Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది నవంబరు 21న జరగనున్న చిలీ అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్ధిగా అనూహ్యంగా కమ్యూనిస్టు పార్టీ నేత డేనియల్‌ జాడ్యు ముందుకు దూసుకు వస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. వివిధ పార్టీల అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయనప్పటికీ కాగల అభ్యర్ధులను ఊహించి సర్వేలు చేస్తున్నారు. మే నెలలో జరిగిన రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో విజయం సాధించిన రెండు వామపక్ష సంఘటనలు, మరొక వామపక్ష పార్టీ అభ్యర్ధులు కూడా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి. వారిలో అంతిమంగా జాడ్యు అభ్యర్దిగా నిర్ణయం అవుతారని భావిస్తున్నారు. అదే జరుగుతుందా, మరో వామపక్ష అభ్యర్ధి రంగంలో ఉంటారా అన్నది త్వరలో తేల నుంది. ఈనెల 18న వివిధ పార్టీలు,కూటములు అభ్యర్ధులను ఖరారు చేయనున్నాయి.


రాజధాని శాంటియాగో మహానగరంలో ఉన్న రికొలెటా ప్రాంత కార్పొరేషన్‌ మేయర్‌గా ఇటీవల జాడ్యు తిరిగి ఎన్నికయ్యారు. పాలస్తీనా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన జాడ్యు తొలి దశలో పోటీ ఎలా జరిగినప్పటికీ మెజారిటీ రాకపోతే రెండవ దఫా ఎన్నికలో అయినా విజేతగా కాబోయే అధ్యక్షుడంటూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, బొలీవియా, బ్రెజిల్‌, అర్జెంటీనా తదితర దేశాలలో వామపక్ష అధ్యక్షులుగా ఎన్నికైన వారందరూ వామపక్షాలకు చెందిన వారు, మార్క్సిజం-లెనిజం పట్ల విశ్వాసం ప్రకటించిన వారే అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు కాదు. ఆయా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. సామ్రాజ్యవాదులు కుట్రలకు పాల్పడి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే ఏం జరుగుతుందో చెప్పలేము గానీ లేనట్లయితే లాటిన్‌ అమెరికాలో మరో ఎర్రమందారం వికసించటం ఖాయంగా కనిపిస్తోంది.తొలి దశలోనే మెజారిటీ సంపాదిస్తారా లేక రెండవ పోటీలోనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నూతన రాజ్యాంగ పరిషత్‌, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలలో అదే పరంపరను కొనసాగించనున్నాయి. ప్రస్తుతం పచ్చి మితవాది సెబాస్టియన్‌ పినేరా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష శక్తులు, వారిని బలపరిచే వారే మెజారిటీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు జాడ్యుతో పాటు మితవాద పార్టీలైన ఇండిపెండెంట్‌ డెమ్రోక్రటిక్‌ యూనియన్‌ అభ్యర్ధి జాక్విన్‌ లావిన్‌, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన యాసనా ప్రొవోటే మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు.
లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నది. గతనెల ఆరున పెరూలో జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో నలభైవేలకు పైగా మెజారిటీతో గెలుపొందినప్పటికీ ఇంతవరకు ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు. అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష మితవాద అభ్యర్ధి చేసిన ఫిర్యాదును విచారించే పేరుతో కాలయాపన చేస్తున్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో బ్రెజిల్‌లో తిరిగి వామపక్ష నేత లూలా డ సిల్వా తిరిగి ఎన్నిక కానున్నారని, నికరాగువాలో అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా తిరిగి విజయం సాధించనున్నారనే వాతావరణం ఉంది. దానికి అనుగుణ్యంగానే చిలీ పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.


ప్రజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం, వివిధ సేవల ప్రయివేటీకరణ చర్యలతో లాటిన్‌ అమెరికా దేశాల్లో అమలు జరిపిన నూతన ఆర్ధిక లేదా నయా ఉదారవాద విధానాలు సామాన్య జనజీవితాలను దిగజార్చాయి. ధనికుల మీద పన్ను భారం పెంచటం, పెన్షన్‌ వ్యవస్ధను పునర్వ్యస్తీకరించటం, ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ ప్రమేయం పెంపు, పన్నులు ఎగవేసేందుకు కంపెనీలు సరిహద్దులు దాటి పోవటాన్ని నిరోధించటం వంటి చర్యలను కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. ప్రపంచంలో అత్యధిక రాగి నిల్వలను కలిగి ఉన్న చిలీ సంపదను బహుళజాతి గుత్త సంస్ధల పాలు చేయకుండా ప్రజల కోసం వినియోగించాలని చెప్పింది. ఖనిజ సంపదకు రాజ్యం యజమాని గనుక అన్ని కార్యకలాపాలలో అది భాగస్వామిగా ఉండాలని కోరింది. సమస్యలపై ఉద్యమించిన ప్రజా సమూహాలపై మాజీ నియంత పినోచెట్‌ తరువాత ప్రస్తుత అధ్యక్షుడు పినేరా మిలిటరీని ప్రయోగించిన తాజా నిరంకుశుడిగా చరిత్రకెక్కాడు.


కమ్యూనిస్టు నేత జాడ్యు ప్రజాదరణ పొందుతున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తుండటంతో మితవాద శక్తులు ఆయన్ను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నాయి. కమ్యూనిస్టును ఎన్నుకుంటే ప్రమాదమని జనాన్ని రెచ్చగొడుతున్నాయి. అధ్యక్షపదవి అభ్యర్ధిగా ఉన్న జాడ్యు పాఠశాల్లో చదువుకొనే రోజుల్లో యూదు వ్యతిరేకిగా ఉన్నాడని అభిశంసిస్తూ పార్లమెంట్‌లోని మితవాద ఎంపీలు ఒక తీర్మానంలో ధ్వజమెత్తారు. అనుకూలంగా 79 వ్యతిరేకంగా 47 వచ్చాయి. చిలీలో యూదులు ఇరవై వేలకు మించి లేనప్పటికీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ తీర్మానాన్ని ఆయన కొట్టిపారవేశారు. చిలీలో పాలస్తీనా మూలాలు కలిగిన వారు ఐదు లక్షల మంది ఉన్నారు. జాడ్యు క్రైస్తవమతానికి చెందిన వ్యక్తి. ఆయన తాతల కాలంలో పాలస్తీనా నుంచి చిలీకి వలస వచ్చారు. చిలీ రాజధాని శాంటియాగోలో 1967 జూన్‌ 28జన్మించిన జాడ్యు పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఇజ్రాయెల్‌ యూదుల దురంతాలను వ్యతిరేకించాడు. పాలస్తీనా విముక్తికి మద్దతుగా చిలీ లోని పాలస్తీనియన్‌ విద్యార్ధి సంఘం, తరువాత కమ్యూనిస్టు విద్యార్ధి సంఘ నేతగా, పని చేశారు. నియంత పినోచెట్‌కు మద్దతుదారు అయిన తండ్రిని ఎదిరించి కుటుంబం నుంచి బయటకు వచ్చాడు.1993లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.2012 నుంచి రికొలెటా కార్పొరేషన్‌ మేయర్‌గా పని చేస్తున్నారు. పేదలకు అవసరమైన జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపి ప్రశంసలు పొందారు.


జాడ్యు పాఠశాలలోనే ఇజ్రాయెల్‌ దురహంకారం, పాలస్తీనియన్లపై జరుపుతున్న దురాగతాలను వ్యతిరేకించేవాడు. ప్రతి సంవత్సరం ప్రచురించే పాఠశాల ప్రత్యేక సంచికలో జాడ్యు స్నేహితులు సరదాగా అనేక వ్యాఖ్యలు రాస్తుండేవారు.వాటిలో ” అతని వాంఛ యూదుల నగరాన్ని శుద్ధి చేయటం, అతని లక్ష్య సాధన కసరత్తుకు తగిన బహుమానం ఒక యూదును ఇవ్వటమే ” వంటి వ్యాఖ్యలు చేసే వారు. అతని రికార్డులో పాఠశాల తనిఖీ అధికారి జాడ్యు యూదు వ్యతిరేకి అని రాశాడు. చిలీ యూదుల నేత ఒకరు ఈ విషయాలున్న పత్రాల కాపీని ట్వీట్‌ద్వారా ఎంపీలు, ఇతరులకు పంపాడు. దాన్ని పట్టుకొని పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసింది. ఇదంతా అతను ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధిగా ముందుకు వస్తున్న నేపధ్యంలోనే జరిగింది.


పార్లమెంట్‌ తీర్మానాన్ని జాడ్యు కొట్టిపారవేశాడు.” దేశం ఇప్పుడు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా సంక్షోభంతో ఉంది. వందలాది మంది మరణిస్తున్నారు, కుటుంబాలు అవసరాలు తీర్చుకోలేకపోతున్నాయి. కానీ మితవాద ఎంపీలు 35 సంవత్సరాల క్రితం ఇతరులు స్కూలు పత్రికలో నా గురించి రాసినదాన్ని వివరించటానికి తీవ్రంగా శ్రమించారు. పాఠశాల తనిఖీ అధికారి రాసిన వాటిని నేను అప్పుడే ఖండించాను ” అని చెప్పాడు. తాజాగా వెలువడిన ఒక సర్వే ప్రకారం జాడ్యుకు 38శాతం మద్దతు ఉండగా అతని సమీప ప్రత్యర్ధికి 33శాతం ఉంది.


చిలీ సోషలిస్టు పార్టీ (మార్క్సిస్టు భావజాలంతో పని చేసింది) నేత సాల్వెడార్‌ అలెండీ లాటిన్‌ అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వామపక్షవాది.1970 నవంబరు మూడు నుంచి 1973 సెప్టెంబరు 11న సైనిక తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయేంతవరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అలెండీ కొనసాగితే లాటిన్‌ అమెరికాలో వామపక్ష ఉద్యమాలు ఊపందుకుంటాయనే భయంతో అమెరికా సిఐఏ కుట్రలో భాగంగా మిలిటరీ అధికారి పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. మిలిటరీని ఎదుర్కొనే క్రమంలో అలెండీ స్వయంగా, అనుచరులు కూడా ఆయుధాలు చేపట్టారు. అయితే తగిన విధంగా పార్టీ నిర్మాణం, సన్నద్దత లేకపోవటంతో మిలిటరీదే పైచేయి అయింది. తరువాత అమెరికా చికాగో విశ్వవిద్యాలయంలో చదివిన ఆర్ధికవేత్తలను చిలీతో పాటు దాదాపు అన్ని లాటిన్‌ అమెరికా దేశాలకు అమెరికా పంపటమే గాక ఉదారవాద విధానాల అమలుకు ఆ ఖండాన్ని ప్రయోగశాలగా చేసింది. అందువలనే ఆ విధాన ఆర్ధికవేత్తలందరినీ ” చికాగో బాలురు ” అని పిలిచారు. రాజ్యాంగాల రచనల నుంచి అన్నింటా వారి ముద్ర ఉండేది. తాజా రాజ్యాంగ ఎన్నికలలో వామపక్ష, అభ్యుదయవాదులు విజయం సాధించటంతో చిలీలో వారి శకం అంతరించినట్లే అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అలెండీ నాయకత్వం వహించిన పార్టీలో తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు.


నూటతొమ్మిది సంవత్సరాల క్రితం 1912 జూన్‌ నాలుగున ఏర్పడిన చిలీ కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను తట్టుకొన్నది.. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు 1912లో సోషలిస్టు వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పది సంవత్సరాల తరువాత అదే కమ్యూనిస్టు పార్టీగా మారింది.1938లో పాపులర్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తరువాత డెమోక్రటిక్‌ కూటమిలో ఉంది. పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి బలం పుంజుకుంటున్న తరుణంలో 1948 నుంచి 58వరకు పార్టీపై నిషేధం విధించారు.1960 దశకంలో తిరిగి బహిరంగంగా పని చేయటం ప్రారంభించింది. పాబ్లో నెరూడా వంటి నోబెల్‌ బహుమతి గ్రహీత కవి, తదితర ప్రముఖులు పార్టీలో పని చేశారు.1970లో అలెండీ నాయకత్వంలో పాపులర్‌ యూనిటీ కూటమిలో భాగస్వామిగా ప్రభుత్వంలో చేరింది. అలెండీ సర్కార్‌ను కూలదోసిన మిలిటరీ నియంత పినోచెట్‌ 1973 నుంచి 1990 వరకు పార్టీపై నిషేధం అమలు జరిపాడు. మరోసారి కమ్యూనిస్టులు అజ్ఞాతవాసానికి వెళ్లారు.1977లో గెరిల్లా దళాన్ని కూడా ఏర్పాటు చేశారు.2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు రికార్డో లాగోస్‌ ఎన్నిక వెనుక కమ్యూనిస్టులు ఉన్నారు. తరువాత 2006లో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు మిచెల్లీ బాచెలెట్‌ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని శాంటియాగోతో సహా అనేక చోట్ల మేయర్లుగా ఎన్నికయ్యారు.1927-31, 1948-1958, 1973-1990 సంవత్సరాల మధ్య నిర్బంధాలకు గురికావటంతో పాటు పినోచెట్‌ పాలనలో పలువురు నేతలతో సహా వేలాది మంది కమ్యూనిస్టులు హత్యలకు గురయ్యారు. తిరుగుబాటు సమయంలో అలెండీని మిగతా వామపక్షాలు వదలి వేసినప్పటికీ కమ్యూనిస్టులు ఆయనతో భుజం కలిపి పినోచెట్‌ను ఎదుర్కొన్నారు. పినోచెట్‌ హయాంలో తీవ్ర కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టారు. కమ్యూనిస్టులు రహస్యంగా పని చేశారు.


చిలీలో గతంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకత, భయం తగ్గిపోతున్నదని 31 ఏండ్ల యువతి, శాంటియాగో నగరంలోని ముగ్గురు కమ్యూనిస్టు మేయర్లలో ఒకరైన జవీరా రేయాస్‌ చెప్పారు. డేనియల్‌ జాడ్యూ మేయర్‌గా ఒక ఆదర్శం అన్నారు. కార్పొరేషన్‌ తరఫున ఔషధ దుకాణాలు, కండ్లజోళ్ల షాపులు, పుస్తకాల షాపులు, రియలెస్టేట్‌ తదితర సంస్దలను నడుపుతూ ప్రజల మన్ననలను పొందారన్నారు. ఆరోగ్యం, విద్య వంటి అంశాలతో కమ్యూనిస్టు మేయర్లు మున్సిపల్‌ సోషలిజాన్ని (పేదల పక్షపాతం) అమలు జరుపుతారని అన్నారు. 2006లో విద్య ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్దుల నాయకురాలిగా ఆమె ప్రస్తానం ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఆమెతో పాటు మరో మేయర్‌ హాస్లర్‌తో పాటు అనేక మంది విద్యార్ధి నేతలు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గతంలో 1931, 32, 1999లో కమ్యూనిస్టు పార్టీ తరఫున అభ్యర్ధులు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగితే చిలీ తొలి కమ్యూనిస్టు అధ్యక్షుడిగా డేనియల్‌ జాడ్యు చరిత్రకెక్కుతాడు. ఆయన కూడా విద్యార్ధినేతగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
.