Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !