Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


రెండు తెలుగు రాష్ట్రాలకూ పొరుగు అయిన కర్ణాటకలో ఏమి జరుగుతోంది ? బిజెపి రాజకీయ నాటకంలో పాత్రధారులెవరు, సూత్రధారులెవరు ? టీవీ సీరియల్‌ మాదిరి ఎంత కాలం సాగనుంది ? తాజాగా ముగిసిన భాగంలో పాత్రధారులు చెప్పిందేమిటి ? అధిష్టానం ఎప్పుడు దిగమంటే అప్పుడు దిగుతా అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడియూరప్ప. లేదు, ఆయన పూర్తి పదవీ కాలంలో ఉంటారు, మార్పులేదు అన్నారు కేంద్ర పార్టీ ప్రతినిధి అరుణ్‌ సింగ్‌. మేము వెనక్కు తగ్గేది లేదు అంటున్నాయి ఇతర పాత్రలు.మొత్తం మీద మూడు ముక్కలాట నడుస్తోంది.


బిజెపి ఎంఎల్‌ఏలు, మంత్రులు లేవనెత్తుతున్న అవినీతి ఆరోపణలు, పాలనా వ్యవహారాల్లో ఎడియూరప్ప కుమార రత్నం జోక్యం గురించి పార్టీ అధిష్టానం మాట్లాడటం లేదు. ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా సజావుగా ఉంది) అంటోంది. పాచిపోతుందని తెలిసినా ఇద్దరు ముగ్గురు ఎంఎల్‌ఏలు చేస్తున్న రచ్చ తప్ప మరింకేం లేదని మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి యడియూరప్ప బిజెపి కేంద్ర నాయకత్వానికి, ముఖ్యంగా తిరుగులేని మోడీ-అమిత్‌ షా ద్వయానికి కొరకరాని కొయ్యగా మారారా ? దేశంలోని పరిస్ధితులు వారిని బలహీన పరిచాయా ?

కర్ణాటకలో కరోనా ఎలా విజృంభించిందో ఎంత మంది మరణించారో, మరణాలను ఎలా దాచిపెట్టారో లోకానికి తెలిసిందే. అభివృద్ది పనులేమీ లేవని బిజెపి వారే చెబుతున్నారు గనుక వివాదం లేదు. డెబ్బయి అయిదు సంత్సరాలు దాటిన వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదన్నది స్వయంగా బిజెపి విధించుకున్న నిబంధన అని అమిత్‌ షా వంటి వారు చెప్పారు. దాని వెనుక ప్రధాని పదవి రేసు నుంచి ఎల్‌కె అద్వానీ తప్పించే ఎత్తుగడ ఉందంటారు. అసలీ నిబంధన నిర్ణయం ఏ సమావేశంలో జరిగిందో తనకు తెలియదని, అమిత్‌ షానే చెప్పాలని లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గతలోక్‌ సభ ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారు. ఆ నిబంధనను చూపి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ను, కేంద్ర మంత్రి నజమా హెప్తుల్లాను పదవుల నుంచి తప్పించారు. కానీ అదే బిజెపి పెద్దలు 75 ఏండ్లు దాటిన తరువాతనే యడియూరప్పను మరోమారు కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించారు ( లేకపోతే ఆయనే గద్దెనెక్కితే ఆమోద ముద్రవేశారు). కేరళలో యడియూరప్పకంటే పదేళ్ల పెద్ద అయిన 88 ఏండ్ల మెట్రో మాన్‌ శ్రీధరన్‌ పిళ్లేను ఎన్నికల్లో నిలపటమే కాదు, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించారు. నిజానికి ఈ రెండూ ఆ పార్టీ ప్రవచించిన స్వయం ప్రవర్తనా నియమావళికి విరుద్దమైనవే.మోడీ-షా ద్వయం తమకు వ్యతిరేకం లేదా ఎవరినైనా దెబ్బతీయాలనుకుంటే ఈ నిబంధనను ముందుకు తెస్తారు. 2014 ఎన్నికల్లో సీట్లు ఇచ్చినప్పటికీ అద్వానీ, మురళీ మనోహర జోషిని ఈ నిబంధన చూపే దూరంగా పదవులకు దూరంగా పెట్టారు. అన్నింటికంటే అవమానం ఏమిటంటే ఇలాంటి వయస్సు మీరిన వారందరితో ఒక మార్గదర్శక మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఏడు సంవత్సరాలలో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, మార్గదర్శనం చేయాలని అడిగిన వారు లేరు.

ఎడియూరప్పకు ఇప్పుడు 78 సంవత్సరాలు, ఆ నిబంధనకు మినహాయింపు ఇస్తే కారణం ఏమిటో చెప్పాలి, ఎలాంటి ప్రకటన, వివరణ లేకుండానే ముఖ్యమంత్రిగా ఆమోదించారు, కొనసాగిస్తున్నారు. అధిష్టానం ఏమి చెప్పినప్పటికీ కర్ణాటక బిజెపి వ్యవహారాలు వీధుళాలకెక్కాయి. కుమారుడే తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందున యడియూరప్పను తప్పిస్తే తప్ప తాము వెనక్కు తగ్గేది లేని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. ఎంఎల్‌సి హెచ్‌ విశ్వనాధ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఎడియూరప్పకు వయసైపోయింది, ఆరోగ్య సమస్యలున్నాయి, కుటుంబ సభ్యులు పాలనలో జోక్యం చేసుకుంటున్నారు, ముఖ్యంగా కుమారుడు విజయేంద్ర అన్ని శాఖలల్లోనూ వేలు పెడుతున్నారని ఆరోపించారు. అయితే విశ్వనాధ్‌ ప్రకటన వ్యక్తిగతం పార్టీకి సంబంధం లేదని, యడియూరప్పే ముఖ్యమంత్రి అని కేంద్ర ప్రతినిధి అరుణ్‌ సింగ్‌ ఇప్పటికే చెప్పారని బళ్లారి మంత్రి బి శ్రీరాములు సిఎంకు మద్దతుగా ప్రకటించారు. జెడిఎస్‌ నుంచి ఫిరాయించిన వారిలో విశ్వనాధ్‌ ఒకరు. వీరశైవ సామాజిక తరగతి నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని కోరుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల వ్యవధి ఉంది. అందువలన కొత్త ముఖంతో ఎన్నికలకు పోవాలన్నది వ్యతిరేకుల ప్రతిపాదన. అదే చేస్తే అసలు ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందని కేంద్ర పెద్దల భయం.


కరోనా నిరోధంలో ముఖ్యమంత్రి పని తీరు బాగుందని, పార్టీలో ప్రతి ఒక్కరూ పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉండాలని, ఎవరికైనా సమస్యలుంటే నాతో మాట్లాడాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయకూడదు, ఎవరైనా అలా చేస్తే సంజాయిషీ కోరతాం అని కర్ణాటక వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ చెప్పారు. ఇద్దరు ముగ్గురు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, వారిలో ఒకరికి బిజెపి సంస్కృతి గురించి తెలియదని అన్నారు. మూడు రోజుల పాటు బెంగళూరులో మకాం వేసి మంత్రులు, ఎంఎల్‌ఏలతో చర్చలు జరిపారు. అంతకు ముందు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప ముఖ్యమంత్రి నియంత పోకడల మీద గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాశారు. పర్యాటక శాఖ మంత్రి సిపి యోగేశ్వర్‌ స్వయంగా ముఖ్యమంత్రి మీద ధ్వజమెత్తారు.ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. మంత్రులను పార్టీ గానీ, ముఖ్యమంత్రిగానీ ఇంతవరకు ఎలాంటి సంజాయిషీ కోరలేదు. ముఖ్యమంత్రి మార్పు గురించి డిమాండ్లు వస్తుండటంతో యడియూరప్పకు మద్దతుగా 65 మంది సంతకాలు చేసినట్లు సిఎం రాజకీయ కార్యదర్శి, ఎంఎల్‌ఏ రేణుకాచార్య ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు శాసనసభా పక్ష సమావేశం జరపాలని కొందరు ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేసిన నేపధ్యంలో సంతకాల కార్యక్రమం చేపట్టారు.

గతంలో యడియూరప్ప మార్పు గురించి అనేక తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో తాజాగా మే రెండవ తేదీ తరువాత ఎప్పుడైనా ఆయన ఉద్యోగం ఊడుతుందని చెప్పారు. ” సూర్యుడు-చంద్రుడు ఉన్నంత వరకు యడియూరప్ప ముఖ్యమంత్రగా ఉంటారని కొందరు చెబుతున్నారు.అదెలా సాధ్యం, 2023లో కూడా ముఖ్యమంత్రిగా ఉంటారా ? 75 సంవత్సరాల వయోపరిమితి నిబంధన వర్తించదా ? ఇప్పటికే రెండు సంవత్సరాల బోనస్‌ పొందారు. అందుకుగాను పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలి, ఏప్రిల్‌ 17 తరువాత స్వచ్చందంగా వైదొలగాలి, మే రెండవ తేదీ తరువాత మార్పు ఏ రోజైనా మార్పు జరగనుంది. ఉత్తర కర్ణాటక నుంచి ఒకరు ముఖ్యమంత్రి అవుతారు ” అని సీనియర్‌ బిజెపి ఎంఎల్‌ఏ బసన్‌గౌడ పాటిల్‌ ఏప్రిల్లో విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఏప్రిల్‌ 17న బెలగామ్‌ లోక్‌సభ, బసవకల్యాన్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌, మే రెండవ తేదీన ఫలితాల ప్రకటన గనుక ఆ తేదీలను బసవన గౌడ ప్రకటించారు. అంతకు ముందు ఇలాంటి ప్రకటనలే చేసినందుకు సంజాయిషీ లేఖ ఇచ్చినప్పటికీ వెనక్కు తగ్గకుండా బహిరంగ దాడికి దిగారు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలు, బదిలీల మాఫియా గురించి, హైకోర్టు మందలింపుల గురించి పార్టీ అధిష్టానానికి తెలుసు అని కూడా గుర్తు చేశారు.పక్షం రోజుల క్రితం కూడా బసన్‌గౌడ తన దాడిని కొనసాగించారు.ముఖ్యమంత్రిని మార్చటం తధ్యం, ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళితే ఓటమి ఖాయం, కర్ణాటకలో పార్టీ బతకాలంటే బయటకు పంపేయాల్సిందే అన్నారు.


అందరికీ తెలిసిన అంశం కుక్క తోకను ఆడిస్తుంది తప్ప తోక కుక్కను ఆడించదు. కానీ కర్ణాటకలో రెండోదే జరుగుతోంది. యడియూరప్పే పార్టీని నిర్దేశిస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌-జనతాదళ్‌ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత జరిగింది అదే. అంతకు ముందు బళ్లారి ఇనుప ఖనిజం కుంభకోణంలో యడియూరప్ప ప్రమేయం కారణంగా 2011లో ముఖ్యమంత్రి పదవి నుంచి కేంద్ర పార్టీ తొలగించింది. దాంతో బయటికి వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు, బిజెపి ఓటమే ధ్యేయంగా పని చేశారు. 2013 ఎన్నికల్లో అదే జరిగింది. తరువాత యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు, పూర్తి అధికారాలు ఇచ్చారు. 2014లో నరేంద్రమోడీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన తరువాత మిత్ర పక్ష పార్టీల పట్ల, అదే విధంగా రాష్ట్రాల్లో బిజెపి వ్యవహారాల్లోనూ మోడీ-షా ద్వయం మాటకు తిరుగులేకుండా పోయింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారానికి అవసరమైన సీట్లు తగ్గాయి. కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది. తరువాత అసలు కథ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల గురించి బిజెపి ఎన్ని నీతి కబుర్లు చెప్పినా అధికార కూటమిలోని ఎంఎల్‌ఏలకు ఎరవేయకుండా యడియూరప్పను అధిష్టానం నివారించలేకపోయింది. ఆయన చెప్పినట్లు తలాడించకతప్పలేదు. తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫిరాయింపు ఎంఎల్‌ఏలకు సీట్లు ఇవ్వటం గురించి పార్టీలో వ్యతిరేకత వెల్లడైనా యడియూరప్ప మాటే చెల్లుబాటైంది. మంత్రివర్గంలో తన అనుచరులకే పెద్ద పీటవేశారు.

ఆర్ధిక రంగం, కరోనా నిరోధంలో నరేంద్రమోడీ వైఫల్యం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపధ్యంలోనే యడియూరప్పను తొలగించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. కరోనా వైఫల్యాన్ని సాకుగా చూపి ప్రత్యర్ధులు పావులు కదిపారు. దాని మీద ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్య నరేంద్రమోడీని ఉద్దేశించే అన్నది స్పష్టం. జూన్‌ మొదటి వారంలో విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు స్పందించారు.” నేను ఎవరినీ విమర్శించను, నాకు ప్రత్యామ్నాయం లేరంటే నేను అంగీకరించను, ప్రత్యామ్నాయ వ్యక్తులు రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎల్లవేళలా ఉంటారు, నాకు ఎలాంటి గందరగోళమూ లేదు, హైమాండ్‌ నాకు అవకాశం ఇచ్చింది, నాశక్తికి మించి పని చేస్తున్నాను. మిగిలిందంతా అధిష్టానమే చూసుకుంటుంది. వారి విశ్వాసం ఉన్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా.” అన్నారు.
దక్షిణ భారత్‌లో ఉన్న ఒక్క కర్ణాటకలో కూడా కాషాయ జెండా ఎగరకపోయినా ఫరవాలేదు, యడియూరప్పను తొలగించాల్సిందే అనుకుంటే తప్ప నాయకత్వమార్పిడి జరిగే అవకాశాలు లేవు. ప్రత్యర్ధుల మీద మాదిరి ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యుల లేదా ఆశ్రితుల అక్రమ సంపాదనల మీద దాడులు చేసినా, కేసులు నమోదు చేసినా పోయేది పార్టీ పరువే. ఇప్పటికీ ముఖ్యమంత్రి, కుటుంబసభ్యుల మీద కేసులు పరిష్కారం కాలేదు. సెక్స్‌ కుంభకోణంలో ఇప్పటికే ఉద్యోగం పొగొట్టుకున్న మంత్రి రమేష్‌ జర్కిహౌలికి యడియూరప్ప పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఒక భూమి డీనోటిఫికేషన్‌ వ్యవహారంలో యడియూరప్ప ప్రమేయం ఉందనే ఫిర్యాదులు రావటంతో ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశించింది. జెడిఎస్‌ ఎంఎల్‌ఏ కుమారుడిని డబ్బు, మంత్రిపదవితో ప్రలోభపెట్టారంటూ 2019లో యడియూరప్పమీద దాఖలైన కేసు ఇంకా ఉంది.ఇలాంటివి అనేక ఆరోపణలు ఉన్నా చలించటం లేదు.


యడియూరప్ప మీద తిరుగుబాటును సమర్ధిస్తే కలిగే లాభనష్టాల గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మదింపు వేస్తున్నట్లు వార్తలు. లింగాయత్‌ సామాజిక తరగతికి రిజర్వేషన్ల అంశం ఎటూ తేలటం లేదు. యడియూరప్ప ఆ సామాజిక తరగతిలో ఒక కులానికి చెందిన వ్యక్తి. ఒక వేళ ముఖ్యమంత్రిపదవి నుంచి తొలగిస్తే మరొక బలమైన సామాజిక తరగతి మీద ఆధారపడాల్సి ఉంటుందన్నది ఒక ఆలోచన. అలాంటపుడు కురుబల మీద ఆధారపడాల్సి వస్తుందని, అందువల్లనే ఆ సామాజిక తరగతికి చెందిన మంత్రి ఈశ్వరప్పతో ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు జెండా ఎగురవేయించారన్నది ఒక అభిప్రాయం. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలలో ఆరితేరిన యడియూరప్ప అంత తేలికగా లొంగబోరని చెబుతున్నారు. ప్రస్తుతం 224 సభ్యులున్న అసెంబ్లీలో బిజెపికి ఉన్న బలం 119 మాత్రమే. అంటే కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి గెలిచిన వారు దూరమైనా ప్రభుత్వం నిలిచే అవకాశం లేదు. తనతో పాటు కనీసం 30-35 మందిని యడియూరప్ప తీసుకుపోగలరని భావిస్తున్నారు. ఒక వేళ జెడిఎస్‌తో మిగిలిన బిజెపి సభ్యులు చేతులు కలిపినా ప్రయోజనం ఉండదు. నరేంద్రమోడీ పేరుతో ఓట్లడిగి బీహార్‌లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా బయటపడినా అసోంలో పెద్ద మెజారిటీ రాలేదు, పశ్చిమబెంగాల్లో అనూహ్య ఓటమి నేపధ్యంలో కర్ణాటకలో మోడీ బొమ్మను చూపి ఓట్లడిగే పరిస్ధితిలో బిజెపి ఉందా అంటే అనుమానమే. తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ, షా వంటి పెద్దలు ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నింటా మిగతా చోట్ల మాదిరే ఓట్లు తగ్గాయి.

కుల రాజకీయాలు నడుస్తున్నంత కాలం ఎడియూరప్ప తన సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. దానికి తోడు ఐక్యంగా పనిచేసే కుటుంబం కూడా ఉంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారందరూ ఐక్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దీపాలు చక్కపెట్టుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. కుటుంబపాలన గురించి అనేక చోట్ల బిజెపి పెద్ద కబుర్లు చెబుతుంది, ఆ పేరుతో ఓట్లు దండుకుంది. కానీ కర్ణాటకలో అసలు అలాంటిదేమీ లేదన్నట్లుగా ఉంటుంది. పెద్ద కుమార్తె పద్మావతి యడియూరప్ప ఇంట్లోనే ఉంటారు, ఆయన అధికారిక పర్యటనలను కూడా ఖరారు చేస్తారు. రెండవ కుమార్తె అరుణాదేవీ అఖిల భారత వీరశైవ మహాసభ మహిళా విభాగ అధ్యక్షురాలు. మూడవ కుమార్తె ” కుటుంబ వ్యాపారాలను ” చూసుకుంటారు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర షివమొగ్గ లోక్‌సభ సభ్యుడు. కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. రెండవ కుమారుడు విజయేంద్రకు ఎలాంటి పదవులు లేకపోయినా సూపర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్‌-జెడిఎస్‌ల నుంచి రెండు సంవత్సరాల క్రితం ఎంఎల్‌ఏల కొనుగోలులో ప్రధాన పాత్రధారి అని చెబుతారు.తనను ముఖ్యమంత్రిగా తొలగిస్తే విజయేంద్రను వారసుడిగా అంగీకరిస్తే యడియూరప్ప ఏ క్షణంలో అయినా వైదొలుగుతారు. వచ్చే ఎన్నికల్లో విజయేంద్ర మైసూరు జిల్లా వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ముందే ప్రకటించేశారు. బిజెపిలో కుమ్ములాటలకు ఇదే మూలం.


కర్ణాటక బిజెపిలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఎవరి ప్రయోజనాలు వారివి. ఆ పార్టీ వ్యవహారాలు చూసినపుడు యడియూరప్ప కొరకరాని కొయ్య. ఆయన చుట్టూ పార్టీ నడవాలి తప్ప పార్టీ చెప్పినట్లు నడిచే తత్వం కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం ఉన్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. యడియూరప్ప లేకపోతే అదీ ఉండదు, వారికి కావాల్సింది అధికారం, విలువలు-వలువలతో పనిలేదు కనుక బిజెపి కేంద్ర పెద్దలు కూడా ఇప్పటికైతే చేయగలిగింది లేదు. నేను గాని ఈలవేస్తే అనే పరిస్దితి లేదు. కానీ అదే యడియూరప్ప ఈల వేస్తే బిజెపి ఖాతా నుంచి కర్ణాటక అవుట్‌ !