ఎం కోటేశ్వరరావు
మన జనాల సహనానికి (బి పాజిటివ్ వైఖరి) ముందుగా శతకోటి నమస్కారాలు చెప్పక తప్పదు. భరతమాత ఆమెను పక్కకు నెట్టేసి పెత్తనం చేస్తున్న గోమాత మహత్తులో, నరేంద్రమోడీ గమ్మత్తులో గానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్ధిరంగా ఉన్న చమురు ధరలు అదేమిటో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచీ పెరుగుతూనే ఉన్నాయి. అనేక దేశాల్లో చమురు ధరల పెంపు ఉద్యమాలకు దారితీసి పాలకులను గడగడలాడించింది, వెనక్కు తగ్గేట్లు చేసింది. మన జనం సహనంతో ఇంతగా సహకరిస్తున్నా ఖాతరు చేయటం లేదు. జనాన్ని వెర్రివెంగళప్పలుగా భావిస్తున్నారు కొందరు, అయినా భరిస్తున్నాం, మన మీద మనకే జాలి వేస్తోంది కదా ! సామాజిక మాధ్యమాల్లో కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఊరూ పేరూ లేకుండా కొన్ని పోస్టులు తిప్పుతున్నారు. భవిష్యత్ కోసమే నరేంద్రమోడీ చమురు బాదుడు కొనసాగిస్తున్నారంటూ రంగుల కలను చూపుతూ జనాన్ని తప్పుదారి పట్టించే పోస్టు ఒకటి తిరుగుతోంది. దాని మంచి చెడ్డలను, ముఖ్య అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించుదాం.
” మీ చుట్టూ జరుగుతున్న మార్పులను మీరు నిశితంగా గమనిస్తే, ఇది అందరి వల్ల కాదు. మోడీ ప్రభుత్వం మీ కోసం మరియు మీ సౌలభ్యం కోసం ఏమి మన భవిష్యత్ తరాల కోసం ఏమి చేస్తుందో మీకు అర్థం అవుతుంది.”
ఏ పాలకులైనా వర్తమాన, భవిష్యత్ తరాలకోసమే తప్ప గతించిన వారికోసం చేయరు. వర్తమానం వాస్తవం, భవిష్యత్ ఆశ. అందువలన ఇప్పుడు ఏమి చేస్తున్నారనేది కీలకం. జనాలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మోడీ ఇంకా కొనసాగుతున్నారు గనుక ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది, ఏమి చేస్తున్నదీ చెప్పకుండా పిట్టల దొర లేదా తుపాకీ రాముడి కబుర్ల వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు తల్లికి కూడు పెట్టని వాడు రేపు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తానంటే నమ్మగలమా ? పది రూపాయల నుంచి 33 రూపాయలకు పెంచిన చమురు ఎక్సయిజు పన్ను నిర్వాకం గురించి చెప్పతరమా ? దేశమంతటికీ ఉచితంగా వాక్సిన్లు వేయించేందుకు సిద్దపడని పెద్దలు పెద్దలు మహమ్మారి నివారణ, నిరోధానికి ఉపయోగపడే పరికరాలు, వాక్సిన్లపై జిఎస్‌టి ఎత్తివేసేందుకు గీచిగీచి బేరాలాడుతున్నారు. అలాంటి వారు డబ్బుదా(దో)చి రాబోయే వారికి ఖర్చు చేస్తారంటే నమ్మాలట !
గతంలో బిజెపి పెద్దలు చేసిన హడావుడి గురించి మరిచిపోతే ఎలా !
” పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై మన చుట్టూ చాలా మంది హడావిడి చేస్తారు ఎందుకంటే వారికి భారత్ భవిష్యత్ ఎలా. వున్నా ఈ పుట గడిస్తే చాలు సరే ఆ విషయాలు పక్కన పెడితే…”
ఇదొక తప్పుడు ప్రచారం ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో స్మృతి ఇరానీ సిలిండర్లు వేసుకొని చేసిన ప్రదర్శనలు, బిజెపి నేతలు చేసిన ఆర్భాటాలూ జనానికి తెలుసు. కాస్త ఓపిక తెచ్చుకొని గూగులమ్మను కోరుకుంటే వాటన్నింటినీ భక్తా ఇంద అంటూ వారి నాటకాల చిత్రాలు, వార్తలను మన ముందు ప్రత్యక్షం చేస్తుంది. మోడీ అనుచరుల బండారాన్ని బయటపెడుతుంది. గతంలో ఆందోళన చేసినపుడు ఈ పెద్దలకు భారత భవిష్యత్ గురించి తెలియదా లేక శ్రద్దలేదా ? పోనీ ఎందుకు ఆందోళన చేశారో అయినా చెప్పాలి. చిత్తశుది,్ద నిజాయితీ లేని రాతలు, ఆరోపణలు.
మోడీ నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న రోజుల నుంచే శుభ్రమైన చమురు !
” ప్రస్తుతం ప్రపంచంలోనే పరిశుభ్రమైన యూరో 6 గ్రేడ్ పెట్రోల్ ఈ రోజు భారతదేశంలో దొరుకుతోంది.”
ఇది ఎలా ఉందంటే అరే పాతికేండ్ల క్రితం నువ్వు పుట్టినపుడు చాలా చిన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎంత ఎత్తు, బరువు పెరిగావో గ్రేట్ కదా అన్నట్లుంది. పుట్టినోళ్లు ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటారు ! పెట్రోలు, డీజిలు వాడకం పెరుగుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నందున ప్రతి దేశం, ప్రతి ఖండం దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది.ఇదేదో నరేంద్రమోడీతోనే దేశంలో ప్రారంభమైందన్నట్లుగా నమ్మబలుకుతున్నారు. ఆ పెద్దమనిషి నిక్కర్లు వేసుకొని(ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా) తిరుగుతున్న రోజుల్లోనే అంటే 1990దశకంలోనే ఇంధన శుద్ధి కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. 1994లో ఢిల్లీ, ముంబై, కొల్‌కతా, చెన్నరు నగరాల్లో తక్కువ సీసం ఉండే పెట్రోలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సీసం, గంధకం వంటి వాటిని తగ్గించటానికి, తొలగించటానికి మన చమురు శుద్ది కర్మాగారాల్లో మార్పులు చేసుకోవాలి, దానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ఇప్పటికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలు 95వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అన్నింటికీ మించి అలాంటి చమురును వాడే విధంగా వాహనతయారీదారులు కూడా ఇంజన్లలో మార్పులు చేయాలి.ఇవన్నీ మంత్రదండాలతో జరిగేవి కాదు.యూరో-3కు సమానమైన భారత్-3 రకం చమురు 2010 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఆరో గ్రేడ్‌కు వచ్చాము. ఇది మనవంటి అన్ని దేశాల్లోనూ ఉంది. ఇది నరేంద్రమోడీ గొప్ప అని చెబితే జనాలకు దేనితో నవ్వాలో అర్ధం కావటం లేదు. ఏ గ్రేడ్ అయినా దాని ఉత్పత్తి ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసేదే తప్ప రాయితీలేమీ లేవు కదా. దాన్ని బట్టే ఉత్పాదక ఖర్చు నిర్ణయిస్తున్నారు. పోనీ చమురు సంస్దలకు ప్రభుత్వం 95వేల కోట్లు ఇస్తే అది మోడీగారి ఘనత అని చెప్పుకుంటే అర్ధం ఉంది. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జనం సొమ్ముతో మోడీకి ప్రచారం అంటే ఇదే.
ముందేం మాట్లాడుతున్నారో తరువాతే చెబుతున్నారో స్పృహ ఉందా !
” పెట్రోల్ మరియు డీజిల్‌పై మొత్తం పన్నులో 71% రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది, కేంద్రానికి 29% మాత్రమే లభిస్తుంది.”
తిమ్మిని బమ్మిని చేయటంలో కాషాయ దళాలకు మించిన మాయగాండ్లు మరొకరు లేరు. సముద్రాలున్నయన్న దగ్గర ఎడారి ఉంటుంది. ఏడు సంవత్సరాల మోడీ ఏలుబడిలో పెట్రోలు మీద లీటరుకు రు.10.38 నుంచి రు. 32.98( రెండు వందల శాతం)డీజిలు మీద రు.4.58 నుంచి రు.31.83 (600శాతం) పెంచింది. రాష్ట్రాలు పెంచిన మొత్తం ఈకాలంలోనే 60, 68శాతాలకు అటూ ఇటూగా ఉన్నాయి తప్ప ఎక్కడా వందల రెట్లు పెరగలేదు. కేంద్రం పెంచిన దానిలో ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 41శాతం తిరిగి రాష్ట్రాలకు బదలాయిస్తారు, అందువలన మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటాయే ఎక్కువ అని వాదిస్తారు. ఇక్కడే అసలు మోసం ఉంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి ఏలుబడిలోనే ఉన్నాయి కదా ? ఎన్ని రాష్ట్రాలు, ఎంత మొత్తం పన్నుతగ్గించాయో ఎవరినైనా చెప్పమనండి. కేంద్రం ఎక్సయిజ్ పేరుతో విధించే పన్నులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్సయిజ్, రెండవది సెస్. మొదటిదానిలో మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది. సర్‌ఛార్జీలు, సెస్‌లో ఉండదు.
ఇలాంటి జిమ్మిక్కుల కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం. తమ నేత అతల్ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి , రోడ్లను ఉపయోగించినందుకు టోలు పన్ను వసూలుకూ నాంది పలికారు. మన దగ్గర నుంచి వసూలు రోడ్లు వేసి మన చేతనే పన్ను కట్టిస్తున్నారు. ఎంత మోసం ?
ప్రస్తుతం ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్ పన్ను(బెడ్) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్ పన్ను(సీడ్) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది.
” మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సరఫరాను వేగవంతం చేయటానికి మొబైల్ రీఫిల్లింగ్ యూనిట్ నడుస్తోంది. ”
వీటితో జనానికి ఒరిగేదేమిటి ? జొమాటో, స్వీగ్గీ వంటి కంపెనీల ద్వారా తెప్పించుకొనే ఆహారానికి ఎక్కువ వెల చెల్లించాలి. అలాగే వీటికీ అదనంగా సేవా రుసుము చెల్లించాలి. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో గతంలో కిరోసిన్ డీలర్లు చిన్న పీపాల్లో తెచ్చి వినియోగదార్లకు అందించేవారు. ఇది అలాంటిది కాదు, కనీసం రెండు వందల లీటర్లు, అంతకు మించి ఆర్డరు పెట్టిన వారికే అందచేస్తారు, అందుకు ఛార్జీ వసూలు చేస్తారు. ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమా ?
” ఇవే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం తన పదవీకాలంలో తీసుకున్న 2026 నాటికి చెల్లించవలసి ఉన్న 2.48 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ రుణం కూడా మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ”
ఇది హిమాలయమంత పచ్చి అబద్దం, జనాన్ని మోసపుచ్చే వ్యవహారం. ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. 2010వరకు అంతకు ముందున్న వాజ్‌పారుతో సహా ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయి. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.
2002-03 సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇలా చెప్పారు.” కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది వక్రీకరణ. వినియోగదారుల మీద వడ్డించే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరో విధంగా చెప్పాలంటే గతంలో వినియోగదారులు పొందిన సబ్సిడీ మొత్తాలను ఇప్పుడు వారి నుంచి మోడీ సర్కార్ తిరిగి వసూలు చేస్తోంది. లేదూ మంత్రి చెప్పిందే నిజమైతే, అప్పు తీరింది కదా పన్ను ఎందుకు తగ్గించటం లేదు ? అసత్యాలను చెప్పటంలో కాషాయ దళం ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ?పన్నులు పెంచకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుందని ఒకసారి అంటారు, సరిహద్దు రక్షణకు పన్నులేయకపోతే ఎలా అని మరోసారి సెంటిమెంట్ రెచ్చగొడతారు. ఇవన్నీ మోడీ పాలనలోనే కొత్తగా వచ్చిన సమస్యలా ?
” పెట్రోల్ లో 2025 నాటికి 20% దేశీయ ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 5 లేదా 10 సంవత్సరాల్లో, హైబ్రిడ్ వాహనాలు అందుబాటులో రానున్నాయి, ఇవి 100% పెట్రోల్, డీజిల్, ఇథనాల్, సిఎన్జి మరియు బ్యాటరీపై నడుస్తాయి.
సాధారణ పెట్రోల్ బుంకుల వద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలో తొలిసారిగా విద్యుత్ రహదారిని నిర్మించబోతున్నారు. కొన్ని సంవత్సరాలలో, రోడ్ రైల్ ట్రక్కులు కూడా భారతదేశ రహదారులపై పరుగులెత్తనున్నాయి. ఎల్‌పిజి గ్యాస్‌ను దేశవ్యాప్తంగా ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా అందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. డీజిల్ ట్రాక్టర్‌ను సిఎన్‌జి ట్రాక్టర్‌గా మార్చడానికి కిట్ వచ్చింది. దీంతో డీజిల్ కోసం ఖర్చు చేసే రైతులకు వేల రూపాయల ఆదా అవుతుంది. హైడ్రోజన్ ఇంధన బ్యాటరీలు మరియు అల్యూమినియం ఎయిర్ బ్యాటరీల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై భారతదేశంలో వేగంగా పరిశోధన మరియు అభివ ద్ధి జరుగుతోంది. ఇది కొత్త భారత్ యొక్క భవిష్యత్తు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆగమనంతో, మనము క్రమంగా పెట్రోల్ మరియు డీజిల్‌పై ఆధారపడవలసిన అవసరం వుండదు. రాబోయే పదేళ్లలో ఇవన్నీ జరగబోతున్నాయి.ఇవన్నీ మన సౌలభ్యం కోసం భవిష్యత్ కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇందనాల పై వస్తున్న కేంద్ర 29% పన్నుల ద్వారా మౌలిక సదుపాయాల అభివ ద్ధి, సైనిక దళాల ఆధునీకరణ సశక్తికరణ సాధికారత మొదలైన వాటిపై ఖర్చు జరుగుతున్నాయి. ”
ఇవన్నీ చేస్తున్నాం, చేయబోతున్నాం కనుక జనం మీద ఎంత పన్ను భారం మోపినా నోరు మూసుకొని చెల్లించాలి అని చెప్పటమే. రాజీవ్ గాంధీ దేశాన్ని కొత్తశతాబ్దంలోకి తీసుకు పోబోతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 అన్నారు. కేబుల్ టీవీ రాక ముందు విదేశాల్లో చూసివచ్చి సెటప్‌బాక్సుల గురించి వాటి ద్వారా కొన్ని వందల ఛానళ్లు రావటం గురించి కథకథలుగా చెప్పారు. అందువలన నవీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరున్నా లేకపోయినా ఆగేది కాదు. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు అచ్చేదిన్ అన్నారు, గుజరాత్ తరహా అభివృద్ధి అన్నారు. అవన్నీ ఎక్కడా కానరావటం లేదు గనుక ఇప్పుడు కొత్త కహానీలు వినిపిస్తున్నారు.