ఎం కోటేశ్వరరావు
నాలుగు నెలల క్రితం లోకల్ సర్కిల్స్ అనే సంస్ధ ఒక సర్వే జరిపింది. దాని ప్రకారం పెరుగుతున్న చమురు ధరల ఖర్చును సర్దుబాటు చేసుకొనేందుకు ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నామని 51శాతం మంది చెప్పారు. అత్యవసర వస్తువుల మీద ఖర్చు తగ్గించుకోవటం బాధాకరంగా ఉందని 21శాతం మంది అన్నారు. ఆ సర్వే రోజు ఢిల్లీలో పెట్రోలు ధర 90.93, డీజిలు ధర రూ.81.32 ఉంది. జూన్ 21న 97.22, 87.97కు పెరిగాయి. అంటే పైన పేర్కొన్న జనాలు ఇంకా పెరుగుతారని వేరే చెప్పనవసరం లేదు. అచ్చేదినాలలో ఉన్నాం కనుక దేశభక్తితో ఇతర ఖర్చులు తగ్గించుకొని దేశం కోసం త్యాగం చేస్తున్నాం. జూన్ 21న చమురు మార్కెట్లో బ్రెంట్ రకం ముడిచమురు పీపాధర 73.50కు అటూ ఇటూగా, మన దేశం కొనుగోలు చేసే రకం ధర.72.39 డాలర్లుగా ఉంది. సాధారణంగా బ్రెంట్ కంటే ఒక డాలరు తక్కువగా ఉంటుంది.
కొంత మంది పాలకులకు, కొన్ని పార్టీలకు చరిత్ర అంటే మహాచిరాకు. ఎందుకంటే జనాలు వాటి పేజీలను తిరగేస్తే బండారం బయట పడుతుంది. గతంలో ఏమి చెప్పారో ఇప్పుడేమి చెబుతున్నారో జనం చర్చించుకుంటారు. ప్రతిఘటనకు ఆలోచనలే నాంది కనుక, జనాన్ని ఏదో ఒక మత్తులో చేతనా రహితంగా ఉంచాలని చూస్తారు. చమురు ధరల గురించి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమి చెప్పారో, ప్రధానిగా ఉంటూ ఆయనేమి చేస్తున్నారో, సచివులేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటం అవసరం.
మరోవైపున చమురు ధరలు పెంచటం వలన సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతేడాది జూన్30న చెప్పారు. ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్ చేసిన ఆందోళనను ప్రస్తావించి ఈ వ్యాఖ్య చేశారు.కుటుంబంలో సమస్య తలెత్తినపుడు భవిష్యత్ అవసరాలను చూసుకొని జనాలు సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెడతారు. చమురు ధరల పెంపును కూడా ఇదే విధంగా చూడాలి. చమురు పన్నుల ద్వారా వసూలు చేస్తున్న డబ్బును ఆరోగ్యం, ఉపాధి, ఆర్ధిక భద్రత చేకూరే ఇతర వాటి మీద ఖర్చు చేస్తున్నాం. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ యోజన పధకం కింద పేదలు, రైతులకు అనేక పధకాల కింది 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించాం. జనాల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం. ఆరునెలల పాటు ఉచితంగా రేషన్ మరియు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పేదలకు సంక్షేమ పధకాలను అమలు జరుపుతుంటే సోనియా గాంధీ, కాంగ్రెస్ భరించలేకపోతున్నాయి.” అన్నారు. ఏడాది తరువాత కూడా ఇదే పద్దతిలో సమర్ధించుకున్నారు.
సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నాం కనుక చమురు ధరలను తగ్గించేది లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 13న కరాఖండిగా చెప్పేశారు. ధరలు జనానికి సమస్యగా ఉందని తెలిసినప్పటికీ చేసేదేమీ లేదన్నారు. వాక్సిన్ల కోసం 35వేల కోట్లు, ఎనిమిది నెలల పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వటానికి ప్రధాని మంత్రి గరీబ్ కల్యాణయోజన పధకం కింద లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు.వేలాది కోట్ల రూపాయలను కిసాన్ సమ్మాన్ యోజన కింద బ్యాంకుల్లో జమచేశాము, రైతులకు కనీస మద్దతు ధరలను పెంచాము కనుక ఈ ఏడాది ఇవన్నీ ఉన్నందున చేయగలిగిందేమీ లేదన్నారు.
ఇవన్నీ ఇప్పుడు చెబుతున్న సాకులు మాత్రమే. ఆరు సంవత్సరాల క్రితం నుంచి క్రమంగా పెంచటంతో పాటు గతేడాది బడ్జెట్ సమయంలోనే చమురు పన్నులు భారీగా పెంచారు. గత మూడు సంవత్సరాలలో చమురు పన్ను ద్వారా వచ్చిన ఆదాయ సంఖ్యలే అందుకు సాక్షి. ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన లోక్‌సభకు మంత్రి ప్రధాన్ ఇచ్చిన సమాధానం ప్రకారం గత మూడు సంవత్సరాలలో వచ్చిన ఆదాయం ఇలా ఉంది.2018-19లో 2.13లక్షల కోట్లు, 2019-20లో 1.78లక్షల కోట్లు, 2020-21లో ఏప్రిల్ నుంచి జనవరి వరకు (పది నెలలకు) 2.94లక్షల కోట్లు వచ్చింది. కరోనా రెండవ తరంగం వస్తుందని ముందే ఊహించి ఇంత భారీ ఎత్తునపన్నులు విధించినట్లు భావించాలా ? ఇన్ని కబుర్లు చెబుతున్నవారు వాక్సిన్ల భారాన్ని రాష్ట్రాల మీద వేసేందుకు ఎందుకు ప్రయత్నించినట్లు ? 2014-15లో అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్రం పెట్రోలు మీద రు.29,279 కోట్లు, డీజిలు మీద 42,881 కోట్లు వసూలు చేయగా ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది మార్చి 22న లోక్‌సభలో చెప్పినదాని ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి వరకు పెట్రోలు మీద రు.89,575 కోట్లు, డీజిలు మీద రు.2,04,906 కోట్లు ఎక్సయిజ్ పన్ను వసూలైంది. ఇంత పెంపుదల రైతులు, కరోనా కోసమే చేశారా ? కరోనా నిరోధ పరికరాలు, ఔషధాల మీద జిఎస్‌టి తగ్గించటానికి ససేమిరా అని వత్తిడి తట్టుకోలేక నామ మాత్ర రాయితీ ఇచ్చిన పెద్దలు చెబుతున్నమాటలివి. బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉండగా ఏమి చెప్పారు ? ఏమి చేశారు ?
కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి చమురు ధరల పెరుగుదల గొప్ప తార్కాణం అని 2012 మే 23న ఒక ట్వీట్ ద్వారా నరేంద్రమోడీ విమర్శించారు.బహుశా అప్పటికి ప్రధాని పదవి ఆలోచన లేదా లేక ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకొనే ఎత్తుగడలో భాగంగా చెప్పారా ? ధరల పెంపుదల వలన గుజరాత్ పౌరుల మీద వందల కోట్ల భారం పడుతుందని కూడా నాడు ముఖ్యమంత్రిగా మోడీ చెప్పి ఉంటారు. 2012లో రైలు ఛార్జీల పెంపు పేదలు, రైతులకు వ్యతిరేకం అని నిరసన తెలుపుతూ గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్రానికి లేఖ రాశారు.అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేశాడన్నట్లుగా 2014లో అధికారానికి వచ్చిన తొలి నెలలోనే ప్రధాని నరేంద్రమోడీ తన వాగ్దానాల్లో ఒకటైన ధరల పెరుగుదల అరికట్టటం, అచ్చేదిన్ అమల్లో భాగంగా రైలు ప్రయాణీకుల ఛార్జీలు 14.2శాతం, సరకు రవాణా 6.5శాతం పెంచారు. దివంగత సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ మాటలను పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న స్కృతి ఇరానీ తీరుతెన్నులు తెలిసిందే. బిజెపి కనుక కేరళలో అధికారానికి వస్తే లీటరు పెట్రోలు, డీజిల్ అరవై రూపాయలకే అందిస్తామని ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనమ్ రాజశేఖరన్ ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. వాటిని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే ఆధరకు ఇవ్వవచ్చని చెప్పారు. చమురును జిఎస్‌టి పరిధిలోకి తెచ్చేందుకు ఎల్‌డిఎఫ్ అంగీకరించటం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్ గారు రోజువారీ ధరల పెంపుదల వినియోగదారులకే మంచిదని, తమ ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధించదని చెప్పారు.
ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చివరికి అదే నిజమై కూర్చుంటుందన్న జర్మన్ నాజీ మంత్రి గోబెల్స్‌ను బిజెపి పెద్దలు, పిన్నలు ఆదర్శంగా తీసుకున్నారు. కేంద్రం విధించే ఎక్సయిజ్ పన్నులో 41శాతం తిరిగి రాష్ట్రాలకే పోతుందని, అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలని నిరంతరం చెబుతుంటారు. అదే వాస్తవం అయితే బిజెపి పాలిత రాష్ట్రాలు ముందుగా ఆ పని చేసి ఆదర్శంగా నిలిచి ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల మీద ఎందుకు వత్తిడి తేవటం లేదు ? ఒక్కటంటే ఒక్క రాష్ట్రమైనా ఆపని ఎందుకు చేయలేదు?
యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో ఎలా ఉందో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం××× ధర డాలర్లలో
2010-11××× 85.09
2011-12××× 111.89
2012-13××× 107.97
2013-14××× 105.52
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.57
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.57
2020-21××× 44.82
2021-22 సంవత్సరం ఏప్రిల్ మాసంలో 66.61, మే నెలలో 72.08 డాలర్లు ఉంది. ఈ సంవత్సరాలలో ధరలు తగ్గితే వినియోగదారులకు ధరలు తగ్గాలి, పెరిగితే పెరగాలి అని చెప్పారు. అదే తర్కాన్ని వర్తింప చేస్తే ప్రభుత్వాలకు కూడా ఆదాయం తగ్గాలి. జరిగిందేమిటి ? ఎలా పెరిగిందో ముందే చూశాము. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వినియోగదారుల జేబులు గుల్ల అయ్యాయి. చమురు ధర 72 డాలర్లు ఉంటేనే మోడీ ఏలుబడిలో పెట్రోలు ధర వంద రూపాయలు దాటింది. అదే పూర్వపు స్ధాయికి చేరితే…… మోత మోగుతుందని వేరే చెప్పాలా ?
సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో బిజెపి చేస్తున్న ప్రచారం పని చేస్తున్న కారణంగానే అనేక మంది పన్ను తగ్గించాల్సింది రాష్ట్రాలే అనుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పెట్రోలు మీద యూపిఏ హయాంలో లీటరుకు విధించిన రూ.9.48 నుంచి 32.98కి డీజిలు మీద రు.3.56 నుంచి 31.80కి పెంచాలని ఏ రాష్ట్రం కోరిందో చెప్పాలని బిజెపి పెద్దలను నిలదీయండి, సమాధానం ఉండదు. ఈ మొత్తాలలో రాష్ట్రాలకు వాటా లేని సెస్‌లు, డ్యూటీలే ఎక్కువ ఉన్నాయి. అందువలన ఈ మొత్తాల నుంచి 41శాతం లెక్కవేసి దానికి, రాష్ట్రాలు విధించే వాట్‌ను కలిపి చూడండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయమే ఎక్కువ కదా, కనుక రాష్ట్రాలే తగ్గించాలని బిజెపి పెద్దలు వాదిస్తారు. అందుకే మెజారిటీ రాష్ట్రాలు మీవే కదా ఆ పని ముందు అక్కడ ఎందుకు చేయలేదు అంటే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగం కోసం చమురు మీద లీటరు పెట్రోల మీద రెండున్నర, డీజిలు మీద నాలుగు రూపాయల సెస్ విధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వినియోగదారులకు పెంచలేదు. మరి ఆ సొమ్మును ఎలా వసూలు చేస్తారు ? పైన చెప్పుకున్న ఎక్సయిజు పన్ను నుంచి ఈ మొత్తాన్ని సెస్ ఖాతాకు మార్చారు. ఈ మొత్తాలనుంచి రాష్ట్రాలకు వచ్చేదేమీ ఉండదు. అలాగే లీటరుకు వసూలు చేస్తున్న రు.18 రోడ్డు మరియు మౌలిక సదుపాయాల సెస్. వీటి నుంచే చమురు, గ్యాస్ పైప్‌లైన్లు, జాతీయ రహదారులు, రాష్ట్రాలకు రహదారులకు నిధులు ఇస్తున్నారు. మరోవైపు వినియోగదారుల చార్జీల పేరుతో వాటిని వినియోగించుకున్నందుకు జనాల నుంచి వసూలు చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే మన డబ్బులతో మనమే రోడ్లు వేసుకొని వాటికి టోల్‌టాక్సు మనమే కడుతున్నాం. ఇవన్నీ పోను మిగిలిన మొత్తాల నుంచే రాష్ట్రాలకు 41శాతం వాటా ఇస్తారు. అసలు మోసం ఇక్కడే ఉంది.
కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో ఏడాదికి ఒక్కో రైతుకు ఆరువేల రూపాయలు ఇస్తున్నట్లు ఎన్నికల కోసం ఒక పధకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపున ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పెట్రోలు,డీజిలు మీద వ్యవసాయ సెస్ పేరుతో ప్రతిపాదించిన మొత్తాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా 49వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. జనమంతా చమురు కొంటారా అని వాదించే వారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వాహనాలు నడిపేవారందరూ వ్యవసాయం చేయరు కదా ? వారి కోసం అందరిదగ్గర నుంచి ఎందుకు వసూలు చేయాలి ? కరోనా కారణంగా చమురు వాడకం తగ్గింది గానీ, ప్రభుత్వాలకు గణనీయంగా ఆదాయం పెరగటం వెనుక మతలబు పెంచిన పన్నులే. మంచి జరిగితే తమ ఖాతాలో, చెడు జరిగితే రాష్ట్రాల ఖాతాలో వేయటం కరోనా విషయంలో చూశాము. కరోనా మీద విజయం సాధించామని చెప్పుకొన్నపుడు నరేంద్రమోడీ అండ్‌కోకు రాష్ట్రాలు గుర్తుకు రాలేదు, తీరా రెండవ తరంగంలో పరిస్ధితి చేజారటంతో ఆరోగ్యం, వైద్యం రాష్ట్రాల బాధ్యత అంటూ ప్రచారానికి దిగారు.
2014 మే నెలలో ఢిల్లీలో ఒక లీటరు పెట్రోలు ధర రు.71.41. దీనిలో చమురు ధర 63శాతం, కేంద్ర పన్నులు 16శాతం, రాష్ట్ర పన్ను 18శాతం, డీలరు కమిషన్ మూడు శాతం ఉంది. అదే 2021 ఫిబ్రవరిలో లీటరు ధర రూ.86.30. దీనిలో కేంద్ర పన్ను 37శాతం, చమురు ధర 36శాతం రాష్ట్ర పన్ను 23శాతం, డీలరు కమిషన్ నాలుగుశాతం ఉంది. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతున్నందున ఈ శాతాల్లో మార్పులు ఉంటాయి. దీన్ని రూపాయల్లో చెప్పుకుంటే రు.86.30లో కేంద్రానికి రు.32.98, చమురు కంపెనీలకు రు.29.71, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.19.92, డీలరు కమిషన్ రు.3.69 వస్తాయి.
పేదలందరూ పెట్రోలు కొంటారా ? వాహనాలు లేని వారు కూడ కొని తాగుతారా అంటూ వితండవాదనలు చేసే వారిని చూస్తాము. అవన్నీ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ముందుకు తెచ్చిన ప్రచార అస్త్రాలు. ప్రతి వస్తువు ధర పెరుగుదల, పన్నుల పెంపు మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఆ సూచికలను నిర్ణయించేందుకు అన్ని రకాల వినియోగ వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకొని ప్రతి నెలా సూచిక తగ్గిందా లేదా అని నిర్ధారిస్తారు. ఉద్యోగులకు, కార్మికులకు, ఇతర వేతన జీవులకు ఆ ప్రాతిపదికనే కరువు భత్యాన్ని నిర్ణయిస్తారు.ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. డీజిలు ధరలు పెరిగితే ప్రజారవాణాకు వినియోగించే బస్సుల నిర్వహణ, సరకు రవాణా లారీ, వ్యవసాయదారుల ట్రాక్టర్లు, పంపుసెట్ల ఖర్చు పెరుగుతుంది. పరిశ్రమల్లో జనరేటర్లను వాడితే అక్కడ తయారయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇలా పరోక్షంగా యావత్ జనజీవనం మీద చమురు ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది.
రానున్న కొద్ది వారాల్లో పీపా చమురు 80డాలర్లకు చేరవచ్చని జోశ్యం చెబుతున్నారు. గత రెండు నెలల్లో మార్కెట్ తీరుతెన్నులను చూసినపుడు ముందుగానే పెరిగినా ఆశ్చర్యం లేదు. వివిధ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆర్ధిక కార్యకలాపాల పెరుగుదల దానికి ఒక కారణంగా చెబుతున్నారు. జోశ్యాలు నిజమౌతాయా లేదా అన్నది పక్కన పెడితే 70-80 డాలర్ల మధ్య చమురు ధరలు ఉన్నప్పటికీ మన వినియోగదారులకు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగానే ఉంటుంది. ఇదే జరిగితే వినియోగదారులకు, ముందే చెప్పుకున్నట్లు యావత్ జనానికి ధరల సెగ, అది పాలకులకు రాజకీయ సెగగా తగలటం అనివార్యం. యుపిఏ చివరి మూడు సంవత్సరాలలో జరిగింది అదే. అదే నరేంద్రమోడీ సర్కార్‌కూ పునరావృతం అవుతుందా ?