Tags
BJP’s trolling army, narendra modi bhakts, Narendra Modi Failures, Seven years Narendra Modi Government
హలో ప్రియమైన భారతీయులారా !
నేను భారత ప్రధాని నరేంద్రమోడీని,
మిత్రోం ఈ మధ్య నేను రాసిన లేఖ పేరుతో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. నా భక్తులు, అభిమానులు లేదా నా వ్యతిరేకులు గానీ వాటిని రాసి ఉండవచ్చు. అభిమానులు అయితే నాకు మద్దతుగా, వ్యతిరేకులు అయితే నా మీద తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు కావచ్చు. ఏమైనప్పటికీ నేను మీకు అదే పద్దతిలో కొన్ని విషయాలు చెప్పదలిచాను. నా పేరుతో అనధికారికంగా తిరుగుతున్న అంశాల మాదిరే వీటిని కూడా అనధికారికంగానే పరిగణించాలన్నది నా మనుసులోని మాట. నాపేరుతో ఉన్న లేఖ అంశాలకు సంబంధించి కొన్ని వివరణలు ఇస్తామరి !
” మీరు నాకు బాధ్యతలను అప్పగించి ఏడు సంవత్సరాలైంది.ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు ముళ్ల సింహాసనం ఎదురైంది ”
మిత్రోం మనలో మాట, నేను ఇప్పుడు కొన్ని తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాను గనుక నా అభిమానులు నాకు దక్కింది ముళ్ల సింహాసనం అని చెప్పవచ్చుగాని నేనుగా ఎప్పుడూ నోరు విప్పి ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. మిత్రోం పెళ్లి కాగానే హనీమూన్ ఉంటుంది. నాకు అలాంటిదేమీ అవసరం లేదని నేను అప్పుడే చెప్పాను. నాకు ముందున్న ప్రభుత్వాలు వంద రోజులు కాదు అంతకంటే ఎక్కువే హానీమూన్ గడిపాయి, వంద రోజులు కాదు కదా వంద గంటలు కూడా గడవక ముందే నా మీద విమర్శలు ప్రారంభమయ్యాయి.
” గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అస్త్యస్ధ పాలన కారణంగా అన్ని ప్రభుత్వ వ్యవస్ధలూ చిన్నాభిన్నం అయ్యాయి.పెద్ద మొత్తంలో విదేశీ అప్పు పేరుకు పోయింది, భారతీయ కంపెనీలు నష్టాల పాలయ్యాయి.”
మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో లేదా ఇతర పేర్లతో రాసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని మా వాళ్లకు పదే పదే చెప్పాను గానీ వారికి అది ఎక్కినట్లు లేదు. కంపెనీలకు నష్టాలు వస్తున్నాయంటే నేనేదో కంపెనీల గురించి తప్ప జనాలకు కలిగిన నష్టాలను పట్టించుకోలేదనుకుంటారు. అందుకే కదా అచ్చే దిన్ , గుజరాత్ మోడల్ అని చెప్పాను. అయితే ఇన్నేండ్ల తరువాత వాటిని గుర్తు చేస్తే జనం నా పీక ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి ఉండరు. నా సంగతి తెలుసుగా ఒకసారి చెప్పిన మాట తిరిగి చెప్పటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా జనానికి ఎప్పుడూ కొత్త కబుర్లు చెప్పాలి తప్ప పాత చింతకాయ పచ్చడి ఎందుకు ? అర్ధం చేసుకోరూ !
మిత్రోం అరవై సంవత్సరాల గతపాలనలో విదేశీ అప్పు 446 బిలియన్ డాలర్లు అయితే ఏడు సంవత్సరాలలోనే దానికి నేను 124 బిలియన్ డాలర్లు అదనంగా చేర్చాను. దేశీయ అప్పు ఇదే కాలంలో 55 లక్షల కోట్ల నుంచి 117 లక్షల కోట్లకు పెంచాను అంటున్నారు. రెండూ కలిపితే 2021 మార్చి ఆఖరుకు రు.121లక్షల కోట్లు, అవును చేశాను, ముందే చెబుతున్నా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అది 136లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇదంతా నా సరదా కోసం చేశానా, నేనేమైనా వెనుకేసుకున్నానా ? దేశం అంటే మీ కోసమే కదా ! నన్ను నమ్మాలి మరి !!
మిత్రోం రాహుల్ గాంధీ, సీతారామ్ ఏచూరీ వంటి వారు ఎంత సేపూ కరోనా, జనం చేతికి డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలీ అంటారు. మీరు చెప్పండి జనం చేతికి కొన్ని వేలిస్తాం, వాటితో వారేమన్నా పరిశ్రమలు పెడతారా, వాణిజ్యం చేస్తారా, పది మందికి ఉపాధి కల్పిస్తారా ? కరోనా కాలంలో జనం దివాలా తీశారు – కార్పొరేట్లు బలిశారని అంటున్నారు. మన ఎస్‌బిఐ వారిని అన కూడదు గానీ అస్సలు బుర్రుందా ? ఎప్పుడేం చెప్పాలో తెలిసినట్లు లేదు. కరోనా కారణంగా వ్యక్తిగత అప్పులు జిడిపిలో 32.5 నుంచి 37.3శాతానికి పెరిగాయని చెబుతారా ? లెక్కలు సరిగా వేసినట్లు లేదు.
మిత్రోం రెండు సంవత్సరాల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు నిరుద్యోగం గురించి లెక్కలు సరిగా వేయలేదని, పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అని, అలాంటి వన్నీ లెక్కల్లో రాలేదని చెప్పాం గుర్తుంది కదా ! ఇప్పుడు కరోనా అప్పుల్లో ప్రతిదాన్నీ కలిపినట్లున్నారు, అందుకే సంఖ్య పెరిగింది. బి పాజిటివ్‌గా చూసినపుడు ఇలాంటి పరిస్దితి వచ్చినపుడే జనం పొదుపు చేస్తారు. అదే అసలైన దేశభక్తి. ఇక కరోనా కాలంలో కార్పొరేట్లు బలిశారు అంటున్నారు. మంచిదే కదా వారు బలిస్తే పెట్టుబడులు పెడతారు, పది మందికి ఉపాధి కల్పిస్తారు. అందుకే కదా గతేడాది 20లక్షల కోట్ల ఆత్మనిర్భరత, ఈ ఏడాది 6.209లక్షల కోట్ల తాయిల పొట్లం. అయినా అందరినీ ఒకేసారి బాగు చేయగలమా, ముందు కంపెనీలను బలపడేట్లు చేద్దాం – తరువాత జనం సంగతి చూద్దాం.
” ఇరాన్ అప్పు 48వేల కోట్లు వదలిపోయారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అప్పు 40వేల కోట్లు ”
మిత్రోం వీటి గురించి పదే పదే ఎక్కువగా ప్రచారం చేయకండిరా గోబెల్స్ కూడా సిగ్డుపడతాడు మన పరువే పోతుంది అని నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నా మా వారికి, అయినా వినటంలా. ఇరాన్ నుంచి మనం చమురు కొన్నాం. దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని మన ఖజానాలో వేసుకున్నాం. మనకేం నష్టం లేదు. ఆ చమురుకు డబ్బు చెల్లించే సమయానికి అమెరికా వారు ఆంక్షలు పెట్టారు. బ్యాంకు ఖాతాలను స్ధంభింప చేశారు. మనమేం చేస్తాం. మీరు చెప్పండి ! ఇరాన్ను వదులుకోగలం గానీ అమెరికాకు ఆగ్రహం వస్తే తట్టుకోగలమా ? అందుకే మన్మోహన్ సింగ్ హయాంలో చెల్లించటం కుదరలేదు కనుక నా హయాంలో చెల్లించా. తరువాత మాకు అమెరికా ముఖ్యం తప్ప మీరు కాదు అంటూ ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లనే ఏకంగా నిలిపివేశాం. దాని బదులు అమెరికా నుంచి కొంటున్నాం.ఈ విషయంలో డోనాల్డ్ ట్రంప్‌కు ఎంత సంతోషం కలిగిందో నేను వర్ణించలేనబ్బా !
మిత్రోం ఇరాన్‌కు మనకూ ఎలాంటి పేచీ లేదు. అయినా అమెరికా కోసం దాని దగ్గర చమురు కొనటం ఆపాం. కానీ అదేంటో ఈ చర్యతో వారు చైనాకు దగ్గరైనట్లు, ఆ పనేదో నేనే చేసినట్లు కొందరు అర్ధాలు తీస్తున్నారు. ఇక యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌కు ఉన్న బాకీల గురించి అవి మన దేశానికి చెందిన సంస్దలు అక్కడ చేసిన అప్పులు. వాటికి తిప్పలో మరో కారణంతోనో అవి చేతులెత్తేశాయి. అవి కూడా మన మీద పడ్డాయి.
” భారతీయ చమురు కంపెనీలకు వచ్చిన నష్టాల మొత్తం రు.1,33,000 కోట్లు ”
మిత్రోం ఇంత మొత్తం మన కంపెనీలకు నష్టం వచ్చిందని నేనెక్కడా చెప్పినట్లు లేదు. గత ప్రభుత్వాలు చమురు బాండ్లుగా ఇచ్చిన మొత్తం నా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని మా మంత్రులు చెప్పారు. ఇప్పటికే వాటిని తీర్చేశామని అత్యుత్సాహంతో చెప్పి ఉండవచ్చు.ప్రతిపక్షాలకు పనీ పాటా లేదు. 2026 నాటికి తీర్చాల్సిన ఈ అప్పుల పేరుతో నేను గత ఏడు సంవత్సరాలుగా చమురు పన్ను పేరుతో జనాల జేబులు కొల్లగొట్టానని ఆడిపోసుకుంటున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పండి ! నా జేబులో వేసుకున్నానా !
” ఇండియన్ ఎయిర్‌లైన్స్ నష్టాలు రు.58,000,భారతీయ రైల్వేల నష్టాలు రు.22,000, బిఎస్‌ఎన్ నష్టాలు రు.1,500 ”
మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో పోస్టు చేస్తున్న వారు నా భక్తుల ముసుగులో ఉన్న వ్యతిరేకులు తప్ప మరొకటి, కాదు ఇప్పటి ఎప్పటివో ఎందుకు వచ్చాయో చెప్పకపోతే పోయేది నా పరువే కదా !
” సైనికులకు కనీస ఆయుధాలు లేవు, వారికి బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు లేవు, ఆధునిక యుద్ద విమానాలు లేవు, సైన్యాలు నాలుగు రోజులు కూడా నిలవలేవు ”
మిత్రోం మనలో మాట. నిజానికి మన సైన్యం అంత దుస్దితిలో ఉందంటే మా గురువు గారు అతల్ బిహారీ వాజ్‌పారుకి, అంతకంటే పెద్ద గురువు ఎల్‌కె అద్వానీకి అవమానం. వారి పాలన ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది.మన సైన్యం నాలుగు రోజుల్లోనే చేతులెత్తేసేట్లుంటే కార్గిల్ యుద్దంలో రెండు నెలల మూడు వారాల రెండు రోజులు ఎలా యుద్దం చేసి విజయం సాధించారు. ఉత్తినే, మా అమిత్ షా అప్పుడప్పుడు అంటుంటాడు కదా జుమ్లా అని అందుకే ఏదో అలా చెబుతుంటాం. సరే మా వాళ్లు నా పేరుతో చేస్తున్న ప్రచారం గురించి చెప్పాను, నా మనసులోని మాటలు కూడా చెప్పాను. పరిస్ధితి ఇలా ఉండగా బాధ్యతలు స్వీకరించిన నేను నిర్ణయించుకున్నదేమిటంటే….
” ఆ సమయంలో వ్యవస్ధలన్నింటినీ సరి చేయటం నా ప్రధాన బాధ్యత అనుకున్నాను. అదృష్టం కొద్దీ భారతీయుల కోసం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగి వచ్చాయి. అయితే తగ్గిన ధరలమేరకు మీరు పూర్తిగా లబ్ది పొందలేదు. ప్రభుత్వం తప్పు చేసిందని మీరు తప్పకుండా భావిస్తూ ఉండి ఉంటారు. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.అయితే చమురు ధరల కారణంగా నామీద మీకు కొద్దిగా కోపంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేనేమీ చేయలేను. ఎందుకంటే నేను నా భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నాను. అంతకు ముందున్న ప్రభుత్వ తెలివితక్కువ తనం మనకు శాపంగా మారింది. వారు అప్పు తెచ్చి చమురు కొనుగోలు చేశారు, అయినప్పటికీ పౌరుల ఆగ్రహాన్ని తప్పించుకొనేందుకు వారు ధరలను పెంచలేదు. అప్పుడు ఆయన విదేశాల నుంచి రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఇందుకోసం మనం ప్రతి సంవత్సరం వడ్డీ కింద ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలు చెల్లించాం. మన దేశానికి పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారు. రుణం తీర్చాలని మనకు చెప్పారు, అలా చేస్తేనే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన దేశానికి చమురు దొరుకుతుందన్నారు.”
మిత్రోం ఇవన్నీ స్వయంగా నేనే మీకు చెబుతున్నట్లుగా ఉంది కదూ, ఉత్తినే. అసలు నేనెక్కడా ఈ మాటలు చెప్పలేదు. అయితే నేను చెప్పినట్లుగా ప్రచారం చేస్తుంటే మనకు వాటంగా ఉన్నాయి కదా అని మౌనంగా ఉన్నా. మీరు కూడా అదే చేస్తారు కదా. సరే,
” చమురు మీద పన్నులు వేసిన కారణం ఏమిటంటారు. మనం వడ్డీతో సహా రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించాం అని ఈ రోజు గర్వంగా చెప్పవచ్చు ”
మిత్రోం ఇలా చెబుతున్నానంటే ఈ అప్పువేరు, చమురు బాండ్ల అప్పు వేరా, అయితే ఎక్కడా అధికారికంగా అలా చెప్పలేదేం అని మీరు అడగవచ్చు. దేశభక్తులం, దేశ రహస్యాలను ఎలా చెబుతాం, చమురు బాండ్ల చెల్లింపు గడువు 2026 వరకు ఉందని బడ్జెట్ పత్రాల్లో ఉంది కదా అని మీరు నిలదీయవచ్చు. బడ్జెట్ పత్రాల్లో రాసినవన్నీ నిజం అనుకుంటే నేనేం చేయలేను. జుమ్లా, ఏదో రాస్తుంటాం. మీరు నిజంగా దేశభక్తులే అయితే అప్పు తీరిందంటున్నారు కదా పెంచిన పన్ను తగ్గిస్తారా అని మాత్రం అడగవద్దు,
” రైల్వేలు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన పధకాలన్నింటినీ పూర్తి చేశాం, అవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి.గతం కంటే వేగంగా అన్ని రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తి చేశాం. అదే విధంగా 18,500 గ్రామాలను విద్యుదీకరించాం. ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లు పేదలకు ఉచితంగా ఇచ్చాం. వందలాది కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేశాం. యువకులకు ఒకటిన్నరలక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ పేరుతో 50 కోట్ల మందికి వైద్య బీమాకోసం లక్షా 50వేల కోట్లతో పధకాన్ని ప్రారంభించాం”
మిత్రోం, భూమికి గొడుగు తొడిగించాం, పగలే లైట్లు వెలిగించాం, ఎడా పెడా చేతికి వచ్చిన బంగారం అంతా జనానికి ఇచ్చాం చివరకు అన్నీ పొగొట్టుకుని మాకు తినేందుకు తిండిలేక ఇలా అడుక్కునేందుకు వచ్చాం అనే తుపాకి రాముడి లేదా పిట్టల దొర మాటల్లా ఉన్నట్లు మీకు అనిపిస్తున్నాయి కదూ, నాకు తెలుసు. ఇన్ని పధకాలకు ఇంతంత భారీ మొత్తాలను ఖర్చు చేసిన మీరు కరోనా రోగులకు ఆక్సిజన్ కూడా అందించలేకపోయారెందుకని అడుగుతారు. ఉచితంగా వాక్సిన్ వేస్తామని మడమ తిప్పారెందుకుని కూడా అడుగుతారు. కరోనా మరణాలకు పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేశారెందుకు అని నిలదీయవచ్చు.అసలు ఈ కోర్టులున్నాయి చూశారూ….ఒక్కోసారి ఏం చేస్తాయో తెలియదు.
” మన సైనికులకు అన్ని అధునాతన ఆయుధాలను, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను, రాఫెల్ యుద్ద విమానాలను, ఇంకా అనేక రకాల మారణాయుధాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాం. వీటన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు. అ సొమ్ము మీరిచ్చిందే, మీరంతా పెట్రోలు, డీజిలు కొని దేశానికి డబ్బు ఇచ్చారు. పెట్రోలు, డీజిలు మీద పన్ను రద్దు చేస్తే మనం అప్పులను తీర్చటం సాధ్యమా ? మనం అప్పులను తీర్చగలం, అదే విధంగా కొత్త పధకాలను తీసుకురాగలం. కాబట్టి పరోక్షంగా ప్రతిదాని మీద పన్నులు పెంచాల్సిందే. నూటముప్పయి కోట్ల మంది పౌరుల బాధ్యత వాహన యజమానిదిగా మాత్రమే ఉండకూడదు.”
మిత్రోం చమురు ధర లీటరుకు ఏడు పైసలు పెంచినందుకు మన నేత అతల్ బిహారీ వాజ్‌పాయి గతంలో ఢిల్లీలో ఎడ్లబండి మీద ఊరేగి నిరసన తెలిపారు కదా అని కొంత మంది పాత వీడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారు. దేశభక్తులు మీరు అలా ప్రచారం చేస్తే, నిలదీస్తే నా మనోభావాలు గాయపడతాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ చమురు మీద ఇంతగా పన్నులు లేవు కదా అని కొందరంటున్నారు. మన దేశ పరువును బజారుకీడ్చటం తప్ప దీనిలో దేశభక్తి ఉందా ? మనం ఇతర దేశాల గురించి పోల్చుకోవటం అంటే టూల్‌కిట్‌ను విదేశాలకు అందించటమే. అది దేశద్రోహం కదా !
” చివరిగా ఒక మాట… మీరు కుటుంబ పెద్ద అయితే మీ కుటుంబం మీద పెద్ద అప్పుల భారం ఉంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తారా లేక అప్పులు తీరుస్తారా ? రుణం దాని మీద వడ్డీ జాగ్రత్తగా తీర్చకపోతే కుటుంబ భవిష్యత్ ఏమౌతుంది ? ప్రత్యర్ధుల వలలో పడకండి.. ఈ దేశభక్తుడైన పౌరుడిగా మీరు దేశ అభివృద్దిలో భాగస్వాములు కండి.ఈ నిరసన అంతా ఎల్లవేళలా ఓట్ల కోసమే, కొంత మంది రాజకీయవేత్తలు తప్పుడు ప్రచారంతో పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారు.భారతీయులుగా మీరు ఈ వాస్తవాలను అందరితో పంచుకోవాలని నేను కోరుతున్నాను.”
మిత్రోం, ఇన్ని విషయాలు చెప్పిన తరువాత మీకు తత్వం తలకెక్కిందని భావిస్తున్నాను. మీరు నిజంగా దేశభక్తులే , బాధ్యతగల పౌరులే అయితే, దేశం మనకేమిచ్చిందని గాక దేశానికి మనమేం ఇచ్చామని ఆలోచించే వారయితే ఏడు సంవత్సరాల కాలంలో 55లక్షల కోట్ల దేశీయ అప్పును 117లక్షల కోట్లకు ఎందుకు పెంచారు, ఏం చేశారని అడగొద్దు. అత్మనిర్భరలో జనానికి ఏం చేశారని అసలే అడగొద్దు. గత ప్రభుత్వం రెండున్నరలక్ష కోట్ల రూపాయల అప్పుకే పాతివేల కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పాను. ముందే చెప్పినట్లు ఈ ఏడాది 121లక్షల కోట్ల దేశీయ, విదేశీ అప్పుకు గాను ఈ ఏడాది వడ్డీ పన్నెండు లక్షల 10వేల కోట్లు, వచ్చే ఏడాది 136లక్షల కోట్లకు గాను పదమూడు లక్షల 60వేల కోట్ల వడ్డీయే చెల్లించాల్సి ఉంటుంది. అదంతా ఎవరు చెల్లిస్తారు. మీకోసం అప్పు చేసినపుడు మీదే బాధ్యత ! నా దగ్గర గడ్డం జులపాలు తప్ప వేరే ఏమీ లేవని తెలిసిందే. అందువలన మీరే చెల్లించాలి. ముందుగానే చెబుతున్నా, ఎవరేమనుకున్నా ఏదీ ఊరికే రాదు అని టీవీల్లో ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు కదా, కనుక రాబోయే రోజుల్లో ఇంకా పన్నులు వేయక తప్పదు, దేశభక్తులుగా మీరు భరించకా తప్పదు.
మీ
నరేంద్రమోడీ,
మాతా నీకు వందనం,
భారత మాత వర్దిల్లుగాక ,
జై హింద్.