Tags

, , , ,


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 3


ఎం కోటేశ్వరరావు


జూన్‌ ఆరవ తేదీన లాటిన్‌ అమెరికాలోని పెరూలో పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. లెక్కింపు పూర్తయినప్పటికీ ఇంకా అధ్యక్ష పదవికి ఎన్నికైన వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలోను ఎన్నికల సంఘం ఇంకా ధృవీకరించలేదు.ప్రజాతీర్పును వమ్ము చేసే కుట్ర దీనివెనుక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలు దామాషా ప్రాతిపదికన జరగ్గా అధ్యక్ష ఎన్నికలు మరోవిధంగా జరిగాయి. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తొలి పోలింగ్‌లోనే సగానికి పైగా ఓట్లు తెచ్చుకుంటే మలి ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా గెలిచిన వారిని అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిగా ప్రకటిస్తారు. లేనపుడు పోటీ చేసిన అభ్యర్ధులలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య రెండవ సారి ఎన్నిక జరుపుతారు. ఆ విధంగా ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో ఫలితం తేలలేదు. జూన్‌ ఆరున జరిగిన ఎన్నికల్లో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో 50.127శాతం ఓట్లు తెచ్చుకోగా ప్రత్యర్ధి కెయికు ఫుజిమోరీ 49.873శాతం ఓట్లు తెచ్చుకున్నారు. కాస్టిలో మెజారిటీ 44,240 ఓట్లు. పెరూ ఎన్నికల సంఘం అంతిమంగా ప్రకటించిన వివరాల ప్రకారం 2,52,87,954 ఓట్లకు గాను 1,88,56,818 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో ఎవరికీ వేయకుండా ఖాళీ పత్రాలు 1,21,478, చెల్లని ఓట్లు 11,07,640 ఉన్నాయి. చెల్లని ఓట్లన్నీ తనకు పడినవే అని కెయికు ఫుజిమోరీ వాదించటంతో రోజుల తరబడి వాటన్నింటినీ తిరిగి పరిశీలించారు. మంగళవారం నాడు ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయినప్పటికీ అంతకు ముందు వెలువడిన ఫలితంలో మార్పులేమీ లేవు. లెక్కింపు ప్రారంభమై పన్నెండు రోజులు గడిచినా ఇది రాస్తున్న సమయానికి ఎన్నికల సంఘం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చిందీ ప్రకటించింది తప్ప అధికారికంగా ఫలితాన్ని ఖరారు చేయలేదు.

ఒకవైపు లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాల ప్రతినిధులు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదని ప్రకటించారు, అమెరికా కూడా ఫలితాలను అందరూ అమోదించాలని చెప్పింది, అయినప్పటికీ అనూహ్యంగా తాము అనుకున్నదానికి భిన్నంగా ఫలితం రావటంతో కుట్రకు తెరలేపినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి కాస్టిల్లోను అభినందిస్తూ సందేశాలు వస్తున్నాయి.గతేడాది అమెరికాలో జరిగిన ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరిగాయంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించటం, కోర్టులకు ఎక్కటం తెలిసిందే. ఇప్పుడ ట్రంప్‌ను ఆదర్శంగా తీసుకొని కెయికు ఫుజిమోరీ తన ఓటమిని అంగీకరించేందుకు సిద్దపడటం లేదు. ఫలితాలను సవాలు చేసేందుకు 30 మంది అగ్రశ్రేణి న్యాయవాదులతో ఇప్పటికే 134 కేసులు వేయించగా మరో 811 వేసేందుకు సిద్దం అవుతున్నట్లు వార్తలు. చెల్లనివిగా ప్రకటించిన వాటిలో రెండున్నరలక్షల ఓట్ల గురించి తాము సవాలు చేస్తున్నట్లు కెయికు గురువారం నాడు వెల్లడించింది. పోటీ తీవ్రంగా ఉందని పసిగట్టిన కెయికు ఎన్నికలకు ముందుగానే వీరితో మంతనాలు జరిపి చట్టపరంగా ఆటంకాలు కల్పించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. కాస్టిలో మద్దతుదారులందరూ గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని స్ధానిక జాతులు, రైతులు, పట్టణ ప్రాంతాల్లోని పేదలు కాగా ఫుజిమోరి మద్దతుదారులందరూ అత్యంత సంపన్నులు, ఐరోపా దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన శ్వేతజాతీయుల వారసులు.కెయికు ఫుజిమోరి తండ్రి, అవినీతి కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఆల్బర్ట్‌ ఫుజిమోరి నియంత, మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద రాజకీయవేత్త. జపాన్‌ నుంచి వలస వచ్చిన వారి సంతానం.


ఎన్నికలకు ముందుగా అమెరికా నూతన రాయబారిగా లిసా కెనా నియమితులయ్యారు. ఆమె గతంలో తొమ్మిది సంవత్సరాలు సిఐఏ అధికారిగా విదేశాంగశాఖ ముసుగులో ఇరాక్‌లో పనిచేశారు. ట్రంప్‌ హయాంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన మైక్‌ పాంపియోకు సలహాదారు. పెరూ ఎన్నికలకు ముందు ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ తమ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అధ్యక్ష ఎన్నిక మొత్తం లాటిన్‌ అమెరికాకే ఒక ఆదర్శ నమూనాగా ఉండాలని పేర్కొన్నారు.కైయికు ఫుజిమోరి విజయం సాధిస్తారనే ధీమాతో ఈ ప్రకటన చేసి ఉండాలి.లేనట్లయితే ప్రతి దేశంలో మాదిరి ముందుగానే పెరూలో కూడా తన కుట్రను అమలు జరిపి ఉండేది.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత తొలి దశలో కైయికు ముందంజలో ఉండగా ఎలాంటి ప్రకటనలు చేయని వారు, గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపులో కాస్టిలో దూసుకుపోవటంతో ఫలితాలు తారుమారైనట్లు గ్రహించి తనకు పడిన ఓట్లను చెల్లనివిగా పక్కన పెట్టారనే ఆరోపణను ఆమె ముందుకు తెచ్చారు. కాస్టిలో ఎన్నికైతే దేశం మరో వెనెజులాగా మారిపోతుందని ఆమె మద్దతుదారుగా ఉన్న నోబెల్‌బహుమతి గ్రహీత వర్గాస్‌ లోసా ప్రకటించి కాస్టిలో వ్యతిరేకులను రెచ్చగొట్టారు. ఎన్నికలకు ముందే అల్బర్ట్‌ ఫుజిమోరిని వ్యతిరేకించిన మితవాదులందరూ కెయికు మద్దతుదారులుగా మారారు. ఫలితాలు అనూహ్యంగా మారటంతో మరింత సంఘటితమై లెక్కింపును గుర్తించబోమంటూ ప్రదర్శనలకు దిగారు.మరోవైపు కాస్టిలో కూడా తీర్పును కాపాడుకొనేందుకు వీధుల్లోకి రావాలని తన మద్దతుదారులకు పిలుపు నిచ్చారు. ఈ నేపధ్యంలో ఓట్ల లెక్కింపు పూర్తయి వివరాలను అధికారికి వెబ్‌సైట్‌లో వెల్లడించినప్పటికీ రోజులు గడుస్తున్నా ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఎన్నికల సంఘం జాప్యం చేస్తున్నది.ఈ లోగా కైయికు కేసులు దాఖలు చేసేందుకు తగిన గడువు ఇవ్వటం ద్వారా సరికొత్త కుట్రకు తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో ఒకసాకుతో కోర్టు ద్వారా ఎన్నికలను రద్దు చేసినా ఆశ్చర్యం లేదు.

ఎన్నికల ఫలితాలపై వచ్చిన ఫిర్యాదులను ఎంతో వేగంగా పరిష్కరిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. గత ఎన్నికల్లో కూడా ఇద్దరు అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా కేవలం 41,027 మాత్రమే.అప్పుడు కూడా రెండవ స్ధానంలో కెయికు ఫుజిమోరియే ఉన్నారు. ఆ సమయంలో కూడా జూన్‌ నెలాఖరుగానీ ఫలితాన్ని ఖరారు చేయలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. అది నిజమే అయినప్పటికీ గత ఎన్నికలలో పోటీ పడిన వారిద్దరూ మితవాద పక్షాలకు చెందిన వారే. ఇప్పుడు అనూహ్యంగా వామపక్ష అభ్యర్ధి రంగంలోకి రావటం, మెజారిటీ సంపాదించిన కారణంగానే అనేక అనుమానాలు తలెత్తాయి.
పెరూలో జరిగిన పరిణామాలలో వామపక్ష అభ్యర్ది విజయం సాధించటం ఆ ఖండమంతటా వామపక్షశక్తులు తిరిగి పుంజకుంటున్నాయనేందుకు సంకేతంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో వామపక్ష తీవ్రవాదిగా రంగంలోకి వచ్చి విజయం సాధించిన మాజీ సైనిక అధికారి ఒలాంటా హమాలా అమెరికా సామ్రాజ్యవాదుల బంటుగా, నయాఉదారవాద విధానాలను అమలు జరిపే వాడిగా తయారై మొత్తంగా వామపక్ష శక్తుల మీదనే అనుమానాలు వ్యక్తం చేసే విధంగా వ్యవహరించాడు. దాన్నుంచి బయటపడి తిరిగి అక్కడి పేదలు కాస్టిలోను ఎన్నుకోవటం చిన్న విషయం కాదు. త్వరలో ఎన్నికలు జరగనున్న చిలీ, కొలంబియా, బ్రెజిల్‌లో కూడా ఇదే పునరావృతం అవుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం వెనెజులా, అర్జెంటీనా, నికరాగువా,బొలీవియా, మెక్సికోలలో వామపక్ష శక్తులు అధికారంలో ఉన్నాయి. కాస్టిలో నాయకత్వం వహిస్తున్నది కమ్యూనిస్టు పార్టీ కాకున్నప్పటికీ తమది మార్క్సిస్టు భావజాలం మీద ఆధారపడి పని చేస్తుందని ప్రకటించారు. పెరూ మితవాద శక్తులను వ్యతిరేకించే ఒక విశాల వామపక్ష పార్టీగా అది ఉందని చెప్పవచ్చు.


మౌలికంగా భిన్నమైన లాటిన్‌ అమెరికా గురించి ఆలోచించాల్సి ఉంటుందని అమెరికాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు బ్రియన్‌ వింటర్‌ ఆ ఖండంలో జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానించాడు. ప్రజాభిప్రాయాన్ని చూస్తే అధికారంలో ఉన్న ప్రత్యేకించి మితవాద శక్తులు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోందని బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌ వెబ్‌సైట్‌ సంప్రదించిన పన్నెండు మంది ప్రాంతీయ విశ్లేషకులు చెప్పారు. దిగజారిపోయిన ఆర్ధిక వ్యవస్ధలు, మహమ్మారి కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలను బట్టి జనాలు మితవాదులను బయటకు గెంటేయాలన్నట్లుగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అసంతృప్తికి కరోనా ఒక్కటే కారణం కాదు, అంతకు ముందే చిలీ, కొలంబియా వంటి చోట్ల జనం వీధుల్లోకి వచ్చారు. వాస్తవానికి కరోనా జనాన్ని ఇండ్లకే పరిమితం చేసింది. మితవాద శక్తులు చేసిన వాగ్దానాలను మరచిపోవటంతో జనం ధనికులతో పాటు ఆర్ధిక విధానాలనే మార్చాలని కోరుతున్నారని పెరూ పరిణామాలు స్పష్టం చేశాయి.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు అధికారంలోకి రావటం వలన పరిణామాలు,పర్యవసానాలు ఆ ఖండానికే పరిమితం కావు. రాజకీయంగా వెనెజులా, బొలీవియా నాయకత్వాల మీద వత్తిడి తగ్గుతుంది.అమెరికాతో సంబంధాలు పరిమితమై చైనాతో పటిష్టమౌతాయి. అన్నింటినీ మించి అమెరికా జోక్యంతో పరిణామాలను ప్రభావితం చేయటం కష్టం అవుతుంది. వామపక్ష శక్తులే కాదు, ప్రజాస్వామిక శక్తులను కూడా అక్కడి మితవాద శక్తులు సహించటం లేదు. ఈ కారణంగానే నిరంతరం ఏదో ఒక దేశంలో కుట్రలు జరగటం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఆరుదశాబ్దాలలో పన్నెండు దేశాలలో 34 కుట్రలు జరిగాయి. వీటన్నింటి వెనుక అమెరికా సామ్రాజ్యవాదుల కుట్ర, డబ్బు, ఆయుధాలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటినీ ఛేదించి జనం ఎప్పటికప్పుడు పురోగామి శక్తులకు పట్టం గడుతున్నారు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు పార్టీలకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో ఈ పరిణామాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి, విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు పదే పదే తలెత్తుతున్నాయంటే అదేదో గాల్లోంచి జరుగుతున్నది కాదు.అక్కడి మితవాద శక్తులు, వాటి విధానాలు, వాటికి వెన్నుదన్నుగా అమెరికా కుట్రలే అందుకు దోహదం చేస్తున్నాయి. .