Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు

జూన్‌ 22వ తేదీన న్యూ ఢిల్లీలో ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ నివాసంలో బిజెపిని వ్యతిరేకించే కొన్ని పార్టీలు, కొందరు మేథావుల ఇష్టాగోష్టి సమావేశం జరిగింది. దీనికి బిజెపి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా నిర్వహిస్తున్న రాష్ట్ర మంచ్‌ ఫోరమ్‌ పేరుతో ఆహ్వానాలు పంపారు. దీనిలో శరద్‌ పవార్‌, యశ్వంత సిన్హా, ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌) ఘనశ్యామ్‌ తివారీ (సమాజవాది), జయంత్‌ చౌదరి(ఆర్‌ఎల్‌డి), సుశీల్‌ గుప్తా (ఆప్‌), నీలోత్పల్‌ బసు( సిపిఎం) , వినరు విశ్వం( సిపిఐ), పవన్‌ వర్మ (జనతాదళ్‌-యునైటెడ్‌), మాజీ న్యాయమూర్తి ఎపి షా, ఆర్ధికవేత్త అరుణ్‌ కుమార్‌, మాజీ దౌత్యవేత్త కెసి సింగ్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొందరికి ఆహ్వానాలు పంపినప్పటికీ ఎవరూ రాలేదు. బిజెపిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్న కాన్ని పార్టీలకు ఆహ్వానాలు అందిందీ లేనిదీ కూడా స్పష్టత లేదు. ఇది బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ సమావేశం కాదని, కరోనా, నిరుద్యోగం, దేశంలోని వ్యవస్ధలపై జరుగుతున్నదాడుల వంటి అంశాల మీద ఆలోచనలను పంచుకొనేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల సమావేశం అని సిపిఎం నేత నీలోత్పల్‌ బసు చెప్పారు. మిగతావారు కూడా ఇదే పద్దతుల్లో మాట్లాడారు. అయితే ఇది రాజకీయ అంశమే అని జనం భావిస్తున్నారు. బిజెపి గురించి చెప్పాల్సిన పనిలేదు.


ఇప్పటి వరకు దేశంలో జరిగిన పరిణామాలను, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయ ప్రక్రియను చూసినపుడు నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి వన్నీ ఎన్నికలు, అధికారం చుట్టూనే తిరిగాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మొత్తం మీద నయా ఉదారవాద విధానాలను అమలు జరపటం తప్ప వాటి పర్యవసానాలకు ప్రత్నామ్నాయ విధానాలు లేవు. సంకీర్ణ ధర్మం కారణంగా తమ అసలు సిసలు విధానాలను అమలు జరపలేమని ఏ పార్టీ కూడా ఇప్పుడు చెప్పటానికి లేదు. ఎవరితో నిమిత్తం లేకుండానే బిజెపికి గత రెండు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చింది. రాజ్యసభలో కూడా అవసరమైన మెజారిటీ చేకూర్చేందుకు ఇతర పార్టీలు సిద్దంగా ఉన్నట్లు స్పష్టమైంది. అయినప్పటికీ గతంలో కాంగ్రెస్‌ అమలు జరిపిన సంస్కరణలను మరింత వేగంగా, అమానవీయంగా అమలు జరపటం తప్ప కొత్త విధానాలేమీ లేవు. అందువలన ప్రత్యామ్నాయ విధానాలతో నిమిత్తం లేని ఫ్రంట్‌ మరొకటి ఉనికిలోకి వచ్చినా ప్రయోజనం ఏమిటి అన్నది ప్రశ్న.


గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించటం వెనుక దాని అవినీతి అక్రమాలే కాదు, జనానికి ప్రయోజనం లేని విధానాల పర్యవసానం కూడా ఇమిడి ఉంది. నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం గానీ గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో కూడా అలాంటిదే. ఇందిరా గాంధీ పార్టీలో తన ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు దాన్ని ముందుకు తెస్తే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే పేరుతో నరేంద్రమోడీ కొత్త నినాదాలిచ్చారు. తన ప్రయోజనాల కోసం అధ్యక్ష తరహా పద్దతుల్లో ప్రధాని అభ్యర్ధి అంటూ గతంలో వాజ్‌పారు, తాజాగా నరేంద్రమోడీని బిజెపి రంగంలోకి తెచ్చింది. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ ఏర్పడవచ్చేమోగానీ ప్రధాని అభ్యర్ధిని అంగీకరించే అవకాశాలు లేవు.అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.


శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు కొత్తవి కాదు. గతంలో కూడా ఉన్నాయి, అయినప్పటికీ గత ఏడు సంవత్సరాలలో ఇలాంటి సమావేశాలు ఎందుకు జరగలేదు అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సమావేశంలో పాల్గొన్నవారు లోపల ఏమి చర్చించారు, బయటికి ఏమి చెప్పారన్నదానిని పక్కన పెడితే ఇది బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పడాలన్న వాంఛ నేపధ్యంలోనే జరిగిన ప్రయత్నమన్నది స్పష్టం. అయితే అది రూపుదిద్దుకుంటుందా ? తీరుతెన్నులు ఎలా ఉంటాయి ? ఆటంకంగా ఉన్న అంశాలేమిటి ?ఎదురయ్యే సవాళ్లేమిటన్న వాటి గురించి రాబోయే రోజుల్లో చర్చ ప్రారంభం అవుతుంది. మరి ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదా ? ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుందని చెప్పలేము. గతంలో ఏర్పడిన ఫ్రంటులు, సంకీర్ణ ప్రభుత్వాలు వాటి ఫలితాలు, వైఫల్యాలూ అన్నీ పార్టీలు, మేథావుల అన్నింటికీ మించి జనం ముందు ఉన్నాయి. వాటిని విస్మరించి ఏ ప్రయత్నమూ సఫలం కాదు.


దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాలకు తొలిసారిగా కాంగ్రెస్‌ వ్యతిరేకత అంశం ముందుకు వచ్చింది. 1967లో తొలిసారిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో ఐక్యంగా పోటీ చేశాయి. తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తొలిసారిగా ఓడిపోయింది. వాటిని కూల్చివేయటంతో కాంగ్రెస్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.


బిజెపి పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన 2014 ఎన్నికలు మూడు ఫ్రంట్ల మధ్య పోటీగా జరిగాయి. ఒకటి బిజెపి నాయకత్వాన ఉన్న నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌, కాంగ్రెస్‌ నాయకత్వాన యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (యుపిఏ), కాంగ్రెస్‌ను తిరస్కరించండి, బిజెపిని ఓడించండి అనే పిలుపుతో వామపక్షాలు ఒక ఫ్రంట్‌గా విడిగా పోటీ చేశాయి. అందువలన కాంగ్రెస్‌కు భిన్నంగా బిజెపి వ్యతిరేక కూటములు ప్రారంభం నుంచీ ఉన్నాయి. ఇంకా పదేండ్లు ముందుకు పోతే కాంగ్రెస్‌కు అవసరమైన మెజారిటీ లేని కారణంగా బిజెపిని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు వామపక్షాలు యుపిఏ కూటమికి మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందువలన బిజెపి వ్యతిరేకత అన్నది అది తొలిసారి అధికారానికి వచ్చినప్పుడే అంకురించింది. సరికొత్త ఆలోచన అయితే కాదు.


కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది ఆ పార్టీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, అన్నింటికీ మించి రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పట్ల అనుసరించిన కక్ష పూరిత వైఖరి, రాష్ట్రాల పట్ల అనుసరించిన విధానాల వంటి వాటి ప్రాతిపదికన ప్రారంభమైంది. 1975లో అత్యవసర పరిస్ధితిని విధించి మొత్తం ప్రజాస్వామిక హక్కులకే ముప్పుగా తయారైన నేపధ్యంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత అన్నది మరింత స్పష్టంగా ముందుకు వచ్చింది. ఆ సమయంలో రాజకీయంగా తనను వ్యతిరేకించిన పార్టీలు, వ్యక్తులు, శక్తులను అది జైలు పాలు చేసింది. అందువల్లనే అనంతరం జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన జనతా పార్టీలో సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) పూర్వ రాజకీయ విభాగమైన మతశక్తి జనసంఘం, స్వతంత్ర పార్టీ వంటి మితవాద శక్తులు ఉన్నప్పటికీ సిపిఎం దాన్ని బలపరిచేందుకు వెనుకాడలేదు.


గత ఏడు సంవత్సరాల కాలంలో బిజెపి ఒక్క అత్యవసర పరిస్ధితి విధింపు మినహా మిగతా అన్ని రకాల ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల కూల్చివేతలకు చేసిన ప్రయత్నాలు, కేంద్ర దర్యాప్తు సంస్దల దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్ధల దుర్వినియోగం వంటి అంశాలన్నీ ఉన్నాయి. వీటితో పాటు మతోన్మాద మహమ్మారిని ముందుకు తెచ్చింది. వివిధ ఉద్యమాల్లో తన విధానాలను వ్యతిరేకించిన వారి మీద ఉగ్రవాద, దేశద్రోహ నేరాలను మోపుతూ తమను వ్యతిరేకిస్తే అందరికీ ఇదే గతి అని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక చేసింది. కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి పాలనకు వ్యతిరేకత పెరిగే కొద్దీ అది రాజకీయ పార్టీలకు విస్తరించే రోజు ఎంతో దూరంలో లేదు. అందువలన వీటిని వ్యతిరేకించే శక్తులన్నీ సహజంగానే ఐక్యం కావాలని కోరుకుంటాయి. అలాంటి వాంఛకు నిదర్శనమే శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన సమావేశం. కరోనా రెండవ దశను నిర్లక్ష్యం చేయటం, వచ్చిన తరువాత అయినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడకపోవటం అన్నింటినీ మించి ఆక్సిజన్‌, వాక్సిన్ల విషయంలో సుప్రీం కోర్టులో తగిలిన ఎదురుదెబ్బల గురించి తెలిసిందే. ఈ సమయంలోనే ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి బలహీనత, దాన్ని వ్యతిరేకించే శక్తుల బలం వెల్లడైంది. బిజెపి వ్యతిరేక శ క్తుల సమావేశానికి పురికొల్పిన అంశాలు ఇవే. వచ్చే ఏడాది జరిగి ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలను బట్టి ఈ ప్రయత్నాలు ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పవచ్చు.


గత అనుభవాలను చూసినపుడు కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమిలోకి వచ్చేందుకు బిజెపి ఎన్నడూ తటపటాయించలేదు. అధికారం కోసం ఎవరితో అయినా చేతులు కలిపేందుకు అది అర్రులు చాచింది. రాజకీయంగా ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తపించి పోయింది. తన అజెండాను దాచుకోకపోయినా ముందుకు తేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు దాన్నే ముందుకు తెచ్చి అమలు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాల వివాదంలో తాము సంఘపరివార్‌ను వదులుకొనేది లేదని బహిరంగంగా ప్రకటించి జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘం విడిపోయి బిజెపి పేరుతో కొత్త దుకాణం తెరిచింది. ఈ కారణంగానే తరువాత కాలంలో దానికి ఉన్న మతోన్మాద లక్షణం కారణంగా వామపక్షాలు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. (పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమన్వయం చేసుకోవటం వేరు ) మిగతా పార్టీలు మతకోణాన్ని పక్కన పెట్టి అవకాశవాదంతో దానితో చేతులు కలిపాయి. ఇప్పుడు అవి తమ వైఖరిని తేల్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.


బిజెపి వ్యతిరేక కూటమి విషయానికి వస్తే గతంలో బిజెపి లేదా దాని పూర్వ రూపం జనసంఘం మాదిరి ఎవరితో అయినా కలవటానికి ముందుకు వచ్చినట్లుగా కాంగ్రెస్‌ రావటం లేదు. రాజకీయంగా బలహీనపడినప్పటికీ తన షరతుల మీద నడవాలని అది కోరుకుంటోంది. అందుకే ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని వ్యతిరేకించే శక్తులతో రాజీపడేందుకు సిద్దం కావటం లేదు. వాస్తవ పరిస్ధితిని గుర్తించేందుకు సిద్దంగా లేదు. ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా తానే ఏక పార్టీగా చక్రం తిప్పగలననే భ్రమలతో ఉంది.బలంగా ఉన్న చోట్ల ఇతర పార్టీలను ఖాతరు చేయటం లేదు. తొక్కివేసేందుకు వెనుకాడటం లేదు. అయితే ఎంత బలహీనపడినప్పటికీ బిజెపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ లేకుండా లక్ష్యం నెరవేరదు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే రెండు రకాలు. గతంలో కాంగ్రెస్‌ బాధిత పక్షాలు,సహజంగానే కాంగ్రెస్‌ వ్యతిరేకతకు ముందుకు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూల్చివేసిన కారణంగానే తరువాత ఎన్‌టి రామారావు దానికి కేంద్రంగా మారారు. అయితే కాంగ్రెస్‌ బలహీనపడిన తరువాత అవే పార్టీలు బిజెపితో అవకాశవాదంతో జట్టు కట్టాయి. అలాంటి వాటిలో తెలుగుదేశం పార్టీ ఒకటి. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీ కాంగ్రెస్‌తో కూడా చేతులు కలిపింది. గత ఎన్నికల్లో బిజెపిని వ్యతిరేకించింది. ఇప్పుడు తిరిగి ఆ పార్టీతో సంబంధాలకు తహతహలాడుతోంది.


మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి కూడా కూడా అవకాశవాదానికి మారుపేరుగా ఉంది. సమాజవాది పార్టీతో మిత్రపక్షంగా ప్రారంభమై శత్రుపక్షంగా మారింది. గతలోక్‌సభ ఎన్నికల్లో తిరిగి జట్టుకట్టింది. ఇప్పుడు దానితో కలిసే పరిస్ధితి లేదు. అదే విధంగా ముఖ్యమంత్రి పదవికోసం బిజెపితో చేతులు కలిపింది. రాజస్దాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. అదే పార్టీతో వైరమూ పెట్టుకుంది. యుపిఏ ప్రభుత్వానికి గతంలో మద్దతు ఉపసంహరించుకుంది.
శివసేన విషయానికి వస్తే అది బిజెపి బాధిత పార్టీ. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గతంలో బిజెపితో చేతులు కలిపింది, కేంద్ర మంత్రి పదవులను కూడా దక్కించుకుంది.తరువాత అధికారం దగ్గర పంచాయతీ వచ్చి బిజెపితో పోరాడాల్సి వచ్చింది. బిజెపి బాధిత పార్టీగా మారింది. తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు దాసోహం అంటున్నాయి. ఒడిషాలో బిజెడి ఎటూ తేల్చుకోలేని స్ధితిలో ఉంది. తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌-బిజెపిలను రెండింటినీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటుంది. కానీ కేంద్రంలో బిజెపి తీసుకొనే అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇస్తుంది. వైసిపి విషయానికి వస్తే కాంగ్రెస్‌తో దానికి పేచీ లేదు. ఆ పార్టీని అంతం చేసి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత బిజెపితో సమస్యలున్నప్పటికీ దానికి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ముందుకు వస్తుందా అంటే అనుమానమే. బిజెపిని సమర్ధించే విషయంలో బిజెపితో పోటీ పడుతోంది.


పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌తో జతకట్టే అవకాశాలు లేవు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు యశ ్వంత సిన్హా ఆహ్వానం మేరకు ఇతర పార్టీలతో పాటు సమావేశానికి హాజరైనప్పటికీ ఆ పార్టీ ఉండే కూటమిలో చేరటం అనుమానమే. కర్ణాటకలో జెడిఎస్‌ పార్టీ కూడా అవకాశ వాదంతో వ్యవహరించింది. అధికారం కోసం బిజెపి-కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపేందుకు అది సిద్దం. కనుక ఇప్పటికిప్పుడు బిజెపి వ్యతిరేక కూటమి రూపుదిద్దుకోవటం అనేక సమస్యలతో కూడి ఉంది.

కరోనా రెండవ దశ తగ్గుముఖం పట్టి బిజెపిని రాజకీయంగా కొంత మేరకు రక్షించింది. అయితే దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితి రాబోయే రోజుల్లో అసలైన పరీక్ష పెట్టనుంది. బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పాటుకు అది కూడా దోహదం చేస్తుంది. గతంలో ఇందిరా గాంధీ తన అధికారానికి ఎసరు వచ్చినపుడు రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సంఘపరివార్‌ తన అజెండాను అమలు జరిపేందుకు అధికారంలో కొనసాగాలని కోరుకుంటోంది. అందువలన ఒక వేళ ఎన్నికల్లో ఓటమి తధ్యమని తేలితే ఎంతకైనా తెగించినా ఆశ్చర్యం లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో అదే జరిగింది. అందువలన ప్రస్తుతానికి ఊహాజనితమైన ప్రశ్నే అయినప్పటికీ అధికారం కోసం ఏమైనా చేయవచ్చు. అదే జరిగితే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల ప్రాతిపదికన ఏకీకరణ జరుగుతోంది. మన దేశంలో కూడా అలాంటి మధనం జరగాలి. దానికి శరద్‌ పవార్‌ నివాసంలో నిర్వహించిన సమావేశం నాంది పలికితే దాని ప్రాధమిక ప్రయోజనం నెరవేరినట్లే !