అన్ని లక్షల కోట్లు ప్రకటించినపుడు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు పెట్టి వాక్సిన్లు వేయించలేని దుస్ధితిలో మోడీ సర్కార్ ఉందా ? వాక్సిన్లకోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పద్దెనెమిదేండ్లు పైబడిన అందరికీ వేస్తే అదనంగా మరో పదివేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఈ మాత్రం భరించలేని స్ధితిలో కేంద్రం ఉందా ? లేదూ పిల్లలకూ వేస్తే మరొక పదివేల కోట్లు అవుతుంది, మరొక అంచనా ప్రకారం 80వేల కోట్లతో అందరికీ వేయించ వచ్చు, 138 కోట్ల మందికి ఆ మాత్రం ఖర్చు చేయలేరా ? ఐదులక్షల కోట్ల జిడిపి లక్ష్యమైనా, మరొకటైనా దేనికోసం ? అంబానీ, అదానీలకు కట్టబెట్టటానికా ? ఎందుకీ కక్కుర్తి పనులు ? ఇంతచిన్న తర్కాన్ని కూడా సలహాదారులు,మంత్రులు ఆలోచించే స్ధితిలో లేరా లేక చెబితే వినే పరిస్ధితి లేదా ? మోడీ సర్కార్‌ను తెరవెనుక నుంచి నడుపుతున్న సంఘపరివార్ మేథావులకు సైతం ఇది ఎందుకు తట్టలేదు ?