Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
వాక్సిన్లు, ఆహారం అందించలేని బోల్సనారో గద్దె దిగు అంటూ గత శనివారం నాడు బ్రెజిల్‌లోని నాలుగు వందల పట్టణాలలో ఏడున్నరలక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. అనేక ప్రాంతాలలో భారీ వర్షాలకారణంగా ప్రదర్శనలు నిర్వహించలేదు. అంతకు ఇరవై రోజుల ముందు జరిగిన నిరసనలో కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు.పదిహేడు దేశాలలో ఉన్న బ్రెజిల్‌ పౌరులు, ఇతరులు కూడా నిరసన తెలిపారు. కరోనా మరణాలు ఐదులక్షలకు చేరిన సందర్భంగా జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరసనతో గుక్కతిప్పుకోలేకపోతున్న అధ్యక్షుడు బోల్సనారో సోమవారం నాడు తన ఆగ్రహాన్ని ఒక టీవీ జర్నలిస్టు మీద చూపాడు.అతగాడి దురుసు ప్రవర్తనను ఖండిస్తూ పదవికి రాజీనామా చేయాలని జర్నలిస్టు యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపున మన దేశానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి కోవాగ్జిన్‌ వాక్సిన్ల కొనుగోలుకు ప్రభుత్వ పెద్దల నుంచి పెద్ద ఎత్తున వత్తిడి చేసినట్లు వెలువడిన వార్తలు బోల్సనారోను మరింత ఇరకాటంలోకి నెట్టాయని చెప్పవచ్చు.
గత ఎన్నికల్లో వామపక్ష వర్కర్స్‌ పార్టీకి వ్యతిరేకంగా బోల్సనారోకు ఓటు వేసిన వారు కూడా రెండేళ్లలో దేశానికి చేసిన నష్టం చాలు గద్దె దిగు అంటూ శనివారం నాటి ప్రదర్శనల్లో నినదించారంటే వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో కోటీ 78లక్షల మందికి వైరస్‌ సోకింది, వారిలో ఐదు లక్షల మంది మరణించారు. ఐసియు పడకలు, ఆక్సిజన్‌ సరఫరాలేక అనేక మంది దుర్మరణం పాలయ్యారు. అయినప్పటికీ బోల్సనారో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు ఒక మిలిటరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినపుడు కూడా ముఖానికి తొడుగు లేకుండా ఉన్నారు. దాంతో గతంలో మీరు ముఖతొడుగు ధరించనందుకు అనేక సార్లు జరిమానా చెల్లించారు కదా అని బ్రెజిల్‌ అతిపెద్ద మీడియా సంస్ద వాన్‌గార్డ్‌ విలేకరి గుర్తు చేయటంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నా ప్రాణం, నా ఇష్టం, తొడుగులేకుండా వస్తాను, నువ్వు నోరు మూసుకో, మిమ్మల్ని చూస్తే అసహ్యం, మీది చెత్త జర్నలిజం, మీదొక పెంట మీడియా, మీరు బ్రెజిల్‌ కుటుంబాలను, మతాన్ని నాశనం చేశారు అంటూ వీరంగం వేశాడు. ఇదిగో ముఖతొడుగు దీన్ని నేను ధరించటం లేదు, ఇప్పుడు మీకు సంతోషమేగా రాత్రి జాతీయ వార్తా కార్యక్రమంలో చూపండి అన్నాడు.మీడియా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సోమవారం నాడు బోల్సనారో విలేకర్ల సమావేశంలో ఆరోపించాడు. సిఎన్‌ఎన్‌ టీవీ శనివారం నాడు ప్రదర్శనలు జరిపిన వారిని ప్రశంసించిందన్నారు. ఆ సందర్భంగానే వాన్‌ గార్డ్‌ టీవి విలేకరి శాంటోస్‌పై విరుచుకుపడ్డారు.
తానుగా ముఖతొడుగును ధరించకపోవటమే గాక కరోనా నిరోధ చర్యలను తీసుకోవటంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాడు. ముఖతొడుగులు, వాక్సిన్ల వలన ఉపయోగం లేదని పదే పదే చెప్పాడు. తాను అధికారంలో ఉన్నంత వరకు కరోనా మీద పోరాడతా, ముఖతొడుగులు ధరించాల్సిన అవసరం లేదని ప్రతి గురువారం దేశ ప్రజల నుద్దేశించి చేసే ఉపన్యాసంలో కూడా చెప్పాడు. ఫార్మాకార్పొరేట్ల ప్రయోజనం కోసం కరోనాను నిరోధించలేని ఔషధాలను వినియోగించాలని ప్రబోధించాడు. ప్రయోజనం లేదని తేలినప్పటికీ దిగుమతి చేసుకున్న కంపెనీలకు అనుకూలంగా మలేరియా నిరోధానికి వినియోగించే క్లోరోక్విన్‌తో చికిత్స చేయాలని వివిధ సందర్భాలలో 84 సార్లు చెప్పాడు. ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం కారణంగా జనంలో తీవ్ర అభద్రతా భావం ఏర్పడింది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల మీద కూడా తాజా నిరసనల ప్రభావం పడటం అనివార్యం. పదవికి రాజనామా చేయాలని కోరుతూ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మూడవ తరంగం కరోనా రానుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం మీద మరింత వత్తిడి తెచ్చేందుకు మే, జూన్‌లో జరిగిన ప్రదర్శనల కొనసాగింపుగా తదుపరి కార్యాచరణకు ప్రజా ఉద్యమాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్దలూ త్వరలో సమావేశం కానున్నాయి.ఇంతకాలం బోల్సనారోకు మద్దతు ఇచ్చిన మీడియా కూడా ప్రజల్లో వెల్లడౌతున్న నిరసన కారణంగా గుడ్డిగా సమర్ధిస్తే పూర్తిగా విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తుందనే భయం లేదా ఎంత బలపరిచినా తదుపరి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదన్న అంచనాకు రావటం వల్లగానీ వైఖరి మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా మహమ్మారి సమస్య మీద రాజకీయంగా విబేధించే శక్తులు కూడా ఈ ప్రదర్శనల్లో భాగస్వాములయ్యాయి. బహుశా ఈ కారణంగానే చీటికి మాటికి నియంత బోల్సనారో మీడియా మీద విరుచుకుపడుతున్నాడు. అయితే ధనిక తరగతులు మాత్రం బోల్సనారోకు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బోల్సనారోపై ప్రతిపక్షం 122 అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టింది. వాటి మీద పార్లమెంట్‌ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఏ అధ్యక్షుడూ ఇలాంటి నిరసనను ఎదుర్కోలేదు.
కరోనా పట్ల నిర్లక్ష్యానికి నిరసనలు ఒక్క బ్రెజిల్‌కే పరిమితం కాలేదు, కొలంబియా, పరాగ్వే,పెరూల్లో కూడా జరిగాయి.బ్రెజిల్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున ఇరుగు పొరుగు దేశాలకు కూడా అక్కడి నుంచి వ్యాప్తి చెందిందనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక కొత్త రకాల వైరస్‌లు బయటపడ్డాయి. జనంలో వ్యతిరేకత పెరుగుతుండటాన్ని గమనించిన బోల్సనారో మే ఒకటవ తేదీన తన మద్దుతుదార్లతో ప్రదర్శనలు చేయించాడు. ఇప్పుడు మిలిటరీ జోక్యం చేసుకోవాలి, నేను అంగీకరిస్తున్నాను అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. కరోనా నిబంధనలను జనాలు పాటించటం లేదు కనుక మిలిటరీ జోక్యం చేసుకొని అయినా నియంత్రణలను అమలు జరపాలని జనం కోరుతున్నారనే పేరుతో ఆ ప్రదర్శనలు చేయించారు. మే 29వ తేదీన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు జరిపిన ప్రదర్శనల్లో వాటికి ప్రతిగా నేను అంగీకరించటం లేదు, మిలిటరీ వద్దు అంటూ ప్రదర్శకులు బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. తనకు మద్దతుగా ప్రదర్శనలు చేసిన వారు సామాన్య జనం అని వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన వారు కిరాయి, అల్లర్లు చేసే వారు, ఉగ్రవాదులు అని బోల్సనారో వర్ణించాడు.
అధికారానికి వచ్చినప్పటి నుంచి బోల్సనారో వివాదాస్పద అధ్యక్షుడిగా తయారయ్యాడు. గతేడాది ఆగస్టులో అతగాడి పాలన బాగుందని చెప్పిన వారు 37శాతం మంది కాగా జనవరిలో 31శాతానికి పడిపోయింది. కరోనా సాయం నిలిపివేసిన తరువాత అదే నెలలో జరిగిన సర్వేలో 24శాతానికి దిగజారింది. దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారింది.కోటీ44లక్షల మంది నిరుద్యోగులున్నారు.వారిలో కేవలం 16శాతం మంది మాత్రమే బోల్సనారోను సమర్ధిస్తున్నారు. బెల్జియన్‌ రియల్స్‌ 2,200(మన కరెన్సీలో 32వేలు) లోపు ఆదాయం వచ్చే వారిలో 55శాతం మంది బోల్సనారోకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారని సర్వే తెలిపింది. ఏడాదిన్నర తరువాత జరిగే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే నిర్ధారణలకు రావటం తొందరపాటు కావచ్చుగానీ అప్పటికి పరిస్ధితి మెరుగుపడే సూచనల్లేవు.
భారత బయోటెక్‌ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ వాక్సిన్లను కొనుగోలుకు హామీ ఇవ్వాలని బ్రెజిల్‌ జాతీయ ఆరోగ్య నిఘా సంస్ధ మీద తీవ్ర వత్తిడి వచ్చినట్లు పోహా అనే పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుగుతోంది. మారినో అనే ఒక సైనికాధిరిని ఆర్యోగ వస్తు,ఔషధాల సరఫరా నిమిత్తం గతేడాది ఆరోగ్యశాఖ మంత్రి నియమించాడు. సదరు సైనికాధికారి జాతీయ ఆరోగ్య సంస్ద మీద వత్తిడి తెచ్చినట్లు వెల్లడైంది. వాక్సిన్ల సరఫరా గురించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న బ్రెజిల్‌ సంస్ధ ఒప్పంద షరతులను ఉల్లంఘించినట్లు తేలింది. ఇతర కంపెనీలు తక్కువ ధరలకు సరఫరా చేస్తామని ముందుకు వచ్చినప్పటికీ భారత బయోటెక్‌ నుంచి ఒక మోతాదు 15 డాలర్ల చొప్పున రెండు కోట్ల మోతాల కొనుగోలుకు అవగాహన కుదిరింది.ఒప్పందం ప్రకారం ఈపాటికే వాక్సిన్‌ బ్రెజిల్‌ చేరి ఉండాలి.ఈ ఒప్పందం చేసుకున్న సంస్ద బోల్సనారోకు సన్నిహితమైంది కావటంతో అధ్యక్ష కార్యాలయం నుంచే వత్తిడి జరిగిందన్నది స్పష్టం.వాక్సిన్‌ గురించి ప్రదాని నరేంద్రమోడీకి బోల్సనారో ఫోన్‌ చేసిన తరువాతే ఒప్పందం ఖరారైనట్లు చెబుతున్నారు. గత సంవత్సరం హైడ్రోక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయాలని రెండు ప్రయివేటు సంస్దల తరఫున బోల్సనారో మన ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్‌ చేసినట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. అందువలన క్లోరోక్విన్‌, వాక్సిన్‌ తయారీ కంపెనీలతో నరేంద్రమోడీకి ఆసక్తి ఎందుకు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
బ్రెజిల్‌లో ప్రస్తుతం చైనా వాక్సిన్‌ సినోవాక్‌, అమెరికా ఫైజర్‌, మరో కంపెనీ ఆస్ట్రాజెనెకా వాక్సిన్లను మూడవ దశ ప్రయోగాల తరువాత సాధారణ లేదా అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చని అనుమతి ఇచ్చారు. వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన మార్పి ఒప్పందాలన్నీ మధ్యవర్తులతో నిమిత్తం లేకుండా నేరుగా ప్రభుత్వ సంస్దలే చేసుకున్నాయి. దానికి భిన్నంగా కోవాగ్జిన్‌కు ఆ నిబంధనలను సడలించారు. ఒప్పందం జరిగిన సమయానికి బ్రెజిల్‌లో కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు జరగలేదు, భారత్‌లో జరిగిన ప్రయోగాల సమాచారాన్ని కూడా అందచేయలేదు. ఇతర వాక్సిన్లకంటే ముందే చెప్పుకున్నట్లు మధ్యవర్తి కంపెనీ అధికధరలకు ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 25న ఒప్పందం చేసుకున్న తరువాత నెల రోజుల్లోపల 80లక్షల మోతాదులను సరఫరా చేయాలి.అయితే ఆ గడువు సెప్టెంబరుకు పెరగవచ్చంటున్నారు. మన దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ప్రభుత్వం మీద తీవ్రవత్తిడి రావటంతో ఎగుమతులపై ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఒప్పందానికి తొమ్మిది రోజుల ముందు బ్రెజిల్‌ మంత్రి కోవాగ్జిన్‌ గురించి బ్రెజిల్‌ రాష్ట్రాల గవర్నర్లకు వివరించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 80లక్షల మోతాదుల చొప్పున మే నెలలో నలభై లక్షల మోతాదులు సరఫరా అవుతాయని చెప్పాడు. వాక్సిన్‌కు సంబంధించి వివరాలు లేకపోవటం, తయారీలో ప్రమాణాలు పాటిస్తున్నట్లు తమకు విశ్వాసం లేనందున వాక్సిన్ను తిరస్కరిస్తున్నట్లు మార్చి 31న బ్రెజిల్‌ ప్రభుత్వ సంస్ద ప్రకటించింది. భారత వాక్సిన్లను రానివ్వకుండా బ్రెజిల్‌ నియంత్రణ సంస్ద జాతీయవాదంతో వ్యవహరించిందని భారత బయోటెక్‌ అధిపతి ఎల్లా కృష్ణ ఆరోపించారు. మొత్తం మీద బ్రెజిల్‌ విచారణ ఎవరి పాత్రను ఎలా బయట పెడుతుందో చూడాల్సి ఉంది.