Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాధ్‌. నాలుగు సంవత్సరాలు గడిచే సరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు సూచించినట్లుగా వార్తలు రావటం విశేషం. అబ్బే అదేమీ లేదు, అంతా సజావుగా ఉంది అని చెప్పుకున్నా అది నష్ట నివారణ చర్య తప్ప మరొకటి కాదు. బిజెపి వంటి పార్టీలలో అలాంటి మార్పులు జరపాల్సి వచ్చినా దాని తీరే వేరుగా ఉంటుంది గనుక సమస్య పూర్తిగా ముగిసింది అని చెప్పలేము. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ, హౌం మంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలతో యోగి భేటీ అయ్యారు. ఎందుకు ఆ సమావేశం జరిగిందో, ఒక్కరే వచ్చి ఏమి చర్చించారో బయటకు తెలియదు. పైకి చెబుతున్నది మాత్రం మర్యాదపూర్వక కలయిక, మార్గదర్శనం కోసం అని. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. ఒకటి మాత్రం స్పష్టం, యోగి సర్కార్‌ వైఫల్యాలు, పార్టీనేతలతో పాటు వివిధ తరగతుల్లో అసంతృప్తి, కరోనా వైఫల్యం, రైతాంగ ఉద్యమం వంటి అంశాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి ముప్పు తెస్తాయనే ఆందోళన పార్టీ పెద్దల్లో ఉంది. కేంద్ర గూఢచార శాఖ ఇటీవల జరిపిన సర్వేలో యోగి నాయకత్వంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపికి 403కు గాను 50 మించి రావని తేలినట్లు చెబుతున్నారు. అదే తాజా పరిణామాలకు మూలంగా భావిస్తున్నారు.

యోగీ తొలగింపు వార్తల వెనుక అసలేమీ లేదా అంటే చాలా ఉంది. మొదటిది నరేంద్రమోడీ ఇష్టనేతల్లో యోగి లేరు. అనివార్యమై అంగీకరించారు. గత ఎన్నికల్లోనే మనోజ్‌ సిన్హా అనే మాజీ కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేస్తున్నారు.నరేంద్రమోడీ మద్దతుదారు. నరేంద్రమోడీ వైఫల్యాల చర్చ వచ్చినపుడు నితిన్‌ గడ్కరీ ప్రత్యామ్నాయంగా పేరు ఎక్కువగా వినిపిస్తున్నది, పెద్ద రాష్ట్రం గనుక రాజనాధ్‌ సింగ్‌ పేరు కూడా పరిశీలనలో ఉంది. యోగి ఆదిత్యనాధ్‌ వీరి పట్ల మొగ్గుచూపుతున్నారు. రాజనాధ్‌ సింగ్‌-యోగి ఇద్దరూ ఠాకూర్‌ సామాజికతరగతికి చెందిన వారే. వారెప్పుడైనా తనకు విరోధులుగా మారతారనే అనుమానం నరేంద్రమోడీలో ఉంది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఘోరపరాజయం, కరోనా వైఫల్యాలపై చర్చ నేపధ్యంలో అనుమానం పెనుభూతమైందని వార్తలు. కరోనా విషయంలో యోగి వైఫల్యంతో మోడీ అనుకూలురకు మంచి అవకాశం వచ్చినందున దీన్ని వదులు కోకూడదని తమ వంతు యత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. యోగి కొరకరాని కొయ్యగా మారిన కారణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు లక్నో పర్యటన జరిపి పరిస్ధితిని మదింపు వేశారని చెబుతున్నారు. తరువాతనే యోగి ఆదిత్యనాధ్‌ ప్రధాని నరేంద్రమోడీ, ఇతర నేతలను ఢిల్లీలో ” మర్యాద ” పూర్వకంగా కలిసి ” మార్గదర్శనాన్ని” అందుకున్నారు.


ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద అనుమానాలు తలెత్తటంతో సామాజిక సమీకరణలకు బిజెపి తెరలేపింది. ఉత్తర ప్రదేశ్‌లో సామాజికంగా 21శాతం మంది దళితులు ఉన్నారు. పన్నెండుశాతం మంది బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలలో వారు 20శాతం వరకు ఉన్నారు. యోగి సర్కార్‌ తమను నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తి వారిలో మొదలైంది. దళితుల కంటే తమ వారు ఎక్కువ మంది హత్యలకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు ఒక బ్రాహణ నేతగా పేరున్న కాంగ్రెస్‌ ప్రముఖుడు జితిన్‌ ప్రసాదను బిజెపి వైపు ఆకర్షించటం వెనుక కథ ఇదే. హక్కుల కోసం పోరాడేందుకంటూ 2020 జూలైలో బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో జితిన్‌ ప్రసాద ఒక సంస్దను ఏర్పాటు చేశారు. వివిధ కేసులను ఎదుర్కొంటున్న తమ సామాజిక తరగతికి సాయం చేసేందుకు టి-20 పేరుతో ప్రతి జిల్లాలోనూ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తరువాత ప్రకటించారు. యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత బ్రాహ్మణుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగినట్లు గతంలో జితిన్‌ ప్రసాద విమర్శించారు. ఇప్పుడు జితిన్‌ ప్రసాదను పార్టీలో చేర్చుకోవటం ద్వారా వారిని బుజ్జగించవచ్చన్నది బిజెపి ఎత్తుగడ.


పార్టీ రహిత ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపి పెద్దలు జిల్లాపరిషత్‌ స్ధానాలకు తమ అభ్యర్ధులు వీరే అని ప్రకటించి చేతులు కాల్చుకున్నారు. వారిలో అత్యధికులు ఓడిపోయారు. దీనికి ఆదిత్యనాధే సూత్రధారి. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలో, రామాలయానికి శంకుస్దాపన చేసిన అయోధ్యలో కూడా ఓడిపోవటంతో నరేంద్రమోడీ పరువు కూడా పోయింది. అదే యోగి వ్యతిరేకులకు ఆయుధంగా మారింది. స్ధానిక సంస్దలలో ఓటమితో పాటు కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం, హైకోర్టు న్యాయమూర్తులతో చివాట్లు తినటం, అనేక చోట్ల ఆక్సిజన్‌ మరణాలు సంభవించటంతో తీవ్ర విమర్శలు, అసంతృప్తి వెల్లడైంది. వీటికి పరాకాష్టగా కరోనా మృతుల దేహాలను గంగానదిలో పారవేయటంతో బిజెపి పరువు గంగలో కలిసింది. గుజరాత్‌ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ నరేంద్రమోడీని దిగంబర రాజుగా వర్ణిస్తూ రాసిన కవిత్‌ వైరల్‌ కావటం తెలిసిందే. ఇన్ని జరిగిన తరువాత నష్ట నివారణ చర్యగా యుపిలో అంతా బాగుంది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయించి యోగి మరిన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. వాణిజ్య ప్రకటనలు, పాకేజ్‌ (డబ్బిచ్చి) వార్తలు, ఇంటర్వ్యూల వంటివి చేయించారు. పార్టీ ఢిల్లీ పెద్దల వ్యూహం మేరకు గుజరాత్‌ కాడర్‌గా పని చేస్తున్న యుపికి చెందిన ఆలిండియా అధికారి ఎకె శర్మ చేత రాజీనామా చేయించారు. ఎంఎల్‌సిగా నియమించి కాబినెట్‌లో చోటు కల్పించాలని ప్రతిపాదించారు. అయితే ఆదిత్యనాధ్‌ ఎంఎల్‌సి పదవిని ఇచ్చారు తప్ప మంత్రిమండలిలో చేర్చుకోలేదు, కనీసం శర్మను కలుసుకొనేందుకు కూడా నిరాకరించారని వార్తలు వచ్చాయి.

ప్రధాని తరువాత ఆదిత్యనాధ్‌ను ప్రధాన ప్రచారకుడిగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి పంపారు. ఇప్పుడు మరోసారి అసలు యుపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఓటర్ల ముందుంచుతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్‌, బీహార్‌, హర్యానాల్లో మిత్రపక్షాలు ఉన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. అసోంలో మాత్రమే గట్టెక్కింది. యుపిలో బలమైన మిత్రపక్షం కూడా బిజెపికి లేదు. అనేక చోట్ల హిందూత్వ తురుపుముక్క పని చేయలేదు, యుపిలో కూడా అదే పునరావృతం అవుతుందేమో అన్న అనుమానాలు సంఘపరివార్‌లో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఓబిసి, షెడ్యూలు కులాలకు చెందిన వారు తమను ఉపయోగించుకొని వదిలేశారనే భావంతో ఉన్నారు. చిన్న పార్టీలే అయినప్పటికీ మిత్ర పక్షాలు అసంతృప్తితో ఉన్నాయి.భారతీయ సమాజ్‌ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. బిజెపి మునిగిపోయే నావ దానిలో ఎవరైనా ఎక్కాలనుకుంటే వారిష్టం, నేను మాత్రం ఎక్కను అని ఆ పార్టీ నేత నేత ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ వ్యాఖ్యానించారు. వెనుకబడిన తరగుతులను వాడుకొని వదిలేస్తున్నారని, నాలుగున్నర సంవత్సరాలలో తమకు చేసిన వాగ్దానం దేన్నీ అమలు జరపలేదన్నారు. బిజెపిని ఓడించేందుకు తాముప్రయత్నిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అప్నాదళ్‌ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక ముక్క సమాజవాదితో చేతులు కలిపేందుకు నిర్ణయించుకుంది. మరో ముక్క కేంద్రంలో తమకు మంత్రి పదవి ఇస్తారా లేదా అని బేరం పెట్టింది. నిషాద్‌ పార్టీ కూడా ఇదే విధంగా బేరం పెట్టింది, పదవులు ఇవ్వకపోతే సమాజవాది పార్టీ వైపు చేరతామనే సంకేతాలు ఆ పార్టీలు ఇస్తున్నాయి.


ఈ పార్టీల బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని వాటితో నిమిత్తం లేకుండా హిందూత్వ అజెండాతో తిరిగి విజయం సాధిస్తామనే అభిప్రాయంతో యోగి ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు చెప్పేది వినకుండా తనకు నమ్మకస్తులైన అధికారులకే ప్రాధాన్యత ఇస్తున్నందుకు నిరసగా అసెంబ్లీలోనే 2019లోనే 200 మంది ఎంఎల్‌ఏలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన ఉదంతం తెలిసిందే. బిజెపికి చెందిన నందకిషోర్‌ గుర్జార్‌ తమ జిల్లా అధికారయంత్రాంగం, పోలీసుల వేధింపుల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవటం పట్ల నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా బిజెపి ఎంఎల్‌ఏలతో సహా రెండు వందల మంది వివిధ పార్టీలకు చెందిన వారు మూడు గంటల పాటు సభలో ధర్నా జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లు అవినేతి కేంద్రాలుగా మారాయని కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సమక్షంలోనే ఒక మాజీ ఎంఎల్‌ఏ చెప్పిన మాటలను ఎంఎల్‌ఏలు, నేతలు అందరూ అభినందించిన ఉదంతం ఈ ఏడాది మార్చినెలలో జరిగింది. రైతు ఉద్యమం పట్ల యోగి సర్కార్‌ అనుసరించిన వైఖరి ముఖ్యంగా రాకేష్‌ తికాయత్‌ను అరెస్టు చేసేందుకు చేసిన యత్నం పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సంచలనమైంది, తికాయత్‌ జాతీయ నేతను చేసింది.రైతు ఉద్యమం బలపడింది. యోగి ఆదిత్యనాధ్‌ జన్మదినాన్ని నిరుద్యోగదినంగా జరపాలని ఇచ్చిన పిలుపు పెద్ద చర్చనీయాంశమైంది.ఉద్యోగులు, టీచర్లలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది.


ఎన్నికలకు కొద్ది నెలల ముందు యోగిని మార్చటం చిన్న విషయం కాదని బిజెపి పెద్దలకు అర్దమైంది. గతంలో బిజెపితో ఉంటూనే హిందూ యువవాహిని పేరుతో తనదైన దళాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ మెడలు వంచిన ఉదంతాలు ఉన్నాయి. తనకు అధికారం వచ్చిన తరువాత దాన్ని వదిలేశారు. అయినప్పటికీ హిందూత్వకు ప్రతీకగా యోగి ఉన్నందున ఆయనను మారిస్తే ఎలా అన్న గుంజాటన కూడా ఉంది. ఆ ప్రాతిపదికన ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అజెండాతో ముందుకు పోవాలంటే యోగి లేకుండా కష్టం అని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, పెద్ద రాష్ట్రమైన యుపి మీద ప్రయోగాలకు పూనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఏదైతే అది అవుతుందన్న తెగింపుతో కేంద్ర బిజెపి పెద్దలకు అవగతం అయి ఉండాలి. అయితే పూర్తిగా పగ్గాలు యోగికే ఇస్తారా అన్నది సందేహమే. యోగికి ఒక సందేశం పంపారు, సూచన చేశారు. గతంలో మాదిరి నరేంద్రమోడీ తిరుగులేని నేతగా ఉంటే అదొక దారి, ఇప్పుడు వైఫల్యాల బాటలో ఉన్నందున యోగి వంటి వారు ఒక పట్టాన అంగీకరిస్తారని చెప్పలేము. ఎందుకంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్‌ చేజారితే అది రాజకీయంగా బిజెపికి కోలుకోలేని దెబ్బ.యోగి మార్పు గురించి చర్చ ప్రారంభమైంది గనుక కొనసాగిస్తే బిజెపిలో, ఆర్‌ఎస్‌ఎస్‌లో నరేంద్రమోడీ పలుకుబడి కోల్పోయినట్లుగా పార్టీలోనే కాదు, దేశ వ్యాపితంగా సందేశం వెళుతుంది. తొలగిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు యోగి కానసాగితే నష్టం-మార్చినా యుపిలో గెలుపు కష్టం అన్నట్లుగా ఉంది. నష్టం కంటే కష్టాన్ని ఎలాగోలా అధిగమిద్దాం అని భావించారా ? పరిస్ధితిని మరింత మదింపు వేసేందుకు సమయం తీసుకుంటున్నారా ? అయోధ్య రామజన్మభూమిని పరిష్కరించాం అనే ప్రచారం చేసుకొనేందుకు ఒక అవకాశం ఉంది. యోగి మీద వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా రానున్న రోజుల్లో వారణాసిలోని గ్యానవాపి మసీదు వివాదాన్ని, మధురలో షాహీమసీదు సమస్యను ముందుకు తేవటం ద్వారా దాన్ని అధిగమించి విజయం సాధించవచ్చా అనే మదింపులో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.