Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారితో ఒక తాయిల పొట్లాన్ని పంపారు. దాని విలువ 6.29లక్షల కోట్ల రూపాయలని చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.గతంలో ప్రకటించిన అంశాలనే కొత్త రంగు కాగితాల్లో చుట్టి చూపటం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే అదనపు ఖర్చేమీ లేదని సిపిఎంనేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. గత ఏడాది ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజ్‌ వలన జనానికి, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు జరిగిన మంచేమిటో ఇంతవరకు చెప్పిన వారెవరూ లేరు. ఇప్పుడు ఇది కూడా అలాంటి వట్టి విస్తరి మంచినీళ్లేనా ?


నిర్మలమ్మ దేశం ముందుంచిన పొట్లంలో ఏముందో విప్పి చూద్దాం. 1.కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రు.1.10లక్షల కోట్లు.2.అత్యవసర రుణాల హామీగా రు.1.5లక్షల కోట్లు. 3. విద్యుత్‌ పంపిణీదార్లకు ఆర్ధిక సాయం రు.97,631 కోట్లు, 4. ఉచిత ఆహార ధాన్యాలకు రు.93,869 కోట్లు, 5.ఎగుమతి బీమా నిమిత్తం రు.88,000 కోట్లు, 6.ఎగుమతుల ప్రోత్సాహం కోసం రు.33,000 కోట్లు, 7. అదనపు ఎరువుల సబ్సిడీ రు.14,775 కోట్లు, 8.నూతన ఆరోగ్య పధకం రు.15,000 కోట్లు, 9. గ్రామీణ ఇంటర్నెట్‌కోసం రు.19,041 కోట్లు,10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రు.100 కోట్లు, 11.ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రు.77 కోట్లు దీనిలో ఉన్నాయి. వీటిలో గతంలో ప్రకటించిన ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రు.1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21వేల కోట్లే కొత్తవి.


మహమ్మారి అయినా మాంద్యం వచ్చినా రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. మన ప్రభుత్వానికి అవేమైనా పట్టాయా అన్నదే అర్ధంగాని విషయం. తక్షణమే ఉపశమనం కలిగించేవి, దీర్ఘకాలంలో ఉపయోగపడే వృద్ధికి అవసరమైనవి. జనానికి నగదు అందచేస్తే తక్షణ గిరాకీ పెరుగుతుంది. ఉచిత నగదు అంటే దాని అర్దం అది వస్తు డిమాండ్‌ను పెంచేదే తప్ప సోంబేరులను తయారు చేసేది కాదు. అత్మనిర్భర, తాజా తాయిలంలో అవి ఉన్నాయా అంటే లేవు. జనాలకు ఉచితంగా కొన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తే చాలదు. కేరళలో మాదిరి బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కూడా అందచేసినపుడే ప్రయోజనం ఉంటుంది.


విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదు లక్షల మందికి వీసాలు ఉచితంగా ఇస్తాం రమ్మంటున్నారు. వీసా ఉచితంగా వచ్చింది కదా అని ఎవరైనా వచ్చి ఖరీదైన కరోనాను తగిలించుకుంటారా ? అనేక రాష్ట్రాలు పరీక్షలను సమగ్రంగా లేదా పెద్ద సంఖ్యలో చేయటం లేదు. వ్యాధిగ్రస్తులు, మరణాలను లెక్కల్లో చూపటం లేదు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపధ్యం. పోనీ వాక్సిన్లు వేసి వ్యాధి నిరోధక చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మన దేశంలోని జనాలే మరో చోటుకు పోవాలంటే భయపడుతున్న స్ధితిలో పొలో మంటూ విదేశీయులు వస్తారా ? అందువలన పర్యాటక రంగానికి 60వేల కోట్లు అప్పులిప్పిస్తామంటున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగం వాటిని తీసుకొని ఏమి చెయ్యాలి అన్నది సమస్య.


మన ప్రజారోగ్య వ్యవస్ధను ఎంత పటిష్టం గావించాలో కరోనా మహమ్మారి వెల్లడించింది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవటం ద్వారా జనాల జేబులు గుల్లకాకుండా చూడవచ్చు. రాష్ట్రాలకు ఆమేరకు నిర్ధిష్టంగా సాయం ప్రకటించి ఉంటే అది వేరు. మూడవ తరంగం, అది పిల్లలను ప్రభావితం చేయనుందనే భయాల నేపధ్యంలో అత్యవసర ఏర్పాట్లకు ప్రకటించింది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే అవి ఏమూలకు వస్తాయి. వైద్య రంగంలో పెట్టుబడులకు వడ్డీ రేటు తక్కువకు 50వేల కోట్ల రూపాయలను చిన్న పట్టణాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అప్పులిప్పిస్తామని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. దాని వలన జనానికి ఆరోగ్య ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదు. అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు కొంత శాతం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి రాయితీలు పొంది వాటిని ఎగనామం పెట్టటమే గాకుండా వారు కొనుగోలు చేసిన వైద్య యంత్రాలకు అవసరమైన సమిధలుగా రోగులను మార్చటాన్ని, లాభాలు పిండటాన్ని చూస్తున్నాము.


మన ఆర్ధిక వ్యవస్ధలో ఎంఎస్‌ఎంఇల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ఆత్మనిర్భర పధకం ప్రకటించే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర కొనుగోలు చేసిన వస్తువులకే లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికీ వాటికి ఎంత బకాయి ఉన్నదీ, ఏడాది కాలంలో ఎంత చెల్లించిందీ స్పష్టత లేదు. రెండు నుండి మూడులక్షల కోట్ల మేరకు బకాయి ఉన్నట్లు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్లు చెబుతున్న మొత్తం పదిశాతం కూడా లేదు. ఇంకా బకాయిలు పన్నెండువేల కోట్లకు మించి లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన పాకేజ్‌ కూడా ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రికార్డు ఉన్నవారికే హమీ అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరోవైపు కొనుగోలు శక్తి పడిపోయిన స్దితిలో గిరాకీయే లేదంటుంటు రుణాలు ఎవరు తీసుకుంటారు, ఉత్పత్తి చేసిన సరకులను ఎక్కడ అమ్ముకుంటారు ?

రుణ హామీ పధకాల గత ఏడాది ప్రకటించిన పరిమితుల విస్తరణే తప్ప కొత్తవేమీ లేవు. అదే విధంగా కొత్తగా ఉపాధి కల్పించే సంస్ధలకు ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు పిఎఫ్‌ చెల్లించే పధకాన్ని మరో తొమ్మిది నెలలు పాడిగించారు. రానున్న ఐదు సంవత్సరాలలో ఎగుమతుల ప్రోత్సాహకానికి 88వేల కోట్లు ప్రకటించారు. ఉత్పత్తి, ఎగుమతులతో ముడిపడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ప్రవేశపెట్టిన ఈ పధకం కొత్తదేమీ కాదు. దాని వలన ఇప్పటి వరకు నిర్ధిష్టంగా పెరిగిన ఎగుమతులేమిటో తెలియదు.


ఎంఎస్‌ఎంఇ రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జిడిపిలో 30శాతం, ఎగుమతుల్లో 40శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(సిఐఏ) జూన్‌ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88శాతం మైక్రో లేదా చిన్న సంస్ధలు గతేడాది ప్రకటించిన పాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు.వారికి భవిష్యత్‌ మీద ఆశలేదు.ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్దలుంటే వాటిలో కేవలం 50లక్షలు మాత్రమే ప్రభుత్వ పధకాల నుంచి ఆర్ధిక సాయం పొందాయి.పొందాయి.కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్దలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. నలభైశాతం సంస్దలు నెల రోజుల కంటే బతకలేవని తేలింది.

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరులక్షల కోట్ల డాలర్ల పాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్ధుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి ఆలోచనలో లేదు.


ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. అయినా మే 2021లో టోకుధరలు 12.94 శాతం, రిటైల్‌ ధరలు 6.3 శాతం పెరిగాయి. జనానికి నగదు బదులు ఆ మొత్తాన్ని కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీగా ఇస్తే లాక్‌డౌన్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని గతేడాది ప్రభుత్వం చెప్పింది. కాని ఏప్రిల్‌ నెలలో 4.3 శాతం వ ద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.

నగదు బదిలీ వామపక్షాలో, లేదా ఇతర మేథావులో చెబుతున్నదే కాదు, సిఐఐ చైర్మన్‌ నరేంద్రన్‌ రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్ధిస్తున్న ప్రతిపాదన. దీని వలన వస్తు డిమాండ్‌ పెరిగితేనే వారి ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటుందన్నది దీని వెనుక ఉన్న భావం. కొటాక్‌ మహింద్రా బ్యాంక్‌ యజమాని ఉదయ కొటాక్‌ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచించారు. కోవిడ్‌-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించేది లేదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటే కోవిడ్‌ మరణాలు దేశంలో 4 లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రు. 4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది.ఈ మాత్రం సొమ్ము కేంద్రం దగ్గర లేదా ?


సిఎంఐఇ అధ్యయనం ప్రకారం, జూన్‌ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. మే నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.


గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేసింది. పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10 కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు, ఇతర సరకులు ఇవ్వటం ద్వారా జనాలు తక్షణం ఉపశమనం పొందుతారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిర్మలమ్మ తాయిలాల పొట్లంలో అలాంటివేమీ లేవు.