Tags
anti china, Anti China Propaganda, Indo-China trade, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue
ఎం కోటేశ్వరరావు
లడఖ్ సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత్-చైనా ఘర్షణ జరిగి ఏడాది గడిచింది. మనవైపు 20 మంది మరణించగా తమవారు నలుగురు చనిపోయినట్లు చైనా చెప్పింది. అది ఒక బాధాకరమైన, అవాంఛనీయ ఉదంతం. సాధారణ పరిస్ధితులను పునర్దురించాలని ఇరుదేశాలూ సంకల్పం ప్రకటించాయి, చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయినా ఒకరి మీద ఒకరికి అనుమానాలు తొలగలేదు. అందుకే ఉభయులూ కొన్ని చోట్ల బలగాలను కొంత మేరకు ఉపసంహరించుకున్నా, పూర్తిగా వైదొలగలేదు. చైనా వైపు నుంచి బలగాలను మోహరిస్తున్నారని మన మీడియాలో, మనమూ అదే పని చేస్తున్నామని చైనా ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఏడాది గడచిన సందర్భంగా ప్రపంచ మీడియాలోనూ దాని గురించి రాశారు.
బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక జూన్ ఎనిమిదవ తేదీన రాసిన వార్తలో కొత్త వివాదాలు తలెత్తుతాయనే భయంతో భారత్ సరిహద్దుల్లో మిలిటరీ బలగాలను పటిష్ట పరుస్తున్నదని పేర్కొన్నది. వేసవి కాలం వచ్చినందున రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగే పెద్ద ముప్పు ఉన్నట్లు రష్యా పత్రిక ఇండిపెండెంట్ పేర్కొన్నది. ఈ పత్రికల వార్తలను ప్రస్తావిస్తూ అనేక పత్రికలు విశ్లేషణలు రాశాయి.కరోనా వైరస్, ఆర్ధిక రంగంలో వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించవచ్చని చైనా విశ్లేషకులు చెప్పిన అంశాలను చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్ ప్రచురించింది. ” యుద్దం రాదు, అయితే 2020 మేనెలలో సంక్షోభం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంది, ఉభయపక్షాలూ పోరుకు ఎంతో సన్నద్దంగా ఉన్నాయి ” అని ఆసియా రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు అర్జన్ తారాపోర్ చెప్పినట్లు టెలిగ్రాఫ్ రాసింది. కరోనా మహమ్మారి, ఆర్ధిక పరిస్ధితి మరింతగా దిగజారితే సరిహద్దుల్లో భారత్ మరో ఘర్షణకు పాల్పడవచ్చని షాంఘైలోని సామాజిక అధ్యయనాల సంస్ధ అంతర్జాతీయ సంబంధాల విభాగపు పరిశోధకుడు హు ఝియాంగ్ చెప్పారు.దేశీయంగా సంక్షోభం ఉన్నపుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పుడూ సరిహద్దు సమస్యలవైపు చూసే రాజకీయ సంప్రదాయం భారత్‌కు ఉందని, ఈ విషయమై చైనా చాలా జాగ్రత్తగా ఉండాలని హు చెప్పాడు.
ఎక్కువ భాగం సైన్యాలను రెండు దేశాలూ ఉపసంహరించుకున్నాయి. హాట్‌స్ప్రింగ్స్, డెస్పాంగ్ మైదానాల వంటివాటి నుంచి ఇంకా జరగాల్సి ఉందని సింఘువా విశ్వవిద్యాలయంలోని జాతీయ వ్యూహ సంస్ధ డైరెక్టర్ క్వియాన్ ఫెంగ్ చెప్పారు.సరిహద్దు వెంబడి చైనా మౌలిక సదుపాయాలు చక్కగా ఉన్నాయి,అయినప్పటికీ ముందు పీఠీన అక్కడ ఎక్కువ దళాలు లేవు, రెండవ వరుసలో బలాలను మోహరించాల్సి ఉందని క్వియాన్ చెప్పారు. వివాదం చిన్నదే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే సరిహద్దులో పరిస్దితి ఎంతో మెరుగ్గా ఉంది, అయితే ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగితే రెండు దేశాల మిలిటరీ మధ్య సంబంధాలకు, పశ్చిమ సరిహద్దులో స్ధిరత్వానికి ముప్పు అని కొందరు అభిప్రాయపడ్డారు. సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో చైనా తన దళాలం సంఖ్యను పెంచిందని కొన్ని వార్తలు సూచించాయి. భారత-చైనా నేతలు జనాలకు జవాబుదారీ కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోగలరని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించాడు. మే నెలలో జరిగిన కీలక ఎన్నికలలో ఓటమి తరువాత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి వచ్చే ఎన్నికల్లో మద్దతు పొందాలని చూస్తోందని గ్లోబల్‌టైమ్స్ వ్యాఖ్యాత పేర్కొన్నారు.
రెండు దేశాల సైన్యాల ఉపసంహరణకు రెండు రోజుల ముందు చైనా నుంచి బెదిరింపులు ఉన్నందున ఇండో – పసిఫిక్ అవగాహనను మరింత పటిష్టపరుచుకోవాల్సిఉందని ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అంగీకరించినట్లు ప్రకటించారు.ఇరు దేశాల సంబంధాలు చౌరాస్తాలో ఉన్నాయి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం సహకారం గురించి ఆలోచించలేమని మన విదేశాంగ మంత్రి జైశంకర్ మేనెలలో వ్యాఖ్యానించారు. పరిస్ధితి ఇలా ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి-మే మాసాల మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం డాలర్ల విలువలో చూస్తే 70.1శాతం జరిగినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 64.1 పెరిగితే, భారత్ నుంచి చైనా దిగుమతుల 90.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2020 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 86.4 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. తిరిగి అమెరికాను వెనక్కు నెట్టేసి మన దేశం చైనాతో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించింది. ఈ ఏడాది తొలి ఐదునెలల్లో 48.16బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు చైనా కస్టమ్స్‌శాఖ వద్ద జూన్ ఏడవ తేదీనాటికి నమోదైన వివరాలు వెల్లడించాయి. గతేడాది జరిగిన సరిహద్దు వివాదాలు చాలా వరకు వెనక్కు పోయినట్లు అసాధారణ వాణిజ్య లావాదేవీలు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో చైనా 63 బిలియన్ డాలర్ల మేరకు మిగుల్లో ఉంటే 2020-21లో అది 44 బిలియన్ డాలర్లుగా నమోదైంది.మన ఎగుమతులు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.
ఒక వైపు చైనాను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పడిన చతుష్టయ బృందంలో అమెరికా, జపాన్,ఆస్ట్రేలియా,మన దేశం ఉన్నప్పటికీ మరోవైపున వాణిజ్యంలో మన దేశం చైనాతో ప్రధమ స్దానంలో ఉంది. వాణిజ్యం గురించి చర్చిందేందుకు మేము సిద్దమే అని ఆస్ట్రేలియా ప్రకటించింది. అమెరికా వైపు నుంచి కూడా అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. సరిహద్దు వివాదాలకు వాణిజ్యానికి లంకె పెట్టవద్దని చైనా చెబుతున్నది. అయితే చైనా వస్తువులను బహిష్కరించాలని, చైనా మన శత్రువు, ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఒకవైపున ప్రచారంతో జనాన్ని సంతృప్తి పరుస్తున్నారు. మరోవైపు అదే చైనా నుంచి వస్తువుల దిగుమతులు, లాభాలతో వాణిజ్యవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ సంతుష్టులను గావిస్తున్నారు. టెలికామ్ రంగంలో ఐదవ తరం ఫోన్లను ప్రవేశపెట్టేందుకు చౌకగా ఉండే చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించి అధిక ఖర్చుతో కూడిన అమెరికా, ఐరోపాల వైపు మన దేశం చూస్తున్నది. అదే జరిగితే సెల్‌ఫోన్ ఛార్జీలు ఇంకా పెరుగుతాయి.
బీజింగ్ కేంద్రంగా పని చేస్తున్న ఆసియా మౌలికసదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబి)లో మన దేశం ఒక వాటాదారు. చైనాకు దానిలో 30.34శాతం వాటాలు ఉండగా మన దేశం 8.52, రష్యా 6.66శాతంతో రెండు, మూడు స్ధానాలలో ఉన్నాయి. చైనా వద్దుగానీ దాని డబ్బు ముద్దు అన్న విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ బ్యాంకులో మనమూ వాటాదారులమే గనుక సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ రుణం తీసుకుంటే తప్పేముందని మన అధికారులు వ్యాఖ్యానించారు. అయితే ఈ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడిబి), ప్రపంచబ్యాంకు వంటి సంస్దల నుంచి రుణాలు తీసుకుంటే ఆ పధకాలకు సభ్యదేశాల కంపెనీలన్నీ టెండర్లు వేసి పాల్గొనేందుకు హక్కును కలిగి ఉంటాయి. గతేడాది ఏడిబి రుణంతో చేపట్టిన రైల్వే ప్రాజక్టులలో చైనా కంపెనీలను అనుమతించవద్దని కొందరు పెద్ద వివాదం సృష్టించిన విషయం తెలిసినదే.
corrcet analysis
LikeLike