Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఏడు ధనిక దేశాల (జి7) బృంద 47వ వార్షిక సమావేశం జూన్‌ 11-13 తేదీలలో బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌ సముద్రతీరంలోని కారన్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి భారత్‌,ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాను ఆహ్వానించారు. ప్రతి ఏటా చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా అనేక అంశాల మీద తీర్మానాలు చేశారు, సంకల్పాలు చెప్పుకున్నారు. హడావుడి చేశారు. చైనా మీద జబ్బ చరచటం ఈ సమావేశాల ప్రత్యేకత. జి7కు భారత్‌ సహజ మిత్రదేశమని మన ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాలంద్వారా చేసిన ప్రసంగంలో చెప్పటం ద్వారా తామెటు ఉన్నదీ మరోసారి స్పష్టం చేశారు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత ధనిక దేశాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు( ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ) తమ ప్రయోజనాలను సక్రమంగా నెరవేర్చటం లేదనే అసంతృప్తి వాటిని ఏర్పాటు చేసిన దేశాల్లోనే తలెత్తింది. దాంతో వాటిని కొనసాగిస్తూనే తమ ప్రయత్నాలు తాము చేయాలనే లక్ష్యంతో 1973లో అమెరికా చొరవతో సన్నాహక సమావేశం జరిగింది. దానిలో అమెరికా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు.మీకు అభ్యంతరం లేకపోతే జపాన్ను కూడా కలుపుకుందాం అన్న అమెరికా ప్రతిపాదనకు మిగతా దేశాలు అంగీకరించటంతో జి5గా ప్రారంభమైంది.1975లో తొలిశిఖరాగ్ర సమావేశానికి ఇటలీని కూడా ఆహ్వానించారు.మరుసటి ఏడాది సమావేశంలో బృందంలో ఆంగ్లం మాట్లాడేవారు మరొకరు ఉంటే బాగుంటుందంటూ కెనడాను కూడా ఆహ్వానించాలని అమెరికా ప్రతిపాదించటంతో 1976 నాటికి జి7గా మారింది. ఈ బృంద సమావేశాలకు ఐరోపా యూనియన్ను శాశ్వత ఆహ్వానితురాలిగా నిర్ణయించారు. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత 1997లో రష్యాను జి7లోకి ఆహ్వానించి, జి8గా మార్చారు. 2014వరకు సభ్యురాలిగా కొనసాగింది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించటంతో అదే ఏడాది దాన్ని సస్పెండ్‌ చేశారు. 2018లో ఈ బృందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే 2020లో అమెరికా, ఇటలీ రెండు దేశాలూ తిరిగి రష్యాను చేర్చుకోవాలని చేసిన ప్రతిపాదనను మిగిలిన దేశాలు తిరస్కరించాయి. తమకసలు చేరాలనే ఆసక్తి లేదని రష్యా చెప్పేసింది. ఏ దేశంలో సమావేశం జరిగితే ఆ దేశం ఎవరిని కోరుకుంటే వారిని ఆహ్వానితులుగా పిలుస్తారు. మన దేశం పెద్ద మార్కెట్‌ గనుక ప్రతి దేశమూ ప్రతిసారీ మనలను ఆహ్వానిస్తున్నది.


జి7 మౌలికంగా సామ్రాజ్యవాద దేశాల కూటమి. వలసలుగా చేసుకోవటం ఇంకేమాత్రం కుదిరే అవకాశం లేకపోవటంతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఈ కూటమి దేశాలన్నీ రాజీకి వచ్చి దేశాలకు బదులు మార్కెట్‌ను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాటి మధ్య విబేధాలున్నప్పటికీ తాత్కాలికంగా పక్కన పెట్టాయి. అయితే రష్యా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారి రంగంలోకి వచ్చిన తరువాత అది కూడా తన వాటా సంగతేమిటని డిమాండ్‌ చేసింది. ద్వితీయ శ్రేణి పాత్ర పోషించేందుకు సిద్దం కాదని ప్రధమ స్ధానంలో ఉండాలని కోరింది కనుకనే జి7 మొత్తంగా దాని మీద దాడికి దిగాయి. దాన్నుంచి తట్టుకొనేందుకు వర్గరీత్యా ఒకటి కాకున్నా ప్రస్తుతానికైతే చైనాతో కలసి ఎదిరించాలని రష్యా నిర్ణయించుకుంది. ఈ కూటమి దేశాలు మన దేశాన్ని కూడా వినియోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప తమ భాగస్వామిగా చేసుకొనేందుకు సిద్దం కావటం లేదు. బ్రెజిల్‌ పరిస్ధితీ అదే.

జి7 47వ సమావేశం ఆమోదించిన అంశాలను క్లుప్తంగా చూద్దాం. వీటిలో రెండు రకాలు, ఒకటి రాజకీయ పరమైనవి, రెండవది ఆర్ధిక, ఇతర అంశాలు. మొదటిదాని సారం ఏమంటే అన్ని దేశాలు కలసి చైనా మెడలు వంచాలి, కాళ్లదగ్గరకు తెచ్చుకోవాలి. గ్జిన్‌ జియాంగ్‌, హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు, తైవాన్ను బెదిరిస్తున్నట్లు ప్రచారం చేయాలి, వత్తిడి తేవాలి. అర్ధిక అంశాలలో తప్పుడు పద్దతులకు పాల్పడుతున్నని ఊదరగొట్టాలి. రెండవ తరగతిలో కంపెనీలు పన్ను ఎగ్గొట్టేందుకు పన్నుల స్వర్గాలుగా ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నందున కార్పొరేట్‌ పన్ను కనీసంగా 15శాతం విధించాలని పేర్కొన్నాయి. పేద దేశాలకు వందకోట్ల డోసుల కరోనా వాక్సిన్‌ అందించాలి. అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ధికి తోడ్పడాలి.దానిలో భాగంగా బి3డబ్యు పధకాన్ని అమలు చేయాలి.


ఈ బృందంలో ఒకటైన బ్రిటన్‌ మన దేశాన్ని వలసగా చేసుకొని మన మూల్గులను పీల్చింది. మనం ఎదగాల్సినంతగా ఎదగకపోవటానికి అది కూడా ఒక కారణం. అదే విధంగా మిగిలిన దేశాలు కూడా అలాంటి చరిత్ర కలిగినవే. అలాంటి వాటికి మన దేశం సహజ బంధువు అని చెప్పటం అసలు సిసలు దేశభక్తుడిని అని చెప్పుకొనే నరేంద్రమోడీ చెప్పటం విశేషం. మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అది విరుద్దం. సంఘపరివార్‌ దానిలో భాగం కాదు కనుక ఆ స్ఫూర్తితో దానికి పనిలేదు. ఆ కూటమి దేశాలతో వాణిజ్య లావాదేవీలు జరపటం వేరు, వాటికి సహజ మిత్రులం అని చెప్పుకోవటం తగనిపని. అణచివేసినవారు-అణిచివేతకు గురైన వారు సంబంధీకులు ఎలా అవుతారు? జి7 కూటమి దేశాల పాలకవర్గాల చరిత్ర అంతా ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం లేదా అణచివేతకు మద్దతు ఇచ్చిందే తప్ప మరొకటి కాదు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవారసుడైన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజా సమావేశాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చైనా వంటి నియంతృత్వ దేశం కంటే తమ కూటమి పేద దేశాలకు మంచి స్నేహితురాలని చెప్పుకున్నారు. కమ్యూనిస్టు చైనా ఉనికిలో లేకముందు ఆ దేశాల చరిత్ర ఏమిటో లోకానికి తెలియదా ? పులిమేకతోలు కప్పుకున్నంత మాత్రాన సాధు జంతువు అవుతుందా ?

నలుగురు కూర్చుని ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో గతించాయని జి7 కూటమి గ్రహిస్తే మంచిదని చైనా తిప్పికొట్టింది.ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికన నిజమైన ఉమ్మడి లక్ష్యంతో మాత్రమే నిర్మాణం జరగాలని పేర్కొన్నది. దేశాలు చిన్నవా – పెద్దవా, బలమైనవా – బలహీనమైనవా పేద-ధనికా అన్నది కాదు అన్నీ సమానమైనవే, వ్యవహారాలన్నీ అన్ని దేశాలు సంప్రదింపులతో నిర్ణయం కావాల్సిందే. ఏదైనా ఒక పద్దతి అంటూ ఉంటే అది ఐరాస వ్యవస్ధ ప్రాతిపదికనే తప్ప కొన్ని దేశాలు నిర్ణయించేది కాదు అని స్పష్టం చేసింది. ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించుకొనేందుకు ఏర్పాటు చేసుకున్న కూటమి ఇది. మరో మూడు సంవత్సరాల్లో ఐదు దశాబ్దాలు నిండనున్నాయి. ఈ కాలంలో ఈ కూటమి తన సమస్యలనే పరిష్కరించుకోలేకపోయింది, ఇక పేద దేశాల గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? కరోనా విషయంలో ఇవన్నీ ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యక్షంగా చూశాము. కరోనాను అదుపు చేయటమే గాక ఆర్ధికంగా పురోగమిస్తున్న చైనా మరింత బలపడుతుందన్న దుగ్ద, దాన్ని అడ్డుకోవాలన్నది తప్ప మరొకటి ఈ సమావేశాల్లో వ్యక్తం కాలేదు.


ఒక వైపు అమెరికాలో ఉన్న వాక్సిన్లు సకాలంలో వినియోగంచకు మురిగిపోతున్నాయనే వార్తలు మరోవైపు ప్రపంచాన్ని ఆదుకుంటామనే గంభీర ప్రకటనలు. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కడోసును కూడా అమెరికా ఇతర దేశాలకు ఇవ్వలేదు. వాటి తయారీకి అవసరమైన ముడిసరకులు, పరికరాల ఎగుమతులపై నిషేధం కొనసాగిస్తూనే ఉంది. చైనా బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పేరుతో తలపెట్టిన ప్రాజెక్టుల అమలుకు ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ పధకాన్ని 2049లో కమ్యూనిస్టు చైనా ఆవిర్భావ వందవ సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. నిజానికి ఇలాంటి పధకాలను ఏ దేశం లేదా కొన్ని దేశాల బృందం ప్రారంభించటానికి ఎలాంటి ఆటంకం లేదు. చైనా చెప్పేది అమలు జరిగేనే పెట్టేనా అని నిర్లక్ష్యం చేసిన దేశాలు దాని పురోగమనాన్నిచూసి ఎనిమిది సంవత్సరాల తరువాత దానికి పోటీగా ఇప్పుడు బి3డబ్ల్యు (బిల్డ్‌ బాక్‌ బెటర్‌ వరల్డ్‌ )పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని ప్రతిపాదించాయి. మంచిదే, అభివృద్దిలో పోటీ పడటం కంటే కావాల్సింది ఏముంది.


బ్రిటన్‌ సమావేశాల్లో జి7 ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ప్రస్తుతం చైనాతో యుద్దానికి సిద్దంగా లేదన్నది స్పష్టం. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నది. అయితే మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న యుద్దం ముగిసింది, విజేతలం మేమే అని ప్రకటించుకున్న తరువాత ఇప్పటి వరకు అమెరికన్లు తమ మిలిటరీ మీద 19లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇదే కాలంలో చైనా ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా. అయినప్పటికీ అమెరికా యుద్దాన్ని కోరుకోవటం లేదని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతవరకు అమెరికా ఏ ఒక్క యుద్దంలోనూ చిన్న దేశాల మీద కూడా విజయం సాధించలేదు, అలాంటిది చైనాతో తలపడే అవకాశాలు లేవన్నది వారి వాదన. అయితే ఉక్రోషం పట్టలేక తెగించి అలాంటి పిచ్చిపనికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు. తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చైనా గనుక పూనుకుంటే అడ్డుపడే అమెరికా మిలిటరీని పనికిరాకుండా చేయగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతకాలం అమెరికా అనుసరించిన మిలిటరీ ఎత్తుగడలు దానికి పెద్ద భారంగా మారాయి.అందువల్లనే నాటో ఖర్చును ఐరోపా దేశాలే భరించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాకు పోటీగా భారత్‌ను తీర్చి దిద్దుతామనే బిస్కట్లు వేసి ముగ్గులోకి దించి మన దేశం కేంద్రంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఎత్తుగడ. ఇన్ని దశాబ్దాల నాటో కూటమితో ఐరోపా బావుకున్నదేమిటో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అమెరికన్లు యుద్దాన్ని కూడా లాభనష్టాల లెక్కల్లో చూస్తారు. 1986లో అమెరికా దళాల చర్యలు, నిర్వహణకు పెంటగన్‌ (రక్షణ) బడ్జెట్‌లో 28శాతం ఖర్చు అయ్యేది, ఇప్పుడది 41శాతానికి పెరిగింది, ఆయుధాల కొనుగోలు కంటే ఇది రెండు రెట్లకంటే ఎక్కువ.

అమెరికా మిలిటరీ బడ్జెట్‌, ఆయుధాలతో పోలిస్తే చైనా బలం తక్కువే అని వేరే చెప్పనవసరం లేదు. వేల మైళ్ల దూరం నుంచి అమెరికా వచ్చి యుద్దం చేయాలన్నా లేదా దానికి ముందు చైనా చుట్టూ తన దళాలను మోహరించాలన్నా చాలా ఖర్చుతో కూడింది. కానీ చైనాకు అలాంటి అదనపు ఖర్చు, ప్రయాస ఉండదు. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ చేతులెత్తేసిన తరువాత అణుబాంబులు వేసి భయపెట్టింది అమెరికా. ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికాను ఎదిరించే ఇరాన్‌, సిరియా వంటి దేశాలు, సాయుధశక్తుల వద్ద ఉన్న ఆయుధాలు అంతగొప్పవేమీ కాదు, అలాంటి వారి మీద అమెరికా అత్యంత అధునాతన ఆయుధాలను ప్రయోగించి చూడండి మా ప్రతాపం అంటున్నది. అది చైనా విషయంలో కుదిరేది కాదు. నిజంగా చైనాతో యుద్దమంటూ వస్తే అది ఒక్క దక్షిణ చైనా సముద్రానికే పరిమితం కాదు.కరోనా నేపధ్యంలో వైరస్‌ పేరుతో అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న ప్రచార యుద్దంతో జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. అది వాస్తవ యుద్దంలో అంత తేలిక కాదు. సాధ్యమైన మేరకు అదిరించి బెదిరించి తన పబ్బంగడుపుకొనేందుకే అమెరికా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.తాజా జి7 సమావేశాలను కూడా అందుకే వినియోగించుకుంది. అమెరికాను నమ్ముకొని తాయత్తులు కట్టుకొని ముందుకు దూకిన దేశాలకు చైనా చుక్కలు చూపుతుందని ఇప్పటికే కొన్ని ఉదంతాలు వెల్లడించాయి.మన దేశం వాస్తవ దృక్పధంతో ఆలోచిస్తుందా ? దుస్సాహసం, దుందుడుకు చర్యలకు మొగ్గుతుందా ?