Tags

, ,



ఎం కోటేశ్వరరావు
కొంత అతిశయోక్తిగానే ఉండవచ్చు గానీ అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న ధరల తీరు తెన్నులను చూస్తే మన జనాలను కరోనా కంటే చమురు ధరలే ఎక్కువగా భయపెట్టేట్లు ఉన్నాయి. బుధవారం నాడు ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం చమురు ధర 75.30 డాలర్లుగా ఉంది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికాతో కరాఖండిగా వ్యవహరించే ఇబ్రహీం రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గనుక అని ఒక కారణం చెప్పారు. అమెరికా ఇతర దేశాలు ఇరాన్‌తో జరుపుతున్న అణు చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడవచ్చని చెబుతున్నారు. అమెరికాలో చమురు నిల్వలు తగ్గిపోవటం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచుతాయో లేదో తెలియని పరిస్ధితి కూడా ఇతర కారణాల్లో ఉన్నాయి. కరోనా తగ్గిపోయి క్రమంగా సాధారణ పరిస్ధితి ఏర్పడితే ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ముడిచమురు పీపా ధర వంద డాలర్ల వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో అమెరికాలో షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరిగితే డిమాండ్‌ తగ్గి ధరలు అదుపులో ఉండటం లేదా కొంత మేరకు తగ్గవచ్చని జోశ్యాలు చెప్పిన వారు పునరాలోచనలో పడ్డారు. దీనితో పాటు ఇరాన్‌కు కొత్త అధ్యక్షుడు వస్తే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఆంక్షలు ఎత్తివేస్తే సరఫరా పెరుగుతుందని ఆశించిన వారంతా అలాంటి అవకాశాలు లేవని భావించటంతో ధరలు భగ్గుమన్నాయి.
అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌(ఏపిఐ) మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్‌ 18వ తేదీతో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7.199 మిలియన్‌ పీపాలకు తగ్గాయి. అంతకు ముందు వారంలో 8.537 మిలియన్‌ పీపాలు ఉన్నాయి. గతేడాది జనవరితో పోల్చితే ఎక్కువే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరితో పోల్చితే తగ్గాయి.ఇది కూడా ధరల పెరుగుదల మీద ప్రభావం చూపింది. ఊహించినదానికంటే ముందుగానే వంద డాలర్లకు పెరుగుతుందా ? వచ్చే నెలలో ఒపెక్‌+దేశాల అదనపు ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చినా ధరలు తగ్గకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం.
ద్రవ్యోల్బణం, చమురు గిరాకీ పెరుగుదల, చమురు కంపెనీల వాటాదార్ల వత్తిడి, పర్యావరణం వంటి కారణాలతో రానున్న మూడు సంవత్సరాలలో ధరల పెరుగుదలతో పాటు చమురు సంక్షోభం తలెత్తవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో విద్యుత్‌ వాహనాల తయారీ మీద కేంద్రీకరణ, అమెరికా వంటి దేశాలలో పునరుత్పాదక ఇంథనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరగవచ్చన్నది విశ్లేషణల సారాంశం. ఈ పరిణామాలు, పర్యవసానాలకు సిద్దం గాని మనవంటి దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు. అది పాలకుల మీద వత్తిడికి దారి తీసి రాజకీయ పర్యవసానాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రానున్న ఆరునెలల్లో ముడి చమురు ధర వంద డాలర్లకు పెరగవచ్చన్నది ఒక అంచనా అయితే రానున్న సంవత్సరాలలో 130 డాలర్లకు పెరగవచ్చని చెబుతున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత పరిణామాలు ఎలా ఉండేది చెప్పలేని స్ధితి. చమురు మార్కెట్‌ను కృత్రిమంగా అదుపు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గతంలో పడిపోయిన 35 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరగవచ్చు లేదా తిరిగి 35 డాలర్లకు దిగిరావచ్చన్నది కొందరి తర్కం. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పెరగాలి, అది జరగాలంటే ఆ రంగంలో పెట్టుబడులు కావాలి. కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వలన ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. ఇది చమురు కొరతకు దారి తీయవచ్చు. పర్యావరణ సమస్యల కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించాలని డచ్‌ కోర్టు షెల్‌ కంపెనీని ఆదేశించింది. మరోవైపున అంతర్జాతీయ ఇంథన సంస్ధ కొత్తగా నిక్షేపాల అన్వేషణలను నిలిపివేయాలని కోరింది.
అమెరికాలో షేల్‌ చమురు ఉత్పత్తి పరిమితంగా ఉన్నందున, తిరిగి పెరిగినా మార్కెట్‌ పడిపోయే అవకాశం లేదని ఒపెక్‌ దేశాలు భావిస్తున్నాయి.ఈ ఏడాది అమెరికా చమురు ఉత్పత్తి రోజుకు కేవలం రెండు లక్షల పీపాలు మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పెరగవచ్చు. షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఒపెక్‌ దేశాలు గమనంలోకి తీసుకున్నాయి. గతేడాది రికార్డు స్ధాయిలో చమురు ధరలు పడిపోయినందున షేల్‌ ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఆ కంపెనీలు లాభాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సంవత్సరం అమెరికా ఉత్పత్తి రోజుకు 11.2 మిలియన్‌ పీపాలు ఉంటుందని, అది గతేడాది కంటే లక్షా 20వేల పీపాలు తక్కువని తాజా జోశ్యాలు ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్‌ టక్సాస్‌ ఇంటర్‌మీడియెట్‌(డబ్ల్యుటిఐ) రకం చమురు ధర పీపాకు 60 డాలర్లకు మించితేనే అక్కడి కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి. అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువే ఉంది. మార్కెట్‌ స్ధిరపడింది అనుకున్న తరువాత వచ్చే ఏడాది ఉత్పత్తి పెంచవచ్చని భావిస్తున్నారు. తమ లాభాలు పెరుగుతాయనుకుంటేనే పెట్టుబడిదారులు మరింత ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను బట్టి ఆగస్టులో ముడి చమురు ఉత్పత్తి పెంచాలా వద్దా అని చమురు ఉత్పత్తి దేశాల సంస్ధ (ఒపెక్‌) చర్చలు జరుపుతోంది.వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్‌లో ఉన్న లోటును పూడ్చేందుకు ఉత్పత్తి పెంచాలా అన్న అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత లండన్‌ మార్కెట్‌లో ముడిచమురు బ్రెంట్‌ ధర 75 డాలర్లు దాటింది. మే నుంచి జూలై మధ్య రోజుకు 20లక్షల పీపాల ఉత్పత్తి పెంచాలన్న అంశాన్ని ఒపెక్‌ దేశాలు సమీక్షిస్తున్నాయి, అయితే ఊహించినదాని కంటే ధరలు పెరగటంతో అంతకంటే ఎక్కువే పెంచాలనే వత్తిడి వస్తోంది. గిరాకీ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే నిలిపివేసిన ఉత్పత్తిని పునరుద్దరించటం గురించి పరిశీలిస్తామని ఒపెక్‌ దేశాల నేతగా ఉన్న సౌదీ అరేబియా చమురు మంత్రి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 30లక్షల పీపాల కొరత ఉన్నట్లు గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా వేసింది. ఒపెక్‌+దేశాలు రోజుకు 58లక్షల పీపాలు ఉత్పత్తి చేస్తున్నాయి. సౌదీతో రోజువారీ ఫోన్లో మాట్లాడుతున్న రష్యా తక్షణమే ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాల్సిన పరిస్ధితి లేదని భావిస్తోంది.
అమెరికాలో చమురు నిల్వల గురించి వస్తున్న వార్తల కారణంగా ముందస్తు చమురు మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో సరఫరా చేయాల్సిన డబ్య్లుటిఐ చమురు ధర పీపాకు 1.2 డాలర్లు పెరిగింది. గత పద మూడు సంవత్సరాలలో రెండు నెలల మధ్య ఒక డాలరుకు మించిన వ్యత్యాసం కేవలం రెండు సార్లు (2008, 2014)మాత్రమే జరిగింది. ఏడాది క్రితం కొనుగోలు చేసిన చమురును ఎక్కడ నిల్వచేసుకోవాలో తెలియక ఒప్పందం ప్రకారం చమురు సరఫరాను స్వీకరించలేని కంపెనీలు ఎగుమతిదార్లకు ఎదురు డాలర్లు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నాయి.ఇప్పుడు చమురుశుద్ది కర్మాగారాలు అమెరికాలో పూర్తి స్దాయిలో పని చేస్తుండటంతో ఆ నిల్వలన్నీ ఖాళీ అవుతున్న కారణంగా చమురు నిల్వ టాంకులు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జూన్‌ తరువాత ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచనట్లయితే చమురు కొరత ఏర్పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ హెచ్చరించింది.
ప్రపంచ చమురు నిల్వల్లో 2012 అంచనా ప్రకారం ఐదో వంతు (296.5 బిలియన్‌ పీపాలు) నిర్దారిత చమురు కలిగి ఉంది వెనెజులా. మార్కెట్లో ధరలు పెరిగిన కారణంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తిని పెంచనున్నది. గతేడాది చమురు ధరలు భారీగా పతనమైనందున రోజుకు నాలుగు లక్షల పీపాలకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏడులక్షలు జరుగుతోందని చమురుశాఖ మంత్రి ఎల్‌ ఇసామీ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి పదిహేను లక్షల పీపాలకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నందున ఉత్పత్తి చేసినప్పటికీ కొనుగోలుదార్లు ముందుకు రాకపోతే ప్రయోజనం లేదు. అందువలన ఆంక్షల గురించి జో బైడెన్‌ సర్కార్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తేనే చర్చలు, ఆంక్షల తొలగింపు అని అమెరికా అంటోంది. మన దేశంలోని రిలయన్స్‌ చమురు కంపెనీ కోసం గతంలో సెనెటర్‌గా బైడెన్‌ ఉన్నపుడు సహాయకుడిగా పని చేసిన భారతీయ లాబీయిస్టు అంకిత్‌ దేశారు ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ చమురు శుద్ది కర్మాగారానికి పని కావాలంటే ముడి చమురు కావాలి. వెనెజులా వద్ద చమురు ఉన్నప్పటికీ డీజిల్‌ తయారీకి అవసరమైన శుద్ది కర్మాగారాలు లేవు. వెనెజులా నుంచి చమురు దిగుమతి చేసుకొని డీజిల్‌ను తయారు చేసి తిరిగి ఎగుమతి చేసే అవకాశం ఉన్నందున ఏదో ఒక రూపంలో ఆంక్షలను సడలించి రిలయన్స్‌ కంపెనీకి తోడ్పడాలని అంకిత్‌ దేశారు రాయబారాలు జరుపుతున్నారు. అంబానీలతో నరేంద్రమోడీకి విడదీయరాని సంబంధాలు ఉన్నందున ఆయన కూడా జోక్యం చేసుకోవచ్చు. అయితే తమ కంపెనీ అమెజాన్‌కు మోడీ మొండి చేయి చూపుతున్నందున బైడెన్‌ యంత్రాంగం ఏమేరకు దిగి వస్తుందో తెలియదు. అమెజాన్‌-రిలయన్స్‌ రాజీపడితే…..ఏమో ఏదైనా జరగవచ్చు !